gandhari
-
ఓ తల్లి ప్రతీకారం
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అటు హీరోయిన్గా ఇటు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు తాప్సీ. తాజాగా ఆమె ప్రధానపాత్రలో నటిస్తున్న హిందీ చిత్రం ‘గాంధారి’. దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కనికా థిల్లాన్ కథ అందించడంతోపాటు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లోపాల్గొన్నారట తాప్సీ. తల్లీకూతుళ్ల అనుబంధం, ఓ తల్లి ప్రతీకారం అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం.కిడ్నాప్ అయిన తన కుమార్తెను కాపాడుకునేందుకు ఓ తల్లి చేసేపోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. వెండితెరపై తాప్సీ తల్లిపాత్రలో కనిపించనున్న తొలి చిత్రం ఇదే. త్వరలో ‘గాంధారి’ సినిమా విడుదల తేదీని ప్రకటించనుంది యూనిట్. ఇదిలా ఉంటే... తాప్సీ ఓ ప్రధానపాత్రలో నటించి, కనికా థిల్లాన్ కథ అందించిన ‘హసీన దిల్రుబా’, ఫిర్ ఆయీ హసీన దిల్ రుబా’లకు మంచి స్పందన లభించింది. దీంతో వీరి కాంబినేషన్లో రూపొందుతున్న ‘గాంధారి’పై బాలీవుడ్లో మంచి అంచనాలున్నాయి. -
రాతి కోటల్లో.. గాంధారి ఖిల్లా!
తెలంగాణలోని రాతి కోటల్లో వరంగల్, భువనగిరి కోటల తర్వాత చెప్పుకోదగ్గది గాంధారి ఖిల్లా. అపారమైన బొగ్గు నిక్షేపాలతో విరాజిల్లుతున్న మంచిర్యాల జిల్లాలో.. వేల సంవత్సరాల క్రితమే మానవ జీవనం ఉన్నట్లు తెలియజేసే సజీవ సాక్ష్యం ఈ గాంధారి ఖిల్లా. మంచిర్యాల పట్టణానికి పన్నెండు కి.మీ. దూరంలో మందమర్రి మండలం, బొక్కలగుట్ట అడవుల్లో ఈ కోట ఉంది. గుట్టపైన నాగశేషుడి ఆలయం, శివుడు, ఏనుగు, విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, కాలభైరవుడి విగ్రహాలు, ద్వారాలు, దేవతా మూర్తుల ప్రతిమలు ఉన్నాయి. శత్రువుల రాకను పసిగట్టే నగారా గుండూ కనిపిస్తుంది. కొండను తొలిచి నిర్మించిన నాగశేషుడి ఆలయం, కాలభైరవ విగ్రహాలు ఆకర్షిస్తాయి. గుట్ట పైన ‘సవతుల బావులు’, కాలువలు ఉన్నాయి. కింద నీటి చెలమలో ఎండాకాలంలోనూ నీటి ఊట పైకి వస్తుంది.చారిత్రక వైభవం..అరుదైన గోండ్వానా రాతి గుట్టలపైన మానవ నిర్మిత నీటి గుండాలతో అద్భుతమైన చారిత్రక సంపద కనిపిస్తుంది. ఈ గుట్టలను ఎవరు తొలిచారనేదానికి స్పష్టతలేదు. పూర్వయుగపు పనిముట్లు, చిత్రలేఖనాలు చరిత్రకారులకు లభ్యమయ్యాయి. కొన్ని ఆధారాల ప్రకారం ఆరవ శతాబ్దంలో కందారపురం పేరుతో గాంధారి కోట రాజధానిగా సోమదేవరాజు రాజరికం చేశారని తెలుస్తోంది. ఆయన కొడుకు మాధవ వర్మ కాకతీయుల మూల పురుషుడనే ప్రస్తావన సిద్ధేశ్వర, ప్రతాప చరిత్రలో ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు. రాష్ట్రకూటుల సామంతుడైన మేడరాజు ఈ గాంధారి కోటను పటిష్ఠం చేశాడు. ఆయన పేరుతో ఉన్న మేడ చెరువు నేటికీ కనిపిస్తుంది. పద్మనాయక రాజులు రాచకొండ కేంద్రంగా పాలిస్తూ, వైష్ణవమతం వ్యాప్తికోసం పెద్దిరాజు అనంతరాజు, రఘు నాయకులు కోటలో హనుమంతుడి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. దీన్ని ధ్రువీకరించే 15వశతాబ్దపు తెలుగు శాసనం ఉంది. పెద్దిరాజును పాండవుల పెద్దనాన్న ధృతరాష్ట్రుడిలా, పెద్దమ్మను ధృతరాష్ట్రుడి భార్య గాంధారిలా భావించి, ఈ కోటను ‘గాంధారి కోట’గా పిలిచారని చరిత్రకారుల అభిప్రాయం. క్రీ.శ.1300లో కథాగేయంగా ‘గాంధారి కథ’ రచన చేసినట్లు చరిత్రకారులు గుర్తించారు. కాని కవి విషయంలో స్పష్టత లేదు. నిజాం కాలంలో పన్ను వసూళ్ల కోసం స్థానిక గోండు మొకాశీలను నియమించుకున్నట్లు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. 1928లో తొలిసారి గాంధారి కథను ప్రచురించినట్లు ఆధారాలున్నాయి. ఇప్పటికీ గిరిజన కథా గేయాల్లో, జానపదాల్లో ఈ కథ వినిపిస్తుంది.అరుదైనది..గుట్టను తొలిచి కట్టిన కోటగా గాంధారి ఖిల్లాకు దక్షిణ భారతదేశంలోనే ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ లోహయుగం నాటి ఆనవాళ్లున్నాయి. కాకతీయ, రాష్ట్రకూటుల కాలం నాటి చారిత్రక సంపద ఉంది. ఇలాంటి అరుదైన కోటలను రక్షించుకుంటే చారిత్రక సంపదతోపాటు, పర్యాటక వనరులనూ కాపాడినట్లవుతుంది. – డా.ద్యావనపల్లి సత్యనారాయణ, తెలంగాణ చరిత్రకారుడు.పర్యాటక కేంద్రంగా..ఎంతో చరిత్ర కలిగిన గాంధారి ఖిల్లాను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధిపరచాలి. దానికి అవసరమైన ఏర్పాట్ల మీద ప్రభుత్వం దృష్టిపెట్టాలి. – మేసినేని రాజయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఆదివాసీ నాయకపోడ్ సాంస్కృతిక కళాభివృద్ధి సంఘం. మాఘమాసం జాతర..అనాదిగా గాంధారి ఖిల్లా నాయక్‌పోడ్ తెగకు ఆరాధ్య ప్రాంతంగా కొనసాగుతోంది. తెలంగాణలో ఇదొక ప్రధాన గిరిజన తెగ. వీరిక్కడ ప్రతి మాఘమాసం (ఫిబ్రవరి) భక్తి, శ్రద్ధలతో జాతర జరుపుతారు. ఇది మూడురోజులు సాగుతుంది. మొదటిరోజు సాయంకాలం దేవతా మూర్తులను సదర్‌భీమన్న నుంచి గోదావరికి తీసుకొచ్చి, స్నానం చేయిస్తారు. ఆ రాత్రి ఆటపాటలతో గడిపి, మరుసటిరోజు మధ్యాహ్నం డప్పు చప్పుళ్లతో జాతర ప్రాంతానికి తీసుకెళ్తారు. చివరిరోజు ఖిల్లా పైభాగంలో ఉన్న మైసమ్మ తల్లి వద్ద పట్నాలు వేసి, నైవేద్యం పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. చరిత్రలో నాటి పాలకులు గాంధారి ఖిల్లాను అష్టదిగ్బంధనం చేసిన ఆనవాళ్లున్నాయి. దాని గుర్తుగా పాలకాయలు (కొబ్బరికాయలు), కోడిగుడ్లు, మేకలు, కోళ్లు (గతంలో దున్నపోతులను) బలి ఇచ్చే సంప్రదాయం నేటికీ ఈ జాతరలో కొనసాగుతోంది. దీనికి నాయక్పోడ్లే ప్రధాన పూజారులు. ముగింపులో జీడికోట వద్ద జరిగే దర్బార్(సభ)లో గిరిజనుల కష్టసుఖాలు, గాంధారి ఖిల్లా అభివృద్ధిపై చర్చిస్తారు. ఈ జాతరకు మహారాష్ట్ర నుంచి కూడా గిరిజనులు వస్తారు. జాతర తిరుగువారం మాత్రం నాయకపోడ్లే జరుపుకుంటారు.ప్రకృతి రమణీయతకు నెలవు..మంచిర్యాల వరకు రైల్లో వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఈ కోటను చేరుకోవచ్చు. గుట్టపైకి మాత్రం కాలినడకనే వెళ్లాలి. కోట పరిసర ప్రాంతంలో చెప్పులతో అనుమతించరు. చుట్టూ అడవి, కాలువలు, చెరువులతో రమణీయంగా ఉంటుందీ ప్రాంతం. వన్యప్రాణుల నిలయం. ట్రెక్కింగ్‌కి అనువైన చోటు. పర్యాటకుల సౌకర్యాల కోసం ప్రణాళికలు వేసినా, అవి ముందుకు సాగలేదు. ఎన్‌హెచ్ 363ని ఆనుకుని గాంధారి వనం పేరుతో అటవీ శాఖ ఓ పార్కును అభివృద్ధి చేసింది. ప్రస్తుతం సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్, వెడ్డింగ్ షూట్లు జరుగుతున్నాయి. ‘పరేషాన్’ అనే సినిమాలో టైటిల్ సాంగ్ ‘గాంధారి ఖిల్లా కత్తవా’ అంటూనే మొదలవుతుంది. – ఆకుల రాజు, సాక్షి ప్రతినిధి, మంచిర్యాలఇవి చదవండి: Health: అంతా మెదడులోనే ఉంది.. -
యాక్షన్ గాంధారి
తాప్సీ ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా హిందీ చిత్రానికి ‘గాంధారి’ టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహిస్తున్నారు. ‘గాంధారి’ సినిమాకు కనికా థిల్లాన్ కథ అందించడంతోపాటు నిర్మిస్తున్నారు. తల్లీకూతుళ్ల అనుబంధం, ఓ తల్లి ప్రతీకారం అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ సమాచారం.కాగా తాప్సీ ఓ ప్రధానపాత్రలో నటించి, కనికా థిల్లాన్ కథ అందించిన ‘హసీనా దిల్రుబా’, ‘ఫిర్ ఆయీ హసీనా దిల్ రుబా’లకు వీక్షకుల నుంచి మంచిపాజిటివ్ రెస్పాన్స్ లభించింది. దీంతో వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న ‘గాంధారి’పై బాలీవుడ్లో అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ‘గాంధారి’ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ΄్లాట్‌ఫామ్‌లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. -
ఆ పాట ఓ ప్రయోగంలా అనిపించింది: కీర్తి సురేష్
Keerthy Suresh Speech At Gandhari Song Launch Event: హీరోయిన్ కీర్తీ సురేష్ నటించిన తొలి మ్యూజికల్ వీడియో ‘గాంధారి’ విడుదలైంది. సోనీ మ్యూజిక్, ది రూట్ అసోసియేషన్‌లో రూపొందిన పాట ఇది. పవన్ సీహెచ్ స్వరపరచిన ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించగా, అనన్య భట్ పాడారు. బృందా మాస్టర్ దర్శకత్వం వహించి, కొరియోగ్రఫీ చేశారు ‘గాంధారి.. గాంధారి.. నీ మరిది.. గాంధారి.. దొంగ చందమామలా ఒంగి చూసిండే’ అంటూ ఈ పాట సాగుతుంది. ఈ పాట ఆవిష్కరణ సందర్భంగా కీర్తీ సురేష్ మాట్లాడుతూ – ‘‘గాంధారి’లాంటి మ్యూజిక్ వీడియో చేయడం ఓ ప్రయోగంలా అనిపించింది. రెండు రోజుల్లోనే ఈ పాటను పూర్తి చేశాం. బృందా మాస్టర్‌గారు కొరియోగ్రఫీ చేసిన పాటలు చేశాను. ఇప్పుడు ఆమె దర్శకత్వంలోనూ వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ‘సారంగ దరియా’ పాట తర్వాత ఈ ‘గాంధారి’ సాంగ్‌తో మ్యూజిక్ డైరెక్టర్‌గా పవన్ సి.హెచ్ మరో హిట్ అందుకున్నారు’’ అన్నారు. ‘‘కీర్తి అద్భుతంగా డ్యాన్స్ చేసింది. కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా ఎంజాయ్ చేస్తూ ఈ పాట చేశాను’’ అన్నారు బృంద. సంగీతదర్శకుడు పవన్, రూట్ ప్రతినిధి ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు. చదవండి: (పాన్ ఇండియాగా రామ్ మూవీ.. హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ !) -
సందేశమే ఆమె సినిమా
డ్రగ్స్‌కు అలవాటుపడి, కన్నవారికి కష్టంగా మారిన బిడ్డల్లో మార్పు తీసుకురావడానికి సందేశాత్మక చిత్రాల బాట పట్టారు కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన సరళారెడ్డి. ఇటీవల ‘ది ట్రిప్’ పేరుతో గంటన్నర నిడివి గల సినిమా తీసిన ఈ గృహిణి గతంలో ‘డాక్టర్ భూమి’ అనే షార్ట్ ఫిల్మ్ కూడా తీశారు. భర్త, కొడుకు, కోడలు ముగ్గురూ డాక్టర్లే. మరో కొడుకు విదేశాల్లో చదువుతున్నాడు. తమ ఇంటి డాక్టర్ల వద్దకు రకరకాల సమస్యలతో వచ్చేవారిని గమనించే సరళారెడ్డి, ఆ సమస్యల నుంచి షార్ట్, ఫుల్ లెంగ్త్ మూవీస్ తీస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వాళ్లది డాక్టర్ల ఫ్యామిలీ. నిత్యం ఎంతోమందికి వైద్యం అందించే కుటుంబం. రకరకాల వ్యక్తులు వస్తుంటారు. వాళ్ల వ్యథలు, గాథలను స్వయంగా చూసిన ఆ ఇల్లాలు చెడు మీద యుద్ధం చేయాలనుకున్నారు. యుద్ధమంటే కొట్లాట కాదు. చెడు అలవాట్ల బారిన పడి, కన్నవారికి కష్టంగా మారిన బిడ్డల్లో మార్పు తీసుకురావడానికి సందేశాత్మక చిత్రాల బాట పట్టారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన సరళారెడ్డి భర్త డాక్టర్ రాజమౌళి అక్కడే ఆస్పత్రి నిర్వహిస్తారు. కొడుకు, కోడలు, అల్లుడు ఇలా అందరూ డాక్టర్లే. మరో కొడుకు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్నాడు. తమ కుటుంబం సంతోషంగా ఉంది. కాని సమాజంలో చాలా రకాల రుగ్మతలతో సతమతమవడాన్ని చూస్తున్న సరళారెడ్డి తన వంతుగా ఏదైనా చేయాలని భావించారు. సరళారెడ్డి రూపొందించిన ‘ది ట్రిప్’ సినిమా; ‘డాక్టర్ భూమి’ సినిమా డ్రగ్స్.. ది ట్రిప్ మొదటి నుంచి తనకు సాహిత్యంపై అవగాహన ఉంది. కథలు చదవడం, రాయడం అలవాటు. సినీ పరిశ్రమలో కొందరు స్నేహితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో సమాజానికి ఉపయోగపడే విధంగా తన ఆలోచనలు సాగాయి. ఆ ఆలోచనల్లో నుంచి పుట్టిందే సందేశాత్మక చిత్రాలు తీయడం. ఇటీవలి కాలంలో గొప్పింటి బిడ్డలు డ్రగ్స్‌కు అలవాటు పడిన సంఘటనలను చూసి చలించి ‘ది ట్రిప్’ పేరుతో గంటన్నర నిడివి గల ఓ సినిమాను తీశారు. ఎదిగిన కొడుకు దారి తప్పితే తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. బిడ్డను దారికి తీసుకురావడానికి తల్లి పడిన తపనను కళ్లకు కట్టినట్టు చూపారు. డ్రగ్స్‌కు బానిసలుగా మారిన వారు ఆ సినిమా చూస్తే ఎంతో కొంత మార్పు కనిపిస్తుంది. ఈ సినిమాలో తన కొడుకు గౌతమ్ రాజ్‌ను హీరోగా పెట్టి తీశారు. గౌతం రాజ్ జర్మనీలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. డాక్టర్ భూమి రోడ్డు ప్రమాదంలో గాయపడిన గర్భిణి బిడ్డను ప్రసవించి ప్రాణం కోల్పోయింది. అనాథగా మారిన ఆ బిడ్డను అక్కున చేర్చుకుని పెంచి పెద్ద చేస్తుంది డాక్టర్ భూమి. పేదల కోసం తపించే మనస్తత్వమే ఆ బిడ్డను చేరదీసేలా చేసింది. మరో సంఘటనలో తల్లిని కోల్పోయిన ఓ యాచకురాలి కూతుర్ని తీసుకువచ్చి పెంచుతుంది. అయితే కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న తన కొడుకు తనకు ఓ బెగ్గర్ చెల్లిగా రావడాన్ని తట్టుకోలేడు. తోటి స్నేహితులు హేళన చేస్తుంటే భరించలేకపోతాడు. ఆ పాపను తనకు చెల్లిగా అంగీకరించలేకపోతాడు. ‘అన్నయ్యా’ అనే మాట అంటే చాలు పళ్లు కొరుకుతాడు. ఓ రోజు తల్లితో గొడవ పడి ఇంటి గడప దాటి వెళతాడు. తల్లి మీద కోపంతో ఓ పార్కులో కూర్చుని ఉన్న బాబును తన తల్లితో కలిసి పనిచేసే ఓ డాక్టర్ చూసి పలకరిస్తే బెగ్గర్ చెల్లిని తెచ్చిన తల్లిమీద తన కోపాన్ని వెళ్లగక్కుతాడు. అప్పుడు ఆ డాక్టర్ పన్నెండేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను వివరిస్తాడు. ఓ తల్లి బిడ్డను కన్న వెంటనే చనిపోయిన విషయం గురించి చెప్పి ‘ఆ బిడ్డ ఏమైందో తెలుసా?’ అని ప్రశ్నిస్తాడు. తెలియదంటే ‘ఆ బిడ్డవి నువ్వే’ అని డాక్టర్ చెప్పిన మాట విని బిత్తరపోతాడు. నీ కోసం తను పిల్లల్ని కనకుండా భర్తను ఒప్పించి మరీ ఆపరేషన్ చేయించుకుందని వివరించడంతో కనువిప్పు కలిగిన ఆ బాబు తల్లి దగ్గరకు వెళ్లి తన అనుచిత ప్రవర్తనకు క్షమాపణ కోరతాడు. ఈ సినిమాలకు కథ, మాటలు స్వయంగా తనే అందించారు. ఇలాంటి సందేశాత్మక సన్నివేశాలతో షార్ట్, ఫుల్‌లెంగ్త్ సినిమాలు నిర్మిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సరళారెడ్డి. మార్పు కోసమే ప్రయత్నం పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు పెరిగి పెద్దయ్యాక తమకు గొప్ప పేరు తేకున్నా ఫర్వాలేదు, కనీసం ఉన్న పేరు కాపాడితే చాలనుకుంటారు. కాని కొందరు పిల్లలు ముఖ్యంగా యువత చెడు వ్యసనాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎదిగిన కొడుకు దారితప్పాడని తెలిసి కన్నవారు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఒక్కోసారి దారి తప్పిన యువతను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ముఖ్యంగా మాదకద్రవ్యాలకు అలవాటు పడి బానిసలుగా మారుతున్న వారిని చూసి చలించిపోయి రాసిన కథ నుంచి పుట్టిందే ‘ది ట్రిప్.’ సందేశాన్ని ఇచ్చే సినిమాలు నిర్మించే ప్రయత్నం చేస్తున్నా. నా ప్రయత్నంతో కొందరిలోనైనా మార్పు వస్తే నా లక్ష్యం నెరవేరినట్టే. – సరళారెడ్డి, గాంధారి గ్రామం, కామారెడ్డి జిల్లా – ఎస్.వేణుగోపాల్‌చారి, కామారెడ్డి, సాక్షి -
పెళ్లి కాకుండానే గర్భం.. బిడ్డను కన్న కొద్దిసేపటికే బావిలో దూకి..
సాక్షి, కామారెడ్డి: అప్పుడే పుట్టిన శిశువును ముళ్ళ పొదల్లో వేసి, ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. బావిలో దూకి ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బీర్మల్ తండాలో చోటుచేసుకుంది. గ్రామంలోని దుర్గం చెరువు వద్ద ముళ్లపొదల్లో అప్పుడే పుట్టిన శిశువు లభ్యమైంది. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న గాంధారి ఎస్సై, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి సరస్వతి శిశువును కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నవజాత శిశువును పరీక్షించిన డాక్టర్ శ్రీనివాస్ శిశువును అబ్జర్వేషన్లో ఉంచారు. తండా వాసులు ఇచ్చిన సమాచారం ప్రకారం శిశువు తల్లి అవివాహిత కావడంతో పసికందును ముళ్లపొదల్లో వదిలేసి అమె బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా తల్లి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కదిలించిన ‘సాక్షి’ కథనాలు -
బావమరదళ్ల ఆత్మహత్యాయత్నం
సాక్షి, నిజామాబాద్ (గాంధారి): వారిద్దరు ప్రేమించుకున్నారు.. కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో యువతికి మరో వ్యక్తితో పెళ్లి ఖాయం చేయడంతో ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా, యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. గాంధారి మండలం పోతంగల్ కలాన్‌కు చెందిన గాండ్ల సాయికుమార్, కామారెడ్డి మండలం వడ్లూర్ గ్రామానికి చెందిన గాండ్ల రమ్య(19) కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరు వరుసకు బావమరదళ్లు అవుతారు. అయితే వీరి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. ఈ క్రమంలో రమ్యకు కుటుంబ సభ్యులు ఇటీవల మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. చదవండి: (సహోద్యోగిని స్నానం చేస్తుండగా వీడియో తీసి..) దీంతో ఆందోళన చెందిన ఆ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శనివారం ఇద్దరు కలిసి పురుగుల మందు తాగారు. అనంతరం కామారెడ్డికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఇద్దరూ బస్సులో అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన ప్రయాణికులు కండక్టర్‌కు తెలపడంతో వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలిసంచారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కామారెడ్డికి చేరుకుని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం చికిత్స పొందుతూ రమ్య మృతి చెందగా సాయికుమార్ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: (గుడికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు..) -
కలికి గాంధారివేళ
కలికి అంటే అందమైన స్త్రీ. గాంధారి చాలా అందగత్తెట. గుడ్డివాడు ధృతరాష్ట్రుడికిచ్చి చేశారు. మనసులో ఆమెకిష్టం లేదు చేసుకోవటం. కాని చేసుకొంది. చేసుకున్న క్షణం నుంచి తనను తాను హింసించుకోవటం మొదలుపెట్టింది. పతివ్రతా లక్షణం అని పైకి అందరూ అనుకోవటమేగాని లోలోపల అందరికీ తెలుసు, ఈమె వల్ల ధృతరాష్ట్రుడికి ఏ సాయం లేకపోగా, ఇంకో బరువు వచ్చి మీద పడిందని. మొగుడు గుడ్డివాడైనా, భార్యకు కళ్లుంటే వాడికీమె కళ్లతో సమానం. ఆ అదృష్టానికి నోచుకోలేదు ధృతరాష్ట్రుడు. ఈమె కళ్లకు గంతలు కట్టుకొని గుడ్డిదానిలా తయారైంది. మహారాజు, మహారాణి కాబట్టి రోజులు గడిచాయి. పదిమంది సేవకులు ఎప్పుడూ అందుబాటులో వుండేవారు. ఇది శబ్దమయ ప్రపంచం. ఎప్పుడూ శబ్దిస్తూనే వుంటుంది. పగలు చేసే రణగొణ ధ్వనులు ఎప్పుడూ మనకు వినపడుతోనే వుంటాయి. చీకటి పడుతున్నకొద్దీ మోతలు తగ్గుతవి. తగ్గినట్లుగా అనిపిస్తుంది. కాని భూమ్మీద సమస్త జంతుజాలమూ ఏదో శబ్దం చీకటి వేళ కూడా చేస్తూనే వుంటుంది. కుప్ప నూర్పిళ్ల కాలంలో రాత్రిళ్లు పొలంలో కాపలా పడుకునేవాళ్లకి తెలుసు ఈ సంగతి. గంట గంటకూ చెట్టుమీద గూడుకట్టుకొన్న పక్షులు పక్కకు ఒత్తిగిల్లుతుంటవి. రాత్రిపూట అల్లా ఒత్తిగిలుతున్నప్పుడు కువకువ శబ్దం వినవస్తుంది. తెల్లవారు జామున వినవచ్చేది కలకలారావం. రాత్రివేళ వాటి గొంతుల్లోంచి గురగురమని శబ్దం వినిపిస్తుంది. కాని ఒక సమయం వుంది. రాత్రి ఒంటిగంట రెండు మధ్య. అప్పుడు ఆకు కదలదు. గాలి వీచదు. ఒక్క పక్షి ఒత్తిగిలదు. గొంతు గురగుర అనదు. సమస్త ప్రాణికోటి సుషుప్తి అనుభవిస్తూ వుంటుంది. అప్పుడు గాంధారికి జాగ్రదవస్థ. లేచి కళ్లకు కట్టుకొన్న గంతలు విప్పదీసేది. స్నానానికి వెళ్లేది. అక్కడ సేవకురాండ్రు ఈమెకు స్నానం చేయించేవారు. స్నానం అయ్యాక కొత్త బట్టలు కట్టుకునేది. మళ్లీ కళ్లకు గంతలు కట్టుకునేది. యథాప్రకారం రోజువారీ కార్యక్రమాల్లో మొగుడితోపాటు పాల్గొనేది. ఇది రాణివాసంలో ప్రతి రాత్రివేళ నిత్యం జరిగేటిది. రహస్యంగా జరిగేటిది. బయటకు పొక్కే వీలులేదు. ఈ రహస్యం ధృతరాష్ట్రుడికిగాని, దుర్యోధనుడికిగాని, తెలియదు. భీష్ముడికి తెలియదు. విదురుడికి తెలియదు. ఒక్క మగవాళ్లకేంటి, ఆడవాళ్లకెవరికీ తెలియదు. కోడళ్లకెవరికీ తెలియదు. కుంతికి తెలియదు. వ్యాసుడికీ తెలియదట. తిక్కనకు అంతకంటే తెలియదట. మరెవరికి తెలుసు? స్నానం చేయించే ఆ సేవకురాండ్రకు తెలుసు. వాళ్లలో వాళ్లు ఉండబట్టలేక ఇంట్లో చెప్పుకునేవారు. అట్లా ఈ రహస్యం ఆ కుటుంబాల్లో ఒక తరం తరువాత ఇంకో తరానికి తెలివిడి పడుతూ వచ్చింది. రాజుల రాజ్యాలు మట్టిగొట్టుకు పోయాయి. వాళ్లు నామరూపాలు లేకుండా పోయారు. కాని అప్పటి పరిచారికలు చావకుండా ఈ గడ్డమీద బతికేవున్నారు. వాళ్ల సంతానం కొందరు బైండ్లవారయినారు. కొందరు బుడబుక్కల వారయినారు. చిందుభాగవతులయినారు. నానారకాలుగా జీవించటం మొదలుపెట్టారు. ‘‘ఈ కథ ఇట్లా మా బైండ్లవారి యింట్లో వుంది. దీన్ని మా ముత్తవ్వ నాకు జెప్పింది. నేను నీకు నేడు చెప్తున్నా. కలికి గాంధారివేళ అంటే ఏమిటో ఎరుక అయ్యెనా? మొత్తం ప్రపంచం అంతా ఏమాత్రం అలికిడి లేకుండా రాత్రి గాఢనిద్రలో మునిగిన వేళ కలికి గాంధారి లేచి స్నానం చేసేటిది. ఆ వేళని కలికి గాంధారి వేళ అంటారు.’’ (గుడిపూడి సుబ్బారావుకు ఒక బైండ్ల అతను చెప్పిన వివరం.) (సౌజన్యం: కృపావర్షం) -దీవి సుబ్బారావు -
మహా పతివ్రత గాంధారి
ఈ దేశంలో కొంతమంది స్త్రీల చరిత్ర పరిశీలిస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి ఉదాత్త స్త్రీలలో గాంధారి ఒకరు. ఆమె సుబలుడనే గాంధార రాజు కుమార్తె. మహా సౌందర్యవతి. మెరుపు తీగ. ఎక్కువ మంది సంతానం కలగాలని వరం పొందింది. సకల సుగుణ రాశి. చిత్రాంగదుడు, చిత్ర వీర్యుల దగ్గరనుంచీ ఎప్పుడూ సంతానం లేక కురువంశం బాధపడుతూ ఉండేది. కురువంశం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందని భీష్మాచార్యులవారు ఆమెను తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేయాలనుకున్నారు. ధృతరాజు పుట్టుకతో కళ్ళులేనివాడు. అటువంటి వ్యక్తిని అంత సౌందర్య రాశి ఎందుకు వివాహం చేసుకోవాలి? సుబలుడు అడిగాడు–‘అమ్మా! నీ కిష్టమేనా’ అని. ఆమె మామూలుగా అంగీకరించడం కాదు, అపారమైన ఔదార్యంతో అంగీకరించింది. ఎవరివలన అవతలివారి వంశం నిలబడితే, కళ్ళులేనివాడు తాను కూడా బిడ్డల్ని పొందానని సంతోషిస్తే అంతకన్నా తన జన్మకి సుకృతి ఏముంటుందని అంగీకరించింది. మహాతల్లి ఇంకా ఏమందో తెలుసా...‘‘నా భర్త ఏవి చూసి సంతోషించడంలేదో అవి చూసి నేను కూడా సంతోషించను..అని చెప్పి తన కళ్ళకు గుడ్డ కట్టేసుకుంది. భర్త పెను వేప విత్తు. పరమ దుష్ట ఆలోచనలున్నవాడు, పెద్ద కొడుకు దుర్యోధనుడు. నూరుగురు కొడుకులు. అల్లుడు సైంధవుడు, నీచుడు.. ఇంతమంది దుష్టుల మధ్యలో ఆమె పుటం పెట్టిన బంగారం. ఆమె ఔదార్యం ఎంతటిదంటే– ఒకనాడు ధృతరాష్టుడ్రు భార్యని పిలిచి అడిగాడు..‘‘పాండవులకు రాజ్యం ఇవ్వకుండా మన కుమారుడికి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను. పట్టమహిషివి. నీ అభిప్రాయం ఏమిటి?’’... ఆమె కుండబద్దలు కొట్టినట్లు జవాబిచ్చింది–‘‘ మహారాజా ‘ మీకడుపున పుట్టిన దుర్యోధనుడు పరమ నీచుడన్న విషయం మీకు తెలియదా! వాడు నీచుడని తెలిసీ, రాజ్యం ధర్మంగా రాదని తెలిసీ, పాండురాజు కొడుకైన ధర్మరాజుకు వెడుతుందని తెలిసీ ఎందుకు కుట్ర చేస్తారు? మీ తమ్ముడి బిడ్డలు మీ బిడ్డలు కారా? ధర్మరాజుకు దక్కవలసిన రాజ్యం అతనికి ఇవ్వలేరా? కొడుకు, కొడుకన్న పుత్ర వ్యామోహంలోపడి ఎందుకు పరుగెడుతుంటారు? మీరు చక్రవర్తులు, మీరెలా ఇవ్వాలనుకుంటే అలా ఇవ్వవచ్చు. ఈ కురు సామ్రాజ్యన్నంతటినీ ధర్మరాజుకు ధారాదత్తం చేస్తే ఎదురుపడి ఆపగలిగిన వాళ్లున్నారా? భీష్మద్రోణాదులు ధర్మపక్షాన నిలబడరా. దుర్యోధనుడు నిన్ను చెణకగలడా? వాడిని ధర్మరాజు దగ్గరపెడితే వాడు వశవర్తియై బతకడా? అప్పటికయినా బుద్ధి మార్చుకోడా? మీ కొడుకు దీర్ఘాయుర్దాయం అంతా మీ చేతిలోనే ఉంది మహారాజా! మీ బిడ్డలని పుత్ర పాశములకు వశపడవద్దు. రాజ్యాన్ని ధర్మరాజుకు, ఆయన తమ్ముళ్ళకి ఇచ్చేయండి.’’ నిజంగా ఎటువంటి ఇల్లాలు ఆ తల్లి, అలా నిలబడగలిగిన వాళ్లు ఈ లోకంలో ఉంటారా? నూరుగురు కొడుకులు చచ్చిపోయిన తరువాత ధర్మరాజు వచ్చి ‘‘అమ్మా! నీ బిడ్డలను అందరినీ చంపిన పాపిష్టివాడిని నేనేనమ్మా, ధర్మం కోసం చంపానే గానీ, నా అంత నేను చంపలేదమ్మా! అది తప్పనిపిస్తే నన్ను కాల్చేయమ్మా’’ అన్నాడు. ఆమె ఒక్కమాట అనలేదు. కళ్ళవెంట నీరు కారింది. ధర్మరాజుని కౌగిలించుకుంది. కాన్నీ ఒక్క బిడ్డకూడా బతికిలేడనే బాధతో ఆమె చూసినపుడు కళ్ళగంత ఒక్కసారి సడలి ఆమె దృష్టి పడినందుకు ధర్మరాజంతటివాడి కాళ్ళు బొబ్బలెక్కాయి. అంతటి పతివ్రత గాంధారి. -
కొరతే లేకుంటే.. బందోబస్తు ఎందుకో?
సాక్షి, కామారెడ్డి: యూరియా కొరత లేదని అధికారులు పైకి చెబుతున్నా.. వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. గురువారం గాంధారి సింగిల్‌విండోలో పోలీసు భద్రత మధ్య యూరియా పంపిణీ చేయాల్సి రావడం ఇందుకు నిదర్శనం.. గాంధారి మండలంలో యూరియాకు తీవ్ర కొరత ఉంది. యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎరువు కోసం రైతులు రోజూ ఉదయమే గాంధారిలోని సహకార సంఘం కార్యాలయానికి చేరుకుని వరుస కడుతున్నారు. ఒకటో రెండో లారీల ఎరువు వస్తున్నా.. అది ఏ మూలకూ సరిపోవడం లేదు. మరో లారీ వస్తుందన్న ఆశతో పంపిణీ కౌంటర్ వద్దే నిరీక్షిస్తున్నారు. స్టాక్ అయిపోయిందనగానే నిరాశతో వెనుదిరుగుతున్నారు. మంగళవారం కొంతమంది రైతులకు మాత్రమే యూరియా అందింది. బుధవారం లోడ్ రాలేదు. దీంతో గురువారం ఉదయమే సొసైటీకి వచ్చి రైతులు బారులు తీరారు. రెండు రోజులుగా లోడ్ రాకపోవడంతో గురువారం రైతులు భారీగా సొసైటీ వద్దకు చేరుకున్నారు. ఒక లారీ లోడ్ రావడం, చాలా మంది రైతులు ఉండడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు సొసైటీకి చేరుకున్నారు. పోలీసు పహారా మధ్య సొసైటీ అధికారులు యూరియా పంపిణీ చేశారు. అంచనాలకు మించి సాగు.. గాంధారి మండలంలో 16 వేల ఎకరాల్లో మక్క పంట సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే దాదాపు 24 వేల ఎకరాల్లో మక్క సాగైంది. పంటకు యూరియా వేయాల్సి న సమయంలో కొరత ఏర్పడింది. మండలంలో ఇప్పటి వరకు 3,803 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశారు. అది ఏమాత్రం సరిపో లేదు. దీంతో రైతులు ఎరువు కోసం ఇబ్బందు లు పడుతున్నారు. మరో పది లారీల యూరి యా మండలానికి వస్తుందని మండల వ్యవసాయ అధికారి యాదగిరి ‘సాక్షి’తో తెలిపారు. కావలసినంత యూరియా ఉందని, అయితే ట్రాన్స్‌పోర్టు ఇబ్బందుల వల్లే ఆలస్యం అవుతోందన్నారు. గొడవలు జరగకుండా ఉండేందు కే బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. స్టాక్ లేకపోవడంపై రైతుల ఆగ్రహం సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారని, కొరత లేకుంటే రైతులు పనులు వదులుకుని క్యూలో ఎందుకు ఉండాల్సి వస్తోందని ప్రశ్నిస్తున్నారు. లారీ లోడ్ రాగానే గంటలో ఖాళీ అవుతోందని, చాలా మందికి సరిపడకపోవడంతో వాపస్ వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. పొద్దుగాల అచ్చిన.. మక్క జుట్టు, పీప దశలో ఉంది. వర్షాలు పడుతున్నయి. ఇప్పుడు తప్పకుండా యూరియా వేయాలే. లేదంటే కంకులు చిన్నగ వస్తయి. దిగుబడి పడిపోతది. యూరియా కోసం పొద్దుగాల అచ్చిన. ఒక లారీ అయిపోయింది. ఇంకోటి వస్తదంటున్నరు. అందుకే ఇక్కడనే ఉన్న. – నాన్యా, రైతు, బూర్గుల్ తండా మొన్నటి నుంచి తిరుగుతున్న.. యూరియా కోసం మొన్నటి నుంచి తిరుగుతున్న. మంగళవారం యూరియా దొరకలేదు. తండాకు వట్టి చేతులతోనే పోయిన. బుధవారం యూరియా లారీ రాలేదు. ఇయ్యాల పొద్దుగాల నుంచి లైన్లో ఉంటే ఇప్పుడు కూపన్ దొరికింది. లారీ వద్ద మస్తుమంది ఉన్నరు. మల్ల లైన్ల నిల్సున్న.. – రుక్కి బాయి, రైతు, గుజ్జుల్ తండా -
గాంధారి గుడ్డి ప్రేమ
భారతంలోని స్త్రీ పాత్రలలో గాంధారిది విశిష్ఠ పాత్ర. రాజభోగాలతో తులతూగవలసిన ఆమెను మానసిక క్షోభ నిరంతరం వెన్నంటింది. తాను పెళ్లాడబోయేది పుట్టుగుడ్డివాడైన ధృతరాష్ట్రుని అని తెలిసి, భర్తకు లేని చూపు తనకు కూడా ఉండనక్కరలేదని తనకు తానే స్వచ్ఛందంగా కళ్లకు గంతలు కట్టుకుంది. అయితే, దీనివల్ల ఆమె ఏమి ప్రయోజనం సాధించిందో అర్థం కాదు. ఒకవేళ పతివ్రతా స్త్రీగా అలా చేసిందే అనుకుంటే, ఆమె కన్న నూటొక్క మంది సంతానం ఏమైపోవాలి? అసలు కౌరవుల పతనానికి వారి తల్లిదండ్రుల మితిమీరిన ప్రేమాభిమానాలే కారణం. పిల్లలు తప్పు చేస్తుంటే, అహంకరిస్తుంటే, విచ్చలవిడితనంతో ప్రవర్తిస్తుంటేæ మురిసిపోతూ చూస్తూ ఊరుకున్నారు గాంధారీ ధృతరాష్ట్రులు. ఫలితం... కురుక్షేత్ర యుద్ధంలో కొడుకులందరూ దిక్కులేని చావుచస్తుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఊరుకుండిపోవలసి వచ్చింది. అప్పటికీ ఆమె తన తప్పిదాన్ని గుర్తించలేదు. భీముని గదాప్రహారానికి తొడలు విరిగి నేలకూలిన కుమారుని చూసి జాలిపడలేదు పైపెచ్చు... ‘ఆ చావు సావదగు ఆ న్నీచునకున్‘ ఆ నీచునికి (అధముడికి) అట్లాంటి చావు తగినదే... అంది. స్వయంగా తన కడుపున పుట్టిన పెద్దకుమారుడు. అసలు ఆ దుర్యోధనుడు నీచుడెలా కాగలిగాడు? పాండవుల వలె కౌరవులు సంస్కారవంతులెలా కాలేకపోయారు? బిడ్డలకు ప్రథమగురువు తల్లి. తండ్రి జాత్యంధుడు. కన్నతల్లి నేత్రపట్టం గట్టుకుని త్యాగమయ జీవితం గడిపినందువలన ఒనగూడిన ప్రయోజనం ఏ మాత్రమూ భారతమున కానరాదు. మరి కన్నపిల్లల భవిష్యత్తును ఎవరు తీర్చిదిద్దాలి? మేనమామ శకునిపై బడింది. శకుని కుటిలబుద్ధి అతనిని ఆత్మీయుడుగా చేసింది. కురుసార్వభౌముడైన భర్త, మహా బల పరాక్రమవంతులైన నూరుగురు కొడుకులు, అందచందాలలో, ఆస్తి అంతస్తులలో కొడుకులకు ఏమాత్రం తీసిపోని కోడళ్లు, మనవలు, మనవరాళ్లు, ఒక్కగానొక్క కూతురు దుస్సల, అల్లుడు సైంధవుడు... వీరందరి సమక్షంలో రాజమాతగా కలకాలం సుఖశాంతులతో జీవితం వెళ్లబుచ్చవలసిన గాంధారి, దుర్భర గర్భశోకాన్ని ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? వందమంది కుమారుల గర్భశోక మొకవైపు, ఉన్న ఒక్క కుమార్తె విధవ కావటం మరోవైపు ఆమెను నిలువునా కుంగదీశాయి. దీని బదులు కురుసార్వభౌముని పట్టమహిషిగా, 100 మంది కోడళ్లకు అత్తగా, రాజమాతగా యుద్ధం ప్రకటించిననాడే నేత్ర పట్టం తీసివేసి దుర్యోధన సార్వభౌముని శిక్షించకల్గిన మాతగా జీవించి ఉంటే, భారతకథ ఏవిధంగా ఉండేదో కదా? అందుకే అన్నారు, బిడ్డలు చెడిపోయారంటే, తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదే బాధ్యత. ఎందుకంటే, పిల్లలకు మంచి చెడ్డలు చెప్పకపోవడం ఆమెదే తప్పు కదా.. – డి.వి.ఆర్. భాస్కర్ -
పరిహారం కోసం రోడ్డెక్కిన రైతన్న
గాంధారి: ప్రభుత్వ తీరుపై రైతులు కన్నెర్ర చేశారు. వరుస వర్షాలతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని, వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గాంధారిలో శనివారం రాస్తారోకో నిర్వహించారు. అఖిల పక్ష నేతలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేతలు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదని, పంట నష్టం వివరాలు సేకరించడం లేదని ఆరోపించారు. నష్టపోయిన పంటలపై ప్రభుత్వం సర్వే చేయించి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు తానాజీరావు, సర్పంచ్ సత్యం, ఎంపీటీసీ సభ్యుడు రాంకిషన్‌రావు, ఏవో యాదగిరి ఎంత నచ్చచెప్పినా రైతులు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు రాస్తారోకో చేశారు. తన రెండెకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తే మొత్తం వర్షార్పణం అయిందని నేరల్‌తండాకు చెందిన మంజూరియా వాపోయారు. ప్రభుత్వం చెప్పడం వల్లే పత్తికి బదులు సోయా సాగు చేశామని, ఇప్పుడు పంట మొత్తం నష్టపోయామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని గాంధారికి చెందిన సాయిలు కోరారు. ఏవో యాదగిరి అక్కడకు చేరుకొని పంట నష్టం వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. సర్వే నెంబర్ల వారీగా పంట నష్టం వివరాలను సేకరించి నివేదిక పంపిస్తామన్నారు. రైతులు పట్టా పాసుబుక్, ఆధార్, బ్యాంక్ ఖాతా జిరాక్స్‌లు ఇవ్వాలని కోరారు. -
గాంధారి
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 6 గాంధార రాజు సుబలుడి కూతురు గాంధారి. ధృతరాష్ట్రుడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లిచేయమని భీష్ముడు వర్తమానం పంపినప్పుడు ‘అతను కళ్లులేనివాడు గదా’ అనే శంక పీడించింది సుబలుణ్ని. కానీ పౌరవకులం ఖ్యాతీ సదాచార సంపన్నతా పరాక్రమమూ మొదలైన అనుకూల విషయాలు చాలా అవుపించడం వల్ల, ప్రతికూలమైన గుడ్డితనాన్ని వెనక్కి నెట్టి, పిల్లనిద్దామని నిశ్చయించుకొన్నారు సుబల దంపతులు. ధృతరాష్ట్రుడికి తనను ఇవ్వబోతున్నారని తెలిసిన గాంధారి ‘నేను ఎదురుగా అతన్ని చూస్తే గుడ్డితనం పెద్దదోషంగా అవుపిస్తుంది. అదీగాక, ఇతరులతో పోల్చడాలూ పోల్చుకోడాలూ వచ్చి మనసు చెదురుతుంది’ అని ఆలోచించి, గట్టి నిశ్చయంతో తన రెండు కళ్లనూ చాలా మడతలు పెట్టిన బట్ట పట్టీతో బంధించుకొంది. నిజానికి, ఉన్న కళ్లను కూడా మూసేసుకొని, కావాలని గుడ్డిగా ఉండటం అంత ప్రశస్తమేమీ కాదు. అయితే, ఆవిడ తర్కమూ తప్పేమీ కాదు. ప్రతిక్షణమూ తల్లిదండ్రుల్ని తప్పుపట్టుకొంటూ, జీవితాన్ని నరకప్రాయం చేసుకోవడం కన్నా తానూ గుడ్డిగా ఉండటమే మంచిదని అనుకొంది ఆవిడ. పిల్లను అడిగి సంబంధం ఖరారు చేయాలిగదా అనిపిస్తుంది గానీ రాజకీయ వివాదాల్లో ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. శాంతనుడికి సత్యవతి వల్ల పుట్టిన పిల్లలు త్వరగా చనిపోవడం వల్ల, రాజవంశానికి పెద్ద సమస్యే వచ్చిపడింది. అందుకోసమనే వంద మంది సంతానం కనగలిగే వరాన్ని శివుణ్నించి పొందిన గాంధారిని భీష్ముడూ సత్యవతీ ఎన్నుకొన్నారు. ఒకరోజున వ్యాసుడు చాలా ఆకలితో గాంధారి ఇంటికి వచ్చాడు. ఆవిడ ఆయనకు భోజనం పెట్టి, విశ్రాంతి తీసుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసింది. దానికి సంతోషించి ఆయన వరం కోరుకోమన్నాడు. ‘నా భర్తకు దీటైన నూరుమంది కొడుకులు పుట్టాల’ని ఆవిడ కోరుకొంది. శివుడిచ్చిన వరాన్ని వ్యాసుడి వరం బలపరిచినట్టయింది. ధృతరాష్ట్రుడి వల్ల కలిగిన గర్భాన్ని ఆవిడ నిండా రెండేళ్లు మోసింది. అక్కడ వనంలో ఉన్న తోటికోడలు కుంతికి యుధిష్ఠిరుడు అప్పుడే పుట్టేశాడు. గాంధారికి అసూయ పుట్టింది. భర్తకు తెలియకుండా ఆవిడ తన కడుపును తొందర కొద్దీ పొడుచుకొంది. చాలా గింజలున్న పెద్దపండు లాంటి ఒక గట్టి మాంస పిండం బయటపడింది. ఆవిడ అవాక్కయింది. వందమంది కొడుకుల వరం అబద్ధమేనా అనిపించింది. వందలూ వేలుగా పిల్లలు పుట్టడాలు జంతువుల్లో కద్దు. పేడలో కులకులలాడుతూ పురుగులు ఎక్కణ్నించి వస్తున్నాయో తెలియకుండా పుట్టుకొస్తాయి. పాములూ మొసళ్లూ మొదలైన జంతువులూ ఎక్కువ గుడ్లను పెట్టి పొదుగుతూ ఉంటాయి. సాధారణ పద్ధతిలో మనుషుల్లో ఒక్కొక్కడూ పుట్టుకొని వస్తూ వందమంది పుట్టాలంటే కనీసం వందేళ్లైనా పడుతుంది. ఇంతకుముందు సగరుడనే రాజుకు ఒక భార్య వల్ల అరవై వేల మంది కొడుకులు పుట్టారని చెబుతారు. వందకు ఆరువందలింతల మంది పుట్టడం ఇంకా కష్టమైనదే. అప్పుడూ ఇప్పుడూ కూడా ఆవునేతి కుండల్లో ఆ గర్భాలను పెంచినట్టు చెప్పారు. అందుచేత, ఎక్కువమందిని కనే ప్రక్రియ ఆయా కాలాల్లో వాళ్లకు తెలుసునని అర్థమవుతుంది. ఇప్పటివాళ్లకే ఇంక్యుబేటర్లలో పిల్లల్ని పెంచే విద్య వచ్చుననీ అప్పటివాళ్లకు ఏమీరాదని అనుకోవడం శుద్ధ అవివేకమవుతుంది. నాగరికత ఎన్నిసార్లో చాలా ఉచ్ఛస్థాయిలకు చేరి, పెద్ద పెద్ద దుర్ఘటనల వల్లనో భూకంపాలూ సునామీలూ భారీ ఉల్కాపాతాలూ మొదలైన అతిఘోరమైన విపత్తుల వల్లనో కనుమరుగైపోతూ వచ్చింది. ఇది తెలియని మనం, ఇప్పటికాలంలో తెలిసినది మునపటి కాలంలో తెలియదని పొరబాటుగా అనుకొంటూ ఉంటాం. సుశ్రుతుడు వెంట్రుకను నిలువుగా చీల్చగలిగిన నేర్పుగల సర్జన్‌గా మనం వింటూ ఉంటాం. క్షయ రోగానికి మేక మాంసం తినడమూ మేకల మందలో పడుకోవడమూ విరుగుడన్న సంగతి పూర్వీకులు ఎరుగుదురు. కానీ ఇప్పటికాలంలో ఆ రోగానికి మందులను కనుక్కోడానికి చాలాకాలమే పట్టింది. కణాదుడనే ఒక శాస్త్రజ్ఞుడు తన ‘వైశేషిక సిద్ధాంతం’లో పరమాణువుల గురించి చెప్పాడన్న సంగతి చాలామందికి తెలియనే తెలియదు. ఈ శాస్త్రాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. ఆ భాష మనకు ‘మెకాలే ఎఫెక్టు’ ద్వారా దూరమైపోయింది. అదీగాక సంస్కృతంలో శాస్త్రాలన్నీ సూత్ర రూపాల్లో ఉంటాయి. సూత్రాలనేవి చిన్న చిన్న వాక్యాలే కానీ చాలా అర్థంతో కూడుకొని ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడానికి విశ్లేషణా వివరణా కావలసివస్తాయి. పెద్ద పెద్ద అంగలేసిందని చెప్పుకొనే ఇప్పటి సైన్సుకు ఇప్పటికీ అర్థంకాని ప్రాకృతికమైన దృగ్విషయాలెన్నో ఉన్నాయి. మన గ్రహం మీదనే జీవం ఉందనీ, అదే చాలా పురోగతిని పొందినదనీ అనుకొంటూ ఉంటాం. ఇతర గ్రహాల మీద జీవం ఉండే అవకాశాన్ని మనం వట్టినే కొట్టిపారేయలేం. ఫ్లైయింగ్ సాసర్లు వస్తున్నాయంటారు; అవేమిటో తెలియదు. వాటిలో వచ్చే ఆగంతకులెవరో ఎంతటి శాస్త్రజ్ఞానం గలవాళ్లో మనకు అంతుపట్టదు. ఈ నేపథ్యంలో మరోచోట జీవం లేదనుకోవడం ఒక విధంగా అహంకారమే. ఎక్కువ ఉష్ణోగ్రతలున్నచోట జీవాలుండవని సాధారణంగా అనుకొంటాం. కానీ కొన్ని రాక్షస తొండలు అగ్నిపర్వతాల నుంచి వెలువడిన లావాల ప్రాంతాల్లో గుడ్లను పెడుతూ ఉంటాయి. ఒక కణం తాలూకు శక్తి ఫలానా సమయంలో ‘ఇంత’ అని మనం స్పష్టంగా చెప్పనేలేం.. వీటన్నింటినీ పోల్చి చూసుకోకపోతే వందమంది పుట్టడమనేది మనకు అసాధారణంగా తోస్తుంది; అబద్ధమనిపిస్తుంది; కట్టుకథ అనిపిస్తుంది. ఇక ఆ గర్భపిండాలను పెంచడమన్నదీ అలాగే అబద్ధమనిపిస్తుంది. వ్యాసుడి పక్కకు చేరి ‘ఆడపిల్ల ఒకత్తె ఉంటే బాగుంటుంది’ అని గాంధారి అంటే దాన్ని కూడా ఆ మాంసపిండం నుంచే తీశాడు. అదే సైంధవుడికి పెళ్లామైన దుస్సల. మన ప్రస్తుత జ్ఞానాన్ని ఆధారంగా తీసుకొని, ఏదైనా సత్యమూ అసత్యమూ అని చెప్పడం ఎంత అసమంజసమో పైన చెప్పిన వాక్యాలను కుదురుగా చదివితే క్షుణ్ణంగా అర్థమవుతుంది. అంత కష్టపడి కన్న ఆ వందమందీ మొగుడి నిర్వాకంకొద్దీ చనిపోతే ఎంత బాధగా ఉంటుందో చెప్పవలసిన పనిలేదు. తనతోబాటే వచ్చి స్థిరపడిపోయిన తన అన్న శకుని మోసపు జూదంతో పాండవుల్ని దాసులుగా చేసినప్పుడు, ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాల పేరిట ఆ దాస్యాన్ని పోగొట్టి సర్ది చెప్పి పంపించేశాడు. అయితే, రెండోసారి జూదమాడటానికి పాండవుల్ని దారి మధ్యలోంచే పిలిపించాలని దుర్యోధనుడు మంకుపట్టు పట్టినప్పుడు, గాంధారి ధృతరాష్ట్రుడితో ‘నీ మాట విననివాణ్ని విడిచిపెట్టడమే మంచిది. ధర్మపూర్వకంగా గెలవని డబ్బు తరవాత తరాలవాళ్లను నాశనం చేస్తుంది’ అని అంది. కొడుకంటే ఆవిడకు ధృతరాష్ట్రుడికున్నంత మోహం లేదు. యుద్ధమంతా అయిపోయిన తరవాత, దగ్గరికి వచ్చిన పాండవుల్ని శపిద్దామన్నంత బాధా కోపమూ ఆవిణ్ని చుట్టుముట్టాయి. అప్పుడు వ్యాసుడు ఆవిడకు ఓ విషయాన్ని గుర్తుకు తెచ్చాడు: ‘‘యుద్ధం జరిగిన పద్దెనిమిది రోజుల్లోనూ ప్రతిరోజూ నీ పెద్దకొడుకు నీ దగ్గరికి వచ్చి, ‘జయించేలాగ దీవించమ’ని అడుగుతూ ఉండేవాడు గదా. నువ్వేమో ఎప్పుడూ ‘యతో ధర్మస్తతో జయః’ అని చెపుతూ వచ్చావే తప్ప ఒక్కసారి గూడా ‘నువ్వు గెలుస్తావు’ అని అనలేదు. నువ్వు ముందరి నుంచీ చాలా ఓర్పు ఉన్నదానివి. అధర్మాన్ని వదిలిపెట్టు. నువ్వన్నట్టే ధర్మమున్న వైపే జయించింది’ అని. అప్పుడు ఆవిడ పాండవుల్ని శపించకుండా ఉన్నా శ్రీకృష్ణుణ్ని మాత్రం శపించింది: ‘జ్ఞాతులైన కౌరవ పాండవులు పరస్పరమూ కొట్టుకొంటూ చచ్చిపోతూ ఉంటే వాళ్లను ఆపకుండా ఉపేక్షించావు గనక, నీ జ్ఞాతుల్ని నువ్వే చంపుతావు. ఈ రోజు నుంచి ముప్ఫై ఆరేళ్ల తరవాత నీవాళ్లందరూ ఒకళ్లతో ఒకళ్లు దెబ్బలాడుకొంటూ చనిపోతారు. నువ్వు కూడా ఒక అనాథుడి మాదిరిగా ఎవరికీ తెలియకుండా కుచ్చితమైన ఉపాయంతో చచ్చిపోతావు’ అని. సంస్కృతంలో శతమూ సహస్రమూ అనే మాటలు వందా వేయీ అనేగాక అనేకమనే అర్థాన్ని కూడా ఇస్తాయి. మనిషిలో అటు దైవీశక్తులూ ఇటు ఆసురీశక్తులూ రెండూ ఉన్నాయి. ఆ మంచీ చెడూ శక్తులు ఎప్పుడూ దెబ్బలాడుకొంటూనే ఉంటాయి. పురాణాల్లో తరచుగా వర్ణిస్తూ ఉండే దేవాసుర యుద్ధమంటే ఇదే. ఆ రెండు శక్తుల్లోనూ మంచివి ఎప్పుడూ తక్కువే. అందుచేతనే ధర్మపరులూ జ్ఞానవంతులూ అయిన పాండవులు ఐదుగురు మాత్రమే. అధర్మం కొమ్ముకాసేవాళ్లూ పాపప్పనులూ అజ్ఞానమూ గొప్ప అనుకొనేవాళ్లూ చాలామందే ఉంటారు. అందుకనే కౌరవులూ వాళ్లవైపు ఉండి యుద్ధం చేసినవాళ్లూ అనేకులు. ‘గాంధారి’ అనే మాటలోని ‘గాం’ అనే మాట కదలికను సూచిస్తుంది. కదలికకు మరోపేరే సృష్టి. అంతా ఒకే వస్తువున్నప్పుడు కదలిక ఎక్కడ ఉంటుంది? అది వేరు పేరైనప్పుడే కదలికలూ స్పందనలూ పుడతాయి. ఆ కదలికను ధరించేది ‘గాంధారి’ - అంటే, సృష్టిని ధరించి పోషించేది ‘గాంధారి’. సృష్టిని ధరించి పోషించేది కోరికల బలం, వాసనల శక్తి, మునపటి కర్మఫల గంధాల శక్తి. ధృతరాష్ట్రుడు ఇంద్రియ సంబంధమైన గుడ్డి మనస్సు; అతని ‘భార్య’ గాంధారి కోరికల శక్తి. మనస్సు ఇంద్రియాల ద్వారానే చూస్తుంది గనక అది పుట్టుగుడ్డిదే; మనను అందర్నీ కోరికల శక్తి, అంటే, మునుపటి వాసనల శక్తి దళసరి పట్టీతో కళ్లకు గంతలు కట్టుకొన్నట్టుగా ప్రవర్తింపజేస్తూ ఉంటుంది. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు -
విద్యుత్ కోతలకు నిరసనగా రాస్తారోకో
గాంధారి, న్యూస్‌లైన్ : విద్యుత్ కోతలకు నిరసనగా మండలంలోని సర్వాపూర్ సబ్‌స్టేషన్ ఎదుట ఆ ప్రాంత రైతులు శనివారం ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రోజుకు రెండు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆరోపించారు. దీంతో పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విష యం తెలుసుకున్న ట్రాన్స్‌కో ఏఈ సంతోష్‌కుమార్ సబ్‌స్టేషన్‌కు చేరుకొని రైతులతో మాట్లాడారు. ఇక నుంచి సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తానని నచ్చజెప్పినా వినలేదు. కామారెడ్డి నుంచి డీఈ రావాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ముదెల్లి నుంచి గాంధారి వైపు వస్తున్న బీజేపీ నాయకుడు బాణాల లక్ష్మారెడ్డి రైతులకు మద్దతుగా ధర్నాలో కూర్చున్నారు. డీఈ వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజుకు ఏడు గంటలు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తామని ఏఈ సంతోష్‌తో రాతపూర్వంగా హామీ తీసుకొ ని రైతులు ఆందోళన విరమిచారు. సుమారు నాలుగు గంటల పాటు ఆందోళన చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో గౌరారం మాజీ సర్పంచ్ మనోహర్‌రావు, తూం అంజయ్య, మోహ న్, జయరాం, బలిరాం, సర్వాపూర్, గండివేట్, సీతాయిపల్లి, గౌరారం, ముదెల్లి, వెంకటాపూర్ గ్రామాల రైతులు తది తరులు పాల్గొన్నారు.