
సొసైటీ కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు
సాక్షి, కామారెడ్డి: యూరియా కొరత లేదని అధికారులు పైకి చెబుతున్నా.. వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. గురువారం గాంధారి సింగిల్‌విండోలో పోలీసు భద్రత మధ్య యూరియా పంపిణీ చేయాల్సి రావడం ఇందుకు నిదర్శనం.. గాంధారి మండలంలో యూరియాకు తీవ్ర కొరత ఉంది. యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎరువు కోసం రైతులు రోజూ ఉదయమే గాంధారిలోని సహకార సంఘం కార్యాలయానికి చేరుకుని వరుస కడుతున్నారు. ఒకటో రెండో లారీల ఎరువు వస్తున్నా.. అది ఏ మూలకూ సరిపోవడం లేదు.
మరో లారీ వస్తుందన్న ఆశతో పంపిణీ కౌంటర్ వద్దే నిరీక్షిస్తున్నారు. స్టాక్ అయిపోయిందనగానే నిరాశతో వెనుదిరుగుతున్నారు. మంగళవారం కొంతమంది రైతులకు మాత్రమే యూరియా అందింది. బుధవారం లోడ్ రాలేదు. దీంతో గురువారం ఉదయమే సొసైటీకి వచ్చి రైతులు బారులు తీరారు. రెండు రోజులుగా లోడ్ రాకపోవడంతో గురువారం రైతులు భారీగా సొసైటీ వద్దకు చేరుకున్నారు. ఒక లారీ లోడ్ రావడం, చాలా మంది రైతులు ఉండడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు సొసైటీకి చేరుకున్నారు. పోలీసు పహారా మధ్య సొసైటీ అధికారులు యూరియా పంపిణీ చేశారు.
అంచనాలకు మించి సాగు..
గాంధారి మండలంలో 16 వేల ఎకరాల్లో మక్క పంట సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే దాదాపు 24 వేల ఎకరాల్లో మక్క సాగైంది. పంటకు యూరియా వేయాల్సి న సమయంలో కొరత ఏర్పడింది. మండలంలో ఇప్పటి వరకు 3,803 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశారు. అది ఏమాత్రం సరిపో లేదు. దీంతో రైతులు ఎరువు కోసం ఇబ్బందు లు పడుతున్నారు. మరో పది లారీల యూరి యా మండలానికి వస్తుందని మండల వ్యవసాయ అధికారి యాదగిరి ‘సాక్షి’తో తెలిపారు. కావలసినంత యూరియా ఉందని, అయితే ట్రాన్స్‌పోర్టు ఇబ్బందుల వల్లే ఆలస్యం అవుతోందన్నారు. గొడవలు జరగకుండా ఉండేందు కే బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
స్టాక్ లేకపోవడంపై రైతుల ఆగ్రహం
సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారని, కొరత లేకుంటే రైతులు పనులు వదులుకుని క్యూలో ఎందుకు ఉండాల్సి వస్తోందని ప్రశ్నిస్తున్నారు. లారీ లోడ్ రాగానే గంటలో ఖాళీ అవుతోందని, చాలా మందికి సరిపడకపోవడంతో వాపస్ వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.
పొద్దుగాల అచ్చిన..
మక్క జుట్టు, పీప దశలో ఉంది. వర్షాలు పడుతున్నయి. ఇప్పుడు తప్పకుండా యూరియా వేయాలే. లేదంటే కంకులు చిన్నగ వస్తయి. దిగుబడి పడిపోతది. యూరియా కోసం పొద్దుగాల అచ్చిన. ఒక లారీ అయిపోయింది. ఇంకోటి వస్తదంటున్నరు. అందుకే ఇక్కడనే ఉన్న.
– నాన్యా, రైతు, బూర్గుల్ తండా
మొన్నటి నుంచి తిరుగుతున్న..
యూరియా కోసం మొన్నటి నుంచి తిరుగుతున్న. మంగళవారం యూరియా దొరకలేదు. తండాకు వట్టి చేతులతోనే పోయిన. బుధవారం యూరియా లారీ రాలేదు. ఇయ్యాల పొద్దుగాల నుంచి లైన్లో ఉంటే ఇప్పుడు కూపన్ దొరికింది. లారీ వద్ద మస్తుమంది ఉన్నరు. మల్ల లైన్ల నిల్సున్న..
– రుక్కి బాయి, రైతు, గుజ్జుల్ తండా

యూరియా కోసం గాంధారి సింగిల్ విండో వద్ద బారులు తీరిన రైతులు
Comments
Please login to add a commentAdd a comment