న్యూస్‌మేకర్
అశ్వత్థామకు మరణం లేదు. మహాభారత కాలం నుంచి కల్కి వచ్చే కాలం వరకూ బతికే ఉండాలి. మరి అతను ఎలా ఉంటాడు? ఆ పాత్ర ధరించింది సాక్షాత్తు అమితాబ్ అయితే అతన్ని అశ్వత్థామలా మార్చే దుస్తులు ఎలా ఉండాలి?
తెలుగు ఫ్యాషన్ డిజైనర్ అర్చనా రావు ‘కల్కి’ సినిమాకు చీఫ్ ఫ్యాషన్ డిజైనర్‌గా అద్భుతంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి ప్రశంసలు అందుకుంటోంది. హైదరాబాద్ నిఫ్ట్‌లో, న్యూయార్క్‌లో చదువుకున్న అర్చనా రావు పరిచయం.
‘సినిమాకు పని చేయడంలో అసలైన సవాలేమిటంటే పేపర్ మీద గీసుకున్నది తెర మీద కనిపించేలా చేయగలగాలి. అందుకు టీమ్ మొత్తంతో మంచి కోఆర్డినేషన్‌లో ఉండాలి’ అంటుంది అర్చనా రావు.
హైదరాబాద్‌కు చెందిన అర్చనా రావుకు ‘అర్చనా రావు లేబుల్’ పేరుతో సొంత బ్రాండ్ ఉంది. ఆమె దుస్తుల డిజైనింగ్ మాత్రమే కాదు ప్రాడక్ట్ డిజైనింగ్ కూడా చేస్తుంది. అంటే పాదరక్షలు, హ్యాండ్ బ్యాగ్‌లు, బెల్ట్‌లు... అన్నీ హ్యాండ్‌మేడ్. ఆమె సృజన మొత్తంలో తప్పనిసరిగా భారతీయత కనిపిస్తుంది.
‘నాకు ఇండియన్ కళాత్మక విలువలంటే ఇష్టం. అవే నన్ను కల్కి సినిమా కాస్టూమ్ డిజైనింగ్‌లో గెలిచేలా చేశాయి. నేడు నా పనికి మంచి ప్రశంసలు అందుతుంటే ఆనందంగా ఉంది’ అందామె.
నిఫ్ట్ స్టూడెండ్
అర్చనా రావు హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఆమెకు ఇష్టంగా ఉండేది. ఏదో ఒక సృజనాత్మక రంగంలో చదువు కొనసాగించాలనుకున్నా స్పష్టత రాలేదు. ఇంటర్ ముగిసే సమయానికి హైదరాబాద్‌లో నిఫ్ట్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) ఏర్పడింది. అందులో క్లాత్ డిజైనింగ్ కోర్సుకు అప్లై చేస్తే సీటు వచ్చింది. ‘కాలేజీలో చేరాక ఇదే నేను చదవాల్సింది అని తెలిసొచ్చింది. మన దగ్గర క్రియేటివిటీ ఉండటం ఒకటైతే చదువు వల్ల తెలిసే విషయాలు ఉంటాయి. నిఫ్ట్‌లో ఒక ఫ్యాబ్రిక్‌కు సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ పూర్తిగా తెలిసింది.
ఫ్యాషన్ డిజైన్ చేయాలంటే ముందు ఫ్యాబ్రిక్‌ని కనిపెట్టాలి. అలా చదువు పూర్తయ్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం న్యూయార్క్ వెళ్లాను. న్యూయార్క్ నగరమే ఒక క్యాంపస్. ఏ మనిషిని చూసినా ఏ వీధిని చూసినా ఫ్యాషన్ కనపడుతూనే ఉంటుంది. నేను మరింత ఎదగడానికి న్యూయార్క్ ఉపయోగపడింది. అయితే నేను అమెరికాలో స్థిరపడాలనుకోలేదు. ఇండియా ఫ్యాషన్ రంగంలో పుంజుకుంటోంది. నా పని ఇక్కడే అని నిశ్చయించుకుని వచ్చేశాను. నా బ్రాండ్ మొదలెట్టాను’ అని తెలిపిందామె.
మహానటితో...
దర్శకుడు నాగ్ అశ్విన్ ఏదో సందర్భంలో పరిచయం కావడంతో అతను ‘మహానటి’ చిత్రం కోసం కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేయమన్నాడు. ‘అప్పటికి నాకు సినిమాలకు కాస్ట్యూమ్స్ ఎలా తయారు చేయాలో తెలియదు. కాని నాగ్ అశ్విన్ ప్రోత్సాహంతో మహానటిలో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌లకు కాస్ట్యూమ్స్ చేశాను. కథాకాలాన్ని బట్టి 1940ల నాటి ఫ్యాషన్‌లను, 1980ల నాటి ఫ్యాషన్‌లను స్టడీ చేయాల్సి వచ్చింది. సినిమాలకు కాస్ట్యూమ్స్ చేయడంలో ముఖ్యమైన సంగతి ఏమిటంటే లైట్ పడితే ఏ రంగు ఎక్కువ మెరుస్తుంది తెర మీద ఏ రంగు మృదువుగా ఉంటుందో తెలుసుకోవడమే. మహానటితో నేను పని తెలుసుకున్నాను. ఆ సినిమాకు నాకు జాతీయ అవార్డు రావడం మరింత సంతోషం’ అందామె.
కల్కి సినిమాలో మహామహులకు...
‘కల్కి సినిమా మొదలెట్టే ముందు నిర్మాత దగ్గర నాగ్ అశ్విన్ పెట్టిన మొదటి షరతు నన్ను చీఫ్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఉంచాలని. నా మీద నాగ్ పెట్టుకున్న నమ్మకం అది. నాలుగేళ్ల క్రితం అతను ఈ కథను చెప్పినప్పుడు చాలా పెద్దప్రాజెక్ట్ అని అర్థమైంది. అశ్వత్థామ పాత్ర గురించి చెప్తే ఎవరు చేస్తున్నారు అనడిగాను. అమితాబ్ అన్నాడు. దాంతో నాకు ఎక్కడ లేని నెర్వస్‌నెస్ వచ్చింది. ఆయనను అశ్వత్థామగా చూపించడం ఎలా? మహాభారత కాలం నుంచి ఆయన జీవించే ఉన్నాడంటే నా మనసులో వచ్చిన భావం మనిషిని చూడగానే ఒక పురాతన వృక్షాన్ని చూసినట్టు ఉండాలని. ఆయనకు వాడే దుస్తులను మళ్లీ మళ్లీ పరీక్షకు పెట్టి తయారు చేశాను.
ఆయన ముఖానికి శరీరానికి ఉండే కట్లు రక్తం, పసుపు కలిసిపోయి ఏర్పడిన రంగులో ఉంచాను. మొదటిసారి అమితాబ్ నా కాస్ట్యూమ్స్ ధరించినప్పుడు అది సినిమా అని అక్కడున్నది సినిమా సెట్ అని తెలిసినా రోమాలు నిక్క΄÷డుచుకున్నాయి. ఇక ప్రభాస్ కోసం నేను డిజైన్ చేసిన సూట్‌ను కాలిఫోర్నియాలో తయారు చేయించాం. కమలహాసన్‌కు అయన వ్యక్తిగత డిజైనర్ సహాయంతో కలసి కాస్ట్యూమ్స్ చేశాను. సినిమాలో మూడు ప్రపంచాలుంటాయి. పిరమిడ్ సిటీలో కనిపించే ఆర్మీ కోసం కాస్ట్యూమ్స్‌ని మన దిష్టిబొమ్మల నుంచి ఇన్‌స్పయిర్ అయి చేశాను. కల్కి సినిమాకు అందరం కష్టపడి పని చేశాం. అది ప్రేక్షకులకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది’ అందామె.
Comments
Please login to add a commentAdd a comment