‘డార్లీ.. డార్లీ.. నీకేం కాలేదుగా?’ | Devon Damon Murders Mystery Story Written By Samhita Nimmana | Sakshi
Sakshi News home page

‘డార్లీ.. డార్లీ.. నీకేం కాలేదుగా?’

Published Sun, Sep 29 2024 4:10 AM | Last Updated on Sun, Sep 29 2024 4:10 AM

Devon Damon Murders Mystery Story Written By Samhita Nimmana

అ ర్థరాత్రి 2 దాటింది. ఉన్నట్టుండి ‘డా..రిన్‌.. సేవ్‌ మీ.. సేవ్‌ మీ’ అనే ఆర్తనాదాలు వినిపించసాగాయి. గాఢనిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన డారిన్, ఆ గొంతు.. కింద నిద్రపోతున్న తన భార్యదేనని గ్రహించి క్షణాల్లో ‘డార్లీ ఏమైంది?’ అంటూ మెట్లవైపు పరుగుతీశాడు. వెళ్తూ వెళ్తూ లైట్స్‌ ఆన్‌ చేశాడు. డార్లీ నొప్పితో రొప్పుతూ గుమ్మం నుంచి బయటికి పరుగులు తీయడం కనిపించింది. ఆమె చేతిలో రక్తమోడుతున్న కత్తి ఉంది. ఆమె పరుగు చూస్తుంటే, ముందు ఎవరో పారిపోతున్నట్లే అనిపించింది. డారిన్‌ వేగం పెంచాడు.

ఇంటికి కాస్తదూరంలో డార్లీ ఆగడం చూసి ‘డార్లీ.. డార్లీ.. నీకేం కాలేదుగా?’ అంటూనే ఆమెను పరిశీలనగా చూశాడు. ఆమె దుస్తుల నిండా రక్తం, ఒంటి మీద కత్తిపోట్లు చూసి డారిన్‌కి వణుకు పుట్టుకొచ్చింది. ‘డ.. డా..రిన్‌ .. ఎవ..డో ఇంట్లోకొచ్చి, క.. కత్తితో దాడి చేసి పారిపోయాడు’ అంది డార్లీ వణుకుతున్న స్వరంతో. భార్య మాటలు వినగానే డారిన్‌ కు ఇంట్లో నిద్రపోతున్న పిల్లలు గుర్తొచ్చారు. ‘íపిల్లలు?!’ అని అరుస్తూనే క్షణాల్లో లోపలికి పరుగుపెట్టాడు. చేతిలోని కత్తి అక్కడే పారేసి, అతడి వెనుకే డార్లీ కూడా పరుగెత్తింది.

డార్లీ అరుపులకు కంగారులో బయటికి పరుగు తీసినప్పుడు చూడలేదు కానీ హాల్‌ అంతా నెత్తుటిమయంగా ఉంది. చాలాచోట్ల మనిషి ఎర్రటి అడుగుజాడలు ఉన్నాయి. అవన్నీ చూస్తూ పిల్లలు పడుకున్నవైపు వెళ్తుంటే, డారిన్‌ కి ప్రాణం పోయినట్లు అనిపించింది. ధైర్యం చేసి పిల్లల దగ్గరకు వెళ్లేసరికి ఇద్దరు కొడుకులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.

అంబులెన్‌ ్స వచ్చేసరికే పెద్దకొడుకు ఆరేళ్ల డెవాన్‌  కన్నుమూశాడు. ఆసుపత్రికి వెళ్లేసరికి రెండో కొడుకు ఐదేళ్ల డామన్‌  చనిపోయాడు. ఆసుపత్రిలో ఉండగా అప్పటికే కత్తిగాయాలతో అల్లాడుతున్న డార్లీకి సీరియస్‌ అయిపోయింది. వెంటనే ఐసీయూలో పెట్టి డాక్టర్లు ఆమెకు చికిత్స మొదలుపెట్టారు. ఆ ఇంట్లో ఏ ప్రమాదానికి గురికానివారు ఇద్దరే మిగిలారు. ఒకరు డారిన్‌ , ఇంకొకరు మూడో కొడుకు డ్రేక్‌. (ఆ రాత్రి తండ్రితోనే నిద్రపోయాడు) వాడికి 9 నెలలు. దాంతో పోలీసుల కన్ను డారిన్‌ పైనే పడింది. అయితే 24 గంటలు గడవకముందే కథ అడ్డం తిరిగింది. డార్లీనే పిల్లల్ని చంపి, ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ ఆధారాలు పుట్టుకొచ్చాయి.

కత్తి మీద డార్లీ వేలిముద్రలు బలమైన సాక్ష్యాలయ్యాయి. ఇంటి లోపలికి చొరబడటానికి వీలుగా మనిషి పట్టేంత రంధ్రం ఓ తలుపు పక్కనే కనిపించింది. అయితే అక్కడ డార్లీ తల వెంట్రుకలు దొరకడంతో నేరం నుంచి తప్పించుకోవడానికి డార్లీనే ఆ రంధ్రాన్ని చేసుంటుందని అనుమానించారు. దాంతో ఆమె కోలుకోగానే అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు అధికారులు.

‘‘ఆ రాత్రి కిల్లర్‌ నా పిల్లల్ని, నన్నూ పొడిచిన కత్తిని పడేసి పారిపోతుంటే, కంగారులో అదే కత్తిని నేను తీసుకుని వెంటపడ్డాను. వాడు గ్యారేజీ వైపు పారిపోయాడు’’ చెప్పింది డార్లీ. ‘సింక్‌లో రక్తం క్లీన్‌ చేసిన ఆనవాళ్లు ఉన్నాయని, పిల్లల్ని పొడిచేశాక, తనని తాను జాగ్రత్తగా పొడుచుకోవడం కోసం డార్లీ సింక్‌ ముందు చాలాసేపు ఉందని, ఆ తర్వాత డ్రామాలో భాగంగా పైన నిద్రపోతున్న డారిన్‌ ని పిలవడం మొదలుపెట్టిందని, ఇంట్లోకి ఏ దుండగుడు రాలేదని నమ్మిన అధికారులు ఆమెను కోర్టుకెక్కించారు.

సరిగ్గా మర్డర్స్‌ జరిగిన వారానికి డెవాన్‌ పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ క్రమంలోనే ఓ జర్నలిస్ట్‌ తీసిన డెవాన్‌ బర్త్‌డే వీడియోలో సమాధి దగ్గర డార్లీ నవ్వడమే కోర్టుకు బలమైన ఆధారంగా మారింది. పైగా డార్లీకి డ్రేక్‌ పుట్టాక, మానసిక సమస్యలతో కొన్ని నెలలు డిప్రెషన్‌ లోకి వెళ్లిందనే పాయింట్‌ డిటెక్టివ్స్‌ నమ్మకానికి ఊతమైంది. దాంతో కోర్టు డార్లీకి మరణశిక్ష విధించింది.

అయితే భర్త డారిన్‌ మాత్రం డార్లీ నిర్దోషి అని బలంగా నమ్మాడు. ‘అసలే డిప్రెషన్‌లో ఉన్న ఒక మనిషి తన ఇద్దరు పిల్లల్ని కళ్లముందే పోగొట్టుకున్నప్పుడు మానసిక స్థితి ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించాలి. అదేరోజు(బర్త్‌డే) ఉదయం తను చాలా ఏడ్చింది’ అంటూ డార్లీ కుటుంబం మొత్తం ఆమెకే మద్దతుగా నిలిచింది. దాంతో మరణశిక్షకు బ్రేక్స్‌ పడ్డాయి. మరోవైపు హత్యలు జరిగిన రాత్రి ఒంటిగంటన్నర సమయంలో ఒక నల్లటి వింత కారు డార్లీ ఇంటికి సమీపంలో ఆగి ఉండటం చూశామని కొందరు సాక్షులు చెప్పారు. డార్లీ అరుపులు వినిపిస్తున్నప్పుడే ఒక కారు స్టార్ట్‌ అయిన శబ్దం విన్నామని ఇంకొందరు పొరుగువారు చెప్పారు. పైగా అప్పటికే ఆ ప్రాంతంలో అనేక హింసాత్మక హత్యలు, అత్యాచారాలు జరిగాయి. కొందరు దుండగులు వేలిముద్రలు దొరక్కుండా చేతులకు గ్లోవ్స్‌ ఉపయోగించేవారు. ఆ క్రమంలోనే డార్లీ ఇరుక్కుని ఉంటుందని కొందరు, లేదంటే డార్లీపై కక్షతో ఎవరైనా ఆమెను ఇరికించారేమోనని ఇంకొందరు నమ్మడం మొదలుపెట్టారు.

1996 జూన్‌ 6 రాత్రి, అమెరికా, టెక్సస్, రౌలెట్‌లో ఈ ఉదంతం జరిగింది. డార్లీ తన ఇద్దరు పిల్లల్ని చంపిందన్న నేరారోపణలతో నేటికీ జైల్లోనే ఉంది. టెక్నాలజీ పెరగడంతో కోర్టు డీఎన్‌ఏ పరీక్షలకు అనేకసార్లు ఆదేశించింది. అయితే, ఇప్పటికీ ఆ పరీక్షా ఫలితాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. మరోవైపు విచారణలో భాగంగా అధికారులకు ఆ ఇంట్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల వేలిముద్రలు లభించాయి. వాటిని గ్యారేజీ తలుపు మీద, ఆ రాత్రి డార్లీ నిద్రపోయిన సోఫా మీద గుర్తించారు. అయినా డార్లీ విడుదల కాలేదు.

ఇద్దరు కొడుకులకు జీవిత బీమా పాలసీ ఉన్నందుకే డార్లీ పిల్లల్ని చంపిందని ప్రాసిక్యూషన్‌ వాదించింది. నిజానికి డార్లీ డబ్బుకోసమే హత్యలు చేసుంటే, ఆమె భర్త డారిన్‌ పేరుమీద ఇంకా పెద్దమొత్తంలో జీవిత బీమా పాలసీ ఉందని, మరి అతడ్ని ఎందుకు చంపలేదనే వాదన డార్లీకి అండగా నిలిచింది. సుమారు 28 ఏళ్లుగా ఈ కేసు కొనసాగుతోంది. నేరం జరిగిన పదిహేనేళ్లకు డారిన్‌ తన భవిష్యత్తు కోసం డార్లీకి విడాకులిచ్చేశాడు. మూడో కొడుకు డ్రేక్‌ ఇప్పటికీ తల్లి తరçఫునే పోరాడుతున్నాడు. ఏదిఏమైనా ముద్దులొలికే చిన్నారుల్ని ఆ రాత్రి పొడిచి చంపిందెవరో? నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement