శేషాచల అడవులు
వలస పక్షుల కిల.. కిల.. రావాలతో శేషాచలం కళకళలాడుతోంది. రంగురంగుల ఈకలు.. చూడచక్కని ముక్కులతో.. కొమ్మరెమ్మలపై ఎగురుతూ.. నింగిలో ఆహ్లాదకరమైన విన్యాసాలు చేస్తూ.. వినసొంపైన కిల..కిల.. రావాలతో శేషాచలం అడవులకు వలస పక్షులు మరింత అందం తీసుకొచ్చాయి. ఇప్పటికే శేషాచల కొండల్లో 215 రకాల పక్షి జాతులుండగా.. ఇప్పుడు వలస పక్షులు వాటికి తోడయ్యాయి. మూడేళ్లుగా వర్షాలు బాగా కురుస్తుండటంతో శేషాచల అడవుల్లోని జంతువులకు, పక్షులకు ఆహారం సమృద్ధిగా లభిస్తోంది. దీనివల్లే ఉత్తర భారతదేశంతో పాటు వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి అరుదైన పక్షులు శేషాచలం బాట పట్టాయని శాస్త్రవేత్త కార్తీక్ చెప్పారు. వాటిలో కొన్నింటిని తన కెమెరాలో బంధించినట్లు తెలిపారు.
–తిరుపతి అలిపిరి
శేషాచలం చేరిన వాటిలో ప్రత్యేకమైనవి..
బ్లాక్ నేప్డ్ మోనార్క్ ఫ్‌లై క్యాచర్: సాధారణంగా ఈ రకంలో మగ పక్షులు బ్లూ కలర్‌లోనూ.. ఆడ పక్షులు గ్రే కలర్‌లోనూ ఉంటాయి. వీటికి సిగ్గు ఎక్కువ.
స్ట్రీక్ త్రోటెడ్ ఉడ్‌పెకర్: ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. పచ్చగానూ.. తలపై ఆరెంజ్ కలర్ జుట్టుతోనూ దర్శనమిస్తుంటాయి. భారతదేశంలోని 12 రకాల ఉడ్ పెకర్స్‌లో ఈ జాతి అరుదైనది.
గ్రీన్ ఇంపీరియల్ పీజియన్: అనేక ఏళ్ల తర్వాత ఇది కళ్యాణి డ్యాం ప్రాంతంలో కనిపించింది. అరుదైన పావురాల్లో ఇది ఒకటి. చైనా, మలేసియా, ఫిలిప్పీన్స్, నేపాల్‌లలో ఇవి కనిపిస్తుంటాయి.
ఏసియన్ పారడైజ్ ఫ్లైక్యాచర్: చిన్న తల, పొడవాటి తోక, ఆరెంజ్ కలర్‌లో ఉండే ఈ పక్షి శేషాచలంలో అరుదుగా కనిపిస్తుంటుంది. చామల రేంజ్‌లోని కోటకాడపల్లి ప్రాంతంలో కెమెరాకు చిక్కింది. మధ్య ఆసియా దేశాల్లో ఈ పక్షులు ఎక్కువగా సంచరిస్తుంటాయి.
ఇండియన్ స్కాప్స్ ఔల్: దక్షిణ ఆసియాలో కనిపించే గుడ్లగూబ ఇది. దీని అరుపులు చాలా వింతగా>.. భయాందోళనకు గురి చేస్తుంటాయి. దీని కళ్లు పెద్దగా ఉంటాయి. కళ్యాణి డ్యాం ప్రాంతంలో ఇటీవల ఇది దర్శనమిచ్చింది.
ఎల్లో త్రోటెడ్ బుల్‌బుల్: పసుపు పచ్చగా.. ముద్దుగా కనిపించే ఈ పక్షులు ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంటాయి. చాలా అరుదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ఈ పక్షులు కపిలతీర్థం ప్రాంతంలో కనిపించడం విశేషం.
టికెల్స్ బ్లూ ఫ్లైక్యాచర్: ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చిన అరుదైన జాతి పిట్ట ఇది. చిన్న ముక్కు, పసుపు రంగు గొంతు దీని ప్రత్యేకత. శేషాచలంలో ఈ పిట్టలు సందడి చేస్తున్నాయి.
కాపర్ స్మిత్ బార్బెట్: ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’తో కాపర్ స్మిత్ బార్బెట్‌ను పోల్చవచ్చు. కాపర్ ప్లేట్‌పై సుత్తితో కొడితే ఎలా సౌండ్ వస్తుందో.. ఈ పిట్ట అరిస్తే అలా ఉంటుంది. వివిధ వర్ణాల్లో ఉండే ఈ పిట్ట.. తన అందంతో మంత్రముగ్ధుల్ని చేస్తుంటుంది.
బ్లాక్ హుడెడ్ ఓరియోల్: పసుపు, నలుపు రంగుల్లో అందంగా ఉండే ఈ పక్షి ప్రస్తుతం శేషాచలంలో దర్శనమిస్తోంది.
ఆరెంజ్ హెడెడ్ త్రష్: ఆరెంజ్ కలర్‌లో ఉన్న ఈ పక్షి బ్రహ్మదేవ గుండంలో కనిపించింది. ఇది హిమాలయ ప్రాంతం నుంచి వచ్చినట్లుగా కార్తీక్ చెప్పారు.
అనేక ఏళ్ల తర్వాత..
శేషాచలంలో ఇప్పటి వరకు 180 రకాల పక్షులను ఫొటోలు తీశాను. ఈ ఏడాది కళ్యాణి డ్యాం, కపిలతీర్థం, మామండూరు, బాలపల్లి, కలివిలేటి కోన, బ్రహ్మదేవ గుండం, మొగిలిపెంట, చామల రేంజ్‌లోని తలకోన, కోటకాడపల్లి తదితర ప్రాంతాల్లో అరుదైన పక్షులు కనిపించాయి. చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ దర్శనమిచ్చాయి.
– కార్తీక్, బర్డ్స్‌మెన్, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment