అరుదైన ఈ పువ్వు నల్లగా గబ్బిలంలా కనిపిస్తుంది. ఈ పూలు పూసే మొక్కలను దూరం నుంచి చూస్తే, మొక్కల మీద గబ్బిలాలు వాలి ఉన్నాయేమోననిపిస్తుంది. గబ్బిలం వంటి ఆకారం వల్లనే ఈ పువ్వుకు ‘బ్లాక్ బ్యాట్ ఫ్లవర్’ అనే పేరు వచ్చింది. కంద జాతికి చెందిన ఒక మొక్కకు ఈ పూలు పూస్తాయి. ఫ్రెంచ్ వర్తకుడు, కళాసేకర్త ఎడ్వర్డ్ ఆండ్రూ తొలిసారిగా ఈ పూల గురించి 1901లో రాసిన తన పుస్తకంలో వర్ణించాడు.
ఈ పూల మొక్కలు బంగ్లాదేశ్, కంబోడియా, దక్షిణ చైనా, లావోస్, మలేసియా, మయాన్మార్, థాయ్‌లండ్ అడవుల్లో కనిపిస్తాయి. ఈ పూల కేసరాలు పిల్లి మీసాల్లా ఉంటాయి. రేకులు గబ్బిలం రెక్కల్లా ఉంటాయి. పన్నెండు అంగుళాల వెడల్పు, పది అంగుళాల పొడవుతో గబ్బిలం ఆకారంలో కొంత భయం గొలిపేలా ఉండటంతో ఈ పువ్వులను దక్షిణాసియా స్థానిక భాషల్లో ‘దెయ్యం పువ్వులు’ అని కూడా పిలుస్తారు. చైనీస్ సంప్రదాయ వైద్యంలో ఈ పువ్వులను కొన్ని ప్రత్యేక ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు.
అతి పురాతన రైల్వేస్టేషన్..
ఇది ప్రపంచంలోనే అతి పురాతన రైల్వేస్టేషన్. ఇక్కడి నుంచే తొలి పాసింజర్ రైలుబండి నడిచింది. ఇంగ్లండ్‌లో ఉన్న ఈ రైల్వేస్టేషన్ పురాతన భవంతిని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో లివర్‌పూల్ రోడ్ స్టేషన్‌ను 1830లో నిర్మించారు. లివర్‌పూల్ రోడ్ నుంచి మాంచెస్టర్ వరకు తొలి పాసింజర్ రైలు నడిచేది. లివర్‌పూల్ అండ్ మాంచెస్టర్ రైల్వే కంపెనీ తరఫున ఈ రైల్వేస్టేషన్‌ను జార్జ్ స్టీఫెన్‌సన్ అనే ఇంజినీరు నిర్మించాడు.
ప్రస్తుతం మ్యూజియంగా మార్చిన ఈ పురాతన రైల్వేస్టేషన్ భవంతిలో రైల్వే మ్యూజియంతో పాటు సైన్స్ ప్లస్ ఇండస్ట్రీ మ్యూజియం, పిల్లల ఆట స్థలం వంటివి కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే తొలి పారిశ్రామిక నగరంలో మాంచెస్టర్ గత వైభవాన్ని తెలిపే వస్తువులను ఇక్కడ కొలువు దీర్చారు. పారిశ్రామిక విప్లవం నాటి పురాతన యంత్రపరికరాలను ఇందులో భద్రపరచారు. రైల్వే మ్యూజియంలో బొగ్గుతో నడిచే తొలినాటి ఆవిరి ఇంజిన్లను, ఆనాటి రైలు బోగీలను, వివిధ కాలాల్లో వచ్చిన మార్పులను ప్రతిబింబించే రైలు ఇంజిన్లను, బోగీలను భద్రపరచారు. ఈ మ్యూజియంను చూడటానికి పద్నాలుగేళ్ల లోపు పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నారు.
అతిచిన్న లకుముకి పిట్ట..
ఇది ప్రపంచంలోనే అతిచిన్న లకుముకి పిట్ట. అత్యంత అరుదైన పక్షుల్లో ఇది కూడా ఒకటి. పొడవాటి ఎర్రని ముక్కుతో రంగురంగుల శరీరంతో ఉండే ఈ పక్షి, చూడటానికి పిచుక పరిమాణంలో ఉంటుంది. ఫిలిప్పీన్స్ అడవుల్లో ఈ జాతి పక్షులు కనిపించేవి. ఫ్రెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త బెర్నార్డ్ జర్మెయిన్ డి లేస్‌పెడె 1799లో వీటిని తొలిసారిగా చూసినప్పుడు, ఇవి చిన్నసైజు కింగ్‌ఫిషర్ పక్షుల్లా కనిపించడంతో వీటికి ‘ఫిలిప్పీన్ డ్వార్ఫ్ కింగ్‌ఫిషర్’ అని పేరుపెట్టాడు.
ఈ పక్షులు క్రమంగా తగ్గిపోయి, కనిపించడం మానేశాయి. ఈ పక్షులను స్థానికులు చివరిసారిగా 130 ఏళ్ల కిందట చూశారు. ఆ తర్వాత ఈ పక్షులు ఎవరికీ కనిపించకపోవడంతో ఇవి అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు కూడా భావించారు. ఫిలిప్పీన్స్ విహంగ శాస్త్రవేత్త మీగెల్ డేవిడ్ డి లియాన్ ఇటీవల దక్షిణ ఫిలిప్పీన్స్ అడవుల్లో ఈ పక్షులను గుర్తించి ఫొటోలు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment