2008 నాటి చిత్రం..
షెరిలిన్ ఫోన్‌లోని చివరి ఫొటో
అదంతా పెద్దపెద్ద కొండలుండే ప్రాంతం. అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రదేశం. ఒకవైపు అడవి, మరోవైపు రహదారి. సుమారు వారం రోజులుగా ఎడతెరిపిలేని వర్షంతో విసిగిపోయిన ఓ గిరిజన బృందం ఆ రోజు వర్షం ఆగడంతో వేటకు బయలుదేరింది. వారంతా నడిచి వెళ్తూ ఉండగా ఓ చిన్న కుక్కపిల్ల మూలుగులు వారి చెవిన పడ్డాయి. ‘ఎక్కడ? ఎటువైపు?’ అన్నట్లు చెవులు రిక్కిస్తూ అటుగా నడిచారు.
వారు అడవిలోంచి రోడ్డు మీదకు వెళ్లేసరికి, రోడ్డు పక్కన ఓ ట్రక్ కార్ ఆగి ఉంది. అందులోంచే కుక్కపిల్ల మూలుగుతోంది. దగ్గరకు వెళ్లి, కారు అద్దంలోంచి చూస్తే, అది బక్కచిక్కిపోయి, నీరసంగా ఆయాసపడుతోంది. ఆ కారులో హ్యాండ్ బ్యాగ్, పర్స్, సెల్ ఫోన్స్ కూడా కనిపించాయి. చుట్టుపక్కల ఎవరూలేరు. పైగా డోర్స్‌ని లాక్ చేయలేదు. కుక్కపిల్ల పరిస్థితి చూస్తే, తిండి లేక చాలా రోజులైనట్లుంది. మరి కారు ఓనర్ ఎక్కడ? విలువైన వాటిని వదిలిపెట్టి లాక్ చేయకుండా, ఇలాంటి ప్రాంతంలో ఎక్కడికి వెళ్లినట్లు? ఇవే ప్రశ్నలు వారిని కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు.
ఆ కారు నంబరు చూడగానే పోలీసులకు ‘జామిసన్ ఫ్యామిలీ మిస్సింగ్ కేసు’ గుర్తొచ్చింది. బాబీ జామిసన్, షెరిలిన్ అనే దంపతులు తమ ఆరేళ్ల కూతురు మాడిసన్ తో కలసి సరిగ్గా అప్పటికి ఎనిమిది రోజుల క్రితం అదే కారులో ఇంటి నుంచి బయలుదేరారు. వారి ఇంటి ముందున్న సీసీ కెమెరాలో అది రికార్డ్ అయ్యింది. అయితే వారు తమ ప్రయాణం గురించి సొంతవారికి కూడా చెప్పలేదు. రెండు మూడు రోజులుగా ఫోన్ ్సకి స్పందించడంలేదంటూ షెరిలిన్ తల్లి కోకోటన్ అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏ క్లూ లేక ఆగిన ఆ కేసుకు ఈ కారే కీలకంగా మారింది. కారు దొరికిన పరిసరాల్లో తప్పిపోయిన ఆ ముగ్గురి కోసం వెతకడం ప్రారంభించారు. అప్పుడే ఆ కారు సీట్ కింద 32 వేల డాలర్లతో ఓ బ్యాగ్ దొరికింది. ‘అంత డబ్బు వారికి ఎక్కడిది?’ అనే ప్రశ్నకు కోకోటన్ కూడా సమాధానం ఇవ్వలేకపోయింది.
మొదటి సంతానం కొడుకుతో కలసి దిగిన ఫొటో
షెరిలిన్ ఫోన్ లోని చివరి ఫొటో విచారణ సమయంలో పలు అనుమానాలకు దారితీసింది. మాడిసన్ భయపడుతూ, ఏడుపు తన్నుకొస్తున్నట్లుగా చేతులు కట్టుకుని నిలబడిన ఫొటో అది. అసలు ఆ ఫొటోలో మాడిసన్ ఎందుకు అలా ఉంది? ఆ ఫొటో ఎవరు తీశారు? అప్పటికే జామిసన్ దంపతులకు ఏదైనా జరిగిందా? వేరే ఎవరైనా ఆ ఫొటో తీసుంటారా? అనే ప్రశ్నలు ఉత్కంఠను రేపాయి.
కారులో దొరికిన మరో ఫోన్ లో జీపీఎస్ లొకేషన్ ఇంకా ఆన్ లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు ఆగిన చోటుకు దగ్గర్లో ఓ కొండపైకి వారు చేరుకోవాల్సిన లొకేషన్ ని చూపిస్తోంది. మరి కారు ఎందుకు అక్కడ ఆగింది? వాళ్లెందుకు అక్కడ దిగారు? అనుకుంటూ అధికారులు కారు దొరికిన పరిసరాల్లో మొత్తం వెతికించారు. అయితే అప్పటికే పడిన వర్షాల కారణంగా సాక్ష్యాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.
సరిగ్గా మూడేళ్ల తర్వాత జామిసన్ కారు దొరికిన ప్రదేశానికి రెండు మైళ్ల దూరంలో అడవి వైపు అసలు దారే లేని చోట కొందరు పర్వతారోహకులకు వారి ముగ్గురి అస్థిపంజరాలు కనిపించాయి. అయితే అప్పటికే కోకోటన్ .. బాబీ ఉపయోగించే పర్సనల్ గన్ తో పాటు ఒక సూట్‌కేస్ కనిపించడం లేదని, అది వారి ఇంట్లోనూ, కారులోనూ దొరకలేదంటే...æ ఆరోజు అడవిలో ఎవరైనా దొంగలు దాడి చేసి తీసుకెళ్లారేమోనని పోలీసులతో చర్చించింది. జామిసన్ దంపతులకు మాడిసన్ కంటే ముందు ఒక కొడుకు కూడా ఉన్నాడు. తన కోకోటన్ దగ్గర పెరిగేవాడు.
మరోవైపు అదే కారులో దొరికిన ఒక డైరీలో షెరిలిన్ – బాబీ ప్రవర్తన గురించి రాసుకుంది. బాబీ ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తున్నాడని, అప్పుడే ప్రేమ, అప్పుడే ద్వేషంతో విచిత్రంగా ప్రవర్తిస్తాడని స్వయంగా షెరిలిన్ రాయడంతో బాబీనే అడవిలోకి తీసుకెళ్లి భార్య, కూతుర్ని చంపేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడేమోనన్న కథనాలు మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఇక వైద్యపరీక్షల్లోనూ అది హత్యా లేక ఆత్మహత్యా అనేది తేలలేదు.
కారులో అంత డబ్బు దొరికిందంటే, ఆ దంపతులు డ్రగ్స్ మాఫియాతో మారకద్రవ్యాల డీల్స్ చేసేవారేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. అంటే మాఫియానే తమ డీల్‌లో తేడా రావడంతో వారిని కడతేర్చిందా అనే ప్రశ్న పురుడుపోసుకుంది. మరోవైపు జామిసన్ దంపతులు ఆ కొండ ప్రాంతాల్లో 40 ఎకరాల స్థలం కొనడానికి అడ్వాన్స్ ఇచ్చారని, త్వరలోనే అక్కడికి షిప్ట్ అవ్వాలనేది వారి కోరికని, ఆ లొకేషన్ కోసమే ఆ రోజు వాళ్లు అక్కడికి వెళ్లారని కొందరు సన్నిహితులు చెప్పారు. అదలా ఉండగా వారు మిస్ అవ్వడానికి కొన్ని నెలల ముందు బాబీ తమ పొరుగువారితో ‘మా ఇంట్లో చాలా దయ్యాలున్నాయి. అవి మమ్మల్ని బాగా ఇబ్బందిపెడుతున్నాయి.. మా ప్రాణాలకే ప్రమాదంలా ఉంది’ అని చెప్పాడట. ఇదే విషయం కోకోటన్ ని అడిగితే, ‘గతంలో ఒకసారి వారి ఇంటికి వెళ్లినప్పుడు నేను కూడా ఆ దయ్యాల ఉనికి గుర్తించాను, చాలా భయపడ్డాను’ అని గుర్తు చేసుకుంది. దాంతో ఈ క్రైమ్ స్టోరీ ఉన్నపళంగా హారర్ రంగు పులుముకుంది. ఏది ఏమైనా, ఆ ముగ్గురూ ఎలా చనిపోయారు? చివరి ఫొటోలో పాప ఎందుకలా ఉంది? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు దొరకలేదు.
2009 అక్టోబర్ 8న అమెరికా, ఓక్లహోమాలోని యుఫాలాలో నివసించే జామిసన్ కుటుంబం కైమిచ్ పర్వతాల వైపు వెళ్లారు. మూడేళ్ల తర్వాత ఆ సమీపంలోనే అస్థిపంజరాలై దొరకడంతో ఈ ఉదంతం స్థానికంగా సంచలనం రేపింది. నేటికీ మిస్టరీగానే మిగిలింది. – సంహిత నిమ్మన
ఇవి చదవండి: Armand Duplantis: ఎవరికీ అందనంత ఎత్తుకు..
Comments
Please login to add a commentAdd a comment