rare bird
-
మార్కాపురంలో అరుదైన జాతి పక్షుల సందడి
ప్రకాశం జిల్లా మార్కాపురంలో తొలిసారిగా ఆసియా ఖండంలోని శ్రీలంక, చైనా, తైవాన్, సుమత్రా దీవుల వద్ద కనిపించే పలు రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కాలనీలో ఇవి కనిపిస్తున్నాయి. మూడు రోజుల క్రితం త్రివర్ణ మునియాను (మూడు రంగుల పక్షి) కనిపించగా వైట్ మునియా, బయా వీవర్, ఇండియన్ సిల్వర్ బిల్ పక్షులను స్నేక్ క్యాచర్ నిరంజన్ తన కెమెరాతో క్లిక్‌మనిపించాడు. ఆ వివరాలను మీడియాకు తెలిపారు. వైట్ మునియా పక్షి అరుదైన జాతికి చెందింది. తెల్లటి, బూడిద రంగులతో కలిపి పొడవాటి నల్లటి తోకతో 10 నుంచి 11 సెం.మీ పొడవు ఉంటుంది. ఇది దట్టమైన పొదల్లో నివసిస్తుంది. ఈ పక్షిని జపాన్‌లోని పలు ప్రాంతాల్లో పెంపుడు పక్షిగా పెంచుకుంటారు. – మార్కాపురంగిజిగాడి పక్షి20 ఏళ్ల క్రితం కనిపించిన ఈ పక్షి మళ్లీ ఇప్పుడు మార్కాపురం ప్రాంతంలో కనిపిస్తోంది. ఇంగ్లిష్‌లో బయావీవర్ అని పిలుస్తారు. పల్లెల్లో అయితే గిజిగాడి పక్షి అంటారు. ఈ పిచ్చుక శ్రీలంక, పాకిస్థాన్, నేపాల్, భారత్‌లోని పలు ప్రాంతాల్లో కనిపిస్తుంది. గిజిగాడు నిర్మించుకునే గూడు విచిత్రంగా ఉంటుంది. కొమ్మలకు వేలాడుతూ ఉంటాయి. పాములు, కాకులు, గద్దలు ఇతరత్రా పక్షులు, జంతువులు రాకుండా అద్భుతమైన ఇంజినీరింగ్ వ్యవస్థతో గూడు కట్టుకుంటుంది. తలమీద పసుపురంగుతో చేసిన బంగారు కిరీటంలా ఉంటుంది. ముక్కు నుంచి గడ్డం వరకు నలుపు రంగుతో ఉంటుంది. పొట్టకింద పసుపు తెలుపు, గోధుమ రంగులతో ఆకర్షణీయంగా ఉంటుంది.ఇండియన్ సిల్వర్‌బిల్ పక్షి ఈ పక్షి మార్కాపురంలోని విశ్వబ్రాహ్మణ రోడ్డులోని చెట్లపై కనిపిస్తోంది. తల, తోక, శరీర మధ్యభాగం ముక్కు ముదురు బ్రౌన్ రంగును కలిగి ఉంటుంది. పొట్టభాగం సిల్వర్ రంగులో ఉండటంతో దీన్ని ఇండియన్ సిల్వర్ బిల్ పక్షి అంటారు. ఇది గడ్డి విత్తనాలను తింటుంది. ఇది ఒక అరుదైన జాతి పక్షి. అంతరించిపోతున్న పక్షుల్లో ఇది కూడా ఒకటి. -
Pudami Sakshiga : అంతరించిపోతున్న అరుదైన పక్షులు.. అక్రమంగా విదేశాలకు
ప్రపంచంలో జరుగుతున్న పర్యావరణ మార్పులతో ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. అదే కోవలో ఎన్నో పక్షిజాతులు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికే పలు జాతులు అంతరించిపోయాయి. స్టేట్ అప్ బర్డ్స్ వార్షిక నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 48% పక్షుల జనాభా తీవ్రంగా తగ్గిపోయింది. మన దేశంలో ఇప్పటికే 50% పక్షుల జనాభా తగ్గిపోయింది. వాటిలో అరుదైన పక్షి ఆకుపచ్చ ముణియాలు కూడా ఉంది. ఈ రకం పక్షుల గురించి ఈ ఇంట్రెస్టింగ్ విశేషాలు మీకు తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా పక్షిజాతులు అంతరించిపోతున్నాయి. అక్రమ విదేశీ విక్రయాల వల్ల వీటి జనాభా తీవ్రంగా దెబ్బతింటుంది. మన దేశంలో దాదాపు 8 పక్షిజాతులు ఉన్నాయి. వీటిలో అత్యంత అరుదైన పక్షి ఆకుపచ్చ ముణియాలు. ఇవి ఆకారంలో చిన్నదిగా, బాహ్యబాగల్లో ఆకుపచ్చరంగుతో, ఉదరబాగల్లో లేత పసుపు వర్ణంతో,నలుపు తెలుపు చారాలతో (జీబ్రా స్ట్రిప్స్), ఎర్రటి కళ్ళు, ఎరుపు ముక్కుతో రామచిలుకను పోలిఉండటంతో చూడముచ్చటగా ఉంటుంది. అందుకే వీటి శాస్త్రీయ నామం Amandava formosa Formosa. అంటే లాటిన్ భాషలో అందంగా తయారైందని అర్థం. వీటిని గ్రీన్ స్ట్రాబెర్రీ ఫించ్, గ్రీన్ టైగర్ ఫించ్ అని కూడా పిలుస్తారు. ఆకుపచ్చ ముణియా,ఎరుపు ముణియా మాత్రమే ఎరుపు ముక్కు కలిగివుంటుంది. ఇది మరే ఇతర ముణియా జాతి పక్షుల్లో కనిపించని లక్షణం. బాల్యదశలోని పక్షులు గోధుమ వర్ణంలోనూ, ఉదరబాగంలో లేత పసుపు రంగుతో ఆకర్షణీయంగా కనబడుతోంది. ఇవి దాదాపు 10 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. మగ పక్షులు ఆడపక్షుల కంటే ప్రకాశవంతంగా ఉంటుంది. ఇవి మధ్య, దక్షిణ భారతదేశానికి మాత్రమే స్థానికమైన పక్షులు. పొద అడవులు, పొడి నేల , వ్యవసాయ నేల , చెరుకు ,మక్కజాన్న ,రాగులు , సజ్జల పంట పొలాల్లో విరివిగా వీటి ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది.పెద్ద పెద్ద ఆకులతోను లేదా చెరుకు ఆకుల మధ్య వీటి గూళ్ళును వేలాడదీస్తుంది. జనవరి నుండి మే నెలలో సంతానోత్పత్తి కొరకు 4-6 గుడ్లు పెట్టి 16-25 రోజుల వరకు ఆడ,మగ పక్షుల చేత పొదగబడుతుంది. ఆహార సేకరణ కొరకు చిన్న చిన్న గుంపులు గుంపులుగా వెళ్లి పంట పొలాల్లోని చీడ పురుగులను, చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకుంటుంది. వీటి కూత హై పిచ్ గానంతో చెవులకు ఇంపుగా స్వీ...స్వీ అంటూ ముగుస్తుంది. ఆది నుండి అక్రమ రవాణ:- నిజానికి మనదేశంలో దాదాపు 250 దేశీయ అడవి పక్షులు,70 విదేశీ పక్షులు ,అక్రమ పక్షులవిక్రయం ( illegal bird trade ) లో ఉన్నాయి . ఇందులో ఆకుపచ్చ ముణియాలు ఆకర్షణగా కనిపించడంతో,మెలోడియస్ గానంతో, వేటగాళ్ల వలక సులభంగా చిక్కిపోవటం,పెంపరులతో స్నేహంగా మెలగడం,పెంచటం సులభ తరం కనుక పంజర పక్షులుగా మారాయి. 19 వ శతాబ్దంలో అహ్మదాబాద్ లోని ఒక కరప్షన్ ప్రాంతం అవడవత్ వీటి విక్రయానికి చిరునామాగా మారింది . అందువలనే వీటికి Green Avadavat అనే పేరు కూడా వచ్చింది. 1960 నుండి 1980 వరకు రెండు వేల ఆకుపచ్చ ముణియా పక్షుల మార్కెట్లలో బహిరంగంగా అమ్మకానికి గురైంది. దాదాపు 2000 నుంచి 3000 పక్షులు వరకు ప్రతియేటా ఇండియా నుంచి ఐరోపా ,ఉత్తర అమెరికా వంటి ఖండాంతర దేశాలకు అక్రమంగా ఎగుమతుల్లో తరలిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ తంతు 1980 నుండి యిప్పటి వరకు కొనసాగుతుంది. శతాబ్దాల నుంచి అక్రమ విదేశీ విక్రయాల వలన స్వేచ్చగా గాలిలో విహరించల్సిన పక్షులు ఇప్పుడు బాధిత పక్షులుగా పంజరాలకు పరిమితమైంది. ఆవాస విధ్వంసమే ప్రధాన ముప్పు:- ఈ పక్షులు మొదట్లో రాజస్థాన్ లోని మౌంట్ అభు కొండల్లో విరివిగా కనిపించేవి కానీ ఇప్పుడు వాటి ఉనికిని కోల్పోయి దక్షిణ భారతదేశానికి పరిమితమైంది. వీటిని సాంప్రదాయ వైద్య పద్దతిలో ఉపయోగించడం వలన జనాభా భారీగా తగ్గిందని అక్కడ ఆదివాసీ గిరిజన ప్రజలు చెబుతున్నారు.1980 లో అరకు లోయ పాదాల చెంత సుంకర మిట్ట ప్రాంతం ప్రధాన ఆవాస కేంద్రంగా పరిగణంపబడుతున్న సమయంలో అక్కడ బాక్సైట్ గనుల తవ్వకాల వలన ఆవాసం కోల్పోయి కనిపించకుండా పోయింది. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు మరియు పురుగు మందుల వాడకం వలన రసాయన పదార్థాలు జైవిక వ్యవస్థాపన జరిగి చనిపోతున్నాయి. అభివృద్ధి పనుల పేరుతో నివాస విధ్వంసం, అక్రమ విదేశీ విక్రయాలు, పంజార పక్షులుగా బంధించడం, ఆహారం కోసం వేటాడం వంటివి ప్రధాన ముప్పులుగా ఉన్నాయి. చట్టాలున్న రక్షణ కరువైంది:- భారత ప్రభుత్వం వీటి పరిరక్షణ నిమిత్తం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ (1972) లో షెడ్యూల్ 4 లో చెర్చింది.1981లో ఆకుపచ్చ మునియాలు అమ్మకానికి బాన్ విధించింది. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండెంజర్డ్ స్పీసీస్ (CITES) లో అంతరించిపోతున్న పక్షుల జాబితాలో చోటుచేసుకుంది. స్టేట్ ఆఫ్ ఇండియా బర్డ్స్ 2020 నివేదిక ప్రకారం.. ఇది తీవ్ర భయాందోళనకు గురికావడం, నిర్లక్ష్యం మరియు తక్కువ సమృద్ధిలో ఉండటం చాలా ప్రమాదకరం,ఆందోళనకరం అని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ 3 వ అనుకూల ఆవాసం:- అడుగడుగునా అంతరాలు ఎదురుకొంటున్న పక్షికి అంధ్రప్రదేశ్ లోని గుడిస రిజర్వు ఫారెస్ట్ భారతదేశంలోనే 3 వ అతిపెద్ద అనుకూల ఆవాస కేంద్రంగా ఆశ్రయమిస్తుంది.అక్కడ సంతానోత్పత్తికి కూడా అనువైన ప్రాంతంగా మారింది. అంతే కాకుండా విశాఖపట్నంలోని దారకొండ మారేడుమిల్లి అడవుల్లో కూడా నాలుగు సైటింగ్స్ చేసినట్లు బర్డ్ వాచేర్స్ ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. పరిరక్షణ అవసరం :- ''ప్రపంచవ్యాప్తంగా ప్రమాద స్థితిలోన్న ఆకుపచ్చ మునీయాలు మరలా పచ్చదనం సంతరించుకోవాలంటే అడవులను పెంచాలి, అడవుల్లో వర్షపు నీతి నిల్వ కుంటలు ఏర్పాటుచేయాలి ,అడవుల్లో విజిలెన్స్ విభాగం తనిఖీ విధిగా చేయాలి , వీటి గుడ్లను పొదిగించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి ,వీటి ఆవాస మనుగడ పై పరిశోధనలు చేసేలా ప్రభుత్వాలు పూనుకోవాలి'' అని ఎస్వీ యూనీవర్సిటీ జువాలజి విభాగ ఆచార్య మారం రాజశేఖర్ తెలిపారు . - గిడ్డకింద మాణిక్యం అసోసియేట్ ప్రొఫెసర్, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి. ఫోటోగ్రాఫర్- అసీమ్ కొఠిలా డా. గుండులూరు స్వాతి,అసోసియేట్ ప్రొఫెసర్ జంతు శాస్త్ర విభాగం , ప్రభుత్వ డిగ్రీ కళాశాల పుత్తూరు. తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
Pudami Sakshiga : అరుదైన పక్షి నల్ల ఏట్రింత గురించి ఈ విషయాలు తెలుసా?
సాయంత్ర సమయంలో పెరటి కంచెల పైన, కరెంటు తీగల మీద, పొదల మీద నిగనిగ లాడే కారు నలుపు రంగులో పిగిలి పిట్ట(బుల్ బుల్) పరిమాణంలో ఉండే సన్నని చురుకైన పక్షిని అదేనండి నల్ల ఏట్రింతను ఎప్పుడైనా గమనించారా? ఈ పేరు కొత్తగా ఉన్నా,నల్లపిట్ట, కత్తెర పిట్ట, పసుల పోలిగాడు, భరద్వాజము, పోలీసు పిట్ట, కొత్వాలు పిట్ట గా మీకు పరిచయం అయిన ఈ పక్షి గురించి తెలుసుకుందాం. ► నల్ల ఏట్రింత దాదాపుగా భారతదేశ మంతటా కనిపిస్తుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువ చురుగ్గా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పచ్చిక బయళ్ళలో, పంటపొలాల గట్ల పైన, పట్టణ ప్రాంతాల్లో పెరటి చెట్లపైన, తీగల మీద దీనిని మనం ఎక్కువగా గమనించవచ్చు. దీని తోక పొడుగుగా ఉండి చివరలో చీలి చూడటానికి కత్తెరను పోలి ఉండడంతో దీనిని కత్తెరపిట్ట, మంగలి పిట్ట అని కూడా పిలుస్తారు. ► ఇది మాంసాహారి. గాలిలో ఎగురుతూ మిడతలు, తూనీగలు, కందిరీగలు, తేనెటీగలను పట్టుకుని అది కూర్చునే చోటకు తీసుకుపోయి కాలి కింద నొక్కిపట్టి, పదునైన ముక్కుతో ముక్కలు చేసి మింగుతుంది.నలువైపులా గమనిస్తూ రివ్వున కిందకు దిగి నేలపై ఉన్న ఎరను పట్టుకుంటుంది. మేస్తున్న పశువులపై కూర్చుని అవి గడ్డిలో నడుస్తున్నపుడు గడ్డిలో నుంచి పైకి ఎగిరిన కీటకాలను పట్టుకుని ఆరగిస్తుంది. ► గోరింకలు, తెల్ల కొంగలతో పాటుగా దున్నుతున్న పొలాల్లో తిరుగుతూ బయట పడ్డ గొంగళీలను కీటకాలను తింటుంది. చాలా అరుదుగా తేళ్ళు, జెర్రెలను, చిన్న పక్షులను, గబ్బిలాలను వేటాడుతుంది. నల్ల ఏట్రింత దక్షిణ భారతంలో ఫిబ్రవరి, మార్చి నెలలలో, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఆగష్టు నెల వరకు సంతానోత్పత్తిని చేస్తాయి. ► జత కట్టే సమయంలో ఆడా, మగ పక్షులు ఉదయాన్నే చెట్ల చిటారు కొమ్మలపై వాలి పాటలు పాడతాయి. తమ రెక్కలు ముక్కులను జత చేస్తూ గాలిలో విన్యాసాలు చేస్తాయి. సాధారణంగా జత మధ్య బంధం సంతానోత్పత్తి కాలం వరకూ ఉంటుంది. జతకట్టిన రెండు పక్షులూ కలిసి కొమ్మ వంచలలో పలుచని కర్రలతో, గడ్డి పోచలతో దొన్నె లాంటి గూడును కడతాయి. ► పనస వంటి పెద్ద ఆకులున్న చెట్లను గూడు కట్టడానికి ఎంచుకుంటాయి. ఈ గూటిలో 3 నుండి 4 గుడ్లను పెట్టి తల్లిదండ్రులిద్దరూ రెండు వారాల పాటు పొదుగుతాయి. పిల్లలకు ఒక నెల పాటు ఆహారం అందించి రక్షించిన తర్వాత పిల్లలు గూటిని విడిచి పెడతాయి. వీటి పిల్లలు చాలా చురుకుగా ఉంటాయి. ► చిన్న ఆకు ముక్కలను తుంపి నేలపైకి వదిలి మధ్య గాలిలో ఎగురుతూ వాటిని పట్టుకుని ఆడుతూ తమ ఎగిరే పాటవాలను, వేటాడే నైపుణ్యాలను మెరుగు పరుచుకుంటుంది.గూడు కట్టిన సమయంలో గూటికి దగ్గరలో కాపలా ఉంటూ వేటాడే కాకి, గ్రద్ద, జాలె డేగ (షిక్రా) వంటి పెద్ద పక్షులను కూడా ఎదిరించి, తరిమివేస్తూ దూకుడు స్వభావం కలిగి ఉంటుంది. ► గూటిని పిల్లలని కాపాడుకోవటానికి పెద్ద పక్షులతో కూడా పోరాడే దాని ధైర్యం మిగిలిన చిన్న పక్షులను ఆ పరిసరాలలో గూడు కట్టుకునేలా ప్రోత్సహిస్తుంది. ఈ దూకుడు స్వభావంతో తన గూటిని కాపాడుకోవటమే కాక పావురాలు, గువ్వలు, పికిలి పిట్టలు, వంగ పండు (ఓరియల్) వంటి ఇతర పక్షులకు కూడా రక్షణగా నిలవడంతో కొందరు నల్ల ఏట్రింతను పోలీసు పిట్ట, కొత్వాలు పిట్ట అని కూడా పిలుస్తారు. ► నల్ల ఏట్రింత రకరకాలుగా కూస్తుంది. సాధారణంగా టీ-టూ అని అరుస్తుంది. అపుడపుడు జాలె డేగ (షిక్రా) ను అనుకరిస్తూ అరిచి మైనాల నుండీ తిండిని దొంగలిస్తుంది. మధ్య భారతదేశంలో, నల్ల ఏట్రింత పశువుల కొమ్ములపై వాలితే పశువుల కొమ్ములు వూడి పోతాయనే మూఢ నమ్మకం కూడా ఉంది. ► నల్ల ఏట్రింత పురుగులను, కీటకాలను ఆహారంగా తీసుకుంటూ రైతుకు పంటను కాపాడుకోవటంలో సహాయ పడుతుంది. కొందరు రైతులు ఏట్రింత కూర్చోవడానికై పొలాలలో కర్రలను కూడా ఏర్పాటు చేస్తారు.పరిమాణంలో చిన్నదైనప్పటికీ తన స్వభావంతో ఇటు రైతులకు, అటు తోటి పక్షులకు ఎంతో సహాయ పడే నల్ల ఏట్రింతను మెచ్చుకోకుండా ఉండగలమా!.. -రవికుమార్ ద్వాదశీ ఫోటోగ్రాఫర్- రేణుకా విజయ్‌రాఘవన్ తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
వింత పక్షి
-
అవిగో.. అరుదైన పక్షులు! నల్ల బాజా, గోధుమ రంగు గుడ్ల గూబ, ఎలుక గద్ద పక్షి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు అరుదైన పక్షి జాతుల్ని బర్డ్ వాచర్స్ గుర్తించారు. గోధుమ రంగు అడవి గుడ్ల గూబ(బ్రౌన్ వుడ్ ఓల్), ఎలుక గద్ద(కామన్ బజార్డ్), నల్ల బాజా(బ్లాక్ బాజా) వంటి అరుదైన పక్షులు కనిపించాయి. తిరుపతి ఐఐఎస్ఈఆర్ విద్యార్థులు సుదీర్ఘకాలం తర్వాత నల్ల బాజాను గుర్తించగా, రాజమండ్రిలో బర్డ్ వాచర్ మోహన్ శ్రీకర్ గోధుమ రంగు అడవి గుడ్ల గూబను రికార్డు చేశారు. విజయవాడలో ఎలుక గద్ద పక్షి రాష్ట్రంలో రెండోసారి రికార్డయింది. రాష్ట్ర వ్యాప్తంగా 8 రకాల గుడ్ల గూబలు రికార్డయ్యాయి. ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు 4 రోజులపాటు ఐఐఎస్ఈఆర్ ఆధ్వర్యంలో వరుసగా నాలుగో సంవత్సరం రాష్ట్రంలో గ్రేట్ బ్యాక్ యార్డ్ బర్డ్ కౌంట్‌గా పిలిచే ప్రపంచ పక్షుల గణన నిర్వహించారు. గణనలో దేశం వ్యాప్తంగా 1,067 జాతుల పక్షులు నమోదవగా, మన రాష్ట్రం 313 జాతుల్ని నమోదు చేసి దేశంలో 12వ స్థానంలో నిలిచింది. బర్డ్ వాచర్లు పక్షులను గమనించి వాటి ఫొటోలను సిటిజన్ సైన్స్ పోర్టల్ ఈబర్డ్లో నమోదు చేశారు. గణనలో 84 మంది బర్డ్ వాచర్స్.. తిరుపతి ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ తిరుపతి, తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్, ఏలూరు సీఆర్ఆర్ మహిళా కళాశాల, విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ సహా రాష్ట్రంలోని పలు క్యాంపస్‌లు ఈ గణనలో పాల్గొన్నాయి. 2013లో తొలిసారి రాష్ట్రంలో గ్రేట్ బ్యాక్ యార్డ్ బర్డ్ కౌంట్ జరగ్గా అప్పుడు 300కి పైగా జాతుల పక్షుల్ని నమోదు చేశారు. ఐఐఎస్ఈర్ తిరుపతి విద్యార్థులు, పరిశోధకులు ఈ గణనలో తిరుపతి పరిసరాల్లో 120 జాతుల పక్షుల్ని నమోదు చేయడం విశేషం. విజయవాడ నేచర్ క్లబ్లో ఉన్న పలువురు వైద్యులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, కొందరు సిటిజన్లు ఒక గ్రూపుగా ఏర్పడి విజయవాడ పరిసరాల్లో 60 రకాల పక్షులను నమోదు చేశారు. ఒంగోలుకు చెందిన ఇద్దరు వైద్యులు ప్రకాశం జిల్లా ప్రాంతంలో 100 జాతులకు పైగా పక్షుల్ని రికార్డు చేశారు. రాజమండ్రి బర్డ్ నేచర్ ఫోటోగ్రఫీ గ్రూపు సభ్యులుగా ఉన్న డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల నుంచి 200 జాతుల పక్షులను రికార్డు చేశారు. విశాఖపట్నంలో స్థానిక ఎన్జీఓలు డబుల్య్సీటీఆర్ఈ, ఈసీసీటీలు అటవీ శాఖతో కలిసి బర్డ్ వాక్‌లు నిర్వహించి 180 జాతుల పక్షులను నమోదు చేశారు. అనంతపురంలో 160 రకాల పక్షులు, కొల్లేరు పక్షుల అభయారణ్యంలో 90 రకాల పక్షులు నమోదయ్యాయి. మొత్తం 84 మంది బర్డ్ వాచర్స్ ఈ గణనలో పాల్గొన్నారు. పక్షి శాస్త్రవేత్తలు, పరిశోధకులకంటె ఎక్కువగా సాధారణ ప్రజలు ఈ గణనలో పాల్గొనడం విశేషం. 65 శాతం పక్షులు నమోదయ్యాయి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 490 జాతుల పక్షులు రికార్డవగా.. ఈ గణనలో వాటిలో 65 శాతం పక్షులు నమోదయ్యాయి. ఎక్కువ మందిని ప్రకృతికి అనుసంధానం చేయడం, పక్షులను చూడాలనే అభిరుచితో ఉన్న వారిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ గణన ఏటా నిర్వహిస్తున్నారు. ఈ ఫలితాలు ప్రాథమికంగా ఇచ్చినవే. కాగా, బర్డ్ కౌంట్ ఇండియా త్వరలో తుది ఫలితాలను వెల్లడిస్తుంది. – బండి రాజశేఖర్, ఐఐఎస్ఈఆర్ సిటిజన్ సైంటిస్ట్ ప్రకాశం జిల్లాలో పక్షుల సమాచారాన్ని అన్వేషిస్తున్నాం.. నా సహోద్యోగి డాక్టర్ శ్రావణ్‌కుమార్(బర్డ్ వాచర్)తో కలిసి ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పక్షుల్ని రికార్డు చేశాను. పెళ్లూరు సమీపంలోని గడ్డి భూముల్లో కొంగలు, పెలికాన్లు, పెయింటెడ్, ఓపెన్ బిల్ స్కార్ట్లను ఎక్కువగా గమనించాము. దర్శి సమీపంలో ఈజిప్టియన్ వల్చర్, హనీ బజార్డ్, బ్లాక్ కైట్ పక్షుల్ని నమోదు చేశాం. ప్రకాశం జిల్లాలోని పక్షుల గురించి మరింత సమాచారాన్ని అన్వేషించడానికి ప్రయత్నిస్తున్నాం. – డాక్టర్ రామాంజినాయక్, బర్డ్ వాచర్, ఒంగోలు -
140 ఏళ్ల తర్వాత కన్పించిన అరుదైన పక్షి.. ఫొటో వైరల్..
అత్యంత అరుదైన బ్లాక్ నేప్డ్ పీసాంట్ పీజియన్ పక్షి(నెమలిలా కన్పించే పావురం) 140 ఏళ్ల తర్వాత కన్పించింది. శాస్త్రవేత్తలు దీన్ని తిరిగి కనిపెట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. ద్వీపకల్ప దేశం పపువా న్యూగినియాలో స్థానికులను వివరాలు అడిగి నెలరోజుల పాటు అడవిలో తిరిగి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు వారి శ్రమకు ఫలితం దక్కింది. శాస్త్రవేత్తలు ఏర్పాటు చేసిన కెమెరాల్లో ఈ పక్షి దృశ్యాలు రికార్డయ్యాయి. బ్లాక్ నెప్డ్ పీసాంట్ పీజియన్‌ను ఇప్పటికే అంతరించిపోయిన జాతిగా ప్రకటించారు. ఇది పపువా న్యూ గినియా అడవిలో మాత్రమే ఇంకా అత్యంత అరుదుగా కన్పిస్తోంది. 10 ఏళ్లుగా కన్పించని, ఇంకా అంతరించిపోని పక్షులను కనుగొనే కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నంలో ఈ నెమలి పావురం కన్పించింది. ఇది గొప్ప విజయంగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. ఇలా కన్పించని అరుదైన పక్షులు మొత్తం 150 ఉన్నట్లు చెప్పారు. ఈ పక్షిని చూశామని స్థానికులు చెప్పడంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. చదవండి: ఆరు నెలల తర్వాత చైనాలో తొలి కరోనా మరణం -
మళ్లీ కూసిన గువ్వ
వలస పక్షుల కిల.. కిల.. రావాలతో శేషాచలం కళకళలాడుతోంది. రంగురంగుల ఈకలు.. చూడచక్కని ముక్కులతో.. కొమ్మరెమ్మలపై ఎగురుతూ.. నింగిలో ఆహ్లాదకరమైన విన్యాసాలు చేస్తూ.. వినసొంపైన కిల..కిల.. రావాలతో శేషాచలం అడవులకు వలస పక్షులు మరింత అందం తీసుకొచ్చాయి. ఇప్పటికే శేషాచల కొండల్లో 215 రకాల పక్షి జాతులుండగా.. ఇప్పుడు వలస పక్షులు వాటికి తోడయ్యాయి. మూడేళ్లుగా వర్షాలు బాగా కురుస్తుండటంతో శేషాచల అడవుల్లోని జంతువులకు, పక్షులకు ఆహారం సమృద్ధిగా లభిస్తోంది. దీనివల్లే ఉత్తర భారతదేశంతో పాటు వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి అరుదైన పక్షులు శేషాచలం బాట పట్టాయని శాస్త్రవేత్త కార్తీక్ చెప్పారు. వాటిలో కొన్నింటిని తన కెమెరాలో బంధించినట్లు తెలిపారు. –తిరుపతి అలిపిరి శేషాచలం చేరిన వాటిలో ప్రత్యేకమైనవి.. బ్లాక్ నేప్డ్ మోనార్క్ ఫ్లై క్యాచర్: సాధారణంగా ఈ రకంలో మగ పక్షులు బ్లూ కలర్‌లోనూ.. ఆడ పక్షులు గ్రే కలర్‌లోనూ ఉంటాయి. వీటికి సిగ్గు ఎక్కువ. స్ట్రీక్ త్రోటెడ్ ఉడ్‌పెకర్: ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. పచ్చగానూ.. తలపై ఆరెంజ్ కలర్ జుట్టుతోనూ దర్శనమిస్తుంటాయి. భారతదేశంలోని 12 రకాల ఉడ్ పెకర్స్లో ఈ జాతి అరుదైనది. గ్రీన్ ఇంపీరియల్ పీజియన్: అనేక ఏళ్ల తర్వాత ఇది కళ్యాణి డ్యాం ప్రాంతంలో కనిపించింది. అరుదైన పావురాల్లో ఇది ఒకటి. చైనా, మలేసియా, ఫిలిప్పీన్స్, నేపాల్‌లలో ఇవి కనిపిస్తుంటాయి. ఏసియన్ పారడైజ్ ఫ్లైక్యాచర్: చిన్న తల, పొడవాటి తోక, ఆరెంజ్ కలర్లో ఉండే ఈ పక్షి శేషాచలంలో అరుదుగా కనిపిస్తుంటుంది. చామల రేంజ్‌లోని కోటకాడపల్లి ప్రాంతంలో కెమెరాకు చిక్కింది. మధ్య ఆసియా దేశాల్లో ఈ పక్షులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇండియన్ స్కాప్స్ ఔల్: దక్షిణ ఆసియాలో కనిపించే గుడ్లగూబ ఇది. దీని అరుపులు చాలా వింతగా>.. భయాందోళనకు గురి చేస్తుంటాయి. దీని కళ్లు పెద్దగా ఉంటాయి. కళ్యాణి డ్యాం ప్రాంతంలో ఇటీవల ఇది దర్శనమిచ్చింది. ఎల్లో త్రోటెడ్ బుల్బుల్: పసుపు పచ్చగా.. ముద్దుగా కనిపించే ఈ పక్షులు ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంటాయి. చాలా అరుదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ఈ పక్షులు కపిలతీర్థం ప్రాంతంలో కనిపించడం విశేషం. టికెల్స్ బ్లూ ఫ్లైక్యాచర్: ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చిన అరుదైన జాతి పిట్ట ఇది. చిన్న ముక్కు, పసుపు రంగు గొంతు దీని ప్రత్యేకత. శేషాచలంలో ఈ పిట్టలు సందడి చేస్తున్నాయి. కాపర్ స్మిత్ బార్బెట్: ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’తో కాపర్ స్మిత్ బార్బెట్ను పోల్చవచ్చు. కాపర్ ప్లేట్‌పై సుత్తితో కొడితే ఎలా సౌండ్ వస్తుందో.. ఈ పిట్ట అరిస్తే అలా ఉంటుంది. వివిధ వర్ణాల్లో ఉండే ఈ పిట్ట.. తన అందంతో మంత్రముగ్ధుల్ని చేస్తుంటుంది. బ్లాక్ హుడెడ్ ఓరియోల్: పసుపు, నలుపు రంగుల్లో అందంగా ఉండే ఈ పక్షి ప్రస్తుతం శేషాచలంలో దర్శనమిస్తోంది. ఆరెంజ్ హెడెడ్ త్రష్: ఆరెంజ్ కలర్లో ఉన్న ఈ పక్షి బ్రహ్మదేవ గుండంలో కనిపించింది. ఇది హిమాలయ ప్రాంతం నుంచి వచ్చినట్లుగా కార్తీక్ చెప్పారు. అనేక ఏళ్ల తర్వాత.. శేషాచలంలో ఇప్పటి వరకు 180 రకాల పక్షులను ఫొటోలు తీశాను. ఈ ఏడాది కళ్యాణి డ్యాం, కపిలతీర్థం, మామండూరు, బాలపల్లి, కలివిలేటి కోన, బ్రహ్మదేవ గుండం, మొగిలిపెంట, చామల రేంజ్‌లోని తలకోన, కోటకాడపల్లి తదితర ప్రాంతాల్లో అరుదైన పక్షులు కనిపించాయి. చాలా ఏళ్ల తర్వాత ఇక్కడ దర్శనమిచ్చాయి. – కార్తీక్, బర్డ్స్మెన్, తిరుపతి -
కిలకిలారావాలు పెరిగాయి !
సాక్షి, అమరావతి: జీవవైవిధ్యానికి ప్రతీకలుగా భావించే పక్షుల ఉనికి దేశంలో సంతృప్తికరంగా ఉంది. అక్కడక్కడా కొన్ని ప్రాంతాలు మినహా ఎక్కువ చోట్ల పక్షుల వైవిధ్యం బాగానే ఉన్నట్లు వెల్లడైంది. సాధారణంగా కనిపించే గోరింక, కాకి వంటి వాటితోపాటు కొన్నిచోట్ల అరుదైన పక్షులు కూడా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని పక్షి ప్రేమికులంతా కలిసి నిర్వహించే గ్రేట్ బ్యాక్ యార్డ్ బర్డ్ కౌంట్ (పక్షుల సందర్శన) సర్వేలో ఈ అంశం స్పష్టమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 12–15 తేదీల్లో ఈ సర్వే జరిగింది. మన దేశంలో బర్డ్ కౌంట్ ఆఫ్ ఇండియా పోర్టల్, మన రాష్ట్రంలో తిరుపతి ఐఐఎస్ఈఆర్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) ఈ సర్వేను సమన్వయం చేశాయి. సర్వే నివేదికను ఇటీవలే బర్డ్ కౌంట్ ఇండియా పోర్టల్ విడుదల చేసింది. బర్డ్ కౌంట్ సర్వేలో పక్షులను రికార్డు చేస్తున్న బర్డ్ వాచర్లు 2,954 బర్డ్ వాచర్లు.. 17 వేల గంటలు దేశంలో 965 రకాల పక్షి జాతులను ఈ సర్వేలో రికార్డు చేశారు. దేశంలో ఉన్న మొత్తం పక్షి జాతుల్లో ఇవి 72 శాతం. 2,954 బర్డ్ వాచర్లు 17 వేల గంటలు పరిశీలించి వీటిని రికార్డు చేశారు. రికార్డు చేసిన పక్షి జాతుల సంఖ్య ప్రకారం ఈ సర్వేలో ఈ సారి ఇండియా రెండో స్థానంలో నిలిచింది. 1,189 పక్షి జాతుల్ని రికార్డు చేసి కొలంబియా మొదటి స్థానంలో నిలిచింది. 2020 సంవత్సరంలో జరిగిన సర్వేలో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. గతం కంటె ఈ సారి ఎక్కువ సంఖ్యలో బర్డ్ వాచర్స్ పాల్గొనడంతో ఎక్కువ జాతులు రికార్డయ్యాయి. దేశంలో ఉత్తరాఖండ్‌లో అత్యధికంగా 426 పక్షి జాతులు, పశ్చిమ బెంగాల్లో 401, కర్నాటకలో 366 జాతుల్ని ఈ సర్వేలో రికార్డు చేశారు. మన రాష్ట్రంలో 57 మంది బర్డ్ వాచర్లు 295 పక్షి జాతుల్ని రికార్డు చేశారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం పక్షి జాతుల్లో ఇవి 60 శాతం. గత సంవత్సరం జరిగిన సర్వేలో 279 పక్షి జాతుల్ని కనుగొన్నారు. ఈ సారి మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఎక్కువగా 180 జాతులు రికార్డయ్యాయి. తర్వాతి స్థానాల్లో తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా నుంచి ఎక్కువ మంది బర్డ్ వాచర్స్ పాల్గొన్నారు. ఈ సారి ఐఐటీ తిరుపతి, ఎస్వీయూ, ఆంధ్రా యూనివర్సిటీ వంటి 13 విద్యా సంస్థలు కూడా సర్వేలో పాల్గొన్నాయి. కర్నూలులో అరుదైన పక్షి జాతులు ఈ సారి సర్వేలో కర్నూలు జిల్లాలో రెండు అరుదైన పక్షి జాతులు నమోదు కావడం విశేషం. ప్రపంచంలో అత్యధిక ఎత్తులో ఎగిరే తెల్ల పెద్ద బాతుతో పాటు మంగోలియా, సైబీరియా నుంచి వచ్చే పొట్టి చెవుల గుడ్ల గూబను కర్నూలులో రికార్డు చేశారు. ఇక, రాష్ట్రంలో సాధారణంగా కనిపించే కాకి, సంటి కొంగ, గోరింక, నల్ల ఏట్రింత, నల్ల కాకి, చిలుక, పావురం, నల్ల గద్ద, పికిలి పిట్టలే సర్వేలో ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలోని దక్షిణాది ప్రాంతమంతటా కాకి, గోరింక, నల్ల ఏట్రింత పక్షులు ఎక్కువగా కనిపించాయి. అద్భుతంగా శబ్దాలు చేసే ఈల గంటె పిట్టను కూడా ఈ సర్వేలో నమోదు చేశారు. పర్యావరణ మార్పుల్ని మొదట గుర్తించేది పక్షులే జీవ వైవిధ్యం ఎలా ఉందో తెలుసుకోవడంలో పక్షులు కీలకం. పర్యావరణంలో జరిగే మార్పుల్ని మొదట గుర్తించేది అవే. బర్డ్ వాచింగ్ వల్ల మన పర్యావరణం, వాతావరణ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఎన్ని జాతుల పక్షులున్నాయో తెలుస్తుంది. బర్డ్ వాచింగ్ కమ్యూనిటీలు పెద్దఎత్తున ఏర్పడి సర్వే చేస్తే పూర్తి స్థాయిలో వాస్తవ పరిస్థితి తెలుసుకునే అవకాశం ఉంటుంది. – బండి రాజశేఖర్, సిటిజన్ సైన్స్ కోఆర్డినేటర్, ఐఐఎస్ఈఆర్ -
అరుదైన బాతు.. 119 ఏళ్లకు ప్రత్యక్షం
డిస్పూర్: అరుదైన బాతు.. సప్తవర్ణాలతో హరివిల్లు అంతా తన ఒంటిపై పూసుకుని కనిపించే మాండరిన్ బాతు భారతదేశంలో 119 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమైంది. అస్సోంలో ఆ అరుదైన బాతు కనిపించడంతో పక్షుల ప్రేమికులు చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. టిన్సుకియా జిల్లాలోని మాగురి బిల్ సరస్సులో ఈ బాతు ప్రత్యక్షమై సందడి చేస్తోంది. అన్ని రంగులతో అందంగా ఉండే ఈ పొట్టి బాతు పేరు మాండరిన్. దీని శాస్త్రీయ నామం అయెక్స్ గలెరికులాట. నిర్దేశిత కాలాల్లో కొన్ని పక్షులు వలసకు వెళ్తుంటాయి. మనదేశంలో కూడా కొన్ని పక్షులు ఇక్కడకు వస్తుంటాయి.. ఇక్కడి పక్షులు మరో చోటకు వెళ్తుంటాయి. అలా ఈ మాండరిన్ బాతు కూడా శతాబ్దం తర్వాత భారతదేశంలో కనిపించిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. డిబ్రూ నదికి ఒడ్డున బిల్ సరస్సు ప్రాంతం అరుదైన పక్షులు.. జంతుజాతులకు నిలయంగా నిలుస్తోంది. ఈ ప్రాంతంలో కనిపిస్తున్న ఈ బాతు ప్రస్తుతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. మనదేశంలో 1902లో కనిపించిన ఈ బాతు మళ్లీ ఇన్నేళ్లకు కనిపించిందని పక్షి ప్రేమికుడు బినంద హతిబోరియా తెలిపారు. ఈ బాతు 10 అందమైన పక్షుల్లో ఒకటిగా పేర్కొంటారు. అయితే ఈ బాతు చైనాకు సంబంధించినది తెలుస్తోంది. చైనా సంస్కృతి చిహ్నంలో ఈ పక్షి ఓ భాగం. ఆ దేశంలో చాలా విషయాల్లో ఈ బాతు ప్రస్తావన ఉంటుందంట. రష్యా, కొరియా, జపాన్, చైనా దేశాల్లో ఈ బాతు ఎక్కువగా కనిపిస్తుంటుంది. Morning! The most handsome duck in our local pond has got to be this gorgeous mandarin duck! With his colourful plumage and gorgeous bright red beak he really does stand out from the crowd like a floating jewel! Happy Wednesday!#WednesdayMotivation pic.twitter.com/11TbBba6qz — Dr Amir Khan GP 💙 (@DrAmirKhanGP) February 17, 2021 -
ప్రపంచంలోనే అరుదైన పక్షి
కర్నూలు కల్చరల్: ప్రపంచంలో అరుదైన పక్షుల్లో ఒకటి బట్టమేక (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్). మన రాష్ట్రంలో ఇలాంటి పక్షులు సుమారు 180 వరకు ఉన్నట్లు అంచనా. మిడుతూరు మండలం రోళ్లపాడు గ్రామం వద్ద దాదాపు 100 పక్షుల వరకు చూడవచ్చు. ఇవి చిన్న చిన్న గుంపులుగా తిరుగుతాయి. బట్టమేక 12 నుంచి 15 కిలోల బరువు, ఒక మీటరు ఎత్తు ఉంటాయి. ఆడదాని కన్నా మగవి పెద్దవిగా ఉంటాయి. మెడ, పొట్ట భాగాల్లో తెల్లగా, వీపు గోదుమ రంగులో ఉంటుంది. తలపై నల్లని టోపీలా ఉండి ఛాతీ వద్ద నలుపు, తెలుపు ఈకలు హారంలా ఉంటాయి. ఇవి ఎక్కువగా నేల మీద తిరుగుతాయి. అరకిలోమీటర్ దూరంలో ఉన్న మనిషి జాడను సైతం ఇవి పసిగట్టగలవు. ఇవి మిడతలు, పురుగులు, తొండలు, బల్లులను ఆహారంగా స్వీకరిస్తాయి. మెట్ట పంటలనాశించు చీడ పురుగులు వీటి ఆహారం. వేరుశనగ, రేగి పండ్లు వీటికి మహా ఇష్టం. ఈ పక్షులు కర్నూలుకు 45 కిలోమీటర్ల దూరంలోని నందికొట్కూరు నుంచి నంద్యాలకు వెళ్లే దారిలో రోళ్లపాడు వద్ద కనిపిస్తాయి. -
గుడ్లగూబ? గరుడ పక్షా?..
వికారాబాద్ అర్బన్ :జిల్లాకేంద్రం వికారాబాద్‌లోని మారుతీనగర్‌లో బుధవారం ఓ అరుదైన పక్షి కనిపించింది. హనుమాన్ మందిరం వెనుకాల ఉన్న ఓ విద్యుత్ స్తంభంపై ఈ పక్షిని చూసిన స్థానికులు ఆసక్తిగా గమనించారు. పలువురు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని పక్షిని పరిశీలించారు. ఆ పక్షి గుడ్లగూబ? గరుడ పక్షా? అని తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని బర్డ్ వాచర్స్‌కు ఫొటోలు పంపి అసలు విషయం తెలుసుకున్నారు. బర్డ్ వాచర్స్ సమాచారం మేరకు అది గరుడపక్షి కాదని, ఓ రకమైన గుడ్లగూబని తెలిపారు. ఈ గుడ్లగూబ పాడుబడ్డ భవనాల్లోనే నివాసం ఉంటుందని, పగటి పూట ఎక్కువగా నిద్రలో ఉంటుందని చెప్పారు. -
కోదాడలో అరుదైన పక్షి
కోదాడఅర్బన్ : పట్టణంలోని ఖమ్మంక్రాస్రో డ్డులో ఓ దుకాణం ఎదుట గురువారం సాయంత్రం గుడ్లగూబ జాతికి చెందిన అరుదైన పక్షి కనిపించింది. లేత నీలం, తెలుపు రంగుతో నల్లని తోక కలిగి రామచిలుకలా ఉంది. ఈ పక్షి వింతగా ఉండడంతో దీనిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు -
సోషల్ మీడియాలో పక్షి హల్చల్
సుమారు గత వారం పది రోజులుగా వాట్సప్, ఫేస్బుక్.. ఇలా సోషల్ మీడియాలో ఓ పక్షి ఫొటో హల్చల్ చేస్తోంది. చూడటానికి అది అసలు పక్షో, జంతువో మరేంటో కూడా చెప్పలేని పరిస్థితి. దాని పేరు హికు. ఇది చాలా అరుదుగా కనిపించే పక్షి అని, దాన్ని చూస్తే అంతా మంచి జరుగుతుందన్న సెంటిమెంటు ఉందని చెబుతున్నారు. ఇది ఎక్కువగా నేపాల్‌లో కనిపిస్తుంది. నాలుగు కాళ్లతో.. నక్క లాంటి శరీరం, కొన్ని కుక్కలకు ఉన్నట్లుగా శరీరం నిండా దట్టంగా తెల్లటి వెంట్రుకలు, తోక, రెండు కొమ్ములు ఉన్నాయి. నడుం భాగం బాగా సన్నగా ఉంది. ఇది ఎగురుతుందా లేదా అన్న విషయం తెలియడం లేదు. పార్వతీదేవి దానికి అరటిపళ్లు తినిపించేదని, శివుడు కూడా దీన్ని ఎవరూ చంపలేరని వరం ఇచ్చాడని సోషల్ మీడియా సందేశాల్లో ఈ పక్షి ఫొటోతో పాటు ఇచ్చిన వివరణలో చెబుతున్నారు. ఎక్కువగా వర్షాకాలంలో మాత్రమే ఇది కనిపిస్తుందట. తర్వాత హిమాలయాలకు వెళ్లిపోతుందని కూడా చెబుతున్నారు. ఇలా చెబుతున్నదాంట్లో నిజానిజాల సంగతి ఎవరికీ తెలియదు గానీ, చూడటానికి మాత్రం ఈ పక్షి చాలా చిత్రంగా కనిపిస్తోంది. -
వందనం.... ప్రేమ సందనం
సఖినేటిపల్లి : ముఖమే 'లవ్ సింబల్' లా ఉన్న ఈ విలక్షణ పక్షి గురువారం తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం వీవీమెరకలో దర్శనమిచ్చింది. గుంపుగా దాడి చేస్తున్న కాకుల మధ్య ఏకాకిగా, నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ పక్షి ఆదర్శ రైతు గంటా శేఖర్‌కి పొలంలో కనిపించింది. ఆయన కాకులను తరిమి, ఆ పక్షిని ఇంటికి తెచ్చి 'ప్రేమ'గా సపర్యలు చేయటంతో కోలుకుంది. ఇంతకీ ఆ పక్షి పేరు ఏంటనేది తెలియాల్సి ఉంది.