పూలతోటలు పెంచడం, దైవారాధనలోను, గృహాలంకరణలోను పూలను ఉపయోగించడం దాదాపు ప్రతి దేశంలో ఉన్న వ్యవహారమే! మన దేశంలోనైతే మహిళలు పూలను సిగలో కూడా ధరిస్తారు. ప్రాచీన సంస్కృతుల ప్రభావం గల కొన్ని ఇతర దేశాల్లోనూ మహిళలు పూలను తమ అలంకరణలో భాగంగా ఉపయోగిస్తుంటారు. మన దేశంలో పండుగల్లో పూలను విరివిగా వినియోగిస్తారు గాని, పూల కోసం ప్రత్యేకమైన పండుగ ఏదీ లేదు.
అయితే, కొలంబియాలో మాత్రం పూల కోసమే ప్రత్యేకమైన పండుగ ఉంది. ఇది ఒకరోజు పండుగ కాదు, ఏకంగా పదిరోజులు జరుపుకొనే భారీ వేడుక. ఏటా ఆగస్టు 2 నుంచి 11 వరకు ఈ పండుగ జరిగినన్ని రోజులూ కొలంబియాలో ఊరూ వాడా ఎటు చూసినా రంగు రంగుల పూల సోయగాలు కనువిందు చేస్తాయి. చిత్రవిచిత్రమైన పుష్పాలంకరణలు చూపరులను కట్టిపడేస్తాయి.
కొలంబియా వాసులు ఈ పండుగను ‘ఫెరియా డి లాస్ ఫ్లోరెస్’ అని పిలుచుకుంటారు. కొలంబియాలో అత్యంత ప్రాధాన్యమున్న సాంస్కృతిక వేడుకల్లో ఈ పూల పండుగ ఒకటి. వర్ణ మహోత్సవంలా సాగే ఈ పూల పండుగను తిలకించడానికి పెద్దసంఖ్యలో విదేశీ పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు. ఈ పండుగలో భాగంగా జరిగే ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కొలంబియా రాజధాని బొగోటాలోని చరిత్రాత్మక కట్టడం ‘ఎల్ ఒబెలిస్కో’ వద్ద పూలబుట్టలతో, పూలతో అలంకరించిన వాహనాలతో జనాలు పెద్దసంఖ్యలో చేరుకుని, అక్కడ సంగీత కార్యక్రమం నిర్వహించడంతో ఈ పూల పండుగ సంబరాలు మొదలవుతాయి.
ఈ సందర్భంగా వీథుల్లో పూలతో భారీ పరిమాణంలో నిర్మించిన జంతువులు, పక్షుల విగ్రహాలు సందర్శకులకు స్వాగతం పలుకుతాయి. వివిధ సాంస్కృతిక కేంద్రాల్లోను, ప్రధాన కూడళ్లలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వేదికలపైన సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు జరుగుతాయి. ముగింపు రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పూల రైతులు తమ తమ తోటల్లో పూసిన పూలను బుట్టల్లో నింపుకుని, వాటిని వీపున కట్టుకుని ‘సిలెటరోస్ పరేడ్’ ఊరేగింపును నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment