జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి. వెర్రి వేయి విధాలు. జపాన్‌లో ఓ వ్యక్తి చేసిన పని చూస్తే ఇలాంటి సామెతలన్నీ వరుసబెట్టి గుర్తు రాక మానవు! అచ్చం కుక్కలా కనిపించేందుకు మనవాడు ఏకంగా 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. పైగా ఆ వేషంలో ఆరుబయట యథేచ్ఛగా తిరిగాడు. అలా జీవితకాల ముచ్చట నెరవేర్చుకుని మురిసిపోయాడు!
జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఓ యూ ట్యూబర్. తన చానల్ పేరేమిటో తెలుసా?
ఐ వాంట్ టు బీ యాన్ యానిమల్’ (జంతువులా మారాలనుకుంటున్నా). దానికి ఏకంగా 31 వేల మందికి పైగా సబ్‌స్రై్కబర్లున్నారు. మనవాడి జీవితకాలపు కోరికుంది. ఏమిటో తెలుసా? ఎలాగైనా కుక్కలా మారడం! దాన్ని తీర్చుకోవడానికి జపాన్‌లో సినిమాలకు, టీవీ షోలకు కాస్ట్యూమ్స్ సరఫరా చేసే జెప్పెట్ అనే ప్రముఖ స్థానిక కంపెనీని సంప్రదించాడు. తన కోరిక వివరించాడు. అచ్చం కుక్కలా కనిపించే కాస్ట్యూమ్ డిజైన్ చేసిచ్చేందుకు వాళ్లూ సరేనన్నారు. అయితే తాను కుక్కను కాదని మనుషులు కాదు కదా, కనీసం కుక్కలు గుర్తు పట్టొద్దని టోకో షరతు విధించాడు. కుక్క వేషంలో తన లుక్ అంత సహజంగా ఉండాలన్నాడు. అందుకోసమని ఏకంగా 20 లక్షల యెన్‌లు (రూ.12 లక్షలు) చెల్లించాడు. కంపెనీ వాళ్లు దీన్నో సవాలుగా తీసుకున్నారు. 40 రోజులు కష్టపడి మరీ టోకోకు కావాల్సిన కుక్క కాస్ట్యూమ్ తయారు చేసిచ్చారు.
పార్కులో ‘డాగ్’ వాక్
► అంతా రెడీ అయ్యాక, ఒక మంచి రోజు చూసుకుని తను తయారుచేయించుకున్న కుక్క వేషం వేసి మనవాడు తొలిసారిగా షికారుకు బయల్దేరాడు. సమీపంలోని పార్కుకు వెళ్లి సందడి చేశాడు. అచ్చం కుక్కలా దొర్లుతూ, తోటి కుక్కల దగ్గరికెళ్లి వాటిని వాసన చూస్తూ హడావుడి చేశాడు. దీన్నంతటినీ వీడియో తీయించుకోవడం మర్చిపోలేదు. దాన్ని తన యూట్యూబ్ చానళ్లో అప్‌లోడ్ చేస్తే చూస్తుండగానే 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చి పడ్డాయి! ‘‘నా కుక్క వేషం సూపర్‌హిట్టయింది. జీవితకాల కలా నెరవేరింది. వీడియో కూడా బంపర్ హిట్టయింది. ఎలా చూసుకున్నా కుక్క వేషం కోసం పడ్డ ప్రయాసకు తగిన ఫలితం దక్కింది’’ అంటూ టోకో సంబరపడిపోతున్నాడు.
గతేడాదే చెప్పాడు
► మనోడు తన మనోగతాన్ని గతేడాదే బయట పెట్టాడు. మానవ శునకంగా మారాలనుందని డైలీ మెయిల్ వార్తా పత్రిక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘‘ఇలాంటి నా అభిరుచులు బయటికి తెలియడం నాకిష్టముండదు. ముఖ్యంగా నా సహోద్యోగులకు. ఎందుకంటే మరీ కుక్కలా మారాలనుందంటే వాళ్లకు విచిత్రంగా తోస్తుందేమో కదా! అందుకే ఇప్పుడు నా అసలు రూపం ఎలా ఉంటుందో అందరికీ చూపించదలచలేదు. ఇలా కుక్కలా మారాలనుందని నా క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా చెప్పలేదు. పిచ్చనుకుంటారేమోనని భయం’’ అన్నాడు టోకో! కుక్క వేషంలో తొలిసారి పార్కుకు వెళ్లినప్పుడు కాస్త నెర్వస్‌గా, మరికాస్త భయంగా అనిపించిందట మనవాడికి. ‘‘అయితే, అక్కడ నన్ను చూసిన మనుషులతో పాటు కనీసం కుక్కలు కూడా నేను కుక్కను కాదని పొరపాటున కూడా అనుకోలేదు. అంటే నా మిషన్ గ్రాండ్ సక్సెస్ అన్నట్టే కదా’’ అంటూ సంబరపడిపోయాడు.
టోకో కోరిక మేరకు కోలీ జాతి కుక్కలాంటి కాస్ట్యూమ్ తయారు చేసిచ్చాం. అది వేసుకున్న వాళ్లు కుక్క కాదని చెప్పినా ఎవరూ నమ్మరు. అంత సహజంగా కుదిరిందది
– కాస్ట్యూమ్స్ తయారీ కంపెనీ జెప్పెట్ అధికార ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment