సముద్రం ఒడ్డున పడుకుని, రాత్రివేళ చుక్కలను చూస్తూ నిద్రలోకి జారుకుంటే భలే బాగుంటుంది కదూ! సముద్రం ఒడ్డున పడుకుని, రాత్రివేళ ఆకాశంలోని చుక్కలను చూడటం వరకు సరే, నిద్రలోకి జారుకోవడం అంత తేలిక కాదు. ఆరుబయట పడుకుంటే, చీకటి పడిన తర్వాత దోమల దాడి నిద్రను దూరం చేస్తుంది. దోమల బెడదకు భయపడే ఆరుబయట నిద్రపోవడానికి చాలామంది వెనుకంజ వేస్తారు.
అయితే, దోమల బెడద లేకుండా, ప్రశాంతంగా ఆరుబయట ఎదురుగా సముద్రాన్ని, ఆకాశంలోని చుక్కలను చూస్తూ గడిపే అద్భుతమైన అవకాశం మాల్దీవ్స్ పర్యాటకులకు ఇప్పుడు అందుబాటులో ఉంది. మాల్దీవ్స్‌లోని సీసైడ్ ఫినోలు రిసార్ట్స్ సంస్థ పర్యాటకుల కోసం ప్రత్యేకంగా బీచ్‌బబుల్ టెంట్లను అందుబాటులోకి తెచ్చింది. పారదర్శకంగా గోళాకారంలో ఉండే ఈ టెంట్లలో పడుకుంటే, రాత్రివేళ ఆకాశం సుస్పష్టంగా కనిపిస్తుంది.
అల్ట్రావయొలెట్ కిరణాలు, నీరు చొరబడకుండా తయారు చేసిన ఈ టెంట్లలోకి దోమలు కూడా చొరబడలేవు. వాతావరణంలోని హెచ్చుతగ్గులను తట్టుకునేలా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ టెంట్లలో బస పర్యాటకులకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ టెంట్లలో బసచేసిన వారు మెలకువగా ఉన్నా, నిద్రపోయినా అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకుంటారని ‘ఫినోలు’ సంస్థ నమ్మకంగా చెబుతోంది.
మాల్దీవ్స్‌లోని బా అటాల్ బీచ్‌లో ‘ఫినోలు’ సంస్థ ఈ బీచ్‌బబుల్ టెంట్లతో ఇటీవల రిసార్ట్ ప్రారంభించింది. ఈ రిసార్ట్స్‌లో బబుల్ టెంట్లలో బసతో పాటు పర్యాటకులకు స్పా, హైడ్రోథెరపీ, జిమ్, బ్యూటీ పార్లర్, టెన్నిస్ కోర్ట్, గోల్ఫ్ కోర్స్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండటం విశేషం. ఈ బీచ్ బబుల్స్‌లో ఒక రాత్రి బస చేయాలంటే, 476 డాలర్లు (రూ. 39,783) చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి చదవండి: క్షణికం! ట్రైన్‌లో అడుగు పెట్టి.. బెర్త్ కింద సూట్‌కేసు తోసి..
Comments
Please login to add a commentAdd a comment