ఓ సిటీలోని ఒక కాలనీలో..
‘మేజ్..అరటి పళ్లూ..’ అంటూ పళ్ల బండి తోసుకుంటూ ఓ బంగ్లా ముందు నుంచి వెళ్తున్నాడో వ్యక్తి.
‘రేయ్.. ఈ ఏరియాల నిన్నెప్పుడు జూడ్లే! యేడి నుంచి ఒచ్చినవ్ బే?’ అంటూ ఆ బంగ్లా ముందున్న ఒక నడి వయసు వ్యక్తి బెదిరింపు స్వరంతో అడిగాడు. అతని పేరు శంకర్. ఆ బంగ్లా యజమాని అయిన మల్లేశ్‌కి కుడి భుజం లాంటివాడు.
ఆ ప్రశ్నకు ఆ వ్యాపారి ఆ ఇంటి ముందు తన బండి ఆపి, తన పిల్లి గడ్డాన్ని సవరించుకుంటూ ‘నేను మార్కెట్ల పనిజేసే ఇమామ్ కజిన్‌ని భాయ్’ అని చెప్పాడు.
బండిలోంచి ఓ పండును తీసుకుంటూ ‘ఏ మార్కెట్లయినా ఈ శంకర్‌కి పహచానత్ ఉంటది. నాకు దెల్వని ఇమామ్.. గాయన కజిన్ ఏడికెంచొచ్చె..’ అన్నాడు అరటి పండు తొక్కతీస్తూ!
‘నాది కరీంనగర్. కామ్‌కే లియే భాయ్‌కే పాస్ ఆయా. భాయ్ ఈ మేజ్ బండి ఇప్పిచ్చిండు’ చెప్పాడు ఇమామ్ కజిన్ అమాయకంగా.
‘అచ్ఛా..’ అని అరటి పండు తింటూ ఇమామ్ కజిన్‌ని ఇంకేదో అడగబోతుండగా.. అప్పుడే రాజ్‌దూత్ మీద ఎవరో ఆ ఇంటికి వచ్చేసరికి అరటి పండు తొక్కను అదే బండిలో విసిరేసి లోపలకు వెళ్లిపోయాడు శంకర్.
పది రోజులు గడిచాయి..
ఇమామ్ కజిన్ రోజూ ఆ కాలనీకి వస్తున్నాడు అరటి పండ్ల బేరానికి. కాలనీ అంతా తిరిగి మల్లేశ్ ఇంటి ముందున్న చెట్టు కిందే బండి పెట్టుకుంటున్నాడు చీకటి పడేవరకు. బంగ్లా యజమాని మల్లేశ్ ల్యాండ్ సెటిల్‌మెంట్లు, రియల్ ఎస్టేట్‌లో ఆరితేరినవాడు. వడ్డీ వ్యాపారి కూడా. ఆ పనుల్లో మల్లేశ్ సహాయార్థం బిజీ అయిపోయాడు శంకర్. ఇమామ్‌ని, అతని కజిన్‌ని పట్టించుకునే తీరికలో లేడు. ఆ పదిరోజుల్లో ఇమామ్ కజిన్.. ఆ బంగ్లా సెక్యురిటీ గార్డ్ లాంటివాడైన శ్రీశైలానికి అరటి పండ్లు ఇస్తూ, రిలీజైన సినిమాలు, చిరంజీవి డాన్స్‌లు, సంజయ్ దత్ యాక్షన్ గురించి మాట్లాడుతూ క్లోజ్ అయ్యాడు.
ఆ దోస్తానా ఎక్కడిదాకా వెళ్లిందంటే రెండు రోజులకోసారి ఆ ఇద్దరూ బిర్యానీ, మందు పార్టీ చేసుకునేదాకా! అయితే తాను ముస్లిం ధర్మాన్ని నిష్ఠగా పాటిస్తాడు కాబట్టి మందు ముట్టనని ముందే శ్రీశైలంతో చెప్పాడు ఇమామ్ కజిన్. ‘దాందేముంది భయ్యా.. నేను మందు తాగుతా.. నువ్వు కూల్‌డ్రింక్ సప్పరియ్’ అంటూ ఇమామ్ వ్రతం చెడకుండా జాగ్రత్తపడ్డాడు శ్రీశైలం. ఆ ఫ్రెండ్‌షిప్ అక్కడితోనే ఆగలేదు.. ఇమామ్ కజిన్‌కి మల్లేశ్ ముఖ్యమైన అనుచరులనూ పరిచయం చేసే వరకు వెళ్లింది.
తరచుగా వాళ్లనూ తమ పార్టీకి తీసుకొచ్చేవాడు శ్రీశైలం. తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో వాళ్లందరినీ ఆకట్టుకుంటూ వాళ్లకూ మాలిమయ్యాడు ఇమామ్ కజిన్. ఆ చనువుతో అతను తనకు కుదిరినప్పుడల్లా మల్లేశ్ ఇంటికి వెళ్లేవాడు వాళ్లను కలవడానికి. అలా ఇంకో పది రోజులు గడిచాయి. ఇప్పుడు అతను.. మల్లేశ్ ఇంటికి ఎన్ని ద్వారాలున్నాయి, ఆ ఇంట్లో ఏ మూల ఏం ఉంది.. మల్లేశ్ కుటుంబ సభ్యుల్లో ఎవరు ఏ గదిలో ఉంటారు లాంటి వివరాలన్నిటితో కళ్లు మూసుకుని ఆ ఇంటి నకలు గీసి చూపించగలడు!
ఇరవై రెండో రోజు..
రాత్రి ఇమామ్ కజిన్.. మల్లేశ్ అనుచరుల్లోని అతి విశ్వాసపాత్రులు, తన దోస్తులూ అయిన ఓ ఇద్దరికి దావత్ ఇచ్చాడు. తన భాయ్ ఇమామ్ తనకు పండ్ల దుకాణం పెట్టించబోతున్నాడనే ఖుష్ ఖబర్‌ను పంచుకుంటూ! ఆ అనుచరులిద్దరూ ఇమామ్ కజిన్‌ని గుండెకు హత్తుకున్నారు. అన్నేళ్ల నుంచి మల్లేశ్ ఇంట్లో ఉంటున్నా తమకు ఒరగని లాభాన్ని, చేస్తున్న చాకిరీని ఏకరువు పెట్టుకున్నారు. వచ్చిన నెలలోపే ఇమామ్ తన కజిన్‌కి దందా పెట్టివ్వడాన్ని పొగిడారు. అందుకు అర్హత సాధించిన ఇమామ్ కజిన్ నిజాయితీకి సలాం చేశారు. ఆ మత్తులో ఇంకా.. తమ బాస్ ఎలా సంపాదిస్తున్నాడో.. ఆ సంపదను దాచే ఆ ఇంట్లోని సీక్రెట్ ప్లేసెస్ ఏంటో డీటేయిల్డ్‌గా చెబుతూ మల్లేశ్ మీదున్న కసిని వెళ్లగక్కారు. అంతేకాదు ఆ రోజు ఉదయమే మల్లేశ్‌కున్న డెయిరీ ఫామ్‌లోని గడ్డివాముల్లో దాచిన డబ్బు సంగతీ చెప్పారు. నెమ్మదిగా కూల్‌డ్రింక్ సిప్ చేస్తూ విన్నాడు ఇమామ్ కజిన్!
తెల్లవారి..
ఆరు గంటలకు ఇన్‌కమ్ టాక్స్ సిబ్బంది ఆ సిటీలోని శంకర్ ఇల్లు సహా అతని స్థావరాలన్నిట్లోకి అడుగుపెట్టారు సెర్చ్ వారెంట్‌తో! ఇంటి గరాజ్‌లోని నేల మాళిగ, స్టోర్ రూమ్, డెయిరీ ఫామ్ గడ్డి వాములు.. అన్నిచోట్లా నాలుగు గంటల్లో.. లెక్క, పత్రాల్లేని ఆదాయం కొన్ని పదుల కోట్లలోనే దొరికింది. బంగారు ఆభరణాలు, బిస్కట్లు సహా!
ఇమామ్ లేడు..
ఇది దాదాపు 20 ఏళ్ల కిందటి సంగతి. మల్లేశ్ వాళ్ల కాలనీలోని ఒక గవర్నమెంట్ టీచర్ ఐటీ డిపార్ట్‌మెంట్‌కు అందించిన టిప్‌తో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది డిపార్ట్‌మెంట్. మామూలుగా ఆ కాలనీ అంతా మల్లేశ్ మనుషులే కాపలా కాస్తుంటారు. సాదాసీదా వ్యక్తిగా వెళితే వివరాలు దొరికే ఆస్కారం లేదు. అందుకే ఇమామ్ అనే ప్రాతను సృష్టించి, అతని కజిన్‌గా పెట్టుడు పిల్లి గడ్డంతో, అరపటి పండ్ల వ్యాపారిగా మల్లేశ్ ఉంటున్న కాలనీలోకి ఎంటర్ అయ్యాడు ఆ ఉద్యోగి. 20 రోజుల్లోనే మల్లేశ్ అనుచరులు అతని గురించిన సీక్రెట్స్ అన్నీ కక్కడంతో ఆ ఆపరేషన్ అనుకున్నదాని కంటే ముందే అయిపోయింది. ఆ రోజు రెయిడ్ చేయకపోతే మరుసటి రోజు గడ్డివాముల్లో దాచిన డబ్బు బెంగళూరుకు రవాణా అయిపోయేది. అదీ ఆ రాత్రి పార్టీలోనే తెలియడంతో వెంటనే రాత్రికిరాత్రే సెర్చ్ వారెంట్ సిద్ధమైపోయింది. రెయిడ్ సక్సెస్ అయింది.
(‘ద రెయిడ్’ అనే కొత్త శీర్షిక కింద.. ఓ వాస్తవ సంఘటనకు కాస్త ఫిక్షన్‌ను జోడించి రాసిన కథనం ఇది. అందుకే ఊరు పేరు ఇవ్వలేదు. వ్యక్తుల పేర్లు మార్చాం. ఇక నుంచి వారం వారం ఇక్కడ ఇలాంటి ఆసక్తికర కథనాన్ని చదవొచ్చు.) – శరాది
ఇవి చదవండి: దయ్యాల పండుగ..! ఒక రకంగా ఇది..?
Comments
Please login to add a commentAdd a comment