అశ్వత్థామ | Ashwatthama story | Sakshi
Sakshi News home page

అశ్వత్థామ

Published Sun, Oct 11 2015 12:01 AM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM

అశ్వత్థామ

అశ్వత్థామ

ఐదోవేదం: మహాభారత పాత్రలు - 19
అశ్వత్థామా బలిచక్రవర్తీ వ్యాసుడూ హనుమంతుడూ విభీషణుడూ కృపాచార్యుడూ పరశురాముడూ అనే ఏడుగుర్నీ చిరంజీవులని చెబుతారు. అశ్వత్థామ ద్రోణుడికీ కృపికీ పుట్టాడు. కర్ణుడు సహజమైన కవచకుండలాలతో పుట్టినట్టుగా, ఇతను తలమీద మణితో పుట్టాడు. ఈ మణి వల్లనే అతనికి శస్త్రాల వల్ల గానీ వ్యాధుల వల్ల గానీ ఆకలి వల్ల గానీ ఏ రకమైన భయమూ ఉండేది కాదు. అంచేత ముంద ర్నుంచీ దుందుడుకుగానూ చపలత్వంతో క్రూరుడిగానూ ఉండేవాడు.

ఇతను పుడు తూనే గుర్రంలాగ గట్టిగా బలంగా (‘స్థామ’) నలుదిక్కుల్లోనూ ప్రతిధ్వనించే లాగ సకిలించాడు గనకనే ‘అశ్వత్థామ’ అయ్యాడని భారతంలో నిర్వచనం. దీనితో ఇతను చిరంజీవి ఎలాగయ్యాడన్నది మనకు అర్థంగాదు. ఇతని తండ్రి ద్రోణుడు సంస్కారానికీ అలవాటుకీ ప్రతీక. మేనమామ కృపుడు అవిద్యకు, అంటే, తప్పుగా అర్థం చేసుకోవడానికి ప్రతీక. తల్లి కృపి కూడా ఆవిడ అన్నగారిలాగే అవిద్యకే గుర్తు.

ద్రోణుడు పోయిన తరువాత ఈవిడ అశ్వత్థామ కోసం బతికే ఉంది. అవిద్య నుంచే అహం కారం పుడుతుంది. ఆ అహం కారం నుంచి భోగించాలనే కోరిక పుడుతుంది. భోగించడానికి సాధనాలు ఇంద్రియాలు. కోరికతోనే ఇంద్రియాలు విషయాలతో కలుస్తాయి. ఈ కలయికే మంచీ చెడు పనులకు దారితీస్తుంది. ఆ పనుల ఫలితాలే అలవాట్లూ సంస్కారాలూను. అవి కొత్త కొత్త కోరికల్నీ వాటికి ఫలాలైన వాసనల్నీ పుట్టిస్తూ, ఎప్పటికీ పోకుండా ఒక జన్మ నుంచి మరోజన్మకు వాటిని రవాణా చేస్తూ, దానికిగా అదే నడవగలిగే ఒక చక్రాన్ని తయారుచేస్తాయి.

స్వయంగా తనను తాను పోషించుకొనే ఈ చక్రమే మన లోపల దాక్కొని ఉండే కోరిక. దీన్నే గుప్తమైన కోరిక, కోరికల వల్ల పుట్టిన విత్తనమూ అంటారు. వాసనల వల్ల పుట్టిన ఈ గుప్తకామమనే ఆశయమే అశ్వత్థామ - లోపల శయనించి ఉండే కోరిక. ‘అశూజ్’ అనే క్రియకు ‘పోగు’ అనే అర్థం ఉంది. పోగై ఒకానొక ప్రత్యేక మైన స్థితిలో ఉండి (‘స్థా’) ఎడ తెరిపిలేకుండా కొనసాగే కోరికే అశ్వత్థామ. పోగై, మార్పులేకుండా ఉంటూ చావుతో కూడా చావకుండా జన్మజన్మాంతరాలకు కొనసాగుతూ, లోపల శయనించి ఉండే చిరంజీవమైన కోరిక బీజమే ఆశయమనే అశ్వత్థామతత్త్వం.
 
ఇంతటి చిరంజీవి చనిపోయాడన్న పుకారు, ఇతని నాన్న ద్రోణుడు చనిపోవ డానికి కారణమైంది. అంటే, ఆశయం కాలిపోతే, వాసనలూ సంస్కారాలూ అస్త్రసన్యాసం చేసి వాటంతట అవే చచ్చి పోతాయన్నమాట. అప్పటికప్పుడు పుట్టే క్రియాశీలకమైన కోరికకు అవచేతనలో వేరులుండవు. ఇది మొదట పుట్టినప్పుడు అంత శక్తిమంతంగా ఉండదు గనుకనే దీన్ని ఇచ్ఛాశక్తితో అణచుకోవచ్చు. ప్రతి కోరికా, అది తీరినా తీరకపోయినా మరో కోరికను కంటూనే ఉంటుంది.

ఎంత తీరినట్టనిపించినా కూడా కోరికలో ఎంతో కొంత తీరని శేషం ఉండనే ఉంటుంది. అహంకారం ప్రేరేపించే క్రియాశీలకమైన కోరికలనుంచే కోరికల విత్తులు పుడుతూ ఉంటాయి. తీరని ప్రతి కోరికా ప్రజ్ఞాన మనే అగ్నిలో వేగకపోతే, మనస్సులో అది ఒక కొత్త కోరిక విత్తును విత్తుతూనే ఉంటుంది. ఈ విత్తులు అప్పటికప్పుడు పుట్టే కొత్త కోరికలకన్నా ఎక్కువగా నిర్బంధిస్తూ ఉంటాయి.
 
ఆశయాలు ఎప్పుడు బయటపడ తాయో చెప్పలేం. అవి బయటికి మొలిచినప్పుడు మనను బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అశ్వత్థామశక్తి అలాగ ఆద్యంతమూ బాధించేదీ ప్రాణాంతకమైన దీను. అభిమన్యుణ్ణి అన్యాయంగా చంప డంలో ఇతని పాత్ర కూడా ఉంది. ద్రోణుణ్ణి దృష్టద్యుమ్నుడు చంపిన తరువాత, అశ్వత్థామ చెలరేగి యుద్ధం చేశాడు. మొత్తం పాండవసైన్యాన్ని ఒక్కసారిగా నాశనం చేద్దామని నారాయణాస్త్రం వేశాడు. ఆ అస్త్రం ఎన్నో బాణాల్నీ చక్రాల్నీ గదల్నీ ఒక్కసారిగా చుట్టుముట్టేలాగ చేస్తుంది.

దానికి విరుగుడు, ఆయుధాల్ని విడిచిపెట్టి రథం నుంచి కిందికి దిగి లొంగి పోవడమే. శ్రీకృష్ణుడికి ఈ విషయం తెలుసు గనక, అందర్నీ రథాల నుంచి దిగి ఆయుధాల్నీ విల్లమ్ముల్నీ విడిచిపెట్టమని చెప్పాడు. భీముడు, అది తన వీరత్వానికి తగదనుకొన్నాడు. బాణాలు చుట్టుముడు తూన్నా యుద్ధం చేసి వాటిని పోగొట్టు కుందామనే ప్రయత్నిస్తూ తాత్సారం చేశాడు. అప్పుడు నరనారాయణులైన కృష్ణుడూ అర్జునుడూ వెళ్ళి, అతన్ని బలవంతంగా కిందికి దించి విల్లమ్ముల్ని కింద పడవేయించారు. అర్జునుడు ఆ అస్త్రానికి ఎదురు వేయొచ్చుగా అని మనకు అనిపిస్తుంది. కానీ నారాయణాస్త్రానికీ గోవులకీ బ్రాహ్మణులకీ ఎదురుగా బాణం వెయ్యకుండా గాండీవాన్ని కింద పెట్టేయాలన్నది అర్జునుడి వ్రతం.
 
ఈవిధంగా నారాయణాస్త్ర ప్రయోగం విఫలమైన తరవాత, దుర్యోధనుడు అశ్వత్థామని దాన్ని తిరిగి ప్రయోగించమని ప్రోత్సహించాడు. అప్పుడు అశ్వత్థామ రెండోసారి ప్రయోగించరాదని చెప్పి, ఆ మీద ఆగ్నేయాస్త్రాన్ని వేశాడు. దాని మంటలకు చాలామందే ఆహుతైపోయారు. కృష్ణార్జు నులు కూడా మసి అయిపోయారని అశ్వత్థామ అనుకొన్నాడు. కానీ, వాళ్ళు చెక్కుచెదరకుండా బయటపడడం చూసి, హతాశుడైపోయాడు.

ఆ సమయంలో వ్యాసుడు అవుపించి, యుద్ధదేవత అయిన రుద్రుణ్ణి పూజించడంలో శ్రీకృష్ణార్జునులకీ అశ్వత్థామకీ మధ్య తేడా చెప్పాడు: ‘నువ్వు రుద్రప్రతిమకు పూజచేస్తూ వచ్చావు; వాళ్ళేమో రుద్రలింగానికి పూజచేస్తూ ఉంటారు’. లింగం ఒక రూపం లేనిది గనక, సర్వరూపుణ్ణి కొలిచినట్టవుతుంది; ప్రతిమ అనేసరికల్లా ఒకే రూపం గనక,  సర్వోపగతత్వానికి పూజచేసినట్టుగాదు. రుద్రుడన్నా అగ్ని అన్నా ఒకటే. వాస్తవ మైన రుద్రతత్త్వాన్ని కొలవడంవల్లనే వాళ్ళిద్దర్నీ అగ్ని ఏమీ చేయలేదు.
 
దుర్యోధనుడు తొడలు విరిగి నేలమీద పడి ఉన్నప్పుడు, అశ్వత్థామా కృతవర్మా కృపాచార్యుడూ అతని దగ్గరికి వెళ్ళారు. అతను అశ్వత్థామ కసికి మెచ్చుకొంటూ అతన్ని సేనాపతిగా చేశాడు. ఆ ముగ్గురూ విజయోత్సాహంతో ఉన్న పాండవసేనకు అవుపడకుండా గడపాలని, ఆ రాత్రికి అడవిలోకి వెళ్ళారు. మర్రిచెట్టుకింద పెద్దవాళ్ళిద్దరూ నిద్రపో యినా, అశ్వత్థామకు మాత్రం కునుకు పట్టలేదు. ఆ చెట్టుమీదకి ఒక పెద్ద గుడ్ల గూబ వచ్చి, అక్కడి గూళ్ళల్లో నిద్రపో తూన్న కాకులదండుని చంపింది.

ఈ మారణకాండను చూసిన అతనికి, తన తండ్రిని చంపిన ధృష్టద్యుమ్నుణ్ణీ ఇతర పాంచాల దేశస్థుల్నీ చంపుదామన్న క్రూరమైన ఆలోచన వచ్చింది. అంతే. ఆ ఇద్దర్నీ లేపి, తన నిశ్చయాన్ని చెప్పాడు. ఆదమరచి నిద్రపోయేవాళ్ళనూ నిరాయుధుల్నీ చంపడం న్యాయం కాదు గనక, ఆపని పొద్దున్న చేద్దామన్న మేనమామ మాట అతనికి నచ్చలేదు. అతను బయలు దేరితే, ఇక చేసేదిలేక, వాళ్ళిద్దరూ కూడా అతని వెంట వెళ్ళారు. అక్కడ పాంచాల శిబిరం దగ్గర అశ్వత్థామ మహాద్భుతుడైన ఒక పురుషుణ్ణి చూశాడు.

భయపడకుండా అతనిమీద ఎన్నెన్నో శస్త్రాల్ని వేశాడు. కానీ అవన్నీ అతనిలో లీనమైపోయాయి. తన దగ్గరున్న అస్త్రశస్త్రాలన్నీ అయిపోయిన తర వాత అతనికి తన క్రూరమైన నిశ్చయాన్ని దండించడానికి మహాదేవుడే దిగి వచ్చా డని అనిపించింది. తక్షణమే రుద్రుణ్ణి స్తుతి చేయడం మొదలు పెట్టాడు. చివరికి తనను తాను రుద్రచరణాల్లో బలిగా అర్పించుకోడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ఎదురుగా ఉన్న వేదిమీద అగ్ని మండుతూ అవుపించింది. అశ్వత్థామ వెనుదీయకుండా ఆ అగ్నిలోకి దూకి కూర్చున్నాడు.

అప్పుడు మహాదేవుడు, ‘శ్రీకృష్ణుణ్ణి సమ్మానిస్తూ పాంచాలుల్ని ఇంతదాకా నేను రక్షిస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు వాళ్ళ కాలం దగ్గరపడింది’ అని చెబుతూ, తానే అశ్వత్థామను ఆవేశించి, ఒక ఖడ్గాన్ని అందించాడు. శిబిర ద్వారం దగ్గర తతిమ్మా ఇద్దరూ ఎవరూ బయటికి పోకుండా కాపలా కాస్తూ నిలుచున్నారు. అశ్వత్థామ లోపలికి పోయి ముందస్తుగా నిద్రపోతున్న ధృష్టద్యుమ్నుణ్ణి జుట్టుపట్టు కొని లేవదీసి, పశువును చంపినట్టు చంపాడు.

ఇంతలో మెలకువ వచ్చి మీదకు వచ్చిన ఇతర యోధుల్ని రుద్రా స్త్రంతో ఊచకోత కోశాడు. ఆ మీద నిద్రపో తూన్న ద్రౌపది కొడుకుల్ని ఒక్కొక్కడినీ నరికేశాడు. శిబిరం ఇవతలకు వచ్చి తాను చేసిన ఘనకార్యాన్ని మేనమామకూ కృతవర్మకూ గొప్పగా చెప్పాడు. తిరిగి ఆ ముగ్గురూ అడవికి వెళ్ళిపోయారు. ఇతని కసినీ ఆలోచన లేనితనాన్నీ ఎరిగినవాడు గనకనే తండ్రి ఇతనికి మనుషుల్లో ప్రయో గించకూడని బ్రహ్మశిరమనే అస్త్రాన్ని ఈయలేదు.

అర్జునుడికి ఇచ్చాడని ఇతను కొంచెం మారాం చేస్తే ఉపసంహారాన్ని చెప్పకుండా ద్రోణుడు ‘నువ్వు దీన్ని చపలభావంతో వెయ్యకూడద’ని మరీ చెప్పి ఆ అస్త్రాన్నిచ్చాడు. ఒకసారి శ్రీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, నీ చక్రాన్ని నాకియ్య మంటూ తలబిరుసుతనాన్ని చూపించాడు. ‘తీసుకో’ అంటే, దాన్ని ఎత్తలేకపోయాడు.
 
కొడుకుల్ని చంపాడనగానే భీముడు అశ్వత్థామ వెంటపడ్డాడు. భీముణ్ణి బ్రహ్మ శిరోనామకాస్త్రం నుంచి కాపాడాలని శ్రీకృష్ణుడు యుధిష్ఠిర అర్జునులతో సహా వెళ్ళాడు. అశ్వత్థామ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని వేసేశాడు. శ్రీకృష్ణుడు చెప్పగా దానిమీదకు మళ్ళీ ఆ అస్త్రాన్నే అర్జునుడు వేశాడు. వ్యాసుడూ నారదుడూ ఆ ముప్పును ఆపడానికి వచ్చారు. ‘ఈ అస్త్రాన్ని మనుషుల మీద వెయ్యకూడదు. దాన్ని మరో అస్త్రంతో నాశనం చేద్దామని చూస్తే, ఆ ప్రదేశంలో 12 ఏళ్ళపాటు వర్షాల్లేక మనుషులు అల మటిస్తారు. కనక, మీరిద్దరూ వాటిని ఉప సంహరించండి’ అని వ్యాసుడు ఆదేశిం చాడు.

అర్జునుడు ఆ పని చేశాడుగానీ, అశ్వత్థామకు అది చేతగాలేదు. వ్యాసుడు చెప్పగా తన మణిని తీసి ఇస్తూ, అపాండవం గావాలని విసిరిన ఇషీకాన్ని పాండవేయుల గర్భం మీదకు మళ్ళిం చాడు. అది విని శ్రీకృష్ణుడు ‘నువ్వు నా చక్రాన్ని అడిగినప్పుడే నీ క్రూరత్వం అర్థమైంది. ఉత్తరాగర్భంలో ఉన్న పరీ క్షిత్తును నీ అస్త్రం కాల్చినా నేను మళ్ళీ ప్రాణం పోస్తాను. అతను పాండవుల తరువాత పరిపాలిస్తాడు. నీ క్రూరత్వానికి ఫలాన్ని పొందు. మూడు వేల సంవత్స రాలు భూమ్మీద ఒంటరిగా నిర్జనవనాల్లో తిరుగు. నీ శరీరం నుంచి చీమూ నెత్తుర్ల వాసన వస్తూండగా కీకా రణ్యాల్లో నువ్వు ఉండవలసి వస్తుంది’ అంటూ శపించాడు.
 
అశ్వత్థామ శక్తిహీనుడై నిర్జన ప్రదే శాల్లో ఉండడమంటే యోగపరంగా గొప్ప అర్థముంది. సాధకుడు ముక్తిని పొంది దివ్యచైతన్యంలో ప్రతిష్ఠితుడై ఉన్నప్పుడు అతని కోరికలు, పర మాత్మ తాలూకు ‘కోరికగాని కోరిక’లాగ అయి, అతన్ని లోబరుచుకోలేని స్థితిలో ఉంటాయి. అంటే, ఆశయాన్నుంచి విడివడి ఈశ్వర త్వాన్ని పొందుతాడు ఆ సాధకుడు.      
- డా॥ముంజులూరి నరసింహారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement