పరిహారం కోసం రోడ్డెక్కిన రైతన్న
పరిహారం కోసం రోడ్డెక్కిన రైతన్న
Published Sat, Oct 1 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
గాంధారి:
ప్రభుత్వ తీరుపై రైతులు కన్నెర్ర చేశారు. వరుస వర్షాలతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని, వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గాంధారిలో శనివారం రాస్తారోకో నిర్వహించారు. అఖిల పక్ష నేతలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేతలు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదని, పంట నష్టం వివరాలు సేకరించడం లేదని ఆరోపించారు. నష్టపోయిన పంటలపై ప్రభుత్వం సర్వే చేయించి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు తానాజీరావు, సర్పంచ్ సత్యం, ఎంపీటీసీ సభ్యుడు రాంకిషన్‌రావు, ఏవో యాదగిరి ఎంత నచ్చచెప్పినా రైతులు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు రాస్తారోకో చేశారు. తన రెండెకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తే మొత్తం వర్షార్పణం అయిందని నేరల్‌తండాకు చెందిన మంజూరియా వాపోయారు. ప్రభుత్వం చెప్పడం వల్లే పత్తికి బదులు సోయా సాగు చేశామని, ఇప్పుడు పంట మొత్తం నష్టపోయామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని గాంధారికి చెందిన సాయిలు కోరారు. ఏవో యాదగిరి అక్కడకు చేరుకొని పంట నష్టం వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. సర్వే నెంబర్ల వారీగా పంట నష్టం వివరాలను సేకరించి నివేదిక పంపిస్తామన్నారు. రైతులు పట్టా పాసుబుక్, ఆధార్, బ్యాంక్ ఖాతా జిరాక్స్‌లు ఇవ్వాలని కోరారు.
Advertisement
Advertisement