సాక్షి, తిరుమల/హైదరాబాద్: శేషాచల అడవుల్లో మంటలు ఎట్టకేలకు అదుపులోకి వచ్చాయి. ‘ఆపరేషన్ శేషాచలం’ చాలావరకు విజయవంతమైంది. నాలుగు రోజులుగా అడవుల్ని కబళిస్తున్న కార్చిచ్చు గురువారం సాయంత్రానికి ఆరిపోయినట్టు కనిపించింది. వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన మూడు హెలికాప్టర్లతో పాటు వివిధ విభాగాలకు చెందిన సుమారు 700 మంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అడవుల్లో చెలరేగిన మంటల్ని అదుపు చేసేందుకు హెలికాప్టర్ల సాయం కావాలని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్.. గవర్నర్ నరసింహన్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ చొరవ తీసుకుని కేంద్రాన్ని సంప్రదించడంతో త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి.
బుధవారం శేషాచలంలో చేతక్ హెలికాప్టర్ ద్వారా సర్వే చేసిన వాయుసేన సిబ్బంది నీటిని చల్లాల్సిన ప్రాంతాలను గుర్తించారు. రాత్రి 11-30 గంటల సమయంలో అత్యాధునిక సీ-130 ఎయిర్‌క్రాఫ్ట్ రెక్కీ నిర్వహించి మంటలు ఎటు నుంచి ఎటువైపు వ్యాపిస్తున్నాయో మరోసారి పరిశీలించింది. గురువారం మధ్యాహ్నం చేతక్ తో పాటు మరో రెండు హెలికాప్టర్లు మరోసారి శేషాచలంలో పరిస్థితిని అంచనా వేశాయి. అధికారులు ఒక్కో హెలికాప్టర్ కు 3 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న భారీ బకెట్లను ఏర్పాటు చేశారు. అవి తిరుమల ఆలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమారధార ప్రాజెక్టులో నీటిని తోడుకుంటూ అడవిపై వెదజల్లాయి. వివిధ విభాగాల సిబ్బంది నేలపైనుంచి మంటల్ని ఆర్పారు. దీంతో సాయంత్రానికల్లా మంటలు చాలావరకు అదుపులోకి వచ్చాయి.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ: గవర్నర్ నరసింహన్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి బి.సోమశేఖరరెడ్డి తిరుమలలో పరిస్థితిని సమీక్షించారు. టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ స్వయంగా మంటలు ఆర్పే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, జిల్లా కలెక్టర్ రాంగోపాల్ ఆపరేషన్‌కు నేతృత్వం వహించారు. దావానలం వల్ల 460 హెక్టార్లలో అడవి దగ్ధమైందని ఈవో గిరిధర్ గోపాల్ తెలిపారు.
టీటీడీ అడవి చుట్టూ ప్రహరీగోడ, రింగ్‌రోడ్డు: భవిష్యత్‌లో ఇలాంటి అగ్నిప్రమాదాలు తిరుమల సరిహద్దులను తాకకుండా 6,004 ఎకరాల్లో విస్తరించిన టీటీడీ అడవి చుట్టూ ప్రత్యేకంగా రింగ్‌రోడ్డు, ప్రహరీగోడ నిర్మించాలని గురువారం సమావేశమైన టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది.
చల్లారిన కార్చిచ్చు!
Published Fri, Mar 21 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM
Advertisement