సాయంత్ర సమయంలో పెరటి కంచెల పైన, కరెంటు తీగల మీద, పొదల మీద నిగనిగ లాడే కారు నలుపు రంగులో పిగిలి పిట్ట(బుల్ బుల్) పరిమాణంలో ఉండే సన్నని చురుకైన పక్షిని అదేనండి నల్ల ఏట్రింతను ఎప్పుడైనా గమనించారా? ఈ పేరు కొత్తగా ఉన్నా,నల్లపిట్ట, కత్తెర పిట్ట, పసుల పోలిగాడు, భరద్వాజము, పోలీసు పిట్ట, కొత్వాలు పిట్ట గా మీకు పరిచయం అయిన ఈ పక్షి గురించి తెలుసుకుందాం.
► నల్ల ఏట్రింత దాదాపుగా భారతదేశ మంతటా కనిపిస్తుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువ చురుగ్గా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పచ్చిక బయళ్ళలో, పంటపొలాల గట్ల పైన, పట్టణ ప్రాంతాల్లో పెరటి చెట్లపైన, తీగల మీద దీనిని మనం ఎక్కువగా గమనించవచ్చు. దీని తోక పొడుగుగా ఉండి చివరలో చీలి చూడటానికి కత్తెరను పోలి ఉండడంతో దీనిని కత్తెరపిట్ట, మంగలి పిట్ట అని కూడా పిలుస్తారు.
► ఇది మాంసాహారి. గాలిలో ఎగురుతూ మిడతలు, తూనీగలు, కందిరీగలు, తేనెటీగలను పట్టుకుని అది కూర్చునే చోటకు తీసుకుపోయి కాలి కింద నొక్కిపట్టి, పదునైన ముక్కుతో ముక్కలు చేసి మింగుతుంది.నలువైపులా గమనిస్తూ రివ్వున కిందకు దిగి నేలపై ఉన్న ఎరను పట్టుకుంటుంది. మేస్తున్న పశువులపై కూర్చుని అవి గడ్డిలో నడుస్తున్నపుడు గడ్డిలో నుంచి పైకి ఎగిరిన కీటకాలను పట్టుకుని ఆరగిస్తుంది.
► గోరింకలు, తెల్ల కొంగలతో పాటుగా దున్నుతున్న పొలాల్లో తిరుగుతూ బయట పడ్డ గొంగళీలను కీటకాలను తింటుంది. చాలా అరుదుగా తేళ్ళు, జెర్రెలను, చిన్న పక్షులను, గబ్బిలాలను వేటాడుతుంది. నల్ల ఏట్రింత దక్షిణ భారతంలో ఫిబ్రవరి, మార్చి నెలలలో, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఆగష్టు నెల వరకు సంతానోత్పత్తిని చేస్తాయి.
► జత కట్టే సమయంలో ఆడా, మగ పక్షులు ఉదయాన్నే చెట్ల చిటారు కొమ్మలపై వాలి పాటలు పాడతాయి. తమ రెక్కలు ముక్కులను జత చేస్తూ గాలిలో విన్యాసాలు చేస్తాయి. సాధారణంగా జత మధ్య బంధం సంతానోత్పత్తి కాలం వరకూ ఉంటుంది. జతకట్టిన రెండు పక్షులూ కలిసి కొమ్మ వంచలలో పలుచని కర్రలతో, గడ్డి పోచలతో దొన్నె లాంటి గూడును కడతాయి.
► పనస వంటి పెద్ద ఆకులున్న చెట్లను గూడు కట్టడానికి ఎంచుకుంటాయి. ఈ గూటిలో 3 నుండి 4 గుడ్లను పెట్టి తల్లిదండ్రులిద్దరూ రెండు వారాల పాటు పొదుగుతాయి. పిల్లలకు ఒక నెల పాటు ఆహారం అందించి రక్షించిన తర్వాత పిల్లలు గూటిని విడిచి పెడతాయి. వీటి పిల్లలు చాలా చురుకుగా ఉంటాయి.
► చిన్న ఆకు ముక్కలను తుంపి నేలపైకి వదిలి మధ్య గాలిలో ఎగురుతూ వాటిని పట్టుకుని ఆడుతూ తమ ఎగిరే పాటవాలను, వేటాడే నైపుణ్యాలను మెరుగు పరుచుకుంటుంది.గూడు కట్టిన సమయంలో గూటికి దగ్గరలో కాపలా ఉంటూ వేటాడే కాకి, గ్రద్ద, జాలె డేగ (షిక్రా) వంటి పెద్ద పక్షులను కూడా ఎదిరించి, తరిమివేస్తూ దూకుడు స్వభావం కలిగి ఉంటుంది.
► గూటిని పిల్లలని కాపాడుకోవటానికి పెద్ద పక్షులతో కూడా పోరాడే దాని ధైర్యం మిగిలిన చిన్న పక్షులను ఆ పరిసరాలలో గూడు కట్టుకునేలా ప్రోత్సహిస్తుంది. ఈ దూకుడు స్వభావంతో తన గూటిని కాపాడుకోవటమే కాక పావురాలు, గువ్వలు, పికిలి పిట్టలు, వంగ పండు (ఓరియల్) వంటి ఇతర పక్షులకు కూడా రక్షణగా నిలవడంతో కొందరు నల్ల ఏట్రింతను పోలీసు పిట్ట, కొత్వాలు పిట్ట అని కూడా పిలుస్తారు.
► నల్ల ఏట్రింత రకరకాలుగా కూస్తుంది. సాధారణంగా టీ-టూ అని అరుస్తుంది. అపుడపుడు జాలె డేగ (షిక్రా) ను అనుకరిస్తూ అరిచి మైనాల నుండీ తిండిని దొంగలిస్తుంది. మధ్య భారతదేశంలో, నల్ల ఏట్రింత పశువుల కొమ్ములపై వాలితే పశువుల కొమ్ములు వూడి పోతాయనే మూఢ నమ్మకం కూడా ఉంది.
► నల్ల ఏట్రింత పురుగులను, కీటకాలను ఆహారంగా తీసుకుంటూ రైతుకు పంటను కాపాడుకోవటంలో సహాయ పడుతుంది. కొందరు రైతులు ఏట్రింత కూర్చోవడానికై పొలాలలో కర్రలను కూడా ఏర్పాటు చేస్తారు.పరిమాణంలో చిన్నదైనప్పటికీ తన స్వభావంతో ఇటు రైతులకు, అటు తోటి పక్షులకు ఎంతో సహాయ పడే నల్ల ఏట్రింతను మెచ్చుకోకుండా ఉండగలమా!..
-రవికుమార్ ద్వాదశీ
ఫోటోగ్రాఫర్- రేణుకా విజయ్‌రాఘవన్
Comments
Please login to add a commentAdd a comment