realistic
-
అచ్చు శునకంలా
జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి. వెర్రి వేయి విధాలు. జపాన్‌లో ఓ వ్యక్తి చేసిన పని చూస్తే ఇలాంటి సామెతలన్నీ వరుసబెట్టి గుర్తు రాక మానవు! అచ్చం కుక్కలా కనిపించేందుకు మనవాడు ఏకంగా 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. పైగా ఆ వేషంలో ఆరుబయట యథేచ్ఛగా తిరిగాడు. అలా జీవితకాల ముచ్చట నెరవేర్చుకుని మురిసిపోయాడు! జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఓ యూ ట్యూబర్. తన చానల్ పేరేమిటో తెలుసా? ఐ వాంట్ టు బీ యాన్ యానిమల్’ (జంతువులా మారాలనుకుంటున్నా). దానికి ఏకంగా 31 వేల మందికి పైగా సబ్స్రై్కబర్లున్నారు. మనవాడి జీవితకాలపు కోరికుంది. ఏమిటో తెలుసా? ఎలాగైనా కుక్కలా మారడం! దాన్ని తీర్చుకోవడానికి జపాన్‌లో సినిమాలకు, టీవీ షోలకు కాస్ట్యూమ్స్ సరఫరా చేసే జెప్పెట్ అనే ప్రముఖ స్థానిక కంపెనీని సంప్రదించాడు. తన కోరిక వివరించాడు. అచ్చం కుక్కలా కనిపించే కాస్ట్యూమ్ డిజైన్ చేసిచ్చేందుకు వాళ్లూ సరేనన్నారు. అయితే తాను కుక్కను కాదని మనుషులు కాదు కదా, కనీసం కుక్కలు గుర్తు పట్టొద్దని టోకో షరతు విధించాడు. కుక్క వేషంలో తన లుక్ అంత సహజంగా ఉండాలన్నాడు. అందుకోసమని ఏకంగా 20 లక్షల యెన్లు (రూ.12 లక్షలు) చెల్లించాడు. కంపెనీ వాళ్లు దీన్నో సవాలుగా తీసుకున్నారు. 40 రోజులు కష్టపడి మరీ టోకోకు కావాల్సిన కుక్క కాస్ట్యూమ్ తయారు చేసిచ్చారు. పార్కులో ‘డాగ్’ వాక్ ► అంతా రెడీ అయ్యాక, ఒక మంచి రోజు చూసుకుని తను తయారుచేయించుకున్న కుక్క వేషం వేసి మనవాడు తొలిసారిగా షికారుకు బయల్దేరాడు. సమీపంలోని పార్కుకు వెళ్లి సందడి చేశాడు. అచ్చం కుక్కలా దొర్లుతూ, తోటి కుక్కల దగ్గరికెళ్లి వాటిని వాసన చూస్తూ హడావుడి చేశాడు. దీన్నంతటినీ వీడియో తీయించుకోవడం మర్చిపోలేదు. దాన్ని తన యూట్యూబ్ చానళ్లో అప్లోడ్ చేస్తే చూస్తుండగానే 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చి పడ్డాయి! ‘‘నా కుక్క వేషం సూపర్‌హిట్టయింది. జీవితకాల కలా నెరవేరింది. వీడియో కూడా బంపర్ హిట్టయింది. ఎలా చూసుకున్నా కుక్క వేషం కోసం పడ్డ ప్రయాసకు తగిన ఫలితం దక్కింది’’ అంటూ టోకో సంబరపడిపోతున్నాడు. గతేడాదే చెప్పాడు ► మనోడు తన మనోగతాన్ని గతేడాదే బయట పెట్టాడు. మానవ శునకంగా మారాలనుందని డైలీ మెయిల్ వార్తా పత్రిక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘‘ఇలాంటి నా అభిరుచులు బయటికి తెలియడం నాకిష్టముండదు. ముఖ్యంగా నా సహోద్యోగులకు. ఎందుకంటే మరీ కుక్కలా మారాలనుందంటే వాళ్లకు విచిత్రంగా తోస్తుందేమో కదా! అందుకే ఇప్పుడు నా అసలు రూపం ఎలా ఉంటుందో అందరికీ చూపించదలచలేదు. ఇలా కుక్కలా మారాలనుందని నా క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా చెప్పలేదు. పిచ్చనుకుంటారేమోనని భయం’’ అన్నాడు టోకో! కుక్క వేషంలో తొలిసారి పార్కుకు వెళ్లినప్పుడు కాస్త నెర్వస్‌గా, మరికాస్త భయంగా అనిపించిందట మనవాడికి. ‘‘అయితే, అక్కడ నన్ను చూసిన మనుషులతో పాటు కనీసం కుక్కలు కూడా నేను కుక్కను కాదని పొరపాటున కూడా అనుకోలేదు. అంటే నా మిషన్ గ్రాండ్ సక్సెస్ అన్నట్టే కదా’’ అంటూ సంబరపడిపోయాడు. టోకో కోరిక మేరకు కోలీ జాతి కుక్కలాంటి కాస్ట్యూమ్ తయారు చేసిచ్చాం. అది వేసుకున్న వాళ్లు కుక్క కాదని చెప్పినా ఎవరూ నమ్మరు. అంత సహజంగా కుదిరిందది – కాస్ట్యూమ్స్ తయారీ కంపెనీ జెప్పెట్ అధికార ప్రతినిధి -
కారులో చిన్నారి.. అద్దాలు పగులకొట్టిన పోలీసు.. ట్విస్ట్ ఏంటంటే
లండన్: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల బొమ్మలు ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. వాటిని చూస్తుంటూ.. నిజమైనవేవో, టెడ్డీ బొమ్మలేవో గుర్తుపట్టలేనంతగా ఒకేలా ఉంటున్నాయి.. తాజాగా జరిగిన ఒక ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వివరాలు.. ఈ ఘటన యూకేలోని క్లీవ్ ల్యాండ్ జరిగింది. అమీ క్విల్లెన్ అనే మహిళ.. తన కూతురు డార్సితో కలిసి షాపింగ్ చేయడానికి వెళ్లింది. డార్సి తాను.. ఆడుకుంటున్న చిన్న బొమ్మను కారు ముందటి సీటులో పెట్టింది. అది అచ్చం చిన్నారిని పోలి ఉంది. అమీ క్విల్లెన్ షాప్‌లోపలికి వెళ్లిపోయారు. అప్పుడు మరోక వ్యక్తి తన కారును పార్క్ చేయడానికి అక్కడికి చేరుకున్నాడు. అతను కారులో ఒక చిన్నారి ఉండటాన్ని గమనించాడు. దానికి సీటు బెల్టు కూడా ఉంది. వెంటనే ఆశ్చర్యపోయాడు. అతను.. చుట్టుపక్కల ఉన్నవారిని అప్రమత్తం చేశాడు. కారు యజమాని కోసం వెతికారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు కారులో చిన్నారిని చూశారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కారు అద్దాలను పగులగొట్టారు. అప్పుడు వారు కారు సీటులో ఉన్న చిన్నారిని చూసి షాకింగ్‌కు గురయ్యారు. కారులో ఉన్నది.. నిజమైన చిన్నారి కాదు.. కేవలం బొమ్మమాత్రమే. పాపం.. ఆ బొమ్మ.. అచ్చం చిన్నారిని పోలీ ఉండటం వలన స్థానికులతో పాటు.. పోలీసులు కూడా గందరగోళానికి గురయ్యారు. ఆ తర్వాత.. అక్కడికి చేరుకున్న అమీ క్విల్లెన్కు, పోలీసులు జరిగిన విషయం తెలిపారు. ఆ బొమ్మ.. తన కూతురికి ఎంతో ఇష్టమని తెలిపారు. క్రిస్టమస్‌కు గిఫ్ట్‌గా ఇచ్చామని తెలిపారు. కాగా, దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు. ఆ తర్వాత , కారు మరమ్మత్తుల కోసం డబ్బులు చెల్లిస్తామని ప్రకటించారు. చదవండి: ‘కొందరు మనుషుల కన్నా.. నోరు లేని జీవాలే నయం’ . వైరల్ వీడియో -
భవిష్యత్‌ను పెన్సిల్‌తో డిజైన్ చేసుకోవాలి.. ఎందుకంటే?
‘పెన్సిల్ మరియు కల ఈ రెండు మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళతాయి’ అన్నాడు పెన్సిల్‌ను అమితంగా అభిమానించే కళాకారుడు. ‘భవిష్యత్‌ను పెన్సిల్‌తో డిజైన్ చేసుకోవాలి. ఎందుకంటే మార్పుచేర్పులకు అవకాశం ఉంటుంది’ అన్నాడు తాత్వికుడు. ఎవరు ఏ కోణంలో తమ ‘ఫేవరెట్’ చేసుకున్నా, పెన్సిల్ ప్రేమికులకు కొదవ లేదు. ‘హైపర్ రియలిస్టిక్ పెన్సిల్ డ్రాయింగ్’పై ఇప్పుడు యూత్ మనసు పారేసుకుంటోంది... జేడీ హిల్బెరీ సంగీతకారుడు కావాలనుకొని పెన్సిల్ చిత్రకారుడయ్యారు. అయితేనేం... ఈ ఆర్ట్‌లో జేడీకి వచ్చిన పేరు ఇంతా అంతా కాదు. ఆయన వెబ్సైట్లోకి వెళితే అద్భుతమైన ఎన్నో పెన్సిల్ చిత్రాలు పలకరిస్తాయి. ‘లెర్న్ మై టెక్నిక్’ అంటూ వీడియో ట్యుటోరియల్స్ విజయవంతంగా నడుపుతున్నారు జేడీ. ‘పెన్సిల్ అంటే స్కూల్ రోజులు గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు అద్భుతమైన కళారూపాలు మదిలో మెదులుతున్నాయి’ అంటున్నాడు 20 సంవత్సరాల స్పానిష్ స్టూడెంట్ నికోలస్. ‘లెర్న్ మై టెక్నిక్’ను ఫాలో అవుతూ తనదైన సొంతశైలిని సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నాడు నికోలస్. హైపర్ రియలిస్టిక్ పెన్సిల్ డ్రాయింగ్ కళలో ఇండోనేషియన్ ఆర్టిస్ట్ వెరి ఆప్రియాంటో ఉద్దండ పిండం. మాట్లాడే భాష అర్థం కాకపోయినా ఆయన టాలెంట్ ఏమిటో నెట్డాట్ టాక్ షోలో చూడవచ్చు. మాట్లాడుతూనే కెమెరాతో ఫోటో తీసినట్టు పెన్సిల్‌తో ‘ఆహా ’అనిపించే బొమ్మ గీస్తాడు. కాలేజీ విద్యార్థులు ఎంత శ్రద్ధగా వింటున్నారో! (ఆయన మాటలు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌గా వస్తే మనలాంటి వాళ్లకు ఎంత ప్రయోజనమో కదా!) బ్రిటన్ పెన్సిల్ ఆర్టిస్ట్ కెల్విన్ వోకఫోర్కు ముఖాలు మాత్రమే గీయడం అంటే ఇష్టం. దీనికి ముఖ్య కారణం... ‘ప్రతి ముఖం తనదైన భావోద్వేగాలను, చరిత్రను చెప్పకనే చెబుతుంది’ అంటారు కెల్విన్. ఇక సెల్ఫ్–టాట్ సౌత్ ఆఫ్రికన్ ఆర్టిస్ట్ జోనో డ్రై ఫోటోరియలిజం, సర్రియలిజంలను మిక్స్ చేసి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నైజీరియన్ ఆర్టిస్ట్ ఎ.స్టాన్లీ ఎగ్బెన్గ్యూ ఆరు సంవత్సరాల వయసు నుంచే పెన్సిల్ పట్టాడు. 28 సంవత్సరాల స్టాన్లీ ఇంజనీర్, యాక్టివిస్ట్, ఫోటోగ్రాఫర్, ఎంటర్ప్రెన్యూర్. అయితే ఆయనకు హైపర్ రియలిస్టిక్ పెన్సిల్ ఆర్టిస్ట్‌గానే ఎక్కువ గుర్తింపు ఉంది. ‘మనలోని సృజనను బొమ్మగా మార్చే శక్తి పెన్సిల్ కు ఉంది’ అంటాడు స్టాన్లీ. ఇక మన దేశంలో వైభవ్ తివారి... మొదలైన వాళ్లు ‘వాహ్వా! పెన్సిల్ డ్రాయింగ్’ అనిపిస్తున్నారు. యూత్‌ను తెగ ఆకట్టుకుంటున్నారు. మరి మీరెప్పుడు! మీరు సైతం... స్కెచింగ్ డ్రాయింగ్ ఫోటో ఎడిటర్ ‘పెన్సిల్ ఫోటో స్కెచ్’ యాప్‌తో మీరు కూడా ముచ్చటగా ఆర్టిస్ట్‌గా మారవచ్చు. మీ ఫోటో లేదా మీ ఫ్రెండ్స్ ఫోటోలను ఆకట్టుకునే పెన్సిల్ స్కెచ్‌లుగా మార్చవచ్చు. పెన్సిల్ స్కెచ్‌తో పాటు లైట్ స్కెచ్, కార్టూన్ ఆర్ట్, కలర్ డ్రాయింగ్...మొదలైన ఎఫెక్ట్లు ఇందులో ఉన్నాయి. ఇలా ఎందుకు? రియల్‌గానే నేర్చుకుందాం... అని డిసైడైతే డ్రాయింగ్ రియలిస్టిక్ పెన్సిల్ పోట్రాయిట్స్ స్టెప్ బై స్టెప్(జస్టిన్ మాస్)... మొదలైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక మీ ఇష్టం! చదవండి: పద్మశ్రీ పంకజాక్షి మనుమరాలు ఏదో చేయాలి.. ఏం చేద్దాం.. ‘కొబ్బరి చిప్పలను ఏం చేస్తున్నారు’ -
మాట్లాడే మహిళా రోబో!
శాస్త్ర సాంకేతిక రంగంలో ముందున్న చైనా పరిశోధకులు తాజా ప్రయత్నంలో భాగంగా మాట్లాడే రోబోను సృష్టించారు. రోబోలు నడవటం, పనులు చేయడం వంటివి ఎన్నో ఇంతకు ముందే చూశాం. అయితే వీటికి భిన్నంగా మాట్లాడే మరమనిషిని కనిపెట్టి మరోసారి విజయవంతమయ్యారు. అచ్చం అమ్మాయిలా ఉండే ముఖ కవళికలతోపాటు మాటలకు అనుగుణంగా కదిలే నోరు, పెదాలతో చైనా పరిశోధకులు వినూత్న సృష్టికి శ్రీకారం చుట్టారు. మరమనిషిలా కాక, సహజత్వం ఉట్టిపడేలా జియా జియా ఇప్పుడు చైనా వాసులనే కాక అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణ మహిళ రూపంలో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. పెదాల కదలికలు, కళ్ళు తిప్పడంతో సహా అచ్చంగా మనిషిని పోలి ఉండటం జియా జియా ప్రత్యేకత అంటున్నారు చైనా యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు. ఈ కొత్త రోబో క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారంగా తన సేవలు అందిస్తుందని చెప్తున్నారు. ముందుగా ఫీడ్ చేస్తేనో, కీ ఇస్తేనో మాట్లాడటం కాక, ఇతరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తల ఊపడం, దగ్గరగా వచ్చిన వారిని స్పర్శించడం వంటి కొత్త విషయాలను ఈ వినూత్న రోబోలో పొందుపరిచారు. మూడు సంవత్సరాలపాటు కష్టపడి పరిశోధకులు జియా జియా కదలికలను తీర్చి దిద్దారు. రోబో సృష్టికర్త చెన్ జియోపింగ్ పలకరిస్తే చాలు.. చక్కగా సమాధానం ఇస్తున్న రోబోను చూసి మీడియా ప్రతినిధులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఫోటోలతో ముంచెత్తారు. ఇదెంతో అద్భుతమంటూ అభినందనలు కురిపించారు. టెక్నాలజీని మరింత అభివృద్ధి పరచి, జియా జియా మాట్లాడటంతోపాటు, నవ్వడం, ఏడ్వటం కూడ చేసేట్లుగా పరిశోధకులు ప్రయత్నిస్తున్నారని స్టేట్ మీడియా వివరించింది. పరిశోధకులు కూడ వారి సాంకేతిక పరిమితులను అధిగమించి మాట్లాడే మహిళా రోబోలో మరిన్ని హావభావాలను కూడ పలికించేందుకు ప్రయత్నిస్తున్నామంటున్నారు.