Ashwatthama
-
కాంప్లెక్స్‌గా మందిరం.. అశ్వత్థామగా వినాయకుడు, వీడియో వైరల్
దేశ వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఎప్పటి మాదిరే ఈ సారి కూడా స్టార్ హీరోలకు సంబంధించిన సినిమా పాత్రలపై స్పెషల్ వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ పుష్ప 2, ఎన్టీఆర్ దేవరతో పాటు పలువురి స్టార్ హీరోల లుక్‌లో ఉన్న గణపతి బొమ్మలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ‘కల్కి’ రూపంలో ఉన్న వినాయకుడే ఈ ఏడాది స్పెషల్ అట్రాక్షన్ నిలిచాడు.కాంప్లెక్స్‌గా మందిరం.. అశ్వత్థామగా వినాయకుడుప్రభాస్ హీరోగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ ఏడాది జూన్ 27న విడుదలై..బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇందులో భైరవగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్, యాస్కిన్‌గా కమల్ నటించారు. ఈ సినిమా చూసిన వాళ్లకు ప్రత్యేక కారు ‘బుజ్జి’, కాంప్లెక్స్ ప్రదేశాలు అలా గుర్తిండిపోతాయి. ఇప్పుడు ఇదే సినిమాను పోలిన ఓ గణపతి మందిరం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వినాయకుడు అశ్వత్థామ రూపంలో ఉండగా.. మందిరం కాంప్లెక్స్ ప్రదేశంలా ఉంది. ‘కల్కి’వినాయకుడు ఎక్కడ ఉన్నాడు?‘కల్కి’ వినాయకుడి విడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అసలు ఈ మందిరం ఎక్కడ ఏర్పాటు చేశారని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ వెరైటీ వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేసింది తమిళ ప్రజలే. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఈ మందిరం ఉన్నట్లు తెలుస్తోంది. కాంప్లెక్ మాదిరి మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్‌లో బుజ్జిని కూడా ఉంచారు. లోపల యాస్కిన్ లుక్‌లో ఉన్న కమల్ బొమ్మ పెట్టి.. అమితాబ్ అశ్వత్థామ లుక్‌లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, నుదుటిపై మణి వెలిగిపోతున్నట్లు ఓ లైట్ కూడా సెట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఏడాది స్పెషన్ వినాయక విగ్రహం ఇదేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. #wow pic.twitter.com/54ssb41OTm— devipriya (@sairaaj44) September 9, 2024 -
Dupe: ఏడడుగుల అశ్వత్థామ
ఏడడుగుల అశ్వత్థామ‘కల్కి’ సినిమాలో అశ్వత్థామ మనందరికీ నచ్చాడు కదా. అమితాబ్ బచ్చన్ ఆ పాత్రలో కనిపిస్తాడు. ద్వాపర యుగం నాటి పాత్ర కాబట్టి సినిమాలో మిగిలిన అన్ని పాత్రలు ఇప్పటి ఎత్తులో ఉన్నా అమితాబ్ 7 అడుగుల ఎత్తులో ఉంటాడు. కాని సినిమాల్లో అన్ని సన్నివేశాల్లో హీరోలు యాక్ట్ చేయరు. వాళ్లకు డూప్స్ ఉంటారు. ‘కల్కి’లో కూడా అమితాబ్‌కు డూప్ ఉన్నాడు. అతని పేరు సునీల్ కుమార్. ఇక్కడ ఫోటోల్లో ఉన్నాడే... అతనే. ఇతని ఎత్తు ఏడు అడుగుల ఏడంగుళాలు. జన్యుపరమైన ఇబ్బందుల వల్ల ఇంత ఎత్తు పెరిగాడు. జమ్ము– కశ్మీర్లో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈ మధ్యనే సినిమాల కోసం ఇతణ్ణి ఉపయోగిస్తున్నారు. కల్కి సినిమా మొత్తం అమితాబ్‌కు డూప్‌గా నటించాడు. అమితాబ్ సునీల్‌ని చూసి ‘అరె... నేనే లంబు అనుకుంటే ఇతను నాకంటే లంబుగా ఉన్నాడే’ అని సరదాపడ్డాడట. సునీల్ కుమార్ ఇటీవల పెద్ద హిట్ అయిన ‘స్త్రీ2’లో కూడా ఉన్నాడు. అందులో ‘సర్కటా’ అనే దెయ్యం వేషం వేశాడు. షూటింగ్‌ల కోసం లీవ్ పెట్టి ముంబై, హైదరాబాద్ తిరగాలంటే సెలవు కొంచెం కష్టమైనా సినిమాల్లో నటించడం బాగనే ఉందని సంతోషపడుతున్నా సునీల్. -
అశ్వద్దామ అమితాబ్ నటనపై బాలీవుడ్ సైలెంట్..?
-
Archana Rao: అశ్వత్థామకు దుస్తులు కుట్టింది
అశ్వత్థామకు మరణం లేదు. మహాభారత కాలం నుంచి కల్కి వచ్చే కాలం వరకూ బతికే ఉండాలి. మరి అతను ఎలా ఉంటాడు? ఆ పాత్ర ధరించింది సాక్షాత్తు అమితాబ్ అయితే అతన్ని అశ్వత్థామలా మార్చే దుస్తులు ఎలా ఉండాలి?తెలుగు ఫ్యాషన్ డిజైనర్ అర్చనా రావు ‘కల్కి’ సినిమాకు చీఫ్ ఫ్యాషన్ డిజైనర్‌గా అద్భుతంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి ప్రశంసలు అందుకుంటోంది. హైదరాబాద్ నిఫ్ట్‌లో, న్యూయార్క్‌లో చదువుకున్న అర్చనా రావు పరిచయం.‘సినిమాకు పని చేయడంలో అసలైన సవాలేమిటంటే పేపర్ మీద గీసుకున్నది తెర మీద కనిపించేలా చేయగలగాలి. అందుకు టీమ్ మొత్తంతో మంచి కోఆర్డినేషన్లో ఉండాలి’ అంటుంది అర్చనా రావు.హైదరాబాద్‌కు చెందిన అర్చనా రావుకు ‘అర్చనా రావు లేబుల్’ పేరుతో సొంత బ్రాండ్ ఉంది. ఆమె దుస్తుల డిజైనింగ్ మాత్రమే కాదు ప్రాడక్ట్ డిజైనింగ్ కూడా చేస్తుంది. అంటే పాదరక్షలు, హ్యాండ్ బ్యాగ్‌లు, బెల్ట్‌లు... అన్నీ హ్యాండ్‌మేడ్. ఆమె సృజన మొత్తంలో తప్పనిసరిగా భారతీయత కనిపిస్తుంది.‘నాకు ఇండియన్ కళాత్మక విలువలంటే ఇష్టం. అవే నన్ను కల్కి సినిమా కాస్టూమ్ డిజైనింగ్‌లో గెలిచేలా చేశాయి. నేడు నా పనికి మంచి ప్రశంసలు అందుతుంటే ఆనందంగా ఉంది’ అందామె.నిఫ్ట్ స్టూడెండ్అర్చనా రావు హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఆమెకు ఇష్టంగా ఉండేది. ఏదో ఒక సృజనాత్మక రంగంలో చదువు కొనసాగించాలనుకున్నా స్పష్టత రాలేదు. ఇంటర్ ముగిసే సమయానికి హైదరాబాద్‌లో నిఫ్ట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) ఏర్పడింది. అందులో క్లాత్ డిజైనింగ్ కోర్సుకు అప్లై చేస్తే సీటు వచ్చింది. ‘కాలేజీలో చేరాక ఇదే నేను చదవాల్సింది అని తెలిసొచ్చింది. మన దగ్గర క్రియేటివిటీ ఉండటం ఒకటైతే చదువు వల్ల తెలిసే విషయాలు ఉంటాయి. నిఫ్ట్‌లో ఒక ఫ్యాబ్రిక్‌కు సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ పూర్తిగా తెలిసింది. ఫ్యాషన్ డిజైన్ చేయాలంటే ముందు ఫ్యాబ్రిక్‌ని కనిపెట్టాలి. అలా చదువు పూర్తయ్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం న్యూయార్క్ వెళ్లాను. న్యూయార్క్ నగరమే ఒక క్యాంపస్. ఏ మనిషిని చూసినా ఏ వీధిని చూసినా ఫ్యాషన్ కనపడుతూనే ఉంటుంది. నేను మరింత ఎదగడానికి న్యూయార్క్ ఉపయోగపడింది. అయితే నేను అమెరికాలో స్థిరపడాలనుకోలేదు. ఇండియా ఫ్యాషన్ రంగంలో పుంజుకుంటోంది. నా పని ఇక్కడే అని నిశ్చయించుకుని వచ్చేశాను. నా బ్రాండ్ మొదలెట్టాను’ అని తెలిపిందామె.మహానటితో...దర్శకుడు నాగ్ అశ్విన్ ఏదో సందర్భంలో పరిచయం కావడంతో అతను ‘మహానటి’ చిత్రం కోసం కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేయమన్నాడు. ‘అప్పటికి నాకు సినిమాలకు కాస్ట్యూమ్స్ ఎలా తయారు చేయాలో తెలియదు. కాని నాగ్ అశ్విన్ ప్రోత్సాహంతో మహానటిలో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌లకు కాస్ట్యూమ్స్ చేశాను. కథాకాలాన్ని బట్టి 1940ల నాటి ఫ్యాషన్లను, 1980ల నాటి ఫ్యాషన్లను స్టడీ చేయాల్సి వచ్చింది. సినిమాలకు కాస్ట్యూమ్స్ చేయడంలో ముఖ్యమైన సంగతి ఏమిటంటే లైట్ పడితే ఏ రంగు ఎక్కువ మెరుస్తుంది తెర మీద ఏ రంగు మృదువుగా ఉంటుందో తెలుసుకోవడమే. మహానటితో నేను పని తెలుసుకున్నాను. ఆ సినిమాకు నాకు జాతీయ అవార్డు రావడం మరింత సంతోషం’ అందామె.కల్కి సినిమాలో మహామహులకు...‘కల్కి సినిమా మొదలెట్టే ముందు నిర్మాత దగ్గర నాగ్ అశ్విన్ పెట్టిన మొదటి షరతు నన్ను చీఫ్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఉంచాలని. నా మీద నాగ్ పెట్టుకున్న నమ్మకం అది. నాలుగేళ్ల క్రితం అతను ఈ కథను చెప్పినప్పుడు చాలా పెద్దప్రాజెక్ట్ అని అర్థమైంది. అశ్వత్థామ పాత్ర గురించి చెప్తే ఎవరు చేస్తున్నారు అనడిగాను. అమితాబ్ అన్నాడు. దాంతో నాకు ఎక్కడ లేని నెర్వస్నెస్ వచ్చింది. ఆయనను అశ్వత్థామగా చూపించడం ఎలా? మహాభారత కాలం నుంచి ఆయన జీవించే ఉన్నాడంటే నా మనసులో వచ్చిన భావం మనిషిని చూడగానే ఒక పురాతన వృక్షాన్ని చూసినట్టు ఉండాలని. ఆయనకు వాడే దుస్తులను మళ్లీ మళ్లీ పరీక్షకు పెట్టి తయారు చేశాను. ఆయన ముఖానికి శరీరానికి ఉండే కట్లు రక్తం, పసుపు కలిసిపోయి ఏర్పడిన రంగులో ఉంచాను. మొదటిసారి అమితాబ్ నా కాస్ట్యూమ్స్ ధరించినప్పుడు అది సినిమా అని అక్కడున్నది సినిమా సెట్ అని తెలిసినా రోమాలు నిక్క΄÷డుచుకున్నాయి. ఇక ప్రభాస్ కోసం నేను డిజైన్ చేసిన సూట్‌ను కాలిఫోర్నియాలో తయారు చేయించాం. కమలహాసన్‌కు అయన వ్యక్తిగత డిజైనర్ సహాయంతో కలసి కాస్ట్యూమ్స్ చేశాను. సినిమాలో మూడు ప్రపంచాలుంటాయి. పిరమిడ్ సిటీలో కనిపించే ఆర్మీ కోసం కాస్ట్యూమ్స్‌ని మన దిష్టిబొమ్మల నుంచి ఇన్‌స్పయిర్ అయి చేశాను. కల్కి సినిమాకు అందరం కష్టపడి పని చేశాం. అది ప్రేక్షకులకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది’ అందామె. -
ఐటీ దాడులు: 22 బాక్సుల్లో రూ.42 కోట్లు
బనశంకరి(బెంగళూరు): బెంగళూరులో ఆదాయపన్ను(ఐటీ) శాఖ అధికారులు జరిపిన దాడుల్లో భారీగా సొత్తు బయటపడింది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ అశ్వత్తమ్మ, ఆమె భర్త ఆర్.అంబికాపతి, కూతురు, వారి బంధువుకు సంబంధించిన 10 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. అంబికాపతి ఇంట్లో మంచం కింద దాచిన 22 పెట్టెల్లో రూ.42 కోట్ల రూ.500 నోట్ల కట్టలు బయటపడినట్లు ఐటీ శాఖ తెలిపింది. త్వరలో తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లను కొనేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఇటీవల ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నై నుంచి బెంగళూరు మీదుగా భారీగా డబ్బును హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే విశ్వసనీయ సమాచారం మేరకు బెంగళూరులోని అశ్వత్తమ్మ కుటుంబీకులకు చెందినలో ఆర్టీ నగర్ తదితర ప్రాంతాల్లోని ఇళ్లలో గురువారం రాత్రి వరకు జరిపిన సోదాల్లో రూ.42 కోట్ల లభ్యమైనట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. కాగా, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అఖండ్ శ్రీనివాసమూర్తికి అశ్వత్తమ స్వయానా సోదరి. అశ్వత్తమ భర్త ఆర్.అంబికాపతి బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఈయనే గతంలో బీజేపీ ప్రభుత్వం ప్రతి పనికీ 40 శాతం కమీషన్ తీసుకుంటోందని ఆరోపణలు చేశారు. కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం కూడా ఇదే విధమైన ఆరోపణలు చేస్తూ దర్యాప్తు జరపాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాసింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. ఈ ఆరోపణలే బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌కు ఎన్నికల అస్త్రంగా మారాయి. మేలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలుకాగా , కాంగ్రెస్ భారీ మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ ఆరోపణలు.. తెలంగాణ ట్యాక్స్ పేరుతో బిల్డర్లు, బంగారం వ్యాపారులు, కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన రూ.1,500 కోట్లను కాంగ్రెస్ పొరుగు రాష్ట్రం నుంచి తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు పంపుతోందని తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ ఇటీవల ఆరోపించింది. ‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ డబ్బును భారీగా వెదజల్లుతోంది. టిక్కెట్లు సైతం అమ్ముకుంటోంది’అని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ కోట్ల రూపాయలను పంపుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సైతం ఆరోపణలు చేశారు. -
మరోసారి మెగా-నందమూరి కాంబో రిపీట్ కానుందా!
మహాభారతం ఆధారంగా బాలీవుడ్లో ‘ది ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ అనే మైథలాజికల్ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ దర్శకుడు ఆదిత్యా థార్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో హీరోగా తొలుత విక్కీకౌశల్, రీసెంట్గా రణ్వీర్ సింగ్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నారని బాలీవుడ్ టాక్. వారిద్దరిలో ఎవరో ఒకర్ని హీరోగా తీసుకునేందుకు పరిశీలిస్తున్నారా? లేక ఇద్దర్నీ ఈ సినిమాలో నటింపచేసేలా సంప్రదింపులు జరుపుతున్నారా? అనే విషయంపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. రోనీ స్క్రూవాలా నిర్మించనున్న ఈ సినిమాను ఇటీవల జీ స్టూడియో టేకోవర్ చేసిందని బీటౌన్‌లో ప్రచారం సాగుతోంది. అదేవిధంగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు సమంత పేరు పరిశీలనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరి.. ‘ది ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ చిత్రంలో ఫైనల్‌గా ఎవరు హీరోగా నటిస్తారు? అనే విషయంపై ఓ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
ఫస్ట్ లుక్: ఆయనకు మరణమే లేదు!
"ఉరి: ద సర్జికల్ స్టైక్".. కశ్మీర్‌లోని ఉరి స్టెకార్లలో 2016లో భారత ఆర్మీ సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటనకు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, పరేష్ రావల్, యామీ గౌతమ్, కీర్తి కుల్హరి తదితరులు పోషించారు. రూ.45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్లో రూ.342 కోట్లు రాబట్టింది. బాక్సాఫీసు దగ్గర ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా రిలీజై నేటికి సరిగ్గా రెండేళ్లవుతోంది. ఈ సందర్భంగా విక్కీ కౌశల్ ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాడు. ఇందులో అశ్వత్థామ తనను ప్రార్థించమని శివుడిని కోరగానే ఆయన ప్రత్యక్షమై ఓ ఖడ్గాన్ని బహుకరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. చూస్తుంటే ఓరకమైన భక్తితో ఒళ్లు గగుర్పొడుస్తున్న ఈ ఫస్ట్ లుక్ వైరల్‌గా మారింది. (చదవండి: రివ్యూ టైమ్: మాస్ మసాలా వయొలెంట్ క్రాక్) ఇక ఉరిని తెరకెక్కించిన ఆదిత్య ధరే ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా గురించి విక్కీ మాట్లాడుతూ.. ఆదిత్య కలలు గన్న ప్రాజెక్ట్ అశ్వత్థామ. ఇది కచ్చితంగా నటుడిగా నాకు మరింత గుర్తింపు తెచ్చిపెడుతుంది అని చెప్పుకొచ్చారు. దీనికి రోనీ స్క్రూవాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మహాభారతంలో కౌరవులకు, పాండవులకు యుద్ధ విద్యను నేర్పిన మహాగురువు ద్రోణాచార్య కుమారుడే అశ్వత్థామ. తండ్రి చేత మరణమనేదే లేని వరాన్ని ఎలా పొందాడు? తర్వాత జరిగిన పరిణామాలేంటి? అన్న విషయాలను ప్రధానంగా తెరకెక్కించనున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: కరోనా టీకా తీసుకున్న మొట్టమొదటి బాలీవుడ్ నటి) -
నాదం సృష్టించే చేతులు
తబల, మృదంగం వంటి చర్మవాద్యాల తయారీ అనాదిగా పురుషుల పని. కాని బెంగళూరుకు చెందిన అశ్వత్థమ్మ గత ఆరు దశాబ్దాలుగా ఈ కళలో ఆరితేరారు. నాదాన్ని సృష్టించే చేతులు స్త్రీలవి కూడా కాగలవని నిరూపించారు. భారతీయ సంప్రదాయ సంగీతంలో కొన్ని వందల వాద్య పరికరాలు ఉన్నాయి. అందులో కొన్ని తంత్రీ వాద్యాలైతే, కొన్ని చర్మ వాద్యాలు. వీటిని తయారుచేయటానికి ఎంతో కొంత సంగీత పరిజ్ఞానం ఉండాలి. స్వరస్థానాలను గుర్తించగలిగే శక్తి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఒక వాద్య పరికరం శృతిపక్వంగా తయారవుతుంది. ముఖ్యంగా తబలా, మృదంగం వంటివి తయారు చేయటం చాలా కష్టం. వాటి తయారీకి కలపతోపాటు జంతు చర్మాలను ఉపయోగిస్తారు. సాధారణంగా వీటిని మగవారే తయారుచేస్తారు. కాని పురుషులకు ఏ మాత్రమూ తీసిపోను అంటూ ఇప్పటి వరకు 10 వేల పరికరాలు తయారుచేశారు బెంగళూరుకు చెందిన అశ్వత్థమ్మ. ‘‘మా వారు ఆర్ ఎస్ అనంతరామయ్య సంగీతకారులు. ఆయన తబలా, మృదంగ వాద్యాలలో నిపుణులు. నా పదిహేనో ఏట నాకు వివాహమైంది. నేను వంటతోపాటు మావారి దగ్గర వాద్యపరికరాల తయారీ, వాటిని బాగు చేయటం రెండూ నేర్చుకున్నాను.’’ అంటున్న అశ్వత్థమ్మ బెంగళూరు బాలాపేట్ సర్కిల్లోని శాంతా తబలా వర్క్స్‌లో పని చేస్తున్నారు. ‘‘ఈ పరికరాల తయారీకి శారీరక బలం చాలా అవసరం. గట్టి గట్టి దెబ్బలు కొడుతూ వాద్యాలు తయారు చేయడం మగవారికి మాత్రమే అలవాటు. అటువంటిది నా కండ బలంతో ఈ కళలో నైపుణ్యం సాధించాను’’ అంటారు 75 సంవత్సరాల అశ్వత్థమ్మ. సంగీతానికి సంబంధించి ఎటువంటి కోర్సులు చేయలేదు అశ్వత్థమ్మ. స్కూలు చదువులు కూడా లేవు. కాని, వాద్యపరికరాలు తయారుచేసేటప్పుడు అందులో పలికే అపశృతులను గుర్తించగలరు. వాటిలోని మాధుర్యం తెలుసుకోగలరు. బెంగళూరులో ఎవరికి వాద్యపరికరాలు కావాలన్నా శాంతా తబలా వర్క్స్‌కి రావలసిందే. అశ్వత్థమ్మ భర్త అనంతరామయ్య దేవాలయాల్లోను, నాటకాలలోను తబలా, మృదంగం వాయించేవారు. ఆ రోజుల్లో కచేరీలకు పెద్దగా డబ్బులు వచ్చేవి కాదు. అందువల్లే వాద్యపరికరాల తయారీ ప్రారంభించారు. అశ్వత్థమ్మ ఆ పని నేర్చుకున్నారు. భార్యాభర్తలు ఈ పనులు చేస్తున్నందుకు బంధువుల నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ‘‘వాద్యపరికరాలను జంతు చర్మాలతో చేస్తారని అందరికీ తెలిసిందే. మా కుటుంబమంతా దేవాలయాలలో పనిచేసేవారు. మేము జంతుచర్మాలతో పనిచేస్తున్నందుకు, మమ్మల్ని దూరం పెట్టారు. మగవారు చేసే మృదంగం పనులు చేయటం ఎందుకు అంటూ నన్ను ఎగతాళి చేసేవారు. వాస్తవానికి జంతుచర్మాలతో తయారుచేసే పరికరాలకు శక్తి కంటె తెలివి ఉండాలి’’ అంటారు అశ్వత్థమ్మ. తబలాను రిపేర్ చేయడానికి వారం రోజులు, మృదంగమైతే పది రోజుల సమయం పడుతుంది. ఈ వాద్యాలను పనస చెక్క, మామిడి చెక్కలతో పాటు ఇతర చెక్కలతోను తయారు చేస్తారు. ఆవు, గేదె, మేక చర్మాలను పరికరాల తోలుకోసం ఉపయోగిస్తారు. ‘‘నేను సుమారు వంద రకాల వాద్య పరికరాలను తయారు చేస్తాను. ఇప్పటివరకు కొన్ని వందల రిపేర్లు చేశాను’’ అంటారు ఆమె. ప్రముఖ సంగీత విద్వాంసులందరూ అశ్వత్థమ్మ దగ్గరే బాగు చేయించుకుంటారు. ఈ అరవై సంవత్సరాలలో అశ్వత్థమ్మ చేతి నుంచి 10000 వాద్యపరికరాలు కళాకారుల చేతుల్లోకి వెళ్లాయి. తబలా, మృదంగం, ఢోలక్, ఢోల్కీ, ఢమరుకం, నగారీ, కంజరా వంటివి తయారవుతుంటాయి. ‘మా వారికి కర్ణాటక కళాశ్రీ బహుమతి వచ్చింది. ప్రస్తుతం మా అబ్బాయి శ్రీనివాస్ ఈ సంస్థను ముందుకు తీసుకువెళ్తున్నాడు’ అంటూ సంతోషంగా చెబుతారు అశ్వత్థమ్మ. – వైజయంతి -
దర్శకురాలిగా ‘లక్ష్మీ సౌజన్య’
గ్యాప్ తర్వాత ‘అశ్వథ్థామ’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో వేగం పెంచాడు. నాగశౌర్య, ‘పెళ్లి చూపులు’ ఫేమ్ రీతు వర్మ జంటగా ఓ సినిమా ప్రారంభమైంది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. రెగ్యులర్ షూటింగ్ ఈ నెల19 నుంచి ప్రారంభంకానుంది. చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశి తెలిపారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి వంశి పచ్చి పులుసు సినిమాటోగ్రపీ అందిస్తున్నారు. ఇక ఛలో తర్వాత అంతటి హిట్ అందుకోని నాగశౌర్య ‘అశ్వథ్థామ’ వంటి మంచి కంటెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు నాగశౌర్యనే కథను అందించడం విశేషం. సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌పై నాగశౌర్య తల్లి ఉష మూల్పురి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిఫరెంట్ కాన్పెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక రీతు వర్మ కూడా పెళ్లి చూపులు తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. అయితే ఈ సినిమాలో రీతువర్మ క్యారెక్టర్ స్పెషల్‌గా ఉంటుందని దర్శక నిర్మాతలు పేర్కొంటున్నారు. చదవండి: ‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ 'చావుకబురు చల్లగా’ చెప్పిన కార్తికేయ -
అమ్మకు థ్యాంక్స్
‘‘సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందన్నారు. ఆ పాజిటివ్ టాక్ వల్లే మా సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది. ఇలాంటి సినిమా నాతో తీసినందుకు అమ్మకు థ్యాంక్స్’’ అన్నారు నాగశౌర్య. రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య, మెహరీన్ జంటగా ఐరా క్రియేషన్స్‌పై ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘అశ్వథ్థామ’. జనవరి 31న విడుదలై మా చిత్రం దిగ్విజయంగా ప్రదర్శించబడుతోంది అన్నారు చిత్రబృందం. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్‌మీట్‌లో నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘రమణ తేజకు ఫుడ్, సినిమా.. ఈ రెండే ప్రాణం. అతడిని నమ్మినందుకు సినిమాని బాగా తీశాడు. మరోసారి ‘నర్తనశాల’ లాంటి సినిమా చెయ్యను’’ అన్నారు. నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ– ‘‘శౌర్య రాసిన కథ నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగు సినీ పరిశ్రమకు నాగశౌర్య రూపంలో మరో యాక్షన్ స్టార్ లభించాడు’’ అన్నారు. ‘‘ఇప్పటివరకూ చేసిన సినిమాలతో రొమాంటిక్ హీరోగా ప్రూవ్ చేసుకున్నానని, ఈ సినిమాతో యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని శౌర్య అన్నప్పుడు ఆశ్చర్యపోయా. తను కథ బాగా రాసుకున్నాడు’’ అన్నారు రచయిత, దర్శకుడు బి.వియస్ రవి. రమణ తేజ మాట్లాడుతూ– ‘‘శౌర్య నటించిన విధానానికి హ్యాట్సాఫ్. మంచి సినిమాలో నన్ను భాగం చేసినందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు. ఉషా మూల్పూరి మాట్లాడుతూ– ‘‘శౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన చిత్రంగా ‘అశ్వథ్థామ’ నిలిచినందుకు ఫుల్ హ్యాపీ. ఐరా క్రియేషన్స్‌లో ఇది బిగ్గెస్ట్ హిట్. ఇకముందు కూడా మా బ్యానర్ మంచి సినిమాలు అందిస్తుంది’’ అన్నారు. ‘‘ఐరా క్రియేషన్స్ ఏ సినిమా చేసినా టెక్నీషియన్లు, యాక్టర్లు అందరూ ఫ్యామిలీలా పనిచేస్తారు. అది వాళ్ల బలం’’ అన్నారు దర్శకురాలు నందినీ రెడ్డి. చిత్ర సమర్పకులు శంకర్ ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, సినిమాటోగ్రాఫర్ మనోజ్‌రెడ్డి, ఎడిటర్ గ్యారీ, నటుడు ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు. -
బ్రేక్ ఈవెన్‌ను క్రాస్ చేసిన ‘అశ్వథ్థామ’
అమ్మాయిల ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం అశ్వథ్థామ. ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా కనిపించిన నాగ శౌర్య ఈ సినిమాతో యాక్షన్ అవతారం ఎత్తారు. రమణ తేజను దర్శకుడిగా పరిచయం చేస్తూ సొంతంగా కథ రాసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్, ఎమోషనల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో మెహరీన్ శౌర్యకి జోడిగా నటించింది. జనవరి 31 న విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనతో ముందుకు కొనసాగుతోంది. (‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ) సంక్రాంతి సీజన్లో వచ్చిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాల హమా మెల్లగా తగ్గుతుండటం.. అశ్వథ్థామ కలెక్షన్స్‌కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. నాగశౌర్య నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేయడంతో ఈ సినిమా స్థిరమైన కలెక్షన్లు రాబడుతోంది. నిన్నటి వరకు రూ. 10 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్రేక్ ఈవెన్‌కు చేరువగా నిలవగా.. తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం రిలీజ్ అయిన అయిదు రోజుల్లోనే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 13.65 కోట్లను రాబట్టి బ్లాక్బాస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. -
కర్నూలులో ‘అశ్వథ్థామ’ విజయోత్సవ యాత్ర
-
మా శౌర్య చిన్నప్పట్నుంచి మాస్
‘నర్తనశాల’ (2018) సినిమా తీసి తల్లిదండ్రులను బాధ పెట్టానని శౌర్య ఫీలయ్యాడు. మా బ్యానర్ నుంచి అలాంటి సినిమా వచ్చినందుకు నిర్మాతగా నేను బాధపడ్డాను. శౌర్య కెరీర్లో అది బిగ్గెస్ట్ డిజాస్టర్. ఆ బాధను తీసేసేలా ‘అశ్వథ్థామ’ మంచి సంతోషాన్ని ఇచ్చింది’’ అన్నారు నిర్మాత ఉషా మూల్పూరి (నాగశౌర్య తల్లి). రమణతేజ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా శంకర్‌ప్రసాద్ సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘అశ్వథ్థామ’. నాగశౌర్య ఈ సినిమాకు కథ అందించారు. జనవరి 31న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ – ‘‘మా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కె. రాఘవేంద్రరావుగారు, నందినిరెడ్డిగారు ఫోన్ చేసి అభినందించారు. శౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. చిత్రం చాలా బాగుందని, ఇంకా మూడు నుంచి నాలుగు వారాలు థియేటర్స్‌లో బాగా ఆడుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతుండటం సంతోషాన్నిచ్చింది. యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను ఆదరిస్తున్నారు. మనకు ఒక నిర్భయ, దిశ కేసులు తెలుసు. కానీ ‘అశ్వథ్థామ’లో చూపించిన విధంగా కూడా జరుగుతుందని మనలో చాలామందికి తెలియదు. కథ పరంగా శౌర్యకు మంచి స్పందన వస్తోంది. శౌర్య ఇలాంటి కథ రాసినందుకు ఒక నిర్మాతగా కంటే కూడా ఒక తల్లిగా బాగా సంతోషపడుతున్నాను. కథ చెప్పినప్పుడు శౌర్య సామాజిక బాధ్యతతో ఆలోచిస్తున్నాడని మేం ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం. ‘అశ్వథ్థామ’ చిత్రంతో శౌర్యలోని మాస్ యాంగిల్‌ని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. కమర్షియల్ హీరోతో సినిమా చేయాలనుకునేవారికి శౌర్య కూడా ఒక మంచి ఆలోచన. నిజానికి చిన్నప్పటి నుంచి కూడా శౌర్య ఫుల్ మాస్. సాఫ్ట్ క్యారెక్టర్ కాదు. కానీ ఇండస్ట్రీలో క్యూట్ అండ్ లవర్‌బాయ్ అనే పేరు వచ్చింది. శౌర్య అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. హీరో అయ్యాడు. ఇప్పుడు రైటర్ అయ్యాడు. భవిష్యత్‌లో దర్శకుడు అవుతాడేమో ఇప్పుడే తెలియదు. ఇండస్ట్రీకి మేం చాలా ప్యాషనేట్‌గా వచ్చాం. మా బ్యానర్లో తర్వాతి చిత్రం వేరే హీరోతో ఉండొచ్చు. మా బ్యానర్లో అందరి హీరోలతో సినిమాలు చేయాలనుకుంటున్నాం. మా అబ్బాయి ఒక్కరే హీరో కాదు కదా! రాఘ వేంద్రరావుగారితో శౌర్య సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
‘అశ్వథ్థామ’ సక్సెస్ సెలబ్రేషన్స్
-
‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ
టైటిల్: అశ్వథ్థామ జానర్: యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ నటీనటులు: నాగశౌర్య, మెహరీన్, ప్రిన్స్, సత్య, జిష్షు సేన్ గుప్తా, పోసాని కృష్ణమురళి, తదితరులు కథ: నాగశౌర్య దర్శకత్వం: రమణతేజ సంగీతం: శ్రీచరణ్ పాకాల నిర్మాత: ఉషా మూల్పూరి ‘ఛలో’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న యువ హీరో నాగశౌర్య ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేపోయాడు. యూత్ హీరోగా ముఖ్యంగా అమ్మాయిల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోకు హిట్టు పడి చాలా కాలమే అయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి బలమైన స్క్రిప్ట్‌తో పాటు సందేశాత్మక చిత్రాన్ని అందించేందుకు స్యయంగా నాగశౌర్యనే కథా రచయితగా మారాడు. తన లవర్ బాయ్ ఇమేజ్ను పక్కకు పెట్టి ఫుల్ యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథ ‘అశ్వథ్థామ’ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగశౌర్య. మరి ఈ సినిమాతో నాగశౌర్యకు యాక్షన్ అండ్ మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టిందా? మళ్లీ ఈ యువ హీరో హిట్ ట్రాక్ ఎక్కాడా? డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారా? అనేది మన సినిమా రివ్యూలో చూద్దాం. కథ: నగరంలోని యువతులు మిస్సవడం.. రెండు మూడు రోజులు తర్వాత అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో కనిపించడం.. కొన్ని నెలల తర్వాత ఆ యువతులు ప్రెగ్నెంట్ కావడం.. చేసింది ఎవరో తెలీదు. కొంత మంది పాత్ర ధారులతో ఓ సూత్రధారి నిర్మించుకున్న పద్మ వ్యూహం లాంటి సామ్రాజ్యంలోకి అశ్వథ్థామ ప్రవేశిస్తాడు. పద్మవ్యూహంలోకి వెళ్లిన అశ్వథ్థామ చిక్కుకున్నాడా? లేక ఆ వ్యూహాన్ని ఛేదించాడా? శత్రు సంహారం జరిగిందా అనేదే అశ్వథ్థామ కథ. గణ (నాగశౌర్య)కు కుటుంబం అన్నా తన చెల్లెలు ప్రియ అన్నా ఎంతో ఇష్టం. చెల్లెలు ప్రియ ఎప్పుడు కంటతడి పెట్టకుండా అండగా, ధైర్యంగా ఉంటానని గణ తన తల్లికి చిన్నప్పుడే మాటిస్తాడు. అయితే రవి (ప్రిన్స్)తో ప్రియ పెళ్లికి కొద్ది రోజుల ముందు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడాన్ని గణ చూస్తాడు. ఇందుకు గల కారణాలను తెలుసుకొని ప్రియకు బాసటగా నిలుస్తాడు. తన చెల్లితో పాటు ఇంకెదరో యువతులు ఇలాంటి ఘటనలే ఎదుర్కోవడాన్ని గణ తన ఇన్వెస్టిగేషన్లో తెలుసుకుంటాడు. ఇదంతా చేస్తుంది ఎవరు? నేహ (మెహరీన్)కు గణ కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి డాక్టర్ మనోజ్‌కుమార్ (జిష్షు సేన్ గుప్తా), సత్య, పోసాని, తదితరలు ఎందుకు ఎంటర్ అవుతారు? చివరికి ఈ మిస్టరీ వెనుక ఉన్నది ఎవరో గణ తెలుసుకుంటాడా? చివరికి ఏమైంది? అనేదే అసలు సినిమా కథ నటీనటులు: నటీనటులు విషయానికి వస్తే ఈ సినిమా మొత్తాన్ని వన్ మ్యాన్ షోతో నాగశౌర్య ముందుండి నడిపించాడు. ఇప్పటివరకు ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ను తొలగించుకునేందుకు ఈ పవర్ ఫుల్ యాక్షన్ చిత్రంలో నటించిన నాగశౌర్య ఫుల్ ఎనర్జీతో సూపర్బ్ అనిపించాడు. యాక్షన్ సీన్స్‌లలో హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. తన శైలికి భిన్నంగా చేసిన ఈ సినిమాతో అటు మాస్ ఆడియన్స్‌ను సొంతం చేసుకోవడం పక్కా. సినిమా తొలి అర్థభాగంలో కొన్ని సీన్లలలో కాస్త క్లాస్ లుక్‌లో కనిపించినా.. ఆ తర్వాత ఫుల్ మాస్ అండ్ రఫ్ లుక్‌లో కనిపిస్తాడు. సైకో విలన్‌గా జిష్షు సేన్ గుప్తా కొన్ని చోట్ల భయపెట్టిస్తాడు. క్లాస్ అండ్ రిచ్ విలన్‌గా చక్కగా ఒదిగిపోయాడు. రబ్బరు బొమ్మగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ మెహరీన్‌కు ఈ చిత్రంలో మంచి పాత్ర లభించినప్పటికీ హావభావాలు పలికించడం తడబడింది. అంతేకాకుండా తన పాత్రలో జీవించడం మరిచిపోయినట్టుగా అనిపిస్తుంది. ప్రిన్స్, నాగశౌర్య చెల్లెలి పాత్రలో కనిపించి అమ్మాయి సందర్భానుసారంగా స్క్రీన్ పై వచ్చి పోతుంటారు. భారీ తారాగణం ఉన్నప్పటికీ కొన్ని సీన్లలో వచ్చిపోతుంటారు తప్ప కథకు వారు పెద్ద ప్లస్ కాదు. విశ్లేషణ: ఈ సినిమాకు ప్రధాన బలం కథ, కాన్సెప్ట్. దీంతో తెరపైనే కాకుండా తెరవెనక కూడా ప్రధాన హీరో నాగశౌర్యనే. ఇక హీరో అందించిన కథను దర్శకుడు రమణ తేజ చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు. సినిమా ప్రారంభమైన తొలి పదిహేను నిమిషాల్లోనే అసలు కథలోకి ప్రవేశిస్తుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా, నెక్ట్స్ ఏంజరుగుతుంది అనే కుతూహలం సగటు ప్రేక్షకుడికి ఏర్పడే విధంగా ఫస్టాఫ్ సాగుతుంది. అయితే హీరోయిన్‌తో వచ్చే సీన్లు, పాటలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టే విధంగా ఉంటాయి. ఇంటర్వెల్ వరకు బాగానే ఉన్న సెకండాఫ్ దర్శకుడు ఎలా తీస్తాడా? అనే అనుమానం అందరిలోనూ తలెత్తడం ఖాయం. అయితే సెకండాఫ్‌లో కూడా కథను ఎక్కడా డీవియేట్ కాకుండా? అనవసర హంగుల జోలికి వెళ్లకుండా రెండో అర్థభాగాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు దర్శకుడు. ఈ విషయంలో దర్శకుడి ప్రతిభకు నూటికి నూరు మార్కులు వేయాల్సిందే. ఎలాంటి గందరగోళం లేకుండా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ వావ్ అనిపిస్తాయి. అయితే అన్నా చెల్లెలి మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ అంతగా పండలేదు. దీనిపై కాస్త శ్రద్ద పెట్టాల్సింది. ఇక అసలు సూత్రధారి ఎవరో కనిపెట్టిన హీరో.. చిన్న ఫైట్‌తో సినిమా ముగించడంతో సినిమా అయిపోయిందా అనే భావన సగటు ప్రేక్షుకడికి కలగడం ఖాయం. మనోజ్ రెడ్డి కెమెరా పనితనం తెరపై కనిపిస్తుంది. హీరోయిన్ అందాలు, యాక్షన్ సీన్లలో మనోజ్ తన సినిమాటోగ్రఫీతో మైమరిపించాడు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం జిబ్రాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్. కొన్ని సీన్లలో సైలెంట్ మ్యూజిక్.. మరికొన్ని చోట్ల హార్ట్ బీట్‌ను పెంచే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. ముఖ్యంగా హీరో ఈల వేసేటప్పుడు థియేటర్ మొత్తం నిశ్శబ్బ వాతావరణం అలుముకుటుంది. ఇక శ్రీచరణ్ పాకాల పాటలు పర్వాలేదనిపించాయి. కానీ గుర్తుండిపోయే పాటలు మాత్రం కాదు. ఇక ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ‘గోపాల గోపాల’ సినిమాలో ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్‌తో సినిమా ఆరంభం అవడం ‘అశ్వథ్థామ’కు బూస్టప్‌ను ఇచ్చే అంశం. ఆకట్టుకునే డైలాగ్‌లు: ‘ఏ తల్లి కన్నదో వంద మంది కౌరవుల క్రూరత్వాన్ని ఈ ఒక్కడిలోనే కనింది’, ‘మనిషికి ఉండేది కోరిక, మృగాడికి ఉండేది వాంఛ. మరి మృగాడి వాంఛను తీర్చుకోవడానికి బతికుంటే ఏంటి? చచ్చిపోతే ఏంటి?’, ‘రావణాసురుడు చనిపోయింది సీతను ఎత్తుకపోయినందుకు కాదు.. జాటాయువును పూర్తిగా చంపనందుకు.. పూర్తిగా చంపుంటే సీతమ్మను ఎత్తుకపోయింది రావణుడని, దక్షిణం వైపు వెళ్లారని రాముడికి తెలిసేదా? రావణుడు చనిపోయేవాడా?’, ‘లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్లో ఏదో మ్యాజిక్ ఉంది’, ‘ప్రస్తుత కాలంలో ఆడపిల్లను కని, పెంచి ఏ గొడవ లేకుండా పెళ్లి చేయడం అంటే సాధారణ విషయం కాదు’ అంటూ సినిమాలో వచ్చే డైలాగ్‌లు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచించే విధంగా ఉంటాయి. ప్లస్ పాయింట్స్: కథ, కథనం నాగశౌర్య నటన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్: కొన్ని సాగదీత సీన్స్ పాటలు క్లైమాక్స్ సాదాసీదాగా ఉండటం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
కొత్త శౌర్యను చూస్తారు
‘‘నటుడిగా నాగశౌర్య ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలడు. గెడ్డం తీస్తే క్లాస్‌గా కనిపిస్తాడు. గెడ్డం ఉంటే ఫైటర్‌గా ఉంటాడు. కీరిటం పెడితే కృష్ణుడిలా, క్యాప్ పెడితే కౌబాయ్‌లా ఉంటాడు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘ఛలో’ వంటి సక్సెస్‌ల సమయంలో నా కన్ను నాగశౌర్యపై పడింది’’ అన్నారు ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు. నాగశౌర్య హీరోగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. రమణ తేజ దర్శకత్వంలో ఉషా మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న దర్శకులు, సాంకేతిక నిపుణులు మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. ‘అశ్వథ్థామ’ చిత్రం చూడలేదు. కానీ ఈ చిత్రం నా ఊహకు ఓ కమర్షియల్ కుటుంబ కథా చిత్రంలా అనిపిస్తుంది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలు ఉన్న ఈ చిత్రం హిట్ సాధిస్తుంది’’ అన్నారు. ‘‘రాఘవేంద్రరావుగారి ఆశీస్సులతో ఈ సినిమా మొదలైంది. ఆయన చేయి చాలా మంచిదని అంటుంటారు. మా సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకుల అభిప్రాయాలను నా చెవులతో వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఇందులో కొత్త శౌర్యను చూస్తారు’’ అన్నారు నాగశౌర్య. ‘‘ఈ సినిమాను రమణతేజ బాగా తీశాడని చెప్పుకుంటున్నారు. కానీ నాగశౌర్య మంచి కథను అందించారు. ఓ మంచి కారణంతో తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు రమణతేజ. ‘‘మా తమ్ముడు ఇప్పటివరకు 17 సినిమాలు చేశాడు. ప్రతి సినిమాకు నేను ఏదో ఒక కంప్లైట్ చేసేవాడిని. ఈ సినిమాకు అలా ఏం లేదు. రమణతేజ ఈ సినిమాను బాగా తీశారు’’ అన్నారు ఐరా క్రియేషన్స్ డిజిటల్ డైరెక్టర్ గౌతమ్. ‘‘అవకాశాల కోసం ప్రయత్నించి ఇక ఇంటికి వెళ్లిపోదామని అనుకుంటున్న సమయంలో ఈ సినిమా అవకాశం వచ్చింది. ‘ఛలో’ వంటి సూపర్ సక్సెస్ కొట్టిన నాగశౌర్య సినిమాకు నేను డైలాగ్స్ రాయడం ఏంటీ? అనుకున్నాను. శౌర్య ఓ సీన్ ఇచ్చి రాయమన్నారు. రాశాను. వెంటనే అడ్వాన్స్ ఇచ్చి ‘నువ్వు ఈ సినిమాకు రాస్తున్నావ్’ అన్నారు. చాలా సంతోషపడ్డాను’’ అన్నారు డైలాగ్ రైటర్ పరశురామ్. -
దేనికైనా ఎమోషనే ముఖ్యం
‘‘మన దగ్గర థ్రిల్లర్ జానర్‌కి ఆడియన్స్ తక్కువ. మన ప్రేక్షకులకు ఎలివేషన్ కన్నా ఎమోషన్ ముఖ్యం. ఒక ఎమోషనల్ కథకు థ్రిల్లర్ అంశాలు జోడిస్తే అదే ‘అశ్వథ్థామ’ చిత్రం’’ అన్నారు దర్శకుడు రమణ తేజ. ఆయన దర్శకత్వంలో నాగశౌర్య, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రమణ తేజ మాట్లాడుతూ – ‘‘మాది చిత్తూరులో మదనపల్లి. చిన్నప్పుడు చదువుకుంది మదనపల్లిలోనే. మా ఫ్యామిలీలో అందరం ఎక్కువగా సినిమాలు చూసేవాళ్లం. నాన్నగారికి చిరంజీవిగారంటే విపరీతమైన అభిమానం. నన్ను ఎక్కువగా సినిమాలకు తీసుకెళ్లేవారు. చిన్నప్పుడు చదువుల్లో చాలా చురుకుగా ఉండేవాణ్ణి. తమిళనాడులో ఇంజనీరింగ్ చేశాను. కాలేజ్‌లో ఉన్నప్పుడే సినిమాల్లోకి వెళ్లాలని బలంగా కోరిక కలిగింది. కాలేజీ రోజుల్లో తీసిన ఓ షార్ట్ ఫిల్మ్‌కి స్క్రీన్‌ప్లే వీక్ అనే కామెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత అమెరికాలో ఎంబీఏ చేయడానికి వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి వెళ్లి ఫిల్మ్ కోర్స్ చేశాను. అక్కడ స్క్రీన్ రైటింగ్‌లో డిగ్రీ చేశాను. స్క్రీన్ ప్లే మీద అవగాహన సంపాదించాను. ‘టెడ్ 2’ అనే హాలీవుడ్ సినిమాకు అప్రెంటిస్‌గా వర్క్ చేశాను కూడా. తిరిగొచ్చాక ఓ సినీ ప్రమోషన్ కంపెనీలో వర్క్ చేస్తుండగా ‘ఛలో’ ప్రమోషన్స్‌లో నాగశౌర్య అన్న పరిచయమయ్యారు. అలా మా ప్రయాణం మొదలైంది. అప్పుడే శౌర్య అన్న ‘అశ్వథ్థామ’ కథ రాస్తున్నారు. అది పూర్తయ్యాక నువ్వే దర్శకుడిని అన్నారు. దర్శకుడిగా నాకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. శౌర్య అన్నయ్యతో ఈ ప్రయాణాన్ని మర్చిపోలేను’’ అన్నారు. -
సమాజంలో మహిళలకు రక్షణ లేదు
నాగశౌర్య హీరోగా నటించి, కథను అందించిన చిత్రం ‘అశ్వథ్థామ’. మెహరీన్ కథానాయిక. రమణ తేజ దర్శకత్వం వహించగా శంకర్ ప్రసాద్ సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించారు. జనవరి 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహరీన్ చెప్పిన విశేషాలు. ► తప్పు జరుగుతున్నప్పుడు అది తçప్పని చెప్పగలిగి, దాన్ని ఆపేవాడే అశ్వథ్థామ. సినిమాలో హీరో పాత్ర అలానే ఉంటుంది. మనందరిలోనూ ఒక అశ్వథ్థామ ఉంటాడు. ► ముంబైలో జరిగిన వాస్తవ సంఘటనతో నాగశౌర్య ఈ కథ రాశారు. సెట్లో కామ్‌గా ఉంటాడు శౌర్య. కెమెరా ఆన్ చేయగానే వేరే మనిషిలా మారిపోతాడు. ► రమణ తేజ ఈ కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. సమాజంలో జరుగుతున్నది కూడా ఇదే. ప్రస్తుతం సమాజంలో మహిళలకు రక్షణ లేదు. అప్పుడే పుట్టిన పాప నుంచి వందేళ్ల బామ్మగారి వరకూ ఎవ్వరికీ సురక్షితమైన వాతావరణం లేదు. సినిమా శక్తివంతమైన మాద్యమం. ఇలాంటి కథలను ప్రేక్షకులకు చెప్పాలి. ► ఇప్పటి వరకూ నేను ఇలాంటి పాత్ర చేయలేదు. నాగశౌర్య కూడా ఇంత సీరియస్ రోల్ చేయలేదు. మా ఇద్దరికీ ఇది కొత్త జానర్. సినిమా చాలా స్పీడ్‌గా, సీరియస్‌గా సాగుతుంది. కామెడీ, కమెడీయన్స్ ఎవ్వరూ ఉండరు. హీరో ప్రయాణంలో సహాయపడే పాత్ర నాది. ► జనవరిలో నా నుంచి వస్తున్న మూడో చిత్రం ‘అశ్వథ్థామ’. పండక్కి ‘ఎంత మంచివాడవురా!’, పటాస్ (తమిళం) విడుదలయ్యాయి. నెలాఖరుకి విడుదల కాబోతున్న ‘అశ్వథ్థామ’ మంచి విజయం సాధిస్తుంది అనుకుంటున్నాను. -
ఈ కథ రాస్తూ జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను
‘‘మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ల మీద చెయ్యేస్తే మనం ఎలా రియాక్ట్ అవుతామో ‘అశ్వథ్థామ’ సినిమాలో హీరో అదే చేస్తాడు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నా కుటుంబమే’’ అన్నారు నాగశౌర్య. ఆయన కథ అందించి, హీరోగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. మెహరీన్ కథానాయిక. రమణ తేజ దర్శకత్వంలో ఈ సినిమాను ఉషా మూల్పూరి నిర్మించారు. జనవరి 31న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఖమ్మంలో ప్రీ–రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ – ‘‘ఇదో నిజాయితీ గల కథ. నా స్నేహితుడి చెల్లికి జరిగిన సంఘటన ఆధారంగా ఈ కథ రాసుకున్నాను. కథ రాస్తున్నాను అన్నప్పుడు అమ్మానాన్న ఎంతో సపోర్ట్ చేశారు. ఈ కథ రాస్తూ జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. నేను ఈ కథ రాయడానికి సమాజంలో చాలా సంఘటనలు ప్రేరేపించాయి’’ అన్నారు. ‘‘ఈ కథ అందర్నీ ఆలోచింపజేస్తుంది’’ అన్నారు మెహరీన్. ‘‘సహజంగా నటించే నటుల్లో నాగశౌర్య ఒకరు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలి’’ అన్నారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. ‘‘ఈ సినిమాలో కొత్త నాగశౌర్యని చూస్తారు. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నాగశౌర్యకి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు రమణ తేజ.‘‘ మంచి కథా బలంతో వస్తున్న చిత్రం అశ్వథ్థామ. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి. ‘‘సినిమాలో నాలుగు పాటలున్నాయి. అన్ని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల. -
‘అశ్వథ్థామ’ ఆడియో ఫంక్షన్
-
అశ్వథ్థామ: చివర్లో విజిల్.. అదిరిపోయింది
ఓ ప్రేమ కథ.. లేదంటే, రెండు వర్గాల మధ్య గొడవలు.. ఎప్పుడూ ఇదే కథేనా అనుకునే వారికి రొటీన్ కథతో కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నాడు హీరో నాగశౌర్య. అతను తాజాగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు పూరీ జగన్నాధ్ గురువారం సాయంత్రం రిలీజ్ చేశారు. సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ట్రైలర్ ప్రకారం అమ్మాయిల మిస్సింగ్‌తోపాటు, వారిని దారుణంగా చంపుతున్న వారికోసం హీరో వేట మొదలు పెడతాడు. అయితే వీళ్లందరినీ ఆడిస్తున్న ప్రధాన సూత్రధారిని పట్టుకోడానికి హీరో తన ప్రయత్నాలు కొనసాగిస్తాడు. (అశ్వథ్థామ టీజర్) ఈ క్రమంలో నాగశౌర్య ఫైట్లు కూడా చేస్తాడు. అయితే శౌర్య లవర్‌బాయ్ ఇమేజ్ నుంచి ఒక్కసారిగా మాస్ యాంగిల్లో కనిపించడం కాస్త కొత్తగా ఉన్నా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక ట్రైలర్ చివరలో శౌర్య విజిల్ వేసుకుంటూ కనిపించే సీన్ అభిమానులతో ఈల వేయించేట్లు కనిపిస్తోంది. బీజీఎమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘ఎటువైపు వెళ్లినా మూసుకుపోతున్న దారులు.. ఒకరితో ఒకరికి సంబంధంలేని వ్యక్తులు... వేట కుక్కల్లా వెంటపడే జాలర్లు.. శకునిలాంటి ఓ ముసలోడు.. వీరందరినీ ఒకే స్టేజ్ మీద ఆడించే ఆ సూత్రధారి ఎవరు?’ వంటి డైలాగ్స్ బాగున్నాయి. నాగశౌర్య ఈ సినిమాతో తప్పకుండా హిట్ ట్రాక్‌లోకి వస్తాడని అభిమానులు మక్తకంఠంతో చెప్తున్నారు. ఇక శౌర్య ఈ సినిమా పేరుని తన ఛాతిపై పచ్చబొట్టుగా పొడిపించుకున్న విషయం తెలిసిందే. కాగా సమాజంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా నాగశౌర్య సొంతంగా కథ రాసుకున్నాడు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది. -
వాస్తవ సంఘటనల అశ్వథ్థామ
నాగసౌర్య, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఈ చిత్రంతో రమణ తేజ దర్శకునిగా పరిచయమవుతున్నారు. శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది.ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్ పూరి జగన్నాధ్ రేపు (గురువారం) సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నారు. ‘‘సమాజంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలతో నాగశౌర్య ఈ సినిమా కథని రాసుకున్నారు. హీరోయిన్ సమంత ఇటీవల విడుదల చేసిన మా సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ కూడా అందరి అంచనాలకు తగ్గట్టు ఉంటుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ రెడ్డి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి. -
నెట్టింట్లో దూసుకుపోతున్న ‘అశ్వథ్థామ’ టీజర్
రమణ తేజని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ నాగశౌర్య, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించారు. ఇప్పటివరకు క్లాస్ అండ్ లవర్‌బాయ్‌గా ముద్ర పడిన నాగశౌర్య ఈ చిత్రంతో ఆ ఇమేజ్ను చెరిపేసుకునే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్, సాంగ్స్‌తో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ఈ టీజర్ మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. దీంతో అశ్వథ్థామ టీజర్ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. కేవలం 24 గంటల్లోనే 4 మిలియన్‌కు పైగా డిజిటల్ వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ టీజర్ సరికొత్త ఘనతను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. టీజర్, సాంగ్స్‌కు వస్తున్న రెస్పాన్స్‌తో చిత్రం ఘనవిజయం సాధించడం ఖాయమని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాకు కథను నాగ శౌర్యనే అందించిన విషయం తెలిసిందే. శ్రీచరణ్ పాకాల సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రం జనవరి 31న విడుదలకానుంది. -
‘అశ్వథ్థామ’ టీజర్ లాంచ్
-
లవర్ బాయ్ ఇమేజ్ అంటే చిరాకు
‘‘ఛలో’ సినిమా టీజర్ ఇక్కడే(రామానాయుడు ప్రివ్యూ థియేటర్) విడుదల చేశాం.. బ్లాక్ బస్టర్ అయింది. ‘నర్తనశాల’ టీజర్ కూడా ఇదే ప్లేస్‌లో రిలీజ్ చేశాం.. ఫ్లాప్ అయింది. ఇప్పుడు ‘అశ్వథ్థామ’ టీజర్‌ని కూడా ఇక్కడే రిలీజ్ చేస్తున్నాం.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని గర్వంగా చెప్పగలను. నా తల్లిదండ్రులు గర్వంగా తలెత్తుకునేలా ఈ సినిమా చేశాను’’ అని నాగశౌర్య అన్నారు. రమణ తేజని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ నాగశౌర్య, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 31న విడుదలవుతోంది. ఈ సినిమా టీజర్‌ని హీరోయిన్ సమంత ట్విట్టర్లో విడుదల చేశారు. అలాగే రామానాయుడు స్టూడియోలో జరిగిన టీజర్ విడుదల కార్యక్రమంలో నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘ఢిల్లీ, ముంబైలలో అమ్మాయిలపై జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ‘అశ్వథ్థామ’ కథను రాశా. ‘ఛలో’ కథ నేనే రాసినా పేరు వేసుకోలేదు. నాకు కథలు రాయడం, చెప్పడం ఇష్టం. నాకు లవర్ బాయ్ ఇమేజ్ అంటే చాలా చిరాకు.. అందుకే ఈ చిత్రంలో దాని నుంచి పూర్తీగా బయటికి వచ్చి రఫ్‌గా ఉండే పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘నాగశౌర్య మంచి కథ రాశారు. ఈ చిత్రంలో నాగశౌర్య విశ్వరూపం చూస్తారు’’ అన్నారు రమణ తేజ. ‘‘కథని నమ్మి ఈ సినిమా తీశాం’’ అన్నారు శంకర్ ప్రసాద్ ముల్పూరి. ‘‘ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‌కి మంచి స్పందన వస్తోంది. మా సినిమా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు ఉషా ముల్పూరి. ఈ కార్యక్రమంలో లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ గ్యారీ, కెమెరామెన్ మనోజ్ రెడ్డి, డైరెక్టర్ బి.వి.యస్.రవి తదితరులు పాల్గొన్నారు.