అది 1987 అక్టోబర్ 30. అమెరికా, అలబామా రాష్ట్రంలో ఎపెస్ అనే పట్టణంలో ఉన్న చిన్న పోస్ట్ ఆఫీస్. మనియార్డర్లు, ఉత్తరాలు, స్టాంపులు తీసుకెళ్లేవారంతా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు, వెళ్తున్నారు. ఆ బిజీలోనే ఉంది పోస్ట్‌మాస్టర్ డ్యూటీ చేస్తున్న ఒపాల్ జాన్సన్ అనే మహిళ. అది తన జీవితంలో అత్యంత భయంకరమైన రోజని ఆమెకు తెలియదు.
ఉదయం 11 దాటింది. ఆఫీసులో ఎవరూ లేరు. ‘ఏదైనా తిందాం’ అనుకుంటూ బాక్స్ అందుకోబోయింది. ఇంతలో ఒక నల్లజాతీయుడు, ఒక తెల్లజాతీయుడు కలసి అక్కడికి వచ్చారు. ‘ఏం కావాలి?’ అన్నట్లుగా చూసింది వాళ్లవైపు ఒపాల్. వాళ్లు స్టాంపులు అడగడంతో ముందున్న డ్రా ఓపెన్ చేసి, వాళ్లు అడిగిన స్టాంప్స్ కోసం వెతకడం ప్రారంభించింది. ఇంతలో ఒకడు తుపాకీ బయటికి తీసి, ఆమెకు గురిపెట్టి ‘కదిలితే కాల్చేస్తా!’ అన్నాడు. ఊహించని పరిణామానికి ఆమె నిర్ఘాంతపోయింది.
చేతులు పైకెత్తి, అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. ఇంతలో మరొకడు కౌంటర్ ముందుకు వెళ్లి, డబ్బులు వెతకడం మొదలుపెట్టాడు. అయితే నల్లజాతీయుడు పోస్టాఫీసు కార్యకలాపాలపై పూర్తి అనుభవం ఉన్నవాడిలా ఏది ఎక్కడుంటుంది? ఎందులో ఎంత ఉంటుంది? అంతా తనతో వచ్చిన తెల్లజాతీయుడికి వివరిస్తున్నాడు. అతడు వాటన్నింటినీ తీసి బ్యాగ్‌లో వేసుకుంటున్నాడు. దోపిడీ జరుగుతోందని ఆమెకు అర్థమైంది. అరిస్తే ప్రాణాలకే ప్రమాదమని, తప్పించుకోవడానికి ఏదో అవకాశం దొరక్కపోతుందా అని దేవుడ్ని ప్రార్థించడం మొదలుపెట్టింది.
పోస్టాఫీసులో దొరికిన నగదు, విలువైన స్టాంపులు ఇలా అన్నీ దోచేశారు. ఆ వెంటనే ‘ఈమెను ఏం చేద్దాం?’ అని చర్చించుకున్నారు. ‘ఈమె ఇక్కడే ఉంటే మనం వెళ్లేలోపు పోలీసులకు సమాచారం ఇచ్చే ప్రమాదం ఉంది. ఇక్కడ తుపాకీ తీస్తే అలర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈమెను కూడా మనతో పాటు తీసుకుని వెళ్దాం’ అన్నాడు నల్లజాతీయుడు తన తోటి దొంగతో.
కాసేపటికి ఆ ఇద్దరూ ఒపాల్‌ని తుపాకీతోనే తోసుకుంటూ ఆమె కారు దాకా తీసుకెళ్లారు. ఆమెను బలవంతంగా కారు ఎక్కించారు. ఒకడు ఆమె పక్క సీట్‌లో కూర్చుని, ఆమెకు తుపాకీ గురిపెట్టే ఉంచాడు. ఇంతలో మరొకరు తమ కారుని ఒపాల్ కారుకి లింక్ చేసి, పరుగున వచ్చి ఒపాల్ కారులో వెనుక సీట్‌లో కూర్చున్నాడు. వెంటనే ‘హూ.. పోనీ’ అంటూ అరిచాడు నల్లజాతీయుడు. ఇక తనకు చావు తప్పదనుకున్న ఒపాల్ వణికిపోతూనే వారు ఎటు అంటే అటు కారుని ముందుకు పోనిచ్చింది.
అయితే వారిద్దరూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల గురించి చాలా బాగా తెలిసినట్లుగా చర్చించుకున్నారు. ‘అక్కడికి వెళ్తే తప్పించుకోవడం ఈజీ! అటు నుంచి అటు పారిపోవచ్చు సులభం!’ అంటూ చాలా ప్రదేశాల పేర్లు ఎంచుకున్నారు. చివరగా, ఆ రెండు కార్లు పట్టణానికి 3 మైళ్ల దూరంలో ఉన్న గాగన్ ్స సరస్సు సమీపంలోని రిమోట్ క్లియరింగ్ దగ్గర ఆగాయి. ఒపాల్‌ని మళ్లీ తుపాకీతో బెదిరించి, ఆమె కారులోనే డిక్కీలోకి ఎక్కించారు. ఆ సమయంలో తుపాకీ తెల్లజాతీయుడి చేతిలో ఉంది.
అయితే నల్లజాతీయుడు ఆవేశంగా ‘ఆమెను చంపెయ్.. చంపెయ్.. వదిలిపెట్టొద్దు.. వదిలితే మనకే సమస్య’ అని తెల్లజాతీయుడి మీద పెద్దపెద్దగా అరిచాడు. అయితే తెల్లజాతీయుడు అందుకు అంగీకరించలేదు. ‘ఆమె వల్ల మనకేం సమస్య రాదు. చంపితేనే పోలీసులు మరింత వేగంగా మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు’ అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కాసేపటికి ఇద్దరి చర్చలో తెల్లజాతీయుడి వాదనే గెలిచింది. ఒపాల్ ఊపిరి పీల్చుకుంది. అప్పటి దాకా వారి చర్చంతా వింటున్న ఒపాల్, తన మీదకు ఎప్పుడెప్పుడు బుల్లెట్లు దోసుకోస్తాయోనని చాలా భయపడింది. చివరికి తనని ప్రాణాలతోనే వదులుతున్నారని అర్థం చేసుకుంది. అయితే ఆమె చేతికున్న ఉంగరాలు, మెడలో గొలుసు, క్రెడిట్ కార్డులు అన్నీ లాగేసుకుని, ఆమెను ఆమె కారు డిక్కీలోనే లాక్ చేసి, వారు తమ కారులో పారిపోయారు.
కొంత సమయానికి చుట్టూ నిశ్శబ్దాన్ని నిర్ధారించుకున్న ఒపాల్, లోపలే ఉన్న ఇనుప టైర్ సాయంతో డిక్కీని పగలగొట్టి బయటపడింది. అయితే డిక్కీ ఓపెన్ కావడానికి సుమారు గంటపైనే పట్టింది. మొత్తానికి ప్రాణాలు దక్కడంతో పోలిస్ స్టేషన్ కి తన కారులోనే వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె చెప్పిన ఆనవాళ్లతో ఆ ఇద్దరు ఆగంతకుల రూపురేఖలను ఊహాచిత్రాలుగా గీయించారు పోలీసులు. వెంటనే విచారణ మొదలుపెట్టారు.
అయితే దోపిడీ జరిగిన మరునాడే, దోపిడీకి పాల్పడిన నల్లజాతీయుడు ఒహాయోలో మరో నల్లజాతీయురాలితో కలసి తిరిగినట్లు కొందరు సాక్షులు చెప్పారు. మరోవైపు ఆ మహిళ చాలాచోట్ల ఒపాల్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించిందని తేలింది. కానీ ఒపాల్‌ని వణికించిన ఆ ఇద్దరు దొంగలు పోలీసులకు ఎప్పుడూ దొరకలేదు. 1995లో ఈ కథనాన్ని అన్‌సాల్వ్‌డ్ ఎపిసోడ్స్‌లో ప్లే చేశారు.
2010లో ఒపాల్ అనారోగ్య సమస్యలతో మరణించింది. అయితే తెల్లజాతీయుడు కంటే నల్లజాతీయుడు సుమారు పదేళ్లు పెద్దవాడనేది ఒపాల్ అంచనా. ఒపాల్ చెప్పినదాని ప్రకారం నల్లజాతీయుడి ప్లాన్ తో ఆ దోపిడీ మొత్తం జరిగింది. అతడికి పోస్టాఫీసులో పనిచేసిన అనుభవం కచ్చితంగా ఉండే ఉంటుంది. ఈ ఘటన జరిగి సుమారు 36 ఏళ్లు దాటింది. ఆ ఇద్దరు ఎక్కడున్నారో, ఏమయ్యారో పోలీసులు ఇప్పటికీ కనిపెట్టేలేకపోయారు. దాంతో ఈ స్టోరీ ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment