Vintalu Vishesalu
-
ఈ కిక్కిరిసిన అపార్ట్మెంట్ ఎక్కడుందో తెలుసా!?
ప్రపంచంలోనే అత్యధిక జనాభా నివాసం ఉండే అపార్ట్మెంట్ భవన సముదాయం ఇది. ఈ భవన సముదాయం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో ఉంది. ఇందులో ఏకంగా ఇరవైవేల మందికి పైగా జనాలు నివాసం ఉంటున్నారు. మనుషులతో కిక్కిరిసిన ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ను పాశ్చాత్య మీడియా ‘హ్యూమన్ యాంట్‌హిల్’గా అభివర్ణిస్తోంది. అంటే, మనుషులు ఉండే చీమలపుట్ట అన్నమాట!ఈ భారీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో 25 అంతస్తుల్లో 3,708 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నిర్మాణం 2015లో పూర్తయింది. అప్పటి నుంచి జనాలు ఇందులోకి చేరడం మొదలుపెట్టారు. స్వల్పకాలంలోనే ఇది పూర్తిగా జనాలతో కిక్కిరిసిపోయే పరిస్థితికి చేరుకుంది. ఉచిత పార్కింగ్, కాంప్లెక్స్ లోపలే సెలూన్లు, కాఫీ షాపులు, నర్సరీ, పోస్టాఫీసు, సూపర్‌మార్కెట్ వంటి సమస్త సౌకర్యాలూ ఉండటంతో జనాలు ఇక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నారు.ఇవి చదవండి: మీ ముఖాన్ని.. మెరిపించే మంత్రదండం! -
‘డార్లీ.. డార్లీ.. నీకేం కాలేదుగా?’
అ ర్థరాత్రి 2 దాటింది. ఉన్నట్టుండి ‘డా..రిన్.. సేవ్ మీ.. సేవ్ మీ’ అనే ఆర్తనాదాలు వినిపించసాగాయి. గాఢనిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన డారిన్, ఆ గొంతు.. కింద నిద్రపోతున్న తన భార్యదేనని గ్రహించి క్షణాల్లో ‘డార్లీ ఏమైంది?’ అంటూ మెట్లవైపు పరుగుతీశాడు. వెళ్తూ వెళ్తూ లైట్స్ ఆన్ చేశాడు. డార్లీ నొప్పితో రొప్పుతూ గుమ్మం నుంచి బయటికి పరుగులు తీయడం కనిపించింది. ఆమె చేతిలో రక్తమోడుతున్న కత్తి ఉంది. ఆమె పరుగు చూస్తుంటే, ముందు ఎవరో పారిపోతున్నట్లే అనిపించింది. డారిన్ వేగం పెంచాడు.ఇంటికి కాస్తదూరంలో డార్లీ ఆగడం చూసి ‘డార్లీ.. డార్లీ.. నీకేం కాలేదుగా?’ అంటూనే ఆమెను పరిశీలనగా చూశాడు. ఆమె దుస్తుల నిండా రక్తం, ఒంటి మీద కత్తిపోట్లు చూసి డారిన్కి వణుకు పుట్టుకొచ్చింది. ‘డ.. డా..రిన్ .. ఎవ..డో ఇంట్లోకొచ్చి, క.. కత్తితో దాడి చేసి పారిపోయాడు’ అంది డార్లీ వణుకుతున్న స్వరంతో. భార్య మాటలు వినగానే డారిన్ కు ఇంట్లో నిద్రపోతున్న పిల్లలు గుర్తొచ్చారు. ‘íపిల్లలు?!’ అని అరుస్తూనే క్షణాల్లో లోపలికి పరుగుపెట్టాడు. చేతిలోని కత్తి అక్కడే పారేసి, అతడి వెనుకే డార్లీ కూడా పరుగెత్తింది.డార్లీ అరుపులకు కంగారులో బయటికి పరుగు తీసినప్పుడు చూడలేదు కానీ హాల్ అంతా నెత్తుటిమయంగా ఉంది. చాలాచోట్ల మనిషి ఎర్రటి అడుగుజాడలు ఉన్నాయి. అవన్నీ చూస్తూ పిల్లలు పడుకున్నవైపు వెళ్తుంటే, డారిన్ కి ప్రాణం పోయినట్లు అనిపించింది. ధైర్యం చేసి పిల్లల దగ్గరకు వెళ్లేసరికి ఇద్దరు కొడుకులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.అంబులెన్ ్స వచ్చేసరికే పెద్దకొడుకు ఆరేళ్ల డెవాన్ కన్నుమూశాడు. ఆసుపత్రికి వెళ్లేసరికి రెండో కొడుకు ఐదేళ్ల డామన్ చనిపోయాడు. ఆసుపత్రిలో ఉండగా అప్పటికే కత్తిగాయాలతో అల్లాడుతున్న డార్లీకి సీరియస్ అయిపోయింది. వెంటనే ఐసీయూలో పెట్టి డాక్టర్లు ఆమెకు చికిత్స మొదలుపెట్టారు. ఆ ఇంట్లో ఏ ప్రమాదానికి గురికానివారు ఇద్దరే మిగిలారు. ఒకరు డారిన్ , ఇంకొకరు మూడో కొడుకు డ్రేక్. (ఆ రాత్రి తండ్రితోనే నిద్రపోయాడు) వాడికి 9 నెలలు. దాంతో పోలీసుల కన్ను డారిన్ పైనే పడింది. అయితే 24 గంటలు గడవకముందే కథ అడ్డం తిరిగింది. డార్లీనే పిల్లల్ని చంపి, ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ ఆధారాలు పుట్టుకొచ్చాయి.కత్తి మీద డార్లీ వేలిముద్రలు బలమైన సాక్ష్యాలయ్యాయి. ఇంటి లోపలికి చొరబడటానికి వీలుగా మనిషి పట్టేంత రంధ్రం ఓ తలుపు పక్కనే కనిపించింది. అయితే అక్కడ డార్లీ తల వెంట్రుకలు దొరకడంతో నేరం నుంచి తప్పించుకోవడానికి డార్లీనే ఆ రంధ్రాన్ని చేసుంటుందని అనుమానించారు. దాంతో ఆమె కోలుకోగానే అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు అధికారులు.‘‘ఆ రాత్రి కిల్లర్ నా పిల్లల్ని, నన్నూ పొడిచిన కత్తిని పడేసి పారిపోతుంటే, కంగారులో అదే కత్తిని నేను తీసుకుని వెంటపడ్డాను. వాడు గ్యారేజీ వైపు పారిపోయాడు’’ చెప్పింది డార్లీ. ‘సింక్‌లో రక్తం క్లీన్ చేసిన ఆనవాళ్లు ఉన్నాయని, పిల్లల్ని పొడిచేశాక, తనని తాను జాగ్రత్తగా పొడుచుకోవడం కోసం డార్లీ సింక్ ముందు చాలాసేపు ఉందని, ఆ తర్వాత డ్రామాలో భాగంగా పైన నిద్రపోతున్న డారిన్ ని పిలవడం మొదలుపెట్టిందని, ఇంట్లోకి ఏ దుండగుడు రాలేదని నమ్మిన అధికారులు ఆమెను కోర్టుకెక్కించారు.సరిగ్గా మర్డర్స్ జరిగిన వారానికి డెవాన్ పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ క్రమంలోనే ఓ జర్నలిస్ట్ తీసిన డెవాన్ బర్త్‌డే వీడియోలో సమాధి దగ్గర డార్లీ నవ్వడమే కోర్టుకు బలమైన ఆధారంగా మారింది. పైగా డార్లీకి డ్రేక్ పుట్టాక, మానసిక సమస్యలతో కొన్ని నెలలు డిప్రెషన్ లోకి వెళ్లిందనే పాయింట్ డిటెక్టివ్స్ నమ్మకానికి ఊతమైంది. దాంతో కోర్టు డార్లీకి మరణశిక్ష విధించింది.అయితే భర్త డారిన్ మాత్రం డార్లీ నిర్దోషి అని బలంగా నమ్మాడు. ‘అసలే డిప్రెషన్లో ఉన్న ఒక మనిషి తన ఇద్దరు పిల్లల్ని కళ్లముందే పోగొట్టుకున్నప్పుడు మానసిక స్థితి ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించాలి. అదేరోజు(బర్త్‌డే) ఉదయం తను చాలా ఏడ్చింది’ అంటూ డార్లీ కుటుంబం మొత్తం ఆమెకే మద్దతుగా నిలిచింది. దాంతో మరణశిక్షకు బ్రేక్స్ పడ్డాయి. మరోవైపు హత్యలు జరిగిన రాత్రి ఒంటిగంటన్నర సమయంలో ఒక నల్లటి వింత కారు డార్లీ ఇంటికి సమీపంలో ఆగి ఉండటం చూశామని కొందరు సాక్షులు చెప్పారు. డార్లీ అరుపులు వినిపిస్తున్నప్పుడే ఒక కారు స్టార్ట్ అయిన శబ్దం విన్నామని ఇంకొందరు పొరుగువారు చెప్పారు. పైగా అప్పటికే ఆ ప్రాంతంలో అనేక హింసాత్మక హత్యలు, అత్యాచారాలు జరిగాయి. కొందరు దుండగులు వేలిముద్రలు దొరక్కుండా చేతులకు గ్లోవ్స్ ఉపయోగించేవారు. ఆ క్రమంలోనే డార్లీ ఇరుక్కుని ఉంటుందని కొందరు, లేదంటే డార్లీపై కక్షతో ఎవరైనా ఆమెను ఇరికించారేమోనని ఇంకొందరు నమ్మడం మొదలుపెట్టారు.1996 జూన్ 6 రాత్రి, అమెరికా, టెక్సస్, రౌలెట్లో ఈ ఉదంతం జరిగింది. డార్లీ తన ఇద్దరు పిల్లల్ని చంపిందన్న నేరారోపణలతో నేటికీ జైల్లోనే ఉంది. టెక్నాలజీ పెరగడంతో కోర్టు డీఎన్ఏ పరీక్షలకు అనేకసార్లు ఆదేశించింది. అయితే, ఇప్పటికీ ఆ పరీక్షా ఫలితాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. మరోవైపు విచారణలో భాగంగా అధికారులకు ఆ ఇంట్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల వేలిముద్రలు లభించాయి. వాటిని గ్యారేజీ తలుపు మీద, ఆ రాత్రి డార్లీ నిద్రపోయిన సోఫా మీద గుర్తించారు. అయినా డార్లీ విడుదల కాలేదు.ఇద్దరు కొడుకులకు జీవిత బీమా పాలసీ ఉన్నందుకే డార్లీ పిల్లల్ని చంపిందని ప్రాసిక్యూషన్ వాదించింది. నిజానికి డార్లీ డబ్బుకోసమే హత్యలు చేసుంటే, ఆమె భర్త డారిన్ పేరుమీద ఇంకా పెద్దమొత్తంలో జీవిత బీమా పాలసీ ఉందని, మరి అతడ్ని ఎందుకు చంపలేదనే వాదన డార్లీకి అండగా నిలిచింది. సుమారు 28 ఏళ్లుగా ఈ కేసు కొనసాగుతోంది. నేరం జరిగిన పదిహేనేళ్లకు డారిన్ తన భవిష్యత్తు కోసం డార్లీకి విడాకులిచ్చేశాడు. మూడో కొడుకు డ్రేక్ ఇప్పటికీ తల్లి తరçఫునే పోరాడుతున్నాడు. ఏదిఏమైనా ముద్దులొలికే చిన్నారుల్ని ఆ రాత్రి పొడిచి చంపిందెవరో? నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మన -
మీరెప్పుడైనా.. ఈ మృత్యుసరోవరం గురించి విన్నారా!?
సముద్రంలో ఉన్న మృత్యుసరోవరం ఇది. సముద్రంలోకి దిగి చూస్తే, ఇది మామూలుగానే కనిపిస్తుంది గాని, ఇందులో ఈత కొట్టాలని సరదా పడితే మాత్రం, చావును కోరి కొనితెచ్చుకున్నట్లే! వంద అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మడుగులోని అత్యంత లవణీయత కలిగిన నీరు, మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి ప్రాణాంతక విషవాయువులు దీనిని మృత్యుసరోవరంగా మార్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని తొలిసారిగా 2015లో కనుగొన్నారు. ఇందులో ఈదులాడేందుకు దిగి మరణించిన జంతువుల కళేబరాలను శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం సేకరించి, భద్రపరచారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో వద్ద సముద్రంలోకి దిగి పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలకు సముద్రం లోపలి భాగంలో ఈ మడుగులాంటి ప్రదేశం కనిపించింది. దాదాపు వంద అడుగుల విస్తీర్ణంలో బురదనీటితో నిండిన ఈ మడుగులోకి వెళ్లే పీతలు, మొసళ్లు వంటి జీవులు నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోవడాన్ని వారు గమనించారు.సాధారణంగా సముద్రపు నీటిలో ఉండే ఉప్పదనం కంటే, ఈ మృత్యుసరోవరం నీటి ఉప్పదనం నాలుగురెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతి కొద్ది జలచరాలు మాత్రమే ఇందులోని పరిస్థితులను తట్టుకుని మరీ బతకగలవని, మిగిలినవి ఇందులోకి దిగితే నిమిషాల్లోనే మరణిస్తాయని చెబుతున్నారు. దీనిని ‘హాట్ టబ్ ఆఫ్ డిస్పెయిర్’ అని, ‘జకూజీ ఆఫ్ డిస్పెయిర్’ అని అభివర్ణిస్తున్నారు.ఇవి చదవండి: గ్యాప్ ఇవ్వలా... వచ్చింది -
ఇదేం బ్యాగ్ రా దేవుడా..! ధర తెలిస్తే కంగుతింటారు..!
కొన్ని ప్రముఖ లగ్జరీయస్ ప్యాషన్ బ్రాండ్లు మార్కెట్లోకి రీలిజ్ చేసే కొత్త వస్తువులు చాలా విలక్షణంగా ఆకర్షణీయంగా ఉంటాయి.పైగా వాటికో స్పెషాలిటీ తప్పక ఉంటుంది. ఆ ఫేమస్ బ్రాండ్లు రిలీజ్ చేసే వస్తువులపై క్రేజ్ మాములుగా ఉంటుంది. అందరూ అటెన్షన్ ఆ వస్తువు పైనే ఉంటుంది. అంతలా ఫ్యాషన్ ప్రపంచంలో వాటికి క్రేజ్ ఉంటుంది. అయితే ఫ్యాషన్‌కే ఐకానిక్ సింబల్‌గా ఉన్న ఈ లగ్జరీ బ్రాండ్ బ్యాగ్ చూస్తే మాత్రం ఇదేం బ్యాగ్ రా బాబు అంటూ ముఖం చిట్లించేస్తారు. ప్రస్తుతం నెట్టింట ఈ బ్యాగ్‌పై సర్వత్ర విమర్శలు, జోక్‌లు వినిపిస్తున్నాయి. ప్రాడ్ అనే ప్రముఖ లగ్జరీ బ్రాండ్ ఈ మెటాలిక్ టోట్ బ్యాగ్‌ని లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ మరింత వినూత్నంగా ఈ బ్యాగ్‌ని రూపొందించింది. పురుషులకు ఇలా డిజైన్ చేయడం మరింత విస్మయానికి గురిచేసింది. ఇది మన బస్సుల్లోనూ, రైల్వే టాయిలెట్లలోనూ ఫ్లోర్ మాదిరిగా ఈ మెటాలిక్ బ్యాగ్ ఉంది. చూసిన వాళ్ల అంతా భయనాకంగా ఉందంటూ ఘెరంగా పోలికలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో కనిపించే ప్లోర్ మాదిరిగా బ్యాగ్‌ని డిజైన్ చేయడం ఏమిటి. ఇది ఫ్యాషన్-ఫార్వర్డ్ స్టేట్మెంట్ లేదా విచిత్రమైన డిజైన్ అని ప్రశ్నలు లేవెనెత్తారు. సర్వత్రా ఈ బ్యాగ్ డిజైన్‌పై విమర్శలు వెల్లవెత్తాయి. ఇదేం డిజైన్ అంటూ తిట్టిపోస్తున్నారు. అయితే ఇంతలా విమర్శలు వస్తున్న ఈ బ్యాగ్ ధర వింటే కచ్చితంగా షాకవ్వుతారు. ఏకంగా రూ. 2.73 లక్షలు పలుకుతుందట. పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ బ్యాగ్ డిజైన్ పరంగానే కాకుండా ధర పరంగానూ క్లిక్ అయ్యేలా లేదు కదూ..!.(చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..!) -
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దీవి.. కానీ ఇక్కడ ఒక్కరు కూడా..?
ప్రపంచంలోని చూడచక్కని దీవుల్లో ఇదొకటి. ఈ దీవి చుట్టూ అందమైన పగడపు దిబ్బలు కనువిందు చేస్తాయి. దీవి తీరం దాటి లోపలకు వెళితే, పచ్చని చెట్లు, రకరకాల అరుదైన పక్షులు ఆహ్లాదం కలిగిస్తాయి. ఇక్కడ ఎలాంటి కట్టడాలూ కనిపించవు. పసిఫిక్ సముద్రంలో ఉన్న ఈ దీవి పేరు ‘పామీరా’ దీవి.ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దీవి. అయితే, ఇది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో లేదు. ప్రస్తుతం ఇది అమెరికా అధీనంలో ఉంది. ఈ దీవి గురించి న్యాయపోరాటాలు కూడా జరిగాయి. చివరకు అమెరికా ప్రభుత్వం 2000 సంవత్సరంలో 27.26 మిలియన్ డాలర్లు (రూ.228.49 కోట్లు) చెల్లించి దీనిని సొంతం చేసుకుంది.ఈ దీవి అమెరికా ప్రభుత్వం అధీనంలోకి వచ్చినా, ఇక్కడ మనుషులెవరూ ఉండరు. దీనికి గల చీకటి చరిత్రే అందుకు కారణం. ఈ దీవి అందానికి ముగ్ధులైన కొందరు ఔత్సాహికులు ఇదివరకు అప్పుడప్పుడూ వచ్చేవారు. వారిలో కొందరు అంతుచిక్కని కారణాలతో మరణించారు. మరికొందరు ఎలాంటి ఆచూకీ లేకుండా గల్లంతైపోయారు. అందువల్ల ఈ దీవి ఎంత అందంగా ఉన్నా, ఇక్కడి వాతావరణం ఎంత ఆహ్లాదభరితంగా ఉన్నా ఇక్కడ అడుగుపెట్టాలంటేనే జనాలు భయంతో వణికిపోతారు. అయితే, అప్పుడప్పుడు కొందరు శాస్త్రవేత్తలు బృందాలుగా ఇక్కడకు వచ్చి, పరిశోధనలు జరిపి వెళుతుంటారు. వారు కూడా ఇక్కడ రాత్రివేళల్లో బస చేయరు.ఇది కిరీటం కాదు.. లైటర్!చూడటానికి కిరీటం పైభాగంలా కనిపిస్తోంది గాని, నిజానికి ఇది సిగార్ లైటర్. ఇందులో విశేషమేంటనేగా మీ అనుమానం? ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సిగార్ లైటర్. మిగిలిన లైటర్ల మాదిరిగా ఇదేమీ తేలికపాటి లైటర్ కాదు. దీని బరువు దాదాపు అరకిలో ఉంటుంది. దీని తయారీకి 400 గ్రాముల మేలిమి బంగారం, 41 కేరట్ల బరువు గల 152 అరుదైన నీలాలను ఉపయోగించారు.ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ‘ఎస్.టి.డ్యూపాంట్’ ఈ సిగార్ లైటర్‌ను ‘లూయీ గీఐఐఐ ఫ్లర్ డి పార్మ్’ పేరుతో హాంకాంగ్ వ్యాపారవేత్త స్టీఫెన్ హంగ్ ఆర్డర్‌పై 2013లో ప్రత్యేకంగా తయారు చేసింది. దీని తయారీ కోసం ఎనబై మంది నిపుణులైన స్వర్ణకారులు ఆరునెలల పాటు అహర్నిశలు శ్రమించారు. దీని ధర 5 లక్షల డాలర్లు (సుమారు రూ.4.19 కోట్లు).అయితే, షోకేసులో అలంకరించుకోవడానికే తప్ప తేలికగా వాడుకోవడానికి అనువుగా లేకపోవడం దీని లోపం. అందుకే, ఇదే కంపెనీ వాడుకోవడానికి అనువుగా ఉండే పరిమాణంలో ఇదే నమూనాలో నీలాలు పొదిగిన బంగారంతో తయారు చేసిన చిన్న లైటర్లను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి 15,900 డాలర్లు (రూ.13.33 లక్షలు) -
అంత్యక్రియల కాలేజీ..! అవును మీరు విన్నది నిజమే..! అదీ..?
అంత్యక్రియలు నిర్వహించే అంశంపై కోర్సులు అందిస్తోంది ఈ విచిత్రమైన కాలేజీ. ఇది అమెరికాలోని అట్లాంటాలో ఉంది. అంత్యక్రియల సమయంలో పాటించవలసిన ఆచారాలు, అంత్యక్రియలు నిర్వహించే పద్ధతులు, అంత్యక్రియల్లో పాల్గొనేటప్పుడు పాటించవలసిన మర్యాదలు తదితర అంశాలను ఈ కోర్సుల్లో బోధిస్తోంది.‘గుప్టన్ జోన్స్ కాలేజ్ ఆఫ్ ఫ్యూనరల్ సర్వీస్’ వంటి కాలేజీ మరెక్కడా లేదు. ఇది క్యాంపస్ విద్యార్థుల కోసం అసోసియేట్ ఆఫ్ సైన్స్, అసోసియేట్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ కోర్సులను అందిస్తోంది. అసోసియేట్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ కోర్సును దూరవిద్యా విధానం ద్వారా కూడా అందిస్తోంది. శవయాత్రల కోసం వాహనాల సేవలు, ఇతర సేవలు అందించే వారికి ఉపయోగపడటమే కాకుండా, అంత్యక్రియల నిర్వహణకు సంబంధించిన వ్యాపారాలను స్వయంగా ఏర్పాటు చేసుకునే వారికి కూడా ఉపయోగపడేలా ఈ కోర్సులను తీర్చిదిద్దినట్లు ఈ యూనివర్సిటీ చెబుతోంది. -
అబ్బా.. తొక్కేం కాదు! నారింజ పుట్టగొడుగు!!
నేల మీద ఎవరో నారింజ తొక్కలను పడేసినట్లుగా ఉంది కదూ! నారింజ తొక్కలేమీ కాదు, ఇవి పుట్టగొడుగులు. నారింజ తొక్కల్లా కనిపించడం వల్ల ఈ పుట్టగొడుగులు ‘ఆరెంజ్ పీల్ ఫంగస్’గా పేరు పొందాయి. ఈ పుట్టగొడుగుల శాస్త్రీయ నామం ‘అల్యూరియా ఆరాంటియా’.చక్కని నారింజ రంగులో, అప్పుడే వలిచిన తజా నారింజ తొక్కల్లా కనిపించే ఈ అరుదైన పుట్టగొడుగులు ఉత్తర అమెరికాలోను, యూరోప్‌లోని కొన్ని ప్రాంతాల్లోను, చిలీ దక్షిణ ప్రాంతంలోను ఆగస్టు నుంచి నవంబర్ నెలల మధ్య కాలంలో కనిపిస్తాయి. ఈ పుట్టగొడుగులు కొద్దిపాటి తేమ ఉన్న మట్టి నేలల్లో పెరుగుతాయి. ఈ పుట్టగొడుగులు తినడానికి పనికి వస్తాయి.ఇవి చదవండి: దస్తూరి అయాచిత వరం! -
ఈ టమాటాలతో సరదా యుద్ధం.. ఎలా మొదలైందో తెలుసా?
దాదాపు ఎనిమిది దశాబ్దాల కిందట కొందరు మిత్రుల మధ్య సరదా వేడుకగా ప్రారంభమైంది. అనతి కాలంలోనే ఇది అతిపెద్ద ఆహార యుద్ధ వేడుకగా పేరు పొందింది. జనాలంతా వీథుల్లోకి చేరి, ఒకరిపై మరొకరు టమాటోలను విసురుకుంటూ, వీథుల్లో మడుగులు కట్టే టమాటో రసంలో మునిగి తేలుతూ సంబరాలు చేసుకునే ఈ వేడుక పేరు ‘లా టమాటినా’. స్పెయిన్‌లోని బునోల్ పట్టణంలో ఏటా ఆగస్టు నెలలో ఆఖరి బుధవారం రోజున ఈ వేడుక జరుగుతుంది. ‘లా టమాటినా’లో పాల్గొనే జనాలు టన్నుల కొద్ది టమాటోలను ఒకరిపై ఒకరు విసురుకోవడంతో, రోడ్లన్నీ టమాటో రసంతో నెత్తుటేర్లను తలపిస్తాయి.ఈ సందర్భంగా దాదాపు 1.50 లక్షల కిలోల టమాటోలను ఒకరిపైకి ఒకరు విసురుకుంటారు. ఈసారి ‘లా టమాటినా’ వేడుకను ఘనంగా నిర్వహించడానికి బునోల్ పట్టణ సంస్థ ఏర్పాట్లు చేసింది. బునోల్ పట్టణ జనాభా దాదాపు తొమ్మిదివేలు మాత్రమే! అయితే, ఏటా జరిగే ఈ టమాటోల సరదా యుద్ధం తిలకించడానికి విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఈ వేడుకలో భాగంగా సంగీత, నృత్య కార్యక్రమాలు, విందు వినోదాలు కూడా జరుగుతాయి. ఈ వేడుక చూడటానికి విదేశాల నుంచి విపరీతంగా జనాలు వచ్చిపడుతుండటంతో బునోల్ పట్టణంలో హోటళ్లు కిటకిటలాడిపోయేవి.స్థానికులకు మంచినీటి సరఫరాకు కూడా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ పరిస్థితిని నివారించడానికి 2013 నుంచి ఈ వేడుకను తిలకించడానికి వచ్చే సందర్శకుల సంఖ్య ఇరవైవేలకు మించరాదంటూ బునోల్ స్థానిక సంస్థ పరిమితి విధించింది. సందర్శకుల సంఖ్యను కట్టడి చేయడానికి అప్పటి నుంచి టికెట్లు కూడా ప్రవేశపెట్టారు. టికెట్లు పెట్టినా సరే సందర్శకులు ఏమాత్రం వెనుకాడకుండా ఈ వేడుకను చూడటానికి నెలల ముందుగానే బుకింగ్‌లు చేసుకుంటుండటం విశేషం. ‘లా టమాటినా’ స్ఫూర్తితో అమెరికాలోని కొలరడో–టెక్సస్ల మధ్య 1982 నుంచి ‘కొలరడో–టెక్సస్ టమాటో వార్’ వేడుక జరుపుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత కొలంబియా, చైనా తదితర దేశాల్లోనూ ఇలాంటి టమాటో యుద్ధాల నిర్వహణ మొదలు పెట్టారు. మన దేశంలో కర్ణాటకలోని బెంగళూరు, మైసూరు నగరాల్లోను, బిహార్ రాజధాని పట్నాలోను దాదాపు దశాబ్దంగా ఏటా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. -
ఈ టూ డెడ్లీ మమ్మీల మ్యూజియం గురించి ఎప్పుడైనా విన్నారా! ఇదొక..?
ఇది మమ్మీల మ్యూజియం. మెక్సికోలోని గ్వానాజ్వాటో పట్టణంలో ఉంది. పలు దేశాల్లో 1870 నుంచి 1958 కాలంలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ మమ్మీలను సేకరించి, జాగ్రత్తగా తీసుకొచ్చి ఈ మ్యూజియంలో భద్రపరచారు. ప్రపంచంలోని భీతిగొలిపే మ్యూజియంలలో ఒకటిగా ఈ మమ్మీల మ్యూజియం పేరుమోసింది. ‘ఎల మ్యూజో డి లాస్ మోమియాస్’ పేరుతో ఈ మమ్మీల మ్యూజియంను 1969లో ఇక్కడ నెలకొల్పారు.ఈ మ్యూజియం సేకరణలో మొత్తం 111 మమ్మీలు ఉన్నాయి. వాటిలో కొన్ని మరీ శిథిలంగా మారడంతో, ప్రస్తుతం వాటిలోని 59 మమ్మీలను మాత్రమే సందర్శకులకు ప్రదర్శిస్తున్నారు. గ్వానాజాటో మునిసిపాలిటీకి, మెక్సికో జాతీయ చరిత్ర పురాతత్త్వ పరిశోధన సంస్థకు మధ్య మమ్మీల నిర్వహణపై వివాదం నడుస్తుండటంతో ఇవి కొంత నిర్లక్ష్యానికి లోనయ్యాయి. స్థానిక సంస్థ నిర్లక్ష్యం వల్లనే మమ్మీలపై ఫంగస్ పెరిగి, అవి పాడైపోతున్నాయనేది జాతీయ చరిత్ర పురాతత్త్వ పరిశోధన సంస్థ ఆరోపణ. -
సాలీళ్లు బాబోయ్! సాలీళ్లు! ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి..
ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలిన బ్రిటిష్ రాజ్యాన్ని ఇప్పుడు సాలీళ్లు గడగడలాడిస్తున్నాయి. సాలీడు పేరు చెబితేనే బ్రిటిష్ ప్రజలు భయంతో వణుకుతున్నారు. సాలీళ్లలో ‘ఫెన్ రాఫ్ట్ స్పైడర్’ జాతికి చెందిన భారీ సాలీళ్లు ఇళ్లల్లోకి చొరబడి గూళ్లు ఏర్పాటు చేసుకుంటూ, జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. మామూలు సాలీళ్లలా ఇవి చిన్నగా ఉండవు. ఏకంగా అరచేతి పరిమాణంలో ఉంటాయి. బ్రిటన్‌లోని సఫోక్, ససెక్స్, నార్ఫోక్ ప్రాంతాల్లో ఈ భారీ సాలీళ్ల బెడద కొద్దిరోజులుగా ఎక్కువైంది. నీటి ఉపరితలంలోను, నేల మీద కూడా జీవించగలిగే ఫెన్ రాఫ్ట్ స్పైడర్ సాలీళ్లలో అరుదైన జాతి. జలాశయాల పర్యావరణాన్ని ఇవి కాపాడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సాలీళ్లు కీటకాలతో పాటు చిన్న చిన్న చేపలను కూడా తింటాయి. ఇదివరకు ఇవి జలాశయాల పరిసరాల్లోనే కనిపించేవి. ఇప్పుడివి ఇళ్లల్లోకి కూడా చొరబడటమే బెడదగా మారింది.నల్లులతో నానా యాతన..!అగ్రరాజ్యం అమెరికాను నల్లులు హడలెత్తిస్తున్నాయి. అమెరికాలోని దాదాపు ఇరవై రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో నల్లుల బెడద విపరీతంగా పెరిగింది. చాలా చోట్ల ఇళ్లు, హోటళ్లు తదితర ప్రదేశాల్లోని మంచాలు, కుర్చీలు, సోఫాల్లోకి చేరిన నల్లులు జనాలను కుట్టి చంపుతున్నాయి.అమెరికాలో ఎక్కువగా ‘ఆసియన్ లాంగ్హార్న్డ్ టిక్’ జాతికి చెందిన నల్లులు కొద్దికాలంగా విజృంభిస్తున్నాయి. అమెరికాలో ఈ జాతి నల్లులను తొలిసారిగా 2017 సంవత్సరంలో ఓక్లహామాలో గుర్తించారు. వీటి నిర్మూలనకు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఇవి అన్నింటినీ తట్టుకుంటూ ఇప్పుడు ఇరవై రాష్ట్రాలకు విస్తరించాయి. ఈ నల్లులు వ్యాప్తి చేసే లైమ్ వ్యాధి ఇప్పటికే పలువురి ప్రాణాలను బలిగొంది. ఈ నల్లులు లైమ్ వ్యాధికి కారణమయ్యే పరాన్నజీవులను వ్యాప్తి చేస్తాయని అమెరికా పర్యావరణ పరిరక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నల్లి కాటుకు గురైన వారిలో లైమ్ వ్యాధికి గురై, దాదాపు 15 శాతం మంది మృతిచెందినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. -
ఈ విషయం తెలుసా! ఏ గుడ్డయినా... వెరీగుడ్డే!
ఫారం కోడిగుడ్ల కంటే నాటు కోడిగుడ్లలో బలం ఎక్కువగా ఉంటుందని కొందరిలో ఓ అపోహ ఉంటుంది. కానీ పోషక విలువల విషయంలో నాటు గుడ్లయినా, ఫారం గుడ్లయినా ఒకటే. రెండింటిలోనూ పోషకాలు ఒకేలా ఉంటాయి. కాకపోతే నాటు గుడ్లు ఫారం గుడ్ల కంటే కాస్తంత చిన్నగా ఉంటాయి, మరికాస్త ఎక్కువ ముదురురంగుతో కాస్త గోధుమరంగు అనిపించేలా ఉంటాయి. అంతేతప్ప పోషకాలతో పాటు మరింకే విషయంలోనూ తేడా ఉండదు. కాబట్టి అధిక ధర పెట్టి నాటు కోడిగుడ్లు కొనడమన్నది జేబుకు నష్టం తప్ప... ఒంటికి చేకూరేలా మరే లాభమూ ఉండదు.ఇవి చదవండి: కాటేసిన కార్ఖానా -
లోటస్ స్టేటస్! ఈ వైపు ఓ లుక్ వేయండి..
ఎక్కువ హంగామా లేకుండా ఇంటికి కళ తెచ్చేది పూల అలంకరణే! అలాగని రోజూ తాజా పువ్వులకు తూగలేం కదా! అందుకే ఈ లోటస్ ఫ్రేమ్ వైపు ఓ లుక్ వేయండి.. దాంతో ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవచ్చు. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించవచ్చు!తామర పువ్వుల గుచ్ఛంతో ఉన్న ఫ్రేమ్స్, లోటస్ పెయింటింగ్‌ని లివింగ్ రూమ్ లేదా డైనింగ్ రూమ్‌లలో అలంకరించవచ్చు. వీటివల్ల ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా అనిపిస్తుంది.సూర్యోదయం వెలుగులో అప్పుడే విచ్చుకుంటున్న తామర పువ్వుల అందం ఇంటి వాతావరణాన్ని వైబ్రెంట్‌గా మారుస్తుంది. గోవుతో కలసి ఉన్న తామర పువ్వుల వాల్ పేపర్స్‌ను పూజ గది, పార్టిషన్స్కు ఉపయోగించవచ్చు.హంగు, ఆర్భాటాలు అక్కర్లేదనుకునేవారు లోటస్ క్యాండిల్ ఏర్పాటుతో ఇంటి శోభను పెంచుకోవచ్చు.లోటస్ థీమ్‌తో ఉన్న కుషన్ కవర్స్‌ను ఎంచుకుంటే గదికి అలంకరణ.. మనసుకు ఆహ్లాదం చేకూరుతాయి.వందల రూపాయల నుంచి లభించే రకరకాల లోటస్ డిజైన్స్‌ను మీ అభిరుచికి తగ్గట్టు ఎంచుకుని, ఇలా డెకరేషన్లో భాగం చేసి ఇంటి స్టేటస్‌నే మార్చేసుకోవచ్చు! -
దయ్యాల పండుగ..! ఒక రకంగా ఇది..?
దయ్యాల పండుగ (ఘోస్ట్ ఫెస్టివల్), ఆకలి దయ్యాల పండుగ (హంగ్రీ ఘోస్ట్ ఫెస్టివల్) అని ఈ పండుగకు పేరు వచ్చినా, ఒకరకంగా ఇది పెద్దల పండుగ. ఆసియా దేశాల్లోని బౌద్ధ మతస్థులు, తావో మతస్థులు ఈ పండుగను తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకొంటారు. బౌద్ధులు దీనిని ‘యులాన్పెన్’ పండుగ అని, తావో మతస్థులు ‘ఝోంగ్యువాన్’ పండుగ అని పిలుచుకుంటారు. చైనా కేలండర్ ప్రకారం ఏడో నెలలోని పదిహేనో రోజు వచ్చే ఈ పండుగను తైవాన్‌లో ‘పుడు’ అని, ‘పున్యాన్’ అని పిలుస్తారు. నిజానికి చైనా కేలండర్లోని ఏడో నెల అంతటినీ పెద్దల మాసంగా ‘ఘోస్ట్ మంత్’గా పాటిస్తారు.ఈ నెల అంతా మరణించిన పెద్దల ఆత్మసంతృప్తి కోసం రకరకాల ఆచారాలను పాటిస్తారు. పండుగ రోజున పెద్దల సమాధుల వద్ద అగరొత్తులు వెలిగిస్తారు. అలాగే, ‘జోస్ పేపర్’ అనే సుగంధభరితమైన కాగితాలను, దుస్తులు, మొక్కల పీచు వంటివి నింపి కాగితాలతో తయారు చేసిన ‘పాపీర్ మేష్’ అనే భారీ బొమ్మలను దహనం చేస్తారు. టాంగ్ వంశస్థుల పాలనాకాలంలో ఈ పండుగ జరుపుకోవడం మొదలైనట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బౌద్ధులు, తావో మతస్థులతో పాటు చైనాలోని వివిధ గిరిజన తెగలకు చెందిన వారు కూడా ఈ పండుగను తమ తమ పద్ధతుల్లో జరుపుకొంటారు.ఈ పండుగ రోజున తమ తమ కుటుంబాల్లో మరణించిన పెద్దలకు నచ్చిన ఆహార పదార్థాలను, పానీయాలను వారికి నైవేద్యంగా పెడతారు. బంధు మిత్రులతో కలసి విందు భోజనాలను ఆరగిస్తారు. నరకంలో చిక్కుకుపోయిన పెద్దల ఆత్మలు ఆకలితో బాధపడుతుంటాయనే భావనతో వారికి ఆకలి తీరేలా భారీగా నైవేద్యాలు పెడతారు. తావో మతస్థులు ఈ పండుగ రోజున నరకంలో బాధలు పడే తమ పూర్వీకుల పాపాలు నశించాలనే ఉద్దేశంతో ‘జోస్ పేపర్’తో తయారు చేసిన నరక లోకపు డబ్బును (హెల్ బ్యాంక్ నోట్స్) తగులబెడతారు.అలాగే, పెద్దల పాప విమోచనం కోసం ఈ పండుగ రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సంప్రదాయ వేషధారణలు ధరించి, సంగీత నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కొన్నిచోట్ల రంగస్థల వేదికలపై పరలోక పరిస్థితులను కళ్లకు కట్టే నాటకాలను ప్రదర్శిస్తారు. బౌద్ధులు, తావో మతస్థులు ఎక్కువగా ఉండే లావోస్, తైవాన్, వియత్నాం, కంబోడియా, మలేసియా, ఇండోనేసియా, నేపాల్, శ్రీలంక దేశాల్లోనూ ఈ పండుగను జరుపుకొంటారు. -
నిక్ స్కుబిష్..! అనుకోని దుర్ఘటనలో ఆ తల్లి?
అనుకోని దుర్ఘటనలో ఆ తల్లి మరణించింది. తన వెంటే ఉన్న మూడేళ్ల కొడుకు కొనప్రాణాలతో మిగిలాడు. మరణించిన తర్వాత కూడా ఆ తల్లి–కొడుకును కాపాడుకోవడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయత్నం ఫలించి, ఆ కొడుకు ప్రాణాలు నిలిచాయి. పెరిగి పెద్దవాడైన కొడుకు మనసులో ఆ జ్ఞాపకాలు నిలిచే ఉన్నాయి.1994 జూన్ 11 రాత్రి, సమయం పదకొండు దాటింది. కాలిఫోర్నియాలోని సియెర్రా నెవాడా పర్వతశిఖరాల పక్కనే ఉన్న ‘హైవే నంబర్ 50’ వైపు ఓ కారు వేగంగా దూసుకుపోతోంది. ఆ కారుని డెబోరా హోయ్ట్ అనే 35 ఏళ్ల మహిళ నడుపుతోంది. బాగా చీకటిపడటంతో ఆమెకు నిద్ర రాకుండా ఉండటానికి పాటల కచేరీ మొదలుపెట్టాడు పక్క సీట్లో కూర్చున్న ఆమె భర్త డేవిడ్. దాంతో డెబోరా కూడా డేవిడ్‌తో కలసి గొంతు కలిపింది. ఆ నిర్మానుష్యమైన రోడ్డుపై భీకరమైన చలిలో పొగమంచును చీల్చుకుంటూ స్ట్రీట్ లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి.ఉన్నట్టుండి డెబోరా చూపు రోడ్డు తిన్నగా కాకుండా రోడ్డు పక్కకు మళ్లింది. ఒంటి మీద నూలుపోగు లేని ఒక అందమైన అమ్మాయి వెనక్కి తిరిగి, వయ్యారంగా నేలపై పడుకుని ఉంది. ఆమె అచ్చం పాలరాతి బొమ్మలా ఉంది. రెండు చేతులూ పైకి పెట్టుకుని, మోకాళ్లు కాస్త ముడుచుకుని హొయలు పోతున్నట్లే కనిపిస్తోంది. అయితే అది బొమ్మా? మనిషా? ప్రాణం ఉందా? లేదా? అర్థం కాలేదు డెబోరాకు. వెంటనే భర్తకు ఆ దృశ్యాన్ని చూపిస్తూ కారు స్లో చేసింది. అది చూసిన డేవిడ్ ‘హేయ్ ఆపొద్దు! పోనీ పోనీ!’ అని అరిచేశాడు కంగారుగా. దాంతో డెబోరా కారు గేర్ మార్చింది. అతడి భయమేంటంటే, అలా అందమైన అమ్మాయిలను రోడ్లపై పడుకోబెట్టి, దొంగలు కాపుగాసి ఉండవచ్చు. లేదా ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుండవచ్చు.‘అర్ధరాత్రి అలా ఎక్కడపడితే అక్కడ కారు ఆపడం ప్రమాదమని నీకు తెలియదా?’ అని తిట్టాడు డేవిడ్. అది నిజమే అనిపించింది డెబోరాకి. దాంతో పోలిస్ స్టేష¯Œ కి వెళ్లి రిచ్ స్ట్రాసర్ అనే డిప్యూటీ అధికారికి విషయం చెప్పారు. ‘పదండి ఎక్కడో చూపించండి’ అన్నాడు స్ట్రాసర్. దాంతో డెబోరా కారు యూటర్న్ తీసుకుంది. తీరా ఆ అమ్మాయి కనిపించిన చోట రెండు లగ్జరీ కార్లు పార్క్ చేసి ఉన్నాయి. నిజానికి ‘ఆ అమ్మాయి కనిపించింది సరిగ్గా ఇక్కడే’ అని ఆ దంపతులిద్దరూ గుర్తించలేకపోయారు. సరైన ల్యాండ్ మార్క్ లేకపోవడంతో పాటు కంగారుగా అక్కడి నుంచి వచ్చేయడంతో ఇద్దరూ గందరగోళం చెందారు. అయితే ఆ చోటికి వెళ్లగానే, రిచ్ స్ట్రాసర్ మదిలో ఓ తల్లికొడుకుల మిస్సింగ్ కేసు మెదిలింది.సరిగ్గా ఐదు రోజుల కిందట క్రిస్టీన్ స్కుబిష్ అనే 23 ఏళ్ల అమ్మాయి తన మూడేళ్ల కొడుకు నిక్‌తో కలసి కారులో ఇదే దారి గుండా వెళ్లిందట! ఆ తర్వాత వాళ్లు ఇంటికి రాలేదు. ఆ మిస్సింగ్ కేస్ మా దగ్గరకొచ్చింది. మీరు ఒకసారి రేపు ఉదయాన్నే రండి. పగటిపూటైతే మనకు ఏరియా మొత్తం కనిపిస్తుంది కదా’ అన్నాడు డెబోరాతో స్ట్రాసర్.మరునాడు ఉదయాన్నే స్ట్రాసర్ను కలసిన డెబోరా రాత్రి తమ ప్రయాణాన్ని, నగ్నంగా కనిపించిన అమ్మాయి దృశ్యాన్నీ ఇలా ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా గుర్తు చేసుకుని, ‘బులియన్ బెండ్‘ అనే ప్రమాదకరమైన చోటును చూపిస్తూ ‘ఇక్కడే సార్! రాత్రి నేను చూసింది ఇక్కడే!’ అంది బలంగా. అక్కడే లోయవైపు కారు టైర్ల గుర్తులు ఆనవాళ్లుగా కనిపించాయి స్ట్రాసర్కి. కొద్ది దూరంలో ఒక చిన్న çషూ రక్తం మరకలతో కనిపించింది. వెంటనే వెతుకులాట మొదలుపెట్టించాడు. అదే లోయలో కాసేపటికి క్రిస్టీన్ కారు కనిపించింది. ఆ పక్కనే ఆమె మృతదేహం కనిపించింది. కాస్త దూరంలో బాబు పడి ఉన్నాడు. పల్స్ కొట్టుకోవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.నిజానికి జూన్ 6 తర్వాత రోడ్డు మీదకు కొండచరియలు విగిరిపడటంతో సుమారు రెండు రోజుల పాటు అటుగా రాకపోకలు కూడా ఆగిపోయాయి. అంటే జూన్ 6న నిక్, క్రిస్టీన్ వెళ్తున్న కారు మీద అవి పడి, ఆ ధాటికి కారు లోయలో పడిపోయి ఉంటుందని అంతా అంచనా వేశారు. అయితే యాక్సిడెంట్ అయిన వెంటనే క్రిస్టీన్ చనిపోయిందని పోస్ట్ మార్టమ్‌లో తేలింది. మరి చిన్న బాబు పగలు భీకరమైన వేడిని, రాత్రి వణికించే చలిని తట్టుకుని, సుమారు ఆరు రోజులు ఎలా ప్రాణాలతో ఉన్నాడో ఎవరికీ అర్థం కాలేదు. నిజానికి డెబోరా కన్ను ఆ నగ్నంగా కనిపించే అమ్మాయి మీద పడకుండా ఉండి ఉంటే, నిక్ ఎవరికీ కనిపించేవాడే కాదు.ప్రమాదంలో క్రిస్టీన్ చనిపోయాక ఆత్మగా మారి, లోయలో పడిన తన బిడ్డను బతికించు కోవడానికే దారిన పోయేవారికి నగ్నంగా కనిపించి ఉంటుందని డెబోరా నమ్మింది. ఆ వార్త బయటికి రాగానే, అటుగా వెళ్లిన చాలామంది ప్రయాణికులు పోలీసులను కలిశారు. జూన్ 8 , 11 మధ్యలో తమకి కూడా ఆ నగ్నంగా ఉన్న అమ్మాయి కనిపించిందని, భయపడి ఆగలేదని చెప్పారు. ఇక బాబు స్పృహలోకి వచ్చిన తర్వాత, తన చుట్టూ కమ్మిన ఓ ప్రకాశవంతమైన కాంతి గురించి అస్పష్టంగా చెప్పడం మొదలుపెట్టాడు. దాంతో క్రిస్టీన్ తన బిడ్డను తానే ఆత్మ రూపంలో కాపాడుకుందని నమ్మారు. బాబు పెద్దవాడయ్యాక, ఆ రాత్రులను తలచుకుని చాలా ఇంటర్వ్యూలిచ్చాడు. ‘ఆ రోజు నాకు బాగా గుర్తు, చాలా ఎత్తు నుంచి కారు పల్టీలు కొట్టింది. నాకు తీవ్రంగా దెబ్బలు తగిలాయి. కానీ ప్రతి క్షణం మా అమ్మ నాతోనే ఉన్నట్లు అనిపించింది, నాకసలు భయమేయలేదు’ అని ఇప్పటికీ చెబుతుంటాడు నిక్.అంత చిన్న బాబు అన్ని దెబ్బలతో, అలాంటి వాతావరణంలో, అడవిలాంటి ప్రాంతంలో అన్ని రోజులు బతకడం కష్టమని డాక్టర్లు సైతం తేల్చేశారు. ఇదిలా ఉంటే, క్రిస్టీన్ తల్లికి ఈ ప్రమాదం జరగడానికి కొన్ని నెలల ముందు నుంచి వరుసగా పీడకలలు వచ్చేవట! ఆ కలల్లో పెద్ద లోయ, కారు పల్టీలు కొట్టడం, మైలు రాయి 16 ఎక్కువగా కనిపించేవట. అయితే యాక్సిడెంట్ అయిన చోట 16 నంబర్ మైలు రాయి నిజంగానే ఉంది. దాంతో మనసులను మెలిపెట్టే ఈ కథలోని ప్రతి సన్నివేశం మిస్టరీనేగా మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
ఈ విషయం తెలుసా? ఈ సాలీడు కుడితే.. ఇక అంతే!
ప్రపంచంలోని సాలెపురుగుల్లోకెల్లా ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఏదో బూజు గూడు అల్లుకునే మామూలు సాలెపురుగే అనుకుంటే పొరపాటే! ఇది కుట్టిందంటే, ఇక అంతే సంగతులు! ‘సిడ్నీ ఫన్నెల్ వెబ్ స్పైడర్’ అనే ఈ సాలెపురుగు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి వంద కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలోని అడవుల్లో కనిపిస్తుంది. ఒక్కోసారి ఈ సాలెపురుగులు ఇళ్లల్లోకి కూడా చేరుతుంటాయి.ఈ సాలెపురుగు కుట్టినప్పుడు శరీరంలోకి చేరే విష పదార్థాలు నిమిషాల్లోనే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. తక్షణ చికిత్స అందించకుంటే, అరగంటలోనే ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తుతుంది. ఈ సాలెపురుగు కాటు వల్ల మనుషులకు ప్రాణాపాయం ఉంటుంది గాని, కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇదొక అరుదైన విశేషం.ఒళ్లంతా ముళ్లున్న స్టార్ఫిష్..సముద్రంలో స్టార్‌ఫిష్‌లు అరుదుగా కనిపిస్తాయి. స్టార్ఫిష్లలో మరీ అరుదైనది ఈ ముళ్ల స్టార్ఫిష్. ఇది సముద్రం లోలోతుల్లో ఉంటుంది. ఒళ్లంతా ముళ్లు ఉండటం వల్ల దీనిని ‘క్రౌన్ ఆఫ్ థాన్స్ స్టార్ఫిష్’ అని అంటారు.ఈ ముళ్ల స్టార్‌ఫిష్‌లు రకరకాల రంగుల్లో ఉంటాయి. ఎక్కువగా నలుపు, ముదురు నీలం, ఊదా, ఎరుపు, గోధుమ రంగు, బూడిద రంగుల్లో ఉంటాయి. ఇవి ఎక్కువగా పగడపు దిబ్బలను ఆశ్రయించుకుని బతుకుతాయి. పర్యావరణ మార్పుల వల్ల పగడపు దిబ్బలు రంగు వెలిసిపోతుండటం, పగడపు దిబ్బల విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతుండటంతో ఈ ముళ్ల స్టార్ఫిష్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పగడపు దిబ్బలను కాపాడుకునేందుకు తగిన చర్యలు చేపట్టకుంటే, ఈ ముళ్ల స్టార్ఫిష్ జాతి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది.అత్యంత పురాతన గుహాచిత్రాలు..ప్రపంచంలో పురాతన మానవులు సంచరించిన ప్రదేశాల్లో పలుచోట్ల ఆనాటి మానవులు చిత్రించిన గుహాచిత్రాలు బయటపడ్డాయి. సహస్రాబ్దాల నాటి గుహాచిత్రాలు పురాతన మానవుల ఆదిమ కళా నైపుణ్యానికి అద్దంపడతాయి. ఇటీవల ఇండోనేసియాలోని సూలవేసీ దీవిలో అత్యంత పురాతన గుహాచిత్రాలు బయటపడ్డాయి. ఈ దీవిలోని మారోస్ పాంగ్కెప్ ప్రాంతానికి చెందిన లీంగ్ కరాంపాంగ్ సున్నపురాతి గుహల్లో ఈ పురాతన చిత్రాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.వీటిలో ఎర్రరంగుతో చిత్రించిన మూడడుగుల పంది బొమ్మ, చిన్న పరిమాణంలో నిలబడి ఉన్న భంగిమలో మూడు వేటగాళ్ల బొమ్మలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన పురాతత్త్వ శాస్త్రవేత్తలు ఈ గుహాచిత్రాలపై క్షుణ్ణంగా పరిశోధనలు జరిపారు. గుహ లోపలి భాగంలో ఒకే రాతిపై వరుసగా చిత్రించిన ఈ బొమ్మలను కార్బన్ డేటింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరీక్షించి, ఇవి కనీసం 51,200 ఏళ్ల కిందటివని అంచనాకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దొరికిన గుహా చిత్రాలలో ఇవే అత్యంత పురాతనమైన గుహా చిత్రాలని గ్రిఫిత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాక్సిమ్ ఆబర్ట్ వెల్లడించారు. -
ఈ భవంతి.. వందేళ్ల గంధర్వ మహల్! ఇక్కడ?
ఈ భవంతి.. జైపూర్ హవా మహల్‌ని గుర్తుకు తెస్తోంది కదూ! ఇది గంధర్వ మహల్.. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంటలో ఉంది! ప్రస్తుతం ఇందులో నివసిస్తున్న మూడోతరం.. ఇటీవలే దీని వందేళ్ల వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ మహల్‌ని చూపించడానికి సందర్భం అదే!ఆచంటకు చెందిన జమీందార్ గొడవర్తి నాగేశ్వరరావు చిన్నతనం నుంచీ కోటలు చూస్తూ పెరగడంతో సొంతూళ్లో అటువంటి కట్టడాన్ని నిర్మించాలని భావించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అక్కడి కోటలను క్షుణ్ణంగా పరిశీలించి, 1918లో.. ఈ గంధర్వ మహల్‌కు శంకుస్థాపన చేశారు. ఆరేళ్లపాటు కొనసాగిన దీని నిర్మాణం 1924 నాటికి పూర్తయింది. సుమారు ఎకరం విస్తీర్ణంలో కొలువై ఉన్న ఈ మహల్ కోసం అప్పట్లోనే సుమారు పది లక్షల రూపాయల వరకు వెచ్చించినట్టు జమీందారు కుటుంబ సభ్యులు చెప్పారు.ప్రత్యేకతలెన్నో.. మహల్ కోసం బర్మా నుంచి టేకు, బెల్జియం నుంచి అద్దాలు, లండన్ నుంచి ఇనుప గడ్డర్లను తెప్పించారు. రవాణా సదుపాయం అంతగాలేని ఆ రోజుల్లో జలరవాణా ద్వారా వాటిని తీసుకువచ్చారు. ఈ కట్టడానికి ఇనుప ఊచల ఊసు లేకుండా డంగు సున్నాన్నే వాడారు. ఈ మహల్లోకి అడుగుపెడితే మైసూర్ మహారాజా ప్యాలస్, గోల్కొండ కోటను చూసిన అనుభూతి కలుగుతుంది. 1885, లండన్ ఎగ్జిబిషన్లో రజత పతకం గెలిచిన పియానో ఈ మహల్లో ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటికీ ఆ పియానో స్వరాలను పలికిస్తుంది. విశాలమైన హాల్లో బెల్జియం నుంచి తెప్పించిన నిలువెత్తు అద్దాలు చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. విద్యుత్ సౌకర్యం లేని ఆ రోజుల్లోనే విదేశాల నుంచి తెప్పించిన రంగురంగుల విద్యుత్ దీపాలను జనరేటర్ సాయంతో వెలిగించేవారని, ఆ వెలుగుల్లో మహల్‌ను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారని స్థానికులు చెబుతారు. ఈ మహల్ కట్టిన పదేళ్లకు గానీ ఆచంటకు విద్యుత్‌సదుపాయం రాలేదట.ముఖ్యమంత్రులు బసచేశారు..ఈ గంధర్వ మహల్ ఎందరో ప్రముఖులకు విడిదిగా విరాజిల్లింది. మాజీ ముఖ్యమంత్రులు మర్రిచెన్నారెడ్డి, ఎన్టీ రామారావుతో పాటు ఎంతో మంది మాజీ మంత్రులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ భవంతిలోనే బసచేసేవారు. ఈ మేడలో మొత్తం నాలుగు అంతస్తులు, 12 గదులున్నాయి. గొడవర్తి నాగేశ్వరరావు అనంతరం మూడు తరాలకు ఇది నివాసంగా ఉంది. నాలుగోతరం వారిలో కొందరు విదేశాల్లో స్థిరపడ్డారని జమీందారు కుటుంబ సభ్యుల్లో ఒకరైన గొడవర్తి వెంకటేశ్వరస్వామి తెలిపారు. ఈ భవంతి కట్టాక రెండు పర్యాయాలు రంగులు వేయగా, వందేళ్లు పూర్తయిన సందర్భంగా రూ. 40 లక్షల వ్యయంతో మరమ్మతులు చేయించి రంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. శతదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మరో 30 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా మరమ్మతులు చేయించామని వెంకటేశ్వరస్వామి చెప్పారు. గంధర్వ మహల్లో సినిమా షూటింగ్‌లకు అవకాశం ఇవ్వాలని ఎంతోమంది సినీరంగ ప్రముఖులు కోరినప్పటికీ జమీందారు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. తమ తాతగారి వారసత్వ సంపదగా వస్తున్న ఈ మహల్‌ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. – విజయ్‌కుమార్ పెనుపోతుల, సాక్షి, భీమవరం -
పూల కోసమే ప్రత్యేకమైన పండుగ! ఇది ఒకరోజు పండుగ కాదు.. ఏకంగా..
పూలతోటలు పెంచడం, దైవారాధనలోను, గృహాలంకరణలోను పూలను ఉపయోగించడం దాదాపు ప్రతి దేశంలో ఉన్న వ్యవహారమే! మన దేశంలోనైతే మహిళలు పూలను సిగలో కూడా ధరిస్తారు. ప్రాచీన సంస్కృతుల ప్రభావం గల కొన్ని ఇతర దేశాల్లోనూ మహిళలు పూలను తమ అలంకరణలో భాగంగా ఉపయోగిస్తుంటారు. మన దేశంలో పండుగల్లో పూలను విరివిగా వినియోగిస్తారు గాని, పూల కోసం ప్రత్యేకమైన పండుగ ఏదీ లేదు.అయితే, కొలంబియాలో మాత్రం పూల కోసమే ప్రత్యేకమైన పండుగ ఉంది. ఇది ఒకరోజు పండుగ కాదు, ఏకంగా పదిరోజులు జరుపుకొనే భారీ వేడుక. ఏటా ఆగస్టు 2 నుంచి 11 వరకు ఈ పండుగ జరిగినన్ని రోజులూ కొలంబియాలో ఊరూ వాడా ఎటు చూసినా రంగు రంగుల పూల సోయగాలు కనువిందు చేస్తాయి. చిత్రవిచిత్రమైన పుష్పాలంకరణలు చూపరులను కట్టిపడేస్తాయి.కొలంబియా వాసులు ఈ పండుగను ‘ఫెరియా డి లాస్ ఫ్లోరెస్’ అని పిలుచుకుంటారు. కొలంబియాలో అత్యంత ప్రాధాన్యమున్న సాంస్కృతిక వేడుకల్లో ఈ పూల పండుగ ఒకటి. వర్ణ మహోత్సవంలా సాగే ఈ పూల పండుగను తిలకించడానికి పెద్దసంఖ్యలో విదేశీ పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు. ఈ పండుగలో భాగంగా జరిగే ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కొలంబియా రాజధాని బొగోటాలోని చరిత్రాత్మక కట్టడం ‘ఎల్ ఒబెలిస్కో’ వద్ద పూలబుట్టలతో, పూలతో అలంకరించిన వాహనాలతో జనాలు పెద్దసంఖ్యలో చేరుకుని, అక్కడ సంగీత కార్యక్రమం నిర్వహించడంతో ఈ పూల పండుగ సంబరాలు మొదలవుతాయి.ఈ సందర్భంగా వీథుల్లో పూలతో భారీ పరిమాణంలో నిర్మించిన జంతువులు, పక్షుల విగ్రహాలు సందర్శకులకు స్వాగతం పలుకుతాయి. వివిధ సాంస్కృతిక కేంద్రాల్లోను, ప్రధాన కూడళ్లలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వేదికలపైన సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు జరుగుతాయి. ముగింపు రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పూల రైతులు తమ తమ తోటల్లో పూసిన పూలను బుట్టల్లో నింపుకుని, వాటిని వీపున కట్టుకుని ‘సిలెటరోస్ పరేడ్’ ఊరేగింపును నిర్వహిస్తారు. -
నల్లగబ్బిలం పువ్వును ఎప్పుడైనా చూశారా!
అరుదైన ఈ పువ్వు నల్లగా గబ్బిలంలా కనిపిస్తుంది. ఈ పూలు పూసే మొక్కలను దూరం నుంచి చూస్తే, మొక్కల మీద గబ్బిలాలు వాలి ఉన్నాయేమోననిపిస్తుంది. గబ్బిలం వంటి ఆకారం వల్లనే ఈ పువ్వుకు ‘బ్లాక్ బ్యాట్ ఫ్లవర్’ అనే పేరు వచ్చింది. కంద జాతికి చెందిన ఒక మొక్కకు ఈ పూలు పూస్తాయి. ఫ్రెంచ్ వర్తకుడు, కళాసేకర్త ఎడ్వర్డ్ ఆండ్రూ తొలిసారిగా ఈ పూల గురించి 1901లో రాసిన తన పుస్తకంలో వర్ణించాడు.ఈ పూల మొక్కలు బంగ్లాదేశ్, కంబోడియా, దక్షిణ చైనా, లావోస్, మలేసియా, మయాన్మార్, థాయ్‌లండ్ అడవుల్లో కనిపిస్తాయి. ఈ పూల కేసరాలు పిల్లి మీసాల్లా ఉంటాయి. రేకులు గబ్బిలం రెక్కల్లా ఉంటాయి. పన్నెండు అంగుళాల వెడల్పు, పది అంగుళాల పొడవుతో గబ్బిలం ఆకారంలో కొంత భయం గొలిపేలా ఉండటంతో ఈ పువ్వులను దక్షిణాసియా స్థానిక భాషల్లో ‘దెయ్యం పువ్వులు’ అని కూడా పిలుస్తారు. చైనీస్ సంప్రదాయ వైద్యంలో ఈ పువ్వులను కొన్ని ప్రత్యేక ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు.అతి పురాతన రైల్వేస్టేషన్..ఇది ప్రపంచంలోనే అతి పురాతన రైల్వేస్టేషన్. ఇక్కడి నుంచే తొలి పాసింజర్ రైలుబండి నడిచింది. ఇంగ్లండ్‌లో ఉన్న ఈ రైల్వేస్టేషన్ పురాతన భవంతిని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో లివర్‌పూల్ రోడ్ స్టేషన్‌ను 1830లో నిర్మించారు. లివర్‌పూల్ రోడ్ నుంచి మాంచెస్టర్ వరకు తొలి పాసింజర్ రైలు నడిచేది. లివర్‌పూల్ అండ్ మాంచెస్టర్ రైల్వే కంపెనీ తరఫున ఈ రైల్వేస్టేషన్‌ను జార్జ్ స్టీఫెన్సన్ అనే ఇంజినీరు నిర్మించాడు.ప్రస్తుతం మ్యూజియంగా మార్చిన ఈ పురాతన రైల్వేస్టేషన్ భవంతిలో రైల్వే మ్యూజియంతో పాటు సైన్స్ ప్లస్ ఇండస్ట్రీ మ్యూజియం, పిల్లల ఆట స్థలం వంటివి కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే తొలి పారిశ్రామిక నగరంలో మాంచెస్టర్ గత వైభవాన్ని తెలిపే వస్తువులను ఇక్కడ కొలువు దీర్చారు. పారిశ్రామిక విప్లవం నాటి పురాతన యంత్రపరికరాలను ఇందులో భద్రపరచారు. రైల్వే మ్యూజియంలో బొగ్గుతో నడిచే తొలినాటి ఆవిరి ఇంజిన్లను, ఆనాటి రైలు బోగీలను, వివిధ కాలాల్లో వచ్చిన మార్పులను ప్రతిబింబించే రైలు ఇంజిన్లను, బోగీలను భద్రపరచారు. ఈ మ్యూజియంను చూడటానికి పద్నాలుగేళ్ల లోపు పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నారు.అతిచిన్న లకుముకి పిట్ట..ఇది ప్రపంచంలోనే అతిచిన్న లకుముకి పిట్ట. అత్యంత అరుదైన పక్షుల్లో ఇది కూడా ఒకటి. పొడవాటి ఎర్రని ముక్కుతో రంగురంగుల శరీరంతో ఉండే ఈ పక్షి, చూడటానికి పిచుక పరిమాణంలో ఉంటుంది. ఫిలిప్పీన్స్ అడవుల్లో ఈ జాతి పక్షులు కనిపించేవి. ఫ్రెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త బెర్నార్డ్ జర్మెయిన్ డి లేస్పెడె 1799లో వీటిని తొలిసారిగా చూసినప్పుడు, ఇవి చిన్నసైజు కింగ్‌ఫిషర్ పక్షుల్లా కనిపించడంతో వీటికి ‘ఫిలిప్పీన్ డ్వార్ఫ్ కింగ్‌ఫిషర్’ అని పేరుపెట్టాడు.ఈ పక్షులు క్రమంగా తగ్గిపోయి, కనిపించడం మానేశాయి. ఈ పక్షులను స్థానికులు చివరిసారిగా 130 ఏళ్ల కిందట చూశారు. ఆ తర్వాత ఈ పక్షులు ఎవరికీ కనిపించకపోవడంతో ఇవి అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు కూడా భావించారు. ఫిలిప్పీన్స్ విహంగ శాస్త్రవేత్త మీగెల్ డేవిడ్ డి లియాన్ ఇటీవల దక్షిణ ఫిలిప్పీన్స్ అడవుల్లో ఈ పక్షులను గుర్తించి ఫొటోలు తీశాడు. -
ఎన్నెన్నో వర్ణాలున్నా కానీ.. నలుపు, తెలుపు రంగులకున్నంత క్రేజ్..
ఎన్నెన్నో వర్ణాలు.. కానీ నలుపు, తెలుపు రంగులకున్నంత క్రేజ్ ఇంకే కలర్‌కూ ఉండదు! ఆ రెండిటినీ కలిపితే కనిపించే రిచ్‌నెస్‌ని చూస్తూండిపోవలసిందే! అదో క్లాసిక్ కాంబినేషన్! దాన్ని ఇంటికీ అద్దితే.. ఆ అభిరుచిని మెచ్చుకోని అతిథి ఉండరు! ఓనర్స్ ప్రైడ్.. నెయిబర్స్ ఎన్వీగా ఫీలయ్యేలా బ్లాక్ అండ్ వైట్‌ని ఇంటి అలంకరణలో మిళితం చేయాలంటే ఈ కింది చిట్కాలను ఫాలో అయితే సరి..!గోడలు, ఫర్నిచర్, ఆర్ట్.. ఎందులోనైనా తెలుపు రంగును డామినేట్ చేస్తూ ఒక వంతు నలుపు రంగు ఉండేలా చూసుకోవాలి. మన కళ్లు సహజంగా నల్లటి వస్తువులను ఆకర్షిస్తాయి. అందుకే వాటిని తక్కువగా ఉపయోగించాలి.ఏ స్థలానికి లేదా గదికి ఎంతమేర బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అవసరమో స్కేల్ సాయంతో సెలెక్ట్ చేసుకోవాలి. అంత కచ్చితత్వాన్ని పాటిస్తేనే ఈ డిజైన్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.నలుపు– తెలుపు కాంబినేషన్లో చెక్స్ డిజైన్ని జోడించవచ్చు.అలంకరణలో తెల్లని గోడపైన నల్ల రంగులో సంగీత పరికరాలు, ప్యాటర్న్ ఫ్రేమ్‌లు, ఐరన్ లైట్స్ వంటివి వాడుకోవచ్చు.నలుపు– తెలుపు డిజైన్లలో కూడా ఇతర షేడ్స్ ఉంటాయి. కలర్స్‌ని న్యూట్రల్‌గా ఉపయోగించడం వలన డిజైన్లలో రిచ్‌లుక్ వస్తుంది.గది అంతా వైట్ పెయింట్ ఉండి మిగతా అలంకరణకు చాకోలెట్, నలుపు రంగులో ఉండే పెయింట్స్, వుడెన్ షో పీసెస్, కుండలు, కుండీలు, బుక్ ర్యాక్స్ వంటివీ అలంకరణకు ఉపయోగించవచ్చు.బ్లాక్ అండ్ వైట్ థీమ్‌ని ఎంచుకుంటే.. దాన్ని మనకు నచ్చినట్టు సులభంగా మార్చుకునే వీలుంటుంది. -
Mystery Death: ‘నాన్నా మూర్ .. బాగా చీకటి పడిందిరా ఎక్కడున్నావ్, వింటున్నావా’..?
ఇది ఓ చిట్టి గుండెకు, స్వచ్ఛమైన నవ్వుకు జరిగిన అన్యాయం. కాలం సైతం మాన్చలేని గాయం. మూర్ఖత్వానికి, క్రూరత్వానికి.. నిర్దాక్షిణ్యంగా బలైన నిండు జీవితం. కుయుక్తులు, కుతంత్రాలు తెలిసిన ఈ ప్రపంచానికి ఎదురీదలేక.. నీరుగారిన పోరాటం.1995 ఏప్రిల్ 23 రాత్రి, దగ్గరదగ్గరగా తొమ్మిది కావస్తోంది. ఫ్లోరిడా, న్యూ స్మిర్నా బీచ్ అంతా ఆటుపోట్లతో ఎగసిపడుతోంది. కారుచీకటిని చీల్చుకుంటూ ఓ బ్యాటరీ లైట్.. స్థిమితం లేకుండా అటూ ఇటూ కదలాడుతోంది. ‘మూర్.. మూర్.. మూర్’ అనే అరుపు.. హోరుహోరుమనే సముద్రగాలికి.. గమ్యం లేకుండా ఎదురీదుతోంది. ‘నాన్నా మూర్ .. బాగా చీకటి పడిందిరా ఎక్కడున్నావ్, వింటున్నావా’ అనే కేక.. క్రమక్రమంగా ఆ పరిసరాల్లో అల్లకల్లోలాన్నే సృష్టిస్తోంది. ఆ అలజడంతా ఓ కన్నపేగుది. ఏదో కీడు శంకిస్తున్న ఓ తల్లి మనసుది.‘ఓరా లీ’ తన ఎనిమిదేళ్ల కొడుకు డిమీట్రీక్ మూర్ని.. మూడు నాలుగు గంటలు ఊరంతా వెతికీ వెతికీ.. చివరికి సముద్రతీరానికి చేరుకుంది. అక్కడ కూడా ఏ జాడ లేకపోయేసరికి.. పోలీస్ స్టేషన్ కి పరుగుతీసింది. ‘ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు.. ఆడుకుని వస్తానంటూ బయటికి వెళ్లిన నా కొడుకు మూర్ తిరిగి రాలేదు. ఏమయ్యాడో తెలియదు. నా బిడ్డను ఎలాగైనా వెతికిపెట్టండి సారు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మరునాడు ఉదయం నుంచి బాబును వెదకడం మొదలుపెట్టారు. స్థానికుల్లో కొందరు మూర్ని వెతకడంలో సాయం చేశారు.ఆ రోజు సాయంత్రం 4 అయ్యేసరికి మూర్.. ఓరా కారు డిక్కీలోనే శవమై కనిపించాడు. ఒంటి మీద బట్టలు కూడా లేవు. మొదట బాబు.. తెలియక ఆ డిక్కీలోకి తనంతట తానే వెళ్లి ఇరుక్కుని చనిపోయాడేమో అనుకున్నారంతా. కానీ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో.. హత్య అని తేలింది. బాడీపై వేలిముద్రలు లేకుండా కడిగినట్లు ఆనవాళ్లున్నాయి. ప్రాణం పోయి 18 నుంచి 24 గంటలు కావస్తోందని నిర్ధారించారు. తడిసిన బాబు బట్టలు కూడా ఆ పరిసరల్లోనే దొరికాయి. తెలివిగా.. వాటిని ఉతికి శుభ్రం చేసి పెట్టారని స్పష్టమైంది. శవం.. తల్లి కారులోనే దొరికింది కాబట్టి కేసు ఓరా మెడకే చుట్టుకుంది. ఆమెను పలుమార్లు.. గంటలు గంటలు విచారించారు పోలీసులు. అరెస్ట్ కూడా చేశారు.‘ఆ రోజు 8 లోపే మూర్ ఇంటికి వచ్చేశాడు. అయితే రెండు గంటలకు వెళ్లిన మూర్ అన్ని గంటల తర్వాత.. బట్టల్నీ మురికి చేసుకుని వచ్చేసరికి ఓరా.. మూర్‌పై తీవ్రంగా కోప్పడింది. ఆ ఆవేశంలో బాబుని బాగా కొట్టింది. ఆ అరుపులు, ఏడుపులు మేము విన్నాం.. ఆ సమయంలోనే మూర్ చనిపోయి ఉంటాడు. అందుకే ఓరా.. తెలివిగా కేసుని పక్కదోవ పట్టించడానికి కారులో శవాన్ని దాచి.. ఊరంతా వెతికి ఉంటుంది’ అంటూ కొందరు సాక్షులుగా నిలిచారు. దాన్ని నమ్మిన పోలీసులు.. ఓరాను అరెస్ట్ చేశారు. అయితే ఓరా అలాంటిది కాదని మరికొందరు వాదనకు దిగారు.కేసు కోర్టుదాకా పోయింది. వాద, ప్రతివాదాల మధ్య నలిగిన ఓరా.. 1996 జూన్ కల్లా నిర్దోషిగా విడుదలైంది. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే కేసును క్లోస్ చేశారు పోలీసులు. అయినా సరే ఓరా ఆగలేదు. తన బిడ్డ మూర్ మరణానికి కారణమెవరో తేల్చాలంటూ న్యాయపోరాటం మొదలుపెట్టింది. ఆ పోరాట ఫలితంగా 1997 ఫిబ్రవరిలో కేసు రీ ఓపెన్ అయ్యింది. ఈసారి రూట్ మార్చారు అధికారులు. ఆ రోజు మూర్తోపాటు ఆడుకోవడానికి వెళ్లిన ఇరుగుపొరుగు పిల్లలను విచారించారు. అయితే అందులో కొందరు ఆ రోజు మూర్‌ను కలవనేలేదని, చూడనేలేదని చెప్పారు.అప్పుడే మూర్ స్నేహితుడొకడు.. కీలక సాక్ష్యమయ్యాడు. ‘మూర్తో కలసి ఆడుకునే స్థానిక పిల్లలంతా అతని కంటే పెద్దవాళ్లే. దాంతో చాలామంది పిల్లలు మూర్ని చిన్నదానికీ పెద్దదానికీ బెదిరించేవారు. ఏదో ఒక కారణంతో ఏడిపించేవారు. గతంలో ఒకసారి ఒక పెద్ద కుర్రాడు మూర్ని నేలపై పడేసి.. బలవంతంగా మట్టి తినిపించడం నేను కళ్లారా చూశాను’ అని మూర్ స్నేహితుడు చెప్పాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అప్పటికే విచారణలో ‘మూర్ని ఆరోజు చూడనేలేదు’ అని చెప్పినవారే.. అతని దృష్టిలో నిందితులు. దాంతో పరిశోధకులు.. మూర్ని తోటి స్నేహితులే అనవసరంగా గొడవపడి, ప్రమాదవశాత్తూ చంపేసి ఉంటారని.. కేసు మీదకు రాకుండా తమ తల్లిదండ్రుల సాయం తీసుకుని మూర్ శరీరాన్ని, దుస్తుల్ని శుభ్రం చేసి ఉంటారని అంచనాకొచ్చారు.ఇంతలో ఓరాకు మరో సంగతి గుర్తొచ్చింది. అసలు కారులోకి శవం ఎలా వచ్చింది? అని ఆలోచిస్తే.. ఒక అనుమానాస్పద సన్నివేశం ఆమె కళ్లముందు కదలాడింది. ఓరా ఆ రోజు బాబుని వెతుకుతుంటే.. ఇద్దరు ఆడవాళ్లు వచ్చి.. ‘మూర్ రైలు పట్టాల దగ్గర ఎవరితోనో గొడవ పడుతున్నాడు’ అని చెప్పారు. తీరా ట్రాక్ దగ్గరకు.. ఓరా పరుగుతీస్తే అక్కడంతా ప్రశాంతంగానే కనిపించింది. అంటే.. తను రైలు పట్టాల దగ్గరకు వెళ్లినప్పుడే.. ఎవరో బాబు శవాన్ని లాక్ చేయని తన కారు డిక్కీలో పెట్టి ఉంటారని నమ్మింది ఓరా.మరోవైపు మూర్ కనిపించకుండా పోయిన మరునాడు మధ్యాహ్నం, శవం దొరక్కముందు.. ‘స్టెఫానీ వాషింగ్టన్’ అనే పొరుగు నివాసి.. ఓరాకు ఓ అబద్ధం చెప్పాడట. ‘మూర్తో ఆడుకున్న అబ్బాయిల్లో ఒకరిని.. ఎవరో కొట్టి చంపి.. రైలు పట్టాల దగ్గర వేశార’ని ఆ వ్యక్తి చెప్పడంతో మూర్కు ఏమై ఉంటుందోనని మరింత భయపడిందట ఓరా. నిజానికి.. ఆ సమయంలో మూర్ మృతికి ముందు కానీ తర్వాత కానీ.. ఏ పిల్లలూ మిస్ అవ్వలేదు. మరి ఇరుగుపొరుగు ఎందుకలా అబద్ధం చెప్పారో తెలియదు. ఏది ఏమైనా మూర్ మృతికి.. అతడి తోటి స్నేహితులే కారణమని నమ్మేవాళ్లు ఎక్కువయ్యారు. కానీ, సరైన ఆధారాలు దొరకలేదు.మొత్తానికి మూర్ మృతికి అసలు కారకులు ఎవరు? పొరుగువారైయ్యుండి ఎందుకు ఓరాని తప్పుదారి పట్టించారు? మూర్ బాడీని.. అతని తల్లి ఓరా కారులో ఎవరు పెట్టారు? ఇలా ఎన్నో ప్రశ్నలు నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మన -
Devil Fish: ఇటువంటి చేపను మీరెప్పుడైనా చూశారా?
ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం తలాయి గ్రామం సమీపంలో పెద్దవాగులో ఓ వింత చేప లభ్యమైంది. పనెం శంకర్ చేపలు పట్టేందుకు వెళ్లగా.. అతడికి ఈ చేప దొరికింది. నల్లమచ్చలతో ఆకారం వింతగా ఉండటంతో చేపను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు.ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ ఫీల్డ్ అధికారి మధుకర్‌ను సంప్రదించగా.. ఈ చేపను డెవిల్ ఫిష్ అంటారని తెలిపారు. ఎక్కువగా ప్రాణహిత జలాల్లో సంచరిస్తుందని పేర్కొన్నారు. అయితే జిల్లాలో ఇప్పటివరకు జాలర్లకు దొరికిన ఘటనలు లేవని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వైపు జిలాల్లో ఎక్కువగా వీటి సంచారం ఉంటుందని, ఈ చేపలు తినేందుకు పనికి రావని తెలిపారు.ఇవి చదవండి: చచ్చిన ఎలుకల కోసం రైల్వే పైలెట్ ప్రాజెక్ట్ -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటబొమ్మను ఎప్పుడైనా చూశారా!
ఆటబొమ్మల ఖరీదు ఎంత ఉంటుంది? పది రూపాయల నుంచి కొన్ని వందల రూపాయల్లో రకరకాల ఆటబొమ్మలు దొరుకుతాయి. మరీ ఖరీదైన ఆటబొమ్మలైనా సరే, కొన్ని వేల రూపాయలకు మించి ఉండవు.ఇది మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటబొమ్మ. ఇది అలాంటిలాంటి ఆటబొమ్మ కాదు, టాయ్ రోబో! పిల్లలు ఆడుకునేందుకు వీలుగా జపాన్‌కు చెందిన ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ ‘గింజా తనాకా’, ఆటబొమ్మల తయారీ సంస్థ ‘బందాయి కంపెనీ’ కలసి ఈ టాయ్ రోబోను రూపొందించాయి. జపానీస్ సూపర్‌హిట్ కార్టూన్ సీరియల్ ‘గండామ్’లో కథానాయక పాత్ర పోషించిన రోబో నమూనాను అచ్చంగా పోలి ఉండేలా దీన్ని తీర్చిదిద్దాయి. ఈ రోబో ఎత్తు పదమూడు సెంటీమీటర్లు, బరువు 1.400 కిలోలు ఈ టాయ్ రోబో కూడా అసలు సిసలు రోబోల మాదిరిగా కొన్ని పనులు చేయగలదు. చిత్రవిచిత్రమైన విన్యాసాలతో, ఆటపాటలతో పిల్లలను అలరించగలదు. ఈ టాయ్ రోబో తయారీకి స్వచ్ఛమైన ప్లాటినమ్‌ను ఉపయోగించారు. దీని ఖరీదు 41,468 డాలర్లు (రూ.34.69 లక్షలు)ఇవి చదవండి: కేవలం వాయుభక్షణతో.. పదివేల ఏళ్లు తపస్సు! -
ఈ బీచ్‌బబుల్ టెంట్లకి.. ప్రత్యేకత ఏంటో తెలుసా!?
సముద్రం ఒడ్డున పడుకుని, రాత్రివేళ చుక్కలను చూస్తూ నిద్రలోకి జారుకుంటే భలే బాగుంటుంది కదూ! సముద్రం ఒడ్డున పడుకుని, రాత్రివేళ ఆకాశంలోని చుక్కలను చూడటం వరకు సరే, నిద్రలోకి జారుకోవడం అంత తేలిక కాదు. ఆరుబయట పడుకుంటే, చీకటి పడిన తర్వాత దోమల దాడి నిద్రను దూరం చేస్తుంది. దోమల బెడదకు భయపడే ఆరుబయట నిద్రపోవడానికి చాలామంది వెనుకంజ వేస్తారు.అయితే, దోమల బెడద లేకుండా, ప్రశాంతంగా ఆరుబయట ఎదురుగా సముద్రాన్ని, ఆకాశంలోని చుక్కలను చూస్తూ గడిపే అద్భుతమైన అవకాశం మాల్దీవ్స్ పర్యాటకులకు ఇప్పుడు అందుబాటులో ఉంది. మాల్దీవ్స్‌లోని సీసైడ్ ఫినోలు రిసార్ట్స్ సంస్థ పర్యాటకుల కోసం ప్రత్యేకంగా బీచ్‌బబుల్ టెంట్లను అందుబాటులోకి తెచ్చింది. పారదర్శకంగా గోళాకారంలో ఉండే ఈ టెంట్లలో పడుకుంటే, రాత్రివేళ ఆకాశం సుస్పష్టంగా కనిపిస్తుంది.అల్ట్రావయొలెట్ కిరణాలు, నీరు చొరబడకుండా తయారు చేసిన ఈ టెంట్లలోకి దోమలు కూడా చొరబడలేవు. వాతావరణంలోని హెచ్చుతగ్గులను తట్టుకునేలా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ టెంట్లలో బస పర్యాటకులకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ టెంట్లలో బసచేసిన వారు మెలకువగా ఉన్నా, నిద్రపోయినా అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకుంటారని ‘ఫినోలు’ సంస్థ నమ్మకంగా చెబుతోంది.మాల్దీవ్స్‌లోని బా అటాల్ బీచ్‌లో ‘ఫినోలు’ సంస్థ ఈ బీచ్‌బబుల్ టెంట్లతో ఇటీవల రిసార్ట్ ప్రారంభించింది. ఈ రిసార్ట్స్‌లో బబుల్ టెంట్లలో బసతో పాటు పర్యాటకులకు స్పా, హైడ్రోథెరపీ, జిమ్, బ్యూటీ పార్లర్, టెన్నిస్ కోర్ట్, గోల్ఫ్ కోర్స్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండటం విశేషం. ఈ బీచ్ బబుల్స్‌లో ఒక రాత్రి బస చేయాలంటే, 476 డాలర్లు (రూ. 39,783) చెల్లించాల్సి ఉంటుంది.ఇవి చదవండి: క్షణికం! ట్రైన్లో అడుగు పెట్టి.. బెర్త్ కింద సూట్‌కేసు తోసి.. -
మీకు తెలుసా! ఆ ఊరికి లైఫ్ లైబ్రరీనే!
కరెంటు.. రోడ్డు.. మంచినీళ్ల వసతి .. గ్రామాభివృద్ధికి చిహ్నాలు! గ్రంథాలయం.. ఆ ఊరి చైతన్యానికి నిదర్శనం! ఈ డిజిటల్ వరల్డ్‌లో అలాంటి చైతన్యంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది పశ్చిమగోదావరి జిల్లాలోని కుముదవల్లి.. 127 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కందుకూరి విరేశలింగం కవిసమాజ గ్రంథాలయానికి చిరునామాగా నిలిచి! 1890వ దశకంలోకి వెళితే.. కుముదవల్లిలోని మధ్యతరగతి రైతుకుటుంబానికి చెందిన తిరుపతిరాజుకు పుస్తక పఠనం అంటే ప్రాణం. దానికి కారణం.. ఆ ఊరికే చెందిన పడ్రంగి చిన్నమారాజు.అప్పట్లో ఆయన తన దగ్గరున్న 50 పుస్తకాలను తిరుపతిరాజు తండ్రి లచ్చిరాజుకిచ్చి లైబ్రరీ ఏర్పాటుకు సాయపడ్డారు. తిరుపతిరాజులో పఠనాసక్తిని కలిగించింది ఆ గ్రంథాలయమే. అందులోని పుస్తకాల వల్లే స్వాతంత్య్ర సమరం గురించి తెలిసింది ఆయనకు. అలా తను చదివిన విషయాలన్నీ తన ఊళ్లోని వాళ్లకూ తెలియాలని.. తమ ఊరూ స్వాతంత్య్ర సమరంలో పాల్గొనాలని తపించారు తిరుపతి రాజు.ఆ చైతన్యం తన ఊరి ప్రజల్లో రావాలంటే తన తండ్రి ఏర్పాటు చేసిన ఆ చిన్న లైబ్రరీని మరిన్ని పుస్తకాలు, పత్రికలతో అభివృద్ధిపరచాలని నిర్ణయించుకున్నారు. అలా 1897 నవంబర్ 28న ఆ ఊళ్లో చిన్న గుడిసె వేసి ‘కందుకూరి వీరేశలింగం కవి సవూజ గ్రంథాలయం’ను ఏర్పాటు చేశారు. పుస్తకాలు, గ్రంథాలు, పత్రికలు కొనుగోలు చేయడానికి తిరుపతిరాజు తనకున్న ఎకరం భూమిని విరాళంగా ఇచ్చేశారు. ఈ గ్రంథాలయాన్ని స్వయంగా సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులే ప్రారంభించారు.గ్రంథాలయంలో పుస్తక పఠనం చేస్తున్న గ్రామస్థులు, అలనాటి పుస్తకాలుతిరుపతిరాజు.. కోరుకున్నట్టే స్థానికులు స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన సమాచారాన్ని గ్రంథాలయానికి వచ్చే పత్రికల్లో చదివి స్ఫూర్తిపొందారు. ఆ గ్రామం నుంచి దాదాపు 24 మంది స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. అలా ఆ గ్రంథాలయం దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించింది. 1934లో గ్రంథాలయోద్యమానికీ పట్టుగొమ్మగా నిలిచింది కుముదవల్లి. ఈ లైబ్రరీ గురించి విరేశంలింగం పంతులు స్వదస్తూరీతో ఇక్కడి మినిట్స్ బుక్‌లో రాసి, చేసిన సంతకం ఇప్పటికీ భద్రంగా ఉంది. రూథర్‌ఫర్డ్ రాసిన అభిప్రాయమూ అందులో కనపడుతుంది.పూరిగుడిసె నుంచి పక్కా భవనం.. కాలక్రమంలో ఈ లైబ్రరీ పూరిగుడిసె నుంచి పెంకుటిల్లుగా, దాన్నుంచి అధునాతన వసతుల భవంతిగా మారింది. అక్షరాస్యత వ్యాప్తి, స్త్రీ విద్య, వితంతు వివాహాలు, సహకార పరపతి సంఘం తదితర ప్రజోపయోగ అంశాలకు వైదికయింది. విజ్ఞాన గని.. ఇందులో.. ఎందరో మహామహులు రచించిన గ్రంథాలు, ప్రవుుఖుల చేతిరాత ప్రతులు వంటి అవుూల్యమైన అక్షర సంపద పోగై ఉంది.ఆత్మకథలు, వచనాలు, నవలలు, ఆధ్యాత్మిక, ఆయుర్వేదం, భారతి, ఆంధ్రపత్రిక, శారద, విజ్ఞానం, గృహలక్ష్మి, కృష్ణాపత్రిక, బాల వ్యాకరణం, వేదాంతసారం వంటి 17 వేల పుస్తకాలు కనిపిస్తాయిక్కడ. కోస్తా జిల్లాలోని విద్యార్థులు తెలుగుభాష, చరిత్రపై పీహెచ్డీ చేసేందుకు ఇది ఎంతో దోహదపడుతోంది. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, అయ్యంకి వెంకటరమణయ్య, చిలకవుర్తి లక్ష్మీనర్సింహం, దుగ్గరాల బలరామకృష్ణయ్య, అడివి బాపిరాజు, జంధ్యాల పాపయ్యశాస్త్రి, డాక్టరు సి నారాయణరెడ్డి, నండూరి కృష్ణవూచార్యులు వంటి పెద్దలు ఈ గ్రంథాలయానికి వస్తూపోతూండేవారట.ప్రత్యేకతలెన్నో..పుస్తక పఠనాన్ని ఈ గ్రామస్థుల జీవనశైలోలో భాగం చేసిన ఆ గ్రంథాలయాభివృద్ధి కోసం కుముదవల్లి ఓ సంప్రదాయాన్ని పాటిస్తోంది. అక్కడ ఎవరి పెళ్లి జరిగినా ఎంతోకొంత డబ్బును ఆ లైబ్రరీకి విరాళంగా ఇస్తూ! ఇప్పటికీ ఆ లైబ్రరీని దేవాలయంగా భావిస్తారు కుముదవల్లి వాసులు. పాదరక్షలతో లోనికి వెళ్లరు. ప్రస్తుతం ఈ గ్రంథాలయానికి లైబ్రేరియన్‌గా పెనుమత్స సూర్యసుగుణ సేవలందిస్తున్నారు. ఆధునిక సాంకేతికతకనుగుణంగా ఆ లైబ్రరీలోని పుస్తకాల డిజిటలైజషన్ ప్రక్రియా మొదలైంది. – విజయ్‌కుమార్ పెనుపోతుల -
నిజమే..! ఇదొక వాంపైర్ మ్యూజియం..!!
దయ్యాలు, భూతాలు, పిశాచాలు వంటివి పాతకాలం జానపద సినిమాల్లోను, ఇప్పటికాలం హారర్ సినిమాల్లోను చాలామంది చూసి ఉంటారు. భూత ప్రేత పిశాచాల గురించి పరిశోధనలు సాగించే వారు పురాతనకాలం నుంచి కూడా ఉన్నారు.భూత ప్రేత పిశాచాలను ఆవాహన చేయడానికి తాంత్రికులు ఉపయోగించే వస్తువులను, మనుషులను భయపెట్టే ప్రేతాత్మలను నిరోధించడానికి ఉపయోగించే వస్తువులను, ప్రేతాత్మలను ఆకర్షించే వస్తువులను జాగ్రత్తగా సేకరించి ఒక మ్యూజియంను ఏర్పాటు చేయాలనే ఆలోచన మాత్రం చాలా అరుదైనది.ప్రేతాత్మలపై పరిశోధనలకే జీవితాన్ని అంకితం చేసిన ఫ్రెంచ్ మేధావి జేక్విజ్ సిర్జంట్ పారిస్‌లో అచ్చంగా భూత ప్రేత పిశాచాలకు సంబంధించిన వస్తువులతో ‘మ్యూజియం ఆఫ్ వాంపైర్స్’ను నెలకొల్పాడు. ఇందులో మానవ కంకాళాలు, పురాతన తాంత్రికులు ఉపయోగించిన జంతువుల మమ్మీలు, ప్రేతాత్మలను తరిమికొట్టే ఆయుధాలు వంటివి భద్రపరచాడు. గుండెదిటవు గల పర్యాటకులు ఈ మ్యూజియంను చూసి పోతుంటారు.