మాట్లాడే మహిళా రోబో!
శాస్త్ర సాంకేతిక రంగంలో ముందున్న చైనా పరిశోధకులు తాజా ప్రయత్నంలో భాగంగా మాట్లాడే రోబోను సృష్టించారు. రోబోలు నడవటం, పనులు చేయడం వంటివి ఎన్నో ఇంతకు ముందే చూశాం. అయితే వీటికి భిన్నంగా మాట్లాడే మరమనిషిని కనిపెట్టి మరోసారి విజయవంతమయ్యారు. అచ్చం అమ్మాయిలా ఉండే ముఖ కవళికలతోపాటు మాటలకు అనుగుణంగా కదిలే నోరు, పెదాలతో చైనా పరిశోధకులు వినూత్న సృష్టికి శ్రీకారం చుట్టారు.
మరమనిషిలా కాక, సహజత్వం ఉట్టిపడేలా జియా జియా ఇప్పుడు చైనా వాసులనే కాక అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణ మహిళ రూపంలో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. పెదాల కదలికలు, కళ్ళు తిప్పడంతో సహా అచ్చంగా మనిషిని పోలి ఉండటం జియా జియా ప్రత్యేకత అంటున్నారు చైనా యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు. ఈ కొత్త రోబో క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారంగా తన సేవలు అందిస్తుందని చెప్తున్నారు. ముందుగా ఫీడ్ చేస్తేనో, కీ ఇస్తేనో మాట్లాడటం కాక, ఇతరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తల ఊపడం, దగ్గరగా వచ్చిన వారిని స్పర్శించడం వంటి కొత్త విషయాలను ఈ వినూత్న రోబోలో పొందుపరిచారు.
మూడు సంవత్సరాలపాటు కష్టపడి పరిశోధకులు జియా జియా కదలికలను తీర్చి దిద్దారు. రోబో సృష్టికర్త చెన్ జియోపింగ్ పలకరిస్తే చాలు.. చక్కగా సమాధానం ఇస్తున్న రోబోను చూసి మీడియా ప్రతినిధులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఫోటోలతో ముంచెత్తారు. ఇదెంతో అద్భుతమంటూ అభినందనలు కురిపించారు. టెక్నాలజీని మరింత అభివృద్ధి పరచి, జియా జియా మాట్లాడటంతోపాటు, నవ్వడం, ఏడ్వటం కూడ చేసేట్లుగా పరిశోధకులు ప్రయత్నిస్తున్నారని స్టేట్ మీడియా వివరించింది. పరిశోధకులు కూడ వారి సాంకేతిక పరిమితులను అధిగమించి మాట్లాడే మహిళా రోబోలో మరిన్ని హావభావాలను కూడ పలికించేందుకు ప్రయత్నిస్తున్నామంటున్నారు.