రోళ్ల పాడు వద్ద సంచరిస్తున్న బట్టమేక పక్షులు
కర్నూలు కల్చరల్: ప్రపంచంలో అరుదైన పక్షుల్లో ఒకటి బట్టమేక (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్). మన రాష్ట్రంలో ఇలాంటి పక్షులు సుమారు 180 వరకు ఉన్నట్లు అంచనా. మిడుతూరు మండలం రోళ్లపాడు గ్రామం వద్ద దాదాపు 100 పక్షుల వరకు చూడవచ్చు. ఇవి చిన్న చిన్న గుంపులుగా తిరుగుతాయి. బట్టమేక 12 నుంచి 15 కిలోల బరువు, ఒక మీటరు ఎత్తు ఉంటాయి. ఆడదాని కన్నా మగవి పెద్దవిగా ఉంటాయి. మెడ, పొట్ట భాగాల్లో తెల్లగా, వీపు గోదుమ రంగులో ఉంటుంది. తలపై నల్లని టోపీలా ఉండి ఛాతీ వద్ద నలుపు, తెలుపు ఈకలు హారంలా ఉంటాయి. ఇవి ఎక్కువగా నేల మీద తిరుగుతాయి. అరకిలోమీటర్ దూరంలో ఉన్న మనిషి జాడను సైతం ఇవి పసిగట్టగలవు. ఇవి మిడతలు, పురుగులు, తొండలు, బల్లులను ఆహారంగా స్వీకరిస్తాయి. మెట్ట పంటలనాశించు చీడ పురుగులు వీటి ఆహారం. వేరుశనగ, రేగి పండ్లు వీటికి మహా ఇష్టం. ఈ పక్షులు కర్నూలుకు 45 కిలోమీటర్ల దూరంలోని నందికొట్కూరు నుంచి నంద్యాలకు వెళ్లే దారిలో రోళ్లపాడు వద్ద కనిపిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment