ప్రకాశం జిల్లా మార్కాపురంలో తొలిసారిగా ఆసియా ఖండంలోని శ్రీలంక, చైనా, తైవాన్, సుమత్రా దీవుల వద్ద కనిపించే పలు రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కాలనీలో ఇవి కనిపిస్తున్నాయి. మూడు రోజుల క్రితం త్రివర్ణ మునియాను (మూడు రంగుల పక్షి) కనిపించగా వైట్ మునియా, బయా వీవర్, ఇండియన్ సిల్వర్ బిల్ పక్షులను స్నేక్ క్యాచర్ నిరంజన్ తన కెమెరాతో క్లిక్‌మనిపించాడు.
ఆ వివరాలను మీడియాకు తెలిపారు. వైట్ మునియా పక్షి అరుదైన జాతికి చెందింది. తెల్లటి, బూడిద రంగులతో కలిపి పొడవాటి నల్లటి తోకతో 10 నుంచి 11 సెం.మీ పొడవు ఉంటుంది. ఇది దట్టమైన పొదల్లో నివసిస్తుంది. ఈ పక్షిని జపాన్‌లోని పలు ప్రాంతాల్లో పెంపుడు పక్షిగా పెంచుకుంటారు. – మార్కాపురం
గిజిగాడి పక్షి
20 ఏళ్ల క్రితం కనిపించిన ఈ పక్షి మళ్లీ ఇప్పుడు మార్కాపురం ప్రాంతంలో కనిపిస్తోంది. ఇంగ్లిష్‌లో బయావీవర్ అని పిలుస్తారు. పల్లెల్లో అయితే గిజిగాడి పక్షి అంటారు. ఈ పిచ్చుక శ్రీలంక, పాకిస్థాన్, నేపాల్, భారత్‌లోని పలు ప్రాంతాల్లో కనిపిస్తుంది. గిజిగాడు నిర్మించుకునే గూడు విచిత్రంగా ఉంటుంది. కొమ్మలకు వేలాడుతూ ఉంటాయి.
పాములు, కాకులు, గద్దలు ఇతరత్రా పక్షులు, జంతువులు రాకుండా అద్భుతమైన ఇంజినీరింగ్ వ్యవస్థతో గూడు కట్టుకుంటుంది. తలమీద పసుపురంగుతో చేసిన బంగారు కిరీటంలా ఉంటుంది. ముక్కు నుంచి గడ్డం వరకు నలుపు రంగుతో ఉంటుంది. పొట్టకింద పసుపు తెలుపు, గోధుమ రంగులతో ఆకర్షణీయంగా ఉంటుంది.
ఇండియన్ సిల్వర్‌బిల్ పక్షి
ఈ పక్షి మార్కాపురంలోని విశ్వబ్రాహ్మణ రోడ్డులోని చెట్లపై కనిపిస్తోంది. తల, తోక, శరీర మధ్యభాగం ముక్కు ముదురు బ్రౌన్ రంగును కలిగి ఉంటుంది. పొట్టభాగం సిల్వర్ రంగులో ఉండటంతో దీన్ని ఇండియన్ సిల్వర్ బిల్ పక్షి అంటారు. ఇది గడ్డి విత్తనాలను తింటుంది. ఇది ఒక అరుదైన జాతి పక్షి. అంతరించిపోతున్న పక్షుల్లో ఇది కూడా ఒకటి.
Comments
Please login to add a commentAdd a comment