మన ముచ్చట
పురాణాల ప్రకారం, అమ్మవారిని ఆరాధించే దేవాలయాలలో ప్రశస్తమైనవి అష్టాదశ శక్తిపీఠాలు. శివుడి అర్ధాంగి సతీదేవి శరీరం 18 ముక్కలై, 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ శక్తిపీఠాలను దర్శించుకుని, అమ్మవార్ల అనుగ్రహం పొందాలని భక్తులు భావిçస్తుంటారు. రకరకాల కారణాల వల్ల కొంతమందికి శక్తిపీఠాల దర్శనభాగ్యం కరవవుతోంది. అలాంటివారికి అన్ని శక్తిపీఠాలను ఒకేచోట దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తూ అష్టాదశ శ«క్తిపీఠాలన్నిటినీ ఒకే దగ్గర నిర్మించారు.
అది ఎక్కడో కాదు తెలంగాణ, సిద్దిపేట జిల్లా, కొండపాక గ్రామ శివారులోని ఆనంద నిలయంలో! గత ఏడాది నవంబరులో.. ఇక్కడి అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో 18 శక్తిపీఠాలతో పాటు లక్ష్మీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివపార్వతులనూ ప్రతిష్ఠించారు.
గట్టు రాంరాజేశం గుప్త సంకల్పంతో..
సిద్దిపేటకు చెందిన గట్టు రాంరాజేశం గుప్త అమ్మవారికి అపర భక్తుడు. అష్టాదశ శక్తి పీఠాలన్నిటినీ ఒకే దగ్గర నిర్మించాలని ఆయన చిరకాల కోరిక. ఒకసారి, తన మనసులో మాటను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆనంద నిలయ వ్యూహకర్త కేవీ రమణాచారి ముందుంచారు. ఆయన ట్రస్ట్ సభ్యులతో చర్చించి, ఆనంద నిలయంలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా రాంరాజేశం రూ. 1.5 కోట్లను అందజేశారు. ఆనంద నిలయం వృద్ధాశ్రమ ట్రస్ట్ సభ్యులు, ఇతర దాతల సహకారంతో మొత్తం రూ.10 కోట్ల వ్యయంతో దేవాలయాలను నిర్మించారు. అమ్మవార్ల రాతి విగ్రహాలను తమిళనాడులో తయారుచేయించారు. వీటిని పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి, శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ప్రతిష్ఠించారు.
22 దేవాలయాలు..
పద్దెనిమిది శక్తిపీఠాల్లో పదిహేడు మనదేశంలో ఉండగా, శాంకరీదేవి శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంది. మన దేశంలో ఉన్న కామాక్షీదేవి (కంచి, తమిళనాడు), శృంఖలాదేవి (కోల్‌కతా, పశ్చిమబెంగాల్), చాముండేశ్వరీదేవి (మైసూరు, కర్ణాటక), జోగులాంబ (ఆలంపూర్, తెలంగాణ), భ్రమరాంబికాదేవి (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్), మహాలక్ష్మీదేవి (కొల్హాపూర్, మహారాష్ట్ర), ఏకవీరాదేవి (మాహుర్, మహారాష్ట్ర), మహాకాళీదేవి (ఉజ్జయిని, మధ్యప్రదేశ్), పురుహూతికాదేవి (పిఠాపురం, ఆంధ్రప్రదేశ్), గిరిజాదేవి (జాజ్‌పూర్, ఒడిశా), మాణిక్యాంబాదేవి (ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్), కామాఖ్యాదేవి ( గౌహతి, అస్సాం), మాధవేశ్వరీదేవి (ప్రయాగ, ఉత్తరప్రదేశ్), వైష్ణవీదేవి (జమ్మూ, జమ్మూ– కశ్మీర్ రాష్ట్రం), మంగళగౌరీదేవి (గయ, బిహార్), విశాలాక్షీ (కాశి), సరస్వతీదేవి (శ్రీనగర్) రూపాలను కొండపాక శివారులోని ఆనంద నిలయంలో దర్శించుకోవచ్చు. ఇదే ప్రాంగణంలో లక్ష్మీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మరకత లింగం, శివపార్వతులతో కూడిన 22 దేవాలయాలను నిర్మించడం విశేషం. ఆయా శక్తిపీఠాల్లో జరిగినట్లుగానే ఇక్కడా పూజాకార్యక్రమాలుంటాయి. ప్రతి పౌర్ణమికి హోమం, ప్రతి శుక్రవారం అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేస్తారు. దర్శనానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు.
సామాజిక సేవ.. ఆధ్యాత్మిక శోభ!
ఆనంద నిలయంలో సామాజిక సేవతోపాటు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. సుమారు వంద ఎకరాల్లోని ఈ ట్రస్ట్‌లో ఒకవైపు వృద్ధాశ్రమం, మరోవైపు అనాథాశ్రమం, ఇంకోవైపు సత్యసాయి పిల్లల హృద్రోగ ఆసుపత్రి, జూనియర్ కళాశాల ఉన్నాయి. భక్తులు, సామాజిక సేవకుల సందర్శనతో ఈ ప్రాంగణమంతా సందడిగా ఉంటుంది. ఇది హైదరాబాద్‌కు 73 కిలోమీటర్లు, సిద్దిపేటకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట, ఫొటోలు: కె సతీష్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్
శక్తిపీఠాల్లో జరిగినట్టుగానే..
ఇక్కడ పూజాకార్యక్రమాలన్నిటినీ శక్తిపీఠాల్లో మాదిరే జరుపుతాం. భక్తులు అమ్మవార్లకు ఒడి బియ్యం పోస్తారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక అలంకరణ ఉంటుంది. ప్రతిరోజు శివుడికి, మరకత లింగానికి రుద్రాభిషేకం చేస్తాం. – పురుషోత్తమ రామానుజ, అర్చకుడు
అందరికీ దర్శనభాగ్యం కలగాలని..
అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకోవటం కొందరికి సాధ్యపడకపోవచ్చు. అలాంటివారికి శక్తిపీఠాల దర్శనభాగ్యం అందాలనేది నాన్నగారి కోరిక. కేవీ రమణాచారి, ఇంకెంతో మంది దాతల సహకారంతో నేడు అది నెరవేరింది. – గట్టు అమర్‌నాథ్, రవి, శ్రీనివాస్
అమ్మవారి అనుగ్రహం..
కొండపాకలో అష్టాదశ శక్తిపీఠాల నిర్మాణం అమ్మవారి దయ. అమ్మవారి అనుగ్రహం, అందరి సహకారంతో దేవాలయ నిర్మాణాలు సాధ్యమయ్యాయి. – డాక్టర్ కేవీ రమణాచారి, ఆనంద నిలయ వ్యూహకర్త
ఇవి చదవండి: అవును..! వారిది గుర్తింపు కోసం ఆరాటమే..
Comments
Please login to add a commentAdd a comment