
కనుమరుగవుతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షులు
దేశవ్యాప్తంగా తగ్గిపోయిన సంఖ్య
ప్రస్తుతం 150 మాత్రమే ఉన్నట్టు నిర్ధారణ
నంద్యాల జిల్లా రోళ్లపాడు అభయారణ్యంలోనూ కనిపించని ఉనికి
గడ్డి భూములు కుచించుకుపోవడంతో చెదిరిపోయిన ఆవాసాలు
కృత్రిమ గర్భధారణ ద్వారా బట్టమేక సంతతి వృద్ధికి ప్రయత్నాలు
పొడవైన తెల్లటి మెడ.. దాని చుట్టూ తెలుపు–నలుపు ఈకల హారం.. బంగారు/గోధుమ వర్ణపు వీపు.. తలపై నల్లని టోపీతో ఇట్టే ఆకర్షించే రూపం బట్టమేక పక్షుల సొంతం. విమానం మాదిరిగా నేలపై పరుగులు తీసి గాల్లోకి లేచి.. స్థిమితంగా.. లయబద్ధంగా విశాలమైన రెక్కలు కదిలిస్తూ గగన విహారం చేయడం వీటి ప్రత్యేకత.
సాక్షి, అమరావతి: అరుదైన బట్టమేక పక్షులు (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్) మన దేశంలో అంతరించిపోయే స్థితికి చేరాయి. కొన్నేళ్లుగా చాలాచోట్ల వీటి జాడ కనిపించడం లేదు. 2008లో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 300 బట్టమేక పక్షులు ఉండగా.. ప్రస్తుతం వాటిసంఖ్య దేశవ్యాప్తంగా 150కి పడిపోయినట్టు తేలింది.
వాటిలోనూ ఎక్కువ పక్షులు రాజస్థాన్‌లోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 20కిపైగా బట్టమేక పక్షి జాతులు ఉండగా.. మన దేశంలో 4 జాతులున్నాయి. వాటిలో మన రాష్ట్రంలో కనిపించేవి ఇంకా అరుదైన జాతి పక్షులు.
మీటరు పొడవు.. 15 కిలోలకు పైగా బరువు
బట్టమేక పక్షుల్లో అత్యంత బలిష్టమైనవి మన ప్రాంతంలోనే ఉండేవి. ఈ పక్షి మీటరు పొడవు, 15 నుండి 20 కిలోల బరువు, పొడవాటి మెడ కలిగి ఉంటుంది. వీటిసంతతి చాలా అరుదుగా వృద్ధి చెందుతూ కేవలం ఏడాదికి ఒక గుడ్డు మాత్రమే పెట్టి దట్టమైన పొదల్లో 27 రోజులపాటు పొదుగుతుంది. దీని జీవిత చక్రం సుమారు 12 ఏళ్లు. ఒక్కో ఆడ పక్షి జీవిత కాలంలో కేవలం ఐదారు గుడ్లు మాత్రమే పెడతాయి.
ఏవి దొరికినా తిని కడుపు నింపుకోవడం వీటి ప్రత్యేకత. ధాన్యం గింజలు, పంటల కోత తర్వాత మిగిలిన మోళ్లు, వేళ్లు, పొలాల్లోని మిడతలు, పురుగులు, జెర్రులు, బల్లులు, తొండలు వంటివి వీటి ఆహారం. ఎగిరే పక్షుల్లో రెండవ అతి భారీ పక్షులుగా గుర్తింపు పొందినా.. నివాసానికి అనుకూల వాతావరణం లేక అంతరించిపోతున్నాయి.
సంరక్షణ చర్యలున్నా.. ప్రయోజనం సున్నా
మన దేశంలో కనిపించే అత్యంత అరుదైన బట్టమేక పక్షి జాతుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం కలగడం లేదు. వీటికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాల్లోనూ వాటి జాడ అరుదుగా మాత్రమే కనిపిస్తోంది. గత ఏడాది కర్ణాటకలోని బళ్లారి సమీపాన సిరిగుప్పలో రెండు, మహారాష్ట్ర లోని బీదర్‌లో ఒకటి కనిపించినట్టు అటవీ శాఖ నిర్ధారించింది. ఆ తర్వాత వీటి జాడ ఎక్కడా కానరాలేదు.
మన రాష్ట్రంలోనూ వీటి కోసం నంద్యాల జిల్లా నందికొట్కూరు సమీపంలోని రోళ్లపాడులో 600 హెక్టార్లలో బట్టమేక పక్షుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా అక్కడ కూడా ఈ పక్షులు కనిపించడంలేదు. వేటగాళ్ల ఉచ్చులకు బలైపోవడం, ఆవాసాలు తగ్గిపోవడం, ఎగిరే సమయంలో గాలి మరలు, విద్యుత్ లైన్లకు తగిలి మృత్యువాత పడటం, వాహనాల రణగొణ ధ్వనులే ఇవి అంతరించిపోవడానికి ప్రధాన కారణాలని వన్యప్రాణుల నిపుణులు చెబుతున్నారు.
గడ్డి భూములు తగ్గిపోవడంతో..|
పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో గడ్డి భూముల పాత్ర కీలకం. బట్టమేకల పక్షుల ఉనికి పర్యావరణానికి మేలు చేసే గడ్డి భూములపైనే ఆధారపడి ఉంది. విశాలమైన గడ్డి మైదానాలే వాటి ఆవాసాలు. అందుకే బట్ట మేక పక్షులను గడ్డి భూముల జీవనాడిగా చెబుతారు. ఈ భూములు పశువులకు మేత అందించడంతోపాటు పశువులపై ఆధారపడి జీవించే జాతుల మనుగడకు ప్రధానమైనవి. వాతావరణంలో ప్రాణవాయువును పెంచేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి.
తద్వారా పర్యావరణం, జీవ వైవిధ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తాయి. ఆయా ప్రాంతాల్లో నీటి ప్రవాహానాన్ని గడ్డి భూములు క్రమబద్ధీకరిస్తాయి. అలాంటి గడ్డి భూములు తగ్గిపోతుండడం బట్టమేక పక్షులు అంతరించిపోతుండటానికి ప్రధాన కారణమైంది. మన దేశంలో 2005 నుంచి 35 శాతం మేర గడ్డి భూములు తగ్గిపోయినట్టు అంచనా.
వ్యవసాయ విస్తరణ, పశువుల మేత ఎక్కువవడం, భూముల నిర్వహణ సరిగా లేకపోవడంతో జీవ వైవిధ్యం కోల్పోయి గడ్డి భూములు క్షీణిస్తున్నాయి. గతంలోని గడ్డి భూములు ప్రస్తుతం బంజరు భూములుగా మారిపోయాయి. ఫలితంగా ఆవాసాలు లేక బట్టమేక పక్షులు అంతరించిపోతున్నాయి.
కృత్రిమ గర్భధారణపైనే ఆశలు
బట్టమేక పక్షుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ పక్షులను మళ్లీ పునరుద్ధరించే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటికోసం సురక్షితమైన గడ్డి మైదానాలను సృష్టించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచిస్తోంది. కృత్రిమ గర్భధారణ ద్వారా బట్టమేక పక్షి పిల్లలను పుట్టించి.. గడ్డి భూముల్లో వదలాలని నిపుణులు సూచిస్తున్నారు.
రెండేళ్ల క్రితం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని జాతీయ పరిరక్షణ పెంపక కేంద్రం (నేషనల్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్) కృత్రిమ గర్భధారణ ద్వారా బట్టమేక పక్షుల్ని పునరుద్ధరించింది. వాటిని గడ్డి మైదానాల్లో వదిలి సంరక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఎంతమేరకు సఫలీకృతం అవుతాయో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment