మన ముచ్చట
తెలంగాణలోని రాతి కోటల్లో వరంగల్, భువనగిరి కోటల తర్వాత చెప్పుకోదగ్గది గాంధారి ఖిల్లా. అపారమైన బొగ్గు నిక్షేపాలతో విరాజిల్లుతున్న మంచిర్యాల జిల్లాలో.. వేల సంవత్సరాల క్రితమే మానవ జీవనం ఉన్నట్లు తెలియజేసే సజీవ సాక్ష్యం ఈ గాంధారి ఖిల్లా. మంచిర్యాల పట్టణానికి పన్నెండు కి.మీ. దూరంలో మందమర్రి మండలం, బొక్కలగుట్ట అడవుల్లో ఈ కోట ఉంది. గుట్టపైన నాగశేషుడి ఆలయం, శివుడు, ఏనుగు, విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, కాలభైరవుడి విగ్రహాలు, ద్వారాలు, దేవతా మూర్తుల ప్రతిమలు ఉన్నాయి. శత్రువుల రాకను పసిగట్టే నగారా గుండూ కనిపిస్తుంది. కొండను తొలిచి నిర్మించిన నాగశేషుడి ఆలయం, కాలభైరవ విగ్రహాలు ఆకర్షిస్తాయి. గుట్ట పైన ‘సవతుల బావులు’, కాలువలు ఉన్నాయి. కింద నీటి చెలమలో ఎండాకాలంలోనూ నీటి ఊట పైకి వస్తుంది.
చారిత్రక వైభవం..
అరుదైన గోండ్వానా రాతి గుట్టలపైన మానవ నిర్మిత నీటి గుండాలతో అద్భుతమైన చారిత్రక సంపద కనిపిస్తుంది. ఈ గుట్టలను ఎవరు తొలిచారనేదానికి స్పష్టతలేదు. పూర్వయుగపు పనిముట్లు, చిత్రలేఖనాలు చరిత్రకారులకు లభ్యమయ్యాయి. కొన్ని ఆధారాల ప్రకారం ఆరవ శతాబ్దంలో కందారపురం పేరుతో గాంధారి కోట రాజధానిగా సోమదేవరాజు రాజరికం చేశారని తెలుస్తోంది. ఆయన కొడుకు మాధవ వర్మ కాకతీయుల మూల పురుషుడనే ప్రస్తావన సిద్ధేశ్వర, ప్రతాప చరిత్రలో ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు. రాష్ట్రకూటుల సామంతుడైన మేడరాజు ఈ గాంధారి కోటను పటిష్ఠం చేశాడు. ఆయన పేరుతో ఉన్న మేడ చెరువు నేటికీ కనిపిస్తుంది. పద్మనాయక రాజులు రాచకొండ కేంద్రంగా పాలిస్తూ, వైష్ణవమతం వ్యాప్తికోసం పెద్దిరాజు అనంతరాజు, రఘు నాయకులు కోటలో హనుమంతుడి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. దీన్ని ధ్రువీకరించే 15వశతాబ్దపు తెలుగు శాసనం ఉంది. పెద్దిరాజును పాండవుల పెద్దనాన్న ధృతరాష్ట్రుడిలా, పెద్దమ్మను ధృతరాష్ట్రుడి భార్య గాంధారిలా భావించి, ఈ కోటను ‘గాంధారి కోట’గా పిలిచారని చరిత్రకారుల అభిప్రాయం. క్రీ.శ.1300లో కథాగేయంగా ‘గాంధారి కథ’ రచన చేసినట్లు చరిత్రకారులు గుర్తించారు. కాని కవి విషయంలో స్పష్టత లేదు. నిజాం కాలంలో పన్ను వసూళ్ల కోసం స్థానిక గోండు మొకాశీలను నియమించుకున్నట్లు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. 1928లో తొలిసారి గాంధారి కథను ప్రచురించినట్లు ఆధారాలున్నాయి. ఇప్పటికీ గిరిజన కథా గేయాల్లో, జానపదాల్లో ఈ కథ వినిపిస్తుంది.
అరుదైనది..
గుట్టను తొలిచి కట్టిన కోటగా గాంధారి ఖిల్లాకు దక్షిణ భారతదేశంలోనే ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ లోహయుగం నాటి ఆనవాళ్లున్నాయి.
కాకతీయ, రాష్ట్రకూటుల కాలం నాటి చారిత్రక సంపద ఉంది. ఇలాంటి అరుదైన కోటలను రక్షించుకుంటే చారిత్రక సంపదతోపాటు, పర్యాటక వనరులనూ కాపాడినట్లవుతుంది. – డా.ద్యావనపల్లి సత్యనారాయణ, తెలంగాణ చరిత్రకారుడు.
పర్యాటక కేంద్రంగా..
ఎంతో చరిత్ర కలిగిన గాంధారి ఖిల్లాను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధిపరచాలి. దానికి అవసరమైన ఏర్పాట్ల మీద ప్రభుత్వం దృష్టిపెట్టాలి. – మేసినేని రాజయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఆదివాసీ నాయకపోడ్ సాంస్కృతిక కళాభివృద్ధి సంఘం.
మాఘమాసం జాతర..
అనాదిగా గాంధారి ఖిల్లా నాయక్‌పోడ్ తెగకు ఆరాధ్య ప్రాంతంగా కొనసాగుతోంది. తెలంగాణలో ఇదొక ప్రధాన గిరిజన తెగ. వీరిక్కడ ప్రతి మాఘమాసం (ఫిబ్రవరి) భక్తి, శ్రద్ధలతో జాతర జరుపుతారు. ఇది మూడురోజులు సాగుతుంది. మొదటిరోజు సాయంకాలం దేవతా మూర్తులను సదర్‌భీమన్న నుంచి గోదావరికి తీసుకొచ్చి, స్నానం చేయిస్తారు. ఆ రాత్రి ఆటపాటలతో గడిపి, మరుసటిరోజు మధ్యాహ్నం డప్పు చప్పుళ్లతో జాతర ప్రాంతానికి తీసుకెళ్తారు. చివరిరోజు ఖిల్లా పైభాగంలో ఉన్న మైసమ్మ తల్లి వద్ద పట్నాలు వేసి, నైవేద్యం పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. చరిత్రలో నాటి పాలకులు గాంధారి ఖిల్లాను అష్టదిగ్బంధనం చేసిన ఆనవాళ్లున్నాయి. దాని గుర్తుగా పాలకాయలు (కొబ్బరికాయలు), కోడిగుడ్లు, మేకలు, కోళ్లు (గతంలో దున్నపోతులను) బలి ఇచ్చే సంప్రదాయం నేటికీ ఈ జాతరలో కొనసాగుతోంది. దీనికి నాయక్‌పోడ్‌లే ప్రధాన పూజారులు. ముగింపులో జీడికోట వద్ద జరిగే దర్బార్(సభ)లో గిరిజనుల కష్టసుఖాలు, గాంధారి ఖిల్లా అభివృద్ధిపై చర్చిస్తారు. ఈ జాతరకు మహారాష్ట్ర నుంచి కూడా గిరిజనులు వస్తారు. జాతర తిరుగువారం మాత్రం నాయకపోడ్‌లే జరుపుకుంటారు.
ప్రకృతి రమణీయతకు నెలవు..
మంచిర్యాల వరకు రైల్లో వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఈ కోటను చేరుకోవచ్చు. గుట్టపైకి మాత్రం కాలినడకనే వెళ్లాలి. కోట పరిసర ప్రాంతంలో చెప్పులతో అనుమతించరు. చుట్టూ అడవి, కాలువలు, చెరువులతో రమణీయంగా ఉంటుందీ ప్రాంతం. వన్యప్రాణుల నిలయం. ట్రెక్కింగ్‌కి అనువైన చోటు. పర్యాటకుల సౌకర్యాల కోసం ప్రణాళికలు వేసినా, అవి ముందుకు సాగలేదు. ఎన్‌హెచ్ 363ని ఆనుకుని గాంధారి వనం పేరుతో అటవీ శాఖ ఓ పార్కును అభివృద్ధి చేసింది. ప్రస్తుతం సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్, వెడ్డింగ్ షూట్‌లు జరుగుతున్నాయి. ‘పరేషాన్’ అనే సినిమాలో టైటిల్ సాంగ్ ‘గాంధారి ఖిల్లా కత్తవా’ అంటూనే మొదలవుతుంది. – ఆకుల రాజు, సాక్షి ప్రతినిధి, మంచిర్యాల
ఇవి చదవండి: Health: అంతా మెదడులోనే ఉంది..
Comments
Please login to add a commentAdd a comment