costumes design
-
Archana Rao: అశ్వత్థామకు దుస్తులు కుట్టింది
అశ్వత్థామకు మరణం లేదు. మహాభారత కాలం నుంచి కల్కి వచ్చే కాలం వరకూ బతికే ఉండాలి. మరి అతను ఎలా ఉంటాడు? ఆ పాత్ర ధరించింది సాక్షాత్తు అమితాబ్ అయితే అతన్ని అశ్వత్థామలా మార్చే దుస్తులు ఎలా ఉండాలి?తెలుగు ఫ్యాషన్ డిజైనర్ అర్చనా రావు ‘కల్కి’ సినిమాకు చీఫ్ ఫ్యాషన్ డిజైనర్‌గా అద్భుతంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి ప్రశంసలు అందుకుంటోంది. హైదరాబాద్ నిఫ్ట్‌లో, న్యూయార్క్‌లో చదువుకున్న అర్చనా రావు పరిచయం.‘సినిమాకు పని చేయడంలో అసలైన సవాలేమిటంటే పేపర్ మీద గీసుకున్నది తెర మీద కనిపించేలా చేయగలగాలి. అందుకు టీమ్ మొత్తంతో మంచి కోఆర్డినేషన్లో ఉండాలి’ అంటుంది అర్చనా రావు.హైదరాబాద్‌కు చెందిన అర్చనా రావుకు ‘అర్చనా రావు లేబుల్’ పేరుతో సొంత బ్రాండ్ ఉంది. ఆమె దుస్తుల డిజైనింగ్ మాత్రమే కాదు ప్రాడక్ట్ డిజైనింగ్ కూడా చేస్తుంది. అంటే పాదరక్షలు, హ్యాండ్ బ్యాగ్‌లు, బెల్ట్‌లు... అన్నీ హ్యాండ్‌మేడ్. ఆమె సృజన మొత్తంలో తప్పనిసరిగా భారతీయత కనిపిస్తుంది.‘నాకు ఇండియన్ కళాత్మక విలువలంటే ఇష్టం. అవే నన్ను కల్కి సినిమా కాస్టూమ్ డిజైనింగ్‌లో గెలిచేలా చేశాయి. నేడు నా పనికి మంచి ప్రశంసలు అందుతుంటే ఆనందంగా ఉంది’ అందామె.నిఫ్ట్ స్టూడెండ్అర్చనా రావు హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఆమెకు ఇష్టంగా ఉండేది. ఏదో ఒక సృజనాత్మక రంగంలో చదువు కొనసాగించాలనుకున్నా స్పష్టత రాలేదు. ఇంటర్ ముగిసే సమయానికి హైదరాబాద్‌లో నిఫ్ట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) ఏర్పడింది. అందులో క్లాత్ డిజైనింగ్ కోర్సుకు అప్లై చేస్తే సీటు వచ్చింది. ‘కాలేజీలో చేరాక ఇదే నేను చదవాల్సింది అని తెలిసొచ్చింది. మన దగ్గర క్రియేటివిటీ ఉండటం ఒకటైతే చదువు వల్ల తెలిసే విషయాలు ఉంటాయి. నిఫ్ట్‌లో ఒక ఫ్యాబ్రిక్‌కు సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ పూర్తిగా తెలిసింది. ఫ్యాషన్ డిజైన్ చేయాలంటే ముందు ఫ్యాబ్రిక్‌ని కనిపెట్టాలి. అలా చదువు పూర్తయ్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం న్యూయార్క్ వెళ్లాను. న్యూయార్క్ నగరమే ఒక క్యాంపస్. ఏ మనిషిని చూసినా ఏ వీధిని చూసినా ఫ్యాషన్ కనపడుతూనే ఉంటుంది. నేను మరింత ఎదగడానికి న్యూయార్క్ ఉపయోగపడింది. అయితే నేను అమెరికాలో స్థిరపడాలనుకోలేదు. ఇండియా ఫ్యాషన్ రంగంలో పుంజుకుంటోంది. నా పని ఇక్కడే అని నిశ్చయించుకుని వచ్చేశాను. నా బ్రాండ్ మొదలెట్టాను’ అని తెలిపిందామె.మహానటితో...దర్శకుడు నాగ్ అశ్విన్ ఏదో సందర్భంలో పరిచయం కావడంతో అతను ‘మహానటి’ చిత్రం కోసం కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేయమన్నాడు. ‘అప్పటికి నాకు సినిమాలకు కాస్ట్యూమ్స్ ఎలా తయారు చేయాలో తెలియదు. కాని నాగ్ అశ్విన్ ప్రోత్సాహంతో మహానటిలో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌లకు కాస్ట్యూమ్స్ చేశాను. కథాకాలాన్ని బట్టి 1940ల నాటి ఫ్యాషన్లను, 1980ల నాటి ఫ్యాషన్లను స్టడీ చేయాల్సి వచ్చింది. సినిమాలకు కాస్ట్యూమ్స్ చేయడంలో ముఖ్యమైన సంగతి ఏమిటంటే లైట్ పడితే ఏ రంగు ఎక్కువ మెరుస్తుంది తెర మీద ఏ రంగు మృదువుగా ఉంటుందో తెలుసుకోవడమే. మహానటితో నేను పని తెలుసుకున్నాను. ఆ సినిమాకు నాకు జాతీయ అవార్డు రావడం మరింత సంతోషం’ అందామె.కల్కి సినిమాలో మహామహులకు...‘కల్కి సినిమా మొదలెట్టే ముందు నిర్మాత దగ్గర నాగ్ అశ్విన్ పెట్టిన మొదటి షరతు నన్ను చీఫ్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఉంచాలని. నా మీద నాగ్ పెట్టుకున్న నమ్మకం అది. నాలుగేళ్ల క్రితం అతను ఈ కథను చెప్పినప్పుడు చాలా పెద్దప్రాజెక్ట్ అని అర్థమైంది. అశ్వత్థామ పాత్ర గురించి చెప్తే ఎవరు చేస్తున్నారు అనడిగాను. అమితాబ్ అన్నాడు. దాంతో నాకు ఎక్కడ లేని నెర్వస్నెస్ వచ్చింది. ఆయనను అశ్వత్థామగా చూపించడం ఎలా? మహాభారత కాలం నుంచి ఆయన జీవించే ఉన్నాడంటే నా మనసులో వచ్చిన భావం మనిషిని చూడగానే ఒక పురాతన వృక్షాన్ని చూసినట్టు ఉండాలని. ఆయనకు వాడే దుస్తులను మళ్లీ మళ్లీ పరీక్షకు పెట్టి తయారు చేశాను. ఆయన ముఖానికి శరీరానికి ఉండే కట్లు రక్తం, పసుపు కలిసిపోయి ఏర్పడిన రంగులో ఉంచాను. మొదటిసారి అమితాబ్ నా కాస్ట్యూమ్స్ ధరించినప్పుడు అది సినిమా అని అక్కడున్నది సినిమా సెట్ అని తెలిసినా రోమాలు నిక్క΄÷డుచుకున్నాయి. ఇక ప్రభాస్ కోసం నేను డిజైన్ చేసిన సూట్‌ను కాలిఫోర్నియాలో తయారు చేయించాం. కమలహాసన్‌కు అయన వ్యక్తిగత డిజైనర్ సహాయంతో కలసి కాస్ట్యూమ్స్ చేశాను. సినిమాలో మూడు ప్రపంచాలుంటాయి. పిరమిడ్ సిటీలో కనిపించే ఆర్మీ కోసం కాస్ట్యూమ్స్‌ని మన దిష్టిబొమ్మల నుంచి ఇన్‌స్పయిర్ అయి చేశాను. కల్కి సినిమాకు అందరం కష్టపడి పని చేశాం. అది ప్రేక్షకులకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది’ అందామె. -
నవరాత్రి ఉత్సాహం
దాండియా నృత్యానికి కళ తెచ్చే దుస్తుల జాబితాలో ముందు వరసలో ఉండేది లెహెంగా చోలీ. చనియా చోలీగా గిరిజన సంప్రదాయ కళ ఓ వైపు అబ్బురపరుస్తుంది.మనవైన చేనేతల గొప్పతనం మరోవైపు కళ్లకు కడుతుంది.అద్దకం కొత్తగా మెరిసిపోతుంటుంది. ఎరుపు, పచ్చ, పసుపు... రంగుల ప్రపంచంలో మునిగిపోయినట్టుగా ఉంటుంది.లెహంగా అంచులు నృత్యంతో పోటీపడుతుంటే ఆనందానికి ఆకాశమే హద్దు అవుతుంది. రాజస్థానీ కళ గిరిజన సంప్రదాయ కళ ఉట్టిపడే ఎంబ్రాయిడరీ చనియా చోలీలు ఇప్పుడు నగరాల్లో జరిగే దాండియా వేడుకలలో తెగ వెలిగిపోతున్నాయి. వాటిని ధరించిన అమ్మాయిలు ఆటపాటల కోలాటంలో తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. మనవైన ఫ్లోరల్స్ నృత్యం ఎప్పుడూ ఆనందాన్ని రెట్టింపు చేస్తూనే ఉంటుంది. ఆ ఆనందంతో పోటీ పడే దుస్తుల్లో ఫ్లోరల్స్ కూడా తమ స్థానాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. సంప్రదాయ కళతో పాటు కొద్దిగా ఆధునికత కూడా ఉట్టిపడాలనుకునేవారు ఫ్లోరల్ గాగ్రా చోలీలు ఎంచుకోవచ్చు. బ్లాక్ ప్రింట్స్ కలంకారీ, గుజరాతీ బ్లాక్ ప్రింట్స్ గాగ్రా చోలీలు దాండియాలో తమ వైభవాన్ని చాటడానికి పోటీపడుతుంటాయి. టాప్ టు బాటమ్ ఒకే కలర్, ప్రింట్స్‌తో ఉండే ఈ డ్రెస్సులు గ్రాండ్‌గా కనిపిస్తుంటాయి. -
అచ్చు శునకంలా
జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి. వెర్రి వేయి విధాలు. జపాన్‌లో ఓ వ్యక్తి చేసిన పని చూస్తే ఇలాంటి సామెతలన్నీ వరుసబెట్టి గుర్తు రాక మానవు! అచ్చం కుక్కలా కనిపించేందుకు మనవాడు ఏకంగా 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. పైగా ఆ వేషంలో ఆరుబయట యథేచ్ఛగా తిరిగాడు. అలా జీవితకాల ముచ్చట నెరవేర్చుకుని మురిసిపోయాడు! జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఓ యూ ట్యూబర్. తన చానల్ పేరేమిటో తెలుసా? ఐ వాంట్ టు బీ యాన్ యానిమల్’ (జంతువులా మారాలనుకుంటున్నా). దానికి ఏకంగా 31 వేల మందికి పైగా సబ్స్రై్కబర్లున్నారు. మనవాడి జీవితకాలపు కోరికుంది. ఏమిటో తెలుసా? ఎలాగైనా కుక్కలా మారడం! దాన్ని తీర్చుకోవడానికి జపాన్‌లో సినిమాలకు, టీవీ షోలకు కాస్ట్యూమ్స్ సరఫరా చేసే జెప్పెట్ అనే ప్రముఖ స్థానిక కంపెనీని సంప్రదించాడు. తన కోరిక వివరించాడు. అచ్చం కుక్కలా కనిపించే కాస్ట్యూమ్ డిజైన్ చేసిచ్చేందుకు వాళ్లూ సరేనన్నారు. అయితే తాను కుక్కను కాదని మనుషులు కాదు కదా, కనీసం కుక్కలు గుర్తు పట్టొద్దని టోకో షరతు విధించాడు. కుక్క వేషంలో తన లుక్ అంత సహజంగా ఉండాలన్నాడు. అందుకోసమని ఏకంగా 20 లక్షల యెన్లు (రూ.12 లక్షలు) చెల్లించాడు. కంపెనీ వాళ్లు దీన్నో సవాలుగా తీసుకున్నారు. 40 రోజులు కష్టపడి మరీ టోకోకు కావాల్సిన కుక్క కాస్ట్యూమ్ తయారు చేసిచ్చారు. పార్కులో ‘డాగ్’ వాక్ ► అంతా రెడీ అయ్యాక, ఒక మంచి రోజు చూసుకుని తను తయారుచేయించుకున్న కుక్క వేషం వేసి మనవాడు తొలిసారిగా షికారుకు బయల్దేరాడు. సమీపంలోని పార్కుకు వెళ్లి సందడి చేశాడు. అచ్చం కుక్కలా దొర్లుతూ, తోటి కుక్కల దగ్గరికెళ్లి వాటిని వాసన చూస్తూ హడావుడి చేశాడు. దీన్నంతటినీ వీడియో తీయించుకోవడం మర్చిపోలేదు. దాన్ని తన యూట్యూబ్ చానళ్లో అప్లోడ్ చేస్తే చూస్తుండగానే 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చి పడ్డాయి! ‘‘నా కుక్క వేషం సూపర్‌హిట్టయింది. జీవితకాల కలా నెరవేరింది. వీడియో కూడా బంపర్ హిట్టయింది. ఎలా చూసుకున్నా కుక్క వేషం కోసం పడ్డ ప్రయాసకు తగిన ఫలితం దక్కింది’’ అంటూ టోకో సంబరపడిపోతున్నాడు. గతేడాదే చెప్పాడు ► మనోడు తన మనోగతాన్ని గతేడాదే బయట పెట్టాడు. మానవ శునకంగా మారాలనుందని డైలీ మెయిల్ వార్తా పత్రిక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘‘ఇలాంటి నా అభిరుచులు బయటికి తెలియడం నాకిష్టముండదు. ముఖ్యంగా నా సహోద్యోగులకు. ఎందుకంటే మరీ కుక్కలా మారాలనుందంటే వాళ్లకు విచిత్రంగా తోస్తుందేమో కదా! అందుకే ఇప్పుడు నా అసలు రూపం ఎలా ఉంటుందో అందరికీ చూపించదలచలేదు. ఇలా కుక్కలా మారాలనుందని నా క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా చెప్పలేదు. పిచ్చనుకుంటారేమోనని భయం’’ అన్నాడు టోకో! కుక్క వేషంలో తొలిసారి పార్కుకు వెళ్లినప్పుడు కాస్త నెర్వస్‌గా, మరికాస్త భయంగా అనిపించిందట మనవాడికి. ‘‘అయితే, అక్కడ నన్ను చూసిన మనుషులతో పాటు కనీసం కుక్కలు కూడా నేను కుక్కను కాదని పొరపాటున కూడా అనుకోలేదు. అంటే నా మిషన్ గ్రాండ్ సక్సెస్ అన్నట్టే కదా’’ అంటూ సంబరపడిపోయాడు. టోకో కోరిక మేరకు కోలీ జాతి కుక్కలాంటి కాస్ట్యూమ్ తయారు చేసిచ్చాం. అది వేసుకున్న వాళ్లు కుక్క కాదని చెప్పినా ఎవరూ నమ్మరు. అంత సహజంగా కుదిరిందది – కాస్ట్యూమ్స్ తయారీ కంపెనీ జెప్పెట్ అధికార ప్రతినిధి -
హర్నాజ్ తళుకులకు ఆమే కారణం.. క్రౌన్ గౌన్ బై షిండే!
ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ వేదికపై విశ్వసుందరి కిరీటంతో మెరిసింది మన హర్నాజ్ సంధు. గ్రాండ్ ఫినాలేలో సిల్వర్ గౌనులో వచ్చి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆమెను వరించిన విశ్వసుందరి కిరీటానికే వన్నె తెచ్చినట్టుగా కనిపించింది ఆ గౌను. దీంతో ఇనుమడించిన అందంతో వెలిగిపోయింది హర్నాజ్. మన భారతీయ అందాన్ని ప్రపంచ అందాల వేదికపై చూపు తిప్పుకోనియ్యకుండా చేసింది డిజైనర్ సైషా షిండే. నలభై ఏళ్ల సైషా షిండే ఇండియాలో ఉన్న కొద్దిమంది ట్రాన్స్‌జెండర్ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరు. గత పదిహేనేళ్లుగా బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాణిస్తోంది. ఈ క్రమంలోనే హర్నాజ్ కోరిక మేరకు సిల్వర్ గౌన్‌ను ఎంతో ప్రత్యేకంగా రూపొందించింది సైషా. ఫుల్కారీ ప్యాటర్న్‌కు ఎంబ్రాయిడరీ, స్టోన్స్, సీక్వెన్స్‌లను జోడించి పంజాబీ సంప్రదాయం ఉట్టిపడేలా గౌన్‌ను రూపొందించింది. ముంబైకి చెందిన సైషా షిండే.. ఎనిమిదో తరగతిలో ఉండగా గియన్ని వెర్సేస్ ఫ్యాషన్ షోను టీవీలో చూసింది. ఆ ఫ్యాషన్ షో బాగా నచ్చడంతో..అప్పుడే ఫ్యాషన్ డిజైనర్ కావాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులు కూడా ఆ నిర్ణయానికి ఒప్పుకున్నప్పటికీ, ముందు చక్కగా చదువుకోవాలని కండీషన్ పెట్టారు. దానికి తగ్గట్టుగానే చదువుకుంటూ ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిగ్రీ చేసింది. తరువాత మిలాన్ లో ఫ్యాషన్ డిప్లొమా చేసింది. ఫ్యాషన్ షోలలో డిజైనర్‌గా పనిచేస్తోన్న సమయంలో.. మధుర్ భండార్కర్ తీసిన ‘ఫ్యాషన్’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవకాశం వచ్చింది. దీంతో సినిమాలో ప్రియాంక చోప్రా ధరించిన డ్రెస్‌లన్నీ షిండే రూపొందించి మంచి డిజైనర్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ల్యాక్మే ఫ్యాషన్ హౌస్’ టీవీ షోలో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఆ తరువాత ఆరునెలల ఇంటర్న్‌షిప్ చేసింది. ప్రముఖ డిజైనర్లు పాల్గొనే అమెరికన్ టీవీ సిరీస్ ‘ప్రాజెక్ట్ రన్‌వే’ సీజన్ 14లో పాల్గొని ఆరో స్థానంలో నిలిచింది. ఐశ్వర్యారాయ్, సన్నీలియోన్, కరీనా కపూర్ ఖాన్, కియరా అడ్వాణీ, కత్రినా కైఫ్, అనుష్క శర్మ, శ్రద్ధా కపూర్, దీపికా పదుకొనే, తాప్సీ పొన్ను, మాధురీ దీక్షిత్ వంటివారికి డిజైనర్‌గా పనిచేసిన షిండే మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాల కోసం పోటీపడే మోడల్స్‌ను మరింత అందంగా కనిపించేలా డ్రెస్‌లు రూపొందించడంలో విశేషం ఏముంది? వీటితోపాటు అనేక ఫ్యాషన్ షోలకు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేస్తూ మంచి డిజైనర్‌గా రాణిస్తోంది. ఇలా మారింది సైషా షిండే అసలు పేరు స్వప్నిల్ షిండే. పుట్టినప్పటి నుంచి అబ్బాయిగా పెరిగిన షిండేకు .. అమ్మాయిల్లా తయారవాలని అనిపించేది. ఈ ఇష్టం కూడా ఫ్యాషన్‌ను కెరియర్‌గా ఎంచుకునేందుకు ప్రేరేపించింది. డిగ్రీలో ఉన్నప్పుడే తను అబ్బాయి కాదు అమ్మాయిని అని అర్థమైంది. ఇరవై ఏళ్ల వయసులో తెలిసిన ఆ నిజాన్ని జీర్ణించు కోవడానికి షిండేకు కొన్నేళ్లు పట్టింది. తర్వాత బాగా ఆలోచించుకుని తన నిజమైన రూపంతోనే మిగతా జీవితాన్ని గడపాలనుకుంది. నేను ‘గే’ని కాను .. ట్రాన్స్ ఉమెన్ను అని ఈ ఏడాది జనవరిలో సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి ప్రకటించింది. ఇక నుంచి తన పేరు స్వప్నిల్ షిండే కాదు సైషా షిండే అని స్పష్టం చేసింది. అప్పటి నుంచి సైషా షిండేగా పిలవబడుతోంది. ఇరవై ఏళ్ల నాటి కల.. ఎన్ఐఎఫ్టీలో సైషా ఫ్యాషన్ డిగ్రీ చదువుతోన్న సమయంలో లారాదత్తా మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. అది చూసిన షిండే ‘‘ఇలా మిస్‌యూనివర్స్ కిరీటం దక్కించుకునే విన్నర్‌కు నేను ఏదోక రోజు డ్రెస్ డిజైన్ చేస్తాను’’ అని మనసులో అనుకుంది. అప్పటి కల ఇప్పుడు హర్నాజ్ రూపంలో తీరింది. హర్నాజ్.. తన గ్రాండ్ ఫినాలే డ్రెస్ ఎలా ఉండాలో చెప్పినప్పుడు ఈమె తప్పకుండా విన్నర్ అవుతుందని షిండే అనుకుంది. హార్నాజ్ కోరుకున్నట్లుగా సిల్వర్ గౌన్ రూపొందించింది. ఇప్పుడు ‘మిస్ యూనివర్స్’ గౌన్ రూపొందించినందుకు ఎంతో సంతోషంగానూ గర్వంగానూ ఉందని షిండే సంబరపడిపోతోంది. -
ఆండ్రియాకు కాస్ట్యూమ్ డిజైనింగ్
కథానాయికలు ముదిరితే కాస్ట్యూమ్ డిజైనర్లు అవుతారనేది సినీ పరిశ్రమ తాజా నానుడి. ఈ జాబితాలో ఒకప్పటి కథానాయిక గౌతమికి ఎప్పటినుంచో స్థానం ఉంది. కమల్‌హాసన్ నటించే సినిమాల్లో ఆయనకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది గౌతమి అన్న విషయం పరిశ్రమలో అందరికీ తెలుసు. తాజాగా ఆమె ఒక అడుగు ముందుకు వేసి, కథానాయిక ఆండ్రియాకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. త్వరలో మొదలు కానున్న ‘ఉత్తమ విలన్’ చిత్రంలో కమల్ సరసన ఆండ్రియా ఒక నాయికగా చేస్తున్నారు. భవిష్యత్తులో మరికొంతమంది కథానాయికలకు గౌతమి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసే ఉద్దేశంలో ఉన్నారట.