గాంధారి | Mahabharata, through the 'eyes' of Gandhari | Sakshi
Sakshi News home page

గాంధారి

Published Sun, Jun 28 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

గాంధారి

గాంధారి

ఐదోవేదం: మహాభారత పాత్రలు - 6
గాంధార రాజు సుబలుడి కూతురు గాంధారి. ధృతరాష్ట్రుడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లిచేయమని భీష్ముడు వర్తమానం పంపినప్పుడు ‘అతను కళ్లులేనివాడు గదా’ అనే శంక పీడించింది సుబలుణ్ని. కానీ పౌరవకులం ఖ్యాతీ సదాచార సంపన్నతా పరాక్రమమూ మొదలైన అనుకూల విషయాలు చాలా అవుపించడం వల్ల, ప్రతికూలమైన గుడ్డితనాన్ని వెనక్కి నెట్టి, పిల్లనిద్దామని నిశ్చయించుకొన్నారు సుబల దంపతులు.

ధృతరాష్ట్రుడికి తనను ఇవ్వబోతున్నారని తెలిసిన గాంధారి ‘నేను ఎదురుగా అతన్ని చూస్తే గుడ్డితనం పెద్దదోషంగా అవుపిస్తుంది. అదీగాక, ఇతరులతో పోల్చడాలూ పోల్చుకోడాలూ వచ్చి మనసు చెదురుతుంది’ అని ఆలోచించి, గట్టి నిశ్చయంతో తన రెండు కళ్లనూ చాలా మడతలు పెట్టిన బట్ట పట్టీతో బంధించుకొంది. నిజానికి, ఉన్న కళ్లను కూడా మూసేసుకొని, కావాలని గుడ్డిగా ఉండటం అంత ప్రశస్తమేమీ కాదు.

అయితే, ఆవిడ తర్కమూ తప్పేమీ కాదు. ప్రతిక్షణమూ తల్లిదండ్రుల్ని తప్పుపట్టుకొంటూ, జీవితాన్ని నరకప్రాయం చేసుకోవడం కన్నా తానూ గుడ్డిగా ఉండటమే మంచిదని అనుకొంది ఆవిడ. పిల్లను అడిగి సంబంధం ఖరారు చేయాలిగదా అనిపిస్తుంది గానీ రాజకీయ వివాదాల్లో ఉద్దేశాలు వేరుగా ఉంటాయి.
 
శాంతనుడికి సత్యవతి వల్ల పుట్టిన పిల్లలు త్వరగా చనిపోవడం వల్ల, రాజవంశానికి పెద్ద సమస్యే వచ్చిపడింది. అందుకోసమనే వంద మంది సంతానం కనగలిగే వరాన్ని శివుణ్నించి పొందిన గాంధారిని భీష్ముడూ సత్యవతీ ఎన్నుకొన్నారు. ఒకరోజున వ్యాసుడు చాలా ఆకలితో గాంధారి ఇంటికి వచ్చాడు. ఆవిడ ఆయనకు భోజనం పెట్టి, విశ్రాంతి తీసుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసింది. దానికి సంతోషించి ఆయన వరం కోరుకోమన్నాడు.

‘నా భర్తకు దీటైన నూరుమంది కొడుకులు పుట్టాల’ని ఆవిడ కోరుకొంది. శివుడిచ్చిన వరాన్ని వ్యాసుడి వరం బలపరిచినట్టయింది. ధృతరాష్ట్రుడి వల్ల కలిగిన గర్భాన్ని ఆవిడ నిండా రెండేళ్లు మోసింది. అక్కడ వనంలో ఉన్న తోటికోడలు కుంతికి యుధిష్ఠిరుడు అప్పుడే పుట్టేశాడు. గాంధారికి అసూయ పుట్టింది. భర్తకు తెలియకుండా ఆవిడ తన కడుపును తొందర కొద్దీ పొడుచుకొంది. చాలా గింజలున్న పెద్దపండు లాంటి ఒక గట్టి మాంస పిండం బయటపడింది. ఆవిడ అవాక్కయింది. వందమంది కొడుకుల వరం అబద్ధమేనా అనిపించింది.
 
వందలూ వేలుగా పిల్లలు పుట్టడాలు జంతువుల్లో కద్దు. పేడలో కులకులలాడుతూ పురుగులు ఎక్కణ్నించి వస్తున్నాయో తెలియకుండా పుట్టుకొస్తాయి. పాములూ మొసళ్లూ మొదలైన జంతువులూ ఎక్కువ గుడ్లను పెట్టి పొదుగుతూ ఉంటాయి. సాధారణ పద్ధతిలో మనుషుల్లో ఒక్కొక్కడూ పుట్టుకొని వస్తూ వందమంది పుట్టాలంటే కనీసం వందేళ్లైనా పడుతుంది. ఇంతకుముందు సగరుడనే రాజుకు ఒక భార్య వల్ల అరవై వేల మంది కొడుకులు పుట్టారని చెబుతారు.

వందకు ఆరువందలింతల మంది పుట్టడం ఇంకా కష్టమైనదే. అప్పుడూ ఇప్పుడూ కూడా ఆవునేతి కుండల్లో ఆ గర్భాలను పెంచినట్టు చెప్పారు. అందుచేత, ఎక్కువమందిని కనే ప్రక్రియ ఆయా కాలాల్లో వాళ్లకు తెలుసునని అర్థమవుతుంది. ఇప్పటివాళ్లకే ఇంక్యుబేటర్లలో పిల్లల్ని పెంచే విద్య వచ్చుననీ అప్పటివాళ్లకు ఏమీరాదని అనుకోవడం శుద్ధ అవివేకమవుతుంది. నాగరికత ఎన్నిసార్లో చాలా ఉచ్ఛస్థాయిలకు చేరి, పెద్ద పెద్ద దుర్ఘటనల వల్లనో భూకంపాలూ సునామీలూ భారీ ఉల్కాపాతాలూ మొదలైన అతిఘోరమైన విపత్తుల వల్లనో కనుమరుగైపోతూ వచ్చింది.

ఇది తెలియని మనం, ఇప్పటికాలంలో తెలిసినది మునపటి కాలంలో తెలియదని పొరబాటుగా అనుకొంటూ ఉంటాం. సుశ్రుతుడు వెంట్రుకను నిలువుగా చీల్చగలిగిన నేర్పుగల సర్జన్‌గా మనం వింటూ ఉంటాం. క్షయ రోగానికి మేక మాంసం తినడమూ మేకల మందలో పడుకోవడమూ విరుగుడన్న సంగతి పూర్వీకులు ఎరుగుదురు. కానీ ఇప్పటికాలంలో ఆ రోగానికి మందులను కనుక్కోడానికి చాలాకాలమే పట్టింది. కణాదుడనే ఒక శాస్త్రజ్ఞుడు తన ‘వైశేషిక సిద్ధాంతం’లో పరమాణువుల గురించి చెప్పాడన్న సంగతి చాలామందికి తెలియనే తెలియదు.

ఈ శాస్త్రాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. ఆ భాష మనకు ‘మెకాలే ఎఫెక్టు’ ద్వారా దూరమైపోయింది. అదీగాక సంస్కృతంలో శాస్త్రాలన్నీ సూత్ర రూపాల్లో ఉంటాయి. సూత్రాలనేవి చిన్న చిన్న వాక్యాలే కానీ చాలా అర్థంతో కూడుకొని ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడానికి విశ్లేషణా వివరణా కావలసివస్తాయి. పెద్ద పెద్ద అంగలేసిందని చెప్పుకొనే ఇప్పటి సైన్సుకు ఇప్పటికీ అర్థంకాని ప్రాకృతికమైన దృగ్విషయాలెన్నో ఉన్నాయి.

మన గ్రహం మీదనే జీవం ఉందనీ, అదే చాలా పురోగతిని పొందినదనీ అనుకొంటూ ఉంటాం. ఇతర గ్రహాల మీద జీవం ఉండే అవకాశాన్ని మనం వట్టినే కొట్టిపారేయలేం. ఫ్లైయింగ్ సాసర్లు వస్తున్నాయంటారు; అవేమిటో తెలియదు. వాటిలో వచ్చే ఆగంతకులెవరో ఎంతటి శాస్త్రజ్ఞానం గలవాళ్లో మనకు అంతుపట్టదు. ఈ నేపథ్యంలో మరోచోట జీవం లేదనుకోవడం ఒక విధంగా అహంకారమే. ఎక్కువ ఉష్ణోగ్రతలున్నచోట జీవాలుండవని సాధారణంగా అనుకొంటాం.

కానీ కొన్ని రాక్షస తొండలు అగ్నిపర్వతాల నుంచి వెలువడిన లావాల ప్రాంతాల్లో గుడ్లను పెడుతూ ఉంటాయి. ఒక కణం తాలూకు శక్తి ఫలానా సమయంలో ‘ఇంత’ అని మనం స్పష్టంగా చెప్పనేలేం.. వీటన్నింటినీ పోల్చి చూసుకోకపోతే వందమంది పుట్టడమనేది మనకు అసాధారణంగా తోస్తుంది; అబద్ధమనిపిస్తుంది; కట్టుకథ అనిపిస్తుంది. ఇక ఆ గర్భపిండాలను పెంచడమన్నదీ అలాగే అబద్ధమనిపిస్తుంది.

వ్యాసుడి పక్కకు చేరి ‘ఆడపిల్ల ఒకత్తె ఉంటే బాగుంటుంది’ అని గాంధారి అంటే దాన్ని కూడా ఆ మాంసపిండం నుంచే తీశాడు. అదే సైంధవుడికి పెళ్లామైన దుస్సల. మన ప్రస్తుత జ్ఞానాన్ని ఆధారంగా తీసుకొని, ఏదైనా సత్యమూ అసత్యమూ అని చెప్పడం ఎంత అసమంజసమో పైన చెప్పిన వాక్యాలను కుదురుగా చదివితే క్షుణ్ణంగా అర్థమవుతుంది.
 
అంత కష్టపడి కన్న ఆ వందమందీ మొగుడి నిర్వాకంకొద్దీ చనిపోతే ఎంత బాధగా ఉంటుందో చెప్పవలసిన పనిలేదు. తనతోబాటే వచ్చి స్థిరపడిపోయిన తన అన్న శకుని మోసపు జూదంతో పాండవుల్ని దాసులుగా చేసినప్పుడు, ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాల పేరిట ఆ దాస్యాన్ని పోగొట్టి సర్ది చెప్పి పంపించేశాడు. అయితే, రెండోసారి జూదమాడటానికి పాండవుల్ని దారి మధ్యలోంచే పిలిపించాలని దుర్యోధనుడు మంకుపట్టు పట్టినప్పుడు, గాంధారి ధృతరాష్ట్రుడితో ‘నీ మాట విననివాణ్ని విడిచిపెట్టడమే మంచిది.

ధర్మపూర్వకంగా గెలవని డబ్బు తరవాత తరాలవాళ్లను నాశనం చేస్తుంది’ అని అంది. కొడుకంటే ఆవిడకు ధృతరాష్ట్రుడికున్నంత మోహం లేదు. యుద్ధమంతా అయిపోయిన తరవాత, దగ్గరికి వచ్చిన పాండవుల్ని శపిద్దామన్నంత బాధా కోపమూ ఆవిణ్ని చుట్టుముట్టాయి. అప్పుడు వ్యాసుడు ఆవిడకు ఓ విషయాన్ని గుర్తుకు తెచ్చాడు: ‘‘యుద్ధం జరిగిన పద్దెనిమిది రోజుల్లోనూ ప్రతిరోజూ నీ పెద్దకొడుకు నీ దగ్గరికి వచ్చి, ‘జయించేలాగ దీవించమ’ని అడుగుతూ ఉండేవాడు గదా.

నువ్వేమో ఎప్పుడూ ‘యతో ధర్మస్తతో జయః’ అని చెపుతూ వచ్చావే తప్ప ఒక్కసారి గూడా ‘నువ్వు గెలుస్తావు’ అని అనలేదు. నువ్వు ముందరి నుంచీ చాలా ఓర్పు ఉన్నదానివి. అధర్మాన్ని వదిలిపెట్టు. నువ్వన్నట్టే ధర్మమున్న వైపే జయించింది’ అని. అప్పుడు ఆవిడ పాండవుల్ని శపించకుండా ఉన్నా శ్రీకృష్ణుణ్ని మాత్రం శపించింది: ‘జ్ఞాతులైన కౌరవ పాండవులు పరస్పరమూ కొట్టుకొంటూ చచ్చిపోతూ ఉంటే వాళ్లను ఆపకుండా ఉపేక్షించావు గనక, నీ జ్ఞాతుల్ని నువ్వే చంపుతావు. ఈ రోజు నుంచి ముప్ఫై ఆరేళ్ల తరవాత నీవాళ్లందరూ ఒకళ్లతో ఒకళ్లు దెబ్బలాడుకొంటూ చనిపోతారు. నువ్వు కూడా ఒక అనాథుడి మాదిరిగా ఎవరికీ తెలియకుండా కుచ్చితమైన ఉపాయంతో చచ్చిపోతావు’ అని.
 
సంస్కృతంలో శతమూ సహస్రమూ అనే మాటలు వందా వేయీ అనేగాక అనేకమనే అర్థాన్ని కూడా ఇస్తాయి. మనిషిలో అటు దైవీశక్తులూ ఇటు ఆసురీశక్తులూ రెండూ ఉన్నాయి. ఆ మంచీ చెడూ శక్తులు ఎప్పుడూ దెబ్బలాడుకొంటూనే ఉంటాయి. పురాణాల్లో తరచుగా వర్ణిస్తూ ఉండే దేవాసుర యుద్ధమంటే ఇదే. ఆ రెండు శక్తుల్లోనూ మంచివి ఎప్పుడూ తక్కువే. అందుచేతనే ధర్మపరులూ జ్ఞానవంతులూ అయిన పాండవులు ఐదుగురు మాత్రమే.

అధర్మం కొమ్ముకాసేవాళ్లూ పాపప్పనులూ అజ్ఞానమూ గొప్ప అనుకొనేవాళ్లూ చాలామందే ఉంటారు. అందుకనే కౌరవులూ వాళ్లవైపు ఉండి యుద్ధం చేసినవాళ్లూ అనేకులు. ‘గాంధారి’ అనే మాటలోని ‘గాం’ అనే మాట కదలికను సూచిస్తుంది. కదలికకు మరోపేరే సృష్టి. అంతా ఒకే వస్తువున్నప్పుడు కదలిక ఎక్కడ ఉంటుంది? అది వేరు పేరైనప్పుడే కదలికలూ స్పందనలూ పుడతాయి.

ఆ కదలికను ధరించేది ‘గాంధారి’ - అంటే, సృష్టిని ధరించి పోషించేది ‘గాంధారి’. సృష్టిని ధరించి పోషించేది కోరికల బలం, వాసనల శక్తి, మునపటి కర్మఫల గంధాల శక్తి. ధృతరాష్ట్రుడు ఇంద్రియ సంబంధమైన గుడ్డి మనస్సు; అతని ‘భార్య’ గాంధారి కోరికల శక్తి. మనస్సు ఇంద్రియాల ద్వారానే చూస్తుంది గనక అది పుట్టుగుడ్డిదే; మనను అందర్నీ కోరికల శక్తి, అంటే, మునుపటి వాసనల శక్తి దళసరి పట్టీతో కళ్లకు గంతలు కట్టుకొన్నట్టుగా ప్రవర్తింపజేస్తూ ఉంటుంది.
- డాక్టర్ ముంజులూరి నరసింహారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement