ప్రకృతి, వికృతి.. ఇవి ఏనాటికీ ఒకటి కాలేవు. ఎక్కడా ఒకటిగా కానరావు. కానీ కుర్సియాంగ్ ప్రకృతిలో ఏదో తెలియని వికృతి దాగుందట. చిత్రవిచిత్రమైన రూపాల్లో వణికిస్తోందట. ఏంటా మిస్టరీ.?
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్.. పర్యాటకానికి పెట్టింది పేరు. అందులో ‘డౌ హీల్’ మాత్రం.. అతీంద్రియశక్తులపై ఆసక్తి చూపేవాళ్లకు ఇస్తుంది మాంచి జోరు. డార్జిలింగ్ నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్సియాంగ్‌కి సరిగ్గా 10 నిమిషాలే డౌ పర్వతాలు. దీన్ని చాలామంది ‘మోస్ట్ హాంటెడ్ హిల్ స్టేష¯Œ ’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎన్నో హారర్ స్టోరీస్ వినిపిస్తారు.
ఒక పక్క తేయాకు తోటలు.. మరో పక్క ఆర్కిడ్ పూల తోటలు.. చుట్టూ కొండలు, పెద్దపెద్ద చెట్లతో దట్టమైన అడవిని తలపిస్తుందీ ప్రాంతం. అయితే సాయంత్రం ఐదు దాటితే.. డౌ హిల్ రోడ్ నుంచి ఫారెస్ట్ ఆఫీస్ మధ్య ఎవ్వరూ తిరగరు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏవో శక్తులు తిరుగుతూ ఉంటాయని అక్కడివారి నమ్మకం. పైగా ఆ రోడ్‌ని.. ‘డెత్ రోడ్’ అనీ పిలుస్తుంటారు. అక్కడ ఒక ఆడ దయ్యాన్ని చూశామని కొందరు.. ఏవో అరుపులు, ఆర్తనాదాలు విన్నామని ఇంకొందరు.. గగుర్పాటును కలిగించే వింత రూపాలను చూశామని మరికొందరు.. చెబుతుంటారు.
విక్టోరియా బాయ్స్ హై స్కూల్
ఇక ఆ సమీపంలోనే ఉన్న ‘విక్టోరియా బాయ్స్ హై స్కూల్’కి కూడా ఈ గాలి సోకిందని వారందరి నమ్మకం. ‘ఒక తల లేని బాలుడు ఆ స్కూల్ నుంచి అడవిలోకి నడిచి వెళ్లడం కళ్లారా చూశాం’ అని.. అడవిలో కట్టెలు కొట్టుకునే బృందం సాక్ష్యం చెప్పింది. అడవికి వనమూలికల కోసం వచ్చే మరో బృందమైతే.. చింతనిప్పుల్లాంటి ఎర్రటి కళ్లు తమని వెంబడించాయని, తరిమేశాయని కొత్తకథను వినిపించింది. అతీంద్రియ శక్తులపై ఆసక్తి ఉన్నవారు ఇక్కడికి వెళితే తప్పకుండా వారు ఆశించినవి ఎదురవుతాయని కొందరి పర్యాటకులు నమ్మకంగా చెబుతుంటారు.
‘విక్టోరియా బాయ్స్ హై స్కూల్’ శీతకాలపు సెలవుల్లో.. సాయంత్రం అయితే చాలు.. మూసి ఉన్న స్కూల్ నుంచి పెద్ద పెద్ద గుసగుసలు, అడుగుల చప్పుళ్లు ప్రతిధ్వనిస్తుంటాయట. సూర్యాస్తమయం కాగానే.. పెద్ద హోరుగాలి చుట్టుముడుతుందని.. భవనం కారిడార్‌లలో అబ్బాయిల నవ్వులు, పరుగెత్తడం స్పష్టంగా వినిపిస్తాయని స్థానికులు పెద్దపెద్ద కళ్లు చేసుకుని వివరిస్తుంటారు. అయితే ఇక్కడ చదువుకునే విద్యార్థులు కానీ.. చదువు చెప్పే ఉపాధ్యాయులు కానీ ఏనాడూ దయ్యాల కథలు చెప్పలేదు. ఎటువంటి అనుమానస్పద స్థితి గురించి నిర్ధారించలేదు. అయితే స్థానికులే కాకుండా ఇక్కడికి వెళ్లిన పర్యాటకులకూ వింత అనుభవాలు ఎదురవ్వడంతో ఈ కొండమలుపుల్లో, చెట్టు చేమల్లో ఏదో శక్తి ఉందనే ప్రచారం మాత్రం విస్తృతంగా సాగుతోంది. దాంతో ఈ ప్రాంతం మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment