Fifth Veda
-
బలరాముడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 37 బలరాముడు దేవకీ గర్భం నుంచి ఏడవ వాడిగా పుట్టవలసినవాడు. కంసుడికి ఏడూ ఎనిమిదీ గర్భాల గురించిన సందిగ్ధతను పుట్టించి, ఇంకా భయాన్ని పెంచడానికి ఈ బలరాముణ్ని దేవకీ గర్భం నుంచి సంకర్షించి, గొల్లపల్లెలో ఉన్న వసుదేవుడి భార్యే అయిన రోహిణి గర్భంలో ఉంచారు. ఆ కాలంలోనే ఈ గర్భమార్పిడి పద్ధతి జరిగింది. అందుకనే బలరాముణ్ని సంకర్షణుడని అంటారు. సంకర్షించడమంటే అసలైన అర్థం, బ్రహ్మ చైతన్యం నుంచి దూరంగా లాగడమని. ఇలా భగవంతుణ్నించి దూరంగా లాగుతూ ప్రపంచ విలాసాల ప్రలోభా లను చూపించేది ప్రకృతి. అంచేత ఇలా సంకర్షణ చేసే ప్రకృతే బలరాముడు. కానీ ప్రకృతి అంటే, భగవంతుడి ప్రకృష్టమైన, గొప్పదైన కృతి, పని, కావ్యం. కావ్యం కాంతలాగ బుర్రకెక్కేలాగ చెబుతుందని చెబుతారు. భగవంతుడనే పురుషుడు గీసిన గిరిలోనే ఉంటూ పనిచేస్తుంది ఈ ప్రకృతి అనే కావ్యకాంత. ప్రకృతి మనను దూరంగా లాగుతున్నా, దూరంగా పోవడం వల్ల కలుగుతూన్న కష్టనష్టాలను అనుభవించేలాగ చేసి, తిరిగి భగవంతుడి వైపు మళ్లేలాగ చేస్తుంది కూడాను. ఆ విధంగా కూటస్థుడైన శ్రీకృష్ణుణ్ని దాటి ఎప్పుడూ ప్రవర్తించదు అతిబలిష్ఠమూ ప్రకృతి రూపమూ అయిన బలరామత్వం. బలరాముడు ప్రకృతిగా దుర్యోధన పక్షపాతిగా, భగవంతుడి దగ్గరే ఉన్నా అతనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూన్నట్టు అవుపిస్తాడు. మోసం చేసి సంపాయించిన పాండవుల రాజ్యాన్ని కౌరవులు తిరిగి ఇయ్యాలి లేదా యుద్ధంలో చావాలి అని శ్రీకృష్ణుడు అంటూంటే, జూదమాడడమూ రాజ్యాన్ని పోగొట్టుకోడమూ ధర్మరాజు స్వయంకృతాప రాధాలే తప్ప, వాటిలో దుర్యోధన శకునుల తప్పేమీ లేదన్నట్టు గానే మాట్టాడాడు బలరాముడు. శ్రీకృష్ణుడి సాయాన్ని అడగడానికి దుర్యోధనుడూ, అర్జునుడూ ద్వారకకు వచ్చారు. కృష్ణుడు వీళ్లను పరీక్షించాలను కొన్నట్టుగా నిద్రపోతున్నాడు. ముందు వచ్చిన దుర్యోధనుడు గర్వం కొద్దీ తల వైపూ తరవాత వచ్చిన అర్జునుడు భక్తి కొద్దీ పాదాల దగ్గర కూర్చున్నారు. కృష్ణుడు లేవగానే ఎదురుగా కూర్చున్న అర్జునుణ్నే చూశాడు సహజంగానే. ‘కానీ బావా! నేనే ముందర వచ్చాను నీ సాయాన్ని అర్థించ డానికి’ అని దుర్యోధనుడు అన్నాడు. ‘నా సాయాన్ని రెండు భాగాలుగా చేస్తాను: ఒక భాగం, ఏ శస్త్రమూ ఆయుధమూ పట్ట కుండా ఏదో మాట సహాయం మాత్రం చేసే నేను; రెండో భాగం కోట్లాది మంది ఉన్న నా నారాయణీసేన. మీ ఇద్దరిలో చిన్నవాడూ నేను ముందు చూసినవాడూ అర్జునుడు కనక, అతన్నే ముందర కోరుకో మంటాను’ అని కృష్ణుడన్నాడు. దీనికి దుర్యోధనుడు, అర్జునుడు ఆ పెద్దసేనను ఎగరేసుకొనిపోతాడేమోననే బెంగతో గతుక్కుమన్నాడు. అయితే, అర్జునుడు శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని ఎరిగినవాడు కనక, శస్త్రం పట్టకపోయినా ఎలా నడచు కోవాలో ఉపాయాలు చెప్పే అతన్నే ఎన్ను కున్నాడు. నారాయణీసేనను సంతోషంగా గ్రహించి దుర్యోధనుడు ఆ మీద తనకు గదాయుద్ధం నేర్పిన బలరాముడి దగ్గరికి వెళ్లి సహాయమడిగాడు. ‘నేను కృష్ణుడితో మనకు ఇరుపక్షాలవాళ్లూ సమానమని చాలాసార్లే చెప్పాను కానీ అతనికి నా మాట నచ్చలేదు. నేనేమో కృష్ణుణ్ని విడిచి ఒక్క క్షణమైనా వేరుగా ఉండలేను. అంచేత ఇటు నీకు గానీ అటు అర్జునుడికి గానీ సాయం చేయ కూడదని మనసులో నిశ్చయించుకొన్నాను. సర్వరాజులూ పూజించే భరతవంశంలో పుట్టావు. వెళ్లు, క్షత్రియ ధర్మానుసారమూ యుద్ధం చెయ్యి’ అని బలదేవుడనగానే అతన్ని కౌగిలించుకొని, కృష్ణుణ్ని మోసం చేయ గలిగానని మురిసిపోతూ దుర్యోధనుడు హస్తినా పురానికి చక్కాపోయాడు. ఇక్కడ యుధిష్ఠిరుడు మామగారైన ద్రుపదుణ్నీ, విరటుణ్నీ, బలరాముణ్నీ, సాత్యకినీ, ధృష్టద్యుమ్నుణ్నీ, శిఖండినీ, సహదేవుణ్నీ ఏడుగురు సేనాపతులుగా అభిషేకం చేశాడు. తిరిగి ఈ ఏడుగురి లోనూ ధృష్టద్యుమ్నుణ్ని సర్వసైన్యాధి పతిగా ఘోషించాడు. వీరికి అధిపతిగా అర్జునుణ్ని నియమించాడు. అర్జునుడి క్కూడా నేతగానూ అతని రథాశ్వాల నియంతగానూ జనార్దనుణ్ని కోరు కున్నాడు యుధిష్ఠిరుడు. ఆ సమయంలోనే మహాయుద్ధానికి సన్నద్ధమయ్యారని తెలిసి బలరాముడు, అక్రూరుడూ గదుడూ సాంబుడూ మొదలైనవాళ్లతో సహా ధర్మ రాజును చూడ్డానికి వచ్చాడు. బల రాముడికి నాగలీ రోకలీ ఆయుధాలుగా వర్ణిం చడంలో కూడా అతను ప్రకృతికి ప్రతీక అని చెప్పడమే ఇమిడి ఉంది. నాగలితో నేలను దున్నగా పండిన ధాన్యాలతోనూ ఆ ధాన్యాలను రోకలితో దంచి ‘పొట్టు’ అనే అడ్డును తొలగించి ఆ అన్నాలతో సర్వభూతాలనూ ప్రకృతి సాకుతోంది. రోహిణి కొడుకు రాగానే ధర్మరాజూ కృష్ణుడూ భీముడూ అర్జునుడూ నకుల సహదేవులూ ఇతర రాజులూ అందరూ వినయంగా లేచి నిలబడి అతన్ని సత్కరించారు. కృష్ణుడి వైపు చూస్తూ బలరా ముడు ‘ఇక ఈ మహా భయంకరమైన యుద్ధం జరగవలసిందేనేమో! యుద్ధానికి ముందే, ఏ దెబ్బలూ సుస్తీలూ లేనప్పుడే చుట్టాల్నీ సుహృత్తుల్నీ చూసిపోదామని వచ్చాను. ఎవరెవరు ఈ కురుక్షేత్రానికి చేరుకున్నారో వాళ్లందరికీ కాలం పక్వ మైందన్న మాట నిస్సంశయం. నువ్వు ఒకవైపు ఉండొద్దని నేను కృష్ణుడికి చెప్పాను. పాండవులు మనకెలాగ బాంధవులో దుర్యోధన మహారాజు కూడా బంధువే. అతనిక్కూడా సాయం చెయ్యి. అతను చాలామార్లే ఇక్కడికి వస్తూ పోతున్నాడు. కానీ నీ కోసమనీ కృష్ణుడు నా మాట పట్టించుకోకుండా దుర్యోధనుణ్ని ఉపేక్షిం చాడు. కృష్ణుడువినా నేను ఈ జగత్తును కన్నెత్తై చూడలేను. అంచేత అతను ఏం చేయదలుచుకున్నాడో దాన్నే నేనూ అనుస రిస్తాను. గదాయుద్ధంలో విశారదులైన భీమదుర్యోధనులిద్దరూ నాకు శిష్యులే. అంచేత వాళ్ల పట్ల నాకు సమానమైన స్నేహముంది. కురువంశీయులు నాశనమవుతూంటే నేను చూస్తూ ఊరకనే ఉండలేను. అందుకే నేను సరస్వతీనది ఒడ్డున ఉన్న తీరాన్ని సేవించుకొందామని వెళ్తున్నాను’ అని సెలవు తీసుకొన్నాడు. ఈ మాటలతోనూ మనకు బలరాముడు తాను పురుషుడి (ఆత్మ) అధీనంలో ఉండే ప్రకృతినని చెప్పకనే చెప్పినట్టయింది. యుద్ధంలో పద్దెనిమిదో రోజుకు నలభై రెండు రోజులపాటు తీర్థయాత్రలు ముగించుకొని బలరాముడు వచ్చాడు. భీమ దుర్యోధనుల యుద్ధం జరుగు తూండగా అర్జునుడు కృష్ణుణ్ని ‘ఈ ఇద్దరిలో నీ ఉద్దేశంలో ఎవరు గొప్ప? ఎవరిలో ఏయే గుణాలున్నాయి? నువ్వు ఎలాగ బేరీజు వేస్తావు?’ అని అడిగాడు. దానికి జవాబుగా వాసుదేవుడు ఇలాగ చెప్పాడు: ‘ఇద్దరికీ సమానమైన శిక్షణే అందింది. భీమసేనుడు బలంలో మిన్న; దుర్యోధనుడేమో గదాయుద్ధంలో బాగా పరిశ్రమ చేశాడు. భీముడు ధర్మపూర్వ కంగా గదా యుద్ధం చేస్తే గెలవడు; అన్యా యంగా చేస్తేనే సుయోధనుణ్ని చంప గలుగుతాడు. దేవతలు అసురుల్ని మాయ తోనే, అంటే ఉపాయంతో కూడిన నేర్పు తోనే జయించారు. అంచేత భీముడు కూడా మాయమయమైన పరాక్రమాన్ని అవలంబించాలి. జూదమాడుతూన్న ప్పుడు సుయోధనుడి తొడలను గదతో విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేశాడు గదా! ఆ ప్రతిజ్ఞను ఇప్పుడు పూర్తి చెయ్యాలి. మాయావి అయిన దుర్యోధనుణ్ని మాయ తోనే నాశనం చేయాలి. అలా కాకుండా బలాన్నే ఆశ్రయించుకొని న్యాయంగా నాభి కింద కొట్టకూడదనే నియమాన్ని పాటిస్తే యుధిష్ఠిరుడు గడ్డు పరిస్థితిలో పడిపోతాడు. ధర్మరాజు దుర్యో ధనుడితో ఈ ద్వంద్వ యుద్ధంలో నువ్వు గెలిస్తే నీదే రాజ్యమంతా అని బుద్ధి లేని మాటల న్నాడు. భీష్మ ద్రోణ కర్ణ శల్య జయద్రథ భగదత్తుల్లాంటి వీరుల్ని చంపిన మీదట ధర్మరాజు ఈ పిచ్చిమాట అని ఇంత కాలమూ కష్టపడి చేసినదాన్నంతనీ ఒక్క సారిగా సంశయంలో పడేశాడు. ఇది ధర్మ రాజు తాలూకు పెద్ద అబుద్ధే. ఈ ఒక్కటీ గెలిస్తే అంతనీ గెలుచుకొన్నట్టే అంటూ ఇంతదాకా గెలుచుకొన్నదాన్నంతనీ పణంగా పెట్టేశాడు. దుర్యో ధనుడు గదా యుద్ధంలో ఆరితేరినవాడు. అదీగాక మిమ్మల్ని గెలవాలన్న అతినిశ్చయంతో ఉన్నాడు. భీముడు గదాయుద్ధ నియమానికి విరుద్ధంగా తన ప్రతిజ్ఞను తీర్చుకోడానికి ప్రయత్నం చెయ్యకపోతే, దుర్యోధనుడు రాజై కూర్చుంటాడు’ అని సుదీర్ఘంగా ఉపన్య సించాడు. అప్పటికే వాళ్లిద్దరూ యుద్ధంలో పరస్పర గదాఘాతాలతో ఎర్రగా తయా రయ్యారు. భీముడి గదావేగం దుర్యో ధనుడి తొడలను విరగ్గొట్టింది. కింద కూలిపోయాడు. భీముడు మునపటి సన్నివేశాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ కసి కొద్దీ దుర్యోధనుడి కిరీటాన్ని కాలితో తన్ని అతని తలను తొక్కాడు. ఇది చూసేసరికి బలరాముడి కోపం మిన్నంటింది. ‘ఛీ ఛీ భీమసేనుడా! గదాయుద్ధంలో బొడ్డు కింద కొట్టగూడదనే శాస్త్రీయ నియమాన్ని ఉల్లంఘించావు’ అని అతన్ని నిందించి, కృష్ణుడితో ‘ఈ రోజున నాతో సమానుడైన దుర్యోధనుణ్నే గాదు నన్ను కూడా అవ మానించాడు భీమసేనుడు’ అంటూ అతి కోపంతో భీముడి మీదకు ఉరికాడు. తక్షణమే శ్రీకృష్ణుడు అన్నను ఆపాడు. ‘మనకు శుద్ధపౌరుషులైన పాండవులు సహజ మిత్రులు. స్వయానా మన మేనత్త కొడుకులు. అదీగాక శత్రువుల చేత బాగా మోసానికి గురి అయ్యారు. క్షత్రియుడైన వాడికి ప్రతిజ్ఞా పరిపాలనం అతిధర్మం. సుయోధనుడి తొడల్ని గదతో భేదిస్తానని సభామధ్యంలో భీముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. తొడలు బొడ్డుకిందే ఉంటాయి. బొడ్డు కింద కొట్టకూడదంటే, ప్రతిజ్ఞను తీర్చుకోడానికి మరో మార్గమేది? అదీగాక మైత్రేయ మహర్షి, అడవిలో పాండవుల కష్టాల్ని కళ్లారా చూసి, దుర్యోధనుడికి పాండవులతో వైరం మానుకోమని చెప్పి నప్పుడు, ఈ దుర్యోధనుడు తొడమీద కొట్టుకొంటూ అతనికి కోపాన్ని తెప్పిం చాడు. ఆయన అప్పుడు భీముడి గద నీ యీ తొడను బద్దలుగొడుతుందని శపించాడు కూడాను. అదీగాకుండా ఇప్పుడు కలియుగం ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. వీటన్నిటి దృష్ట్యా వైరాన్నీ ప్రతిజ్ఞనీ తీర్చుకోవడం క్షత్రియుడైన భీముడికి తగినదే. నువ్వు కోపాన్ని దిగమింగాలి’ అని కృష్ణుడు బలరాముణ్ని తగ్గేలాగ చేశాడు. బలరాముడు కృష్ణుడికి ఎదురాడలేక ద్వారకకు వెళ్లిపోయాడు. - డా॥ముంజులూరి నరసింహారావు -
భూరిశ్రవసుడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 35 భూరిశ్రవసుడు అర్జునుణ్ని ఆడిపోసు కోవడం మొదలుపెట్టాడు; అస్త్ర ధర్మాన్నెరి గిన నువ్వు నీతో యుద్ధం చేయని నా కుడిచేతిని కొట్టెయ్యడం ఏ రకమైన ధర్మం? వాసుదేవుడి మాట విని నువ్వు ఈ నికృష్టమైన పని చేశావని తెలిసిపోతోంది. నువ్వు కృష్ణ సఖుడివి కాకపోతే ఈ పని చేసేవాడివి కావు’ అని అర్జునుణ్ని తప్పు బట్టడమే కాకుండా కృష్ణుణ్ని కూడా దూషించాడు. భూరిశ్రవసుడు భీష్ముడికి వరసకు మనవడవుతాడు. భూరిశ్రవసుడికి భూరి దక్షిణుడనీ యూపకేతువనీ యజ్ఞశీలుడనీ పేర్లు ఉన్నాయి. యజ్ఞంలో బలిపశువును కట్టే స్తంభాలను యూపస్తంభాలని అంటారు. ఆ యూపస్తంభాన్నే తన రథానికి ధ్వజంగా చేసుకున్నాడు ఈ కర్మప్రతీకుడు. యజ్ఞ కర్మల్లో ఎక్కువగా దక్షిణలిచ్చేవాడు గనక ఇతన్ని భూరి దక్షిణుడని కూడా అంటారు. భూరిశ్రవసుడి పుట్టుక వెనుక ఒక కథ ఉందని చెబుతారు. వసుదేవుడికి కాబోయే భార్య అయిన దేవకికి స్వయంవరం చేసి నప్పుడు, శిని అనే వృష్ణి వర్గంవాడు, ఆమెను తెచ్చి వసుదేవుడికిచ్చి పెళ్లిచేద్దా మని ఆవిణ్ని తీసుకొని వస్తున్నాడు. తోవలో ఆ పనికి సోమదత్తుడు అడు ్డపడ్డాడు. శినీ సోమదత్తుడూ పోట్లాడు కున్నారు. ఓడిపోయిన సోమదత్తుణ్ని శిని చంపకుండా తన్ని అవమానపరిచి విడిచిపెట్టాడు. ఆ అవమానం సోమదత్తుణ్ని పీడించింది. తన రాజ్యానికి తిరిగి పోకుండా, అతను అక్కణ్నించే తపస్సు చేయడానికి వనానికి వెళ్లిపోయాడు. అయితే, తపస్సుకు కావలసిన ఫలితం వచ్చేలోపులో శినీ చచ్చిపోయాడు, శిని కొడుకు సత్యకుడూ చచ్చిపోయాడు. అంచేత శిని మనవణ్ని ఓడించగలిగే కొడుకు తనకు కలగాలని వరం కోరుకున్నాడు సోమదత్తుడు. ఆ వరప్రసాదంగానే భూరిశ్రవసుడు పుట్టాడు. శిని మనవడే సత్యకుడికి కొడుకైన సాత్యకి. ఈ సాత్యకి అసలు పేరు యుయుధానుడు. బ్రహ్మచైతన్య యోగం కోసం యుద్ధం చేయడానికి బుద్ధిని ధారణ చేసినవాణ్నే యుయుధానుడని అంటారు. అంటే, యోగం కోసం పోరాడాలన్న శ్రద్ధా భక్తీ ఉన్నవాడన్నమాట. అంచేతనే ఈ సాత్యకిని శ్రద్ధకు ప్రతీకగా చెబుతారు. శినికో శిని కొడుకుకో పడవలసిన కర్మశిక్ష, శిని మనవడైన సాత్యకికి దిగివచ్చింది. కర్మఫలం తప్పకుండా వచ్చిపడడం వరప్రసాదంగా కథారూపేణా చెప్పుకొంటాం. సాత్యకి అర్జునుడికి శిష్యుడు. సాత్యకి విలువిద్య అంతా అర్జునుడి ప్రసాదం. అదీగాక సాత్యకి వరసకి, సత్యభామకు తమ్ముడుగా, శ్రీకృష్ణుడికి బావమరిది అవుతాడు. సైంధవుణ్ని సూర్యుడు అస్తమించేలోపుగా వధించాలనే ప్రతిజ్ఞను నెరవేర్చుకోడానికి, ద్రోణుణ్ని తప్పించుకొని, కౌరవ సేనా వ్యూహంలో చొరబడిన అర్జునుడికి సాయంగా ఉండమని ధర్మరాజు, భీముణ్నీ సాత్యకినీ పంపించాడు. సాత్యకి యుద్ధం చేస్తూ చాలామందినే సంహరిస్తూ ముందుకు వస్తున్నాడు. చాలా అలసిపోయిన స్థితిలో అతనికి తటాలున భూరిశ్రవసుడు ఎదురయ్యాడు. ‘చాలా కాలానికి నా కోరిక తీరబోతోంది. ఈ రోజున నువ్వు యుద్ధరంగం వదిలి పారిపోకుండా ఉంటే, నా చేతిలో చనిపోవడం నీకు తప్పదు. నా చేతిలో నువ్వు చనిపోయినప్పుడు, నిన్ను ఈ వ్యూహంలోకి పంపిన ధర్మరాజు నీలాంటి దుర్బలుణ్ని పంపినందుకు సిగ్గుపడతాడు. ‘రా, యుద్ధానికి సిద్ధపడు’ అని అంటూ సాత్యకిని కవ్వించాడు భూరిశ్రవసుడు. యుయుధానుడు నవ్వుతూ సమాధానం చెబుతూ, ‘నేను నీ మాటలకే భయపడిపోయే పిరికివాణ్ని కాను. నన్ను యుద్ధంలో నిరాయుధుణ్ని చేసినవాడే నన్ను గెలవగలుగుతాడు. అయినా, వట్టిగా బడబడలాడడం వల్ల లాభమేమిటి? నువ్వన్నది చేసి చూపించు చూద్దాం’ అంటూ ఆ సవాలును స్వీకరించాడు సాత్యకి. ఒక ఆడ ఏనుగు కోసం భీషణంగా కొట్టుకొనే రెండు ఏనుగుల్లాగ జయం కోసం పోరాడుతూ వాళ్లిద్దరూ ఒకళ్ల మీద మరొకళ్లు బాణవర్ష ధారలు కురిపించడం మొదలుపెట్టారు. విల్లులు విరగ్గొట్టుకొని రథాలను ధ్వంసం చేసుకొని, ఇక కత్తి యుద్ధానికి దిగారు. రకరకాలుగా ఖడ్గ యుద్ధం చేస్తూ ఒకరి డాలును మరొకరు విరగ్గొట్టి ఆమీద మల్లయుద్ధానికి ఉపక్ర మించారు. వాళ్లిద్దర్నీ కొంతదూరంలో ఉన్న కృష్ణార్జునులు చూస్తున్నారు. కృష్ణుడు ‘సాత్యకి బాగా అలసిపోయినప్పుడు ఈ భూరిదక్షిణుడు యుద్ధాన్ని కోరుకొంటూ ఎదురుపడ్డాడు. అంచేత వీళ్ల యుద్ధం సమయుద్ధంగా లేదు. యుయుధానుడు నేలమీద పడిపోయాడు చూడు! నీ శిష్యుణ్ని ఇప్పుడు నువ్వు కాపాడాలి’ అంటూ అర్జునుణ్ని పురిగొల్పాడు. సాత్యకి జుట్టు పట్టుకొని, కాలితో ఛాతీమీద తన్నుతూ భూరి శ్రవసుడు తన ఒర నుంచి ఖడ్గాన్ని తీశాడు. యుయుధా నుడి శిరస్సును కోద్దామని భూరిశ్రవసుడు ఉంకిస్తున్నాడు. కుమ్మరి చక్రం మీది కన్నంలో కర్రను పెట్టి కుమ్మరి చక్రాన్ని తిప్పినట్టు, సాత్యకి యూపకేతువు కత్తికి అందకుండా తిప్పుతూ ఉన్నాడు. ‘నువ్వు నీ శిష్యుణ్ని తక్షణమే కాపాడాలి’ అంటూ శ్రీకృష్ణుడు చెబుతూన్న మాటలను విని, అర్జునుడు గాండీవం మీద ఒక బాణాన్ని సంధించి, ఖడ్గంతో సహా భూరిశ్రవసుడి కుడిచేతిని కొట్టేశాడు. భూరిశ్రవసుడు అర్జునుణ్ని ఆడిపోసు కోవడం మొదలుపెట్టాడు; ‘మరొకడితో యుద్ధం చేస్తూన్నవాడి చేతిని కొట్టడం నీకు ఇంద్రుడు చెప్పాడో కిరాతుడైన రుద్రుడే చెప్పాడో సాక్షాత్తూ నీ గురువు ద్రోణుడే చెప్పాడో మొదటి గురువు కృపాచార్యుడే చెప్పాడో నాకు తెలియదు. అస్త్ర ధర్మాన్నెరి గిన నువ్వు నీతో యుద్ధం చేయని నా కుడిచేతిని కొట్టెయ్యడం ఏ రకమైన ధర్మం? వాసుదేవుడి మాట విని నువ్వు ఈ నికృష్టమైన పని చేశావని తెలిసిపోతోంది. నువ్వు కృష్ణ సఖుడివి కాకపోతే ఈ పని చేసేవాడివి కావు’ అని అర్జునుణ్ని తప్పు బట్టడమే కాకుండా కృష్ణుణ్ని కూడా దూషించాడు. ‘మాకోసం ప్రాణాలను ఒడ్డి యుద్ధం చేస్తూన్న యోద్ధను రక్షించడం నా ధర్మం. యుద్ధం చేసే వీరుడు కేవలం తననే రక్షించుకొంటూ కూర్చోకూడదు; తన పనుల్ని చేసి పెడుతూన్న వాళ్లను రక్షించడం కూడా రాజు కర్తవ్యమే. అలాగే వాళ్లు కూడా రాజును రక్షిస్తూ ఉండాలి. అయినా ఈ సంగ్రామం ఒక్కొక్కరూ ఒక్కొక్కరితో చేస్తున్నారని చెప్పడానికి కుదరదు. ఇదో సైన్య సాగరం. ఎవరెవర్ని దెబ్బతీస్తున్నారో చెప్పలేం. ఒక పక్షమూ వేరు పక్షమూ మధ్య జరుగుతూన్న యుద్ధమని చెప్పగలం తప్ప, ఒక ఫలానా యోద్ధా మరొక ఫలానా యోద్ధా మధ్య జరుగుతూన్న యుద్ధంగా దీన్ని చెప్పడం చెల్లదు. అదీగాక సాత్యకి అలసిపోయి ఉన్నాడు. అంచేతనే నీకు దొరికిపోయాడు. అటువంటి సమయంలో నాలాంటి బాధ్యత గల యోద్ధ అతన్ని కాపాడడంలో ఏ దోషమూ లేదు సరిగదా న్యాయమే ఉంది. అయినా మీరందరూ కలిసి అభిమన్యుణ్ని చంపలేదా? అప్పుడు ఈ నువ్వు చెప్పే న్యాయం ఎక్కడికి పోయింది?’ అంటూ దీటైన జవాబు చెప్పాడు అర్జునుడు. ఈ మాటలు విని, యూపకేతువు మారుమాటాడలేదు. అతను తన ఎడమచేత్తో బాణాలను కింద పరుచుకొని, ఆ శరాసనం మీద కూర్చొని ధ్యానమగ్నుడై ప్రాణాలను వదిలిపెట్టడానికి సంసిద్ధుడయ్యాడు. ‘నాకు ధర్మరాజూ భీముడూ నకుల సహ దేవులూ అంటే ఎంత ప్రేమో నువ్వన్నా అంతే ప్రేమ. నేనూ కృష్ణుడూ నువ్వు పుణ్యలోకాలకు పోవాలని ఆకాంక్షి స్తున్నాం’ అంటూ అర్జునుడు అనడంతో బాటు కృష్ణుడు కూడా ‘నాతో సమానంగా గరుడుడి మీద ఎక్కి సంచరించేవాడివి కా’ అంటూ దీవించాడు. ఇంతలో సాత్యకి లేచి, కృష్ణార్జునులు వద్దు వద్దు అని అంటూన్నా వినకుండా భూరిశ్రవసుడి శిరస్సును తన కత్తితో కోసేశాడు. దాన్ని తప్పుబట్టిన కౌరవులకు అర్జునుడన్నమాటే అప్పజెప్పాడు: ‘శస్త్రాలూ కత్తులూ ఏమీలేని విరథుడూ కవచ హీనుడూ అయిన అభిమన్యుణ్ని చంపడం ధర్మమైతే ఇదీ అంత ధర్మమే. నేను ఈ భూరిశ్రవుడి తల తీయడానికి నా ప్రతిజ్ఞే కారణం. ఎవరైతే నన్ను రణరంగంలో బతికుండ గానే కోపంతో కాలితో తంతాడో వాణ్ని, అతను ముని వ్రతుడైనా సరే, చంపుతా నని నా ప్రతిజ్ఞ. అది తీర్చుకోవడం సబబే గనక నేను ఈ పని చేశాను’ అని తన పనిని సమర్థించుకొన్నాడు సాత్యకి. కథాపరంగా చూస్తే, ఈ చంపడం ఒప్పా తప్పా అనే వాదాలు సహజంగానే పుడతాయి. కానీ శ్రద్ధను (సాత్యకిని) నాశనం చేద్దామని చూసే కర్మనీ కర్మ బంధాన్నీ (భూరిశ్రవసుణ్ని) మనో నిగ్రహంతో (అర్జునుడి ద్వారా) మట్టు బెట్టడం నూటికి నూరుపాళ్లూ ఒప్పే. అలాగే శ్రద్ధే సూటిగా కర్మబంధాన్ని కోసెయ్యడమూ బేషరతుగా ఒప్పే. ఇటువంటి సన్నివేశం ద్రోణవధ ఘట్టంలో కూడా ఉంది. ద్రోణుడు, కొడుకు చనిపోయాడని వినగానే, కుడిచేయి తెగిన భూరిశ్రవసుడి లాగ, అస్త్ర సన్యాసం చేసి, యోగధ్యానంలో కూర్చున్నాడు. అతన్ని చంపడానికే పుట్టిన ధృష్టద్యుమ్నుడు తటాలున అతని రథం ఎక్కి, ద్రోణుడి తలకాయను నిర్దాక్షిణ్యంగా కోసేశాడు. ఇదీ ఒప్పా తప్పా అనే మీమాంసకు తెరతీసింది. కానీ అలవాట్లను మప్పి నేర్పే వాసన అనే ఆచార్యుడి తలను ఆగమశక్తి తెగ్గోయడం అత్యంతమూ సబబే. అంచేతనే మనం ఈ భారతవ్యాసాల పరంపరలో అంతటా, మనుషుల వెనక ఉన్న భావాలనే గ్రహించాలని పదేపదే చెబుతూ వస్తున్నాం. - డా॥ముంజులూరి నరసింహారావు -
ఘటోత్కచుడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 34 ఘటోత్కచుడు హిడింబి అనే ఒక రాక్షసి కడుపున పుట్టాడు. అంటే, రాక్షసాంశ ఉన్నవాడన్నమాట. పాండవుల తట్టున ఉన్నంతమాత్రాన, భీమసేనుడి కొడుకైనంత మాత్రాన ఘటోత్కచుడు ధర్మలోపం చేయనివాడేమీ కాదు. అతను యజ్ఞద్వేషీ జ్ఞానద్వేషీను. కర్ణుడు ఇంద్రుడికి తన కవచ కుండలాల్ని దానం చేసి, ప్రతిదానంగా అర్జునుణ్ని చంపాలనే దుర్బుద్ధితో శక్తినొకదాన్ని అడిగి పుచ్చు కొన్నాడు. ఆ శక్తి కర్ణుడి దగ్గరున్నంత వరకూ శ్రీకృష్ణుడికి ఒకటే బెంగ. దాన్ని, ఘటోత్కచుడి ప్రతాపాన్ని సహించలేక కర్ణుడు వేసి అతన్ని చంపినప్పుడు, శ్రీకృష్ణుడు ఆనందాన్ని పట్టలేక, గట్టిగా సింహనాదం చేస్తూ అర్జునుణ్ని కావలించుకొన్నాడు. మగధరాజు జరాసంధుడూ చేదిరాజు శిశుపాలుడూ నిషాదరాజు ఏకలవ్యుడూ - వీళ్లని వేరు వేరు ఉపాయాలతో చనిపోయేలాగ చేయకపోతే, ఈ మహాభారత యుద్ధంలో దుర్యోధనుడి వైపు వాళ్లు చేరడమూ ఖాయమే, వాళ్లను జయించలేకపోవడమూ ఖాయమే అయ్యుండేది. వాళ్లతోపాటు ఘటోత్కచుడు కూడా ముందే పోవలసిన వాడే కానీ పాండవులకు ప్రియుడు గనక, ఇంత కాలంపాటు అతను బతికి ఉన్నాడు. కర్ణుణ్ని కవచకుండలాలతో సహా శక్తి హీనుణ్ని చేసి మానుషత్వాన్ని పొందేలాగ ధర్మాన్ని నిలబెట్టే శ్రీకృష్ణుడి ఉపాయమే చేసింది. కర్ణుడు బ్రహ్మణ్యుడు, అంటే, జ్ఞాన సంపన్నుల్ని ప్రేమించేవాడు; సత్యాన్నే చెప్పేవాడు; తపస్సు చేసిన వాడు; నియమాలనూ వ్రతాలనూ చేసిన వాడు; శత్రువుల్ని కూడా దయగా చూసే వాడు. ఈ గుణాల కారణంగా అతన్ని ధర్మాత్ముడని నలుగురూ చెప్పుకొనేవాళ్లు. అర్జునుడు తప్ప మరెవ్వరూ చంపలేరు కర్ణుణ్ని. అర్జునుడికి ఆ అవకాశం రావాలంటే, కర్ణుడికి ఇంద్రుడిచ్చిన శక్తి వ్యర్థమైపోవాలి. దాన్ని అతను వివశుడై, మరేమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉపయో గించాలి. ఈ యోగంతోనే రెండు ఫలా లను సాధించాడు శ్రీకృష్ణుడు; ఒకటి, కర్ణుడు శక్తిహీనుడు కావడమూ, రెండోది, ఘటోత్కచుడనే రాక్షస స్వభావం చనిపో వడమూను. ఈ కారణంగానే ఘటోత్క చుడు పతనమై పోగానే పాండవులందరూ శోకంతో ఏడుస్తున్నా, శ్రీకృష్ణుడు ఆపుకో లేనంత ఆనందంతో అతిహర్ష నాదాన్ని చేస్తూ నాట్యం చేశాడు. బావగారైన సైంధవుణ్ని అర్జునుడు చంపి, ప్రతిజ్ఞ తీర్చుకోగానే, దుర్యో దనుడు ఉండబట్టలేక, ద్రోణుణ్ని ‘పాండవ పక్షపాతిగా యుద్ధం చేస్తున్నావు’ అంటూ నానామాటలూ అన్నాడు. దానితో బాధపడుతూ సాయంత్రం శిబిరానికి వచ్చి కూడా కవచం విప్పకుండానే తిరిగి యుద్ధభూమికి వెళ్లిపోయాడు ద్రోణుడు. పాంచాలుల్ని చంపి గానీ తిరిగి రానంటూ ఉక్రోషంతో మాట్టాడుతూ రణ భూమికి చేరిన ద్రోణుడి ముందు ఎవరూ నిలవలేకపోయారు. ఆ విధంగా మహా భారత యుద్ధపు పద్నాలుగోరోజున యుద్ధ నియమాలకు విరుద్ధంగానే రాత్రి యుద్ధం ప్రవర్తించింది. రాక్షసులకు రాత్రి పూట అనువైన కాలం. ఇటు పాండవుల వైపు హిడింబుడి మేనల్లుడు ఘటోత్క చుడూ అటు కౌరవులవైపు జటాసురుడి కొడుకు అలంబుషుడూ ఇద్దరూ అతి రాక్షస బలంతో పేట్రేగిపోయారు. ఘటోత్కచుడికి ఒక అక్షౌహిణీ ఉంది: ఇరవై యొక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథాలూ అన్నే ఏనుగులూ వాటికి మూడింతలు, అంటే, అరవై ఐదు వేల ఆరు వందల మంది గుర్రాలూ దీనికి మరో రెండింతలు కలిపిన, అంటే, ఒక లక్షా తొమ్మిదివేల మూడు వందల యాభై మంది కాల్బలమూ - ఇదీ ఒక అక్షౌహిణీ అంటే. ఈ సేన శూలాలూ ముద్గరాలూ కొండ శిఖ రాలూ పెద్ద పెద్ద వృక్షాలూ ఆయుధాలుగా పట్టుకొని సిద్ధంగా ఉంది. ఘటోత్కచుడు ఒక పర్వత శిఖరంలాగ వస్తూ ఒక సింహగర్జన చేశాడు. ఆ గర్జనకు మనుషులు అల్లాడిపోయారు. అతను సృష్టించిన మాయతో ఇనప చక్రాలూ ఈటెలూ శూలాలూ శతఘు్నలూ వరసగా మీదపడుతూంటే ధృతరాష్ట్రుడి కొడుకులూ కర్ణుడూ ఇతర రాజులూ పరుగులు పెట్టారు. అశ్వత్థామ మాత్రం తన అస్త్ర బలంతో ఘటోత్కచుడి మాయను నష్ట పరిచి, అతనికి అతి కోపాన్ని తెప్పించాడు. అతను కోపంతో వేసిన శరవ్రాతాలు అశ్వత్థామ శరీరంలోకి దూరి రక్తసిక్తం చేశాయి. కోపంతో అశ్వత్థామ వేసిన పది బాణాలతో గట్టి పీడ పుట్టిన ఘటోత్క చుడు ఒక చక్రాన్ని విసిరాడు. దాన్ని అశ్వత్థామ వాడి బాణాలతో దెబ్బతీశాడు. ఇంతలో ఘటోత్కచుడి కొడుకు అంజన పర్వుడు అశ్వత్థామకు అడ్డుకట్ట వెయ్య డానికి వచ్చాడు. అశ్వత్థామ అంజన పర్వుడి ధ్వజాన్ని, రథసారథుల్నిద్దర్నీ, రథాన్నీ, నాలుగు రథాశ్వాలనూ నేల మీదకు ఒరిగేలా చేశాడు. అప్పుడు విరథుడైన అంజన పర్వుడు ఖడ్గాన్ని తీసుకొంటే దాన్నీ రెండు ముక్కలు చేశాడు ద్రోణ పుత్రుడు. ఆ మీద అంజనపర్వుడు ఆకాశంలోకి ఎగిరి వృక్షాలను వర్షించడం మొదలుపెట్టాడు. అతణ్ని ద్రోణపుత్రుడు తన వాడి శిలీ ముఖాలతో బాధపెట్టేసరికి, అంజన పర్వుడు కిందికి దిగివచ్చాడు. రుద్రుడు అంధకాసురుణ్ని అంతం చేసినట్టు, ఇనప కవచాన్ని ధరించి ఉన్న అంజనపర్వుణ్ని ద్రౌణి యమదండంలాటి ఒక బాణంతో వధించాడు అశ్వత్థామ. కొడుకును చంపిన అశ్వత్థామ మీదకు కసిగా ఉరికాడు ఘటోత్కచుడు. మాయను పన్ని కాటుక కొండలాగ మీద పడుతూ ఉంటే, అశ్వత్థామ వజ్రాస్త్రాన్ని వేసి, ఆ మాయాపర్వతాన్ని చూర్ణం చేశాడు. ఆ మీద అతను మేఘమై రాళ్ల వర్షం కురిపించడం మొదలుపెడితే, వాయవ్యాస్త్రం వేసి ఆ నీలిమేఘాన్ని చెదర గొట్టేశాడు అశ్వత్థామ. తన ప్రయత్నాలన్నీ వమ్మై కంగారేమీ పడకుండా కరాళ ముఖాలున్న చాలామంది రాక్షసులతో కలిసి అశ్వత్థామ మీద దాడిచేశాడతను. తొణకకుండా ఆ అక్షౌహిణీ సైన్యం మొత్తాన్నీ అశ్వత్థామ యమపురికి పంపించాడు. ఘటోత్కచుణ్ని కూడా ఒక బాణంతో వేధించి కిందపడేశాడు. కొంత రాత్రి గడిచిన తరవాత మళ్లీ ఘటోత్కచుడు అశ్వత్థామకు ఎదు రయ్యాడు. ఈసారి రాక్షసుడు అశ్వ త్థామను తుఫానుగాలికి ఊగిపోయే చెట్టులాగ వణికించేశాడు. ఇంతలోనే పుంజుకొని మళ్లీ ఘటోత్కచుణ్ని యమ దండంలాటి గొప్ప బాణాలతో వేధించాడు అశ్వత్థామ. బాధలో మునిగిన ఘటోత్కచుణ్ని చూసి అతని సారథి త్వరగా రథాన్ని పక్కకు తప్పించేశాడు. ఆ రోజు రాత్రి యుద్ధంలో కర్ణుడు విపరీతంగా విక్రమించడం మొదలు పెట్టాడు. ధర్మరాజుకు భయం వేసింది. అతను అర్జునుడితో ‘నువ్వు ఇక కర్ణుణ్ని చంపకపోతే మన సైన్యంలో ఎవరూ మిగలరు’ అంటూ అతన్ని తొందర పెట్టాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ‘కర్ణుడితో తలపడవలసిన సమయం ఇంకా రాలేదు. ఇంకా అతని దగ్గర శక్రశక్తి ఉంది. ఇప్పుడు ఘటోత్కచుణ్ని అతని మీదకు పంపిద్దాం. ఆ రాక్షసుడి చేతిలో కర్ణుడికి మూడుతుంది’ అన్నాడు. ఘటో త్కచుణ్ని పిలిచి కర్ణుడితో యుద్ధం చేసి చంపమని పురమాయించాడు కూడాను. ఘటోత్కచుడు కర్ణుడివైపు వెళ్తూంటే, అలంబుషుడు అడ్డుకొన్నాడు. అతణ్ని చంపి కర్ణుడి మీదకు మళ్లీ లంఘించాడు ఘటోత్కచుడు. కర్ణ ఘటోత్కచులిద్దరూ రెండు పులులు గోళ్లతో చీల్చుకొన్నట్టు, రెండు ఏనుగులు దంతాలతో కొట్టు కొన్నటు బాణాలతో ఒకళ్లనొకళ్లు క్షత విక్షతులనుగా చేసుకోవడం ప్రారంభిం చారు. ఇద్దరి శరీరాలూ రక్తాలోడాయి. మాయావి అయిన రాక్షసుడు ఒకసారి ముక్కముక్కలై బలహీనుడై ఆకాశం నుంచి పడిపోయినట్టు మాయను కల్పించాడు. అతను చనిపోయాడని కౌరవులందరూ గర్జిస్తూ ఉండగా మళ్లీ కొత్త కొత్త దేహాలతో అన్ని దిక్కుల్లోనూ కనిపించడం మొదలుపెట్టాడు. ఒకసారి బొటనవేలంత చిన్నవాడిగానూ మరోసారి మైనాక పర్వతమంత పెద్దగానూ అవుపిస్తూ వాళ్లకు శాంతి లేకుండా చేస్తూ మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ఈవిధంగా రాత్రి యుద్ధం జరుగు తూన్న విషయం అలాయుధడనే బకా సురుడి సోదరుడికి తెలిసి దుర్యోధనుడి దగ్గరికి తన రాక్షస సైన్యంతో సహా వచ్చి ‘నేను భీముణ్ని చంపి మా అన్న బకుడి ఋణం తీర్చుకొంటాను. అతను మా రాక్షసుల ఆడపడుచును బలాత్కారంగా పెళ్లి చేసుకొని మమ్మల్ని అవమానించాడు. హిడింబుణ్నీ కిమ్మీరుణ్నీ చంపాడు. మా రక్తం కుతకుతలాడుతోంది. అనుజ్ఞ ఇయ్యి’ అంటూ ప్రాధేయపడ్డాడు. దుర్యోధనుడి ఆజ్ఞ తీసుకొని భీముణ్ని ఎదిరించాడు అలాయుధుడు. అతను భీముణ్ని హింసి స్తూంటే శ్రీకృష్ణుడు మళ్లీ ఘటోత్కచుణ్ని పిలిచి ‘మీ నాన్నను ఇబ్బందిపెడుతూన్న అలాయుధుణ్ని ముందుగా చంపు’ అని పంపాడు. ఆ మీద అలాయుధుణ్ని పట్టి తిప్పితిప్పి నేలకేసి కొట్టి తలకాయను నిర్దాక్షిణ్యంగా కోసేశాడు ఘటోత్కచుడు. తిరిగి కర్ణుడి మీదకు మళ్లించాడు ఘటోత్కచుడు తన ప్రతాపాన్ని. కర్ణుడు అంతరిక్షాన్నంతనీ బాణాలతో ఆచ్ఛాదించి విజృంభిస్తూ ఉంటే, ఘటోత్కచుడు దారుణమైన మాయను ప్రయోగించాడు. ఎర్రటి మబ్బులు ప్రకాశించాయి; వాటి నుంచి మెరుపులూ ఉల్కలూ పడడం మొదలుపెట్టాయి. రకరకాల శరాలూ శక్తులూ ఈటెలూ రోకళ్లూ గొడ్డళ్లూ ఖడ్గాలూ ఇనపగదలూ శతఘు్నలూ బండరాళ్లూ పిడుగులూ చక్రాలూ సైన్యం మీద అవిచ్ఛిన్నంగా పడడం మొదలు పెట్టాయి. వాటిని ఆపలేకపోయాడు కర్ణుడు. గుర్రాలు చచ్చి కిందపడు తున్నాయి; ఏనుగులు నేలకూలి పోతున్నాయి; మహారథులు చతికిల పడిపోతున్నారు.ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. ఎవర్నీ వదలకుండా నిర్దాక్షిణ్యంగా నరికి పోగులు పెట్టాడు ఘటోత్కచుడు. ఈ ఊచకోతను భరించలేక కౌరవులు కర్ణుడితో ‘ఇక నువ్వు ఇంద్రశక్తితో వీణ్ని చంపకపోతే మేమందరమూ నాశనమైపోతాం’ అంటూ కాళ్లావేళ్లాపడి బతిమాలడం మొదలుపెట్టారు. దాంతో అర్జునుణ్ని చంపాలని దాచుకొన్న శక్తిని ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు కర్ణుడు. ఆ రాక్షసుడి మహా శరీరం నేలమీద పడుతూ ఒక అక్షౌహిణీ కౌరవ సైన్యాన్ని ముద్ద ముద్ద చేసింది. ఇదే కర్ణసంహారానికి దారిని సుగమం చేసింది. -
విరటుడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 30 విరటుడు మత్స్యదేశానికి అధిపతి. పాండవులు పన్నెండేళ్ల వనవాసం పూర్తి చేసుకొని, ఎవరికీ తెలియకుండా గడప వలసిన పదమూడో ఏడాదిని మారు వేషాల్లోనూ మారుపేర్లతోనూ ఈ విరాట రాజు కొలువులో గడిపారు. భౌతికమైన కోరికలు అలవాట్లుగా స్థిరపడి, మనిషిని పూర్తిగా వశం చేసు కున్నప్పుడు, ఆ అలవాట్లనే దొంగరాజుల పాలన నుంచి తన శరీర రాజ్యాన్ని విడి పించడానికి, కనీసం పన్నెండేళ్లైనా వ్యవధి పడుతుంది సాధకుడికి. శారీరకమూ మాన సికమూ అయిన మార్పులకూ... మంచి అలవాట్లను అలవర్చుకుని, వాటిని దృఢంగా నిలుపుకోడానికీ అథమపక్షం ఒక పుష్కర సమయం కావాలి. పోయిన శరీర రాజ్యాన్ని తిరిగి పొందడానికి వివేక గుణబలగాలు, ఆ బలాన్ని సమాధి యోగానుభవంలో స్థిరమూ దృఢమూ చేసుకోవాలి. అలా వివేక బలాల్ని నిలుపు కొంటూ శరీరం గుండా, ఇంద్రియాల గుండా వాటిని రూఢీగా ప్రకాశింప జేయగలగాలి. అలా తమ సామర్థ్యాన్ని నిరూపించుకొన్న తరవాత, అవి శారీరక రాజ్యాన్ని తిరిగి తమ అధీనంలోకి తీసు కోవడానికి చేయవలసిన ఆధ్యాత్మిక యుద్ధానికి సిద్ధంగా ఉంటాయి. వన వాసాన్ని పాండవులు తమ ఆధ్యాత్మిక శక్తుల్ని దృఢపరుచుకోడానికి ఉపయో గించారు. పన్నెండేళ్లు వాళ్లు తమ తమ వివేక బలగాల్ని దిట్టపరుచుకొని, విరటుడి కొలువుకి పదమూడో ఏడాదిని అజ్ఞాతంగా గడపడానికి చేరుకున్నారు. ‘విరాట’ అనే మాటను ‘వి’, ‘రాజ్’ అనే రెండింటి అర్థాల్ని కలిపి రాబడతారు. ‘వి’ అనేది ఒక ఉపసర్గః. దానికి ‘విశేషంగానూ, వివిధంగానూ’ అనే అర్థాలున్నాయి. ‘రాజ్’ అంటే, పరిపాలించడమూ ప్రకాశించడమూ అనే అర్థాలు ఉన్నాయి. విశేషంగానూ వేరు తీరులోనూ పరిపాలించడమంటే, సామాన్యమైన మానుషచైతన్యంతో కాకుండా, సమాధి ధ్యానంలో అనుభవానికి వచ్చే దివ్య చైతన్యంతో పరిపాలించడమని అర్థం. అంచేతనే విరాటరాజు పరిపాలన మరోలా ఉంటుంది. కీచకుడనే సేనాపతి బావమరిది ద్వారానే అతని పాలన సాగుతూన్నట్టనిపిస్తుంది. త్రిగర్తరాజు సుశర్మని, సాల్వ దేశస్థుల్ని కీచకుడు తన బంధుసేనలతో ఆక్రమించి చాలాసార్లు సతాయించాడు. విరటుడి పరిపాలన ఇలా ఉండడం, ‘విరటుడు’ సమాధి తాలూకు తాత్కాలికమైన దివ్య యోగ స్థితులకు ప్రతీక అని చెప్పడానికి సరిపడుతుంది. సవికల్ప సమాధిలో సాధకుడు, విశేషంగా ఆత్మలో మునిగిపోయి, బయటి విషయాల్ని తెలియని స్థితిలో ఉంటాడు. విరాటరాజు కొలువులో మహారాజైన ధర్మరాజు తోటిరాజు దగ్గర సేవకుడిగా పనిచేయడానికి కంకుభట్టనే బ్రాహ్మ ణుడిగా మారువేషం వేసుకున్నాడు. ఆ రాజును సంతోషపెట్టడానికి అతనితో పాచికలాడుతూ ఉండేవాడు. భీముడు వలలుడనే వంటవాడిగా ఉంటూ, తన శారీరక బలాన్ని చూపిస్తూ మల్లయుద్ధాలు చేస్తూ రాజును సంతోషపెట్టేవాడు. ఊర్వశి ఇచ్చిన శాపాన్నే వరంగా మలచుకొని బృహన్నలై అర్జునుడు రాచకూతురు ఉత్తరకు నాట్యగాన పాఠాల్ని నేర్పుతూ కాలాన్ని నెట్టుకొచ్చాడు. నకుల సహ దేవులు గుర్రాల్నీ ఆవుల్నీ సాకుతూ పశువుల శాలల్లో గడిపారు. ఆ ఏడాది చివరికి వస్తూన్నప్పుడు కీచకుడి బెడద వచ్చిపడింది. విరాటరాజు కీచకుడికి ఎదురు పలకలేడన్న విషయం అప్పుడే మనకు బయటపడింది. సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని అమర్యాదగా వెంటాడుతూ సభకు వచ్చిన కీచకుణ్ని పల్లెత్తు మాటైనా అనలేకపోయాడు విరటుడు. పైగా, ‘మీ ఇద్దరిమధ్యా ఇంతకుముందు ఏ కీచులాటలు జరిగాయో నాకు తెలియవుగా’ అంటూ తప్పించుకోడానికే చూశాడు. కామం పెచ్చరిల్లినప్పుడు, దాన్ని బయట పడనీయకుండా అదుపులో ఉంచుతూ గుట్టుచప్పుడు గాకుండానే నాశనం చేయ డానికి ప్రాణక్రియల్ని ముమ్మరం చేయాలి. అదే విషయాన్ని భీముడనే ప్రాణ క్రియా శక్తి కీచకుడనే కామశక్తిని నాశనం చేసినట్టు కథారూపేణా చెబుతారు. ప్రతికూలమైన ఇంద్రియాల మొగ్గుదలలు నూరూ ఇంద్రియాల శక్తులు ఐదూ అదమలేని మనస్సు ఒకటీ వెరసి నూటారు. ఆ నూటారుగురే కీచకుడూ ఉపకీచకులూను. ఏడాది ఇక కొన్ని రోజుల్లో పూర్తి కాబోతూండగా దుర్యోధనుడికి కీచకవధ గురించి అనుమానం వేసింది. కానీ దాన్ని కర్ణుడూ దుశ్శాసనుడూ మాట్లాడిన తీరును బట్టి బలం లేకుండా చేశారు. ‘పాండవులు బాగా గుప్తమైన స్థానంలో దాక్కొనైనా ఉండవచ్చు; లేకపోతే, సముద్రానికి అవ తల ఒడ్డుకు వెళ్లైనా ఉంటారు. లేక వాళ్లను మహారణ్యంలో క్రూరమృగాలు గానీ కొండచిలువలు గానీ మింగేసి ఉండవచ్చు. అదీ కాకపోతే విషమాతి విషమ పరిస్థితుల్లో పడి పూర్తిగా నాశనమైపోయి ఉంటారు’ అంటూ దుర్యోధనుడి ముందు తన పాప భావాల పర్యవసానాన్ని ప్రకటించాడు దుశ్శాసనుడు. భీష్ముడు వాళ్లను వెదకాలంటే ఎలాగో కొన్ని లక్షణాల్ని సూచించాడు. ధర్మరాజు ఉన్నచోట గోవులు ఎక్కువగా ఉంటాయి; అవి దుర్బలంగా ఉండనే ఉండవు; మంచి రస వంతమైన పాలూ పెరుగూ నెయ్యీ అనే హోమద్రవ్యాలు పుష్కలంగా దొరుకు తాయి ఆ చోట. దృశ్యాలన్నీ ప్రసన్నంగా ఉంటాయి. అతనున్నచోట ప్రజలు సంప్రీతిమంతులై ఉంటారు. ఈ లక్షణాలన్నీ చారుల కథనాన్ని బట్టి మత్స్య దేశంలో అవుపించాయి. అది అదనుగా తీసుకొని, సభలో ఉన్న సుశర్మ కీచకుడి మీద తనకున్న కోపాన్ని తీర్చుకోడానికి వేళ దగ్గర పడిందని అనుకుంటూ, దుర్యోధనుణ్ని మత్స్యదేశం మీద దండెత్తడానికి పురి గొలిపాడు. ‘ఇప్పుడు కీచకుడు లేడు గనక, విరటుడు నిరాశ్రయుడు; దర్పం కాస్తా పూర్తిగా అణిగిపోయి ఉంటుంది; అప్పటి ఉత్సాహమూ ఉండవు. ఆ దేశంలో చాలా గోసముదాయముంది. ఆ పశుసంపదను మీరూ మేమూ కలిసి హరిద్దాం. మేము ఒకవైపు నుంచీ మీరు మరొకవైపు నుంచీ దాడిచేసి ఉక్కిరిబిక్కిరి చేస్తే వాళ్లను సులువుగానే వశపరచుకోవచ్చు’ అని దుర్యోధనుడి లోపల ఏర్పడుతూన్న ఉద్దేశానికి ఆజ్యం పోశాడు సుశర్మ. దానికి తోడు త్రిగర్తుడి మాటలకు కర్ణుడు ‘సై’ అన్నాడు. ‘అర్థమూ బలమూ పౌరుషమూ హీనమైపోయి మూడు వంతులు నష్టమై పోయి ఉన్న పాండవులతో మనకేం పని? విరాటరాజును ముట్టడించి అక్కడి గో సంపదను మన హస్తగతం చేసుకోవ డంలో నిమగ్నమవుదాం’ అని కర్ణుడు కూడా అనడంతో దుర్యోధనుడు మత్స్య దేశాన్ని ముట్టడించడానికి సైన్యాన్ని సిద్ధం చేశాడు. ముందు రోజు సుశర్మను దక్షిణం వైపు నుంచి ముట్టడించమని పురమా యించి, ఆ మీద భీష్మద్రోణకర్ణాదులతో కలిసి తాము ఉత్తరం వైపు నుంచి దాడి చెయ్యాలని పథకం వేశారు. ఈ ప్రణాళిక సిద్ధమయ్యేసరికి పద మూడో ఏడాది నిజానికి పూర్తైయింది. సుశర్మ దక్షిణ గోగ్రహణానికి తన సేనల్ని మత్స్యదేశం వైపుకు నడిపాడు. ఇది తెలియగానే విరటుడు యుద్ధానికి తన పెద్దకొడుకు శంఖుణ్నీ తమ్ముళ్లు శతానీక మదిరాక్షుల్నీ తీసుకొని వెళ్తూ, కంకుభట్టునీ వలులుణ్నీ దామగ్రంథినీ తంతిపాలుణ్నీ కూడా అనురూపమైన కవచాలు ధరించి యుద్ధం చెయ్యడానికి రమ్మనమని ఆహ్వా నించాడు. ఎప్పుడైనా సరే, తామున్న దేశానికి కష్టం వచ్చినప్పుడు, తాము కూడా యథాశక్తి సాయం చేయడం విధా యకంగా నమ్మినవాళ్లు గనక వెంటనే బయలుదేరారు. అయితే, ఆ యుద్ధంలో సుశర్మ విరటుణ్ని బందీగా పట్టుకొని తీసు కొనిపోతూ ఉంటే, యుధిష్ఠిరుడు భీముణ్ని పంపి విరటుణ్ని విడిపించేలా చేశాడు. సుశర్మను ఆ విధంగా ఓడించి, యుధిష్ఠిరుడి సలహా ప్రకారం చంప కుండానే వదిలేశారు. త్రిగర్తమంటే మూడు రథాలని అర్థం. మూడు రథాలూ మనిషికుండే మూడు శరీరాలు: స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. ఈ మూడింటి నుంచీ విడివడితేనే ఏ సాధకుడికైనా పూర్తి ముక్తి దొరుకుతుంది. వాటికి సాధకుడు లొంగిపోవడమే విరటుడు త్రిగర్తుడైన సుశర్మకు పట్టుబడడంలోని ఆంతర్యం. అయితే, భీముడనే ప్రాణాయామ శక్తి ఆ మూడు శరీరాల పట్టు నుంచీ సాధ కుణ్ని విడిపించగలుగుతుంది. విరటుడు ఆ నలుగురు పాండవుల పరాక్రమంతోనూ ముక్తుడు కావడంతో చాలా సంతోషిస్తూ వాళ్లను పదేపదే సమ్మానించాడు. ఆ రాత్రికి శిబిరంలోనే ఉంటూ రాజపట్ట ణానికి రాజుగారి విజయవార్తను దూతల ద్వారా చేరవేశారు. ప్రణాళిక ప్రకారం అటు విరటుడు త్రిగర్తుడితో యుద్ధానికి వెళ్లగానే, ఇటు దుర్యోధనుడు ఉత్తరం వైపు నుంచి మత్స్యదేశాన్ని ముట్టడించాడు. భీష్ముడూ ద్రోణుడూ కర్ణుడూ కృపుడూ అశ్వత్థామా శకునీ దుశ్శాసనుడూ వివింశతీ వికర్ణుడూ చిత్రసేనుడూ దుర్ముఖుడూ దుశ్శలుడూ వగైరా మహారథులు చాలా మందితో కౌరవులు ముమ్మరంగా దాడి చేశారు. ఆ సమయంలో రాజధానిలో ఉన్న వాడు ఉత్తరుడనే విరాటరాజు రెండో కొడుకు మాత్రమే. అతనికి సైరంధ్రి చెప్పగా బృహన్నలను సారథిగా చేసుకొని యుద్ధానికి బయలుదేరడానికి సాహసం చేశాడు. తీరా సముద్రంలా ఉన్న విశాల మైన కౌరవ సైన్యాన్ని చూసి బెంబేలుపడి పారిపోతూ ఉంటే, అతన్ని ఆపి, తానే రథికుడై బృహన్నల వాళ్లతో భీకరంగా పోరాడాడు. చివరికి సమ్మోహనాస్త్రంతో ఆ హేమాహేమీలనందర్నీ మూర్ఛలో మునిగి పోయేలాగ చేసి, గోసంపత్తిని వెనక్కి మళ్లించాడు అర్జునుడు. విరటుడు ఆ విజయం తన కొడుకుదే అని ఉబ్బిపోయాడు. ఆ సంతోషంలో కంకుభట్టుతో పందెం వేస్తూ పాచికలాటకు దిగాడు. తన కొడుకు గురించి చెబు తూంటే, ధర్మరాజు ‘బృహన్నల సారథిగా ఉంటే వాళ్లను గెలవడం ఏమంత గొప్పేమీ కాదు’ అని పదే పదే బృహన్నల గొప్ప తనమే చెబుతూ ఉంటే, భరించలేక విరటుడు ధర్మరాజు ముఖమ్మీదకు పాచికలను గట్టిగా విసిరాడు. ధర్మరాజుకు దెబ్బతగిలి ముక్కుల్లోంచి రక్తం కారబో తూంటే, దాన్ని చేతులతో ఆపుతూ పక్కనే ఉన్న సైరంధ్రి వైపు చూశాడు. ఆవిడ తటా లున ఒక గిన్నెపట్టి ఆ రక్తాన్ని నేలమీద పడకుండా చేసింది. ఆ రక్తమే గనక నేల మీద పడితే, రాష్ట్రంతో సహా విరటుడు నాశనమైపోయేవాడు. అప్పుడే ఉత్తరుడూ బృహన్నలా యుద్ధభూమి నుంచి తిరిగి వచ్చారు. ఉత్తరుడు వస్తూనే ‘ఎవరీ పాపాన్ని చేశారు?’ అంటూ ధర్మరాజువైపుకు వెళ్లాడు. ‘నేనే’ అని తండ్రి చెప్పగా ‘ఎంత తప్పు చేశారు! నిజానికి ఈ యుద్ధమంతా బృహన్నలే చేశాడు. అతనెవరో కాదు... సాక్షాత్తూ అర్జునుడు’ అంటూ నిజం చెప్పాడు. తన తప్పును సరిదిద్దు కోడానికి అర్జునుడికి తన కూతురునిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు విరటుడు. ‘శిష్యురాలు కూతురుతో సమానం. కోడలిగా చేసు కుంటాను. ఉత్తరను మా అబ్బాయి అభి మన్యుడికిచ్చి పెళ్లి చేయండి’ అని ఒడం బరిచాడు అర్జునుడు. - డా॥ముంజులూరి నరసింహారావు -
కీచకుడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 29 కీచకుడు విరాటరాజు భార్య సుధేష్ణకు తమ్ముడు. ఆ దేశంలో బావమరిది కీచకుడిదే పైచేయి. కీచకుడు సూత పుత్రుడు. ఇతను మొదట్లో విరాటరాజుకి రథసారథే. ఆ మీద తన బలప్రాబల్యం కొద్దీ సేనాపతేగాదు, పరోక్షంగా మత్స్య రాజ్యాన్ని ఏలేవాడిగా కూడా తనను తాను అనుకునేవాడు. విరాటరాజు కూడా అతని దుందుడుకుతనాన్ని గానీ విర్రవీగుణ్ని గానీ తప్పు పట్టేవాడు కాడు. ‘చీకయతే’ అనే క్రియారూపానికి సహించడం, ఓర్పుగా ఉండడం, అదు పులో ఉండడం, గెలవడం, ఓడించడం మొదలైన అర్థాలున్నాయి. దీన్ని తిరగేస్తే, అంటే, ‘క’కారానికున్న అకారాన్ని ‘చ’కారానికీ ‘చ’కారానికున్న ‘ఈ’కారాన్ని ‘క’కారానికీ బదిలీ చేసి, ఆ రెండక్షరాల్నీ తిరగేస్తే, ‘కీచయతే’ అనే రూపమేర్పడు తుంది. తిరగదిప్పడం వల్ల, సహించక పోవడమూ అదుపులో పెట్టుకోక పోవ డమూ గెలవలేకపోవడమూ ఓడిపోవ డమూ అనే విప రీతార్థాలు ఈ ‘కీచక’ శబ్దానికి సంక్రమిస్తాయి. అతడూ అటు వంటివాడే. ఆవేశం వస్తే అదుపులో ఉండదు; పైగా అతడు అమర్యాదకమైన కామావేశానికి పెట్టింది పేరు. దాన్ని ఓర్చుకోలేకనే ఇతను తన ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు. కీచకమంటే వెదురుబొంగని కూడా అర్థం ఉంది. వెదురు గడకి కణుపులు ఉంటాయి. అలాగ కణుపులతో ఉండేది మన శరీరంలోని వెన్నుదండం. వెన్ను దండం కింది భాగంలో ఉండే కుండలినీ శక్తిని లైంగిక నాడుల్నుంచి తప్పించి, పైకి తలతట్టుగా నడిపిస్తే మన చైతన్యం విస్త రించగలదు. కీచకుడు ప్రాణశక్తిని ఇంద్రి యాల ద్వారా అడ్డూ అదుపూ లేకుండా బయటికి పోనిస్తూ, ఇప్పటికే దిగజారి పోయి ఉన్న మానుష చైతన్యాన్ని ఇంకా నీచాతి నీచంగా చేస్తూ ప్రవర్తిస్తాడు. వనవాసం పన్నెండేళ్లూ గడిచిన మీదట, పదమూడో ఏడాదిని, అంటే, ఎవరికీ తెలియకుండా ఉండవలసిన అజ్ఞాతవాసాన్ని పాండవులు విరాటుడి కొలువులో గడిపారు. ధర్మరాజు కంకు భట్టుగా రాజుగారికి సహాయకుడు అయ్యాడు; భీముడు వలలుడై వంట ఇంటిని చక్కబెట్టేవాడు; అర్జునుడు ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఒక విధంగా వరంగా వాడుకుంటూ పేడిగా అయి బృహన్నల రూపంలో విరాటరాజు కూతురు ఉత్తరకి సంగీత నాట్యాలను నేర్పేవాడు; నకులుడు గ్రంథికుడనే పేరుతో గుర్రాల బాగోగుల్ని చూసేవాడు; సహదేవుడు తంతిపాలుడనే పేరుతో ఆలకొట్టాల మంచీ చెడుల్ని చూసే గోపాలుడయ్యాడు; ద్రౌపది కేశ శృంగా రాన్నీ శరీరాలకు పూసుకొనే లేపనాల్ని తయారుచేసే నేర్పరిగా మాలిని అనే పేరుతో సైరంధ్రిగా సుదేష్ణ దగ్గర చేరింది. అజ్ఞాతవాసం పూర్తి కావడానికి మరి కొన్ని రోజులే మిగిలిన తరుణంలో కీచకుడు విరాట నగరంలో ఊడి పడ్డాడు. ద్రౌపదిని చూశాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ద్రౌపదితో మాట కలిపాడు: ‘నా భార్యల నందర్నీ నీకోసం వదిలేస్తాను. నీకు దాసుణ్ణవుతాను’ అంటూ తన కోరికను బహిరంగపరిచాడు. ‘సూత పుత్రుడా! నా జాతి చాలా హీనమైంది. నాతో నీకు పొత్తు తగదు. అందులోనూ పరుడి భార్యను కోరుకోవడం కూడని పని. దానివల్ల నీకు అపకీర్తి రావడమే గాదు, భయం కూడా పట్టుకుంటుంది’ అని నచ్చజెప్పి తప్పించుకోబోయింది. కానీ కామార్తుడికి భయమెక్కడుంటుంది? ‘భూమ్మీద నాతో సమానుడైన సొగసరి గానీ మగసిరి గలవాడు గానీ లేడు. నా బలమూ అనితరమైనది. అయినా ఈ దాసీత్వం నీలాంటి మహా అందగత్తెకు తగదు. నాకు స్వామినివై అందరిమీదా అధికారాన్ని ప్రదర్శించదగినదానివి’ అంటూ వాగుతూన్న అతగాడితో ద్రౌపది ‘నన్ను ఐదుగురు భీమగంధర్వులు కాపా డుతూ ఉంటారు. వాళ్లు నా భర్తలు. నిన్ను చంపేస్తారు’ అంటుంది. అయినా ఆమెను వశం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతూ అక్క దగ్గరికి చేరాడు కీచకుడు: ‘నువ్వేదో ఒక ఉపాయాన్ని పన్ని సైరంధ్రిని నా దగ్గరికి పంపాలి. లేకపోతే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి’ అంటూ మొరపెట్టుకున్నాడు. సుదేష్ణ మెత్తబడి, ‘సరే, నీ దగ్గరికి సురను తెమ్మని పంపుతాను. అప్పుడు ఒప్పిం చుకో’ అని అనునయించి పంపింది. సుధేష్ణ సైరంధ్రిని కీచకుడి విడిదికి పోయి మదిరను తెమ్మంది. ‘నేను వెళ్లను. ఆ సిగ్గులేనివాడు సతాయిస్తాడు. ఎంత మందో సేవకులుండగా నన్నే ఎందుకని పంపించడం?’ అంది ద్రౌపది. తమ్ముడి ముచ్చటను తీర్చడానికి రాజీపడిన ఆ అక్క ‘నేను పంపించానంటే హింసించడు’ వెళ్లి రమ్మనమని బలవంతపెట్టింది. వెళ్లక తప్పలేదు ద్రౌపదికి. వెళ్తూ కర్మసాక్షి అయిన సూర్యుణ్ని ధ్యానించి, రక్షించ మంటూ మొరపెట్టుకుంది. అక్షయ పాత్ర నిచ్చి అడవిలో ఉన్నన్నాళ్లూ కాపాడిన సూర్యుడు, ఇప్పుడావిడ శీలాన్ని కాపాడ్డా నికి ఒక రాక్షసుణ్ని నియోగించాడు. భయపడుతూన్న లేడిలాగ వెళ్లింది. వెళ్లడమే తడవు కీచకుడు వెంటబడ్డాడు. ఆవిడ కుడిచేతిని పట్టుకున్నాడు. ఆవిడ చేతిని విదిలించేసరికి, పెచైరగు పట్టు కున్నాడు. అప్పుడావిడ రెండు చేతులతో ఒక తోపు తోసేసరికి, వేళ్లూడిన చెట్టులాగ కింద పడిపోయాడు. అదే అదనని ఆవిడ పరిగెత్తుకుంటూ రాజసభలోకి వచ్చింది, తనకు అండగా విరాటరాజూ ధర్మరాజూ ఉంటారనే గొప్ప ధైర్యంతో. కానీ అక్కడా చుక్కే ఎదురయ్యింది. కీచకుడు రాజంటే ఏ ఖాతరూ లేనివాడు గనక, సభలోకి దూసుకొని వస్తూ ద్రౌపది కేశపాశాన్ని దుశ్శాసనుడి మాదిరిగానే పట్టుకున్నాడు; రాజు ఎదురుగానే ఆవిణ్ని నేలమీద పడేసి కాలితో తన్నాడు. ఆ క్షణంలో సూర్యుడు పంపిన రాక్షసుడు కీచకుణ్ని పట్టుకొని గాలివేగంతో దూరంగా నెట్టాడు. దానితో కీచకుడు బోర్లా పడ్డాడు. ఇదంతా రాజూ ధర్మరాజూ కళ్లప్పగించి చూస్తూనే ఉన్నారు. అప్పుడక్కడికి వచ్చిన భీముడు పళ్లు కొరికాడు. ఉపద్రవం ముంచుకొని రాబోతోందని పసిగట్టిన ధర్మరాజు తన బొటనవేలితో భీముడి బొటనవేలిని నొక్కి, తమ అజ్ఞాతవాసాన్ని కాపాడుకోవాలని మౌనంగానే హెచ్చరించాడు. చెట్టునొక దాన్ని పీకి కీచకుడి పీచమడుద్దామని చూస్తున్న భీముడితో, ‘వలలుడా! ఎండిన వంట చెరకు కోసం చూస్తున్నావా? బయట చెట్ల నుంచి కొమ్మల్ని కోసుకో’ అంటూ ధర్మరాజు ‘ఇక్కడగాదు, బయట ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా వాడి పనిపట్టమ’ని సూచించాడు. ద్రౌపది లేచి, తన ఆకారాన్ని రక్షించు కుంటూ, కళ్లు చింతనిప్పుల్లాగ మండు తూండగా, ‘సిగ్గూ ఎగ్గూ లేని ఈ సూతుడు నన్ను ఇలాగ వేధిస్తూంటే, నా గంధర్వ పతులు అతి బలవంతులయ్యుండి కూడా రక్షించడానికి రావడం లేదు. రాజు కూడా కిమ్మనడం లేదు. అబలనైన నన్ను రక్షించ డానికి ముందుకు రావడం లేదు. కీచకు డెంత అధర్మపరుడో మత్స్యరాజూ అంత అధర్మపరుడిలాగే ఉన్నాడు’ అనేసరికి విరటుడు, ‘మీ ఇద్దరిమధ్యా ఇంతకు మునుపు ఏ తకరారు జరిగిందో తెలియ నప్పుడు నేనేం చేయగలను?’ అంటూ తప్పించుకోడానికే చూశాడు. అప్పుడు ధర్మరాజు కలగజేసుకుంటూ, ‘ఈ సమయం కోపకాలం కాదనుకొని నీ గంధర్వపతులు రావటం లేదేమో! నువ్వు అంతఃపురానికి వెళ్లిపో! నీకు విప్రియం చేసినవాడికి అప్రియం చేయడానికి నీ పతులు తరవాత వస్తారేమోలే’ అంటూ ఆవిణ్ని వెళ్లిపోయేలాగ చేశాడు. అంతఃపురంలోకి వెళ్లి సుధేష్టతో జరిగిన విషయాన్నంతనీ పూసగుచ్చినట్టు చెప్పింది ద్రౌపది. ఆవిడ తన దురుద్దేశాన్ని బయటపడనీయకుండా ‘వాడు చావును కోరుకుంటున్నాడేమో’ అని ఊరుకొంది. నిరాశతో అప్పటికి ఊరుకొని, రాత్రిపూట వంట ఇంట్లో నిద్రపోతూన్న భీమసేనుణ్ని ‘ఇంత జరిగినా నీకు కునుకు ఎలాగ పట్టింది’ అంటూ లేవదీసింది ద్రౌపది. ఇద్దరూ కీచకుడి చావుకి ఒక పథకాన్ని వేశారు. ‘ఈ దుఃఖాన్నీ శోకాన్నీ పక్కకు పెట్టి నువ్వు రేపు రాత్రికి వాడు నర్తన శాలకు రహస్యంగా వచ్చేలాగ చేశావంటే నేను వాడి భరతం పడతాను’ అని భీముడు పథకాన్ని టూకీగా చెప్పాడు. ‘‘నా గంధర్వపతులకు ఈ మన ప్రసంగం వల్ల అపవాదం వచ్చి పడు తుంది. అంచేత అతి రహస్యంగా రాత్రి పూట నర్తనశాలకు వచ్చావంటే నేను నీ అధీనమవుతాను’’ అని ద్రౌపది కీచకుణ్ని నమ్మించింది. వాడు సంకేత స్థలానికి వస్తున్నాడన్న సంగతి భీముడికి చేరవేసి, అతను రాత్రికి అక్కడికి వెళ్లి సిద్ధంగా ఉండేలా ఏర్పాటు చేసింది. ఎప్పుడు రాత్రి వస్తుందా అని ఉవ్విళ్లూరుతూ కీచకుడు భీముడి మృత్యుకౌగిట్లోకి వచ్చి చిక్కు కున్నాడు. ఏ అరుపులూ బొబ్బలూ విని పించకుండా కీచకుణ్ని మాంసమ్ముద్దలాగ నలిపేసి, గుట్టు చప్పుడు కాకుండా తన వంట ఇంటికి వెళ్లిపోయాడు. కీచకుడి సోదరులైన ఉపకీచకులు కీచకుణ్ని దహన సంస్కారం కోసం తీసు కొని వెళ్తూండగా, ఆ సన్నివేశాన్ని కళ్లారా చూద్దామని అక్కడికి వచ్చిన ద్రౌపదిని చూసి, ‘ఈవిడ వల్లనే మన అన్నయ్య నికృష్టమైన చావు చచ్చిపోయాడ’ని రెచ్చి పోయి, ఆవిణ్ని కీచకుణ్ని తీసుకొని వెళ్తూన్న బండమీద ఒక రాటకు కట్టి తీసుకుపోవడం మొదలుపెట్టారు. రాజు వాళ్ల బలం ఎరిగినవాడు గనక కిక్కురు మనకుండా ఉన్నాడు. ‘ఉపకీచకులు శ్మశా నానికి లాక్కుపోతున్నార’ంటూ ద్రౌపది గట్టిగా ఏడ్చింది. ఆ ఏడుపును విని, నిద్ర పోతూన్న భీముడు గభాలున లేచి ‘సైరంధ్రీ! నేను నీ మాట విన్నాను. ఈ సూతపుత్రుల భయం నీకేమీ లేదు’ అంటూ అభయాన్నిచ్చి, వేషం మార్చు కొని, రాజద్వారం గుండా వెళ్లకుండా, గోడ దూకి బయటనున్న ఒక చెట్టునెక్కి, వాళ్లు ఎటు వెళ్తున్నారో చూశాడు. చితి దగ్గరికి పోయి, ఆ దగ్గర్లో తాడిచెట్టులాగ బాగా పొడుగ్గా ఉన్న ఒక గుబురుచెట్టును ఊడబెరికి, భుజంమీద పెట్టుకొని భీముడు రావడాన్ని ఉపకీచకులు చూశారు. వాళ్ల పై ప్రాణాలు పైనే పోయాయి. ‘ బాబోయ్! ఆ గంధర్వుడు మళ్లీ వస్తున్నాడు’ అంటూ ఆమెను వదిలి నగరం వైపు పారిపోవడం మొదలు పెట్టారు. భీముడు యముడి మాదిరి మీదపడి ఆ నూటైదు మందినీ పశువుల్ని వేటాడి చంపినట్టు చంపేశాడు. ‘సైరంధ్రీ! నిన్ను కష్టపెట్టినవాళ్లెవరైనా ఇలాగే చచ్చిపోతారు. నువ్వే భయం లేకుండా నగరానికి నడు!’ అని ద్రౌపదికి చెప్పి, భీముడు మరో దోవ మీదుగా వంట ఇంటికి వెళ్లిపోయాడు. విరటుడి మాటగా సుదేష్ణాదేవి ‘సైరంధ్రీ! గంధర్వులు చేసిన పరాభవం నుంచి రాజుగారు బాగా భయపడు తున్నాడు. నువ్వేమో అతి అందగత్తెవి; మగాళ్లకు విషయ భోగమంటే చెప్పరానంత ఇష్టం; గంధర్వులా అతి కోపిష్ఠులు. అంచేత నువ్వు ఇక్కణ్నించి నీకు ఇష్టమైన చోటికి వెళ్లు’ అంటూ భయపడుతూనే అంది. ‘రాజుగారు మరొక్క పదమూడు రోజులు ఓపిక పడితే చాలు గంధర్వులు వచ్చి నన్ను తీసుకొని వెళ్తారు’ అంటూ ద్రౌపది సర్దిచెప్పింది. - డా॥ముంజులూరి నరసింహారావు -
జరాసంధుడు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 28 జరాసంధుడు రెండు సగాలుగా పుట్టిన రాజకుమారుడు. ఆ సగాలను ‘జరా’ అనే రాక్షసి సంధించగా అతను జరాసంధు డయ్యాడు. ‘జరా’ అంటే, ముసలితనం. అది మార్పులకు పరాకాష్ఠ. జరాసంధుడి తండ్రి మగధనేలిన బృహద్రథుడు. అతనికి ఇద్దరు భార్యలు. వాళ్లు కాశిరాజుకి పుట్టిన కవల కూతుళ్లు. ‘మిమ్మల్నిద్దర్నీ ఒకే తీరుగా ప్రేమిస్తాను’ అని బృహద్రథుడు భార్యలిద్దరికీ మాట ఇచ్చాడు. అయితే ఎన్ని మంగళ కార్యాలు, హోమాలు చేసినా అతనికి పిల్లలు పుట్టలేదు. ఒకసారి చండకౌశికుడనే ముని వీరి రాజ్యానికి వచ్చాడు. పుత్రుణ్ని ప్రసా దించమని రాజు ఆ మునిని ప్రార్థించాడు. ముని ధ్యానంలో కూర్చున్నాడు. కొంత సేపటికి, ఓ మామిడి పండు ముని ఒడిలోకి వచ్చి పడింది. దాన్ని మంత్రించి రాజు చేతికిచ్చాడు. అతడా పండును తీసుకువెళ్లి పెళ్లాల చేతిలో పెట్టాడు. భార్యల్ని సమానంగా చూస్తానన్న మాటను బట్టి వాళ్లు ఆ పండును రెండు సగాలు చేసి తిన్నారు. అయితే ఇద్దరు పిల్లలు పుట్టలేదు; రెండు శరీర శకలాలు పుట్టాయి. అవి ముక్కలే అయినా బతికే ఉన్నాయి. తల్లులు తల్లడిల్లిపోయారు. దాదుల్ని పిలిచి బయట పడేసి రమ్మని పంపించారు. రోడ్ల కూడలిలో విసిరేసిన ఆ ముక్కల్ని ‘జరా’ అనే రాక్షసి తిందామనుకుని రెండిటినీ దగ్గరికి చేర్చింది. అప్పుడు ఆ రెండూ కలసి ఒక వీర కుమారుడిగా తయారయ్యాయి. ఆ రాక్షసి క్రూరమైనది కాదు. ఆ ఊళ్లో ఆవిడను గృహేశ్వరిగా చెప్పుకొనేవాళ్లు. ఆమె ఏమైనా తింటే, మంగళమవుతుందని ఆ ఊరివాళ్ల భావన. పిల్లవాడి కోసం అర్రులు చాచి చూస్తున్న రాజు కొడుకును చంపకూడదని అనుకుంది ఆ రాక్షసి. ఒక మానుష స్త్రీ రూపాన్ని దాల్చి, ఆ అబ్బాయిని రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్లింది. రాజు కృతజ్ఞతతో ఆ కుర్రాడికి ‘జరాసంధుడు’ అని పేరు పెట్టుకున్నాడు. జరాసంధుడు ఎంత బలసంపన్ను డైనా, ఎదురుపడిన అందరి తేజస్సునూ హరించేవాడైనా, ఏ శస్త్రాలతోనూ చావని హంసడింభకులనే వీరులు అతని సహా యకులైనా, కంసుడంతటి బలవంతుడు అల్లుడిగా ఆసరాగా ఉన్నా, శిశుపాలుడు సేనాపతిలాగ సాయంగా ఉన్నా కూడా కలపబడిన ఒంటిముక్కలతో ఏర్పడ్డాడు గనక అతడు భీముడి చేతిలో చచ్చిపోవలసి వచ్చింది. జరాసంధుడికి అస్తీ, ప్రాస్తీ అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వాళ్లను కంసుడికిచ్చి పెళ్లి చేశాడు. కంసుడు తన చెల్లెలు దేవకి కడుపున పుట్టే ఎనిమిదో సంతానం వల్ల చచ్చిపోతానన్న భయంతో ఆవిడకు పుట్టిన పిల్లలను వరసగా చంపడం మొదలు పెట్టినా, అతనికి సందిగ్ధత కలగడానికి ఏడోసారి గర్భాన్ని రోహిణికి బదలా యించడమూ, ఆ తర్వాత పుట్టిన కృష్ణుణ్ని యశోద పక్కలో పడుకోబెట్టి, అక్కడ పుట్టిన ఆడపిల్లను ఇక్కడకు తేవడమూ, ఆ అమ్మాయిని చంపబోతే గాలిలోకి ఎగిరి పోతూ ‘నిన్ను చంపేవాడు’ పుట్టేశాడని చెప్పడమూ కంసుడి భయాన్ని పెంచాయి. పుట్టిన పిల్లలనందర్నీ చంపమని పూతన, శకటాసురుడు, తృణావర్తుడు మొదలైన చాలామందినే పంపాడు. అతను పంపిన వాళ్లంతా కృష్ణుడి చేతిలో చచ్చిపోయారు. అక్రూరుణ్ని పంపించి, బలరామకృష్ణుల్ని ధనుర్యాగం చూడడమనే మిషను పెట్టి, ‘చావు’ను తన దగ్గరికే పిలిపించుకున్నాడు. వాళ్లు మథురకు వస్తూనే ఆ వింటిని విరగ్గొట్టారు. భూవలయానికే అలం కారమని పేరుపొందిన కువలయా పీడ మనే బలిష్ఠమైన ఏనుగును మీదకు ఉసి గొలిపితే, దంతాలూడబెరికి దాన్ని చంపేశారు; కండలు తిరిగిన మల్ల యోధులు చాణూర ముష్టికుల్ని ఉపయోగించి చంపుదామనుకుంటే, వాళ్లనూ చంపేశారు. ఆ మీద కృష్ణుడు, కంసుడు కుస్తీపట్లను చూడ్డానికి ఎక్కి కూర్చొన్న మంచె మీదకు లంఘించి... అతని జుట్టు పట్టుకొని కిందకు పడేసి తానూ అతని మీదకు ఉరికి చంపి నేలమీద ఈడ్చేశాడు. దాంతో అస్తి ప్రాప్తులిద్దరూ ఒకేసారి విధవలైపోయారు. తండ్రి దగ్గరికి చేరి, ‘మా భర్తను చంపిన వాణ్ని చంపి ప్రతీకారం తీర్చ’మని అతన్ని ప్రేరేపించారు. దాంతో జరాసంధుడికి కృష్ణుడితో వైరం ప్రారంభమైంది. తన గదను తొంభై తొమ్మిదిసార్లు తిప్పి తిప్పి తన ఊరు గిరివ్రజం నుంచి మథురవైపు విసిరితే, తొంభై తొమ్మిది యోజనాలు దూరంలో ఉన్న మథుర దగ్గర పడింది. ఆ ప్రదేశం ‘గదావసానం’గా ప్రసిద్ధికెక్కింది. జరాసంధుడు యుద్ధానికి వెళ్తే ఎదుటి వాళ్ల తేజస్సును హరించే శక్తి ఉన్నవాడు గనక చాలామంది రాజుల్ని అలవోకగానే జయించాడు. జయించడమే గాక, వాళ్లను రుద్రయజ్ఞంలో బలి ఇద్దామని ఇరవై వేల పైచిలుకు మంది రాజుల్ని తన నగరం గిరి వ్రజంలో ఖైదు చేసి ఉంచాడు. మథురలో ఉన్న కృష్ణుణ్ని కూడా అంత సులువుగానూ జయించాలని ఇరవై మూడు అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకొని దండెత్తాడు. బలరామ కృష్ణులు ఆ అక్షౌహిణీలనన్నిటినీ సంహ రించి, జరాసంధుణ్ణి మాత్రం చంపకుండా వదిలి పెట్టారు. దానికి కారణం ఉంది. అతగాడు మళ్లీ మళ్లీ అంతంత సైన్యాన్నీ తెచ్చుకొని వస్తాడు గనక, భూభారాన్ని కొంతలో కొంత మథుర సీమలోనే తగ్గించ వచ్చు అని. ఇలా అతను పదిహేడుసార్లు ప్రతి తూరీ ఇరవై మూడు అక్షౌహిణీలతో వచ్చి తాను ఒక్కడే తిరిగి వెళ్తూండేవాడు. పదిహేడో యుద్ధంలో హంసుడనే ఒక యోధుడు బలరాముడి చేతిలో చనిపోతే, తన సహ సేనాపతే పోయాడని డింభకుడు గూడా బాధతో యమునాప్రవాహంలోకి ఉరికి చచ్చిపోయాడు. డింభకుడు ఈ విధంగా ఒక అబద్ధపు చావు విని పోవడం చూసి, హంసుడు నిజంగానే ఆ యమున లోకి దుమికి ప్రాణాల్ని వదిలేశాడు. ఇలా ఏ శస్త్రానికీ చావని హంస డింభకులు ఒక్క సారిగా చచ్చిపోయి జరాసంధుడికి గొప్ప బాధనే మిగిల్చారు. పద్దెనిమిదోసారి, బలరామకృష్ణులు అతన్ని మోసగించ డానికి పరిగెత్తుతూ పారిపోతూన్నట్టు నటించి, ఎప్పుడూ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండే ప్రవర్షణ పర్వతం మీదకు ఎక్కారు. జరాసంధుడు ఆ కొండ చుట్టూ ఎండు కట్టెలు పేర్పించి నిప్పంటించాడు. వాళ్లిద్దరూ కొండమీంచి ఉరికి బయటపడి వెళ్లిపోయారు. జరా సంధుడు మాత్రం బలరామకృష్ణులిద్దరూ ఆ మంటల్లో కాలిపోయారనే దిలాసాతో గిరివ్రజానికి తిరిగి వెళ్లిపోయాడు. మథురలో ఉంటే ఇలా అస్తమానూ జరాసంధుడు దండెత్తుతూనే ఉంటాడని, సముద్రంలో ఉన్న ద్వారకకు రాజధానిని మార్పించాడు శ్రీకృష్ణుడు. అక్కడికి దండెత్తి వెళ్లడం కష్టం గనక, జరాసంధుడి దాడులూ ఆగాయి. కానీ అతని కోపం మాత్రం చల్లారలేదు. ధర్మరాజు రాజ సూయయాగం చేయడానికి ఉపక్రమిస్తూ, శ్రీకృష్ణుడు తనకు మార్గదర్శకుడిగా ఉండా లని ప్రార్థిస్తూ వర్తమానం పంపాడు. ఆ వర్తమానం వచ్చేముందే, జరాసంధుడు చెరసాలలో పెట్టిన రాజుల నుంచి రహ స్యంగా ఒక దూత వచ్చి, వాళ్లను విడి పించి కాపాడాలని విన్నవించాడు. రెండు పనులూ ఒకేసారి ఎలా జరుగుతాయి? అప్పుడు ఉద్ధవుడు కృష్ణుడితో ‘ధర్మరాజు రాజసూయం చేయాలంటే, రాజులందర్నీ జయించాలి. ఆ దిగ్విజయానికి పెద్ద అడ్డు జరాసంధుడే. అంచేత అతన్ని మట్టు బెట్టడం అవసరం. అతను చావగానే చెర సాలలో ఉండే రాజులందరూ ముక్తులవు తారు. కనక జరాసంధుణ్ని చంపేందుకు పథకం వేస్తే రెండు పనుల్నీ ఒకేసారి సాధించవచ్చు’ అని సలహా ఇచ్చాడు. ఈ పనుల్ని ఒకేసారి చేయడానికి ముందు ధర్మరాజు దగ్గరికే వెళ్లాడు కృష్ణుడు. ధర్మరాజుతో జరాసంధుణ్ని చంపడం గురించి మంతనాలు చేశాడు: ‘జరా సంధుణ్ని రణంలో చంపడమన్నది సురా సురులందరూ కలసినా అయ్యే పని గాదు. అతన్ని బాహుయుద్ధంలోనే జయించాలి. నాలో నీతీ భీముడిలో బలమూ అర్జు నుడిలో మమ్మల్నిద్దర్నీ రక్షించగలిగే శక్తీ ఉన్నాయి. బలం గుడ్డిది; దానికి మాలో ఉన్న విచక్షణ అవసరం. అంచేత నామీద నమ్మకం ఉంచి భీమార్జునులిద్దర్నీ నా చేతిలో పెట్టావంటే, జరాసంధుణ్ని చంపి తిరిగి వస్తాను’ అన్నాడు. నయమూ జయమూ బలమూ కలసి విక్రమిస్తే సిద్ధి తథ్యమని యుధిష్ఠిరుడు ఆ ముగ్గుర్నీ గిరివ్రజానికి పంపించాడు. ముగ్గురూ మూడు అగ్నుల్లాగ తేజస్వంతులైన బ్రాహ్మ ణుల వేషాలు వేసుకొని బయలుదేరారు. విపులగిరీ వరాహగిరీ వృషభగిరీ ఋషిగిరీ చైత్యగిరీ అనే ఐదు గిరులు ఒకదానితో ఒకటి ఒరుసుకుంటూ కలసి గిరివ్రజాన్ని చుట్టి రక్షిస్తున్నాయి. సూర్యచంద్రాగ్నుల్లాటి ఆ ముగ్గురూ ముఖద్వారాన్ని వదిలిపెట్టి, ఎత్తయిన చైత్యక పర్వతం మీదుగా గిరి వ్రజానికి చేరుకున్నారు. అక్కడ ఎద్దు రూపంలో వచ్చిన ఋషభుడనే రాక్షసుణ్ని జరాసంధుడి తండ్రి బృహద్రథుడు చంపి, ఆ రాక్షసుడి మాంసంతో మూడు భేరీలను మోగించినప్పుడు దివ్యపుష్ప వర్షం పడుతూ ఉండేది. ఆ మూడు భేరీలనూ ఈ ముగ్గురూ బద్దలుగొట్టి చైత్యశిఖరాన్ని తమ బాహుబలంతో విరగ్గొట్టి, గిరివ్రజంలోకి చొరబడ్డారు. జరాసంధుడి దగ్గరికి చేరారు. బ్రాహ్మణులకు పూజ చేయడం అతని వ్రతం. కృష్ణుడొక్కడే మాట్లాడుతూ ‘మా తోటి వాళ్లిద్దరూ అర్ధరాత్రి దాటితేనే గానీ మాట్లాడరు’ అని చెబితే, వాళ్లను యజ్ఞశాలలోనే ఉండమని, రాత్రి తిరిగి వస్తానని చెబుతూ జరాసంధుడు రాజభవనానికి వెళ్లిపోయాడు. బ్రాహ్మణులంటే ఎంతో గౌరవం గనకనే మాట ప్రకారం అర్ధరాత్రి తిరిగి వచ్చాడు. వాళ్లను నిశితంగా చూసి క్షత్రి యుల్లాగ ఉన్నారని పసిగట్టి నిలదీశాడు. కృష్ణుడు దానికి ‘మేము బ్రాహ్మణులం కాము. నేను కృష్ణుణ్ని. వీళ్లిద్దరూ మా మేన బావలైన భీమార్జునులు. మాతో యుద్ధం చెయ్యి. ఆ రాజులనందర్నీ విడిచి పెట్టు, లేదా యముడి దగ్గరికి పో!’ అన్నాడు. ‘నేను ఆ రాజులనందర్నీ దేవతా బలికోసం తెచ్చి ఎందుకు విడిచిపెట్టాలి? మన సేనలతో గానీ, మీలో ఒకడితో గానీ ఇద్దరితో గానీ ముగ్గురితోనూ గానీ నేను పోరాడతాను, రండి’ అని, కొడుకైన సహదేవుడికి పట్టంగట్టి, యుద్ధం చేయడానికి వచ్చాడు జరాసంధుడు. భీముడు జరాసంధుణ్ని పైకి లేవనెత్తి వేగంగా తిప్పడం మొదలుపెట్టాడు. తిప్పి తిప్పి మోకాళ్లతో వీపును విరిచి, శరీరాన్ని పిప్పిపిప్పిగా నలుపుతూ గర్జించాడు. ఒక చేత్తో జరాసంధుడి ఒక కాలు పట్టుకొని, రెండో కాలిమీద తన కాలు ఉంచి, అతన్ని రెండు ముక్కలుగా చీల్చేశాడు. అలా రెండు సగాలుగా పుట్టినవాణ్ని రెండు సగాలుగానే చేసి యమలోకానికి పంపాడు. తన ఎక్కువతనాన్ని నిలబెట్టు కోవడానికి అతిక్రూరంగా చేద్దామనుకొన్న రుద్రయజ్ఞం చెయ్యకుండానే చచ్చి పోయాడు తానే అందరికన్నా అధికుణ్నను కున్న జరాసంధుడు. శ్రీకృష్ణుడు అతని చెరసాలలో ఉన్న రాజులందర్నీ విడిపించి, వాళ్లందరిచేతా ధర్మరాజుకు కప్పం కట్టించాడు. ఆ విధంగా మహాభారత యుద్ధానికి అంకురం లాంటి రాజసూయ యాగాన్ని నిర్విఘ్నంగా నడిపించడానికి శ్రీకారం చుట్టాడు శ్రీకృష్ణుడు. - డా॥ముంజులూరి నరసింహారావు -
దుష్టచతుష్టయం
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 22 దుష్టచతుష్టయమంటే నలుగురు చెడ్డవాళ్లు: దుర్యోధనుడూ దుశ్శాసనుడూ శకునీ కర్ణుడూను. దుర్యోధనుడంటే చురుకైన కోరిక; దుశ్శాసనుడేమో పట్టరాని కోపం; శకుని అంటే అత్యంతమైన మోహం; కర్ణుడంటే ఏది తనకిష్టమో, ఏది తనకు సుఖకరమో దాన్నే చేద్దామనుకొనే లోభమున్నవాడు. కోరికా కక్కుర్తీ అనేవి మూడూ నరకానికి తెరిచిన ద్వారాలని చెబుతారు. మనిషిలో కిందికి దిగివచ్చిన చైతన్యాన్ని దివ్య చైతన్యంగా లేవనెత్తడానికి మూలాధారంలో ఉన్న కుండలినీశక్తిని మెదడులో ఉన్న సహస్రారానికి నడపాలి. ఆ పనికి కామమూ క్రోధమూ లోభమూ మోహమూ అనే నాలుగు దుష్టశక్తులూ పెద్ద ఆటంకాలు. దుర్యోధనుణ్ని కలి అనీ శకునిని ద్వాపరుడనీ చెబుతారు. కలి అంటే కలహానికి మారు పేరు; ద్వాపర మంటే అనిశ్చితీ సందేహమూను. పాచికలాట మొదలుపెడితే చాలు ఎవరి బతుకైనా సందేహంలో పడిపోతుంది. రాజసూయ యాగ సమయంలో వచ్చిన రత్నసంచయాన్ని చూసి దుర్యోధనుడు వెర్రెత్తిపోయాడు. ఆ డబ్బంతా తనదై పోవాలనుకున్నాడు. ఆ పవిత్రయాగ ధూమంతో సుగంధిలమైన ద్రౌపది జుట్టును పట్టుకొని కోపంతో సభలోకి ఈడ్చుకొని వచ్చాడు దుశ్శాసనుడు. చాలామందికి భార్య గనక ఆవిణ్ని వేశ్య అంటూ, సభలోకి ఏకవస్త్రగా వచ్చినా వివస్త్రగా వచ్చినా ఫరవాలేదంటూ కర్ణుడు వస్త్రాపహరణానికి బీజం వేశాడు. కలిరూపమైన క్రియాశీలకమైన కోరికతో యుద్ధం చేయడం చాలా కష్టం. లోకంలో అవుపించే విషయాల్ని తలచు కుంటూ ఉంటే, వాటితో మనకు తగులు బాటు కలుగుతుంది. మాట వరసకు, ఓ పువ్వును చూశామనుకోండి. బావుందని అనుకోడంతోబాటు, అది త్వరలోనే వసి వాడిపోతుందని తెలిసినా, లోభంతో దాన్ని కోసుకొని మన దగ్గర పెట్టుకుందా మన్న కోరిక పుడుతుంది. అక్కడ పువ్వుల్ని కోయకూడదన్న ఆంక్ష ఉందనుకోండి. అది ఆ కోరికకు గొడ్డలిపెట్టులాగ ఉంటుంది. కోరికకు అడ్డంకి రాగానే చిరాకు పుడు తుంది. చిరాకు రాగానే ఏం చేస్తున్నామో తెలియని మూఢత్వం కమ్ముకుంటుంది. ‘నా అంతటివాడి మాటను ఖాతరు చేయవా’ అంటూ జుట్టు పట్టుకుంటాడు. ఆ భ్రాంతి మోసంలో పడేసి, తానెవరో మరచిపోయేలాగ చేస్తుంది. ఆవిడ వదిన, తల్లిలాంటిది అనే మాట గుర్తుకురాదు. మరపురాగానే వివేకం బొత్తిగా అడుగంటుతుంది. బుద్ధి పోగానే మంచి ప్రవర్తన మాసిపోతుంది. వదిన అన్న మాట విస్మరించి బట్టల్ని ఊడదీయడానికి సిద్ధమైపోతాడు. అది నిండుసభ అనే మాట కూడా గుర్తు ఉండదు. ఈ దుష్టచతుష్టయం పుట్టించే గందరగోళంలో మనిషిలోని కుండలినీ ప్రాణశక్తి దుర్వినియోగానికి గురి అయి, కలహాన్నీ అశాంతినీ కలిగిస్తుంది. నిండు కొలువులో ద్రౌపది అనే మహారాణి తన శీలాన్ని కాపాడుకోవడం కోసం అటూ ఇటూ పరుగులు పెట్టింది. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడికి సరిపోయిన తండ్రి. దుర్యోధనుడు పైకే తన కుచ్చితాన్ని చూపిస్తాడు గానీ ధృత రాష్ట్రుడు లోపల అంత కుచ్చితంగానూ ఆలోచిస్తూ ఉంటాడు. పాండవుల ఉన్నతి చూసి, ధృతరాష్ట్రుడు అసూయపడుతూ ‘ఏం చేయాలి నేను?’ అంటూ కణికుడనే రాజనీతిజ్ఞుణ్ని పిలిచాడు. ‘అగ్నిహోత్రమూ యజ్ఞమూ చేస్తూ కాషాయబట్టల్ని కట్టుకొని జడలూ మృగచర్మమూ ధరించి ముందు అందరికీ విశ్వాసాన్ని కలగ జెయ్యాలి. ఆమీద తోడేలులాగ శత్రువుల మీదపడి నాశనం చేయాలి. శత్రువును ఈ విధంగా చంపలేకపోతే వాడున్న ఇంటికి నిప్పు పెట్టాలి’ అని పాఠం చెబుతూ ఒక గుంటనక్క కథను చెప్పాడు కణికుడు. స్వార్థపండితుడైన ఒక నక్క పులీ ఎలుకా తోడేలూ ముంగిసా అనే తన నేస్తాలతోబాటు ఒక అడవిలో ఉంది. ఒకరోజున అందరూ కలిసి లేళ్ల సర్దారును చూసి లొట్టలేశాయి. అయితే దాని వేగం ముందు వీళ్ల ప్రయత్నాలు ఎందుకూ కొరగాలేదు. అప్పుడు నక్క ఒక పథకాన్ని వేసింది. అది పడుకొన్నప్పుడు మన ఎలుక దాని పాదాల్ని కొరికినట్టయితే దాని వేగం తగ్గుతుంది. అప్పుడు పులి దాన్ని పట్టి చంపగలుగుతుంది. సరే అని అందరూ ఆ పన్నాగాన్ని అమలుపరిచారు. ‘మీరంతా స్నానాలు చేసి రండి. నేను ఈ మృగ దేహాన్ని కాపలా కాస్తూ ఉంటాను’ అని నక్క, వాళ్లందర్నీ పంపించింది. స్నానం చేసి మొదట పులి వచ్చింది. అయితే, నక్క ఏదో చింతలోపడ్డట్టు ముఖం పెట్టింది. ‘ఏమిటి సంగతి?’ అని పులి వాకబు చేస్తే, ‘ఎలక మీ గురించి అన్నమాటను విని నేను చింతలో పడ్డాను: నావల్లనే ఈ మృగం చచ్చింది. పులిరాజు బలం దీంట్లో ఎక్కడుంది? నా బాహుబలాన్ని ఆశ్ర యించుకొని అతను తన ఆకలిని తీర్చు కోనీ అంటూ ఈసడించుకుంటూ వెళ్లి పోయింద’ని నక్క చెప్పింది. ‘నా బలంతో సంపాయించుకొనే తింటానులే’ అంటూ పులి వెళ్లిపోయింది. ఇంతలో ఎలుక వచ్చింది. ‘ఎలుకా! ముంగిస ఏమందో తెలుసునా? నాకు ఈ మృగమాంసం గీంసం పడవు. నేను ఎలుకను తినడానికి ఇష్టపడతాను’ అని నక్క చెప్పడమే తడవు, అది తుర్రుమని పారిపోయింది. తరవాత తోడేలు వచ్చింది. దానితో, ‘పులి ఎందు కనో నువ్వంటే గుర్రుగా ఉంది. పెళ్లాన్ని తీసుకొని వస్తానని వెళ్లింది’ అని చెప్పే సరికి, అది ఠకీమని పారిపోయింది. చివరికి ముంగిస వచ్చింది. ‘నా సొంత బలంతో వాళ్లనందర్నీ జయించాను. నువ్వు కూడా నాతో యుద్ధం చేసి గెలిచి ఈ మాంసాన్ని తిను’ అనేసరికి అది తోక ముడుచుకొని పారిపోయింది. నక్కే ఆ మాంసమంతా కడుపునిండా ఆరగించింది. ఇలాగ తక్కువ చేసో బెదిరించో భయ పెట్టో బామాలో శత్రువును నిర్మూలించు కోవాలంటూ కణికుడు పాఠం చెప్పాడు. ఈ కణికనీతి ధృతరాష్ట్రుడికి బాగా ఒంటపట్టింది. ‘కానీ అలా చేస్తే బాగుం డదు; ఏదో ఒకటి చేయకపోతే నేను కుమిలిపోతున్నాను’ అంటూ ద్వైదీ భావంలో ఊగిసలాడడం మొదలు పెట్టాడు. సరిగ్గా అప్పుడే దుష్టచతుష్టయం పెద్ద పన్నాగాన్ని పన్నుతున్నారు. ఏదో విధంగా పాండవుల్ని దూరంగా పంపిం చకపోతే ‘నాకు రాజ్యం రానేరాదు. ప్రజ లందరూ ధర్మరాజునే రాజుగా కోరుకుం టున్నారు’ అని నాన్న లోపలి ఆలోచన అనే నిప్పుకు ఆజ్యం పోశాడు. ‘నాదీ అదే అభిప్రాయం. కానీ అది పాపపుటాలోచన అని నేను బయటపెట్టడం లేదు. భీష్ముడూ మొదలైన పెద్దలకు ఎలాగ నచ్చజెప్పాలి?’ అంటూ మనస్సులో మాట చెప్పాడు తండ్రి. ‘భీష్ముడు ఎప్పుడూ మధ్యస్థుడే; అశ్వత్థామ నా పక్షానే ఉంటాడు. కొడుకెక్క డుంటే ద్రోణుడు అక్కడే ఉంటాడు. కృపా చార్యుడేమో బావామేనల్లుళ్లు ఉన్నచోటే ఉంటాడు. ఒక్క విదురుడే ఎదురు. అతనొక్కడూ దీన్ని ఆపలేడు’ అని దుర్యో ధనుడు తాము నలుగురూ చేసిన లక్క ఇంటి ఆలోచనను బయటపెట్టాడు. ధృతరాష్ట్రుడు పాండవులతో వారణావత నగర రమ్యత్వం గురించి కొంతమంది చేత పదే పదే చెప్పించి, వాళ్లకు అక్కడికి వెళ్లాలనే కోరికను లేవదీశాడు. ఆ మీదట ‘మీరు వెళ్దామనుకుంటున్నారటగా! శుభం వెళ్లిరండి’ అని పాండవుల్ని వారణావతం పంపించాడు. కానీ ఆ ఒక్క విదురుడూ వీళ్ల పన్నాగాన్ని విఫలం చేసేశాడు. దుర్యోధనుడి కన్ను ధర్మరాజుకున్న ధన సంపదల మీద పడింది. అతగాడికి ఆ డబ్బంతా తనదిగా చేసేసుకోవాలన్న కోరిక ఉవ్వెత్తున లేచింది. దానికి తోడు మయసభలో తిరుగుతూ నేలను చూసి నీళ్లూ నీళ్లను చూసి నేలా అని భ్రాంతిపడ్డ అతన్ని చూసి, భీముడు కిసుక్కుమని నవ్వాడు. ఆ మీద ద్రౌపదితో సహా ఆడ వాళ్లందరూ గలగలా నవ్వారు. దుర్యో ధనుడికి ఒంటి నిండా తేళ్లూ జైలూ పాకినట్టయింది. ఇంటికొచ్చి, మనస్సులో గుచ్చుకొన్న ముల్లును తీయడానికి దార్లను వెదకడం మొదలుపెట్టాడు. శకుని మామ మోసానికి ప్రతిరూపం. అతని ఆయుధాలు పాచికలు. జూదపీఠమే రణరంగం. మోసమే అతని చతురంగ బలం. పాచికలాటే మాయాక్రీడ. అది చాలా రంజుగా ఉంటుంది. ఆ రంధిలో పడి మనిషి తన శరీర రాజ్యాన్ని, తన ఆత్మానందశక్తిని, మోసానికి ఒడిగడు తూన్న ఇంద్రియాల మాటల్లో పడి, పందెంగా ఒడ్డి పోగొట్టుకుంటాడు. తెలిసుండీ ధర్మరాజు, జూదం ఆటకు, సరదా జూదం అని చెప్పి పెదనాన్న పిలిస్తే వెళ్లాడు. దీనికి కారణం రాజసూయ యాగం తరవాత వచ్చే కలహానికీ నాశ నానికీ తాను కారణం కాకూడదనే. అతను రాజసూయంలోనూ దిగ్విజయంలోనూ వచ్చిన కప్పాల్నీ కట్నాల్నీ ఒడ్డి పోగొట్టు కున్నా, శకుని ‘నీకింకా నీ తమ్ముళ్లున్నారు గదా, నువ్వున్నావుగా, నీ భార్య ఉందిగా’ అని పురిగొలుపుతూ అమంగళప్పక్షిలాగే పనిచేశాడు. శకుని అంటే పక్షి అని అర్థం కూడా ఉంది. కొన్ని పక్షుల కూతలు నష్టాన్నీ హింసనీ కలిగిస్తాయి. తీతువుపిట్ట ఇటువంటిదే. శకుని అటువంటి అప శకునప్పక్షి. ధర్మరాజు జూదం మొదలు పెట్టక ముందు ‘జూదం ఒక రకంగా మోసమూ పాపమూను. దీనిలో క్షత్రి యుడికి తగిన పరాక్రమం చూపించడం ఉండదు; దీనికి ఒక నిశ్చితమైన నీతీ లేదు. ధర్మానికి అనుకూలమైన విజయం యుద్ధంలోనే దొరుకుతుంది. క్షత్రియులకు యుద్ధమే శ్రేష్ఠం, జూదం కాదు. కుటిల త్వమూ మోసమూ లేని సంగ్రామమే సత్పురుషుడు చేసే యుద్ధం. జూదగాళ్లకు మోసమన్నా, కపటత్వమన్నా వల్లమాలిన గౌరవం. మంచివాళ్లు జూదాన్ని పొగడరు. నువ్వు క్రూరుడిలాగ అనుచితమైన మార్గంలో మమ్మల్ని జయించాలని చూడకు’ అని అన్నాడు. శకుని దానికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు: ‘ఒక వేద విజ్ఞాని మరో వేద విద్వాంసుణ్ని ఓడించడానికి ఏదో మారుమూల విషయాన్ని ఉపయోగించి మోసంతోనే జయిస్తూ ఉంటాడు. తెలిసినవాడు తెలియనివాణ్ని ఓడిస్తే అది మోసం ఎలాగవుతుంది? పాచికలాట బాగా ఎరిగిన నాబోటిగాడు ఆ ఆటలో చెయ్యి తిరగనివాణ్ని ఓడించడం జరుగుతుంది. దాన్ని మోసమంటే, అస్త్రాల్ని వెయ్య గలిగినవాడు ఆ నేర్పులేని వాణ్ని జయిస్తే అదీ మోసమే అవుతుంది. బలవంతుడు బలహీనుణ్ని జయించడం ఒక రకమైన మోసమే గానీ దాన్నీ మోసమని అనరు. ఇది మోసం అనుకుంటే నువ్వు వెళ్లిపో వచ్చు’. ‘పిలిచిన తరవాత వెళ్లిపోవడం నా వ్రతానికి విరుద్ధం. నేను ఇక్కడ ఎవరితో ఆడాలి?’ అని యుధిష్ఠిరుడు అనగానే దానికి దుర్యోధనుడి జవాబే జరగ బోతూన్న మోసాన్ని ఎదురుగుండా చూపించింది: ‘నేను డబ్బు పెడతాను. నా తరఫున శకునిమామ ఆడతాడు’. ‘ఒకడి కోసం మరొకడు ఆడడం విషమం’ అని అంటూనే ధర్మరాజు జూదానికి దిగాడు. నలుగురు దుష్టులూ తమ రొట్టె విరిగి నేతిలో పడిందనే ఆనందించారు. వెనక సింహాసనం మీద కూర్చొన్న ధృతరాష్ట్రుడికీ అదే ఆనందం. - డా॥ముంజులూరి నరసింహారావు -
ద్రౌపది
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 21 ద్రౌపది ద్రుపదుడి కూతురు. ద్రుపదు డంటే, అత్యంత వైరాగ్యంతో వేగంగా బ్రహ్మపథానికి పురోగమించేవాడని అర్థం. కనక, ద్రుపదుడైన సాధకుడి ఆతృత నుంచి పుట్టుకొచ్చిన దివ్యమైన ఉత్సా హంతో ప్రేరణ పొంది, బ్రహ్మపథానికి సాగే కుండలినీ శక్తే ఈ ద్రౌపది. ఆకాశంలో శక్తి చాలామటుకు కుండలినిగా, అంటే, చుట్టబెట్టుకొని సర్పిలంగా సంచరిస్తూ ఉంటుంది. పరమాణువుల కేంద్రకాల చుట్టూ ఉన్న కర్పరాల్లో తిరిగే ఎలక్ట్రాన్ల రాసనృత్యంలోనూ సూర్యుడూ నక్షత్ర చక్రాలూ ఆకాశంలో విష్ణునాభి అనే పరమ కేంద్రం చుట్టూ పరిభ్రమించడంలోనూ ఇదే కనిపిస్తుంది. జీవ మూలాణువైన డి.ఎన్.ఎ. కూడా సర్పిలాకారమైన నిచ్చెనగా నిర్మితమై, మెలికలు చుట్టుకొన్న రెండు పాములు నిలువుగా నిలుచున్న ట్టుండే సుబ్రహ్మణ్యేశ్వర రూపంగా ఉంటుంది. చాలా పాలపుంతలు సర్పిలా కారాలే. మానవ శరీరంలోని కుండలినీ శక్తి ఇటువంటి సర్పిలమైన తేజోరూపం. పామును గుప్తమూ శక్తిమంతమూ అయిన విషయానికి గుర్తుగా వాడతారు. అది నేల లోని కన్నాల్లో దాక్కొని ఉంటుంది. వెన్ను కాండం చివర ఉన్న భూమి స్పందనలుండే మూలాధారమనే చోట బయటికి ప్రసరిస్తూ ఉండే ఈ కుండలినీ జీవశక్తినే సర్పశక్తి అని పిలుస్తూ ఉంటారు. ఇది ఒక సర్పిలాకారమైన దారిగుండా లైంగిక నాడుల్లోకి వెళ్తుంది గనకనే దీన్ని కుండలినీ శక్తి అంటారు. దీన్నే ‘ఇలీబిశం’ అని వేదం వర్ణిస్తుంది: అంటే, ఇలాబిలంలో శయనించి ఉన్నదని అర్థం. ఇలా అంటే భూమి. మూలా ధారంలో ఉన్న సర్పిలాకార మైన దోవలో ఒదిగి ఈ ‘ఇలాబిలశాయి’ నలిగినట్టై ‘ఇలీబిశం’ అయింది. వైరాగ్యానికి నేను నేస్తాన్నంటే నేను నేస్తాన్నంటూ అలవాట్లు వెంటబడి వేధిస్తూ ఆధ్యాత్మిక జీవిత యుద్ధంలో చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ద్రోణుడు ‘నేను నీ నేస్తాన్ని’ అంటూ ద్రుపదుడి దగ్గరికి వచ్చినప్పుడు ‘నువ్వు నాకు సమ ఉజ్జీ కావు’ అని ద్రుపదుడు నిరాకరించడానికి కారణం ఇదే. వైరాగ్యం తీవ్రదశలో ఉన్నప్పుడు, అలవాట్ల హడావిడి చాలా చికాకును తెప్పిస్తుంది. అంచేతనే ద్రుపదుడనే సాధకుడు ద్రోణుడనే సంస్కారాన్ని దూరంగా ఉంచడానికే ప్రయత్నిస్తాడు. సాధకుడు ప్రాణయజ్ఞాన్నే తన చతురంగ బలంగా చేసుకొని యజ్ఞసేనుడై, తన లోపలి నిబ్బరమైన కాంతితో ‘ధృష్టద్యుమ్నుడై’, అలవాట్ల తలను ఖండించడమే గాక, యుద్ధంలో గెలుపును రాసిచ్చే, తలదిక్కునున్న ‘అహిచ్ఛత్రానికి’, అంటే, అనంతత్వమనే శేషుడే గొడుగుగా ఉన్న ఆత్మ చైతన్య క్షేత్రానికి పురోగమించడం జరుగుతుంది. యజ్ఞసేన ప్రగతి వల్ల యాజ్ఞసేని అయిన కుండలినీ శక్తి మేలుకొని ‘అహిచ్ఛత్రానికి’, అంటే, సహస్రారానికి సాగుతుంది. కుండలిని అంటే చుట్టుముట్టుకొన్న పాము అని చెప్పుకొన్నాం. పాము శక్తికి గుర్తు. ఈ శక్తిని తప్పుగా ఉపయోగించినవాడు విషమెక్కి చచ్చిపోతాడు; దీన్ని సరిగ్గా ఉపయోగించినవాడు చైతన్య సామ్రాజ్యాన్ని ఏలతాడు. ఆడదాని జడను పాముతో పోలుస్తూ ఉంటారు. అది కొప్పుగా చుట్టుకొని తలమీద ఉన్నప్పుడు, ఒబ్బిడిగా అదుపులో ఉన్న శక్తికి ప్రతీక అవుతుంది. అది విరబోసుకొని ఉన్నప్పుడు, కట్టుబాటుకు దూరమై, బయటికి ప్రసరిస్తూ దుబారా అయిపోతూన్న ప్రాణశక్తికి ప్రతీక అవుతుంది. దుశ్శాసనుడు ద్రౌపది జుట్టు పట్టుకొని, ఈడ్చుకొని వస్తూ ఆవిడ జుట్టును విరబోసినట్టు చేశాడు. ఈ విధమైన పరిస్థితి అహంకారమనే రాజు పరిపాలనకు గుర్తు. ఈ పరిపాలనలో మూలాధారశక్తి ఎప్పుడూ కలవరపడుతూ ఉంటుంది; అది తప్పుడు వినియోగానికి గురి అయి, ఇంద్రియాల అదుపులేని కోరికలకు బలి అయి ఖర్చైపోతుంది. కోరిక రూపుడైన దుర్యోధనుడు అసహ్యంగా తన ఎడమ తొడమీది గుడ్డను తీసి వికటంగా చూడడం దీని పర్యవసానమే. ద్రుపదుడి రాజ్యాన్ని పాంచాలమని అంటారు. అర్జునుడి ద్వారా ఈ రాజ్యాన్ని జయించాడు ద్రోణుడు: దాంట్లోని ఉత్తర పాంచాలాన్ని తన దగ్గరబెట్టుకొని, దక్షిణ పాంచాలాన్ని మాత్రమే ద్రుపదుడి కిచ్చాడు. పాంచాలమంటే ‘పంచానాం అలం’ - ఐదుగురికి చక్కగా సరిపోయేది అని అర్థం. ఉత్తర పాంచాలమంటే యోగ భాషలో వెనుబాములోని పైచక్రాలు; దక్షిణ పాంచాలమంటే, కింది మూడు చక్రాలూను. పైకేంద్రాల్లో పనిచేసే ప్రాణశక్తీ చైతన్యాల సూక్ష్మబలగాలు వెనుబాములో చివర ఉండే మూలాధార కేంద్రం గుండానే భౌతిక రూపాల్ని దాలుస్తాయి. ఈ రూపాలు, మూలాధారమూ స్వాధిష్ఠానమూ మణిపూరమూ అనాహతమూ విశుద్ధమూ అనే ఐదు కేంద్రాల్లో పనిచేసే భూమీ నీరూ అగ్నీ వాయువూ ఆకాశమూ అయిన ఐదు మూలకాల స్పందనల వల్ల ఏర్పడతాయి. ప్రాణశక్తి మూలాధారం నుంచి బయటికి ప్రవహిస్తూ మాంస దేశాన్నీ ఎముకల ప్రదేశాన్నీ రక్తమార్గాల్నీ వగైరా వగైరా అన్ని భాగాల్నీ సృష్టిస్తూ పోషిస్తూ పదార్థం ఐదు రూపాల్లో అవుపిస్తుంది. ఆత్మరాజు పరిపాలనలో మూలాధారంలో ఉన్న కుండలినీ ప్రాణశక్తి ప్రశాంతంగానూ అదుపులోనూ ఉంటూ రాజ్యానికి ఆరోగ్యాన్నీ అందాన్నీ శాంతినీ ఇస్తాయి. గాఢమైన ధ్యానంలో ఈ శక్తి లోపలికి మళ్లి, పైచక్రాల వైపుకు వెళ్తూ ఆత్మరాజ్యాన్ని ప్రకాశింపజేస్తుంది. కుండలినీ శక్తి పైకి ఐదు పద్మాల, లేక, చక్రాల గుండా వెళ్లడమంటే, ద్రౌపదికి ఐదుగురు పాండవులతో పెళ్లి కావడమనీ ద్రౌపదేయులు పుట్టడమనీ అర్థం. ద్రౌపదేయులంటే ద్రౌపదికి పాండవుల వల్ల పుట్టిన పిల్లలు. వీళ్లు ప్రతి కేంద్రంలోనూ ఆయా కేంద్రాలకు లక్షణాలై అవుపించే రూపాలూ కాంతులూ ధ్వనులూను. ఈ కాంతుల మీదా ధ్వనుల మీదా తన దృష్టిని కేంద్రీకరించి యోగి, దివ్యమైన విచక్షణను పొంది, మనస్సు తోనూ దాని సంతానంతోనూ, అంటే కామమూ క్రోధమూ లోభమూ మోహమూ మదమూ మాత్సర్యమూ - అంటే, దుర్యోధనుడూ దుశ్శాసనుడూ కర్ణుడూ శకునీ శల్యుడూ కృతవర్మా - మొదలైన ఆవేశ రూపాలతో పోరాడగలిగే శక్తిని ప్రయోగించగలుగుతాడు. పాండవులు లక్కింటి నుంచి బయటపడి గూఢంగా ద్రుపదుడి నగరంలో స్వయం వరానికి వచ్చినప్పుడు, శ్రీకృష్ణుడు వాళ్లను గుర్తించడాన్ని వర్ణిస్తూ వ్యాసుడు ‘పంచాభి పద్మానివ వారణేంద్రాన్ భస్మావృతాం గానివ హవ్యవాహాన్’ (ఆదిపర్వం 186-9) అంటూ పాండవుల్ని ఐదు సూక్ష్మ పద్మాల్లాగా ఐదు అగ్నుల్లాగా చెప్పడం మనం పైన చెప్పుకొన్న వివరణానికి పాదుగా ఉంది. ఈవిధంగా ద్రౌపదికి ఐదుగురు పతులుండడాన్ని అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీకి ఐదుగురు మొగుళ్లుండడాన్ని జీర్ణించుకోలేనివాళ్లు అప్పుడూ ఉన్నారు ఇప్పుడూ ఉన్నారు. ఆవిడ తండ్రికే అది ఎబ్బెట్టనిపించింది. దాన్ని పోగొట్టడానికి వ్యాసుడు అతనికి ద్రౌపది మునపటి జన్మకథను చెప్పాడు: ఒక తపోవనంలో అతిరూపవతి అయిన ఒక ఋషికన్యకు పతి లభించలేదు. ఆవిడ శివుణ్ని ఉద్దేశించి తపస్సు చేసింది. శివుడు ఎదురుగా అవుపించి, వరాన్ని కోరుకోమన్నాడు. ఆవిడ ‘నాకు సర్వగుణసంపన్నుడైన పతిని ప్రసాదించ’మంటూ ఐదుసార్లు అడిగింది. ‘మరో శరీరంలో నీకు ఐదుగురు పతులు లభిస్తారు’ అని చెప్పి శివుడు అంతర్ధాన మయ్యాడు. ద్రుపదుడు ఈ కథను విని ‘దేవో హి వేత్తా పరమం యదత్ర’ (ఆదిపర్వం 197-3) అంటూ దీనిలోని రహస్యం దేవుడే ఎరుగునంటూ విస్తు పోతూనే పెళ్లిచేశాడు. ఆ రహస్యం మనం పైన చెప్పుకొన్నదే. ద్రౌపదికి ‘కృష్ణా’ అనే పేరు ఉంది. అంటే, శ్యామల వర్ణం కలదని అర్థం. శ్రీకృష్ణుడు భూమిభారాన్ని తగ్గించడానికి వచ్చేటప్పుడు అర్జునుడితో పాటు ఈ‘కృష్ణ’ను తనకు సాయం చేసే చెల్లెలిగా తెచ్చుకొన్నాడు. ఈవిడ వల్లనే పద్దెనిమిది అక్షౌహిణులు ఒకచోటికి చేరి నాశనమై పోయి భూమికి పట్టిన అధర్మభారాన్నీ అయోగభారాన్నీ తీర్చగలిగాయి. అగ్నివేది నుంచి పుట్టింది గనక, ఆ ‘కృష్ణవర్త్ముడి’, అంటే, అగ్ని మాదిరిగానే తనవైపుకు గుంజి కాల్చే శక్తిగలిగిన అగ్నిరూపమే ఈవిడ. సభలోకి తనను రమ్మనమని పిలవడానికి ప్రాతికామి వచ్చినప్పుడు, ద్రౌపది వేసిన చిక్కు ప్రశ్నకు జవాబు చెప్పడం ఎవరిచేతా గాలేదు: ‘తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా’ అనే ఈ ప్రశ్నకున్న సమాధానమే ఆవిడ దాసి కాలేదని నిరూపించింది. భీష్ముడంతటి మహాధర్మవేత్తే దీనికి జవాబు చెప్పడం చాలా కష్టమంటూ చేతులెత్తేశాడు: అంటే, అంతటి కురువృద్ధుడు కూడా రాజుగారి మాటకు ఎదురు చెబితే ఏమవుతుందో నన్న భయాన్ని కనబరిచాడన్నమాట. వికర్ణుడు ధృతరాష్ట్రుడి కొడుకే అయినా ఈ ప్రశ్నకు జవాబు చెప్పకపోతే సభలో ఉన్నవాళ్లందరూ నరకానికి వెళ్ల వలసివస్తుందని హెచ్చరిస్తూ ‘ధర్మరాజు జూదం మైకంలో పడి ధూర్తులైన జూద గాళ్లు పురిగొల్పడంతో ఒళ్లుమరిచిపోయి, ద్రౌపదిని పందెంగా కాశాడు. ఆమె పాండవులైదుగురికీ సమానం. ఒక్క ధర్మరాజుకే భార్య కాదు ఆవిడ. అదీగాక, తనను ముందు పణంగా పెట్టి ఓడి పోయిన తరవాతనే శకుని మాటల్లోపడి, ద్రౌపదిని ఒడ్డాడు ధర్మరాజు. ఈ విషయాల్ని పరిశీలిస్తే, ద్రౌపదిని గెలుచు కున్నామనడం తప్పే’ అని నిగ్గుదేల్చాడు. విదురుడు ఆమీద ఇలాగే తన నిష్కర్షని కరాఖండీగా చెప్పాడు: ‘తన శరీరాన్ని మొదటే ఓడాడు గనక, ఆమీద ద్రౌపదిని పణంగా పెట్ట డానికి అతనికి హక్కెక్కడిది? అధికారి కానివాడు పందెంగా పెట్టినదాన్ని గెలవడం గానీ ఓడడం గానీ కలలో డబ్బు గెలవడంతో గానీ ఓడడంతో గానీ సమానం’. అప్పుడు ధృతరాష్ట్రుడి అగ్ని శాలలో నక్కలు చొరబడి ఊళలు కూశాయి; గాడిదలు దూరి ఓండ్ర పెట్టాయి. ఈ అపశకునాల్ని చూసి గాంధారీ విదురుడు చెప్పగా, అంతదాకా ‘ఏమేమి గెలిచార’ంటూ ఆత్రుతను చూపించిన ధృతరాష్ట్రుడు మొదటికే మోసం వచ్చేలాగ ఉందని, ద్రౌపదిని పిలిచి వరాలనిచ్చి పాండవులను దాస్యం నుంచి విముక్తపరిచాడు. చెయ్యకూడని పనుల్ని చేశారు గనకనే కౌరవులు మూకుమ్మడిగా మూల్యం చెల్లించవలసివచ్చింది. దుర్యోధనుడు కండకావరం కొద్దీ ఏకవస్త్ర అయిన వదినను సభలోకి తీసుకొని రమ్మనడమూ ఆమెను తన తొడమీద కూర్చోడానికి నిస్సిగ్గుగా పిలవడమూ కర్ణుడు ప్రేరేపిం చగా దుశ్శాసనుడు ఆమె బట్టల్ని ఊడ దీయడానికి ప్రయత్నించడమూ సైంధ వుడు, వనంలో ఈవిడ ఒక్కతే ఉన్నప్పుడు కామించి ఎత్తుకొని పోవడమూ - మొదలైనవన్నీ తక్కువ తప్పులేమీగావు. అవి మూలాధారంలోని శక్తిని ఉద్వేగపరిచి అశాంతిని కలగజేస్తాయి. సింహబలుడని పేరున్న కీచకుడికీ ద్రౌపది వల్ల పరాభ వాన్ని చవిచూడడమే కాదు నికృష్టమైన చావును కూడా కౌగిలించుకోవలసి వచ్చింది. చెడ్డపని దానికదే పరిహారాన్ని చెల్లించమని ఎదురొచ్చి అడుగుతుంది. పాపిష్ఠులు వాళ్లకు వాళ్లే తమను శిక్షించు కుంటారు. ఆ శిక్షే భీమసేనుడి నోట భీకరమైన శపథంగా రూపొందింది. - డా॥ముంజులూరి నరసింహారావు -
ద్రుపద ధృష్టద్యుమ్నులు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 20 పృషతుడనే రాజు పాంచాల దేశాన్ని పరిపాలించేవాడు. అతని కొడుకు పేరు ద్రుపదుడు. ఇతన్ని యజ్ఞసేనుడని కూడా పిలుస్తారు. ద్రుపదుడికి పుట్టిన వాళ్లం దరూ గడ్డుగడ్డువీరుల్ని వధించడానికి పుట్టినవాళ్లే. కౌరవులపైనున్న హేమా హేమీల్లో భీష్ముడూ ద్రోణుడూ ముఖ్యమైన వాళ్లు. వాళ్లను జయించడం దాదాపుగా అసంభవమే. భీష్ముడికేమో స్వచ్ఛంద మరణమనే అరుదైన వరముంది. ఎవడూ తనకుగా తాను చావాలని కోరుకోడు గదా! మరి అటువంటివాణ్ని చంపడానికి ఎటువంటివాడు ఎలాగ పుట్టాలో భగ వంతుడికే ఎరుక! నముచి అనే రాక్షసుడు, తాను తడిదానితో గానీ పొడిదానితో గానీ చావకూడదన్న అపురూపమైన వరాన్ని కోరుకొన్నాడు. నముచి కోసం తడీ పొడీ కానిదైన నురుగు చావై కూర్చుంది. నురుగు నీళ్ల నుంచి వచ్చింది గనక తడిదేమో అనిపిస్తుంది; కాని అది పొడిగా ఉన్నట్టుగా ఉంటుంది. వజ్రాయుధానికి నురుగును పట్టించి ఇంద్రుడు నముచిని చంపాడు. ‘నముచి’ అంటే, వదలదని అర్థం. అటువంటి వదలని జబ్బునే ఉపాయంతో పోగొట్టారు. అలాగే, స్వచ్ఛంద మరణమున్న భీష్ముణ్ని చంపించడానికీ రుద్రుడు అంబకు వరమిచ్చాడు. అంబను సాల్వుడనే ఆమె ప్రియుడికి చెందకుండా చేసిన నేరానికి భీష్ముడంటే జన్మజన్మాంతర వైరం పట్టుకొంది అంబను. శివుడు ఆవిడకు ప్రత్యక్షమై, ‘నువ్వు ఆడదానివై పుట్టినా, మగవాడివై మరీ భీష్ముణ్ని చంపుతావు’ అని వరమిచ్చాడు. ఆవిడ యమున ఒడ్డునే చితిని పేర్చుకొని, ‘భీష్ముణ్ని చంపడానికి వెళ్తున్నాను’ అని అంటూ చితిలో ప్రవేశించింది. అదే సమయంలో ద్రుపదుడు మగ సంతానం కోసం ‘నాకు ఆడపిల్లగాదు, మగపిల్లవాడు పుట్టాలి’ అంటూ ఘోర తపస్సు చేశాడు. అతనికీ రుద్రుడే ఎదురుగా అవుపించి, అంబకిచ్చిన వరాన్ని సార్థకం చేయడానికి, ‘నీకు ఆడపిల్లే పుడుతుంది గానీ మగాడిగా మారుతుందిలే తరవాత’ అంటూ వరమిచ్చాడు. భీష్ముడు గొప్ప విలుకాడు. అంచేత అతనికి వ్రతాలూ చాలానే ఉన్నాయి. మనకు తెలిసిన రాజ్య సింహాసనాన్ని ఎక్కకపోవడమూ ఆజన్మాంతం బ్రహ్మచర్యాన్ని పాటించడమూ అనేవే కాకుండా యుద్ధంలో పాటించే వ్రతాలు కూడా కొన్ని ఉన్నాయి. అవే స్వచ్ఛంద మరణాన్ని కూడా దాటి అతని పతనాన్ని శాసించాయి. మహాయుద్ధం ప్రారంభమై తొమ్మిది రోజులైపోయినా భీష్ముడు ధర్మరాజు జయించడానికి పెద్దగోడలాగ నిలుచు న్నాడు. ఇక లాభం లేదని, ధర్మరాజు తన తమ్ముళ్లతోనూ శ్రీకృష్ణుడితోనూ కలిసి, ఆ రోజు రాత్రి, శస్త్ర కవచాల్ని పక్కకు పెట్టి భీష్ముడి దగ్గరికి వెళ్లాడు. ‘‘తాతయ్యా! మేమెలా గెలవగలం?’ అని సూటిగా అడిగాడు. ‘‘అవును, నేను బతికుండగా నీకు జయమెలాగ దొరుకుతుంది? నేను యుద్ధంలో నిలుచుంటే, సాక్షాత్తూ ఇంద్రుడొచ్చినా జయించలేడు. అయితే, నాకు కొన్ని వ్రతాలున్నాయి. శస్త్రం కింద పెట్టేసినవాడితోనూ కిందజారిపడిన వాడితోనూ కవచమూ ధ్వజమూ లేనివాడితోనూ భయంతో పారిపోయే వాడితోనూ ‘నేను నీ వాణ్నే’ అని శరణుజొచ్చినవాడితోనూ స్త్రీతోనూ స్త్రీలాంటి పేరుపెట్టుకొన్నవాడితోనూ ముందు స్త్రీగా ఉండి, ఆ మీద మగవాడిగా మారినవాడితోనూ దెబ్బతిని కలవరపడేవాడితోనూ తన నాన్నకు ఒక్కడే కొడుకైనవాడితోనూ అపకీర్తిమంతుడితోనూ నేను యుద్ధం చేయడానికి ఇష్టపడను. అప్పుడు మహారథులు నన్ను పడగొట్టగలుగు తారు’’ అని తన చావుకు తానే మంత్రం చెప్పాడు భీష్ముడు. శిఖండి మొదట ఆడపిల్ల, ఆ మీదట మగవాడయ్యాడు. అహంకారానికున్న దురభిమానం కొద్దీ అటువంటి శిఖండితో అది యుద్ధం చెయ్యదు. యుద్ధంలో ఉండీ యుద్ధం చెయ్యకపోతే చావు రావడం తథ్యం. అది ఒకలాగ స్వచ్ఛందంగా చావడమే. మగవాడిగా పుట్టకపోయినా శివుడి మాటను బట్టి, ద్రుపదుడు కూతురుగా పుట్టిన ‘అతనికి’ యుద్ధ విద్యను నేర్పించాడు. ద్రోణుడే అతనికి ఆచార్యుడయ్యాడు. అర్జునుడు, భారతయుద్ధం పదోరోజున శిఖండిని తన రథంలో నిలుచోబెట్టుకొని బాణాలు వేయించి, భీష్ముణ్ని అస్త్ర సన్యాసం చేసేలాగ చేసి, ఆ మీద తానే, మర్మాల్ని తాకేలాగ అస్త్రాల్ని వేసి, అతన్ని పడగొట్టాడు. ఎంతటివాడైనా చావు ముందు తలవంచవలసిందే. స్వచ్ఛంద మరణాల్లాంటివెన్నైనా అతన్ని కాయలేవు. కౌరవులవైపు యుద్ధం చేసిన ప్రము ఖుల్లో రెండోవాడు ద్రోణుడు. ద్రోణుడు నిజానికి ద్రుపదుడికి సహాధ్యాయుడే. ఇద్దరూ కలిసి అగ్నివేశుడి దగ్గర విలు విద్యను అభ్యసించారు. ద్రుపదుడు క్షత్రియుడే గానీ ద్రోణుడంతటి విలుకాడు గాడు. ద్రోణుడు బ్రాహ్మణుడే అయినా సర్వ క్షత్రియులకూ పరశురాముడి మాదిరిగా భయంకరుడు. ఇతను పరశురాముణ్నించే అస్త్రాలను నేర్చు కున్నాడు. అదీగాక, బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని అభ్యసించినవాడు. ద్రోణుడికి కృపితో పెళ్లై అశ్వత్థామ పుట్టిన తరవాత చాలా దారిద్య్రాన్ని అనుభ వించాడు. పృషతుడు పోయిన మీదట, ద్రుపదుడు పాంచాల రాజయ్యాడు. చిన్నప్పటి సఖిత్వాన్ని పురస్కరించుకొని ఎంతో కొంత ఇవ్వకపోతాడా అన్న భరోసాతో ద్రుపదుడి దగ్గరికి పోయి, ఆ మునపటి సఖిత్వాన్ని గుర్తుకు తీసుకు రాబోయాడు. స్నేహం ఇద్దరు సమానుల మధ్య ఉంటుంది గానీ ఒక పేదవాడికీ రాజుకీ మధ్య ఉండదు. రాజుకీ రాజుకీ మధ్య స్నేహం కుదురుతుంది. ఇటువంటి మాటలతో అవమానాన్ని పొంది, ద్రోణుడు వెళ్లిపోయాడు గానీ అతని గుండెలో ఒక బ్రాహ్మణుడికి ఉండదగని ప్రతీకార జ్వాల మాత్రం మండుతూనే ఉంది. పాండవులకూ కౌరవులకూ విలు విద్యను నేర్పడానికి ముందే గురువేతనం ఇదీ అని చెప్పాడు. అర్జునుడు ఆ ప్రతీ కారాన్ని తీర్చిపెట్టాడు. అహిచ్ఛత్రాన్ని ముట్టడించి, ద్రుపదుణ్ని బందీ చేసి, ద్రోణుడి ముందు నిలబెట్టాడు అర్జునుడు. అప్పుడు ద్రోణుడు, ‘ఇప్పుడు నేను పాంచాల రాజును. అయినా స్నేహితుడిగా నీకు దక్షిణ పాంచాలాన్ని ఇస్తాను. ఉత్తర పాంచాలానికి మాత్రం నేనే రాజుని. ఇప్పుడు నీకూ నాకూ రాజులుగా స్నేహం కుదురుతుంది గదా’ అని ద్రుపదుణ్ని కించపరుస్తూ మాట్లాడాడు. అప్పణ్నించీ ద్రుపదుడికి రెండు కోరికలు బయలుదేరాయి. ద్రోణుణ్ని తానెలాగూ విలుయుద్ధంలో గెలవలేడు. అతన్ని చంపగలిగే పుత్రుడుంటేనే తన కోపం చల్లారుతుంది. అర్జునుడు గొప్ప వీరుడు గనక అతన్ని తన అల్లుడిగా చేసుకొనే వీలు కలగాలి. నిజానికి, తనను బంధించి ద్రోణుడి ముందు నిలబెట్టిన వాడే అయినా అర్జునుడంటే తోటి మేటి శూరుడిగా అభిమానం ఉండడానికి కారణం తనూ తనలాటి యుద్ధసాధకుడు కావడమే. తన కోరికల్ని తీర్చుకోవడం కోసం యాజుడూ ఉపయాజుడూ అనే యజ్ఞ నిర్వాహకుల్ని ఆశ్రయించాడు. యాజుడు చేయించిన యజ్ఞంలో, అగ్ని లోంచి కవచాన్ని ధరించిన తేజోవంతుడూ శరఖడ్గధనుర్ధారీ అయిన రథికుడొకడు పుట్టుకొని వచ్చాడు. అతనే ధృష్టద్యుమ్నుడు. ధృష్టత్వమంటే అదరని బెదరనితనం. అటువంటివాడు ఎదురుగా ఎవరున్నా సహించడు. అగ్నిలోంచి పుట్టాడు గనక కాంతిరూపుడతను. పాండవులకు ధృష్టద్యుమ్నుడే సేనాపతి. కౌరవులకేమో వరసగా ఐదుగురయ్యారు సేనాపతులు - భీష్మ ద్రోణ కర్ణ శల్య అశ్వత్థామలు. ఒకడు అహంకారమూ రెండోవాడు సంస్కారమూ మూడోవాడు లోభమూ నాలుగోవాడు మదమూ ఐదో వాడు ఆశయమూను. అటు, పాండవుల ఏకైక సేనాపతి, ధృష్టద్యుమ్నుడంటే ఎవరు? ‘ధృష్ట’ అంటే ధైర్యంతో కూడిన విశ్వాసం; ద్యుమ్నమంటే కాంతీ బలమూ కీర్తీను. అంచేత, ధృష్టద్యుమ్నుడంటే నిబ్బరమైన కాంతి అని అర్థం. ఏ కలతనూ కలగనీయని ప్రశాంతమైన లోపలి ప్రకాశం, సత్యాన్ని తటాలున ప్రకటింపజేసే ఆగమ దీప్తి - అంటే, స్వయంగా దానికదే లోపల నుంచి వచ్చి అర్థాన్ని ప్రకాశింపజేసే సహజమైన విజ్ఞానం. అది ఎప్పటికీ తప్పుదారి పట్టిం చదు. ప్రశాంతమూ నిర్దుష్టమూ అయిన ఈ కాంతే, ఇష్టం లేకపోయినా బలవం తంగా చేయించి మరీ ఏడిపించే అల వాటునీ జిడ్డులాగ వదలని సంస్కారాన్నీ నిర్బంధించి కాల్చివేయగలదు. అహంకా రమూ అలవాటూ కక్కుర్తీ నీల్గుడూ ఆగమకాంతి ముందు నిలవలేవు. అయితే, లోపల పోగై ఉండే కోరికలు, మోసం తోనూ దుర్మార్గంతోనూ ఆగమకాంతిని ఆర్పివేయగలవు. ఆ కారణంగానే ధృష్టద్యు మ్నుడు నిద్రపోతూంటే, అశ్వత్థామ చేతిలో పశువు మాదిరిగా చచ్చిపోయాడు. యజ్ఞసేనుడు చేసిన ఆ యజ్ఞవేదిక నుంచే ద్రౌపది కూడా పుట్టింది. ఆవిడ, మొత్తం ధార్తరాష్ట్రులకే కాదు, హేమాహేమీలైన రాజులందరికీ కాళరాత్రి అయింది, ‘సర్వయోషిద్వరా కృష్ణా నినీషుః క్షత్రియాన్ క్షయం’ (ఆదిపర్వం 166-48) మరి ఇటువంటి పిల్లల్ని కన్న తండ్రి ద్రుపదుడంటే ఎవరబ్బా అని సహజం గానే మనకు అనిపిస్తుంది. ‘ద్రుతం పద్యం యస్య సః’ - అంటే, త్వరత్వరగా పురోగ మించేవాడని ద్రుపదమనే పదానికి అర్థం. తీవ్రమైన సంవేగంతో, అంటే, అత్యంత వైరాగ్యంతో ఆత్మదిశగా పెద్ద పెద్ద అంగలేస్తూ నడిచే ఇతను, ఏ కలతా లేని అనాసక్తికి ప్రతీక. ‘ద్రుపదాదివ ముంచతు; ద్రుపదాదివేన్ముముచానః; స్విన్నస్స్నాత్వీ మలాదివ’ అంటూ తైత్తిరీయ బ్రాహ్మణంలో (2-4-4-10) ఒక మంత్రం ఉంది. చెమటతో ముద్దైన వాడు స్నానం చేసి బాగుపడ్డట్టు, ద్రుపదం అనే శిక్షాపరికరం నుంచి విడివడడమన్నట్టుగా పాపం నుంచి విడదీయమని ఈ ప్రార్థన అర్థం. ద్రుపదమంటే కాలికి కట్టే ఒక పెద్ద దుంగ; అది నేరం చేసినవాణ్ని బంధించి కదలనీయదు. ద్రుపదమనే మాటకు మనం చెప్పుకొన్న రెండు అర్థాల్నీ కలుపు కుంటే, ‘భౌతికమైన ఆసక్తి అనే ద్రుపదం నుంచి విడివడి, త్వరగా, తీవ్రమైన వైరాగ్యమనే ఉపాయంతో బ్రహ్మపదానికి అభిముఖంగా ద్రుతగతితో సాగిపోయే వాడ’ని అర్థం. ఇటువంటి ద్రుపదుడి ఆధ్యాత్మికమైన ఉత్సాహ భక్తులనే అగ్ని నుంచి పుట్టినవాళ్లే ధృష్టద్యుమ్నుడూ ద్రౌపదీను - ఆగమశక్తీ కుండలినీ శక్తీను. - డా॥ముంజులూరి నరసింహారావు -
అశ్వత్థామ
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 19 అశ్వత్థామా బలిచక్రవర్తీ వ్యాసుడూ హనుమంతుడూ విభీషణుడూ కృపాచార్యుడూ పరశురాముడూ అనే ఏడుగుర్నీ చిరంజీవులని చెబుతారు. అశ్వత్థామ ద్రోణుడికీ కృపికీ పుట్టాడు. కర్ణుడు సహజమైన కవచకుండలాలతో పుట్టినట్టుగా, ఇతను తలమీద మణితో పుట్టాడు. ఈ మణి వల్లనే అతనికి శస్త్రాల వల్ల గానీ వ్యాధుల వల్ల గానీ ఆకలి వల్ల గానీ ఏ రకమైన భయమూ ఉండేది కాదు. అంచేత ముంద ర్నుంచీ దుందుడుకుగానూ చపలత్వంతో క్రూరుడిగానూ ఉండేవాడు. ఇతను పుడు తూనే గుర్రంలాగ గట్టిగా బలంగా (‘స్థామ’) నలుదిక్కుల్లోనూ ప్రతిధ్వనించే లాగ సకిలించాడు గనకనే ‘అశ్వత్థామ’ అయ్యాడని భారతంలో నిర్వచనం. దీనితో ఇతను చిరంజీవి ఎలాగయ్యాడన్నది మనకు అర్థంగాదు. ఇతని తండ్రి ద్రోణుడు సంస్కారానికీ అలవాటుకీ ప్రతీక. మేనమామ కృపుడు అవిద్యకు, అంటే, తప్పుగా అర్థం చేసుకోవడానికి ప్రతీక. తల్లి కృపి కూడా ఆవిడ అన్నగారిలాగే అవిద్యకే గుర్తు. ద్రోణుడు పోయిన తరువాత ఈవిడ అశ్వత్థామ కోసం బతికే ఉంది. అవిద్య నుంచే అహం కారం పుడుతుంది. ఆ అహం కారం నుంచి భోగించాలనే కోరిక పుడుతుంది. భోగించడానికి సాధనాలు ఇంద్రియాలు. కోరికతోనే ఇంద్రియాలు విషయాలతో కలుస్తాయి. ఈ కలయికే మంచీ చెడు పనులకు దారితీస్తుంది. ఆ పనుల ఫలితాలే అలవాట్లూ సంస్కారాలూను. అవి కొత్త కొత్త కోరికల్నీ వాటికి ఫలాలైన వాసనల్నీ పుట్టిస్తూ, ఎప్పటికీ పోకుండా ఒక జన్మ నుంచి మరోజన్మకు వాటిని రవాణా చేస్తూ, దానికిగా అదే నడవగలిగే ఒక చక్రాన్ని తయారుచేస్తాయి. స్వయంగా తనను తాను పోషించుకొనే ఈ చక్రమే మన లోపల దాక్కొని ఉండే కోరిక. దీన్నే గుప్తమైన కోరిక, కోరికల వల్ల పుట్టిన విత్తనమూ అంటారు. వాసనల వల్ల పుట్టిన ఈ గుప్తకామమనే ఆశయమే అశ్వత్థామ - లోపల శయనించి ఉండే కోరిక. ‘అశూజ్’ అనే క్రియకు ‘పోగు’ అనే అర్థం ఉంది. పోగై ఒకానొక ప్రత్యేక మైన స్థితిలో ఉండి (‘స్థా’) ఎడ తెరిపిలేకుండా కొనసాగే కోరికే అశ్వత్థామ. పోగై, మార్పులేకుండా ఉంటూ చావుతో కూడా చావకుండా జన్మజన్మాంతరాలకు కొనసాగుతూ, లోపల శయనించి ఉండే చిరంజీవమైన కోరిక బీజమే ఆశయమనే అశ్వత్థామతత్త్వం. ఇంతటి చిరంజీవి చనిపోయాడన్న పుకారు, ఇతని నాన్న ద్రోణుడు చనిపోవ డానికి కారణమైంది. అంటే, ఆశయం కాలిపోతే, వాసనలూ సంస్కారాలూ అస్త్రసన్యాసం చేసి వాటంతట అవే చచ్చి పోతాయన్నమాట. అప్పటికప్పుడు పుట్టే క్రియాశీలకమైన కోరికకు అవచేతనలో వేరులుండవు. ఇది మొదట పుట్టినప్పుడు అంత శక్తిమంతంగా ఉండదు గనుకనే దీన్ని ఇచ్ఛాశక్తితో అణచుకోవచ్చు. ప్రతి కోరికా, అది తీరినా తీరకపోయినా మరో కోరికను కంటూనే ఉంటుంది. ఎంత తీరినట్టనిపించినా కూడా కోరికలో ఎంతో కొంత తీరని శేషం ఉండనే ఉంటుంది. అహంకారం ప్రేరేపించే క్రియాశీలకమైన కోరికలనుంచే కోరికల విత్తులు పుడుతూ ఉంటాయి. తీరని ప్రతి కోరికా ప్రజ్ఞాన మనే అగ్నిలో వేగకపోతే, మనస్సులో అది ఒక కొత్త కోరిక విత్తును విత్తుతూనే ఉంటుంది. ఈ విత్తులు అప్పటికప్పుడు పుట్టే కొత్త కోరికలకన్నా ఎక్కువగా నిర్బంధిస్తూ ఉంటాయి. ఆశయాలు ఎప్పుడు బయటపడ తాయో చెప్పలేం. అవి బయటికి మొలిచినప్పుడు మనను బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అశ్వత్థామశక్తి అలాగ ఆద్యంతమూ బాధించేదీ ప్రాణాంతకమైన దీను. అభిమన్యుణ్ణి అన్యాయంగా చంప డంలో ఇతని పాత్ర కూడా ఉంది. ద్రోణుణ్ణి దృష్టద్యుమ్నుడు చంపిన తరువాత, అశ్వత్థామ చెలరేగి యుద్ధం చేశాడు. మొత్తం పాండవసైన్యాన్ని ఒక్కసారిగా నాశనం చేద్దామని నారాయణాస్త్రం వేశాడు. ఆ అస్త్రం ఎన్నో బాణాల్నీ చక్రాల్నీ గదల్నీ ఒక్కసారిగా చుట్టుముట్టేలాగ చేస్తుంది. దానికి విరుగుడు, ఆయుధాల్ని విడిచిపెట్టి రథం నుంచి కిందికి దిగి లొంగి పోవడమే. శ్రీకృష్ణుడికి ఈ విషయం తెలుసు గనక, అందర్నీ రథాల నుంచి దిగి ఆయుధాల్నీ విల్లమ్ముల్నీ విడిచిపెట్టమని చెప్పాడు. భీముడు, అది తన వీరత్వానికి తగదనుకొన్నాడు. బాణాలు చుట్టుముడు తూన్నా యుద్ధం చేసి వాటిని పోగొట్టు కుందామనే ప్రయత్నిస్తూ తాత్సారం చేశాడు. అప్పుడు నరనారాయణులైన కృష్ణుడూ అర్జునుడూ వెళ్ళి, అతన్ని బలవంతంగా కిందికి దించి విల్లమ్ముల్ని కింద పడవేయించారు. అర్జునుడు ఆ అస్త్రానికి ఎదురు వేయొచ్చుగా అని మనకు అనిపిస్తుంది. కానీ నారాయణాస్త్రానికీ గోవులకీ బ్రాహ్మణులకీ ఎదురుగా బాణం వెయ్యకుండా గాండీవాన్ని కింద పెట్టేయాలన్నది అర్జునుడి వ్రతం. ఈవిధంగా నారాయణాస్త్ర ప్రయోగం విఫలమైన తరవాత, దుర్యోధనుడు అశ్వత్థామని దాన్ని తిరిగి ప్రయోగించమని ప్రోత్సహించాడు. అప్పుడు అశ్వత్థామ రెండోసారి ప్రయోగించరాదని చెప్పి, ఆ మీద ఆగ్నేయాస్త్రాన్ని వేశాడు. దాని మంటలకు చాలామందే ఆహుతైపోయారు. కృష్ణార్జు నులు కూడా మసి అయిపోయారని అశ్వత్థామ అనుకొన్నాడు. కానీ, వాళ్ళు చెక్కుచెదరకుండా బయటపడడం చూసి, హతాశుడైపోయాడు. ఆ సమయంలో వ్యాసుడు అవుపించి, యుద్ధదేవత అయిన రుద్రుణ్ణి పూజించడంలో శ్రీకృష్ణార్జునులకీ అశ్వత్థామకీ మధ్య తేడా చెప్పాడు: ‘నువ్వు రుద్రప్రతిమకు పూజచేస్తూ వచ్చావు; వాళ్ళేమో రుద్రలింగానికి పూజచేస్తూ ఉంటారు’. లింగం ఒక రూపం లేనిది గనక, సర్వరూపుణ్ణి కొలిచినట్టవుతుంది; ప్రతిమ అనేసరికల్లా ఒకే రూపం గనక, సర్వోపగతత్వానికి పూజచేసినట్టుగాదు. రుద్రుడన్నా అగ్ని అన్నా ఒకటే. వాస్తవ మైన రుద్రతత్త్వాన్ని కొలవడంవల్లనే వాళ్ళిద్దర్నీ అగ్ని ఏమీ చేయలేదు. దుర్యోధనుడు తొడలు విరిగి నేలమీద పడి ఉన్నప్పుడు, అశ్వత్థామా కృతవర్మా కృపాచార్యుడూ అతని దగ్గరికి వెళ్ళారు. అతను అశ్వత్థామ కసికి మెచ్చుకొంటూ అతన్ని సేనాపతిగా చేశాడు. ఆ ముగ్గురూ విజయోత్సాహంతో ఉన్న పాండవసేనకు అవుపడకుండా గడపాలని, ఆ రాత్రికి అడవిలోకి వెళ్ళారు. మర్రిచెట్టుకింద పెద్దవాళ్ళిద్దరూ నిద్రపో యినా, అశ్వత్థామకు మాత్రం కునుకు పట్టలేదు. ఆ చెట్టుమీదకి ఒక పెద్ద గుడ్ల గూబ వచ్చి, అక్కడి గూళ్ళల్లో నిద్రపో తూన్న కాకులదండుని చంపింది. ఈ మారణకాండను చూసిన అతనికి, తన తండ్రిని చంపిన ధృష్టద్యుమ్నుణ్ణీ ఇతర పాంచాల దేశస్థుల్నీ చంపుదామన్న క్రూరమైన ఆలోచన వచ్చింది. అంతే. ఆ ఇద్దర్నీ లేపి, తన నిశ్చయాన్ని చెప్పాడు. ఆదమరచి నిద్రపోయేవాళ్ళనూ నిరాయుధుల్నీ చంపడం న్యాయం కాదు గనక, ఆపని పొద్దున్న చేద్దామన్న మేనమామ మాట అతనికి నచ్చలేదు. అతను బయలు దేరితే, ఇక చేసేదిలేక, వాళ్ళిద్దరూ కూడా అతని వెంట వెళ్ళారు. అక్కడ పాంచాల శిబిరం దగ్గర అశ్వత్థామ మహాద్భుతుడైన ఒక పురుషుణ్ణి చూశాడు. భయపడకుండా అతనిమీద ఎన్నెన్నో శస్త్రాల్ని వేశాడు. కానీ అవన్నీ అతనిలో లీనమైపోయాయి. తన దగ్గరున్న అస్త్రశస్త్రాలన్నీ అయిపోయిన తర వాత అతనికి తన క్రూరమైన నిశ్చయాన్ని దండించడానికి మహాదేవుడే దిగి వచ్చా డని అనిపించింది. తక్షణమే రుద్రుణ్ణి స్తుతి చేయడం మొదలు పెట్టాడు. చివరికి తనను తాను రుద్రచరణాల్లో బలిగా అర్పించుకోడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ఎదురుగా ఉన్న వేదిమీద అగ్ని మండుతూ అవుపించింది. అశ్వత్థామ వెనుదీయకుండా ఆ అగ్నిలోకి దూకి కూర్చున్నాడు. అప్పుడు మహాదేవుడు, ‘శ్రీకృష్ణుణ్ణి సమ్మానిస్తూ పాంచాలుల్ని ఇంతదాకా నేను రక్షిస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు వాళ్ళ కాలం దగ్గరపడింది’ అని చెబుతూ, తానే అశ్వత్థామను ఆవేశించి, ఒక ఖడ్గాన్ని అందించాడు. శిబిర ద్వారం దగ్గర తతిమ్మా ఇద్దరూ ఎవరూ బయటికి పోకుండా కాపలా కాస్తూ నిలుచున్నారు. అశ్వత్థామ లోపలికి పోయి ముందస్తుగా నిద్రపోతున్న ధృష్టద్యుమ్నుణ్ణి జుట్టుపట్టు కొని లేవదీసి, పశువును చంపినట్టు చంపాడు. ఇంతలో మెలకువ వచ్చి మీదకు వచ్చిన ఇతర యోధుల్ని రుద్రా స్త్రంతో ఊచకోత కోశాడు. ఆ మీద నిద్రపో తూన్న ద్రౌపది కొడుకుల్ని ఒక్కొక్కడినీ నరికేశాడు. శిబిరం ఇవతలకు వచ్చి తాను చేసిన ఘనకార్యాన్ని మేనమామకూ కృతవర్మకూ గొప్పగా చెప్పాడు. తిరిగి ఆ ముగ్గురూ అడవికి వెళ్ళిపోయారు. ఇతని కసినీ ఆలోచన లేనితనాన్నీ ఎరిగినవాడు గనకనే తండ్రి ఇతనికి మనుషుల్లో ప్రయో గించకూడని బ్రహ్మశిరమనే అస్త్రాన్ని ఈయలేదు. అర్జునుడికి ఇచ్చాడని ఇతను కొంచెం మారాం చేస్తే ఉపసంహారాన్ని చెప్పకుండా ద్రోణుడు ‘నువ్వు దీన్ని చపలభావంతో వెయ్యకూడద’ని మరీ చెప్పి ఆ అస్త్రాన్నిచ్చాడు. ఒకసారి శ్రీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, నీ చక్రాన్ని నాకియ్య మంటూ తలబిరుసుతనాన్ని చూపించాడు. ‘తీసుకో’ అంటే, దాన్ని ఎత్తలేకపోయాడు. కొడుకుల్ని చంపాడనగానే భీముడు అశ్వత్థామ వెంటపడ్డాడు. భీముణ్ణి బ్రహ్మ శిరోనామకాస్త్రం నుంచి కాపాడాలని శ్రీకృష్ణుడు యుధిష్ఠిర అర్జునులతో సహా వెళ్ళాడు. అశ్వత్థామ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని వేసేశాడు. శ్రీకృష్ణుడు చెప్పగా దానిమీదకు మళ్ళీ ఆ అస్త్రాన్నే అర్జునుడు వేశాడు. వ్యాసుడూ నారదుడూ ఆ ముప్పును ఆపడానికి వచ్చారు. ‘ఈ అస్త్రాన్ని మనుషుల మీద వెయ్యకూడదు. దాన్ని మరో అస్త్రంతో నాశనం చేద్దామని చూస్తే, ఆ ప్రదేశంలో 12 ఏళ్ళపాటు వర్షాల్లేక మనుషులు అల మటిస్తారు. కనక, మీరిద్దరూ వాటిని ఉప సంహరించండి’ అని వ్యాసుడు ఆదేశిం చాడు. అర్జునుడు ఆ పని చేశాడుగానీ, అశ్వత్థామకు అది చేతగాలేదు. వ్యాసుడు చెప్పగా తన మణిని తీసి ఇస్తూ, అపాండవం గావాలని విసిరిన ఇషీకాన్ని పాండవేయుల గర్భం మీదకు మళ్ళిం చాడు. అది విని శ్రీకృష్ణుడు ‘నువ్వు నా చక్రాన్ని అడిగినప్పుడే నీ క్రూరత్వం అర్థమైంది. ఉత్తరాగర్భంలో ఉన్న పరీ క్షిత్తును నీ అస్త్రం కాల్చినా నేను మళ్ళీ ప్రాణం పోస్తాను. అతను పాండవుల తరువాత పరిపాలిస్తాడు. నీ క్రూరత్వానికి ఫలాన్ని పొందు. మూడు వేల సంవత్స రాలు భూమ్మీద ఒంటరిగా నిర్జనవనాల్లో తిరుగు. నీ శరీరం నుంచి చీమూ నెత్తుర్ల వాసన వస్తూండగా కీకా రణ్యాల్లో నువ్వు ఉండవలసి వస్తుంది’ అంటూ శపించాడు. అశ్వత్థామ శక్తిహీనుడై నిర్జన ప్రదే శాల్లో ఉండడమంటే యోగపరంగా గొప్ప అర్థముంది. సాధకుడు ముక్తిని పొంది దివ్యచైతన్యంలో ప్రతిష్ఠితుడై ఉన్నప్పుడు అతని కోరికలు, పర మాత్మ తాలూకు ‘కోరికగాని కోరిక’లాగ అయి, అతన్ని లోబరుచుకోలేని స్థితిలో ఉంటాయి. అంటే, ఆశయాన్నుంచి విడివడి ఈశ్వర త్వాన్ని పొందుతాడు ఆ సాధకుడు. - డా॥ముంజులూరి నరసింహారావు -
కృపాచార్యుడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 17 శరద్వంతుడనే గౌతమ వంశీయుడు తపస్సుతో ధనుర్వేదాన్ని నేర్చుకొన్నాడు. కొంతమంది చదువు అంటకపోయినా, ఆటల్లోనో నటనలోనో ఇతర కళల్లోనో రాణించినట్టుగా ఈ గౌతముడికి వేదా భ్యాసమంటే గిట్టేది కాదు గానీ, విలువిద్య అంటే మహాపిచ్చి ఉండేది. తపస్సుతోనే ఆ ధనుర్విద్యలో పారంగతుడయ్యాడు. తపస్సంటే ఇంద్రియాల స్వేచ్ఛను అపహరించడమే; వాటిని అదుపులో పెట్టడమే. ఇంద్రియాలకు రాజు మనస్సు. మనస్సు రెండు రకాలుగా ఉంటుంది: ఇంద్రియ సంబంధమైనది ఒకటి; రెండోది దివ్యమైనది. పురాణాల్లో కనిపించే ఇంద్రుడు మొదటి రకం మనస్సు, తపస్సును భ్రష్టుపట్టిద్దామన్న యావతో తన ఇంద్రియ రాజ పదవికి ముప్పు రాకుండా చూసుకొనే కరడుగట్టిన స్వార్థం లాగ అనిపిస్తుంది గానీ నిజానికి అది పెట్టేది ఒక గడ్డు పరీక్ష; వేదంలో అవుపించే ఇంద్రుడు రెండో రకం మనస్సు, సాక్షిభూతమూ కూటస్థమూ ధ్రువమూ స్థిరమూ అయిన విజ్ఞానం. మొదటి మనస్సు మానుషమైనదిగా అనిపిస్తుంది; రెండోది దివ్యమైనది. మానుషమైన మనస్సుకు ఏ తపస్సైనా కంటగింపే. ఆ మనస్సు అప్సరసల్ని పంపించి తపస్సును పాడు చేద్దామని చూస్తుంది. ‘ప్సా’ అనే క్రియకు తినడం, అంటే, అనుభవించడం అని అర్థం. ‘అప్సా’ అంటే, అందుచేత, ‘తినకూడనిదీ’, ‘అనుభవించకూడనిదీ’ అని అర్థం. అనుభవించకూడని రసమే ‘అప్సరస’. ఈ అనుభవించకూడని రసమేమిటి? అప్సరసలు ‘అప్సు’, అంటే, నీళ్లల్లోంచి పుట్టారని పురాణాలు ఒక కథను చెబుతాయి. అమృతం కోసం సముద్రాన్ని మధించినప్పుడు విషమూ లక్ష్మీ చంద్రుడూ ఐరావతమూ ఉచ్చైశ్శ్రవమూ మొదలైనవాటితో సహా అప్సరసలు పుట్టుకొచ్చారని ఆ కథ చెబుతుంది. అమృతం కోసం ప్రయత్నించేవాళ్లకు పైన చెప్పినవన్నీ అడ్డులే. నీళ్లు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. అచ్చూ మచ్చూ అలాగే ఎప్పుడూ ఎడతెరిపి లేకుండా ప్రవహించేవి కర్మలు. ఒక పని తరవాత మరో పని వరసగా మీదకు దాడి చేస్తూన్న ట్టుగా వస్తూనే ఉంటుంది ఆపుదల లేకుండా. సంస్కృతంలో ‘అప్పు’లంటే నీళ్లనీ కర్మలనీ రెండు అర్థాలూ ఉన్నాయి. ఇంతకీ అప్సరసలంటే, ఇప్పుడు తేలిం దేమిటంటే, అనుభవించకూడని కర్మఫల రసాలని. కర్మఫలాలను అనుభవించాలని ఉవ్విళ్లూరితే ఎడతెగని బంధాలనే అప్పుల్లో పీకలదాకా మునిగిపోతాం: జన్మమీద జన్మ పోటీపడ్డట్టుగా ఎడతెరిపి లేకుండా అవశంగా వస్తూనే ఉంటుంది. మనస్సును అదుపులో పెట్టుకొని, తపస్సు చేద్దామని చూసే ప్రతి సాధక రుషికీ ఆ మనస్సే ‘అప్సరసల’ను ఎరగా చూపిస్తూ ఉంటుంది. పురాణాల్లో చెప్పిన ఇటువంటి రుషులందరూ మార్కండేయుడిలాగ అసలు లొంగ కుండానో ఇప్పటి గౌతముడిలాగ తాత్కాలికంగానో కొంతమంది విశ్వామిత్రుడిలాగ చాలాకాలం పాటో లొంగి, పాట్లను పడుతూ ఉంటారు. ఇక్కడ గౌతముణ్ని ఊరిద్దామని వచ్చిన దివ్యకన్య పేరు ‘జానపది’: ‘జానం’ అంటే పుట్టుక. పుట్టుకకు పదం, అంటే, స్థానమైనది ‘జానపది’. పుట్టుకకు స్థానం, అంటే, కారణం తెలివి మాలినతనమనే పాపం. గౌతముడంటే ఇంద్రియాలను బాగా అణిచినవాడని అర్థం. కానీ ఆ జానపదిని చూడగానే అతని ధైర్యం ఆ క్షణంలో సడలిపోయింది. ఇంతలోనే మెలకువను తెచ్చుకొని, విల్లూ అమ్ములూ అక్కడే వదిలేసి, ఎక్కడికో వెళ్లిపోయాడు. అతని ధైర్యం తాత్కాలి కంగా దెబ్బతిన్న కారణంగా అక్కడ ఒక పిల్లాడూ ఒక పిల్లా పుట్టారు. ‘జానపది’ పని అయిపోయింది కాబట్టి ఆవిడా జారుకుంది. అక్కడ ఆ రెల్లుగడ్డి మధ్యలో ఉన్న పసికందుల్ని, వేటకు వెళ్లిన శాంతను మహారాజు చూసి జాలితో వాళ్లను సాకాడు. కనకనే వాళ్లకు ‘కృప’, ‘కృపి’ అనే పేర్లు పెట్టారు. పుట్టిన కొడుక్కి అతని తండ్రి రహస్యంగా వచ్చి విలువిద్యను నేర్పాడు. ‘కృప’ అనే మాటకు జాలి అని అర్థమేగాక, ‘కృప’ అనే ధాతుపరంగా కల్పన చేయడం అన్న అర్థం కూడా ఉంది. అదీగాక, దౌర్బల్యమనీ సామర్థ్యమనీ కూడా అర్థాలున్నాయి. మనుషుల్ని దౌర్బల్యంగా చేసే సామర్థ్యమున్నది అభూతకల్పనకు లోనుజేసే అవిద్య. అవిద్య మాయకు కూతురు. మాయ మొత్తం లోకంలోని అందర్నీ మోసం చేస్తుంది. మాట వరసకు, ఆకాశానికి ఏ రంగూ లేకపోయినా మనందరికీ నీలంగా అవుపిస్తూ ఉంటుంది. అంతేగాదు, అది మహా నిజమైనట్టు, వినీలాకాశమంటూ కవుల కవిత్వాలూ వినిపిస్తూ ఉంటాయి. ఆకాశంలో ఎగురుతూండే దుమ్ముకణాల మీద కాంతికిరణాల విక్షేపం వల్ల ఈ రంగు అవుపిస్తుంది. కానీ, ఎంత తెలిసినా, దాన్ని రంగులేనిదానిగా చూడడం నేలమీద తిరిగే మనకు పడదు. అవిద్య అనేది మనిషి మనిషికీ వేరు వేరుగా ఉండే భ్రమ. ఇది అతని స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. అవిద్య అంటే, విద్య లేకపోవడమని అర్థంగాదు. శుభ్రంగా లేనిదాన్ని శుభ్రంగా ఉందను కోవడమూ, మారిపోయేదాన్ని అసలు మారిపోకుండా ఎప్పటికీ ఉంటుందను కోవడమూ, దుఃఖాన్ని సుఖమను కోవడమూ - అన్నీ ఇలాగ తారుమారుగా కల్పించుకొంటూ అనుకోవడమే అవిద్యకు గుర్తు. మాటవరసకు, పొద్దున్న వండిన అన్నం సాయంత్రానికి పాసిపోతుంది. ఆ అన్నాన్ని తిని పెరిగే ఈ శరీరం ఎప్పుడూ ఉంటుందని ఊహించడం అందరికీ ఉన్న అవిద్యే, తెలివిమాలినతనమే. దీన్ని ఆలోచనతో రూఢి చేసుకొన్న మనిషి మొదట్లో అందరిలాగే శరీరాన్ని నిత్యమని భ్రమపడినా, తాను పోగుచేసుకొన్న జ్ఞానంతో నెమ్మదినెమ్మదిగా దాన్ని పోగొట్టుకోగలుగుతాడు. ఆ విధంగా అవిద్యా స్థాయిల్లో తేడాలుంటాయి. ఈ అవిద్యే మనుషులందరికీ మొదటి ఆచార్యుడు. పాండవులకూ కౌరవులకూ యాదవులకూ అందరికీ కృపాచార్యుడే మొదటి గురువు. ఆ తరవాతనే ద్రోణా చార్యుడి పాఠాలు వచ్చాయి. కృపాచార్యుడి తోబుట్టువు కృపి, ద్రోణాచార్యుడికి భార్య అయింది. కృపీ ద్రోణాచార్యుల సంతానమే అశ్వత్థామ. అంచేత, కృపాచార్యుడికి అశ్వత్థామ మేనల్లుడన్నమాట. వీళ్లు ముగ్గురూ అధర్మానికే కొమ్ముకాస్తూ కౌరవులవైపే యుద్ధం చేశారు. దానిలో జరిగిన రెండు అకృత్యాల్లో కృపాచార్యుడూ అశ్వత్థామా భాగస్వాములయ్యారు. మొదటిది, అభి మన్యుణ్ని ఏకాకిని చేసి ఒకేసారి ఆరుగురు దాడిచేసి చంపడం. అర్జునుణ్ని చంపిగానీ యుద్ధాన్ని విరమించమని శపథం చేసి సుశర్మతో సహా పదివేల మంది అతన్ని దూరంగా తీసుకొనిపోయారు. ఆ సంశప్త కులతో అక్కడ యుద్ధం జరుగుతూన్న ప్పుడు, ద్రోణాచార్యుడు చక్రవ్యూహం పన్నాడు. దానిలోకి చొరబడడమైతే వచ్చును గానీ బయటపడడం మాత్రం చేతగాదు అభిమన్యుడికి. అయితే, అర్జునుడు సంశప్తకులతో యుద్ధం చేస్తూ ఉండడంతో, ఇక్కడ అభిమన్యుడు వ్యూహంలోకి చొరబడవలసివచ్చింది గత్యంతరం లేక. ద్రోణుడూ అశ్వత్థామా కృపుడూ కృతవర్మా కర్ణుడూ బృహద్బ లుడూ అనే ఆరుగుర్నీ వేరువేరుగా ఓడించాడు అభిమన్యుడు. అప్పుడు ద్రోణుడు విల్లునొకణ్నీ గుర్రాలనొకణ్నీ రథానికి అటుపక్కా ఇటుపక్కా రక్షిస్తూ ఉండే పార్శ్వరక్షకుల్ని ఒక్కణ్నీ పడగొట్ట మని పథకం వేశాడు. కర్ణుడు విల్లు విర గ్గొడితే, గుర్రాల్ని కృతవర్మ చంపాడు; కృపుడు పార్శ్వరక్షకుల్ని మట్టుబెట్టాడు. అలా ఒక్కణ్ని చేసి అభిమన్యుణ్ని చంప డంలో కృపాచార్యుడి చెయ్యి కూడా ఉంది. రెండోది, నిద్రపోతూన్న ఉప పాండవుల్నీ ధృష్టద్యుమ్నుణ్నీ శిఖండినీ చంపడం. దుర్యోధనుడు కూడా చని పోయిన తరవాత, సౌప్తికపర్వంలో అశ్వ త్థామకు సాయపడ్డవాళ్లు కృతవర్మా కృపా చార్యుడూను. సౌప్తిక పర్వమనేది నిద్ర పోతూన్నప్పుడు యోద్ధల్ని పశువుల్ని చంపినట్టు చంపిన కథనాన్ని చెప్పే భాగం. దుర్యోధనుడి చేత చివరి సేనాపతిగా తిలకాన్ని పెట్టించుకొన్న అశ్వత్థామ, తనతోబాటు బతికి ఉన్న కృపుడూ కృతవర్మలతో కలిసి శత్రువులకు అవుపడ కుండా రాత్రి అడవిలో ఒక మర్రిచెట్టు కింద ఉన్నాడు. వాళ్లిద్దరూ నిద్రపోయారు గానీ అశ్వత్థామకు కునుకు పట్టలేదు. అక్కడ అతను ఒక గుడ్లగూబ ఆ చెట్టు మీదున్న గూళ్లల్లో నిద్రపోతూన్న కాకుల్ని చంపడాన్ని చూశాడు. తాను కూడా తన తండ్రిని చంపిన ధృష్టద్యుమ్నుణ్ని అలాగే చంపాలని నిశ్చయం చేసుకొన్నాడు. ఆ ఆలోచనను విన్న మేనమామ కృపా చార్యుడు బోధ చేశాడు: అద్య స్వప్స్యన్తి పఞ్చాలా విముక్తకవచా విభో విశ్వస్తా రజనీం సర్వే ప్రేతా ఇవ విచేతసః॥యస్తేషాం తదవస్థానాం ద్రుహ్యేత పురుషో నృజుః వ్యక్తం స నరకే మజ్జేదగాధే విపులే ప్లవే॥(సౌప్తికపర్వం 5-13, 14): ఈ రోజు రాత్రి పాంచాలురందరూ గెలిచామన్న ధీమాతో, కవచాలు తీసేసి నిశ్చింతగా నిద్రపోతూంటారు. ఆ అవస్థలో ఎవడైనా క్రూరుడై ద్రోహం చేస్తే, వాడు ఘోర నరకంలో మగ్గిపోవడం ఖాయం. ఇంత చెప్పినా, మేనల్లుడు మేనమామ మాటను పెడచెవిన పెట్టాడు. అశ్వత్థామ ఒక్కడూ వాళ్ల శిబిరానికి బయలుదేరుతూంటే, కృతవర్మా కృపుడూ సాయంగా వెళ్లారు. శిబిర ద్వారం దగ్గర నిలుచుని, ఎవరైనా పారిపోతూంటే వాళ్లను చంపడానికి సన్నద్ధులై పొంచి కాపలా కాశారు. ఇంతగా పాండవులకు విరుద్ధంగా ప్రవర్తించి కూడా చివరికి బతికినవాళ్లు కౌరవుల్లో ఈ ముగ్గురే. నిజానికి వీళ్లు కౌరవులు కారు, కౌరవుల అధర్మానికి కొమ్ముకాసినవాళ్లు. అశ్వత్థామ ద్రోణా చార్యుడి కొడుకు; కృతవర్మ భోజవంశం వాడైన యాదవుడు; కృపాచార్యుడు గౌతమ వంశంవాడు. అశ్వత్థామ తాను చేసిన జుగుప్సాకరమైన పనివల్ల అడవు ల్లోనే అజ్ఞాతంగా ఇప్పటికీ బతికే ఉన్నాడని చెబుతారు. కృపాచార్యుడు పాండవులతో సంధి చేసుకొని, వాళ్ల దగ్గరే ఉన్నాడు. అభిమన్యుడి భార్య ఉత్తరకు పరీక్షిత్తు పుట్టిన తరవాత, ఆ కుర్రాడికి విలువిద్యను కృపాచార్యుడే నేర్పాడు. అంటే, మొదటి పాఠం మళ్లీ అవిద్యకు ప్రతీక అయిన కృపాచార్యుడిదేనన్నమాట. కృపాచార్యుడిలాగ తన బతుకును పొడిగిస్తూ ఉండడమంటే, ఈ సాపేక్షక ప్రపంచంలో ఈ అవిద్య ఎప్పటికీ లేకుండా పోదని అర్థం. అవిద్యే తప్పుకుంటే, సృష్టిలోని రూపాలన్నీ అరూపమైన పరమాత్మగా అయిపోయి సృష్టి కనుమరుగైపోతుంది. -
నకులసహదేవులు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 16 నకులసహదేవులు కవలపిల్లలు. అశ్వినీ దేవతల వల్ల మాద్రికి పుట్టినవాళ్లు. సూర్యుడికి సంజ్ఞాదేవి వల్ల పుట్టిన అశ్వినులు కూడా కవలలే. అశ్వినుల్ని దివిభువులనీ రాత్రిం బగళ్లనీ శ్వాసప్రశ్వాసలనీ చెబుతారు గనక వాళ్లు ద్వంద్వాలకు ప్రతినిధులు. వీళ్లిద్దరూ అందంగా ఉండడం వల్లనే వీళ్లవల్ల పుట్టిన నకులసహదేవులు కూడా చాలా అంద గాళ్లు. కవలపిల్లల్ని సంస్కృతంలో ‘యమౌ’ అని అంటారు. ‘యమౌ’ అంటే, యోగ భాషలో ‘యమ నియమాల’నే మొదటి రెండు యోగాంగాలూను. యమాలంటే హింసిం చకుండా ఉండడమూ దొంగతనానికి పాల్పడకపోవడమూ వీర్యాన్ని కాపాడు కుంటూ ఉండడమూ అబద్ధం చెప్పకుండా ఉండడమూ కావలసినదాని కన్నా ఎక్కువగా పోగు చేసుకోకపోవడమూ మొదలైనవి. నియమాలంటే, లోపలా బయటా శుచిగా ఉండడమూ ఉన్నదానితో సంతృప్తిపడుతూ అనవసరమైన వాటి కోసం వెంపర్లాడ కుండా ఉండడమూ కోరికల్ని విడిచిపెట్టి క్రమశిక్షణతో ఉండడమూ విశ్వమంతా విస్తరించి ఉన్న చైతన్యాన్ని అధ్యయనం చేస్తూ ఉండడమూ విశ్వాన్ని సృష్టించిన మహాచైతన్యానికి తన సర్వస్వాన్నీ సమర్పించే భావాన్ని పెంపొందించుకోవ డమూ మొదలైనవి. యమనియమాలను వినగానే వీటివల్లనే ఆరోగ్యం కలుగు తుందని తెలిసిపోతుంది. ఆరోగ్యం అందా నికి మూలం. అశ్వినులు ఈ ఆరోగ్యమనే అందాన్నిచ్చే వైద్యులు. వాళ్ల కొడుకుల అందం గూడా ఈ యమనియమాల ప్రభావం వల్లనే సిద్ధించింది. యమనియమాల్లాగే శమదమాలు కూడా కవలలే. దమమంటే బయటి పది ఇంద్రియాలనూ అదుపులో ఉంచుకో వడం; శమమంటే లోపలి ఇంద్రియమైన అంతఃకరణాన్ని అదుపులో పెట్టుకోవడం. అంతఃకరణమంటే మనస్సూ బుద్ధీ చిత్తమూ అహంకారమూ అనే నాలుగుగా మనం చెప్పుకొనే ఒకే ఇంద్రియం. యమనియమాలూ దమశమాలూ అనే కవల లక్షణాలకు సహదేవనకులులు ప్రతీకలు. ఆధ్యాత్మికతకు మూలమైన ఆధారాలు దమమూ యమమూను. అంచేతనే వీటిస్థానం మూలాధారం. ఇది సహదేవుడి స్థానం. దేవతలంటే సృష్టిలోని వస్తువుల్ని ప్రకాశింపజేసేవాళ్లు. ఆ పని చేసేవి మన ఇంద్రియాలు. అంచేత దేవత లంటే ఇంద్రియాలన్నమాట. ‘షహ- మర్షణే’, అంటే, సహించడమూ ఓర్చుకోవ డమూను. అంచేతనే, ఇంద్రియాల ఒత్తిళ్లను ఓర్చుకొనే శక్తే ‘సహదేవుడు’, అంటే, దమం. ఆధ్యాత్మికతకు అధిష్ఠా నాలు శమమూ నియమమూను. అంచే తనే వీటి స్థానం స్వాధిష్ఠానం. ఇది నకు లుడి స్థానం. ఇంద్రియ కులానికి బంధువు మనస్సు. మనస్సుకు అనుకూలంగా ఉండనివాడే - ‘న(అను)కూలుడు’, అతనే నకులుడు. మనస్సు అశాంతికి పెట్టింది పేరు. అందుకే నకులుడు శాంతికి, అంటే, శమానికి ప్రతీక. ధర్మరాజుతో సమానుడు. ప్రశాంతికి మారుపేరైన ధర్మరాజు, తండ్రి ఆజ్ఞ ప్రకారం రాజసూయయాగం చేద్దామనుకొన్నాడు. ఆ యాగం చేయా లంటే రాజులందర్నీ జయించాలి. దాని కోసం అతని నలుగురు తమ్ముళ్లూ నాల్గు దిక్కులనూ జయించుకొని వచ్చారు. వాటిలో పడమర నకులుడి భాగమైంది; దక్షిణం సహదేవుడి భాగమైంది. పడమటి దిక్కంటే, వాసుదేవ కృష్ణుడి అధికారంలో ఉన్న దిక్కు. కృష్ణుడు పాండవుల మీది ప్రేమకొద్దీ నకులుడికి కానుకలు పంపాడు. అలాగే అటే ఉన్న మద్రదేశానికి అధిపతి అయిన శల్యుడు, మేనల్లుడి మీది ప్రేమ కొద్దీ తానే స్వయంగా నకులుడి వశంలోకి వచ్చాడు. సహదేవుడు దక్షిణదిక్కుకు పోతూ కిష్కింధ గుహకు వెళ్లాడు. అక్కడ ద్వివిదమైందవులతో యుద్ధం జరిగింది. నకుల సహదేవులకు మల్లేనే మైందద్వి విదులనే వానర రాజులిద్దరూ కూడా అశ్వినీపుత్రులే. వాళ్లు ఏడురోజులు యుద్ధం చేసి సహదేవుడి శౌర్యానికి సంతో షిస్తూ, ధర్మరాజుకోసం రత్నాలను కాను కలుగా ఇచ్చారు. ‘అవిఘ్నమస్తు కార్యాయ ధర్మరాజాయ ధీమతే’ అని దీవించి సహ దేవుణ్ని పంపారు. మాహిష్మతీనగర రాజు నీలుడికి అతని అల్లుడైన అగ్ని బాసటగా నిలిచాడు. అగ్ని తన సేనను కాల్చడాన్ని చూసి, సహదేవుడు అగ్నిని స్తుతి చేశాడు. రాజసూయయాగం చేద్దామనుకుంటూన్న ధర్మరాజుకు ‘యజ్ఞవిఘ్నమిమం కర్తుం నార్హస్త్వం హవ్యవాహన’ అని ప్రార్థించ గానే, సహదేవుణ్ని ఊరడిస్తూ అగ్ని తప్పు కొన్నాడు. అప్పుడు నీలుడు, అగ్ని ఆజ్ఞతో సహదేవుణ్ని సత్కరించి అతనికే విజయ మని ఘోషించాడు. దక్షిణ సముద్ర తీరానికి వచ్చి, విభీషణుడికి ధర్మరాజు యాగాన్ని గురించి కబురు పంపాడు. కబురందుకోగానే అతను రత్నాలనూ దివ్యమైన ఆభరణాల్నీ ఖరీదైన బట్టల్నీ ఉపాయనాలుగా పంపాడు. అలా నకుల సహదేవులిద్దరూ పశ్చిమ దక్షిణాలను జయించి ధర్మరాజు యాగానికి దోహదం చేశారు. రాజసూయంలో భీష్ముడు ధర్మ రాజుతో ఒకానొక అర్హుడికి అగ్రపూజ చేయాలని గుర్తుకు తెచ్చాడు. యుధిష్ఠి రుడు తాతగార్నే ఆ అగ్రపూజకు అర్హు డెవరో నిర్ణయించమని ప్రార్థించాడు. అప్పుడతను శ్రీకృష్ణుడే అర్హణీయతముడని నిర్ణయించాడు: ఏష హ్యేషాం సమస్తానాం తేజోబలపరాక్రమైః!/మధ్యే తపన్నివా భాతి జ్యోతిషామివ భాస్కరః!!/ అసూర్యమివ సూర్యేణ నిర్వాతమివ వాయునా!/ భాసితం హ్లాదితం చైవ కృష్ణేసేదం సదో హి నః!!’ (సభాపర్వం 36-28, 29): జ్యోతిర్మండలాల్లో సూర్యుడి మాదిరిగా అందరిలోకీ తేజస్సుతోనూ బలంతోనూ పరాక్రమంతోనూ ప్రకాశిస్తూన్నవాడు ఈ శ్రీకృష్ణుడే. సూర్యుడు లేక చీకటిలో అలమటిస్తూన్న లోకాన్ని సూర్యుడు తన వెలుగులతో ఎలాగ ముంచెత్తుతాడో అలా లోకాల నన్నిటినీ తేజశ్శక్తులతో నింపుతున్నాడు ఈ శ్రీకృష్ణుడు. గాలి లేనిచోట జీవం చచ్చి పోతుంది, ఉండనే ఉండదు. అటువంటి గాలి లేనిచోట గాలి సంచరించడం మొదలుపెడితే, ఎలాగ జీవాలన్నీ ఆనం దిస్తాయో అలాగ అందరినీ ఆహ్లాదంలో మునిగేలాగ చేస్తాడు ఈ శ్రీకృష్ణుడు. ఈవిధంగా శ్రీకృష్ణుణ్ని అగ్రపూజకు తగినవాడిగా ఘోషించగానే సహదేవుడు పూజాసామగ్రిని పట్టుకొని సభలోకి వచ్చాడు. సరిగ్గా అప్పుడే దానికి శ్రీకృష్ణుడి మేనత్తకొడుకు శిశుపాలుడు ఆక్షేపణ తెలుపుతూ అడ్డగించాడు: ‘ఆచార్యుడు గానీ ఋత్విక్కుగానీ సంబంధీకుడు గానీ శ్రుతిశాస్త్రస్నాతకుడు గానీ ప్రియమిత్రుడు గానీ ఒక మహారాజు గానీ అర్ఘ్యానికి అర్హులు. యాదవకులంలో పుట్టిన శ్రీకృష్ణుడికి రాజ్యార్హతే లేదు. పెద్దవాడం దామా దానికి అతని తండ్రి వసుదేవుడు న్నాడు. ప్రియమిత్రుడందామా దానికి ద్రుపదుడున్నాడు. అదీగాక ఋత్విక్కైన వ్యాసుడుండగా ఇతన్ని అర్హుడని ఎలాగన గలం? దుర్యోధనుడూ కృపాచార్యుడూ ద్రోణాచార్యుడూ భీష్మకుడూ రుక్మీ ఏక లవ్యుడూ శల్యుడూ అనే మహామహా పరాక్రమవంతులుండగా కృష్ణుణ్ని ఈ పూజకు ఎన్నుకోవడం సబబు కానేకాదు’ అంటూ ధ్వజమెత్తాడు. ధర్మరాజూ భీష్ముడూ ఎవరు చెప్పినా వినకుండా మొండిగా వితండంగా వాదిస్తూనే ఉన్నాడు. అప్పుడు సహదేవుడు నిండు సభలో అతిధైర్యంగా, అప్రమేయమైన పరాక్రమమున్న శ్రీకృష్ణుణ్ని పూజార్హుడిగా సహించలేనివాళ్లెవరున్నా వాళ్ల తలమీద ‘ఇదుగో నా పాదం పెడతాను’ అని భీకరంగా పలికాడు: ‘పూజ్యమానం మయా యో వః కృష్ణం న సహతే నృపాః!/సర్వేషాం బలినాం మూర్ధ్ని మయేదం నిహితం పదమ్!!’ (సభాపర్వం 39-2,3). అందరి మధ్యలో సహదేవుడు తన పాదాన్ని ఎత్తి చూపించగానే వాళ్లలో ఎవ్వరూ పెదవి మెదపలేదు. మూగ వాళ్లలా చతికిలపడి పోయారు. దీనికి కారణం యమనియ మాలు దృఢం కావడంతో సహదేవుడికి నైతిక ధైర్యం ప్రబలడమే. అప్పుడు సర్వ సంశయాల్నీ పోగొట్టే నారదుడు ఇలా ముక్తాయించాడు: ‘కృష్ణం కమలపత్రాక్షం నార్చయిష్యన్తి యే నరాః!/జీవన్మృతాస్తు తే జ్ఞేయా న సంభాష్యాః కదాచన!!’ (సభాపర్వం 39-9). కృష్ణపూజను చేయనివాడు బతి కుండీ చచ్చినవాడితో సమానం. అటు వంటివాడితో మాట్లాడటం కూడా అప రాధమే అని తేల్చి చెప్పాడు. భీముడూ నకులసహదేవులూ కలిసి శకునినీ అతని కొడుకు ఉలూకుణ్నీ ఎది రించిన సమయంలో సహదేవుణ్ని శకుని ఒక ఈటె వేసి రథంలో కూలిపోయే లాగ చేశాడు. అప్పుడు భీముడు చేసిన సింహ గర్జనకు శకుని సైనికులందరూ కాందిశీ కులై, అంటే, ఏ దిక్కుకు పోతున్నారో తెలియకుండా పారిపోయారు. ఇంతలో సహదేవుడు మెలకువ తెచ్చుకొని, శకుని విల్లును విరగ్గొట్టాడు. మరో విల్లు తీసు కొని శకుని నకులుణ్ని అరవై బాణాల తోనూ భీముణ్ని ఆరు బాణాలతోనూ కొట్టాడు. ఉలూకుడు కూడా భీముణ్ని ఏడు బాణాలతోనూ సహదేవుణ్ని డెబ్భై బాణాలతోనూ వేధిం చాడు. అప్పుడు అతికోపంతో సహదేవుడు ఒక భల్లాన్ని వేసి ఉలూకుడి తలను ఉత్తరించాడు. కొడుకు తన ఎదురు గుండానే నేలకొరగ డాన్ని సహించలేక, శకుని సహదేవుడి మీద విరుచుకుపడ్డాడు. సహదేవుడి విల్లును విరగ్గొట్టాడు. అంతటితో ఊరు కోక ఒక పెద్ద ఖడ్గాన్ని తీసి సహదేవుడి మీదకు విసిరాడు. దాన్ని మధ్యలోనే రెండు ముక్కలుగా చేశాడు సహదేవుడు. ‘ఎవడైనా క్షత్రియ ధర్మాన్ని అనుసరిస్తూ బాణాలు వేసి పౌరుషాన్ని చూపిస్తాడు గానీ, నీలాగ సభలో పాచికలతో పందెం వేస్తూ మోసంతో గెలిచి వెకిలిగా నవ్వుతూ వెక్కిరించడు. ఆ నీచకర్మకు ఫలాన్ని అనుభవించు’ అంటూ సహ దేవుడు శకుని వింటిని విరిచి, గుర్రాల్ని చంపి, ధ్వజాన్ని ముక్కలు చేసి, బాణ వర్షం కురిపించాడు. శకుని ప్రాసం వేయ బోతూంటే సహ దేవుడు ఆ ప్రాసంతో సహా అతని రెండు చేతుల్నీ మూడు భల్లాలతో నరికి, ఆ వెంటనే మరో భల్లంతో అతని తలను ఉత్తరించాడు. శకునిని చంపి, సహదేవుడు మోహాన్ని మోసాన్నీ అంతం చేశాడు. - డా॥ముంజులూరి నరసింహారావు -
శ్రీకృష్ణుడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 15 (గతవారం తరువాయి) శ్రీకృష్ణుడికి రెండువైపులవాళ్లూ ఒకటే. పాండవులకేమో అమ్మకు సాక్షాత్తూ మేనల్లుడు; దుర్యోధనాదులకేమో చిన్నమ్మకు మేనల్లుడు. అంతే తేడా. ‘సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యో స్తి న ప్రియః! యే భజన్తి తు మాం భక్త్యా మయి తే తేషుచాప్యహమ్!!’’ (భగవద్గీత 9-29): అతనికి అందరూ సమానులే. ఒకడు పగవాడూ మరొకడు ప్రేమించ దగినవాడూ అంటూ లేరతనికి. భక్తితో సేవించేవాళ్ల దృష్టిలో తాను ఉంటాడు, అలాగే తన దృష్టిలోనూ వాళ్లుంటారు. కల్పవృక్షానికి పక్ష పాతం ఉండదు. దాని దగ్గర చేరిన వాళ్లకూ దూరంగా ఉన్నవాళ్లకూ మధ్య తేడా ఉండటంలో ఆశ్చర్యమేముంటుంది? కావలసినవాళ్లూ కొట్టుకోవలసివచ్చిందే అన్న బెంగ అతనికీ ఉంది. అందుకనే పాండవుల వైపున్నాడు గనక అక్కణ్నించి రాయబారానికి వెళ్లాడు. అప్పుడు దుర్యోధనుడు ‘మా ఇంట్లో వచ్చి ఉండు బావా’ అని పిలిచాడు. కానీ అతను దానికి ఇష్టపడలేదు. భక్తుడైన విదురుడింట్లో ఉన్నాడు. మర్నాడు సభలో వాళ్లు చేద్దామనుకొన్న ఘనకార్యం మనందరికీ తెలుసును: కృష్ణుణ్ని కట్టిపడేస్తే పనై పోతుందన్న దుర్భ్రమలో పడ్డాడు దుర్యోధనుడు. విశ్వమంతా అతని చైతన్యం నిండి ఉందని తెలియక, ఆ పని చెయ్యబోతే దుర్యోధనుడి కళ్లే చెదిరి పోయాయి. అయినా బుద్ధిరాలేదు. రాయబారమెప్పుడూ వైమనస్యాల్ని నివారించడానికే జరుగుతుంది. కానీ దూతనే బంధిద్దామని ప్రయత్నించడం క్షమించరాని నేరం. రావణుడు ఇలాగే దూత అయిన హనుమంతుణ్ని బంధించి భంగపడ్డాడు. జరగబోయే యుద్ధంలో భీమార్జునులు ఏ స్థాయిలో చెలరేగుతారో చెబితే ఏమన్నా మెత్తబడి లొంగుతాడేమో అనుకొన్నాడు కృష్ణుడు. కానీ దుర్యో ధనుడు మూర్ఖుడు. మూర్ఖుల మనస్సును రంజింపజేయడం అసంభవమే. కర్ణుడు దుర్యోధనుడితో జట్టుగట్టి చెడిపోయాడని, అతగాడి పుట్టు పూర్వోత్తరాలు చెప్పి, మంచిదారి పట్టిద్దా మనుకొని కర్ణుణ్ని తన రథమెక్కించుకొని కొంత చెప్పిచూశాడు. దుష్టచతుష్టయంలో ముఖ్యుడైన ఆ ‘అంగ’దేశం రాజు, శరీరంతో ఒకటై, రాజరికపు లోభంలో పడ్డవాడు ఏవిధంగా వింటాడు? ద్రోణుడు అతిగా విజృంభించి బాధపెడుతూ ఉంటే, యుధిష్ఠిరుడికి ‘అశ్వత్థామ పోయాడ’ని చెప్పమనడం అందరికీ సమానుడైన కృష్ణుడికెలాగ నప్పుతుందని అనుమానం వేస్తుంది. కానీ ధర్మం తెలిసుండీ కూడా తిండి పెట్టారన్న మోహం కొద్దీ అధర్మానికి కొమ్ముకాసేవాళ్లను ఉపాయాలతోనే నాశనం చేయాలి. ఈ ఉపాయం అటు అబద్ధంతో బయలుదేరి నిజంలో అంత మవుతుంది: ‘అశ్వతా మో హతః హతః కుంజరః’లో అబద్ధమైన ‘అశ్వత్థామ చచ్చి పోయాడు’ అన్నమాటను గట్టిగానూ నిజమైన ‘అశ్వత్థామ అనే ఏనుగు చచ్చి పోయింది’ అన్నమాటను నెమ్మదిగానూ అన్నాడు ధర్మరాజు. ద్రోణుడంటే మన పూర్వ సంస్కారాలు; అశ్వత్థామ ఇంకా బయటకురాని స్థితిలో ఆశయ రూపంలో, లోపల ఉండే కోరిక. ఈ లోపలి కోరికలే లేకపోతే సంస్కారాలు కృశించి పోతాయి. నిజానికి ఆశయాలు లేకపోవడం చాలా అరుదు. అదే జరిగితే, వాసనలు సన్నబడిపోయి ముక్తి అరచేతిలో ఉంటుంది. ఇదే పైన చెప్పిన అబద్ధ నిజాల కలగలుపు. కృష్ణుడు దిగివచ్చిందే అధర్మాన్ని అంతమొందించడానికి. అధర్మమంటే అయోగం. అయోగమంటే, ధర్మరూపుడైన భగవంతుడికి విముఖమై అతన్నుంచి విడిపోవడం. యోగాన్ని పునరుద్ధరించాలంటే, యోగాలు అవసరం. యోగాలంటే ఉపాయాలు. అందుకనే కృష్ణుణ్ని యోగేశ్వరేశ్వరుడని అంటారు: అందరికీ యోగాన్ని సాధించ డానికి యోగాలను తయారుచేసేవాడు ఇతను. ‘అసంయ తాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః! వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః!!’ (భగవద్గీత 6-36). అదుపులో ఉన్న మనస్సుతో ప్రయత్నం చేస్తే ఉపాయంతో యోగాన్ని, అంటే, ధర్మాన్ని సాధించ వచ్చు. అధర్మపరులైన జరాసంధుణ్నీ శిశుపాలుణ్నీ మహాయుద్ధానికి ముందే యమలోకానికి పంపడానికి కారణం, వాళ్లే గనక బతికి ఉంటే, కౌరవుల వైపుజేరి ముప్పుతిప్పలు పెట్టడం ఖాయమనే. జరాసంధుడు ఇరవై వేల మంది రాజుల్ని తాను చేయబోయే భైరవయజ్ఞంలో బలి చెయ్యాలని జైల్లోపెట్టి ఉంచాడు. తమను ఆ చెర నుంచి విడిపించమని వాళ్లు మొర పెట్టుకొన్నారు; అదే సమయంలో ధర్మ రాజు రాజసూయ యాగానికి రావాలని కబురుపంపాడు. ఆ యాగం చేయాలంటే, రాజులనందర్నీ జయించాలి. ఆ రాజు లందరిలోనూ ఈ జరాసంధుడు అతి బలిష్ఠుడు. అతన్ని జయిస్తే రాజసూయం అయిపోయినట్టే. అందుకని ఈ యోగేశ్వ రుడు అర్జునుణ్నీ భీముణ్నీ తీసుకొని మారువేషాల్లో మగధకు వెళ్లాడు. అక్కడ భీముడితో జరాసంధుణ్ని నాశనం చేయిం చాడు. ఏకలవ్యుడి కుడి బొటనవేలు కనక ఉంటే, అతగాడూ అజేయుడే అవుతాడని ముందుగానే అర్జునుణ్నీ ద్రోణుణ్నీ నిమిత్తంగా చేసుకొని వాడి బొటనవేలును లేకుండా చూశాడు. కర్ణుడు తన కవచ కుండలాలకు బదులుగా ఇంద్రుణ్నించి పొందిన శక్తి నుంచి భక్తుడైన అర్జునుణ్ని రక్షించడం కూడా అయోగాన్ని శిక్షించ డానికే. ఘటోత్కచుడు పాండవ పక్షంవాడే అయినా బ్రాహ్మణద్వేషీ యజ్ఞద్వేషీను. అర్జునుణ్ని రక్షించడానికి ఘటోత్కచుణ్ని శిక్షించడానికీ కర్ణుడి శక్తిని ఘటోత్కచుడి మీద ప్రయోగింపజేశాడు కృష్ణుడు. ప్రతిరోజూ రాత్రి దుర్యోధనుడూ శకునీ దుశ్శాసనుడూ సంజయుడూ కూడా కర్ణుడికి ‘రేపు నువ్వు అర్జునుడిమీద శక్తివేసి యుద్ధాన్ని అంతంచెయ్యి’ అని చెబుతూనే వచ్చారు. అయినా సరే, పొద్దున్న రణ క్షేత్రంలోకి రాగానే అతన్ని మోహం కమ్మేది. ఎన్నెన్ని వరాలను కవచాలుగా ధరించినా హిరణ్యకశిపుడు కూడా చచ్చి పోయాడు; దేవతలందర్నీ గడగడలాడిం చిన రావణుడు మనుషుల చేతుల్లోనూ కోతుల చేతుల్లోనూ చావవలసివచ్చింది. ఈవిధంగా కర్ణుడు శక్తిని మరిచిపోవడం ఘటోత్కచుడు వచ్చేంతదాకా జరిగింది. అశ్వసేనుడు తక్షకుడి కొడుకు. ఆ రోజున ఖాండవ దహనంలో అశ్వసేనుణ్ని వాళ్లమ్మ నోట్లో పెట్టుకొని ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటే, అర్జునుడు ఆ తల్లి పాము తలను తెగేశాడు. అశ్వసేనుడు ఏదో విధంగా తప్పించుకొన్నాడు. అతను కర్ణుణ్ని చేరి, ‘నన్ను ప్రయోగించ’మని ప్రేరేపించాడు. సరిగ్గా ప్రయోగం చేసిన సమయంలో కృష్ణుడు అర్జున రథాన్ని రెండంగుళాలు కిందికి దిగేలాగ ఒక తొక్కు తొక్కాడు. సైంధవుణ్ని చంపడానికీ సూర్యుణ్ని మాటు చేయడమనే యోగాన్ని ఉపయోగించాడు కృష్ణుడు. మళ్లీ దీని తోనూ భక్తుడైన అర్జునుణ్ని కాపాడాడు. చివరికి తనవాళ్లే అయిన యాదవుల్ని కూడా మట్టుబెట్టడానికి శాపమనే యోగాన్ని ఉపయోగించాడు. మహాభారత యుద్ధంతో అధర్మమూ అయోగమూ నాశనమైపోయాయనుకోడానికి వీలులేదు. ఎందుకంటే, మహాశూరులైన యాదవులు రేప్పొద్దున మేకులై కూర్చొంటారు. తన కొడుకు సాంబుణ్నే ఈ శాపానికి పావుగా వాడాడు. కడుపుతో ఉన్న ఒక స్త్రీగా వేషం వేసి ఆటగా పిల్లలు, రుషుల దగ్గరికి పోయి, ‘ఇది మగపిల్లవాణ్ని కంటుందా ఆడపిల్లనా?’ అంటూ అడిగారు. ‘మీ వంశాన్ని అంతం చేసే ముసలం పుడుతుంది’ అని మునుల నోట ఆ శాపం వెలువడింది. ఆ శాపంలో తాను కూడా చనిపోవడాన్ని ఇమిడ్చేశాడు కృష్ణుడు. ఇదీ అతని సమానత్వం తాలూకు పరాకాష్ఠ. శ్రీకృష్ణుడికి వేలకు వేలమంది పెళ్లాలూ వాళ్లలో ఒక్కొక్కళ్లకూ పది పదేసి మంది పిల్లలూ అని వింటూ ఉంటాం. మహాచైతన్యానికి ఈ కుటుంబాలతోనూ పనిలేదు, మందీ మార్బలంతోగానీ గదలూ చక్రాలూ విల్లులూ బాణాలూ అనే ఆయుధాలతో గానీ పనిలేదు. లోకంలో పుట్టినప్పుడు ఇతరుల్లాగే కనిపించడానికే పెళ్లాలూ సంభోగాలూ పిల్లలూ అనే ఈ తతంగాలన్నీను. ఒక్క ఆకును నోట్లో వేసుకొని ముల్లోకాల్లో ఉన్నవాళ్లందరికీ తృప్తినిచ్చినవాడు, ఏదైనా అలవోకగానే చేస్తాడు, లీలగానే చేస్తాడు మరి. మనం అన్నీ మన మర్త్య దృష్టితో చూడ్డం వల్లనే, అందరూ మనలాగే ఉండాలని అనుకోడం వల్లనే, కొందరు మనకన్నా వేరుగా ఉండ వచ్చుననే ఊహ లేకపోవడం వల్లనే ఇన్ని అనుమానాలు మన కడుపునిండా ఉండి ఉబ్బరిస్తూ ఉంటాయి. మనుషుల్లోనే చాలామంది మనకన్నా గొప్పగానూ విశిష్టంగానూ అవుపిస్తూ ఉంటారు. అటు వంటప్పుడు శ్రీకృష్ణుడిలాంటి మహాను భావులు అత్యంత విశిష్టంగా ఉండటంలో అద్భుతమేముంటుంది? అతన్ని అస్కలిత బ్రహ్మచారి అని అంటారు కూడాను. అతన్ని ఏ పనులూ అంటవు. ‘న మాం కర్మాణి లిమ్సన్తి న మే కర్మఫలే స్పృహా’ (భగవద్గీత 4-14): అతనికి కర్మల ఫలాలమీద కోరిక ఉండదు. అటువంటి పనులను చేసేది మనలాంటి వాళ్లకు పాఠం చెప్పడానికే. ఎలాగ పనిని చేస్తే అది మనను తన ఫలంతో నిర్బంధ పెట్టకుండా ఉంటుందో ఆ వైనాన్ని చెప్ప డానికే అటువంటివాళ్లు పుడతారు, పనుల్ని చేస్తారు. మనలాగే పనుల్ని చేస్తున్నా వాటిని మనకన్నా చాలా వేరుగా చేస్తారు వాళ్లు. ఈ తేడా తెలియకనే కృష్ణుడి గురించి నోటికొచ్చినట్టల్లా చెప్పుకొంటూ ఉంటాం. అందుకనే అర్జునుడు తాను చేసిన పొరపాట్లను వల్లిస్తూ బాధపడ్డాడు: ‘సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి! అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి!! యచ్చాపహాసార్థమసత్కృతో సి విహారశయ్యాసనభోజనేషు! ఏకోథ వాప్య చ్యుత తత్సమక్షం తత్ క్షామయే త్వామ హమప్రమేయమ్!!’ (భగవద్గీత 11-41, 42): అర్జునుడు బావగా అతన్ని హేళన చేసేవాడు. యాదవుడా అని సంబోధించే వాడు. ఒంటరిగా ఉన్నప్పుడే కాదు, నలు గురిలోనూ కూడా ఇదే తరహాలో అగౌరవ పరిచేవాడు. శ్రీకృష్ణుడి కూటస్థ చైతన్య ప్రభావాన్ని కనుక్కొన్న తరవాత చాలా బాధపడ్డాడు. మనమూ అంతే. అతని మహా చైతన్యాన్ని తెలుసుకోలేని దుఃస్థితిలో ఉన్నంతసేపూ అర్జునుడిలాగే అతన్ని హీన పరుస్తూనే మాట్లాడుతూ ఉంటాం. ఈ విషయంలో శిశుపాలుడి కన్నా మనమేమీ తీసిపోం. తత్త్వాన్ని తెలుసుకోడానికి అందుకనే ప్రయత్నం చేయాలి. - - - డా॥ముంజులూరి నరసింహారావు -
అర్జునుడు
ఐదోవేదం : మహాభారత పాత్రలు - 13 అర్జునుడు కుంతి సంతానంలో మూడో వాడు. ‘అరజ్జు’ అంటే జైలని ఒక అర్థం. రజ్జువంటే తాడు. అంచేత ‘అ-రజ్జు’ అని విడదీస్తే, బంధనం లేనివాడన్న అర్థం వస్తుంది. ఎవడైనా ఈ శరీరమనే జైల్లో ఉన్నవాడే. ఆ బంధనాన్ని వదిలించు కోవాలంటే అదుపు కావాలి. శరీరమనే జైల్లో ఉంటూ కూడా నిగ్రహంతో బంధనానికి లోబడకుండా ఉండగలిగే సాధకుడు అర్జునుడు. వేయించిన (ఋజి-భర్జనే) విత్తనాలు మొలకెత్తవు. ‘ఋజ’ అనే ధాతువులో ముందు ముందుకు నడవడమూ మంచి స్థానాన్నే సంపాయించడమూ దాగి ఉన్నాయి. వీటిలోని ‘ఋ’కారం ‘ఆర్’గా మారి అర్జునుడనే మాట పుట్టింది. అదుపుతోనూ తపస్సుతోనూ మునపటి కర్మలనే విత్తుల్ని వేయించి, శాశ్వతమైన ఆత్మపదాన్ని ఆర్జించాలన్న పట్టుదలతో ఎడతెరిపి లేకుండా ప్రయత్నించే సాధకుడే అర్జునుడు. అర్జునుడికి ‘సవ్యసాచి’ అని పేరొకటి ఉంది. సవ్యమంటే కుడీ ఎడమా అని రెండర్థాలూ ఉన్నాయి; ‘సాచి’ అంటే అడ్డంగా అని అర్థం. రెండు చేతులతోనూ గాండీవాన్ని అడ్డంగా లాగి బాణాల్ని వేయగలిగిన సామర్థ్యమున్నవాడు గనకనే అతనికి సవ్యసాచి అనే పేరు వచ్చింది. ఇతనికి ‘ధనంజ యుడ’నే మరో పేరుంది. ‘ధనం’ అంటే డబ్బని అర్థం. యుద్ధంలో ఓడిపోయినవాళ్ల ధనం జయించినవాళ్ల సొంతం అవుతుంది గనక, ‘ధనం’ అనే మాటకు యుద్ధమనే అర్థం వచ్చింది. యుద్ధంలో ఎప్పుడూ జయాన్నే వరించే విజయుడిగాను, జయించినవాళ్ల సొమ్మును తన బొక్కసంలోకి చేర్చుకొన్నవాడిగాను అర్జునుడు ధనంజయుడు. ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేయడానికి ముందు ‘ఉత్తర’ దిక్కులో ఉన్న రాజుల్ని జయించి అర్జునుడు ధనంజయుడయ్యాడు. ధనంజయుడంటే అగ్ని అనే అర్థం కూడా ఉంది. యుద్ధంలో జయాన్నిచ్చేది మనిషి లోపల ఉండే ఉత్సాహమూ పరాక్రమమూ ధైర్యమూ పట్టుదలా అనే వేడి. యుద్ధాలు బయటివి మాత్రమే కావు. లోపల కూడా జరుగుతూ ఉంటాయి. లోపల పుట్టే భావావేశాల వల్లనే ఏ యుద్ధాలైనా పుడతాయి. రెండు రకాల పోరుల్లోనూ వేడీ కాకా అవసరం. అందుకనే ‘ధనాన్ని’ జయించేవాడు అగ్ని అయ్యాడు. ఈ అగ్నికి బొడ్డు వెనక ఉండే మణిపూర చక్రం ఆస్థానం. ఈ చక్రం కూడా రెండు దిక్కులకీ పోడానికి వీలునిచ్చే చక్రం. ఇంద్రియాల మీద అదుపులేని సాధకుడు ఈ చక్రం నుంచి కింది చక్రాలైన స్వాధిష్ఠాన మూలాధారాలవైపు జారిపోతాడు; ఇంద్రియాల మీద చెప్పుకోదగ్గ అదుపును సాధించినవాడు అనాహతమూ విశుద్ధమూ మొదలైన పైచక్రాల వైపు కొనసాగుతాడు. ఇదీ సవ్యసాచిత్యం లాంటిదే.అర్జునుణ్ని ‘నరుడ’ని పిలవడం కద్దు. నాట్యం చేసేవాడి మాదిరిగా ఒంట్లోని అవయవాల్ని బాగా కదుపుతూ పనుల్ని చేసే మనిషిని నరుడని అంటారు. పనుల్ని చేస్తూ ఉంటే, వాటివల్ల వచ్చే ఫలితాల వల్ల అవి బంధాన్ని కలగజేస్తాయి. అంచేత ఎవడైతే పనుల్ని బంధనానికి లోను గాకుండా చేస్తూ ఉంటాడో అతగాడే నిజమైన ‘నరుడ’ని పెద్దలు చెబుతారు. నరుడంటే నాయకుడని (నౄ-నయే) చెబుతారు కూడాను. ఏ నరుడైనా నేతగా కావాలంటే, ఇతరుల కన్నా వేరుగా, వాళ్లకు ఒక నమూనాగా ఉండి, ముందుకు నడిపేవాడు కావాలి. అటువంటి నరుణ్ణే సాధకేంద్రుడని అంటారు. అటువంటి నరుణ్ణించే నారాయణుడు పుడతాడు. ‘నర’ శబ్దం వృద్ధిని చెంది ‘నార’ శబ్దమవుతుంది. పెరిగి పెంపొందడం, పనుల్ని నేర్పుగా బంధం అంటకుండా చేయడంతోనే అబ్బుతుంది. అప్పుడే అతను ‘నారాలకు’, ‘అయనుడు’, అంటే ‘దారి’ అయినవాడూ, దారి చూపించే వాడూ అవుతాడు. అంటే, ‘నారాయణు డ’వుతాడు. ఒకటే శక్తి రెండు కింద విడి నరుడూ నారాయణుడూ కింద అవుపిస్తారు. అర్జునుడు ద్రోణాచార్యుడి శిష్యుడై ఏకాగ్రతను బాగా ఒంటబట్టించు కొన్నాడు. అస్త్ర పరీక్షలో అర్జునుడి ఏకాగ్రత అర్థమైంది ద్రోణుడికి. చిటారు చెట్టుకొమ్మ మీద ఉన్న పక్షి తాలూకు తలను మాత్రమే చూస్తూ, దాని శరీరాన్ని గానీ చుట్టూ ఉన్న ఆకులూ రెమ్మలూ గానీ చూడకుండా తన బాణాన్ని వేసి, దాని తలను తెగ్గొట్టిన మేటి విలుకాడు అర్జునుడు. ఒకరోజున గంగలో స్నానానికి దిగిన ద్రోణుణ్ని ఒక మొసలి పట్టుకొంది. తతిమ్మా శిష్యులందరూ ఏం చేయాలో తెలియక, ఉన్న చోటనే నిశ్చేష్టులై నిలిచిపోతే, అర్జునుడు మాత్రం తన బాణాలతో ఆ మొసలిని ముక్కలు ముక్కలు చేశాడు. దానికి మెచ్చుకొని, అర్జునుడికి బ్రహ్మశిరో నామకమైన ఆటంబాంబులాంటి అస్త్రాన్ని ప్రయోగ సంహారాలతో సహా ఉపదే శించాడు ద్రోణుడు. అతను గురువుగారికి ద్రుపదుడి వల్ల జరిగిన అవమానానికి ప్రతీకారం చేసి అతని రాజ్యాన్ని ద్రోణుడి కైవసం చేశాడు. అటువంటి యోద్ధకు భార్యను కానుకగా ఇద్దామని, ద్రుపదుడు ద్రౌపదిని అగ్నిముఖంగా కూతురిగా పొందాడు. కిందనున్న నీళ్లలోకి చూస్తూ, పైనున్న చక్రయంత్రంలోని కన్నానికి పైనున్న చేపను ఐదు బాణాలతో కొట్టి ద్రౌపదిని గెలుచుకొన్నాడు. అర్జునుడు ఒక బ్రాహ్మణుడి గో ధనాన్ని కాపాడటం కోసం, యుధిష్ఠిరుడు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్న చోట్లో పెట్టిన ఆయుధాల కోసం వెళ్లవలసి వచ్చింది. అంచేత పెట్టుకొన్న నియమం ప్రకారం అతను వనవాసం చేయవలసి వచ్చింది. ప్రభాస తీర్థంలో శ్రీకృష్ణుణ్ని కలుసు కొన్నాడు. అక్కడ రైవతక పర్వతం మీద జరుగుతూన్న ఉత్సవంలో సుభద్రను చూసి మోహించాడు. శ్రీకృష్ణుడి అను మతితో ఆవిణ్ని ఎత్తుకుపోడంతో బల రాముడికి కోపం వచ్చింది. అప్పుడు కృష్ణుడు ‘అర్జునుడితో పోరి గెలవడం కష్టం. అతను మనను జయించి సుభద్రను తీసుకొనిపోతే మనకే మచ్చ. అంచేత అతన్ని ఊరడించి, వాళ్లను వెనక్కి తెచ్చి, మనమే పెళ్లి చేయడం మంచిది’ అని సలహా ఇచ్చాడు. అక్కడ సుభద్రకు అభిమన్యుడు పుట్టాడు. అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేస్తూన్నప్పుడు, శివుడు కిరాత వేషంలో పరీక్షించడానికి వచ్చాడు. అదే సమయంలో మూకాసురుడు అర్జునుణ్ని చంపుదామని ఒక పందిలాగ వచ్చాడు. అర్జునుడు ఆ పందిమీద బాణం వేసినప్పుడే మాయాకిరాతుడు కూడా బాణం వేసి, గిరగిరా తిరుగుతూ చచ్చిపోయిన పందిని నాదంటే నాదని వాదులాడుకుంటూ ఇద్దరూ యుద్ధానికి దిగారు. అర్జునుడి అమ్ములపొది ఆశ్చర్యంగా ఖాళీ అయింది. ఇక కుస్తీకి దిగాడు. ఆ పోరులో శివుణ్ని మెప్పించి, పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఆమీద అక్కడికి వచ్చిన దిక్పాలకుల నుంచి కూడా అస్త్రాలను పొంది, ఇంద్రుడు పిలవగా స్వర్గానికి అతిథిగా వెళ్లాడు. సంగీతం నాట్యమూ కూడా నేర్చుకోమని ఇంద్రుడు పురమాయిస్తే, అర్జునుడు చిత్రసేనుడి దగ్గర నేర్చుకొన్నాడు. అక్కడికి ఊర్వశి వచ్చి అతన్ని కోరుకొంటే, ‘చంద్ర వంశానికి మాతృరూపివి నువ్వు. అంచేత ఇది తగద’ని కాదన్న అర్జునుణ్ని ‘నపుంసకుడివి కమ్మ’ని శపించింది. ‘ఈ శాపం నీకు అజ్ఞాతవాసవేళ పనికి వస్తుంద’ని ఇంద్రుడతణ్ని ఊరడించాడు. ఉత్తర గోగ్రహణానికి దుర్యోధనుడు భీష్ముడూ కర్ణుడూ మొదలైనవాళ్లతో వచ్చినప్పుడు, ఉత్తరుడికి సారథిగా బృహ న్నల రూపంలో ఉన్న అర్జునుడు వెళ్లాడు. అక్కడ కౌరవ సైన్యాన్ని చూసి బెంబేలెత్తిన ఉత్తరుణ్ని సారథిగా చేసుకొని, అర్జునుడే యుద్ధం చేసి ఆవుల్ని మళ్లించాడు. రాయాబారాలన్నీ విఫలమై, తీరా యుద్ధం ప్రారంభమయ్యే తరుణంలో అర్జునుణ్ని విషాదం చుట్టుముట్టింది: ‘నా శరీరంలోని ఇంద్రియాల్లాంటి ఈ నా చుట్టాల్నీ సొంతవాళ్లనీ చంపి ఏం బావు కోవాలి?’ అనే పనికిరాని జాలి పుట్టు కొచ్చింది. శ్రీకృష్ణుణ్ని ‘నాకిప్పుడేమీ పాలుపోవడం లేదు. నాకు గురువువై మార్గాన్ని చూపించు’ అని వేడుకొన్నాడు. శ్రీకృష్ణుడప్పుడు కర్తవ్యాన్ని బోధించాడు: ‘ఇక్కడ ఈ లోకంలో లోపలా బయటా అన్నీ సంఘర్షణలే. వాటి నుంచి ఎవడూ పారిపోలేడు. ఈ కర్మలనన్నిటినీ నిమిత్త మాత్రంగా చెయ్యాలి తప్ప, వాటి ఫలితాల ఆస్తి మీద మనకెవ్వరికీ హక్కు లేదు. పరమేశ్వరుణ్నే శరణు కోరుకొని, ఫలితాలన్నీ అతనివేనన్న వివేకంతో, అతని చేతిలో ఒక సాధనంగా మాత్రమే పనిచెయ్యాలి. ఇక్కడ ఎవ్వరూ ఎవ్వర్నీ చంపడం లేదు, చావడం లేదు కూడాను. మార్పులకు గురి అయ్యే శరీరాలు మార్పుల్ని పొందితే మనం ఏడవవలసిన పనిలేదు. అంతటా వ్యాపించి ఉన్న మనలో ఎవరికీ చావులేదు. భగవంతుణ్నే గుండెలో పెట్టుకొని తొణుకూ బెణుకూ లేకుండా ఈ జగన్నాటకాన్ని వినోదంగా చూస్తూ ఉండాలి. అతనూ నేనూ ఒకటేనన్న భావాన్ని రూఢి చేసుకొని, జీవితంలో సంఘర్షణలన్నీ నవ్వుతూనే ఎదుర్కోవాలి. అప్పుడే నీ మోహం పోతుంది’. ఈ ఉద్బోధను విని, గురువు చెప్పినట్టుగానే చేస్తూ అర్జునుడు యుద్ధంలో విజృంభించాడు. ఒకరోజున కర్ణుణ్నింకా చంపలేదన్న కోపంతో ధర్మరాజు అర్జునుడితో, ‘నీ గాండీవాన్ని ఎవరికైనా ఇచ్చెయ్’ అంటూ అవమానపరుస్తూ అన్నాడు. అలాగ అన్నవాణ్ని చంపుతానని అర్జునుడి వ్రతం. అయితే ధర్మరాజును చంపితే తాను బతకలేడు. ఇటువంటి పరిస్థితిలో ఏం చేయాలో చెప్పమని శ్రీకృష్ణుణ్ని అడిగాడు అర్జునుడు. ‘పెద్దవాణ్ని తిట్టడం అతన్ని చంపడంతో సమానం. తనను తాను పొగుడుకోవడం చావడంతో సమానం. ఈ రెండు పనులూ చేసి నీ ప్రతిజ్ఞను తీర్చు కో’మంటూ అతను సలహా ఇచ్చాడు. ఆ తరువాత యుద్ధభూమికి వెళ్లి కర్ణుణ్ని సంహరించాడు అర్జునుడు. మొత్తం మీద భారతమంతటా అర్జునుడి సాధకరూపం ఉట్టిపడుతూ వచ్చింది. ఏకాగ్రతతో తపస్సు చేశాడు. కానీ మధ్యమధ్యలో ఈర్ష్యా కామమూ కోపమూ ఏమీ చేయలేని దీనత్వమూ విషాదమూ కూడా అతనిలో చోటు చేసుకున్నాయి. చివరికి పెద్ద పెద్ద హేమాహేమీలను గెలిచి ప్రతిజ్ఞలు తీర్చుకొన్నాడు. అన్నిరకాల యుద్ధాల్లోనూ గెలిచాడు. దేవతలక్కూడా లొంగని కాలకేయుల్నీ నివాతకవచులనే రాక్షసుల్నీ సంహరించాడు. నరత్వం నుంచి నారాయణ గురుత్వంతోనూ సఖిత్వంతోనూ పెంపొందుతూ నారాయణుడితో ఒకటయ్యాడు. - డా॥ముంజులూరి నరసింహారావు -
భీమసేనుడు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 12 భీమసేనుడు పాండవుల్లో మధ్యవాడు. భీముడంటే భయంకరుడు; ‘సేనుడ’ంటే ప్రభువుతో కూడినవాడు. శారీరక బలం దృష్ట్యా ఇతను పదివేల ఏనుగుల బలమున్నవాడు: వాయునందనుడిగా పాండవ మధ్యముడైన భీముడు పసివాడిగా ఉన్నప్పుడు కుంతి ఒడిలోంచి జారి, ఒక రాతిమీద పడ్డాడు. ఆ రాయి వక్కలై పోయింది గానీ ఇతని శరీరం మాత్రం చెక్కుచెదరలేదు. తోడేలు పొట్టలాటి పొట్ట ఉన్న భీమసేనుడు తోడేలు తిన్నట్టే ఎక్కువగా తింటాడు. అలాగే హరాయించుకొంటాడు కూడాను. అందుకే ఇతనికి వృకోదరుడనే పేరు కూడా ఉంది. తల్లి కుంతీదేవి రోజూ వండిన దాంట్లో సగం ఇతనికే కేటాయించేది; తతిమ్మా సగం తతిమ్మా నలుగురికీ తనకూ ఉపయోగించేది. భీముణ్ని చూస్తే, దుర్యోధనుడికీ అతని కన్నా, అతన్ని కన్న ధృతరాష్ట్రుడికీ ఇద్దరికీ గుండెల్లో గుబులే. చిన్నప్పుడు పరుగుపందేల్లోనూ తిండి తినడంలోనూ ఒకళ్లొకళ్ల మీద ఇసుకా దుమ్మూ విసురుకోవడంలోనూ భీముడు, దుర్యోధనాదులనందర్నీ మించిపోయి వాళ్లను ఏడిపించేవాడు. పండ్లను కోసుకోడానికి చెట్టుపైకి కౌరవులు ఎక్కినప్పుడు, వాళ్లతో సహా ఆ చెట్టును ఊపి ఊపి పండ్లతో సహా వాళ్లను కూడా కిందపడేసేవాడు. ఇదంతా అతను పిల్లతనం కొద్దీ చేసేవాడు గానీ ద్రోహబుద్ధితో మాత్రంగాదు. దుర్యోధనుడు మాత్రం ఇతని బలాన్ని చూసి అసూయపడుతూ, మోసంతో పట్టి చంపేద్దామని దుష్టబుద్ధిని చూపించేవాడు. ఒకరోజున, గుండెలో కత్తులు నూరుతూ, పైకి మాత్రం తియతియ్యగా మాట్టాడుతూ, అతి ప్రేమతో సొంత అన్నదమ్ముడిలాగ ‘తిను తిన’మంటూ విషంతో కలిపిన తినుబండారాల్ని భీముడికి కడుపునిండా తినిపించాడు. తరవాత ప్రమాణ కోటిఘాట్లో నీళ్లలో ఆడుకొని, అక్కడి గట్టుమీదున్న విడిదిగదిలో విషం మత్తు బాగా ఎక్కడంతో నిద్రపోయాడు భీముడు. చచ్చినట్టు పడున్న అతన్ని దుర్యోధనుడు లతలతోనూ తాళ్లతోనూ కట్టి ఎత్తుమీంచి గంగలో విసిరేసి వెళ్లిపోయాడు. పీడ విరగడైందనుకొన్నాడు గానీ అతను నాగలోకానికి పోయి, అక్కడ వాళ్లిచ్చిన సిద్ధరసాన్ని తాగి, పదివేల ఏనుగుల బలంతో తిరిగివచ్చాడు. వారణావతంలోని లక్కింట్లో విదురుడు పంపిన పనివాడి చేత చడీ చప్పుడూ గాకుండా సొరంగాన్నొకదాన్ని తవ్వించుకొన్నారు పాండవులు. ఒక ఏడాది పాటు ఆనుపానుల్ని చూసుకుంటూ చివరికి భీముడు, పురోచనుడున్న గదినీ ఆ చుట్టూరాను అంటించి, తల్లినీ నకుల సహదేవుల్నీ ఎత్తుకొని, యుధిష్ఠిరుడూ అర్జునుడూ వెనక నడుస్తూండగా ఆ సొరంగం గుండా త్వరత్వరగా బయటికి నడిచి ఎవరికీ తెలియకుండా అడవిలోకి తీసుకొనిపోయాడు. ఇది పాండవుల తొలి అజ్ఞాతవాసం. లక్కింట్లో పాండవులు చనిపోయారనే అబద్ధాన్ని కొనసాగించడానికీ దుర్యోధనుడు వీళ్లకోసం వెదికి చంపించడానికి ప్రయత్నించ కుండా ఉండడానికీ ఈ అజ్ఞాతవాసం పనికి వచ్చింది. తప్పించుకొని వచ్చి అడవిలో వాళ్లందరూ అలసిపోయి పడుకుంటే, భీముడొక్కడూ నిద్రపోకుండా వాళ్లకు కాపలా కాస్తూ నిలుచున్నాడు. భీముడు వారిని కళ్లల్లో వత్తులేసుకొని కాపాడుతూ ఉండగా, వాళ్లందర్నీ చంపి తీసుకొని రమ్మనమని హిడింబుడు పంపగా హిడింబి అక్కడికి వచ్చింది. అయితే హిడింబి భీముడి కండలు చూసి మోహంలో పడింది. అన్నమాట మరిచిపోయింది. చెల్లెలింకా రాలేదని చిరాకుపడుతూ హిడింబుడు రానే వచ్చాడు. అన్నదమ్ముళ్లకీ అమ్మకీ నిద్రాభంగం గాకూడదని, వాణ్ని దూరంగా తీసుకొనిపోయి నలిపి ముద్దచేశాడు భీముడు. హిడింబి కుంతితో మాట్లాడి భీముణ్ని పెళ్లిచేసుకొంది. పిల్లాడు పుట్టేదాకా భీముడు పగటిపూట ఆవిడతో ఉంటూ రాత్రిపూట అన్నదమ్ములతో ఉంటూ గడిపాడు. కుంతికి మొట్టమొదటి మనవడు హిడింబికి పుట్టిన ఘటోత్కచుడు. ‘ఎప్పుడు పనిపడితే అప్పుడు నేను వచ్చి సాయం చేస్తాను’ అని చెప్పి అతను తల్లితో సహా వెళ్లిపోయాడు. ఏకచక్రపురంలో పాండవులు చేరిన బ్రాహ్మణుడి ఇంట్లో వచ్చిన సంకటాన్ని భీముడే తీర్చాడు. బకాసురుడికి తీసుకెళ్లే బండెడాహారాన్నీ తానే తిని, ఆ రాక్షసుణ్ని మట్టిబెడ్డలాగ నలిపేశాడు భీముడు. రాజసూయయాగం చేయడానికి దిక్కులన్నీ జయించాలి. భీముడు తూర్పువైపు రాజుల్ని జయించుకొని వచ్చాడు. దానికి ముందు, జరాసంధుణ్ని సంహరించడం అవసరమని శ్రీకృష్ణుడూ అర్జునుడూ భీముడూ యాచకుల వేషంలో జరాసంధుడి దగ్గరికి వెళ్లారు. అక్కడ భీముడు జరాసంధుణ్ని గదాయుద్ధంతోనూ చివరికి కుస్తీతోనూ చంపాడు. మయసభలో నేలనుకొని నీళ్లలో చతికిలబడ్డ దుర్యోధనుణ్ని చూసి భీముడు నవ్వేసరికి దుర్యోధనుడి గుండె మండిపోయింది. శకుని పాచికల బలాన్ని చూసుకొని, తండ్రి ధృతరాష్ట్రుణ్ని ఒప్పించి, పాండవుల్ని జూదమాడడానికి పిలిపించాడు. తొలిజూదంలో అందరూ దాసులైపోయారు. భీముడు, తమను ఓడినందుక్కాదు గానీ ద్రౌపదిని పణంగా పెట్టడాన్ని చూసి అన్నగార్ని తప్పుపట్టాడు. ఆ కోపంతో సహదేవుడితో ‘తమ్ముడూ! నిప్పు పట్టుకొనిరా! ఈ ధర్మరాజు చేతుల్ని కాల్చేస్తాను’ అంటూ మండిపడ్డాడు. కొప్పుపట్టుకొని ద్రౌపదిని దుశ్శాసనుడు జూదసభలోకి ఈడ్చుకొని రావడాన్ని చూసి భీముడు ‘ఈ పాపిష్ఠి దుశ్శాసనుడి రొమ్మును బలవంతంగా చీల్చి వాడి వేడి వేడి రక్తాన్ని తాగుతాను’ అంటూ కోపంతో ఊగిపోయాడు. భీముడి భయంకరమైన ఈ మాటలు విన్నతరవాత కూడా కర్ణుడు ఉసిగొల్పడంతో, ద్రౌపదిని ఉద్దేశిస్తూ దుర్యోధనుడు తన ఎడమ తొడను చూపించాడు. అది చూసి భీముడు అతికోపంతో సభలో అందరిమధ్యా ‘వీడి సిగ్గూ ఎగ్గూ లేని ఈ తొడను మహాయుద్ధంలో గదతో పగలగొడతాను’ అని భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు. రెండోసారి జూదంలో వనవాసానికి వెళ్లవలసివచ్చినప్పుడు, తన మహాబాహువుల బలానికి దీటుగా పరాక్రమాన్ని చూపిస్తానన్నట్టుగా భీముడు తన విశాల బాహువుల్ని చూసుకుంటూ ముందుకు నడిచాడు. కామ్యకవనంలో చొరబడుతూనే దుర్యోధనుడి మీద ఉన్న కోపాన్ని మొత్తమూ కిర్మీరుడనే రాక్షసుణ్ని చంపడంలో చూపించాడు. కిర్మీరుడు బకాసురుడి సోదరుడూ హిడింబుడి నేస్తమూను. అర్జునుడు అస్త్రాలను సంపాయించడానికి వెళ్లినప్పుడు, ద్రౌపదితో సహా ఆ నలుగురు పాండవులూ లోమశమహర్షి బృందంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లారు. హిమాలయాలకు వెళ్లి, అక్కడ గంధమాదన పర్వతం మీద భీముడితో ద్రౌపది విహరిస్తూన్నప్పుడు, సౌగంధిక పుష్పం ఒకటి గాలికి ఎగిరి వచ్చింది. దాన్ని చూసి ద్రౌపది ముచ్చటపడింది. భీముడు ఆ ముచ్చటను తీర్చడానికి ఆ పువ్వుల కోసం వెదుక్కుంటూ ముందుకు వెళ్లాడు. పొగరుగా భీముడు ఈ దారిని వెళ్తే, దేవతలు శాపం పెట్టవచ్చునని, స్వర్గానికి వెళ్లేదారికి అడ్డంగా హనుమ పడుకొన్నాడు. భీముడు హనుమంతుడి దగ్గరకు వచ్చాడు. ‘దారికి అడ్డం తొలగవయ్యా ముసలాయనా’ అన్నాడు. ‘నేను ముసలివాణ్ని గదా. నువ్వే ఈ తోకను పక్కకు పెట్టి వెళ్లు’. అన్నాడు ఆంజనేయుడు. అంతేగదా అని ఎడమచేత్తో తీయబోయాడు. చేతగాలేదు. రెండు చేతులూ ఉపయోగించాడు. శాయశక్తులా ప్రయత్నించాడు. హతాశుడయ్యాడు. దానితో అతని గర్వం కాస్తా దిగింది. అప్పుడు హనుమంతుడు తనను తాను పరిచయం చేసుకొన్నాడు. తమ్ముడడిగితే, తన రూపాన్ని చూపించి, ‘అదుగో అటువైపు ఉంది సౌగంధిక పుష్పాలున్న నది. ఏం గొడవ చేయకుండా తీసుకొని వెళ్లు’ అని సలహా చెప్పి వెళ్లిపోయాడు. భీముడు అక్కడి రక్షకులను తరిమికొట్టి పువ్వుల్ని తీసుకొని వెనక్కు బయలు దేరాడు. అక్కణ్నించి ద్వైతవనానికి వచ్చాడు. ద్వైతవనంలో ఉన్నప్పుడే పాండవుల్ని అవమాన పరుద్దామని దుర్యోధనుడు సేనలతో సహా అక్కడికి వచ్చాడు. అక్కడ గంధర్వులతో గిల్లికజ్జా పెట్టుకొని వాళ్ల చేతిలో ఓడిపోయాడు. ధర్మరాజు ఆజ్ఞమేరకు భీముడూ అర్జునుడూ వెళ్లి అతన్ని విడిపించారు. అక్కణ్నించి కామ్యకవనం వచ్చిన తరవాత ఓ రోజు ద్రౌపదిని, దుశ్శల భర్త జయద్రథుడు అపహరించబోగా భీమార్జునులు వాడి వెంటబడి బంధించి తెచ్చారు. విరాటనగరంలో అజ్ఞాతవాసం చేసేటప్పుడు భీముడు వలలుడనే వంటవాడయ్యాడు. సైరంధ్రి అయిన ద్రౌపది, రాజుగారి బావమరిది కీచకుడి కంటబడింది. ఆ కాముకుడు ఆమె వెంటపడగా, రాత్రిపూట నాట్యశాలకు రమ్మనమని కీచకుడికి ద్రౌపదిచే చెప్పించి, అతను అక్కడికి రాగానే, రహస్యంగా అక్కడికి చేరిన భీముడు అతగాణ్ని మల్లయుద్ధంలో నుగ్గునుగ్గు చేశాడు. ఆ మీద కీచకుడి శవంతో సహా ద్రౌపదిని శ్మశానానికి తీసుకొని వెళ్తూన్నప్పుడు కీచకుడి తమ్ముళ్లనందర్నీ మూకుమ్మడిని చంపేశాడు భీముడు. అర్జునుడు సంశప్తకులతో యుద్ధానికి దూరంగా వెళ్లినప్పుడు, అభిమన్యుడు ద్రోణుడు వేసిన పద్మవ్యూహంలో ప్రవేశించాడు. అభిమన్యుడికి సాయంగా వెళ్లడానికి ప్రయత్నించిన పాండవుల్ని సైంధవుడు శివుడి వరం వల్ల అడ్డుకోగా ఒంటరిగా ఉన్న అభిమన్యుణ్ని ఆరుగురు ఒక్కసారిగా ముట్టడించి చంపేశారు. ఆ కారణంగానే సైంధవుణ్ని మర్నాటి సాయంత్రం లోపులో చంపుతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. యుధిష్ఠిరుడు భీముణ్ని వాళ్లకు సాయంగా వెళ్లమన్నాడు. భీముణ్ని ద్రోణుడు అడ్డుకొన్నాడు. భీముడు ద్రోణుడు వేసే బాణాల వానను ఓర్చుకుంటూ అతని రథాన్ని విసిరిపారేశాడు. మళ్లీ ఇంకో రథమెక్కి వస్తే దాన్నీ అలాగే ఎత్తి విసిరేశాడు. ఇలా ఎనిమిది రథాల్ని విసిరి పారేసి అదను దొరికినప్పుడల్లా విరోధులను చంపుతూ దుశ్శాసనుణ్ని పట్టుకొని వాడి వక్షస్సును చీల్చి కసిగా రక్తాన్ని తాగాడు. చివర్లో దుర్యోధనుడు భయపడి మడుగులో దాక్కొన్నాడు. పాండవులు అవమానపరుస్తూ మాట్లాడటంతో బయటికి వచ్చి భీముడితో గదాయుద్ధం చేశాడు. తన ప్రతిజ్ఞ ప్రకారం భీముడు అతని తొడను విరగ్గొట్టి పడగొట్టాడు. భీష్ముడన్నా భీముడన్నా భయంకరుడనే అర్థం. కానీ వీళ్లు పెట్టే భయంలో తేడా ఉంది. భీష్ముడు అంపశయ్య మీద పడుకొన్నాడు; భీముడు తన అతిపరాక్రమంతో ధార్తరాష్ట్రులందర్నీ నేలకొరిగేలాగ చేశాడు. -డాక్టర్ ముంజులూరి నరసింహారావు -
దుర్యోధనుడు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 11 ధృతరాష్ట్రుడి పిల్లల్లో ఆరోవంతు మంది పేర్లకు ముందు ‘దుః’ అనే మాట ఉంది. ‘దుః’ అంటే, కష్టమనే గాక, ‘చెడ్డ’ అనే అర్థం కూడా ఉంది. దుర్యోధనుడంటే ‘ఇతనితో యుద్ధం చేయడం అతికష్టం’ అనేగాక, ‘ఇతని యుద్ధం అతి చెడ్డది’, ‘ఇతను బహు చెడ్డ యోద్ధ’ అనే అర్థాలు కూడా వస్తాయి. మనందరికీ మినహాయింపేమీ లేకుండా ఎవరితో పోరాడటం కష్టం? ఎవరి పోరాటం చెడ్డది? అంటే ఒకే ఒక్క జవాబు వస్తుంది లోకంలో... ‘కోరిక’ అని. అందరితోనూ ఏదోవిధంగా దెబ్బలాడవచ్చునేమో గానీ కోరికతో కొట్లాడటం మాత్రం అతికష్టం. అది అందితే మెడకో అందకపోతే కాలికో మెలిక వేస్తూనే ఉంటుంది. ఒకటి పోతే మరో కోరిక దాని స్థానే ఎడతెగని ప్రవాహంలాగ వస్తూనే ఉంటుంది. కోరిక రజోగుణం నుంచి పుట్టింది; బాగా తిండిపోతు; అతి పాపిష్ఠిది. అది నిప్పులాంటిది. నిప్పులో ఎన్ని ఎండుపుల్లలేసినా, ఎంత నెయ్యి పోసినా అది కాదనదు; తింటూనే ఉంటుంది, మండుతూనే ఉంటుంది. నిప్పుకు ‘అనలం’ అనే పేరు అందుకనే వచ్చింది. ‘అలం’ అంటే ‘చాలు’ అని అర్థం. ‘అనలం’ అంటే చాలనే మాటను అననే అనదని అర్థం. కోరిక నిప్పు నార్పాలంటే, ఒకే ఒక్క దారి: వస్తువుల మీద ఉన్న ఆసక్తి అనే నేతినీ విషయాలతో పూసుకొని తిరగడమనే కట్టెపుల్లల్నీ వేయడం మానెయ్యాలి. ‘దుర్యోధనుణ్ని’ చంపడాని క్కూడా అదే దారి: విదురుడు ధృతరాష్ట్రుడికి పదే పదే చెప్పిన దారి: ‘వాణ్ణొక్కణ్ణీ వదిలిపెడితే మొత్తం శరీర రాష్ట్రానికీ మనస్సనే క్షేత్రానికీ క్షేమమూ శాంతీ వస్తాయి; లేకపోతే, జీవితం పొడుగునా ఉపద్రవమే ఉపద్రవం. మనం అందరం ధృతరాష్ట్రులం గనకనే అంతర్వాణి అయిన విదురుడు పదే పదే చెప్పే ఈ మాటను వినాలని అనుకోం. కోరికను పెద్దకొడుకన్నట్టుగా కావలించు కొని కూర్చుంటాం. వాడు కలిలాగ నెత్తికెక్కి కూర్చున్నాడని అనుకోం. కలి నెత్తికెక్కినప్పుడు పరీక్షిత్తులాంటి భాగవతుడు కూడా నిష్కారణంగా ఏ పాపమూ చేయని సాధువు భుజంమీద చచ్చిన పామును పడేసి చెప్పరానంత ముప్పును కొనితెచ్చుకొంటాడు. ‘కలేరంశస్తు సంజజ్ఞే భువి దుర్యోధనో నృపః! దుర్బుద్ధిర్దుర్మతిశ్చైవ కురూణామయశస్కరః!!’ (ఆదిపర్వం 67-87). కలి అంశమే దుర్యోధనుడు; దుర్బుద్ధీ దుర్మతీ అతని లక్షణాలు. పనిని కుశలంగా చేద్దామనుకొనే వంశానికి అపయశస్సును తెచ్చే మచ్చ ఇతను. కలి అంటే, తమోగుణం ఎక్కువగా ఉన్నవాడు. తమోగుణమంటే నిద్రా ఆలస్యమూ ప్రమాదమూ (అజాగర్తా) మొహమూ మొదలైనవి. ‘కలిః శయానో భవతి’ అని ఐతరేయ బ్రాహ్మణంలో చెబుతారు: కలి అంటే ‘నిద్ర’లో మునిగిన వాడని అర్థం. ‘నిద్ర’ అంటే, మనం మామూలుగా అనుకొనే నిద్రగాదు: ‘నిద్ర’ అంటే, జీవశక్తి అంతా ఇంద్రి యాల ద్వారానూ ఇతరమైన అవయవాల గుండానూ బయటికి పోతూ ఖర్చైపోవడం. మెలకువ తెచ్చు కోడమంటే, ఆ ప్రాణశక్తిని వెనక్కి మలిపి మెదడు దిక్కుగా పంపడమని అర్థం. కోరికకూ పైన చెప్పిన ‘నిద్ర’కూ అవినాభావ సంబంధం ఉంది. మనకు సినిమాలు దుర్యోధనుడంటే అభిమాన ధనుడని చెబుతాయి. సినిమాల్లో అతి గొప్పగా చెప్పడానికి కారణం, మనమం దరమూ కోరికను పగవాడిగా తెలుసు కోలేకపోవడం వల్లనే. కోరిక లేకుండా బతకడమెలాగ అని మనమంటాం. మనను మనం ఉద్ధరించుకోవాలనే కోరికను వద్దని ఎవడూ అనడు. కానీ మన కోరికలన్నీ ఇతరులని చూసి వాతపెట్టు కుందామన్న మూర్ఖత్వంతో ప్రబలినవే. దుర్యోధనుడు పుట్టినప్పుడు నక్కలాగ అమంగళంగా అరిచాడని సినిమాలు చెప్పవు. అతను భీముణ్ని ఎదిరించడం తెలియక విషం పెట్టాడు. అతనికి అధికారం లేకపోయినా కర్ణుడికి ‘అంగ’ రాజ్యాన్ని కట్టబెట్టి అర్జునుణ్ని ఎదిరించడానికి అతన్ని, తన ‘ఉప్పు’ తిన్నవాడిగా చేసు కొన్నాడు. ఎదురుగుండా ఎదిరించ డానికి దమ్ములేకపోవడం వల్లనే ఆకతాయిగా పాండవుల్ని వేరే ఊరు పంపించి, వాళ్లున్న ఇంటిని కాల్చడానికి ప్రయత్నించాడు. రాజసూయయాగంలో పాండవుల డబ్బును చూసి అతనికి కన్నుకుట్టింది. మయసభలో నేలా నీళ్ల మధ్య తేడా తెలుసుకోలేని మతి లేని వాడై, ‘నేల’లో మునిగి, ‘నీళ్ల’ మీద బొక్కబోర్లా పడి కముకు దెబ్బతిన్నాడు. మయుడి మాయే జూదమనే మాయకు తెర తీసేలాగ చేసింది. తనకు జూద మాడటం చేతగాకపోయినా బోళా ధర్మ రాజును ముగ్గులోకి దించి, తనకు బదులుగా శకుని మామ చేత ఆడించాడు. విదురుడి మాట విని, ద్రౌపదికి వరం ఇచ్చి ధృతరాష్ట్రుడు పాండవుల దాస్యాన్ని పోగొడితే, మళ్లీ ఇంతలోనే మరో ప్రణాళిక వేసి, పన్నెండేళ్ల వనవాసమూ ఓ ఏడాది అజ్ఞాతవాసమూ అనే విలక్షణమైన పందేన్ని వేయించే జూదాన్ని తిరిగి ఆడేలాగ నిర్బంధపెట్టాడు దుర్యోధనుడు. పదమూడేళ్లు రాజ్యానికి దూరంగా ఉంటే, ధర్మరాజంటే ఇష్టపడే ప్రజలందర్నీ తనవైపునకు తిప్పుకోవచ్చుననుకొన్నాడు. వనవాసం చేస్తున్నప్పుడు దూర్వాసుణ్ని పంపించి, అతని కోపానికి పాండవుల్ని గురిచేద్దామని పథకం వేశాడు. అక్షయ పాత్ర ఆ రోజు ఇవ్వవలసిన గ్రాసం ఇచ్చేసింది. ద్రౌపది కడిగేసిన పాత్రలో ఒక మెతుకు మిగిలి ఉందని వాళ్లకు తెలి యదు. దాన్ని నోట్లో వేసుకొని, సర్వ భూతాల కడుపుల్నీ ఒకే కాలంలో నిండి పోయేలాగ శ్రీకృష్ణుడు చేయడంతో, స్నానం చేయడానికి వెళ్లిన దూర్వాసుడూ అతని పదివేల మంది శిష్యులు అందరూ కడుపులు ఉబ్బరించి అక్కణ్నించే పారి పోయారు. ఈ పన్నాగం దెబ్బతినడంతో, పాండవుల్ని అవమానం పాలు చేద్దామన్న దుర్భుద్ధితో మందీమార్బలంతోనూ అతి పటాటోపంతోనూ దుర్యోధనుడు పాండ వుల పక్కనే గుడారాలు వేయించాడు. అక్కడ ఓ గంధర్వుడితో గిల్లికజ్జా పెట్టు కొని గొంతుమీదికి తెచ్చుకొన్నాడు. సమయానికి ధర్మరాజు భీమార్జునుల్ని పంపించకపోతే దుర్యోధనుడి పని అంతటితో సమాప్తమైపోయి ఉండేది. ఇలాగ ఎప్పుడూ తాను వేసిన రాయి తిరిగొచ్చి తన నెత్తిమీదనే పడుతున్నా కళ్లు తెరుచుకోవడాన్ని ఇతను ఎరుగడు. కీచకుడు చచ్చిపోయిన తీరు చూసి, మూడు వంతులు పాండవులు విరాట నగరంలో అజ్ఞాతవాసం చేస్తూ ఉండవచ్చు నని అంచనా వేశాడు దుర్యోధనుడు. కానీ ఇదంతా గడువైపోయింతరవాతనే. ఐదైదేళ్లకు రెణ్ణెలలు అధికంగా వస్తూ ఉంటాయి చాంద్రమానంలో. పదమూడేళ్లయ్యేసరికి అటువంటి ఐదు నెలలు గడిచిపోతాయని లెక్కవేసుకోలేదు ఈ ఆత్రగాడు. పసిగట్టి అజ్ఞాతవాసాన్ని భంగం చేసి, తిరిగి పన్నెండేళ్ల పాటు అడవిబసకు పంపిద్దామని వేసిన పథకం మళ్లీ పెద్ద అవమానాన్నే తెచ్చిపెట్టింది. విరాట నగరం దక్షిణాన ఉన్న గోసంపత్తిని పట్టుకోడానికి సుశర్మ మొదలైనవాళ్లను పంపి, కొంత ఎడంగా, ఇటు ఉత్తరాన ఉన్న గోధనాన్ని కొల్లగొట్టడానికి, తాను, భీష్ముడూ ద్రోణుడూ కర్ణుడూ మొదలైన హేమాహేమీలతో బయలుదేరాడు. అంచనా వేసినట్టుగానే విరాటరాజుతో సహా అందరూ దక్షిణానికి యుద్ధం చేయడానికి వెళ్లారు. ఉత్తర గోగ్రహణాన్ని ఆపడానికి బృహన్నలను తీసుకొని, కోటకు కాపుగా ఉండటానికి మిగిలిన ఉత్తరకుమారుడొక్కడే వచ్చాడు. బృహన్నల కాలం లెక్కపెట్టుకొనే వచ్చాడు. ఎదురుగుండా గాండీవాన్ని పట్టి అర్జునుడే వచ్చేసరికి రొట్టె విరిగి నేతిలో పడిందని సంబరపడిపోతూ ‘పాండవుల బండారం బయటపడింది’ అని గెంతు లెయ్యబోయాడు దుర్యోధనుడు. కానీ భీష్ముడు అధిక మాసాల లెక్కచెప్పి గాలి తీసేశాడు. మాద్రికి అన్నగారైన శల్యుడు పాండవుల వైపున పోరాడదామని వస్తూ ఉంటే, అతనికి తెలియకుండా, అతని దారి పొడుగునా సకల సౌకర్యాలనూ అందించి, చివరికి ‘ఎవరబ్బా ఇంత చేస్తున్నాడ’ని విస్తుపోయే సమయంలో ఎదుటపడి దణ్నం పెట్టి, అతనిచేత ‘నీకేం కావాలి?’ అనిపించుకొని, తనవైపు యుద్ధం చేసేలాగ వక్రంగానే వరాన్ని పొందాడు. ఇలాగ అన్నీ కుచ్చితమైన పనులనే చేశాడు దుర్యోధనుడు. ఒక గొప్ప యోద్ధ చేయవలసిన పని ఒక్కటీ చేయలేదు. రాయబారానికి వచ్చిన కృష్ణుణ్ని బంధిద్దామని వెర్రి ప్రయత్నం కూడా చేసిన మూర్ఖుడు ఇతను. అతిబలవంతుడైన వృత్రుడు కూడా. ఇలాగ ‘అయోద్ధ’లాగే ప్రవర్తించాడని ఋగ్వేద సూక్తమొకదానిలో (1-32-6) మనకు అవుపిస్తుంది. అసలు వృత్రుడంటే, మన జ్ఞాన సూర్యుడికి అడ్డుగా వచ్చే అవిద్య అనే మబ్బు. దుర్యోధనుడు ‘కోరిక’కు ప్రతి రూపంగనకనే అతనూ ‘అయోద్ధ’ లాగానే భారతం పొడుగునా ప్రవర్తించాడు. తనది కాని రాజ్యాన్ని కోరుకొన్నవాడు, ఎదుటపడి అమీ తుమీ తేల్చుకొనే యుద్ధం చేసి, విజయమో వీరస్వర్గమో వరించాలి. అతనెప్పుడూ శకునినీ భీష్ముణ్నీ ద్రోణుణ్నీ కృపాచార్యుణ్నీ అశ్వత్థామనీ జయద్రథుణ్నీ కర్ణుణ్నీ అడ్డుపెట్టుకొని వాళ్ల దన్నుతోనే యుద్ధం చేయడానికి చూశాడు. చిట్టచివరికి తన పాలు వచ్చేసరికి నీళ్లల్లోకి వెళ్లి దాక్కున్నాడు. బయటికి వచ్చి ‘గదా’ యుద్ధానికి భీముడితో తలపడ్డప్పుడు, అతను మొదట్నుంచీ చివరిదాకా చేసిన ‘దగా’నే ఎదుర్కోవలసివచ్చింది. దెబ్బతీద్దామని పెకైగిరినప్పుడు, భీముడి గద అతని తొడలను పగలగొట్టింది. ‘గద’ బుద్ధికి ప్రతీక. దుర్యోధనుడి ‘గద’ ఎప్పుడూ ‘దగా’ చేద్దామనే ప్రయత్నించింది. ఇతన్ని ‘సుయోధనుడ’ని కొన్నిసార్లు పిలుస్తూ ఉంటారు. ‘సు’ అంటే ఇటువంటిచోట ‘మంచి’ అని అర్థంగాదు. ‘అతి’ అని అర్థం. ‘సుదారాచారుడ’నే ఒక ప్రయోగం భగవద్గీతలో అవుపిస్తుంది: దాని అర్థం ‘అతిదురాచారుడ’ని. అలాగే, ‘సుయోధనుడ’న్నా అతియుద్ధం చేసేవాడని అర్థం. అంటే, యుద్ధ నియమాలను తుంగలోకి తొక్కి యుద్ధం చేసేవాడని. ఏదోవిధంగా గెలవాలనే యావ తప్ప, ‘కోరిక’ ఎప్పుడూ సజావుగా ప్రవర్తించదు. ఏదోలాగ కబ్జాచేసి, తన పబ్బం గడుపుకుందామని చూస్తుంది. అభిమానం కాదు ఇతని ధనం, మోసమూ దగాను. పెద్దవాళ్లంటే ఏ కోశానా భయమూ లేదు భక్తీ లేదు. పిన్నా పెద్దా గురువూ తాతా అందరూ ‘కోరిక’ మాట వినవలసినవాళ్లే; దాని బలిపీఠమ్మీద చావవలసినవాళ్లే. కోరికను గెలిచినవాడే నిజమైన యోద్ధ. నిజమైన శూరుడు. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు -
కుంతీదేవి
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 8 శూరుడు శ్రీకృష్ణుడికి తాతగారు. ఆ యాదవ శ్రేష్ఠుడికి శ్రీకృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడు పుట్టిన తరువాత, పృథ అనే అందమైన అమ్మాయి పుట్టింది. మిత్రుడూ మేనత్త కొడుకూ అయిన కుంతిభోజుడికి సంతానం లేకపోతే పృథను అతనికి దత్తతిచ్చాడు. చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే, ఆమె తన పుట్టింటి చల్లని ఒడిని విడిచిపెట్టి, ఏ పిల్లజెల్లల సందడీ లేని కుంతిభోజుడి ఖాళీగృహాన్ని ఆనందంతో నింపింది గనకనే పృథాదేవి మూర్తీభవించిన వైరాగ్యమని చెబుతారు. కుంతిభోజుడామెకు ‘కుంతీదేవి’ అని పేరు పెట్టుకొన్నాడు. పెంపుడు తండ్రిగారింట్లో అతిథులు తరచుగా వస్తూండేవాళ్లు. వాళ్లను సేవించడానికి ఆయన కుంతిని నియోగించేవాడు. ఓసారి కోపానికి మారుపేరైన దూర్వాసుడు అతిథిగా వచ్చాడు. అతను ఉన్నన్నాళ్లూ కుంతి చాలా ఓర్పుగా, అతనికి ఏ రకమైన ఇబ్బందీ లేకుండా, కోపంతో కసిరినా చిరాకుపడకుండా శాయశక్తులా సేవించింది. దానికి సంతోషిస్తూ, ‘నీకు నీ జీవితంలో అవసరం అవుతుంది గనక దివ్యశక్తుల్ని వశంలో తెచ్చుకోగలిగే మంత్రం ఒకటి చెబుతాను. నువ్వు కాదనడానికి వీల్లేదు’ అంటూ దూర్వాసుడు ఆమెకు ఆ ఆభిచారిక మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ కారణంగానే వైరాగ్యం ద్వారా దివ్యత్వాన్ని ఆహ్వానించగలిగే శక్తికి కుంతి ప్రతీక అయింది. ‘కుణ’ అనే క్రియకు పిలవడమని అర్థం. మంత్రాన్ని అందుకోగానే కౌమార చపలత్వం కొద్దీ కుంతి అది నిజమా కాదా అని పరీక్షిద్దామనుకొంది. అప్పుడు ఎదురుగా నింగిలో సూర్యుడు వెలుగుతూ పిలవడానికి నేనున్నానన్నట్టుగా అవుపించాడు. అతన్నే ఆ మంత్రంతో పిలిచింది. అంతే, సూర్యుడు ఒక యోగమూర్తిగా రానే వచ్చాడు. కన్నెపిల్ల కంగారుపడిపోయింది. ‘మంత్రాన్ని పరీక్షించడానికి మాత్రమే నిన్ను పిలిచాను. అంతే. నువ్వు వెళ్లిపోవచ్చు’ అని అన్నా, సూర్యుడు ఆమె మాటను కాదంటూ, ‘ఈ మంత్ర మహిమను మనం ఆపలేం. నీకు కొడుకొకడు కలుగుతాడు. అయినా నీ కన్నెతనానికేమీ ముప్పు రాదులే’ అని వరమిచ్చి వెళ్లిపోయాడు. బంగారు కవచ కుండలాల వసువుతో (ధనంతో) ఒక పిల్లాడు పుట్టాడు. కుంతి సమాజానికి భయపడి, ఆ పసికుర్రాణ్ని ఒక పెట్టెలో పెట్టి నదీజలాల్లో విడిచిపెట్టింది. ఆ పెట్టె నీళ్ల ప్రవాహంలో సాగుతూ పోయి రాధ భర్త అయిన అదిరథుడికి దొరికింది. అపరంజి కిరణాల సేనతో పుట్టాడు గనక, అతన్ని వసుషేణుడని పిలుచుకొన్నారు ఆ దంపతులు. తరవాత అతనే కర్ణుడయ్యాడు. బుద్ధికి ప్రతీక అయిన పాండురాజుతో ఇంకా సంబంధం కుదరని కాలంలో ఈ కర్ణుడు పుట్టాడు గనక, అతను భౌతికమైన ఇంద్రియాల మొగ్గుదలల ప్రభావంలో ఉంటూ అధర్మానికి మరో పేరైన దుర్యోధనుడివైపే జేరాడు. ఆ మీద కుంతిభోజుడు కుంతికి స్వయంవరం చాటించాడు. వచ్చిన రాజుల్లో పాండురాజును ఆవిడ వరించింది. శల్యుడి చెల్లెలు మాద్రి ఆవిడకు సవతి అయింది. భర్తతో వన విహారంలో కాలాన్ని సరదాగా గడుపుతూండగా, ఒకరోజున మృగరూపంలో ఉన్న ముని దంపతుల్ని చంపిన దోషానికి పాండురాజు స్త్రీ సుఖానికి దూరంగా ఉండవలసి వచ్చింది. సంతానం లేకపోవడం వల్ల స్వర్గద్వారాలు తెరిచి ఉండవని తెలుసుకున్న పాండురాజు మహర్షుల ప్రబోధం మేరకు తాను ఎలాగైతే తన నాన్నగారి క్షేత్రమైన అంబాలికకు వ్యాసమహర్షి వల్ల పుట్టడం జరిగిందో... అలాగే తానూ ప్రయత్నం చేయాలనుకొన్నాడు. కుంతితో ఆ విషయాన్నే ప్రస్తావించాడు. ఆవిడ తనకు దివ్యశక్తుల్ని పిలిచి యమధర్మరాజు ద్వారా యుధిష్ఠిరుణ్ని, వాయువు ద్వారా భీముణ్ని, ఇంద్రుడి ద్వారా అర్జునుణ్ని కని కుంతి, పాండురాజును సంతానవంతుడిగా చేసింది. అంతేకాదు, భర్త కోరిన మీదట మాద్రికి కూడా ఆ మంత్రాన్ని చెప్పి నకుల సహదేవులను కలిగేలాగ చేసింది. మాద్రితో సహా వనంలోకి వెళ్లిన పాండురాజు కామాంధుడై చావును కొని తెచ్చుకోవడంతోనూ మాద్రి అతనితో సహగమనం చేయడంతోనూ కుంతి ఐదుగురు పిల్లల్నీ వెంటబెట్టుకొని రుషుల సాయంతో హస్తినాపురానికి చేరుకొంది. అప్పటినుంచి కుంతికి ఇక కష్టాలే కష్టాలు. ధృతరాష్ట్రుడికి గుడ్డితనం వల్ల రాజ్యం రాకపోయినా పాండురాజు చనిపోవడంతో అతని చేతిలోనే రాజ్యం ఉండిపోయింది. అతని కొడుకుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు మహా అసూయాపరుడు. భీముడి పొడ అసలు గిట్టేది కాదు. అతను తననూ తన తమ్ముళ్లనూ కుస్తీపట్లలోనూ ఇతరమైన ఆటల్లోనూ ఓడిస్తున్నాడని ఒకటే గుర్రు. భీముడికి వాళ్లు విషం పెట్టారు; గాఢనిద్రలో ఉన్నప్పుడు అతన్ని గంగలోకి విసిరేశారు. అయితే, భీముడి ప్రాణం చాలా గట్టిది. అతను వాటినన్నిటినీ దాటేశాడు. యుధిష్ఠిరుడు పెద్దాడు గనక ధృతరాష్ట్రుడు అతన్ని యువరాజుగా చేయడమైతే చేశాడు గానీ దుర్యోధనుడి పోరు మాత్రం ఇంతింతగాదు. కొడుకు మాటను నెగ్గించడానికి కుంతితోసహా పాండవుల్ని వారణావతానికి పంపించి, లక్క ఇంట్లో సజీవ దహనం చేద్దామన్న కుటిల ప్రయత్నం చేశాడు ధృతరాష్ట్రుడు. విదురుడి ఆలోచనల వల్ల ఆ కష్టం నుంచి బయటపడి, ఐదుగురు పిల్లల్నీ పెట్టుకొని అజ్ఞాతంగా కొన్నాళ్లు బతకవలసివచ్చింది కుంతి. ఏకచక్రపురంలో తమకు నివాసాన్ని కల్పించిన బ్రాహ్మణుడికి వచ్చిన కష్టాన్ని తీర్చడానికి భీముణ్నే బకాసురుడి దగ్గరికి పంపడానికి ముందుకొచ్చింది ఆవిడ. దీనికి కారణాలు రెండు అవుపిస్తాయి: తన కొడుకు బలం మీద ఆవిడకున్న నమ్మకం మొదటిది; తామెంత కష్టాల్లో ఉన్నాసరే, ఇతరుల కష్టాన్ని తీర్చడానికి తమను తాము సమర్పించుకోవాలన్న సేవాభావాన్ని పిల్లలకు నేర్పడం రెండోది. లేకపోతే, ఏ తల్లైనా తను కన్న పిల్లవాణ్ని వధ్యశిలకు పంపించడం జరుగుతుందా? అక్కణ్నించి దక్షిణ పాంచాల దేశానికి బ్రాహ్మణులతో సహా వెళ్లి, ఒక కుమ్మరివాని ఇంట్లో బస చేశారు. స్వయంవర మంటపానికి వెళ్లి, మత్స్యయంత్రాన్ని ఛేదించి, బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు ద్రౌపదిని గెలుచుకొన్నాడు. కోలాహలం అవుతూంటే, ధర్మరాజు నకుల సహదేవులిద్దరితోనూ బసకు వచ్చేశాడు. అక్కడ రాజులందరూ భీమార్జునులను బ్రాహ్మణులనే తలపుతోనే అడ్డుకొన్నారు. భీమార్జునులు వాళ్లందర్నీ ఓడించి ద్రౌపదితో సహా బసకు వచ్చి, ‘భిక్షను తెచ్చామమ్మా!’ అని సరదాగానే అన్నారు. లోపలి గదిలో ఉన్న కుంతి వాళ్లను చూడకుండానే, రోజూ సాధారణంగా బిచ్చం తెచ్చుకొన్నప్పుడేమంటుందో అదే తరహాలో ‘మీ అందరూ కలసి దాన్ని పంచుకోండి’ అని యథాలాపంగా అంది. ఇంతలో ఇవతలకు వచ్చి ద్రౌపదిని చూసి నాలిక్కరుచుకొంది. ‘ఛ ఛ ఎంత అనుచితమైన మాటనన్నాను’ అని చాలా నొచ్చుకొంది. చాలామందికి ఒకత్తె భార్యగా ఉండటం అధర్మమనిపిస్తుంది. అయితే, గురువు చెప్పిన మాటనే ధర్మమని అంటారు. తల్లేమో గురువుల్లో కల్లా గురువు. అంచేత, ఆవిడన్నమాటనే ధర్మంగా తీసుకోవాలని యుధిష్ఠిరుడు నిర్ణయించాడు. ద్రౌపది క్రితం జన్మలో పెళ్లికాక, శివుణ్ని గురించి తపస్సు చేసి అతను ప్రత్యక్షమైనప్పుడు ‘నాకు పతి చేకూరేలాగ చెయ్యి’ అని ఐదుసార్లు అంది అని చెబుతూ, వ్యాసుడు కూడా దాన్నే సమర్థించాడు. అలాగ కుంతి వాక్శుద్ధి కొద్దీ పాండవులైదుగురికీ ద్రౌపది భార్య అయింది. దుర్యోధనుడి తరఫున శకుని ఆడిన మోసపు జూదంలో ఓడిపోయి, పన్నెండేళ్ల వనవాసమూ ఒక ఏడాది అజ్ఞాతవాసమూ చేయడానికి పాండవులు వెళ్లినప్పుడు, కుంతి ధృతరాష్ట్రుడి పంచనే ఉండి కష్టపడింది. ద్రౌపది పాండవులతో కలసి వనవాస కష్టాలూ అజ్ఞాతవాస కష్టాలూ పడి బయటపడ్డ తరవాత, తమ రాజ్యాన్ని తిరిగి ఇమ్మంటే, దుర్యోధనుడు ససేమిరా అన్నాడు. ఇక పోరు తప్పనిసరి అయింది. అప్పుడు తన మొట్టమొదటి కొడుకు కర్ణుడు అటువైపు ఉండటం కుంతికి మింగుడుపడలేదు. ఏకాంతంగా అతన్ని కలసి జరిగిన సంగతి చెప్పింది: ‘నువ్వు సూతకులంలో పుట్టినవాడివి కావు, నా కొడుకువి. క్షత్రియకులంలో పుట్టినవాడివి. నువ్వు పాండవులవైపుకు వచ్చి, యుధిష్ఠిరుడికి అన్నగారివై రాజ్యాన్ని పాలించు. కర్ణార్జునులకు బలరామకృష్ణులకుమల్లే అసాధ్యమేమీ ఉండదు’ అని. కుంతి మాటను సూర్యుడు బలపరుస్తున్నట్లుగా బిట్టుగా ప్రకాశించాడు. అయినా సరే, కర్ణుడు దానికి ఒప్పుకోలేదు. ‘నన్ను అన్నివిధాలా సత్కరిస్తూన్న దుర్యోధనుణ్ని వదిలిపెట్టలేను. అందులోనూ యుద్ధకాలంలో ఆ పని నేను చేయను. అతనికోసం నీ కొడుకులతో యుద్ధం చేస్తాను. అయితే, ఒక్క అర్జునుణ్ని తప్ప, మిగతా నలుగుర్నీ నేను చంపను’ అని కర్ణుడన్న మాటను విని నిరాశగా కుంతి వెనుదిరిగి వచ్చింది. కానీ ఆ పెద్దకొడుకు గురించి ఆమె చివరిదాకా లోలోపల కుమిలిపోతూనే ఉంది. ఇలాగ కుంతి జీవితం పొడుగునా కష్టాలు అనుభవిస్తూనే ఉంది. కానీ ఆవిడ వైరాగ్యానికి మరోపేరు గనక వాటన్నింటినీ చాలా ఓర్పుగా శ్రీకృష్ణుడి మీద భక్తితో సహిస్తూ వచ్చింది. ఆవిడ భక్తి చాలా గొప్పది. ఆమెకు శ్రీకృష్ణుడు మేనల్లుడే; కలసినప్పుడల్లా అతను ఆవిడ పాదాలకు మొక్కేవాడు. అయినా ఆవిడ అతన్ని దేవుడిగా ఎరిగి శరణాగతిని పొందింది. పాండురాజు పోయిన దగ్గర్నుంచీ ఆవిడకు అన్నీ కష్టాలే. అన్ని ఆపదల్లోనూ శ్రీకృష్ణుడు కాపాడుతూనే వచ్చాడు. అతని మహాదయను తలచుకొంటూ కుంతి చేసిన ప్రార్థన మన అందరికీ కనువిప్పు కావాలి: ‘విపదస్సన్తునః శశ్వత్తత్ర తత్ర జగద్గురో! భవతో దర్శనం యత్ స్యాదపునర్భవదర్శనమ్!!’ (భాగవతం 1-8-25): ‘ప్రభూ! మా జీవితంలో ఎప్పుడూ విపత్తులే వస్తూ ఉండనీ! ఎందుకంటే, విపత్తుల్లోనే కచ్చితంగా నీ గుర్తు వచ్చింది, నీ రూపం ఆ కన్నీళ్లలో ప్రతిబింబించి అవుపిస్తుంది. లోపల నీ దర్శనమైతే ఇంకేముంది? చావు పుట్టుకల చక్రం నుంచి బయటపడిపోవడం ఖాయమవుతుంది. యోగేశ్వరుడా! యాదవుల మీదా పాండవుల మీదా నాకున్న అతి మక్కువ అనే పాశాన్ని తెగ్గోసి, నిన్నే నేనెప్పుడూ తలచుకొంటూ ఉండేలాగ దీవించు!’ అనే ఆవిడ మాటలు మనమెప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. -డాక్టర్ ముంజులూరి నరసింహారావు -
పాండురాజు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 7 అంబాలిక వ్యాసుడి విరూపాన్ని చూసి బెదిరిపోయి పాలిపోయినట్టయింది గనకనే పాలిపోయిన తెల్లని ఒంటితో పుట్టిన కొడుక్కి ‘పాండు’ (అంటే, తెల్లవాడు) అని పేరుపెట్టారు. రెండోవాడైనా, అన్న ధృతరాష్ట్రుడి గుడ్డితనం కారణంగా పాండుడే రాజయ్యాడు. క్షాత్ర విద్యలన్నీ క్షుణ్ణంగా నేర్చుకొన్నాడు. స్వయంవరంలో కుంతిని పెళ్లి చేసుకొన్నాడు. భీష్ముడు మద్రరాజైన శల్యుడి దగ్గరికి వెళ్లి, అతని చెల్లెలు మాద్రిని తెచ్చి, పాండుకి రెండో భార్యగా చేశాడు. ఒక నెలపాటు ఉన్నాడో లేదో పాండురాజు దిగ్విజయానికి వెళ్లాడు. తిరిగి వచ్చిన తరువాత భార్యలిద్దరితోనూ వనవిహారం చేస్తూ ఉండేవాడు. ఓ రోజున వేటతమకంలో కామక్రీడలో ఉన్న జింకల్ని బాణాలతో కొట్టాడు. అవి నేలకొరిగాయి. రామాయణంలో కువకువలాడుతూ కామమోహితాలై ఉన్న క్రౌంచపక్షుల జంటలో ఒకదాన్ని వేటగాడు కొట్టినట్టుగా ఇక్కడ కూడా కామమోహితాలై ఉన్న జింకల మీద పాండురాజు ప్రహారం చేశాడు. ఆ జింకలు నిజానికి మృగాలు కావు; మృగ రూపంలో ఉన్న మునిదంపతులు. కిందముడనే ఆ ముని మహాతపస్సంపన్నుడు గనక మానుష రూపంలో భార్యతో సంభోగించడానికి కొద్దిగా సిగ్గువేసింది. అందుకనే మృగరూపాన్ని ధరించారు దంపతులిద్దరూను. జంతువులు మైథున క్రియలో ఉన్నప్పుడు ఎంతటి క్రూరుడైన వేటగాడైనా చంపడానికి తటపటాయిస్తాడు. కానీ బుద్ధిమంతుడే అయినా పాండురాజు ప్రారబ్ధానికి లోబడి ప్రాణాంతకమైన బాణాల్ని వేశాడు. కిందముడు చనిపోతూ ‘నువ్వు కూడా స్త్రీ సుఖానికి ఉపక్రమిస్తే చచ్చిపోతావు’ అని శపించాడు. పాండురాజుకి వైరాగ్యం పుట్టుకొచ్చింది. సన్యాసిగా ఉందామని పెళ్లాలను రాజధానికి వెళ్లిపోమన్నాడు. కానీ వాళ్లు కూడా అతనితో పాటే ఉంటామనడంతో వానప్రస్థుడిగా ఆ వనంలోనే తపస్సూ ధ్యానమూ చేసుకొంటూ ఉండిపోయాడు. ఆభరణాలనూ ఖరీదైన బట్టల్నీ అక్కడున్న బ్రాహ్మణులకు ఇచ్చేశాడు. ‘పాండురాజు వానప్రస్థాశ్రమం తీసుకొన్నాడ’న్న వార్తనూ, రాజధనాన్నీ... హస్తినాపురానికి చేరవేయమని సేవకులందర్నీ పంపించేశాడు. ఆ తర్వాత ఆ వనం నుంచి గంధ మాదన పర్వతం మీదుగా శతశృంగ పర్వతానికి చేరుకొని అక్కడి తాపసులతో కలసి తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. కొంతకాలంలోనే తపస్సు తీవ్రంగా చేసి బ్రహ్మర్షులతో సమానుడయ్యాడు. ఓసారి అక్కడి మహర్షులందరూ బ్రహ్మలోకంలో జరగబోతూన్న దేవ రుషి పితృ మహాత్ముల సభను చూడడానికి బయలుదేరారు. ‘నేనూ వస్తాన’ంటూ పాండురాజు కుంతీమాద్రులతో సహా కొండల ఎగుడుదిగుడు దారుల మీదుగా ప్రయాణాన్ని ప్రారంభించాడు. కొంతదూరం వెళ్లిన తరువాత ‘ఇక ఈ పైన గాలీ, సిద్ధులైన మహర్షులూ మాత్రమే వెళ్లగలరు. ఈ కోమలులు ఈ దారుల్లోని బాధల్ని సహించలేరు. అందుచేత మీరు ఇక పైన రాకండి’ అని మహర్షులన్నారు. ‘అవును, సంతానం లేనివాళ్లకు స్వర్గద్వారం తెరచి ఉండదు. ప్రతి మనిషికీ నాలుగు రుణాలుంటాయి. పూర్వీకుల విజ్ఞానమూ సంస్కారాలే ఇప్పటి మనిషికి వెలుగును చూపిస్తూ ఉంటాయి. కనుక, ఆ పూర్వీకుల, అంటే, పితృదేవతల రుణం తీర్చుకోవాలి. వాళ్ల వర్ధంతుల నాడు వాళ్లు మనకిచ్చిన సంస్కారాలను నెమరు వేసుకోవాలి; సంతానాన్ని పొంది, ఆ సంస్కారాల్ని కింది తరాలవాళ్లకు చేరవేస్తూ సంప్రదాయ పరంపరను అవిచ్ఛిన్నంగా సాగేలాగ చూడాలి. దేవతలనుంచి ఆ వికాసాన్ని పుణికిపుచ్చుకోవడానికి అంతస్సులో ప్రాణయజ్ఞం ద్వారా లోపలున్న దివ్యశక్తులకు ప్రాణశక్తితో సంతర్పణ చేస్తూ ఉండాలి. అదే దేవతల రుణాన్ని తీర్చుకొనే తీరు. రుషులు మనను ఉద్ధరించి వికసింపజేసే శాస్త్రాలనూ మంత్రాలనూ ప్రసాదించారు. వాటిని స్వాధ్యాయం ద్వారానూ, అంటే, వినడమూ తలపోయడమూ తదేకంగా అదే ధ్యాసలో ఉండటం ద్వారానూ, తపస్సు ద్వారానూ అనుభవంలోకి తెచ్చుకోవడమే రుషిరుణం తీర్చుకోవడమంటే. తోటి మనుషుల ఆర్తినీ ఆకలినీ తీర్చడమే మనకు వర్తమాన కాలంలోని మనుషుల రుణం తీర్చుకోవడానికి మార్గం. ఈ నాలుగింటిలోనూ ప్రాణయజ్ఞమూ తపస్సూ ప్రజాపాలనా అనేవాటితో నాకు మూడు రుణాలు తీరాయి గానీ, సంతానం ద్వారా పూర్వీకుల సంస్కారాల్ని విస్తరింపజేసే రుణం మాత్రం తీరలేదు. ఏవిధంగానైతే మా నాన్నగారి క్షేత్రరూపమైన మా అమ్మకు వ్యాసమహర్షి ద్వారా నేను పుట్టానో, అదేవిధంగా నా ఈ కుంతీమాద్రిరూప క్షేత్రాల్లో ఉత్తమ పురుషుల ద్వారా సంతానం కలిగే అవకాశముందేమో గదా అనిపిస్తూ ఉంటుంది’ అని పాండురాజంటే దానికి జవాబుగా ఆ రుషులు ‘నీకు దేవతలతో సాటి అయిన సంతానం కలుగుతుంది. సంతానం లేదు లేదు అని విలపించడం గాదు నువ్వు చేయవలసినది, ఏదైతే నీకు కలగాలో దాన్ని ఫలింపజేయడానికి గాఢమైన ప్రయత్నం చేయాలి’ అని చెప్పి వాళ్లు ముందుకు సాగిపోయారు. పాండురాజు ఇక ఆ ప్రయత్నానికి శ్రీకారం చుట్టడానికి కుంతితో ఏకాంతంలో ఆ విషయాన్ని కదిపాడు: ‘ఏ మహానుభావుడి ద్వారానైనా నాకు సంతానం కలిగేలాగ నువ్వు చేయాలి కుంతీ!’ అని చేతులెత్తి నమస్కరిస్తూ ప్రార్థించాడు. అప్పుడు కుంతి తనకు కుంతిభోజుడింట్లో ఉన్నప్పుడు దూర్వాస మహర్షి ఇచ్చిన వరం వల్ల ఏ దేవతనైనా పిలవగల శక్తి అబ్బిందని చెప్పింది. ‘అలా అయితే, ఆయా దేవతల ద్వారా పుత్రుల్ని పొందవచ్చు గదా’ అని పాండురాజు అందుకొన్నాడు. ‘అంచేత, ఈ రోజునే ఆ ప్రయత్నాన్ని చెయ్యి కుంతీ! ముందస్తుగా ధర్మదేవతను పిలు. ధర్ముడి వల్ల కలిగే పుత్రుడి మనస్సు ఎప్పుడూ అధర్మం దిక్కుగా వంగదు. అతను కురువంశీయుల్లో కల్లా గొప్ప ధర్మాత్ముడవుతాడు’. కుంతి ధర్ముణ్ని సంతానం కోసమని ఆహ్వానించింది. మంత్ర బలంతో యోగ మూర్తి రూపంలో ధర్ముడు వచ్చి కుంతికి పుత్రుణ్ని ప్రసాదించాడు. ఆకాశవాణి అతనికి యుధిష్ఠిరుడని పేరుపెట్టింది. ఆ మీద పాండురాజు ‘క్షత్రియులకు బలమే ముఖ్యం గనక నువ్వు మహాబలుడైన వాయుదేవుణ్ని ఆహ్వానించి అతి బలవంతుడైన పుత్రుణ్ని కను’ అని కుంతిని కోరాడు. వాయువు వల్ల ఆవిధంగా భీముడు పుట్టాడు. సరిగ్గా భీముడు పుట్టినరోజునే అక్కడ గాంధారికి దుర్యోధనుడు పుట్టాడు. గాంధారిలోంచి ఊడిపడిన మాంసపిండాన్ని విడదీసి రెండేళ్లు జాగర్తగా పెంచగా, దుర్యోధనుడూ దుశ్శాసనుడూ మొదలైన వందమంది కొడుకులూ దుస్సల అనే కుతురూ పుట్టారు. ఇక్కడ కుంతికి దివ్యశక్తుల వల్ల ఏడాది ఏడాదికీ వరుసగా పిల్లలు పుట్టారు. ఆ మీద దేవతలకు రాజైన ఇంద్రుణ్ని తపస్సుతో సంతోషపెట్టి, మానుషుల్నీ అమానుషుల్నీ కూడా యుద్ధంలో ఎదిరించి నాశనం చేయగలిగే మహావీరుణ్ని పొందాలని పాండురాజు కోరుకొన్నాడు. ఇంద్రుడు ప్రసన్నుడయ్యాడు. కుంతి ఇంద్రుణ్ని పిలిచింది; అర్జునుడు పుట్టాడు; ఆకాశంలో దుందుభులు మోగాయి. పాండురాజుకు పుత్ర ప్రలోభం పెరిగిపోయింది. అయితే అది ధర్మవిరుద్ధం కాబట్టి కుంతి ఇక వద్దంటూ వారించింది. సవతికి సంతానం కలగ్గానే మాద్రికి సంతాపం కలిగింది. మొగుడితో ‘నేను స్వయంగా సవతిని అడగలేను. మీరు కుంతికి చెప్పి ఆ మంత్రం ద్వారా నాక్కూడా పిల్లలు కలిగేలాగ చేస్తే నా సంతాపం తీరడమే గాక మీ క్కూడా హితం జరుగుతుంది’ అంది. కుంతి తన మంత్రాన్ని మాద్రి ద్వారా ఫలింపజేసింది. నకుల సహదేవులు పుట్టారు. అందగాళ్లైన తన ఐదుగురు కొడుకుల్నీ చూసుకొంటూ ఆ పర్వతం మీద ప్రసన్నంగా నివసిస్తూ ఉన్నాడు పాండురాజు. ఓసారి వసంత రుతువులో వనమంతా పూలతో విరబూసి సర్వభూతాలకూ సమ్మోహనంగా తయారైంది. పిల్లల్ని చూసుకొంటూన్న కుంతి... పాండురాజు, మాద్రీ కలిసి వనంలో సంచారానికి వెళ్లడాన్ని గమనించలేదు. మాద్రిని చూస్తూ ఉంటే, పరిసరాల మహాత్మ్యం వల్ల, వనంలో దావాగ్ని పుట్టి పెరిగినట్టు, పాండురాజులో కామాగ్ని ఒక్కసారిగా భగ్గుమంది. కిందముడు పెట్టిన శాపం గుర్తుకు రాలేదు. మాద్రి ‘వద్దు వద్దు’ అంటున్నా వినకుండా, ఇక తన జీవితం అంతమైపోవాలన్నట్టుగా, మన్మథుడికి వశీభూతుడై బలవంతంగా ఆవిణ్ని వాటేసుకొన్నాడు. అంతే, అతను నిర్జీవుడైపోయాడు. మాద్రి, తన వల్లనే ఈ అఘాయిత్యం జరిగిందని, అతనితో పాటే చితిలో కాలిపోయింది. పిల్లలు తండ్రిలేని పిల్లలైపోయారు. అక్కడి రుషులు కుంతినీ పిల్లల్నీ హస్తినాపురానికి తీసుకువచ్చి ధృతరాష్ట్రుడికి అప్పగించారు. పాండురాజు చనిపోగానే అతని ప్రభావం అంతటితో ముగిసిపోలేదు. అతనివల్లనే మహాభారత యుద్ధానికి బీజం కూడా పడింది. భూలోకానికి బయలుదేరుతూన్న నారదుణ్ని ఖాండవ ప్రస్థంలో ఉన్న యుధిష్ఠిరుడికి ఓ మాట చెప్పమని ప్రార్థించాడు: ‘నువ్వు నీ తమ్ముళ్ల సాయంతో రాజులందర్నీ జయించగల సమర్థుడివి. దిగ్విజయుడివై నువ్వు రాజసూయ యాగాన్ని చేశావంటే ఇక్కడ ఈ ఇంద్రసభలో మహదానందంగా చాలాకాలం ఉండగలుగుతాను’ అని. నారదుడు ఈ మాట చెబుతూ ‘ఈ యాగంలో చాలా విఘ్నాలు వచ్చే అవకాశం ఉంది. అంతేగాదు. భూమ్మీద పెద్ద ప్రపంచ యుద్ధం జరిగి క్షత్రియులు చాలామంది నాశనమైపోతారు కూడాను. ఈ దృష్ట్యా నువ్వు ఆలోచించి ఏది క్షేమమో ఆ పనిని చెయ్యి. జాగర్తగా ఉంటూ తెలివీ బలమూ కృషీ శ్రమలతో పనుల్ని చేసే నాలుగు రకాల ప్రజల సంరక్షణమూ ఎలా జరుగుతుందో అలాగ చెయ్యి’ అని చెప్పి చక్కాపోయాడు. నాన్నగారికి స్వర్గ సౌఖ్యం కలకాలమూ ఉండేలాగ చేయడం కోసం యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేయటానికి పూనుకోవలసి వచ్చింది. అంటే, యుద్ధానికి తెరతీయవలసి వచ్చింది. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు -
గాంధారి
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 6 గాంధార రాజు సుబలుడి కూతురు గాంధారి. ధృతరాష్ట్రుడికి మీ అమ్మాయినిచ్చి పెళ్లిచేయమని భీష్ముడు వర్తమానం పంపినప్పుడు ‘అతను కళ్లులేనివాడు గదా’ అనే శంక పీడించింది సుబలుణ్ని. కానీ పౌరవకులం ఖ్యాతీ సదాచార సంపన్నతా పరాక్రమమూ మొదలైన అనుకూల విషయాలు చాలా అవుపించడం వల్ల, ప్రతికూలమైన గుడ్డితనాన్ని వెనక్కి నెట్టి, పిల్లనిద్దామని నిశ్చయించుకొన్నారు సుబల దంపతులు. ధృతరాష్ట్రుడికి తనను ఇవ్వబోతున్నారని తెలిసిన గాంధారి ‘నేను ఎదురుగా అతన్ని చూస్తే గుడ్డితనం పెద్దదోషంగా అవుపిస్తుంది. అదీగాక, ఇతరులతో పోల్చడాలూ పోల్చుకోడాలూ వచ్చి మనసు చెదురుతుంది’ అని ఆలోచించి, గట్టి నిశ్చయంతో తన రెండు కళ్లనూ చాలా మడతలు పెట్టిన బట్ట పట్టీతో బంధించుకొంది. నిజానికి, ఉన్న కళ్లను కూడా మూసేసుకొని, కావాలని గుడ్డిగా ఉండటం అంత ప్రశస్తమేమీ కాదు. అయితే, ఆవిడ తర్కమూ తప్పేమీ కాదు. ప్రతిక్షణమూ తల్లిదండ్రుల్ని తప్పుపట్టుకొంటూ, జీవితాన్ని నరకప్రాయం చేసుకోవడం కన్నా తానూ గుడ్డిగా ఉండటమే మంచిదని అనుకొంది ఆవిడ. పిల్లను అడిగి సంబంధం ఖరారు చేయాలిగదా అనిపిస్తుంది గానీ రాజకీయ వివాదాల్లో ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. శాంతనుడికి సత్యవతి వల్ల పుట్టిన పిల్లలు త్వరగా చనిపోవడం వల్ల, రాజవంశానికి పెద్ద సమస్యే వచ్చిపడింది. అందుకోసమనే వంద మంది సంతానం కనగలిగే వరాన్ని శివుణ్నించి పొందిన గాంధారిని భీష్ముడూ సత్యవతీ ఎన్నుకొన్నారు. ఒకరోజున వ్యాసుడు చాలా ఆకలితో గాంధారి ఇంటికి వచ్చాడు. ఆవిడ ఆయనకు భోజనం పెట్టి, విశ్రాంతి తీసుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసింది. దానికి సంతోషించి ఆయన వరం కోరుకోమన్నాడు. ‘నా భర్తకు దీటైన నూరుమంది కొడుకులు పుట్టాల’ని ఆవిడ కోరుకొంది. శివుడిచ్చిన వరాన్ని వ్యాసుడి వరం బలపరిచినట్టయింది. ధృతరాష్ట్రుడి వల్ల కలిగిన గర్భాన్ని ఆవిడ నిండా రెండేళ్లు మోసింది. అక్కడ వనంలో ఉన్న తోటికోడలు కుంతికి యుధిష్ఠిరుడు అప్పుడే పుట్టేశాడు. గాంధారికి అసూయ పుట్టింది. భర్తకు తెలియకుండా ఆవిడ తన కడుపును తొందర కొద్దీ పొడుచుకొంది. చాలా గింజలున్న పెద్దపండు లాంటి ఒక గట్టి మాంస పిండం బయటపడింది. ఆవిడ అవాక్కయింది. వందమంది కొడుకుల వరం అబద్ధమేనా అనిపించింది. వందలూ వేలుగా పిల్లలు పుట్టడాలు జంతువుల్లో కద్దు. పేడలో కులకులలాడుతూ పురుగులు ఎక్కణ్నించి వస్తున్నాయో తెలియకుండా పుట్టుకొస్తాయి. పాములూ మొసళ్లూ మొదలైన జంతువులూ ఎక్కువ గుడ్లను పెట్టి పొదుగుతూ ఉంటాయి. సాధారణ పద్ధతిలో మనుషుల్లో ఒక్కొక్కడూ పుట్టుకొని వస్తూ వందమంది పుట్టాలంటే కనీసం వందేళ్లైనా పడుతుంది. ఇంతకుముందు సగరుడనే రాజుకు ఒక భార్య వల్ల అరవై వేల మంది కొడుకులు పుట్టారని చెబుతారు. వందకు ఆరువందలింతల మంది పుట్టడం ఇంకా కష్టమైనదే. అప్పుడూ ఇప్పుడూ కూడా ఆవునేతి కుండల్లో ఆ గర్భాలను పెంచినట్టు చెప్పారు. అందుచేత, ఎక్కువమందిని కనే ప్రక్రియ ఆయా కాలాల్లో వాళ్లకు తెలుసునని అర్థమవుతుంది. ఇప్పటివాళ్లకే ఇంక్యుబేటర్లలో పిల్లల్ని పెంచే విద్య వచ్చుననీ అప్పటివాళ్లకు ఏమీరాదని అనుకోవడం శుద్ధ అవివేకమవుతుంది. నాగరికత ఎన్నిసార్లో చాలా ఉచ్ఛస్థాయిలకు చేరి, పెద్ద పెద్ద దుర్ఘటనల వల్లనో భూకంపాలూ సునామీలూ భారీ ఉల్కాపాతాలూ మొదలైన అతిఘోరమైన విపత్తుల వల్లనో కనుమరుగైపోతూ వచ్చింది. ఇది తెలియని మనం, ఇప్పటికాలంలో తెలిసినది మునపటి కాలంలో తెలియదని పొరబాటుగా అనుకొంటూ ఉంటాం. సుశ్రుతుడు వెంట్రుకను నిలువుగా చీల్చగలిగిన నేర్పుగల సర్జన్‌గా మనం వింటూ ఉంటాం. క్షయ రోగానికి మేక మాంసం తినడమూ మేకల మందలో పడుకోవడమూ విరుగుడన్న సంగతి పూర్వీకులు ఎరుగుదురు. కానీ ఇప్పటికాలంలో ఆ రోగానికి మందులను కనుక్కోడానికి చాలాకాలమే పట్టింది. కణాదుడనే ఒక శాస్త్రజ్ఞుడు తన ‘వైశేషిక సిద్ధాంతం’లో పరమాణువుల గురించి చెప్పాడన్న సంగతి చాలామందికి తెలియనే తెలియదు. ఈ శాస్త్రాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. ఆ భాష మనకు ‘మెకాలే ఎఫెక్టు’ ద్వారా దూరమైపోయింది. అదీగాక సంస్కృతంలో శాస్త్రాలన్నీ సూత్ర రూపాల్లో ఉంటాయి. సూత్రాలనేవి చిన్న చిన్న వాక్యాలే కానీ చాలా అర్థంతో కూడుకొని ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడానికి విశ్లేషణా వివరణా కావలసివస్తాయి. పెద్ద పెద్ద అంగలేసిందని చెప్పుకొనే ఇప్పటి సైన్సుకు ఇప్పటికీ అర్థంకాని ప్రాకృతికమైన దృగ్విషయాలెన్నో ఉన్నాయి. మన గ్రహం మీదనే జీవం ఉందనీ, అదే చాలా పురోగతిని పొందినదనీ అనుకొంటూ ఉంటాం. ఇతర గ్రహాల మీద జీవం ఉండే అవకాశాన్ని మనం వట్టినే కొట్టిపారేయలేం. ఫ్లైయింగ్ సాసర్లు వస్తున్నాయంటారు; అవేమిటో తెలియదు. వాటిలో వచ్చే ఆగంతకులెవరో ఎంతటి శాస్త్రజ్ఞానం గలవాళ్లో మనకు అంతుపట్టదు. ఈ నేపథ్యంలో మరోచోట జీవం లేదనుకోవడం ఒక విధంగా అహంకారమే. ఎక్కువ ఉష్ణోగ్రతలున్నచోట జీవాలుండవని సాధారణంగా అనుకొంటాం. కానీ కొన్ని రాక్షస తొండలు అగ్నిపర్వతాల నుంచి వెలువడిన లావాల ప్రాంతాల్లో గుడ్లను పెడుతూ ఉంటాయి. ఒక కణం తాలూకు శక్తి ఫలానా సమయంలో ‘ఇంత’ అని మనం స్పష్టంగా చెప్పనేలేం.. వీటన్నింటినీ పోల్చి చూసుకోకపోతే వందమంది పుట్టడమనేది మనకు అసాధారణంగా తోస్తుంది; అబద్ధమనిపిస్తుంది; కట్టుకథ అనిపిస్తుంది. ఇక ఆ గర్భపిండాలను పెంచడమన్నదీ అలాగే అబద్ధమనిపిస్తుంది. వ్యాసుడి పక్కకు చేరి ‘ఆడపిల్ల ఒకత్తె ఉంటే బాగుంటుంది’ అని గాంధారి అంటే దాన్ని కూడా ఆ మాంసపిండం నుంచే తీశాడు. అదే సైంధవుడికి పెళ్లామైన దుస్సల. మన ప్రస్తుత జ్ఞానాన్ని ఆధారంగా తీసుకొని, ఏదైనా సత్యమూ అసత్యమూ అని చెప్పడం ఎంత అసమంజసమో పైన చెప్పిన వాక్యాలను కుదురుగా చదివితే క్షుణ్ణంగా అర్థమవుతుంది. అంత కష్టపడి కన్న ఆ వందమందీ మొగుడి నిర్వాకంకొద్దీ చనిపోతే ఎంత బాధగా ఉంటుందో చెప్పవలసిన పనిలేదు. తనతోబాటే వచ్చి స్థిరపడిపోయిన తన అన్న శకుని మోసపు జూదంతో పాండవుల్ని దాసులుగా చేసినప్పుడు, ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాల పేరిట ఆ దాస్యాన్ని పోగొట్టి సర్ది చెప్పి పంపించేశాడు. అయితే, రెండోసారి జూదమాడటానికి పాండవుల్ని దారి మధ్యలోంచే పిలిపించాలని దుర్యోధనుడు మంకుపట్టు పట్టినప్పుడు, గాంధారి ధృతరాష్ట్రుడితో ‘నీ మాట విననివాణ్ని విడిచిపెట్టడమే మంచిది. ధర్మపూర్వకంగా గెలవని డబ్బు తరవాత తరాలవాళ్లను నాశనం చేస్తుంది’ అని అంది. కొడుకంటే ఆవిడకు ధృతరాష్ట్రుడికున్నంత మోహం లేదు. యుద్ధమంతా అయిపోయిన తరవాత, దగ్గరికి వచ్చిన పాండవుల్ని శపిద్దామన్నంత బాధా కోపమూ ఆవిణ్ని చుట్టుముట్టాయి. అప్పుడు వ్యాసుడు ఆవిడకు ఓ విషయాన్ని గుర్తుకు తెచ్చాడు: ‘‘యుద్ధం జరిగిన పద్దెనిమిది రోజుల్లోనూ ప్రతిరోజూ నీ పెద్దకొడుకు నీ దగ్గరికి వచ్చి, ‘జయించేలాగ దీవించమ’ని అడుగుతూ ఉండేవాడు గదా. నువ్వేమో ఎప్పుడూ ‘యతో ధర్మస్తతో జయః’ అని చెపుతూ వచ్చావే తప్ప ఒక్కసారి గూడా ‘నువ్వు గెలుస్తావు’ అని అనలేదు. నువ్వు ముందరి నుంచీ చాలా ఓర్పు ఉన్నదానివి. అధర్మాన్ని వదిలిపెట్టు. నువ్వన్నట్టే ధర్మమున్న వైపే జయించింది’ అని. అప్పుడు ఆవిడ పాండవుల్ని శపించకుండా ఉన్నా శ్రీకృష్ణుణ్ని మాత్రం శపించింది: ‘జ్ఞాతులైన కౌరవ పాండవులు పరస్పరమూ కొట్టుకొంటూ చచ్చిపోతూ ఉంటే వాళ్లను ఆపకుండా ఉపేక్షించావు గనక, నీ జ్ఞాతుల్ని నువ్వే చంపుతావు. ఈ రోజు నుంచి ముప్ఫై ఆరేళ్ల తరవాత నీవాళ్లందరూ ఒకళ్లతో ఒకళ్లు దెబ్బలాడుకొంటూ చనిపోతారు. నువ్వు కూడా ఒక అనాథుడి మాదిరిగా ఎవరికీ తెలియకుండా కుచ్చితమైన ఉపాయంతో చచ్చిపోతావు’ అని. సంస్కృతంలో శతమూ సహస్రమూ అనే మాటలు వందా వేయీ అనేగాక అనేకమనే అర్థాన్ని కూడా ఇస్తాయి. మనిషిలో అటు దైవీశక్తులూ ఇటు ఆసురీశక్తులూ రెండూ ఉన్నాయి. ఆ మంచీ చెడూ శక్తులు ఎప్పుడూ దెబ్బలాడుకొంటూనే ఉంటాయి. పురాణాల్లో తరచుగా వర్ణిస్తూ ఉండే దేవాసుర యుద్ధమంటే ఇదే. ఆ రెండు శక్తుల్లోనూ మంచివి ఎప్పుడూ తక్కువే. అందుచేతనే ధర్మపరులూ జ్ఞానవంతులూ అయిన పాండవులు ఐదుగురు మాత్రమే. అధర్మం కొమ్ముకాసేవాళ్లూ పాపప్పనులూ అజ్ఞానమూ గొప్ప అనుకొనేవాళ్లూ చాలామందే ఉంటారు. అందుకనే కౌరవులూ వాళ్లవైపు ఉండి యుద్ధం చేసినవాళ్లూ అనేకులు. ‘గాంధారి’ అనే మాటలోని ‘గాం’ అనే మాట కదలికను సూచిస్తుంది. కదలికకు మరోపేరే సృష్టి. అంతా ఒకే వస్తువున్నప్పుడు కదలిక ఎక్కడ ఉంటుంది? అది వేరు పేరైనప్పుడే కదలికలూ స్పందనలూ పుడతాయి. ఆ కదలికను ధరించేది ‘గాంధారి’ - అంటే, సృష్టిని ధరించి పోషించేది ‘గాంధారి’. సృష్టిని ధరించి పోషించేది కోరికల బలం, వాసనల శక్తి, మునపటి కర్మఫల గంధాల శక్తి. ధృతరాష్ట్రుడు ఇంద్రియ సంబంధమైన గుడ్డి మనస్సు; అతని ‘భార్య’ గాంధారి కోరికల శక్తి. మనస్సు ఇంద్రియాల ద్వారానే చూస్తుంది గనక అది పుట్టుగుడ్డిదే; మనను అందర్నీ కోరికల శక్తి, అంటే, మునుపటి వాసనల శక్తి దళసరి పట్టీతో కళ్లకు గంతలు కట్టుకొన్నట్టుగా ప్రవర్తింపజేస్తూ ఉంటుంది. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు -
ధృతరాష్ట్రుడు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 5 రాష్ట్రమంటే ప్రాంతమూ దేశమూ అనే అర్థాలే వాడుకలో ఉన్నాయి. అయితే, దీనికి ఉపద్రవమూ ఉత్పాతమూ ఎప్పుడొస్తుందో తెలియకుండా మీదికి విరుచుకొనిపడే విపరీతమైన కష్టమూ అనే అర్థం కూడా ఉంది. అటువంటి ఉపద్రవాన్ని ధరించి పోషించేవాడు మన ధృతరాష్ట్రుడు. అతను రాష్ట్రాన్ని తన పట్టులో ఉంచుకొని పోషించాలని చూస్తూ ఉండేవాడు. కానీ అతను పుట్టుగుడ్డి. పుట్టుగుడ్డివాడు రాజ్యాన్ని ఏవిధంగా పరిపాలించగలడు? దాన్ని తన పట్టులో ఎలాగ ఉంచుకోగలడు? ‘చక్షుర్వై సత్యం’ అని అంటారు: కంటితో చూసినదే సత్యం. కళ్లులేని కబోదికి, ఇక సత్యమనేది ఏవిధంగా అవుపిస్తుంది? అందుకనే పెద్దవాడైనా సరే, ఇతన్ని కాదని, అంబాలిక కొడుకైన పాండురాజునే రాజుగా చేశారు. పాండురాజు విలువిద్యలో మేటిగాడు; ధృతరాష్ట్రుడేమో పదివేల ఏనుగుల బలమున్నవాడు; విదురుడు, యముడి అవతారం గనక, మహాధర్మిష్ఠుడు. పాండురాజు పెళ్లైన ఒక మాసానికే దిగ్విజయానికి వెళ్లి, రాజ్యాన్ని బాగా పెంపొందించాడు; సుస్థిరంగా కూడా చేశాడు. అయినా, ఇలాగ గుడ్డితనం ‘సాకు’తో తన పెద్దరికాన్ని పక్కుకు పెట్టారని, పైకి గంభీరంగా ఉన్నా, ధృతరాష్ట్రుడికి మొదటి నుంచీ లోపల పీకుడే. తనకు కళ్లు లేకపోతే లేకపోనీ, భార్యకైనా ఉంటే ఒక పక్షంగా బాగానే ఉండేది. కానీ, గాంధారి తనను పుట్టుగుడ్డి అయిన ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లిచేస్తారని వినగానే మగాడిలో తప్పుల్ని చూడకూడదన్న కృతనిశ్చయంతో ఆమె తన నిక్షేపమైన కళ్లకు బట్టను పట్టీగా కట్టుకొంది. మొగుడు పుడుతూనే గుడ్డివాడైతే, పెళ్లాం తెచ్చిపెట్టుకొన్న గుడ్డితనం కలదైంది. ఈ రెండు గుడ్డితనాలూ కలిసి కన్న వందమంది పిల్లలూ మరోరకం గుడ్డివాళ్లయ్యారు. వాళ్లల్లో పెద్దవాడికి అసూయ అనే గుడ్డితనం. రెండోవాడికి మన్నూమిన్నూ కానని కావరమనే గుడ్డితనం. పెద్దాడు దుర్యోధనుడు పుడుతూనే గాడిదల ఓండ్రింపు లాంటి కర్ణకఠోరమైన ధ్వనిచేశాడు; అప్పుడు దిక్కులు కాలిపోతాయా అన్నట్టు వడగాలులు వీచాయి. ఇదంతా చూసి ధృతరాష్ట్రుడు ‘యుధిష్ఠరుడు మన కులంలో పెద్దబ్బాయి. అంచేత అతనికి రాజ్యం దక్కుతుంది. సరే. ఇదుగో ఈ దుర్యోధనుడు తరువాత పుట్టాడు. వీడు నా పెద్దకొడుకు గదా! వీడు కూడా రాజవుతాడా కాడా?’ అని భీష్ముడూ విదురుడూ మొదలైనవాళ్లను అడిగాడు. ఆ మాట అడగ్గానే క్రూరజంతువులు గర్జించాయి; నక్కలు అమంగళంగా ఊళలు వేశాయి. అప్పుడు విదురుడు ‘చూస్తున్నావుగా అన్నయ్యా ఈ అపశకునాలు! వీడు కులాంతకుడవుతాడు. వీణ్ని విడిచిపెడితే శాంతిగా ఉంటుంది రాజ్యం. వీణ్ని రక్షిస్తే మాత్రం చాలా ఉపద్రవమే వచ్చిపడుతుంది. ఈ ఒక్కణ్నీ వదిలిపెట్టి, కులానికే గాదు, జగత్తుకి కూడా క్షేమాన్ని కలిగించు. కులం మంచికోసం ఒకణ్ని (దుర్మార్గుణ్ని) విడిచిపెట్టాలి; గ్రామం మంచికోసం కులజంజాటాన్ని వదలాలి; జనపదం హితంకోసం గ్రామమనే సంకుచితత్వాన్ని విడిచిపెట్టాలి; విస్తారమైన సుఖం కోసం భూమి అనే ఇంతపాటి పరిధిని విడిచిపెట్టాలి’ అన్నాడు. పుత్రుడి మీది మోహం కొద్దీ విదురుడు చెప్పిన మంచి మాటల్ని పెడచెవిని పెట్టాడు ధృతరాష్ట్రుడు. పాండురాజు జింకల రూపంలో ఉన్న మునిదంపతుల్ని బాణం వేసి చంపడంతో శాపగ్రస్తుడై కామక్రీడకు దూరంగా ఉండవలసిన దగ్గర్నుంచీ వనంలోనే తపస్సు చేసుకొంటూ ఉండేవాడు. అప్పణ్నించీ రాజ్యాన్ని ధృతరాష్ట్రుడే పరిపాలిస్తున్నాడు. దూర్వాసుడు కుంతికిచ్చిన వరం సాయంతో కుంతికీ మాద్రికీ యుధిష్ఠరుడూ భీముడూ అర్జునుడూ నకులుడూ సహదేవుడూ పుట్టారు. ఓ రోజున మాద్రితోబాటు వనంలోకి షికారుకు వెళ్లిన పాండురాజుకు పట్టరాని కామం ఆవహించింది. వద్దన్నా వినకుండా మాద్రిని కావలించుకోబోయాడు. అంతే, అతను చనిపోయాడు. ‘నా వల్లనే పోయాడు గనక, నేనూ ఆయనతో బాటే వెళ్లిపోతాను’ అని మాద్రి అతని చితిలోనే కాలిపోయింది. కుంతినీ చిన్నపిల్లల్ని ఐదుగుర్నీ వెంటబెట్టుకొని, వనంలోని రుషులు హస్తినాపురానికి వచ్చి, జరిగింది చెప్పి, వాళ్లను విడిచిపెట్టి వెళ్లారు. కుర్రాళ్లు పెద్దవాళ్లవుతున్నారు. చదువులూ సంస్కారాలూ ఆయుధ విద్యలూ అబ్బాయి. అన్నిట్లోనూ పాండవులదే పైచేయిగా ఉండేది. ధర్మరాజు పెద్దవాడు గనక అతన్ని యువరాజుగా చేశాడు ధృతరాష్ట్రుడు. పౌరులందరూ ధృతరాష్ట్రుణ్ని, భీష్ముణ్ని కూడా కాదని, ధర్మరాజునే రాజుగా కోరుకోడాన్ని చూసి దుర్యోధనుడు విలవిల్లాడిపోయాడు. ‘ఈ రాజ్యం పాండురాజుది గనక, అతని పిల్లలకే చెందుతుంది. ఇక మేమూ మా పిల్లలూ రాజ్యానికెప్పుడూ దూరంగా ఉండవలసిందేనా? ఎప్పుడూ ఇతరులు వేసే కూడు తినవలసినవాళ్లమేనా? నీకే గనక మొదట రాజ్యం వచ్చి ఉంటే, మాకీ దుర్దశ ఉండేది కాదు’ అని తండ్రి ఎదుట తన బాధ వెళ్లగక్కాడు. పాండవుల్ని వారణావతమనే ఊరుకి పంపించడానికి ప్రయత్నం చేసి, ప్రజలందరూ తన అధీనంలోకి వచ్చిన తరవాత, తిరిగి వాళ్లు వచ్చేలాగ చేద్దామని ఒక ప్రణాళికను తయారుచేశాడు. అంతకుముందు కణికుడనే మంత్రి, శత్రువులు బలవంతులైతే ఉపాయంతో వాళ్లను బలహీనులుగా జేసి చంపాలనీనూ త్వరగా మట్టుబెట్టాలంటే వాళ్ల ఇంటిని తగలబెట్టాలనీనూ ధృతరాష్ట్రుడికి ఉపదేశించాడు. దీనితోనే లక్కింటి పథకానికి బీజం పడింది. నమ్మకస్తులైన మంత్రుల చేత వారణావతం ‘ఏం అందమైన నగరమండీ!’ అని పాండవుల ముందు పొగిడించాడు ధృతరాష్ట్రుడు. వాళ్లు వెళ్లడానికి సుముఖంగా ఉన్నారన్నప్పుడు ‘మీరు వారణావతం వెళ్దామనుకొంటున్నారుగా! శుభం. వెళ్లిరండి’ అని అడక్కుండానే పచ్చజెండా ఊపేశాడు. ధర్మరాజుకు ధృతరాష్ట్రుడి మనస్సు తెలియకపోలేదు కానీ పెద్దవాడి మాటకు ఎదురు ఎలాగ చెప్పగలడు? వారణావతానికి పాండవులు వెళ్తూంటే, నిర్భయులైన కొంతమంది ‘రాజు పాండవుల్నీ తన పుత్రుల్నీ సమంగా చూడటం లేదు. ధర్మాన్ని పట్టించుకోవడం లేదు. ఇంత అధర్మాన్ని భీష్ముడెలాగ ఒప్పుకొంటున్నాడో’ అని బాహాటంగానే అన్నప్పటికీ ధృతరాష్ట్రుడికి చీమకుట్టినట్టుగా కూడా లేదు. లక్క ఇంటిలో కాలిపోయారని తెలిసినప్పుడు మొసలి కన్నీళ్లు కార్చి స్నానాలు కూడా చేశాడు ధృతరాష్ట్రుడు. ద్రౌపదితో వివాహమైన తరవాత, ఇక ఈ తగాదాల్లేకుండా అర్ధరాజ్యమిచ్చేస్తానని చెప్పి పాండవుల్ని ఖాండవ ప్రస్థానికి పంపాడు. భీముడూ అర్జునుడూ నకులుడూ సహదేవుడూ నాలుగు దిక్కుల్నీ జయించుకొని వచ్చి ధర్మరాజు రాజసూయయాగం చేయడానికి అనువు కల్పించారు. అక్కడికి వెళ్లిన దుర్యోధనుడికి ధర్మరాజుకున్న సిరిని చూసి కన్నుకుట్టింది. తిండి సయించడం మానేసింది; కృశించుకొనిపోయాడు. ‘ఏమిటిలా నీరసించుకొనిపోతున్నావు?’ అని అడిగాడు తండ్రి. ‘పాండవులసిరి అంతా నన్నుజేరితేనే నాకు కంటినిండా నిద్రపడుతుంది నాన్నా! శకుని మామయ్య వాళ్లతో కపట జూదమాడి ఆ సిరిని నాకు అప్పగిస్తానంటున్నాడు. నువ్వు ఊ అంటే చాలు!’ అని పెద్ద పుత్రరత్నం గునిశాడు. ‘వాళ్ల ధనమూ నీదేగదరా! బాహువుల్లాటి వాళ్లను తెగ్గొట్టుకోకు. ద్వేషాన్ని పెట్టుకోకు’ అని నెత్తీనోరూ మొత్తుకొని చెప్పినా వినలేదు. ‘సరే, విదురుడితో మాట్లాడి నిశ్చయిద్దాంలే’ అనగానే... ‘అయినట్టే! విదురుడు బాబాయి దీన్ని పడనివ్వడు. అప్పుడింక నాకు చావే శరణ్యం’ అన్నాడు. ఎంత పుత్రమోహం ఉన్నా, విదురుణ్ని అడక్కుండా ఒక్కపనీ చేయలేడు ధృతరాష్ట్రుడు. ‘జూదం వల్ల కొడుకుల మధ్య భేదం రాకుండా చూడు అన్నయ్యా!’ అన్న విదురుడికి ‘అహ, ఇది వట్టి సుహృద్ద్యూతం మాత్రమే. అయినా నేనూ ద్రోణుడూ భీష్ముడూ నువ్వూ ఉండగా అన్యాయం ఎందుకు జరుగుతుంది?’ అని సన్నాయి నొక్కులు నొక్కుతూ పాండవుల్ని పిలిపించాడు. జూదం జరుగుతుంటే మాటిమాటికీ ‘ఇప్పుడేం గెలిచారు, ఇప్పుడేం గెలిచారు?’ అని అడుగుతూనే ఉన్నాడు. తన గుడ్డిముఖంలో తాండవిస్తూన్న ఆనందాన్నిదాచుకోలేకపోయాడు. కోడలికి అవమానం జరిగిపోయిన తరవాతనే, పెద్దలందరూ ఏమీ అనకుండా ఉండటం కోసం, ఆమెకు వరాలనిచ్చి పాండవుల దాస్యాన్ని తీర్చాడు. ‘ఇంతా సాధించిన తరవాత ముసిలోడు అంతా పాడుచేసేశాడు’ అని దుశ్శాసనుడు మెటికలు విరిచాడు. మళ్లీ జూదానికి పిలిపించమని దుర్యోధనుడు మంకుపట్టు పట్టాడు. అప్పుడు తల్లి గాంధారి కూడా ‘నీ అదుపులో వాడు ఉండనంటే, కులానికి చిచ్చులాంటివాణ్ని వదిలిపెట్టెయ్’ అని చెప్పింది. ‘కులం అంతమైపోతే పోనీ నేను మాత్రం దుర్యోధనుణ్ని ఆపలేను’ అని ధృతరాష్ట్రుడు చేతులెత్తేశాడు. ‘పద్నాలుగో ఏడాది తిరిగివచ్చినప్పుడు, వాళ్ల రాజ్యం వాళ్లకు ఇవ్వకపోతే భీమార్జునులు నిశ్శేషంగా అందర్నీ చంపేస్తారు. అందుకని అహితం చేస్తూన్న నీ కొడుకును విడిచిపెట్టు’ అని విదురుడు అనేసరికి కోపాన్ని పట్టలేక ‘నిజమే, పాండవులూ నా పుత్రులే. కానీ, దుర్యోధనుడేమో నా శరీరం నుంచి పుట్టాడు. నా దేహాన్ని నేనెలాగ వదిలిపెట్టాలి? నీకెప్పుడూ పాండవులంటేనే ఇష్టం. నీ ఇష్టమొచ్చిన చోటికి వెళ్లవచ్చు’ అని ధృతరాష్ట్రుడు నోరుజారాడు. విదురుడు వెళ్లిన మీదట, తాను చేసిన తప్పు స్పృహకు వచ్చి, వెంటనే సారథి సంజయుణ్ని పంపి, అతన్ని తిరిగి వచ్చేలా చేసుకొన్నాడు. యుద్ధం వచ్చి పడబోతోందన్న దగ్గర్నుంచీ నిద్ర కరువైపోయింది. విదురుడూ సనత్సుజాతుడూ ఎంతమంది చెప్పినా ఊరట కలగలేదు. సంజయుడు యుద్ధ విషయాలను చెబుతూంటే కుమిలి కుమిలిపోయాడు. శ్రీకృష్ణుడు చెప్పిన గీతను విన్నా కోపం ఏమాత్రమూ తగ్గలేదు. వందమంది పిల్లల్నీ చంపినవాడు భీముడు గనక అతన్ని తన కౌగిలిలో చంపేద్దామని అనుకొన్నాడు. శ్రీకృష్ణుడు ఇనుప విగ్రహాన్ని ధృతరాష్ట్ర కౌగిలిలోకి పంపాడు. మొదటినుంచి చివరిదాకా ధృతరాష్ట్రుడిది ఒకటే తీరు: పుత్రమోహంతో అజాగ్రత్తగా వ్యవహరించడం. ‘అజాగ్రత్తే మృత్యువు’ అని ఎంతమంది చెప్పినా తెలుసుకోలేక పోయాడు. మనిషి మనస్సు కూడా ఇలాగే అజాగ్రత్తగా ప్రవర్తిస్తూ శరీర రాష్ట్రానికి ‘రాష్ట్రాన్ని’ అంటే ఉపద్రవాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు -
సత్యవతీ శాంతనులు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 3 గంగాదేవి విడిచిపెట్టి వెళ్లిపోయిన తరువాత శాంతనుడు ముప్పై ఆరేళ్ల పాటు పెళ్లి గురించే ఆలోచించకుండా అడవుల్లో ఉన్నట్టుగా ఉంటూ రాజ్యాన్ని పాలించేవాడు. గంగాదేవి తానుకన్న ఎనిమిదో వసువును ముందు శాంతనుడి వద్దే ఉంచి వెళ్లినప్పటికీ, ఇంటిపట్టున ఉండి పిల్లవాణ్ని పట్టించుకోవడం లేదని ఆ తర్వాత వచ్చి తిరిగి తనతో తీసుకొని వెళ్లిపోయింది. తండ్రిపోలికలు బాగా ఉన్న ఆ గంగాదత్తుడి పేరు దేవవ్రతుడు. వ్రతమంటే దీక్షగా పనిచేయడం. దేవవ్రతుడంటే ఏ పనినైనా దేవుడి పనిగానే దీక్షగా చేసేవాడని అర్థం. ఒకరోజున శాంతనుడు ఒక క్రూరమైన పశువును వేటాడుతూ గంగ ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డున నడుస్తూండగా అతనికి ఆ నదిలో నీళ్లు తగ్గినట్టుగా అనిపించాయి. ఈ దేవనది మునుపటిలాగా కాకుండా ఇలా బక్కచిక్కినట్టు ఉండటానికి కారణమేమిటబ్బా అని చోద్యంగా చూశాడు. అక్కడ ఒక అందమైన కుర్రాడు దివ్యాస్త్రాలను వేస్తూ గంగనీటికి అడ్డుకట్ట వేస్తున్నాడు. ఆ పిల్లవాడు తన పోలికలతోనే ఉన్నా, తన కొడుకేనని అతను గుర్తుపట్టలేకపోయాడు. ఆ కుర్రాడూ తండ్రిని చూసి, ఎవడో కొత్తవాడని అనుకొంటూ, అతన్ని మాయలో పడేసి, తానూ మాయమైపోయాడు. కనిపిస్తూనే అంతర్థానమైన పిల్లవాడిలో తన పోలికలే ఉన్నాయని తలచుకొంటూ ఉన్న శాంతనుడికి ‘అతను మూడొంతులు నా కొడుకే అయ్యుంటా’డనే అనుమానం వేసింది. తక్షణమే గంగను తలుచుకొన్నాడు. గంగాదేవి ఆ పిల్లవాణ్ని చేతబట్టుకొని ఎదురుగుండా వచ్చింది. ‘నేను నీవల్ల కన్న ఎనిమిదో కొడుకే ఈ సర్వాస్త్రవేత్త. ఇక వీణ్ని నువ్వు తీసుకో. వశిష్ఠుణ్నించి వేదాలూ పరశురాముణ్నించి ధనుర్విద్యా క్షుణ్ణంగా నేర్చుకొన్నాడు ఈ మన అబ్బాయి’ అంటూ ఆ అబ్బాయిని తండ్రికి అప్పగించి గంగాదేవి తిరిగి వెళ్లిపోయింది. ఆ వీరపుత్రుణ్ని చూసుకొంటూ ఇట్టే నాలుగేళ్లు గిర్రున గడచిపోయాయి. ఒకరోజున యమునానది పక్కనున్న వనంలోకి వెళ్లాడు శాంతనుడు. అక్కడ అతనికి ‘ఇదీ’ అని చెప్పడానికి వీలులేని ఒక సువాసన గాలితెర మీదుగా వచ్చింది. ఆ సుగంధం ఎక్కణ్నించి వస్తోందా అని దాని దిక్కుగా ముందుకు నడిచాడు అతను. ఎదురుగా అక్కడ దేవకన్యలాగా ఉన్న ఒక బెస్తపిల్లని చూశాడు. ‘ఎవరిదానివి? ఎవత్తెవి? ఏం చేద్దామని ఇక్కడున్నావు?’ అంటూ వరసగా ప్రశ్నల వర్షం కురిపించాడు. ‘నేను బెస్తలదొర దాశరాజు కూతుర్ని. నాన్నగారి ఆజ్ఞ మేరకు యమునానది మీద పడవను నడుపుతూ ఉంటాను’ అని ఆమె జవాబు చెప్పింది. శాంతనుడు ఆమె రూపానికీ సుగంధమోడుతూన్న ఆమె శరీరానికీ ముగ్ధుడై ఆమెను పెళ్లిచేసుకొందామని అనుకొన్నాడు. అనుకోవడమే తడవు, ఆమె తండ్రి దగ్గరికిపోయి ఆ మాటనే చెప్పాడు. ‘ఆడపిల్ల పుట్టగానే ఎవరికో ఒకరికి ఇవ్వవలసినదే అవుతుంది. అందులోనూ మీరేమో సాక్షాత్తూ రాజుగారు. ఇక నాకు కావలసినదేముంటుంది? అయితే, నాకో కోరిక ఉంది. ఆ వరం ఇస్తే, నేను మీకు మా అమ్మాయినిస్తాను’ అన్న దాశరాజు మాటను విని, ‘అది ఇవ్వగలిగినదైతే తప్పకుండా ఇస్తాను; ఇవ్వరానిదైతే మాత్రం ఏమైనా ఇవ్వను’ అని రాజు దృఢంగానే అన్నాడు. ‘నా కూతురికి పుట్టినవాడే మీ రాజ్యానికి యువరాజు కావాలి; మరెవ్వడూ కాకూడదు’ అన్నమాటను విని శాంతనుడు మనసు చిన్నబుచ్చుకొని, ముఖం ముడుచుకొని మారుమాట మాటాడకుండా హస్తినాపురానికి వెళ్లిపోయాడు. ఆ అమ్మాయినే తలచుకొంటూ లోలోపల కుములుతూ ఉండటం చూసి, నాన్న దగ్గరికి చేరాడు దేవవ్రతుడు. అసలు కారణమేమిటా అని గుచ్చి గుచ్చి అడిగాడు. ‘అవునురా అబ్బాయీ నాకు కొంత చింతగానే ఉంది. నువ్వొక్కడివే ఈ వంశానికి మొలకవు. ఆ నువ్వేమో ఎప్పుడూ అస్త్ర శస్త్రాలతో క్రీడిస్తూ యుద్ధాలు చేస్తూ ఉంటావు. నీకేమైనా విపత్తు వస్తే, ఈ కులం ఏంగాను? అవును, నువ్వు ఒక్కడివే వందమంది పుత్రులపెట్టు అన్నమాట నిజమే. అయితే, నేను వృథాగా పెళ్లిచేసుకొందామని అనుకోవటం లేదు. మన వంశం ఎక్కడ లోపిస్తుందోనని మాత్రమే రెండోపెళ్లి చేసుకొందామని అనుకొంటున్నాను. ఒక్క పుత్రుడే ఉండటం అపుత్రత్వంతో సమానమే’ అని ముక్తాయించాడు శాంతనుడు. కానీ అసలు మాట మాత్రం బయటపెట్టలేదు. ఆలోచనాపరుడైన దేవవ్రతుడు తండ్రిగారికి బాగా కావలసిన మంత్రి దగ్గరికి వెళ్లి అసలు విషయాన్ని వాకబు చేశాడు. అతను యోజనగంధి అయిన సత్యవతిని గురించీ ఆమె తండ్రి పెట్టిన షరతు గురించీ చెప్పాడు. ఆమీద కొంతమంది కులపెద్దల్నీ సామంతుల్నీ తీసుకొని దాశరాజు దగ్గరికి వెళ్లాడు దేవవ్రతుడు. వెళ్లి, ‘ఈవిడకు పుట్టినవాడే రాజవుతాడు’ అని రాజులందరి ముందూ దాశరాజుకు మాటిచ్చాడు. ‘నువ్వన్నది బాగుంది కానీ నీ కొడుకులు దీనికి అడ్డం రావచ్చు గదా’ అని మరో మెలిక పెట్టాడు దాశరాజు. దానికి బదులుగా ‘నేను ఈ రోజు నుంచీ బ్రహ్మచారిగానే ఉంటాను’ అని భీష్మమైన ప్రతిజ్ఞ చేశాడు దేవవ్రతుడు. అప్పణ్నించే దేవవ్రతుడు భీష్ముడయ్యాడు. సత్యవతిని రథం ఎక్కించుకొని తీసుకొనిపోయి శాంతనుడికి అప్పగించాడు. కొడుకుతో సహా వచ్చిన సత్యవతిని చూడగానే శాంతనుడికి నోటమాట రాలేదు. సంతోషమూ వేసింది, బాధా కలిగింది. ‘నీ ఇష్టం ఉంటేనే గాని నిన్ను మరణం తాకలేదు’ అని కొడుక్కి వరం ఇచ్చాడు. సత్యవతీ శాంతనుల దాంపత్యం ఫలించి మొదట చిత్రాంగదుడనే కొడుకు పుట్టాడు. ఆమీద విచిత్రవీర్యుడనే మరో కొడుకు కూడా పుట్టాడు. రెండోవాడు ఇంకా పసివాడుగా ఉన్నప్పుడే శాంతన మహారాజు చనిపోయాడు. సత్యవతికీ ఆమె తండ్రికీ ఇచ్చిన మాట ప్రకారమే చిత్రాంగదుణ్ణి రాజుగా చేశాడు భీష్ముడు. ఆ చిత్రాంగదుడు మనుషుల్లో తనకు సరిజోడైనవాడు లేడని విర్రవీగేవాడు. ఒక్క మనుషుల్నే కాదు, దేవతల్నీ అసురుల్నీ కూడా ఎదిరించడం మొదలెట్టాడు. దాన్ని సహించలేకపోయాడు అదే పేరున్న ఒక గంధర్వుడు. గంధర్వులు మాయల్లో మేటివాళ్లు కదా! చిత్రాంగద మహారాజును చిత్రాంగదుడనే గంధర్వుడు చంపేశాడు. అయితే ఆ యుద్ధం మాత్రం నిండా మూడేళ్లు కొనసాగింది. మళ్లీ సత్యవతితో మాట్లాడి చిన్నవాడైన విచిత్రవీర్యుణ్ని రాజుగా చేసి, తానే అతనిపేర అన్ని కార్యాలూ నిర్వహించేవాడు భీష్ముడు. దేవవ్రతుడు అచ్చూ మచ్చూ శాంతనుణ్ణే పోలి ఉండేవాడు. అంటే, శాంతను చైతన్యం దేవవ్రతుడిలో ప్రతిబింబమైందన్నమాట. ఈ ప్రతిబింబితమైన చైతన్యం అద్దంలోని బొమ్మలాగా ‘అనిపించే’ చైతన్యం మాత్రమే. అనిపించడాన్ని ‘ఆభాస’ అని అంటారు. తన ఆభాసవిద్యాబాణాలతో అడ్డుకట్ట కట్టి, మహాగంగాప్రవాహమనే జ్ఞానమయమైన తల్లి ప్రకృతిని అతను సన్నగిల్లి పోయేలాగ చేశాడు. దీనివల్ల రెండు రకాల పరిస్థితులు తారసిల్లవచ్చు: ఒకటి, సాపేక్షకతను పుట్టించే ప్రకృతే లేకుండాపోయే పరిస్థితి. రెండోది, ఆభాస చైతన్యానికి ఏ రకంగానూ ప్రభావితం కాని మరో ప్రకృతి ఎదురుగావడం. మొదటి పరిస్థితేమో సృష్టినే ఆపుజేస్తుంది. సృష్టితో తాను ‘చాలా’గా అవుదామనుకొన్న భగవంతుడి కోరిక దీనితో తీరకుండానే ఉండిపోతుంది. అతని కోరిక తీరాలీ అంటే, రెండోది జరగాలి. రెండోదే సృష్టిని ముందుకు నడిపించగలదు. సరిగ్గా అదే సమయంలో నల్లగా ఉండే యమునానది దగ్గర సత్యవత్తుగా తోచే పదార్థమైన మలిన ప్రకృతి ఎదురుపడి, శాంతను చైతన్యాన్ని మోహంలోకి దించింది. ఆభాసచైతన్యం తాలూకు ప్రభావం లేకుండా ఉండటమే, దేవవ్రతుడు భీష్ముడిగా మారి, రాజ్యాధికారాన్ని విడిచిపెట్టి, పెళ్లి చేసుకోనని ఒట్టుపెట్టుకోవడం. సృష్టి అనే చలనచిత్ర రంగానికి సిద్ధంచేసే చిత్రాంగదత్వమే సృష్టికి అంకురం లాంటి ‘మహత్తత్త్వం’. చిత్రం అంటే చూపును ఆకట్టుకొనేది. చూపును ఆకట్టుకొనే చిత్రరంగాన్ని ప్రదానం చేసేదే మహత్తరమైన చిత్రాంగదత్వం. మొదట్లో ప్రకృతికున్న మూడు గుణాలూ, అంటే, జ్ఞానసుఖంతో కలిపే సత్త్వమూ, కర్మలతో సంగాన్ని కల్పించే రజస్సూ, అలసభావాన్నీ నిద్ర ముంపునీ కలగజేసే తమస్సూ అనే మూడూ సరిసమానంగా ఉండటంతో ఏ తేడానూ అవుపించేది కాదు. తేడా ఉంటేనే ఇంతకుముందు పరిస్థితితో ఇప్పటి పరిస్థితిని పోల్చే సాపేక్షత ఏర్పడుతుంది. అదే సృష్టికి నాంది కాగలదు. ఈ గుణాలు కలగలిసి ఎక్కువ తక్కువలు గావడమే సాపేక్షకతకు అంకురం. గుణాల మిశ్రమాన్నే ‘కాలశక్తి’ అంటారు. కాలమంటే గుణాల్లో మార్పును తీసుకొనివచ్చే భావం. చిత్రాంగదుడు చిత్రాంగదుడి చేతిలో మూడేళ్లపాటు పోరాడి చనిపోయాడంటే, ప్రకృతి మూడుగుణాల సమానత్వమూ నశించి క్షోభ కలగడమే. గుణాల కలగలుపునే మహాతత్త్వమనీ చిత్తమనీ అంటారు. ఆ చిత్తం మీద మహాచైతన్య ప్రకాశం పడి ‘నేను వేరుగా ఉన్నాన’ నే విచిత్రమైన వీర్యం ప్రకటితమవుతుంది. ఇదే దివ్యమైన అహంకారం. అహంకార రూపమే అయిన ఆభాస చైతన్యం ఈ దివ్యమైన అహంకారం కోసం అన్ని పనుల్నీ చేస్తూ ఉంటుంది. భీష్ముడు విచిత్రవీర్యుణ్ని సింహాసనమెక్కించి తానే రాజ్యభారాన్నీ పాలనాభారాన్నీ మోయడమంటే ఇదే. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు 9000765972 -
వేదవ్యాసుడు
ఐదోవేదం: మహాభారత పాత్రలు - 2 మహాభారతం రాసింది వేదవ్యాసుడే అయినా, వ్యాసుడు అందులో ఒక పాత్ర కూడా. ఋషుల పుట్టుక గురించీ నదుల పుట్టుక గురించీ అడగకూడదంటారు. ఎంత పెద్ద నది అయినా దాని మూలంలో అది చాలా చిన్నదిగానే ఉంటుంది; చుక్కలు చుక్కలుగానే పడుతూ ఉంటుంది. ‘ఆ నదేనా ఇక్కడ పుట్టింది?’ అన్నంత ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది. ఋషుల పుట్టుక గూడా అలాగే ఉంటుంది కానీ, వారి విషయంలో దాన్ని వేరుగా అర్థం చేసుకోవాలి. ఒక బెస్తలదొర పేరు దాశరాజు. అతని దగ్గర చాలామంది చేపలు పట్టేవాళ్లే ఉన్నారు. ఓసారి వాళ్లు సముద్రంలోకి వేటకోసం వెళ్లారు. వాళ్లకు ఆ రోజున కడుపుతో ఉన్న పెద్ద చేప ఒకటి చిక్కింది. దాన్ని తెచ్చి దొర చేతికిచ్చారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ చేప కడుపును చీల్చినప్పుడు, దానిలోనుంచి ఒక పిల్లాడూ, ఒక పిల్లా బయటపడ్డారు! దాశరాజు వాళ్లనిద్దర్నీ తీసుకొనిపోయి వాళ్ల రాజుగారికి చూపించాడు. ఆ రాజుగారు ఎంతో ఆనందంతో దాశరాజుకి అమ్మాయినిచ్చి, తానేమో పిల్లవాణ్ని తీసుకొన్నాడు. దాశరాజు ఆమెకు ‘సత్యవతి’ అని పేరుపెట్టుకొని, అల్లారు ముద్దుగా పెంచుకొన్నాడు. చేపల వాసనతో ఉన్న ఆ పిల్లను ‘మత్స్యగంధి’ అని అందరూ పిలుస్తూ ఉండేవాళ్లు. తండ్రికి సాయం చేయడానికి ఆ అమ్మాయి యమునానది మీద నావ నడుపుతూ ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకూ, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకూ యాత్రికుల్ని చేరవేస్తూ ఉండేది. ఓసారి, తీర్థయాత్రలు చేస్తూ వస్తున్న పరాశర మహర్షి ఆ నావ ఎక్కేడు. ఆ అమ్మాయి రూపానికి ముగ్ధుడైన పరాశరుడు ఆమెను దగ్గరికి పిలిచాడు. ఆమె సిగ్గుతో, భయంతో ‘ఆవలి ఒడ్డునా ఈవల ఒడ్డునా చాలామందే చూస్తూ ఉన్నారు. అదీగాక, తండ్రి చాటు బిడ్డను నేను. నా కన్యాత్వం పోతే, తిరిగి నాన్నగారికి నా ముఖం ఎలా చూపించగలను?’ అని వాపోయింది. పరాశరుడు గొప్ప యోగి. తక్షణమే మంచుతెరనొకదాన్ని సృష్టించి అంతా చీకటిగా మార్చేశాడు. ‘నీ కన్యాత్వం ఎక్కడికీ పోదులే’ అని పలుకుతూ, ‘ఏదైనా నీకు ఇష్టమొచ్చిన వరం కోరుకో’మని అన్నాడు. అందరూ ఆమె ఒంటి నుంచి వచ్చే చేపల వాసనను వెక్కిరిస్తూ ఉండేవాళ్లు. అదీగాక, యౌవనంలో ఉన్న ఆమె దగ్గరికి ఎవరు రావాలన్నా కొంత సంకోచిస్తూనే ఉండేవాళ్లు. అందుకనే ఆమె, తన శరీరానికున్న చేపల గబ్బును పోగొట్టి పద్మపుష్పాల సుగంధం వచ్చేలా చేయమని అడిగింది. ఆవిడ కోరిక తీరింది. ఆమె అప్పణ్నించీ ‘గంధవతి’గా మారింది. ఆమె ఒంటి నుంచి వచ్చే ఆ సువాసన యోజనం దాకా, అంటే, పన్నెండు పదమూడు కిలోమీటర్ల దాకా విస్తరించడాన్ని చూసి, ఆమెను‘యోజనగంధి’ అని కూడా పిలవడం మొదలుపెట్టారు. యోజనం అంటే కలపడం అని కూడా అర్థం ఉంది. ఆ సుగంధమే ఆవిణ్ని శాంతన మహారాజుగారితో కలిపింది తరువాత. అప్పటికప్పుడు శోభనం గదిని తయారుచేసినట్టుగా మంచుతెరను సృష్టించినవాడు మామూలు మనుషుల్లా సంగమించవలసిన పనిలేదు. అటువంటివాళ్లు వట్టి మానస భావంతోనే పిల్లల్ని సృష్టించగలరు. సంగమించి కన్నా, సంగమించకుండా కన్నా పరాశరుడి లాంటి మహాయోగులకు తేడా ఏమీ ఉండదు. నేలమీది జనుల్ని ఉద్ధరించడానికి ఒక మహానుభావుణ్ని తీసుకురావలసిన సమయం దగ్గరపడ్డప్పుడు, ఇటువంటి కథల్ని చెబుతూ ఉంటాయి పురాణాలు. పురాణాల పద్ధతి అది. ఇలా చెప్పినది ఠకీమని ఎక్కుతుంది. పైన చెప్పినట్టుగా మానసిక భావంతో కన్నాడన్నమాట నమ్మబుద్ధి కాదు. మనకన్నా వాళ్లు వేరుగా ఎలా ఉంటారని అనిపిస్తుంది. ఆ సందేహాన్ని పుట్టించకుండా ఉండటానికే పురాణాలు ఈ పద్ధతిని ఉపయోగిస్తాయి. దీనివల్ల ఆ మహాయోగులకు వచ్చిన నష్టమేమీ ఉండదు. పరాశర మహర్షి వల్ల ఆమెకు అప్పటికప్పుడే ఆ యమునానదీ ద్వీపంలోనే ఒక పదహారేళ్ల పడుచువాడు పుట్టుకొని వచ్చాడు. అతను పుడుతూనే తపస్సుకు వెళ్లిపోతూ, ‘అమ్మా! నీకు అవసరమైనప్పుడు నేను వస్తాను’ అని చెప్పి వెళ్లిపోయాడు.ఆ పడుచువాడే వేదవ్యాసుడు. ద్వీపంలో పుట్టాడు గనక అతన్ని ద్వైపాయనుడని కూడా అంటారు. మంచుతెర అనే చీకట్లో నల్లటి రూపంలో పుట్టాడు గనక అతను కృష్ణుడు కూడాను. రెండు పేర్లనూ కలిపి వెరసి అతన్ని కృష్ణ ద్వైపాయనుడని పిలుస్తూ ఉంటారు. యుగయుగంలోనూ ధర్మం తాలూకు పాదాలు కుంచించుకొని పోతూ ఉంటాయి. మనిషికి రెండు పాదాలూ సజావుగా ఉంటే నిటారుగానూ హుందాగానూ నడవగలుగుతాడు. అలాగే ధర్మానికున్న తపస్సూ, శుచిత్వమూ, దయా, సత్యమూ అనే నాలుగు పాదాలూ సమానమైన పొడుగులో ఉంటే, ధర్మం ఏ కుంటూ లేకుండా సాగుతుంది. కానీ తపస్సు చేస్తున్నామన్నది గర్వాన్ని తెస్తుంది; ఆ గర్వంతో అది తన ‘పొడుగు’ను పోగొట్టుకుంటుంది. నలుగురితోనూ విచ్చలవిడిగా చేతులు కలపడంతోనూ తిరగడంతోనూ శుచిత్వం సమసిపోతుంది. ‘నేను చాలా దయావంతుణ్ని’ అనే భావం తలకెక్కుతుంది. క్రమంగా అది అహంగా మారిపోతుంది. ఇలా కాలం గడుస్తూన్నకొద్దీ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అదీగాక, మనుషుల ఆయుష్షూ శక్తీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్ని చూసే కృష్ణద్వైపాయనుడు ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు భాగాలుగా విడదీశాడు. అందుకనే అతను వేదవ్యాసుడయ్యాడు. ఏ విషయం గురించైనా విరివిగా రాయడాన్నే వ్యాసమని అంటారు. ఇతను కూడా వేదంలోని విషయాలను విపులంగా వివరిస్తూ 18 పురాణాలను రాశాడు. ఇంటి పనుల్లో మునిగి ఉండే ఇల్లాళ్లకూ పొలం పనుల్లో తలమునకలై ఉండే పాలేర్లకూ రోజువారీ జీవితానికి అవసరమైన వస్తువుల్ని చేరవేస్తూ వ్యవహారాలు చేసే వర్తకులకూ కూడా వేదార్థాన్ని చేరవేద్దామన్న తపనతోనూ జాలితోనూ పంచమ వేద రూపంలో మహాభారతాన్ని కూడా రాశాడితను. అందుకనే వేదవ్యాసుణ్ని అందరికీ గురువుగా ఆరాధిస్తారు. ఆషాఢ పూర్ణిమకు గురుపూర్ణిమ అని పేరుపెట్టి ఈ మహాగురువుకి పూజను చేస్తూ ఉంటారు. మహాభారతాన్ని రాయడమే గాక దాంట్లో ఒక పాత్రగా కూడా ఉన్నాడీయన. తల్లి సత్యవతి తలుచుకోగానే వచ్చి, రాజసంతానం లేక విధవలుగా ఉన్న అంబికా అంబాలికా అనే రాజపత్నులకు సంతానాన్ని ప్రసాదించాడితను. అంబిక, ఇతని గెడ్డాలూ మీసాలూ చూసి కళ్లు మూసుకోబట్టి గుడ్డి ధృతరాష్ట్రుడు పుట్టాడు; అంబాలిక ఇతన్ని చూసి భయపడి పాలిపోబట్టి పాలిపోయిన శరీరంతో పాండురాజు పుట్టాడు. ఈ సంతానం ఇటువంటిదని ఎరిగిన సత్యవతి, మళ్లీ కొడుకుని వేడుకోగా, వచ్చిన వ్యాసుడి దగ్గరికి అంబాలిక, ధైర్యంగా ఉన్న దాసిని పంపించడంతో మహావివేకి అయిన విదురుడు పుట్టాడు. పిల్లల వైనాన్నిబట్టి చూస్తే ఇదంతా మానసిక సంతానమే అని అర్థమవుతోంది. పాండురాజు భార్యకు అప్పుడే పిల్లవాడు పుట్టేశాడనే దుగ్ధతో ధృతరాష్ట్రుడి భార్య గాంధారి, గర్భంతో ఉన్న తన పొట్టను రాయితో చీల్చుకోవడంతో ఒక మాంస పిండం బయటపడింది. అప్పుడు వ్యాసుడే వచ్చి, ఆ మాంసపు ముద్దను వంద ముక్కలుగా చేస్తూ ఆవునేతి కుండల్లో పెట్టి, సాకేలాగ చేశాడు. ఆ పనిలో ఉండగా, గాంధారి, ‘ఒక కూతురు కూడా ఉంటే బాగుంటుంది’ అంటే, వ్యాసుడు మరోముక్కను విడదీశాడు. అలాగ దుర్యోధనాదులతో పాటు దుశ్శల అనే కూతురు కూడా పుట్టింది. ఆవునేతి కుండల్ని టెస్టుట్యూబులుగా ఉపయోగించిన పద్ధతిని కొంత మనం పరిశోధిస్తే ఆ పద్ధతేమిటో అర్థమవుతుంది. ఈ విధంగా కౌరవులకూ పాండవులకూ ఇతను తాతగారవుతాడు; భీష్ముడిగా ప్రసిద్ధికెక్కిన గంగాదత్తుడైన దేవపుత్రుడికి సోదరుడవుతాడు. మహాభారతంలో అవసరమైనప్పుడల్లా వచ్చి సలహాలనిచ్చి వెళ్తూ ఉంటాడు. ఒక స్త్రీ (ద్రౌపది) ఐదుగురికి ఆలిగా కావలసివచ్చినప్పుడు, అందులోని ధర్మసూక్ష్మాలను వివరిస్తూ రెండు పక్షాలవాళ్లనూ ఒడంబరిచినవాడు ఈయన. పాండవులకు ఎప్పటికప్పుడు ఏవిధంగా ముందుకు నడవాలో దిగ్దర్శనం చేసినవాడూ ఈయనే. యుద్ధంలో అభిమన్యుడు చిన్నవయస్సులోనే చనిపోయినప్పుడు ధర్మరాజూ అర్జునుడూ బెంబేలు పడి ఏడుస్తూ ఉంటే, వచ్చి ఓదార్చినవాడూ ఈయనే. వ్యాసుడికి పాండవులూ కౌరవులూ మనవళ్లే అయినా ఎవరిమీదా ఆయన వల్లమాలిన ప్రేమనూ చూపించడు, ద్వేషమూ కనబరచడు. రెండువైపుల వాళ్లకూ సలహాలనిస్తూ మంచిని చెబుతూ, చెడును తెగుడుతూ తన సర్వగురుత్వాన్ని నిలుపుకొన్నవాడు ఇతను. ఇతన్ని గురువనడానికి ఒక పెద్దకారణముంది. ఈ జగత్తులో ఉన్నదంతా ఎప్పుడూ ఒకేలా ఉండదు, క్షణక్షణమూ మారిపోతూ ఉంటుంది. అయితే, ఈ మార్పులన్నింటి వెనకా ఎప్పటికీ మారని తత్త్వం ఒకటి ఉంది. గాలుల వల్ల నీళ్లల్లో కెరటాలు పుడుతూ ఉంటాయి. కానీ ఆ కెరటాల రూపంలో ఉన్నవీ, వాటికి ఆధారంగా ఉన్నవీ అన్నీ ఒకే నీళ్లు. కెరటాలనూ కెరటాల వెనక ఉన్న నీళ్లనూ ఒకేసారి చూసి, ఇతరులకు చూపిస్తూ, కెరటాలు వేరూ, కిందనున్న నీళ్లు వేరూ అనే మోసంలో పడకుండా కాపాడే వాడే గురువు. వేడీ చలవా హాయీ బాధా మొదలైన జమిలి భావాలనూ, వేరువేరుగా అనిపించే వస్తువుల వెనకనున్న సత్యాన్ని సూక్ష్మదృష్టితో చూడగలిగిన వివేకాన్నీ ఆ మహాచైతన్యం ఏ భావంలో పొదిగిందో ఆ భావస్వరూపమే వ్యాసత్వమూ గురుత్వమూను. పరాశరత్వమంటే, గొప్పగా ఛిన్నాభిన్నం చేసే సామర్థ్యం. సత్యమనిపించే ఈ జగత్తులోని మార్పుల మాయనీ మోసాన్నీ వివేకంతో ఛిన్నాభిన్నంచేసి నిరూపించే తత్త్వమే ఈ వ్యాసగురుత్వం. సత్యవత్తుగా, అంటే, నిజం లాగే అనిపించే జడప్రకృతే సత్యవతి. గంగాదేవిని జ్ఞానప్రవాహ స్వరూపమైన ప్రకృతిగా ఇంతకుముందు చెప్పుకొన్నాం: స్వచ్ఛమైన ఆ ప్రకృతిని పరాప్రకృతి అని అంటారు. ఆ పరాప్రకృతే ఎదురుగుండా అవుపించని తన సంతానంతో ఈ సృష్టినంతనీ ధరించే జగద్ధాత్రి. తన రూపవిలాసాలతో మహర్షులక్కూడా రిమ్మతెగులు పుట్టించే మలిన ప్రకృతి అయిన సత్యవతే అపరాప్రకృతి. శాంతనుచైతన్యం ఈ సత్యవతీ ప్రకృతితో కలసి మంచీచెడుల జగన్నాటకాన్ని నడిపించడానికి నాందీ ప్రస్తావనలను చేసింది. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు Mb.No: 9000765972 -
గంగాశాంతనులు
ఐదోవేదం: మహాభారత పాత్రలు మహాభారతమనే కథ, కౌరవ పాండవులకు మూడు తరాల కింద నుంచి మొదలవుతుంది. నిజానికి, కౌరవులనే మాట అందరికీ సమానమైనదే. అందరూ కురురాజ వంశం వాళ్లే. మరి కౌరవశబ్దం పాండవులకు ఎందుకని వాడరు? ఎందుకంటే ‘కురు’ అనే మాటను ‘పనిచెయ్యడం’ అనే అర్థంలో వాడతారు. పనులు జరిగే చోటేమో శరీరం. శరీరానికి అంకితమైనవాళ్లు కౌరవులు. పండా అంటే బుద్ధీ జ్ఞానమూ గనక, పాండవులు, వంశరీత్యా కురువంశంవాళ్లే అయినప్పటికీ, బుద్ధికీ జ్ఞానానికీ ప్రతీకలు. ధర్మానికి అంకితమైనవాళ్లు గనక, పాండవుల్ని కౌరవ శబ్దాన్నుంచి వేరు చేశారు. సరే, ఇప్పుడు ఆ ముందుతరాల వైపు తిరిగి దృష్టి సారిద్దాం. ప్రతీపుడనే ఒక రాజు ఉండేవాడు. ఆయనకు వయసు మీరినా పిల్లలు కలగకపోవడంతో భార్యతో కలసి పిల్లలకోసం తపస్సు చేశాడు. ఆ దంపతుల తపఃఫలంగా ఒక పిల్లవాడు కలిగాడు. వయసు బాగా పైబడిన తరువాత కామం బాగా శాంతించిన తరువాత పుట్టాడు గనక, ఆ పిల్లాడికి ‘శాంతనుడ’ని పేరుపెట్టారు. అంతకుముందు ఒకసారి ప్రతీపుడొక్కడే గంగ ఒడ్డున కూర్చొని ఉండగా, గంగానదే, ఒక అందమైన అమ్మాయి రూపాన్ని దాల్చి, అతని కుడి తొడమీద కూర్చుని ‘నన్ను పెళ్లి చేసుకో’మని కోరింది. శాస్త్రం ప్రకారం కుడి తొడ మీద కూర్చునేవాళ్లు కొడుకులూ కూతుళ్లూ కోడళ్లూ అవుతారు; ఎడమ తొడమీద కూర్చునేవాళ్లే భార్యలుగా కావడానికి తగినవాళ్లు. ప్రతీపుడు ఈ మాటనే చెప్పి, మా పిల్లాడికి నువ్వు పెళ్లానివి అవుదుగానిలే అని ఆవిడను ఒప్పించాడు. ప్రతీపుడికి పుట్టిన శాంతనుడు అంతకుముందు జన్మలో మహాభిషుడనే రాజు. అతను ఒకసారి బ్రహ్మసభకు వెళ్లినప్పుడు, అక్కడకు వచ్చిన గంగాదేవిని చూసి మోహంలో పడ్డాడు. బ్రహ్మ ఎదురుగుండానే అతను కామమోహితుడిగా కనిపించడం వల్ల, ‘నువ్వు మనుషుల్లో పుట్టి తిరిగి బ్రహ్మలోకానికి రాగలుగుతావు’ అని శపించాడు బ్రహ్మ. ‘గంగ అంటే మహామోహంలో పడ్డావు గనక, నువ్వు మనుషుల లోకంలో పుట్టినప్పుడు, ఆవిడే నీకు ప్రతికూలంగానూ, అప్రియంగానూ ప్రవర్తిస్తుంది’ అని శాపాంతమూ చెప్పాడు. బ్రహ్మ లోకం నుంచి తిరిగి వెళ్తూన్నప్పుడు గంగాదేవికి దిగాలు ముఖాలతో కాళ్లీడ్చుకుంటూ వెళ్తూన్న అష్టవసువులు అగుపడ్డారు. ఆ ఎనిమిది మంది వసువుల్లో ద్యుమంతుడనేవాడు (ఇతన్ని ప్రభాసుడని కూడా చెబుతూ ఉంటారు) భార్య మెప్పు కోసం వశిష్ఠ మహర్షి హోమధేనువును ఇతర వసువుల సాయంతో దొంగిలించుకొని వచ్చాడు. ఇంతట్లో వశిష్ఠుడు ఫలాలూ సమిధలూ తీసుకొని రానేవచ్చాడు. తన నందినీ ధేనువూ, దాని దూడా అక్కడ కనిపించలేదు. దివ్యదృష్టితో వసువుల నిర్వాకాన్ని కనిపెట్టి, వాళ్లందర్నీ మనుషులుగా పుట్టమని శపించాడాయన. మనుషుల్లో పుట్టడమంటే పనులు చేయడమూ వాటివల్ల వచ్చిపడే బంధనాల్లో చిక్కుకోవడమూ అనే వరస నిరంతరమూ జరుగుతూ ఉంటుంది. ఆ చిక్కుల నుంచి బయటపడాలంటే చాలా కష్టాలే పడాలి. శాపం గురించి విని, వాళ్లందరూ వచ్చి వశిష్ఠుణ్ని ప్రసన్నం చేసుకొందామని ఆయన్ను బతిమాలుకొన్నారు. ‘మీరందరూ ప్రతి సంవత్సరమూ ఒక్కొక్కళ్ల చొప్పున శాపమోక్షాన్ని పొందుతారు గానీ, ఈ ద్యుమంతుడు అసలైన నేరస్థుడు గనుక, ఇతను మాత్రం, తన కర్మ కారణంగా, చాలాకాలం పాటు మానుష లోకంలో ఉండవలసి వస్తుంది. ఇతనికి పిల్లలు కలగరు; తండ్రికి ప్రియాన్ని చేయడం కోసం స్త్రీ భోగాల్ని పూర్తిగా విడిచిపెడతాడు కూడాను. అయితే, ఇతను సర్వశాస్త్రాల్లోనూ విశారదుడవుతాడులే’ అని వశిష్ఠుడు వాళ్లకు చెప్పి పంపించాడు.దిగాలుపడి వస్తూన్న వసువులు గంగతో తమ శాప వృత్తాంతం చెప్పుకొని ‘ప్రతీపుడి కొడుకును మేము తండ్రిగా ఎన్నుకొంటాం. మమ్మల్ని నువ్వే మనుషుల లోకం నుంచి త్వరగా వెనక్కి తీసుకొని రావాలి’ అంటూ గంగను బతిమాలుకొన్నారు. ‘అయితే శాంతనుడితో నా సంగమం వమ్ము కాకుండా ఒక కొడుకైనా ఉండేలాగ ఏదో ఒక మార్గం చూడండి’ అని గంగ అడిగింది. ‘ఇదుగో ఈ ద్యుమంతుడు అతని దగ్గర ఉంటాడు. కానీ అపుత్రుడిగానే ఉంటాడు’ అని వసువులు గంగతో ఒప్పందం చేసుకొని ‘అమ్మయ్య’అని ఊపిరి పీల్చుకున్నారు. బ్రహ్మసభలో శాపాన్ని పొందిన మహాభిషుడే శాంతనుడిగా ప్రతీపుడికి పుట్టాడు. ప్రతీపుడు శాంతనుడికి పట్టంగట్టి అడవికి తపస్సు చేయడానికి వెళ్లాడు. పిల్లలకు ఏళ్లొచ్చి తమ పొల్లు తాము పోసుకొంటూ ఉన్నప్పుడు, పెద్దలు ఆస్తులన్నీ పంచిపెట్టి, మన అందరికీ మూలమైన మహాచైతన్యాన్ని వెదుక్కోవడానికి ఈ మాయాలోకం నుంచి దూరంగా వెళ్లి ప్రయత్నించాలి. అందుచేతనే బ్రహ్మచర్యమూ గృహస్థుగా ఉండటమూ ఆమీదట ఈ వానప్రస్థమూ, అంటే, ప్రతీపుడి మాదిరిగా వనానికి వెళ్లి తపస్సు చేయడమూ చివరికి సన్యాసమూ ఏర్పడ్డాయి. శాంతనుడు రాజయ్యాడు. వినోదం కోసం వేటకు వెళ్లడం రాజులకు ఒక అలవాటు. క్రూరమృగాల్ని చంపడమూ తిండికి పనికివచ్చే జంతువుల్ని మితంగా చంపడమూ ఈ వేటలో జరుగుతూ ఉంటుంది. దుప్పుల్నీ దున్నల్నీ చంపుతూ శాంతనుడు అక్కడున్న గంగానది ఒడ్డుకు సేదదీరడానికి వచ్చాడు. ఆ ఒడ్డుమీదకే గంగాదేవి ఊరకనే, ఏ ఉద్దేశమూ లేకుండానే, ఒక స్త్రీ రూపంలో వచ్చింది. ఇద్దరి కళ్లూ కలిశాయి; ప్రేమ పొటమరించింది. అయితే, గంగాదేవి పెళ్లికి ఒక షరతు పెట్టింది: ‘నేనేం చేసినా, అది శుభమైనది గానీ అశుభమైనదిగానీ నువ్వు అడ్డు చెప్పకూడదు. నాకు వ్యతిరేకంగా కానీ, అప్రియంగా గానీ నువ్వేమీ మాటలాడకూడదు. అడ్డు పడినా, అప్రియంగా మాట్లాడినా నేను నిన్ను విడిచివెళ్లిపోతాను. దీనికి తిరుగుండదు’ అని. ఆమె ఎవరో తెలియకపోయినా, ఆవిడగారి రూపవిమోహంలో పడ్డ శాంతనుడు ఏం జరగబోతోందో పిసరంతైనా ఆలోచించకుండా అన్నిటికీ ఒప్పేసుకొన్నాడు. అంతేమరి, మోహంలో పడ్డవాడికెవడికైనా ఇంగిత జ్ఞానం చక్కాపోతుంది. ప్రతి ఏడాదీ కన్న ప్రతి కొడుకునీ ‘ఇదుగో, నీకు చెప్పినట్టుగా నిన్ను శాపం నుంచి విముక్తుణ్ని చేస్తూ నిన్ను ప్రసన్నుణ్నిగా చేస్తున్నాను’ అంటూ గంగ నీళ్లల్లో ముంచుతూ ఉండేది. ఇలాగ ఏడుగురు కొడుకుల్ని పొట్టనబెట్టుకొన్నా, ఆవిడ ఎక్కడ విడిచివెళ్లిపోతుందోనన్న భయంతో శాంతనుడు పల్లెత్తు మాట కూడా అనలేదు. కానీ ఎనిమిదోవాణ్ని కూడా అలాగే కసాయిదానిలాగ తీసుకొనిపోతూ ఉంటే, శాంతనుడు ఉండబట్టలేక ‘వీణ్ని చంపకు. ముక్కుపచ్చలారని పిల్లల్ని ఇంత నిర్దయగా చంపే అసలు నువ్వెవత్తివి? ఎవరి పిల్లవి? నీ పిల్లల్ని నువ్వే నిర్దాక్షిణ్యంగా, కంట తడి కూడా పెట్టకుండా చంపుతున్నావేమిటి? పసిపిల్లల్ని చంపినందుకు నువ్వు చెప్పలేనన్ని ఏళ్లు నరకంలో ఉండవలసి వస్తుంది’ అని అంటూ ఆవిణ్ని అడ్డగించాడు. ‘నీకూ నాకు చెల్లిపోయింది గనకనే ఇలాగ అడ్డుపడ్డావు. ఈ పిల్లవాణ్ని చంపనులే. నేను మహర్షులందరూ శ్రద్ధగా సేవించే గంగానదిని. ఒక దేవకార్యాన్ని సిద్ధింపజేయడానికి నేను నీతో పాటు ఇన్నాళ్లున్నాను. ఈ గంగాదత్తుణ్ని నువ్వు ఉంచుకో’ అని చెబుతూ ఆవిడ నదీరూపంతో ఒకటైపోయింది. గంగ ఇచ్చిన ఆ గంగాదత్తుడే భీష్ముడు. ‘ఇతగాడికి పిల్లలుండరు; ఇతను పెళ్లిచేసుకోడు’అని చెప్పడానికి కారణంగానే వసువులు చేసిన దొంగతనం కథను చెప్పడం జరిగింది. శాంతనుడు పుట్టడానికి మూలకారణంగా బ్రహ్మసభలో జరిగిన కథను చెప్పారు. గంగాదేవి ఆవిడకుగా ఆవిడే, ఎవరి ప్రమేయమూ లేకుండానే బ్రహ్మసభకు వచ్చింది; ప్రతీపుడి కుడి తొడమీద కూర్చొంది; వేటాడి ఒడ్డున సేదదీరుతూన్న శాంతనుడి దగ్గరికీ వచ్చింది. ప్రతిదానికీ, మనకు తెలిసినా తెలియకపోయినా, మనం చేసిన ఏదో ఒక పనే కారణమవుతూ ఉంటుందని చెప్పడానికే ఈ రకంగా కథలో కథల్ని అల్లుతూ ఉంటాడు వ్యాసుడు. నిజానికి ఈ కథల వెనక ‘దేవకార్యం’ (సృష్టి) ఒకటి సిద్ధించడానికి పథకం అల్లడం జరిగింది. మహాభిషమంటే అన్నీ దేనిలో చివరికి విశ్రాంతిని పొందుతాయో ఆ పరమస్థానం. ‘బ్రహ్మ’ అనే పదానికి పెంపొందడమని అర్థం. అన్నిటికీ అంతమైన దివ్యవస్తువులో, సృష్టిని చేసి పెంపొందించాలన్న కోరిక పుట్టుకొని వచ్చింది. అక్కడికి ఒక కారణమంటూ ఏమీ లేకుండానే ఊరకనేగంగానది ఒక రూపాన్ని దాల్చి వచ్చింది. ‘గం’ అన్నా, ‘గా’ అన్నా వెళ్తూ ఉండటమని అర్థం. అంటే, ఎప్పుడూ ఆపుదల లేకుండా జరిగే సృష్టి ప్రవాహాన్ని నడిపే స్వచ్ఛమైన ప్రకృతి. అన్నిటికీ చివరి మజిలీ అయిన దివ్యుడికి సృష్టిగా, అంటే, చాలామందిగా పెంపొందాలనే కోరిక పుట్టడంతోనే, దానంతట అదే, అతనిలోంచే, అతని సొంత భావమనే ఆపరాని ప్రవాహం ఒకటి ఆకర్షించే ఒక గొప్ప రూపాన్ని ధరించి ‘ప్రకృతి’గా ఎదురు అవుపించింది. ‘ప్ర’ అంటే గొప్పది; ‘కృతి’ అంటే, తయారైన ఒక ఆకారం. అన్నిటికీ చివరి స్థానమైన దివ్యత్వం, లేక, చైతన్యం ఒకటిగా ఉండక ‘అనేకం’గా అవుదామని అనుకోవడమే ‘ప్రతీపత్వం’, వ్యతిరేకత్వం, తనకు తాను విరుద్ధంగా ప్రవర్తించడం. ఏకత్వానికి వ్యతిరేక భావమే అనేకత్వం. మహాచైతన్యానికి ఏ కొరతా ఉండదు. దానికి అనేకంగా కావాలని కోరిక పుట్టడమే అన్ని వికారాలూ శాంతించిన ‘శాంతన’ చైతన్యానికి ఎదురుగా గంగానది అనే ప్రకృతి రూపుగట్టడమూ, ఆ చైతన్యానికి జత కడదామని అనిపించడమూను. ఆ మహాచైతన్యం కొన్ని దివ్యశక్తుల ద్వారా ఈ అనేకత్వమనే సృష్టి నాటకాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ శక్తుల్లోవే వసువులు, సృష్టిని నివసింపజేసేవాళ్లు. ఈ ఎనిమిదింటిలో ఏడు ఎదురుగుండా అవుపించకుండానే పనిచేస్తూ ఉంటాయి. అవి కనిపించకుండానే పనిచేస్తూ ఉంటాయని చెప్పడానికే, గంగ తన ఏడుగురు కొడుకుల్నీ తన ప్రవాహంలో ముంచిందని చెప్పారు. పుట్టినదేదైనా నిలిచి ఉండాలంటే, దాంట్లో ‘నేనున్నాన’నే భావం ఉండాలి. ఆ భావమే ప్రకృతి మనకు ఇచ్చిన, మనలో మిగిల్చిన, అంటే, ‘గంగాదత్తమైన’ అహంభావం, ‘నేనున్నాన’నే భావం. ఈ ‘నేను’ అనే భావానికి మగా ఆడా అనే తేడా లేదు; అదే రెండూను. ఈ రెండూ సమంగా ఉంటే, పెళ్లి అవసరమే ఉండదు; అంచేత దానికింక పిల్లలు కలగరు. అహంకారం దానంతట అదే చావాలి; ఎవ్వరూ చంపలేరు. దాన్నే ‘స్వచ్ఛంద మరణమ’ని అంటారు. అదే భీష్ముడు తన తండ్రి నుంచి స్వచ్ఛంద మరణం పొందడమనే వరం వెనుక ఉన్న మర్మం. - డాక్టర్ ముంజులూరి నరసింహారావు