archana
-
Archana Jois: మహాదేవి
హీరోయిన్స్ కెరీర్ తల్లి పాత్రలతో ఎండ్ అవుతుందనే అభిప్రాయం ఉంది సినీఫీల్డ్‌లో! కానీ అర్చనా జోయిస్ సినీ ప్రయాణమే తల్లి పాత్రతో మొదలైంది. ‘కేజీఎఫ్’లో రాకీ భాయ్‌కి అమ్మగా నటించి, దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకుంది. వరుస సినీ, సిరీస్ అవకాశాలతో అదరగొడుతున్న ఆమె గురించి కొన్ని వివరాలు...అర్చన పుట్టి పెరిగిందంతా కర్ణాటకలోని రామనాథపురలో. నాన్న శ్రీనివాసన్, అమ్మ వీణ.. ఇద్దరూ ప్రైవేటు టీచర్లు. అర్చనకు క్రమశిక్షణతో పాటు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్పించారు.చిన్నప్పటి నుంచే సంగీతం, నాట్యంలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. ఇంటర్ తర్వాత డిగ్రీ చేయాలా? లేక నాట్యం వైపు వెళ్లాలా? అనే సందిగ్ధంలో పడింది.మామూలు డిగ్రీలో జాయిన్ అయితే బాల్యం నుంచి ప్రేమించిన నాట్యానికి దూరమవుతానేమో అని భావించి, బెంగళూరు యూనివర్సిటీ, నాట్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ అండ్ కొరియోగ్రఫీలో చేరింది. మూడేళ్ల ఆ డిగ్రీలో పట్టా పొంది, దేశవిదేశాల్లో నృత్యప్రదర్శనలు ఇచ్చింది.బీఎఫ్ఏ చేస్తున్న రోజుల్లోనే ‘మహాదేవి’ సీరియల్ కోసం జరిగిన ఆడిషన్స్‌లో ఆమె పాల్గొంది. ఇచ్చిన డైలాగ్స్‌ని తడబడకుండా బ్రహ్మాండమైన ఫీల్‌తో చెప్పి, ఆ సీరియల్లో నటించే చాన్స్‌ని దక్కించుకుంది. అనుకున్నట్టుగానే అది ఆమెకు మంచిపేరే కాదు.. మరెన్నో సీరియల్స్‌లో అవకాశాలనూ తెచ్చిపెట్టింది. అలా వరుస సీరియల్స్ చేస్తూనే చెన్నైలోని పద్మా సుబ్రహ్మణ్యం అకాడమీలో చేరి ఫైన్ఆర్ట్స్లో మాస్టర్స్ చదివింది.సీరియల్స్ అంటే ఒకే పాత్రలో నెలల తరబడి నటించడం వల్ల వైవిధ్యానికి చోటుండదు. ఆ వైవిధ్యం కోసమే సమయం చిక్కినప్పుడల్లా నృత్యప్రదర్శనలిస్తూ, కవర్ సాంగ్స్ కూడా చేయడం మొదలుపెట్టింది. అవన్నీ మంచి ఆదరణ పొందాయి. ఆ పర్ఫార్మెన్స్ చూసే దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’లో తల్లి పాత్రను ఆఫర్ చేశాడు. అప్పటికి అర్చన వయసు 21ఏళ్లు మాత్రమే. అయినప్పటికీ ఆ పాత్రలో అలవోకగా నటించి, మెప్పించింది. ఆ తర్వాత ‘ఘోస్ట్’, ‘మ్యూట్’ చిత్రాలతోనూ తన ప్రతిభ చాటుకుంది. ‘మాన్షన్ 24’ అనే సిరీస్‌తో వెబ్ దునియాలోకీ అడుగుపెట్టింది. ఆ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. అర్చన నటించిన తాజా చిత్రం ‘యుద్ధ కాండ’ విడుదలకు సిద్ధంగా ఉంది.సినిమాల్లోకి రాకముందే మా దూరపు బంధువు శ్రేయస్‌తో నాకు పెళ్లయింది. నా నాట్యం, నటనకు వైవాహిక జీవితం ఎప్పుడూ అడ్డు కాలేదు. సినిమా, సిరీస్‌ల వల్లే నాకిష్టమైన డా¯Œ ్సకు కాస్త దూరమయ్యాను. అందుకే ఇకపై నాట్యానికి, నటనకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని, ఎప్పటికీ గర్తుండిపోయే పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాను!– అర్చనా జోయిస్. -
ఎన్సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌గా విజయా కిశోర్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) నూతన చైర్‌పర్సన్‌గా విజయ కిశోర్ రహాట్కర్ నియమితులయ్యారు. అదేవిధంగా, కమిషన్ సభ్యురాలిగా డాక్టర్ అర్చనా మజుందార్ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం శనివారం ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రహాట్కర్ మూడేళ్ల పాటు, లేదా 65 ఏళ్లు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని తెలిపింది. మజుందార్ మూడేళ్ల పాటు కొనసాగుతారని వివరించింది. తక్షణం ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన రహాట్కర్ 1995లో బీజేపీలో చేరారు. 2007–2010 మధ్య ఛత్రపతి సంభాజీనగర్ (ఔరంగాబాద్) మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఉన్నారు. నేషనల్ మేయర్స్ కౌన్సిల్‌కు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శిగా 2010–2014 మధ్య పనిచేశారు. 2016–21 సంవత్సరాల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా ఉన్నారు. -
ఐవీఎఫ్‌తో.. సంతనాలేమికి చెక్!
సంతానలేమితో బాధపడుతున్న వారికి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) అనేది ఒక వరం లాంటిదని వైద్యురాలు అర్చన అన్నారు. జిల్లా కేంద్రంలో ‘పినాకిల్ ఫెర్టిలిటీ’ సెంటర్ ద్వారా సేవలందిస్తున్న వైద్యురాలు అర్చన.. అంతర్జాతీయ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఇన్ఫెర్టిలిటీ సమస్యతో సతమతమవుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్‌వో) రిపోర్టులు వెల్లడించడం గమనార్హమని అన్నారు. అడ్వాన్స్డ్, ఎక్కువ సక్సెస్ రేట్ కలిగిన ఐవీఎఫ్ విధానం సంతానలేమితో బాధపడుతున్న వారికి మంచి అవకాశమని తెలిపారు. గ్రామీణప్రాంతాల వారికి సైతం తక్కువ ఖర్చుతో ఆధునిక సౌకర్యాల ద్వారా చికిత్స అందించడం పినాకిల్ ఫెర్టిలిటీ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఐవీఎఫ్‌కు సంబంధించి పలు అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు సందేహాలను డాక్టర్ అర్చన నివృత్తి చేశారు.ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లల ఆరోగ్యంపై..1978 జూలై 25న ఐవీఎఫ్ ద్వారా మొదటి బేబి లూయీస్ బ్రౌన్ జన్మించారు. నాలుగు దశాబ్దాలు నాటికి 8 మిలియన్ల పిల్లలు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా జన్మించారు. ఇప్పటి వరకు చేసిన రిసెర్చ్, ఆర్టికల్స్ ఆధారంగా సహజంగా గర్భం ద్వారా పుట్టిన పిల్లలకి ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకి ఎటువంటి తేడా లేదని తేలింది.ఐవీఎఫ్ ద్వారా కవలలు పుట్టే అవకాశం..ఐవీఎఫ్ పద్ధతిలో అంటే ఆడవారి అండాలను మగవారి వీర్యకణాలు కలిపితే వచ్చే పిండాలను గర్భసంచిలో ప్రవేశపెడతాం. ఈ పద్ధతిలో మునుపు రెండు లేక మూడు పిండాలను ప్రవేశపెట్టేవారు. అందువల్ల ఐవీఎఫ్‌లో కవలలు పుట్టే అవకాశం పెరుగుతుంది. కానీ ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీతో గర్భం దాల్చే అవకాశాలు మెరుగయ్యాయి.నొప్పి ఉంటుందంటారు..ఆడవారు 10–12 రోజులపాటు ఐవీఎఫ్‌లో రోజూ కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తరువాతే ఆడవారి శరీరంలో ఉండే అండాలను బయటకు తీసి మగవారి వీర్యకణాలతో కలపడం జరుగుతుంది. అలా పెరిగిన దాన్ని ఆడవారి గర్భసంచిలో ప్రవేశ పెడతాం. ఈ ప్రక్రియలు ఎగ్ పికప్ (ఎమ్బ్య్రో ట్రాన్స్ఫర్) అంటాం. ఇవన్నీ కూడా డే కేర్ ప్రొసీజర్స్ అంటే అదే రోజు ఇంటికి వెళ్లొచ్చు. ఐవీఎఫ్‌లో నొప్పి అనేది చాలా తక్కువతొమ్మిది నెలలు రెస్ట్ అవసరమా..ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన తర్వాత ఒక రెండు నెలలు జాగ్రత్త చెబుతాం. ఆ తరువాత సహజ ప్రెగ్నెన్సీ లాగే అన్ని పనులు చేసుకోవచ్చు. ఆఫీస్‌కి వెళ్ళేవాళ్లు, ఇంటి పనులు చేసుకునేవారు ఎప్పటిలాగే వారి పనులను చేసుకోవచ్చు.సిజేరియన్ అవసరం లేదు..ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన వాళ్లు నార్మల్ డెలివరీ ఖచ్చితంగా చేయించుకోవచ్చు. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ సహజ ప్రెగ్నెన్సీ లాగే ఉంటుంది. వేరే ఇతర కారణాల వల్ల సిజేరియన్ చేయించాల్సిన పరిస్థితి వస్తే తప్ప కేవలం ఐవీఎఫ్ వల్ల సిజేరియన్ చేయించాల్సిన అవసరం అసలు లేదు.– డాక్టర్ అర్చన, పినాకిల్ ఐవీఎఫ్, ఫెర్టిలిటీ సెంటర్ -
Archana Rao: అశ్వత్థామకు దుస్తులు కుట్టింది
అశ్వత్థామకు మరణం లేదు. మహాభారత కాలం నుంచి కల్కి వచ్చే కాలం వరకూ బతికే ఉండాలి. మరి అతను ఎలా ఉంటాడు? ఆ పాత్ర ధరించింది సాక్షాత్తు అమితాబ్ అయితే అతన్ని అశ్వత్థామలా మార్చే దుస్తులు ఎలా ఉండాలి?తెలుగు ఫ్యాషన్ డిజైనర్ అర్చనా రావు ‘కల్కి’ సినిమాకు చీఫ్ ఫ్యాషన్ డిజైనర్‌గా అద్భుతంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి ప్రశంసలు అందుకుంటోంది. హైదరాబాద్ నిఫ్ట్‌లో, న్యూయార్క్‌లో చదువుకున్న అర్చనా రావు పరిచయం.‘సినిమాకు పని చేయడంలో అసలైన సవాలేమిటంటే పేపర్ మీద గీసుకున్నది తెర మీద కనిపించేలా చేయగలగాలి. అందుకు టీమ్ మొత్తంతో మంచి కోఆర్డినేషన్లో ఉండాలి’ అంటుంది అర్చనా రావు.హైదరాబాద్‌కు చెందిన అర్చనా రావుకు ‘అర్చనా రావు లేబుల్’ పేరుతో సొంత బ్రాండ్ ఉంది. ఆమె దుస్తుల డిజైనింగ్ మాత్రమే కాదు ప్రాడక్ట్ డిజైనింగ్ కూడా చేస్తుంది. అంటే పాదరక్షలు, హ్యాండ్ బ్యాగ్‌లు, బెల్ట్‌లు... అన్నీ హ్యాండ్‌మేడ్. ఆమె సృజన మొత్తంలో తప్పనిసరిగా భారతీయత కనిపిస్తుంది.‘నాకు ఇండియన్ కళాత్మక విలువలంటే ఇష్టం. అవే నన్ను కల్కి సినిమా కాస్టూమ్ డిజైనింగ్‌లో గెలిచేలా చేశాయి. నేడు నా పనికి మంచి ప్రశంసలు అందుతుంటే ఆనందంగా ఉంది’ అందామె.నిఫ్ట్ స్టూడెండ్అర్చనా రావు హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఆమెకు ఇష్టంగా ఉండేది. ఏదో ఒక సృజనాత్మక రంగంలో చదువు కొనసాగించాలనుకున్నా స్పష్టత రాలేదు. ఇంటర్ ముగిసే సమయానికి హైదరాబాద్‌లో నిఫ్ట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) ఏర్పడింది. అందులో క్లాత్ డిజైనింగ్ కోర్సుకు అప్లై చేస్తే సీటు వచ్చింది. ‘కాలేజీలో చేరాక ఇదే నేను చదవాల్సింది అని తెలిసొచ్చింది. మన దగ్గర క్రియేటివిటీ ఉండటం ఒకటైతే చదువు వల్ల తెలిసే విషయాలు ఉంటాయి. నిఫ్ట్‌లో ఒక ఫ్యాబ్రిక్‌కు సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ పూర్తిగా తెలిసింది. ఫ్యాషన్ డిజైన్ చేయాలంటే ముందు ఫ్యాబ్రిక్‌ని కనిపెట్టాలి. అలా చదువు పూర్తయ్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం న్యూయార్క్ వెళ్లాను. న్యూయార్క్ నగరమే ఒక క్యాంపస్. ఏ మనిషిని చూసినా ఏ వీధిని చూసినా ఫ్యాషన్ కనపడుతూనే ఉంటుంది. నేను మరింత ఎదగడానికి న్యూయార్క్ ఉపయోగపడింది. అయితే నేను అమెరికాలో స్థిరపడాలనుకోలేదు. ఇండియా ఫ్యాషన్ రంగంలో పుంజుకుంటోంది. నా పని ఇక్కడే అని నిశ్చయించుకుని వచ్చేశాను. నా బ్రాండ్ మొదలెట్టాను’ అని తెలిపిందామె.మహానటితో...దర్శకుడు నాగ్ అశ్విన్ ఏదో సందర్భంలో పరిచయం కావడంతో అతను ‘మహానటి’ చిత్రం కోసం కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేయమన్నాడు. ‘అప్పటికి నాకు సినిమాలకు కాస్ట్యూమ్స్ ఎలా తయారు చేయాలో తెలియదు. కాని నాగ్ అశ్విన్ ప్రోత్సాహంతో మహానటిలో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌లకు కాస్ట్యూమ్స్ చేశాను. కథాకాలాన్ని బట్టి 1940ల నాటి ఫ్యాషన్లను, 1980ల నాటి ఫ్యాషన్లను స్టడీ చేయాల్సి వచ్చింది. సినిమాలకు కాస్ట్యూమ్స్ చేయడంలో ముఖ్యమైన సంగతి ఏమిటంటే లైట్ పడితే ఏ రంగు ఎక్కువ మెరుస్తుంది తెర మీద ఏ రంగు మృదువుగా ఉంటుందో తెలుసుకోవడమే. మహానటితో నేను పని తెలుసుకున్నాను. ఆ సినిమాకు నాకు జాతీయ అవార్డు రావడం మరింత సంతోషం’ అందామె.కల్కి సినిమాలో మహామహులకు...‘కల్కి సినిమా మొదలెట్టే ముందు నిర్మాత దగ్గర నాగ్ అశ్విన్ పెట్టిన మొదటి షరతు నన్ను చీఫ్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఉంచాలని. నా మీద నాగ్ పెట్టుకున్న నమ్మకం అది. నాలుగేళ్ల క్రితం అతను ఈ కథను చెప్పినప్పుడు చాలా పెద్దప్రాజెక్ట్ అని అర్థమైంది. అశ్వత్థామ పాత్ర గురించి చెప్తే ఎవరు చేస్తున్నారు అనడిగాను. అమితాబ్ అన్నాడు. దాంతో నాకు ఎక్కడ లేని నెర్వస్నెస్ వచ్చింది. ఆయనను అశ్వత్థామగా చూపించడం ఎలా? మహాభారత కాలం నుంచి ఆయన జీవించే ఉన్నాడంటే నా మనసులో వచ్చిన భావం మనిషిని చూడగానే ఒక పురాతన వృక్షాన్ని చూసినట్టు ఉండాలని. ఆయనకు వాడే దుస్తులను మళ్లీ మళ్లీ పరీక్షకు పెట్టి తయారు చేశాను. ఆయన ముఖానికి శరీరానికి ఉండే కట్లు రక్తం, పసుపు కలిసిపోయి ఏర్పడిన రంగులో ఉంచాను. మొదటిసారి అమితాబ్ నా కాస్ట్యూమ్స్ ధరించినప్పుడు అది సినిమా అని అక్కడున్నది సినిమా సెట్ అని తెలిసినా రోమాలు నిక్క΄÷డుచుకున్నాయి. ఇక ప్రభాస్ కోసం నేను డిజైన్ చేసిన సూట్‌ను కాలిఫోర్నియాలో తయారు చేయించాం. కమలహాసన్‌కు అయన వ్యక్తిగత డిజైనర్ సహాయంతో కలసి కాస్ట్యూమ్స్ చేశాను. సినిమాలో మూడు ప్రపంచాలుంటాయి. పిరమిడ్ సిటీలో కనిపించే ఆర్మీ కోసం కాస్ట్యూమ్స్‌ని మన దిష్టిబొమ్మల నుంచి ఇన్‌స్పయిర్ అయి చేశాను. కల్కి సినిమాకు అందరం కష్టపడి పని చేశాం. అది ప్రేక్షకులకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది’ అందామె. -
Archana Sinha: అలా వచ్చిన ఆలోచనే.. ఈ 'ఎన్ఎస్ఎఫ్'..
పిల్లలు, ఆటలు, పాటలు ఒకే కుటుంబం. ఆటపాటలంటే పిల్లలకు బోలెడు ఇష్టం. ఆ ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకొని పోషకాహారం నుంచి పరిసరాల పరిశుభ్రత వరకు ఎన్నో కాన్సెప్ట్‌లను ఆటల రూపంలో డిజైన్ చేసిన బెంగళూరుకు చెందిన నరిషింగ్ స్కూల్స్ ఫౌండేషన్(ఎన్ఎస్ఎఫ్) వారి కృషి వృథా పోలేదు. స్కూల్ గార్డెన్ నుంచి గ్రూప్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనడం వరకు పిల్లల్లో ఎంతో సానుకూల మార్పు కనిపిస్తోంది..ప్రభుత్వ పాఠశాలలకు వెళుతూ పిల్లల వయసు, ఎత్తు, బరువు.. మొదలైన విషయాల ఆధారంగా బేస్‌లైన్ సర్వేలు నిర్వహిస్తోంది ఎన్ఎస్ఎఫ్ ఫౌండేషన్. సర్వే ఫలితాల గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయడమే కాదు తగిన సూచనలు కూడా ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకోవడానికి ఈ సర్వే ఫలితాలు ఉపయోగపడుతున్నాయి.‘పారిశుధ్య ప్రాముఖ్యత, సరైన పౌష్టికాహారం గురించి పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా టూల్ కిట్ ఆధారిత విధానానికి రూపకల్పన చేశాము. వారికి తగిన పరిజ్ఞానాన్ని అందించి ఆలోచనాపరులుగా మార్చడమే మా లక్ష్యం’ అంటుంది ఎన్ఎస్ఎఫ్ కో–ఫౌండర్, సీయివో అర్చన సిన్హా.పోషకాహారం, పారిశుధ్యంతో పాటు నవీన వ్యవసాయ పద్ధతుల గురించి పిల్లలకు అవగాహన పరిచే పదిహేను గేమ్స్‌తో కూడిన టూల్కిట్లను ఎన్ఎస్ఎఫ్ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తోంది. పోషకాహార లోపాల లక్షణాలను గుర్తించడానికి ఈ టూల్కిట్లలోని ఎనిమీ కార్డ్, అలాగే... ఈ లోపాలను పరిష్కరించడానికి సహాయపడే ఆహార వనరుల గురించి తెలుసుకోవడానికి ఫ్రెండ్ కార్డు పిల్లలకు ఉపయోగపడుతుంది.వైకుంఠపాళిలోని పాములు, నిచ్చెనలతో కూడా పిల్లలు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండేవారి సత్ప్రవర్తనకు బహుమతులు, జంక్ ఫుడ్‌ను అమితంగా ఇష్టపడేవారికి ఈ ఆటలో శిక్షలు (పాముకాటు)లు ఉంటాయి. సబ్బు వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడానికి ఆకట్టుకునే కాన్సెప్ట్‌కు రూపకల్పన చేశారు.టూల్‌కిట్స్ యాక్టివిటీల ద్వారా పిల్లలు స్కూల్ గార్డెన్లను పెంచుతున్నారు. వారికి ఇచ్చిన గైడ్‌బుక్‌లో వెజిటేబుల్ క్యాలెండర్, మొక్కల పెంపకానికి సంబంధించి స్టెప్–బై–స్టెప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టూల్కిట్లు పిల్లలపై ఏ మేరకు ప్రభావం చూపాయి... అనే విషయంలో ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తుంటుంది ఫౌండేషన్.‘పిల్లల ఆహారపుటలవాట్లపై టూల్‌కిట్స్ సానుకూల ప్రభావం చూపించడమే కాదు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. గ్రూప్ యాక్టివిటీలలో చురుగ్గా పాల్గొనేలా చేస్తున్నాయి’ అంటుంది ఒకిత ఎం అనే గృహిణి. ‘ప్రభుత్వ పాఠశాలలతో పోల్చితే ప్రైవేట్ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగ్గా ఉండవచ్చు. అయితే ఊబకాయంలాంటి సమస్యలు ఉన్నాయి’ అంటుంది అర్చన సిన్హా. త్వరలో ప్రైవేట్ స్కూల్స్లోకూడా ఆన్లైన్ మాడ్యుల్ అందుబాటులోకి తీసుకు రానున్నారు. ‘ఎన్ఎస్ఎఫ్’ దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రభుత్వ పాఠశాలల్లో యాక్టివిటీ ్రపోగ్రామ్స్ నిర్వహించింది. వేలాదిమంది విద్యార్థులపై ఇవి సానుకూల ప్రభావం చూపుతున్నాయి.అలా వచ్చిన ఆలోచనే.. ఎన్ఎస్ఎఫ్..జర్నలిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టిన అర్చన సిన్హా ఆ తరువాత మేనేజ్మెంట్ అండ్ కన్సల్టింగ్లోకి వచ్చింది. సామాజికసేవా కార్యక్రమాలు అంటే మొదటి నుంచి ఇష్టం ఉన్న అర్చన ‘అశోక ఇన్నోవేటర్స్ ఫర్ ది పబ్లిక్’ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేసింది. ఒడిషాలోని గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడి మహిళలతో పౌష్టికాహారం గురించి మాట్లాడింది. అరుదుగా మాత్రమే వారు పౌష్టికాహారం గురించి పట్టించుకుంటున్నారు. పౌష్టికాహారం, పారిశుధ్యం గురించి వారికి అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించిన అర్చన ‘నరిషింగ్ స్కూల్స్ ఫౌండేషన్’కు శ్రీకారం చుట్టింది.ఇవి చదవండి: Priya Chhetri - 'ప్రియ'మైన విజయం -
ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రం నుంచి ఇద్దరు
తాంసి/దండేపల్లి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో ప్రదా నం చేసే ఉత్తమ ఉపాధ్యాయ పుర స్కారానికి ఈసారి రాష్ట్రం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 50 మందిని ఎంపిక చేయగా తెలంగాణ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక కాగా, ఆ ఇద్దరూ ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాకు చెందినవారే. ఆది లాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం బెదోడ్కర్ సంతోష్‌కుమార్, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం నుగూరి అర్చన.. సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోనున్నారు. పాఠశాల పేరు మీద యూట్యూబ్ చానల్లో పాఠాలు 20 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సంతోష్‌కుమార్ కరోనా ఉధృతి సమయంలో పాఠశాల విద్యార్థులు చదువుకు దూరం కాకుండా గూగుల్ యాప్ ద్వారా ఆన్లైన్లో పాఠా లను బోధించారు. పాఠశాల పేరు మీద ప్రత్యేక యూ ట్యూబ్ చానల్లో సైతం నిత్యం రోజు వారీ పాఠాలను అప్ లోడ్ చేయడం వంటివి చేపట్టారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా 100 వరకు ఉన్న విద్యార్థులను ప్రస్తుతం 220 వరకు చేర్చారు. సొంత డబ్బులతో స్కూల్‌ను తీర్చిదిద్ది.. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నుగూరి అర్చన తీర్చిదిద్దారు. దాతలు, స్వచ్చంద సంస్థల సహకారంతోపాటు ఆమె సొంత ఖర్చులతో నాణ్యమైన విద్యాభోధన చేస్తూ, రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల అంటేనే అందరు మెచ్చుకునేలా తీర్చిదిద్దారు. అర్చన సేవలకు ఇప్పటికే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో గుర్తింపు పొందగా, ఈసారి ఏకంగా జాతీయ పురస్కారం దక్కింది. -
తెలుగులో సూపర్ హిట్స్ కొట్టిన హీరోయిన్.. ఆ సినిమాతో రీ ఎంట్రీ!
అప్పట్లో సూపర్ హిట్ సినిమాలు చేసిన కొందరు హీరోయిన్లు లేటు వయసులో రీఎంట్రీ ఇస్తుంటారు. ఒకప్పుడు టాప్ హీరోయిన్గా రాణించిన నటీమణులు అవకాశం వస్తే ఏ పాత్రలోనైనా అలరించేందుకు సిద్ధంగా ఉంటారు. అలా ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇచ్చిన వారు కూడా ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అద్భుతంగా నటిస్తున్నారు. అలా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న మరో నటి టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకీ అందాల నటి ఎవరో తెలుసుకుందాం. (ఇది చదవండి: 'ఇంకా లేటెందుకు.. త్వరగా పెళ్లి చేసుకోండి'.. మిల్కీ బ్యూటీకి నెటిజన్స్ సలహా!) తెలుగువారికి హీరో భాను చందర్ పేరు సుపరిచితమే. ఆయన హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం‘నిరీక్షణ’. ఈ మూవీతోనే తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న భామ అర్చన. 1980లో తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అర్చన తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించారు. మీనాక్షి పొన్నుంగా అనే కోలీవుడ్ టీవీ సీరియల్లోనూ కనిపించారు. భానుచందర్ సరసన నటించిన ‘నిరీక్షణ’ చిత్రంలో గిరిజన యువతిగా ఆమె చేసిన క్యారెక్టర్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం 1986లో రిలీజ్ కాగా.. ఈ సినిమాలో ఆమె నటనకు నంది అవార్డ్ దక్కింది. మధురగీతం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అర్చన ఆ తర్వాత వీడు, లేడీస్ టైలర్, దాసీ,ఉక్కు సంకెళ్లు, మట్టి మనుషులు, భారత్‌బంద్, పచ్చతోరణం లాంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. అయితే భాను చందర్, అర్చన నటించిన ‘వీడు’ చిత్రానికి నేషనల్ అవార్డ్‌తో పాటు ఫిలింఫేర్ కూడా దక్కింది. దాసి చిత్రానికి సైతం మరోసారి జాతీయ ఉత్తమ నటిగా అవార్డ్ గెలుచుకున్నారు. అయితే కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న అర్చన రీఎంట్రీకి ఇస్తోంది. ప్రస్తుతం ఆమె షష్ఠిపూర్తి అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవలే ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం పోస్టర్ రిలీజ్ చేయగా ఈ విషయం బయటకొచ్చింది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత అర్చన మళ్లీ నటిస్తుండడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నిర్మిస్తున్న చిత్రం 'షష్టిపూర్తి'. ఇందులో రూపేష్ కుమార్ చౌదరి హీరో. కథానాయకుడిగా నటించడంతో పాటు సినిమాను నిర్మిస్తున్నారు. ఆయనకు జోడీగా కథానాయిక ఆకాంక్షా సింగ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్నారు. (ఇది చదవండి: సస్పెన్స్ థ్రిల్లర్ 'మిస్టేక్'... పోస్టర్ రిలీజ్ చేసిన ప్రియదర్శి) -
సినీ ఇండస్ట్రీని కుదిపేసిన ఘటన.. హీరోయిన్‌పై అత్యాచారయత్నం!
బాలీవుడ్ నటి అర్చన జోగ్లేకర్ 1990లో పరిచయం అక్కర్లేని పేరు. అర్చన బుల్లితెరతో పాటు బాలీవుడ్‌తో పాటు మరాఠీ, ఒరియా, సినిమాల్లోనూు నటించింది. అంతే కాకుండా ఆమె గొప్ప డ్యాన్సర్ కూడా. అర్చనకు క్లాసికల్ డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. కిసీ కా శాంతి కా', 'కర్ణభూమి', 'ఫూల్వతి' వంటి సీరియల్స్‌తో బాలీవుడ్లో మంచి గుర్తింపు వచ్చింది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆ సంఘటన అప్పట్లో ఏకంగా సినిమా ఇండస్ట్రీనే కుదిపేసింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం. (ఇది చదవండి: రెండోసారి తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్!) సినిమా షూటింగ్ సమయంలోనే అర్చనపై అత్యాచారయత్నం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఘటన ఆమె నటించిన ఒరియా సినిమా సెట్లో చోటు చేసుకుంది. ఓ చిత్రంలో అర్చన హీరోయిన్గా నటించింది. అప్పట్లో వచ్చిన మీడియా కథనాల ప్రకారం మూవీ షూటింగ్ జరిగి సమయంలో ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నం చేసేందుకు యత్నించాడట. అదే సమయంలో అక్కడున్న వ్యక్తులు ఆమెను రక్షించినట్లు సమాచారం. అయితే అప్పట్లో ఆ సంఘటనతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా భయాందోళనకు గురైందట. కాగా.. పెళ్లి చేసుకున్న తర్వాత అర్చన అమెరికాలో న్యూజెర్సీలో స్థిరపడింది. ప్రస్తుతం తానే స్వయంగా ఓ డ్యాన్స్ స్కూల్ కూడా నిర్వహిస్తోంది. ఆమె స్కూల్ ద్వారా పిల్లలకు శాస్త్రీయ నృత్యంలో శిక్షణనిస్తోంది. కాగా.. అర్చన సునా చదేయ్, స్త్రీ లాంటి ఒరియా చిత్రాల్లో కనిపించింది. (ఇది చదవండి: ఒకటే ముక్క..పుష్ప-2 పవర్ఫుల్ డైలాగ్ లీక్..!) View this post on Instagram A post shared by Archana Arts (@archanaarts.us) -
అర్చన... అనుకున్నది సాధించింది
‘నేర్చుకోవాలి’ అనే తపన ఉంటే ఏ విద్య అయినా చేతికి చిక్కుతుంది. సైకిల్ తొక్కడం కూడా రాని అర్చనా ఆత్రమ్ పెద్ద బస్సును నైపుణ్యంగా నడుపుతూ ‘భేష్’ అనిపించుకోవడానికి ఆ తపనే కారణం.... మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (ఎంఎస్ఆర్టీసీ) తొలి మహిళా డ్రైవర్‌గా వార్తల్లో నిలిచింది అర్చనా ఆత్రమ్. నాందేడ్ జిల్లాలోని కివ్వత్ తాలూకలోని సర్కానీ గ్రామానికి చెందిన అర్చన డ్రైవింగ్ ఫీల్డ్‌ను ఎంచుకోవడం తండ్రికి నచ్చలేదు. బంధువులు ‘అది ఆడవాళ్లు చేసే ఉద్యోగం కాదు’ అన్నారు. కొందరైతే...‘నీకు సైకిల్ తొక్కడమే రాదు. బస్సు నడుపుతావా!’ అని బిగ్గరగా నవ్వేవాళ్లు. ఎన్నో ప్రతికూల మాటలను ఈ చెవిన విని ఆ చెవిన వదిలేసిందేగానీ ఒక్క అడుగు వెనక్కి వేయలేదు అర్చన. ‘పట్టుదల ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు’ అంటున్న అర్చన పుణెలో జరిగిన శిక్షణ తరగతులలో ఎన్నో విషయాలు నేర్చుకుంది. క్లచ్, గేర్ అంటే ఏమిటో తెలియని అర్చన జీరో నుంచి ప్రయాణం ప్రారంభించి హీరో అయ్యింది. డిపో మేనేజర్ నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరకు ఎంతో మంది అర్చనా ఆత్రమ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. -
సూపర్ హిట్ కాంబినేషన్.. 37 ఏళ్ల తర్వాత మళ్లీ!
1986లో వచ్చిన చిత్రం లేడీస్ టైలర్ సినిమా మీకు గుర్తుందా? అప్పట్లో ఆ మూవీ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, అర్చన జోడీగా నటించారు. ఈ సినిమాలో జంటగా నటించిన రాజేంద్రప్రసాద్, అర్చనల కెమిస్ట్రీని సినీ ప్రేక్షకులు అంత సులువుగా మరచిపోలేరు. అయితే ఇప్పుడేంటీ అనుకుంటున్నారా? అయితే మళ్లీ అదే జోడీ తెరపై సందడి చేయనుంది. దాదాపు 37 ఏళ్ల తర్వాత మరోసారి స్క్రీన్ పంచుకోబోతోంది ఈ జంట. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో తాజాగా తెరకెక్కుతోన్న చిత్రం ‘షష్ఠి పూర్తి’. రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షా సింగ్ జంటగా పవన్ ప్రభ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. హీరోగా నటించడంతో పాటు రూపేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాాగ చెన్నైలోని సంగీతదర్శకుడు ఇళయరాజా స్టూడియోస్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. తొలి సీన్‌కి ఇళయరాజా కెమెరా స్విచాన్ చేయగా.. నిర్మాత ఆర్బి చౌదరి క్లాప్ ఇచ్చారు. రూపేష్ కుమార్ చౌదరి మాట్లాడుతూ..'లేడీస్ టైలర్’ తర్వాత రాజేంద్రప్రసాద్, ఇళయరాజా కాంబినేషన్లో ‘ఆస్తులు అంతస్తులు, చెట్టు కింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల లాంటి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ లెజెండ్స్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అలాగే ‘లేడీస్ టైలర్’ తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన నటిస్తున్న చిత్రమిదే. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఈ మూవీ న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా. జూలైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.' అని అన్నారు. #LadiesTailor duo #RajendraPrasad & #Archana reunited after 37 years for the film #Shastipoorthi "Shoot starts this month and release in August “ says @ActorRupesh An #Ilaiyaraaja musical#RupeshKumarChaudhary @aakanksha_s30 #PavanPrabha #ThotaTharrani @BrindhaGopal1… pic.twitter.com/nCNwXPp0sz — Phani Kandukuri (@phanikandukuri1) April 1, 2023 -
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్
మాన్యం కృష్ణ, అర్చన జంటగా రూపొందిన చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’. పండు దర్శకత్వంలో ఉషశ్రీ సమర్పణలో ఎన్వీ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్ని హీరో ఆకాశ్ పూరి విడుదల చేసి, ‘‘సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మహిళలకు కనెక్ట్ అయ్యే అంశాలు మా సినిమాలో ఉన్నాయి’’ అని చిత్ర యూనిట్ తెలిపింది. -
ప్రేమ.. వినోదం..
‘‘మిస్టర్ కళ్యాణ్’ మూవీ ట్రైలర్ బాగుంది. మేకింగ్, లొకేషన్స్, డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి దర్శకుడు పండు, నిర్మాత ఎన్వీ సుబ్బారెడ్డి మరిన్ని మంచి సినిమాలు చేయాలి’’ అని డైరెక్టర్ నక్కిన త్రినాథరావు అన్నారు. మాన్యం కృష్ణ, అర్చన జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’. పండు దర్శకత్వంలో ఉషశ్రీ సమర్పణలో ఎన్వీ సుబ్బారెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ని నక్కిన త్రినాథరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా పండు, ఎన్వీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ, లవ్, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూ΄÷ందిన చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’’ అన్నారు. -
చెరిగిపోని పచ్చబొట్టు సంతకం
‘ఒక మహిళ చిత్రకారిణిగా ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు.కాని టాటూ ఆర్టిస్ట్‌గా ఉంటానంటేఆశ్చర్యంగా చూస్తారు’ అంటుంది అర్చన భానుషాలి.దేశంలో ఉత్తమ మహిళా టాటూ ఆర్టిస్ట్‌గా గుర్తింపు ΄పొం దిన అర్చనమగవాళ్లు రాజ్యమేలే ఈ రంగంలో తన ఉనికిని సగర్వంగా చాటుతోంది. ఈ రంగంలో మగవారు విపరీతంగా ఉన్నారు. ఆడవాళ్ల ప్రవేశం అంత సులభం కాదు. కాని నేను పంతంతో ఈ స్థాయికి వచ్చాను. మహిళలకు నేను చెప్పేది ఒక్కటే. మీకు లక్ష్యం ఉంటే సరిపోదు. దానికి తగ్గ కష్టం చాలా చేయాలి. ఇవాళ నేను ఈ రంగంలో గుర్తింపుతో పాటు ఆర్థికంగా కూడా మంచి రాబడి ΄పొం దుతున్నాను. – అర్చన శివరాత్రి సందర్భంగా ‘శివ్ అండ్ శక్తి కాస్మిక్ డాన్స్’ అనే సబ్జెక్ట్‌ను పచ్చబొట్టుగా వేసింది అర్చన భానుషాలి. శివుడు, పార్వతి ఆనంద తాండవం చేస్తున్న ఆ పచ్చబొట్టులో జీవం ఉట్టి పడుతోంది. అర్ధనారీశ్వరుడి చిత్రం కూడా పచ్చబొట్టుగా వేస్తుందామె. ఇవే కాదు ఆమె బొమ్మల్లో మన సంస్కృతిని ప్రతిబింబించే భారతీయ పౌరాణిక, ఆధ్యాత్మిక చిహ్నాలు కనపడతాయి. శివాజీ వంటి వీరులూ, అన్నా హజారే వంటి సామాజిక ఉద్యమకారులు కూడా కనపడతారు. పచ్చబొట్టును ఒక విశృంఖల చిహ్నంగా కాకుండా వ్యక్తిత్వ ప్రకటనగా మార్చడం వల్లే అర్చనకు మంచి పేరొచ్చింది. అందుకే ఆమె ప్రస్తుతం దేశంలో ఉన్న మహిళా టాటూ ఆర్టిస్ట్‌లలో బెస్ట్ ఆర్టిస్ట్‌గా, సీనియర్ ఆర్టిస్ట్‌గా గౌరవం ΄పొందుతోంది. కమర్షియల్ ఆర్టిస్ట్‌గా అర్చన కుటుంబానిది గుజరాత్ అయినా ముంబైలో స్థిరపడింది. అర్చన ఏడేళ్ల వయసు నుంచే వయసుకు మించిన పరిణితిని ప్రదర్శిస్తూ బొమ్మలు వేసేది. దాంతో ఇంట్లోప్రో త్సహించారు. అయితే ఇంటర్ వయసు వచ్చే సరికి గుజరాతీలలో అమ్మాయిలకు పెళ్లి చేసి పంపాలనే తొందర ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు పెళ్లి చేస్తామని వెంటపడితే అప్పుడే వద్దని చెప్పి ముంబై జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో మూడేళ్ల డిప్లమా చేసింది కమర్షియల్ ఆర్ట్‌లో. ఆ తర్వాత లండన్ వెళ్లి ఒక సంవత్సరం కోర్సు చదవాలని అనుకుంది. ఆ కోర్సుకు అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తుండగా టీవీలో ఒక షో చూసింది. అందులో ప్రఖ్యాత అమెరికన్ టాటూ చిత్రకారిణి కేట్ వాన్ డి తన క్లయింట్లకు అద్భుతంగా టాటూలు వేయడం చూపించారు. ‘నేను పేపర్ మీద వేసేది ఈమె ఒంటి మీద వేస్తోంది. నేనెందుకు ఇలా వేయకూడదు’ అనుకుంది అర్చన. ఆమె యాత్ర మొదలైంది. ‘మా అమ్మానాన్నలు నేను టాటూ ఆర్టిస్ట్‌గా మారతానంటే కంగారు పడినా ఆ తర్వాతప్రో త్సహించారు. దాని వల్ల టాటూ వేయడంలో కోర్సు చేశాను. నాకు బొమ్మలు వచ్చు కనుక చాలా త్వరగా పని నేర్చుకున్నాను. మేము గుజరాతీలం. ఒకరి కింద పని చేయడం కంటే సొంత బిజినెస్ ఉండటాన్నే ఇష్టపడతాం. అందుకే ‘ఏస్ టాటూజ్’ పేరుతో ముంబైలో మా నాన్న నా కోసం టాటూ స్టూడియో ఏర్పాటు చేశాడు’ అంటుంది అర్చన. అయితే అసలుప్రో త్సాహం భర్త నిఖిల్ నుంచి, అత్తా మామల నుంచి లభించింది. ‘మా అత్తగారు నన్ను బాగాప్రో త్సహిస్తారు. పెళ్లయ్యాక నా మొదటి పచ్చబొట్టును ఆమెకే వేశాను’ అంది అర్చన. -
Savitri Devi: నిందలు పడి కూతుర్ని విజేతను చేసింది
‘కూతుర్ని ఎవరికో అమ్మేసింది. ఏ తప్పుడు పనుల్లోనో పెట్టింది’... భర్త చనిపోయిన సావిత్రి తన కూతుర్ని పొరుగూరి స్కూల్లో చేర్చాక ఊరి ఆడవాళ్ల నుంచి ఎదుర్కొన్న నింద అది. ‘ఏమైనా సరే నా కూతురు క్రికెట్ ఆడాలి’ అనుకుంది సావిత్రి. అందుకే ఘోరమైన పేదరికంలో కూడా కూతురి కలలకు అండగా నిలబడింది. ఇవాళ ఆ కూతురు– అర్చనా దేవి ప్రపంచ విజేతగా నిలిచింది. ‘అండర్– 19’ క్రికెట్ జట్టులో బౌలర్‌గా, ఫీల్డర్‌గా రాణించి ఫైనల్స్ గెలవడంలో కీలకంగా మారింది. ఆడపిల్లల ఆకాంక్షలకు ఎన్ని అవరోధాలు ఉన్నా తల్లి గట్టిగా నిలబడితే కొండంత బలం అని తల్లులకు ఈ స్ఫూర్తిగాథ సందేశం ఇస్తోంది. సౌత్ ఆఫ్రికాలో అండర్ 19 టి 20 మహిళా ప్రపంచకప్. 16 దేశాలు తలపడ్డాయి. మన అమ్మాయిలు కప్ సాధించారు. మొత్తం 16 మంది టీమ్. ఒక్కొక్కరు శివంగిలా మారి అన్ని జట్లతో తలపడ్డారు. ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను అతి తక్కువ స్కోర్ (68) వద్ద కట్టడి చేసి 14 ఓవర్లకే మూడు వికెట్ల నష్టానికి విజయం సాధించారు. ఇంగ్లాండ్ జట్టును బౌలర్లు హడలగొట్టారు. వారిలో టిటాస్ సాధు, పార్శవి కాకుండా మూడో బౌలర్ ఉంది. అర్చనా దేవి. కీలకమైన రెండు వికెట్లు పడగొట్టడమే కాకుండా ఒక అద్భుతమైన క్యాచ్ పట్టి మూడవ వికెట్ పడేందుకు కారణమైంది. వరల్డ్ కప్‌లో ప్రతి ఒక్కరిదీ ఒక విజయగాథే అయినా అర్చనా దేవిది భిన్నమైనది. కష్టాలను తట్టుకుని అర్చనా దేవి (18) సొంత ఊరు ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలోని రతై పూర్వ. గంగానది ఒడ్డునే వీరి పొలం. ఊరు. వరదలతో ఆ పొలం సంవత్సరంలో సగం రోజులు మునకలో ఉండేది. మిగిలిన సగం రోజుల్లో తండ్రి శివరామ్ వ్యవసాయం సాగించేవాడు. కాని ఆయనను 2008లో కేన్సర్ కబళించింది. దాంతో ఊళ్లో ఆడవాళ్లందరూ అర్చనా తల్లి సావిత్రిదేవిని నష్ట జాతకురాలిగా పరిగణించసాగారు. సావిత్రి వెరవలేదు. ఇద్దరు కొడుకులను, కూతురైన అర్చనను రెక్కల కింద పెట్టుకుని సాకసాగింది. దురదృష్టం... ఆఖరు కొడుకు బుద్ధిమాన్ కూడా మరణించాడు. దాంతో సావిత్రిని చూస్తే చాలు ఊరు దడుచుకునేది. ‘ఇదో మంత్రగత్తె. మొదట భర్తను మింగింది. తర్వాత కొడుకును’ అని... ఎదురుపడితే పక్కకు తప్పుకునేవారు. సావిత్రి దేవి ఇంకా రాటు దేలింది. పిల్లల కోసం ఎలాగైనా బతకాలనుకుంది. కూతురి క్రికెట్ అర్చనకు క్రికెట్ పై ఆసక్తి, పట్టు కూడా సోదరుడు బుద్ధిమాన్ వల్ల వచ్చినవే. అతను అర్చనను వెంటబెట్టుకుని పొలాల్లో క్రికెట్ ఆడేవాడు. తోడుగా అర్చన బ్యాటు ఝళిపించేది. అర్చన టాలెంట్‌ను బుద్ధిమాన్ వెంటనే గమనించాడు. ‘నువ్వు క్రికెటర్‌వి కావాలి’ అనేవాడు. అర్చన ఆశలు పెట్టుకుంది కాని తల్లి పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు బుద్ధిమాన్ బాల్ని కొడితే అది దూరంగా చెత్తలో పడింది. వెళ్లి చేతులతో చెత్తను కదిలిస్తూ ఉంటే పాము కరిచింది. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆటోలో ఆస్పత్రికి తీసుకెళుతుంటే కొన ఊపిరితో ఉన్న బుద్ధిమాన్ ‘అర్చనను క్రికెట్ మాన్పించవద్దు’ అని చెప్పి మరణించాడు. ఆ రోజు సావిత్రి సంకల్పించుకుంది ఎలాగైనా అర్చనను క్రికెటర్ చేయాలని. స్కూల్లో చేర్చి అర్చన క్రికెట్ కొనసాగాలంటే చదువును, ఆటలను నేర్పించే స్కూల్లో చేర్పించాలని సావిత్రి నిశ్చయించుకుంది. తమ పల్లెకు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే గంజ్ మొరాదాబాద్‌లోని గర్ల్స్ బోర్డింగ్ స్కూల్లో చేర్పించింది. వాళ్లుండే పల్లె నుంచి అలా మరో ఊరి బోర్డింగ్ స్కూల్లో ఏ ఆడపిల్లా చేరలేదు. అందుకని ఊరి ఆడవాళ్లు సావిత్రిని అనుమానించారు. కూతుర్ని ఎవరికో మంచి బేరానికి అమ్మేసి ఉంటుందని అనేవారు. చెడ్డ పనుల కోసం ఊరు దాటించింది అనేవారు. అవన్నీ సావిత్రీదేవి నిశ్శబ్దంగా భరించింది. కొడుకును ఢిల్లీలో బట్టల ఫ్యాక్టరీలో పనికి పెట్టి తమకున్న ఒక ఆవు, ఒక బర్రె పాల మీద ఆధారపడి కూతురి ఖర్చులను అతి కష్టం మీద చూసేది. ‘నేను ఉన్నాను’ అని అర్చనకు ధైర్యం చెప్పేది. దశ తిరిగింది బోర్డింగ్ స్కూల్లోని ఒక టీచరు అర్చన ప్రతిభను గమనించి కాన్పూరులో ఉండే కోచ్ కపిల్ పాండే దృష్టికి తీసుకెళ్లింది. ఆ టీచరు తీసిన అర్చన బౌలింగ్ వీడియోలు చూసిన కపిల్ పాండే వెంటనే కాన్పూరుకు పిలిపించి అక్కడి క్రికెట్ అసోసియేషన్‌లో జాయిన్ చేసి తన శిష్యురాలిగా తీసుకున్నాడు. కపిల్ పాండే క్రికెటర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా కోచ్ కావడంతో కుల్దీప్ యాదవ్ అర్చనను ప్రోత్సహించాడు. ఆమె శిక్షణకు సాయం అందించాడు. అతిథులయ్యారు ‘ఒకప్పుడు మా ఇంట నీళ్లు కూడా ఎవరూ తాగలేదు. ఇవాళ అందరూ అతిథులుగా వచ్చి మీ దశ తిరిగింది అని భోజనం చేస్తున్నారు’ అంది అర్చన తల్లి సావిత్రి. వాళ్ల ఊరిలో ఆ కుటుంబం ఇప్పుడు సగర్వంగా నిలబడింది. తల్లి తన కూతురి ద్వారా అలా నిలబెట్టుకుంది. ఆ తల్లీకూతుళ్లను చూసి ఊరు మురిసిపోతోందిగాని అది ఎన్నో ఎదురీతల ఫలితం. ఎవరో అన్నట్టు... అపజయాల ఆవల విజయ తీరం ఉంటుంది. అర్చన విజయానికి తెడ్డు వేసిన నావ– ఆ తల్లి సావిత్రీ దేవి. అందుకే అర్చన విజయంలో సగం ఆ తల్లిదే. ఇంగ్లాండ్‌తో ఫైనల్స్‌లో అర్చన క్యాచ్ ప్రపంచ విజేత మన జట్టు -
అరగంట చాలు.. రాష్ట్రంలో సీన్ మారిపోతుంది!: అర్చనా నాగ్
క్రైమ్: హైప్రొఫైల్ హనీ ట్రాప్‌గా ఒడిశాలో సంచలనం సృష్టించి.. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది అర్చనా నాగ్ అరెస్ట్ ఉదంతం. అయితే వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన తరుణంలో మంగళవారం ఆమె మీడియా ఎదుట సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నేను పెదవిప్పితే రాష్ట్రంలో పరిస్థితి మారిపోతుంది. ప్రభుత్వమే కూలిపోతుంది. అందుకు మాట్లాడేందుకు 30 నిమిషాలు అవకాశం ఇవ్వండి. కీలక ఆధారాలను మీకిస్తా’ అని అక్కడే ఉన్న మీడియాను ఉద్దేశించి అర్చన నాగ్ వ్యాఖ్యానించారు. ఆమె అక్రమ ఆస్తులపై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు అర్చన నాగ్‌ను మంగళవారం ఏడు రోజుల రిమాండుకు తీసుకున్నారు. కారాగారం నుంచి ఆమెను క్యాపిటల్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆసుపత్రి వద్ద అర్చన నాగ్ మీడియాతో మాట్లాడారు. పోలీసులు తనను ఓ ఉగ్రవాదిలా చూస్తున్నారన్నారు. ఎలాంటి దర్యాప్తునకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈరోజు కోసమే ఎదురు చూస్తున్నా. ఎవరినీ విడిచిపెట్టేది లేదు. ఈడీ దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా. అని ఆమె తెలిపారు. . శ్రద్ధాంజలి బెహరా, సినీ నిర్మాత అక్షయ పరిజ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకుంటే తననెందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. అధికార బీజేడీ నుంచి 20 మంది, ప్రతిపక్ష బీజేపీ నుంచి కొందరు, రాజకీయ నేతలేగాక.. వీఐపీలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, నిర్మాతలు.. అర్చనా వలపు వలలో చిక్కుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒడిశాతో పాటు బెంగాల్‌కు చెందిన ప్రముఖులు ఉన్నట్లు తేలిందని పోలీసులు చెప్తున్నారు. హనీ ట్రాప్ కేసులో అర్చనతో పాటు ఆమె భర్త జగబంధు చంద్, ఈ జంటకు వ్యాపారంలో భాగస్వామిగా ఉన్న ఖగేశ్వర్ పాత్రాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదివరకు పలువురిని విచారించిన ఈడీ అధికారులు మంగళవారం నుంచి ఏడు రోజులపాటు అర్చన నాగ్‌ను విచారించనున్నారు. కీలక అంశాలు బహిర్గతమవుతాయని భావిస్తున్నారు. సంబంధిత కథనం: పేద కుటుంబంలో పుట్టి.. అర్చనా నాగ్ వెర్షన్ డర్టీ పిక్చర్ ఇది! -
భర్త చనిపోయాక అత్తింటి హింస.. గంభీరంగా కనిపించే మేజర్ అర్చన వెనుక కన్నీటి కథ
Minnie Vaid: శాస్త్రరంగం నుంచి సైనికరంగం వరకు మనకు స్ఫూర్తిని ఇచ్చే మహిళలు ఎంతో మంది ఉన్నారు. వారి గురించి తెలుసుకుంటే ఆగిపోయిన అడుగులో కదలిక మొదలవుతుంది. ‘అందదు’ అనుకున్న కల చేరువవుతుంది. అలాంటి మహిళలను తన పుస్తకాలతో లోకానికి పరిచయం చేస్తోంది మిన్నీ వైద్. వాస్తవ జీవిత కథతో తాజాగా ‘ఫతే’ అనే పుస్తకాన్ని రాసింది... జర్నలిస్ట్, రైటర్, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకుంది ముంబైకి చెందిన మిన్నీ వైద్. మూడు సంవత్సరాల క్రితం ‘ఇస్రో’ మహిళా శాస్త్రవేత్తలపై తాను రాసిన పుస్తకం గురించి హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలి కంటోన్మెంట్ టౌన్లో ప్రసంగించింది. ప్రసంగం పూర్తయిన తరువాత జనరల్ అనీల్ చౌదరి మిన్నీతో మాట్లాడారు. ‘ఇస్రోలోనే కాదు, ఆర్మీలో కూడా ఎంతోమంది స్ఫూర్తిదాయకమైన మహిళలు ఉన్నారు. వారి గురించి కూడా తప్పనిసరిగా రాయాలి’ అంటూ కొంతమంది గురించి చెప్పారు ఆయన. అలా ‘ఫతే’ పుస్తకానికి బీజం పడింది. ఆ పుస్తకంలో... హరియాణాలోని చిన్న పట్టణంలో పుట్టి పెరుగుతుంది అర్చన. తనది సంప్రదాయ కుటుంబం. ‘ఎక్కడి వరకు చదవాలో అక్కడి వరకే చదవాలి. ఉన్నత చదువులు అవసరం లేదు’ అనేది ఆ కుటుంబ భావన. కాలేజీ రోజుల్లో ఎన్సీసీలో చేరుతుంది అర్చన. అప్పుడే... సైన్యంలో పనిచేయాలని గట్టిగా అనుకుంటుంది. అయితే తాను ఒకటి తలిస్తే, కుటుంబం ఒకటి తలిచింది. అర్చనకు ఆర్మీ ఆఫీసర్ లక్ష్మణ్ దెస్వాల్తో వివాహం జరిపిస్తారు. పెళ్లితో తన కల కలగానే మిగిలిపోయింది. నాన్–ఫ్యామిలీ ఫీల్డ్‌లో భర్త ఉద్యోగం. సెలవుల్లో అతడు ఇంటికి వచ్చినప్పుడు...ప్రతిరోజూ అపూర్వమైన రోజు. భర్త విధుల్లో చేరిన తరువాత ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫోన్లో గంటల తరబడి కబుర్లు ఉండేవి! ఈ సంతోషకాలంలో, తన కల పెద్దగా గుర్తుకు వచ్చేది కాదు. ఒకరోజు.. లక్ష్మణ్‌కు ఫోన్ చేస్తే ఎత్తలేదు... ఆయన ఫైరింగ్ లో చనిపోయాడు! భూమి నిలువునా చీలిపోయింది. తాను ఎక్కడో పాతాళలోకంలో పడిపోయింది. అప్పటికే తాను గర్భవతి. బిడ్డను చూసుకోకుండానే ఆయన చనిపోయాడు. భర్త ఉన్నప్పుడు ఎలాంటి సమస్యా ఎదురు కాలేదుగానీ, అతడు చనిపోయిన తరువాత అత్త, ఆడబిడ్డల నుంచి మానసిక హింస మొదలైంది. ఒక మూలన ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే బాధ పెరుగుతుంది తప్ప తరగదు అనే విషయం తనకు అర్థం కావడానికి ఎంతోసేపు పట్టలేదు. తాను మళ్లీ బతకాలంటే, కొత్త జీవితం మొదలుపెట్టాలి! ఆగిపోయిన చదువును మళ్లీ పట్టాలెక్కించింది. ఒక్కో అడుగు వేస్తూ...ఆర్మీలో చేరాలనే తన చిరకాల కోరికను నెరవేర్చుకుంది. ఆర్మీ ఆఫీసర్ స్థాయికి ఎదిగింది. అమ్మాయి ఆలనాపాలన చక్కగా చూసుకుంటుంది. ఆర్మీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో ఆలివ్‌గ్రీన్ యూనిఫామ్‌లో గంభీరంగా కనిపించే మేజర్ అర్చన వెనుక ఇంత కన్నీటి కథ ఉందని తెలిసినవారు చాలా తక్కువ. నిజజీవిత కథ ఆధారంగా మిన్నీ రాసిన ఈ కాల్పనిక పుస్తకం పేరు... ఫతే. ‘ఫతే’ అంటే విజయం. ఎన్ని కష్టాలు దాటితే ఒక విజయం సొంతం అవుతుందో కళ్లకు కట్టే పుస్తకం ఇది. దీనిలో ఎలాంటి శైలి, విన్యాసాలు, నాటకీయతా లేవు. 126 పేజీలలో సాధారణ వాక్యాలు కనిపిస్తాయి. అయితే అవి ఒక అసాధారణమైన వ్యక్తి గురించి అద్భుతంగా చెబుతాయి. మిన్నీ ఈ పుస్తకం దగ్గరే ఆగిపోవాలనుకోవడం లేదు. అనేక రంగాలలో మనకు స్ఫూర్తిని ఇచ్చే మహిళలు ఎంతోమంది ఉన్నారు. వారి గురించి కూడా భవిష్యత్‌లో మరిన్ని పుస్తకాలు రాయాలనుకుంటోంది. చదవండి: బ్యూటిఫుల్ సక్సెస్ మంత్ర Joycy Lyngdoh: నిరుపేద మహిళ.. తొలుత స్కూల్ బస్ డ్రైవర్‌గా.. ఇప్పుడేమో! -
అర్చనా నాగ్ వెర్షన్ డర్టీ పిక్చర్ ఇది
భువనేశ్వర్: అర్చనా నాగ్.. ఒడిషాలో కలకలం రేపిన పేరు. వీవీఐపీలకు వలపు వల విసిరి ముగ్గులోకి దించి.. ఆపై బ్లాక్‌మెయిలింగ్‌తో కోట్లు దన్నుకున్న వగలాడి. ఓ నిర్మాత ఫిర్యాదుతో కదిలిన ఈ తేనెతుట్టు(హనీట్రాప్) ఒడిషాలో రాజకీయ ప్రముఖులకు మాత్రమే కాదు.. బెంగాల్‌కు చెందిన సెలబ్రిటీలకు సైతం వణుకు పుట్టిస్తోంది. కలహంది జిల్లా ఒకప్పుడు ఆకలి కేకలతో అల్లలాడిపోయిన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఓ పేద కుటుంబంలో పుట్టిన అర్చనా నాగ్.. కట్ చేస్తే కోట్లు విలువ చేసే బ్యాంక్ బ్యాలెన్స్‌తో, ఇంటి నిండా విదేశాల నుంచి వచ్చిన ఫర్నీచర్‌తో, లగ్జరీ కార్లతో, హైబ్రీడ్ కుక్కలు, ఓ తెల్ల గుర్రం పెంచుకుంటూ విలాసవంతమైన జీవితం గడపాలనుకుంది. అందుకు తగ్గట్లే 26 ఏళ్ల అర్చన పెద్ద పెద్ద స్కెచ్‌లే వేసింది. ప్రముఖులను హనీట్రాప్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి కోట్లు దండుకుంది. ► లంజిగర్‌లో ఓ పేద కుటుంబంలో పుట్టిన అర్చనా.. తల్లి వృత్తిరిత్యా కేసింగలో పెరిగింది. ఆపై 2015లో భువనేశ్వర్‌లో అడుగుపెట్టింది. తొలుత ఓ ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలో పని చేసి.. ఆపై ఓ బ్యూటీపార్లర్‌లో పనికి కుదిరింది. అక్కడే బాలాసోర్ జిల్లాకు చెందిన జగబంధు చంద్‌తో పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. అక్కడి నుంచి ఈ భార్యాభర్తల మోసాలు మొదలయ్యాయి. బ్యూటీపార్లర్‌లో పని చేసే టైంలోనే సెక్స్‌రాకెట్ నడిపినట్లు ఆమెపై ఆరోపణలు కూడా వచ్చాయి. ► జగబంధు ఓ కార్ల షోరూం తెరిచి.. బిల్డర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ఇతరులతో పరిచయం పెంచుకున్నాడు. వాళ్లతో ఆ భార్యాభర్తలు ఫొటోలు కూడా దిగారు. ఒక అర్చన వీవీఐపీలతో పరిచయం పెంచుకుని.. వాళ్లకు అమ్మాయిలను సప్లై చేయడం ప్రారంభించింది. ఆ సమయంలోనే వాళ్ల ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు తీసి.. డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించిందని పోలీసులు వెల్లడించారు. ► అర్చనా బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించిన పోలీసులు నోళ్లు వెళ్లబెట్టారు. 2018 నుంచి 2022 మధ్య.. కేవలం నాలుగేళ్లలో అర్చనా-జగబంధుల ఆసక్తి రూ.30 కోట్లకు చేరుకుందని చెప్తున్నారు. ఆమె ఏయే విలాసాలు కోరుకుందో.. అవన్నీ నెరవేర్చుకుందామె. అంటే.. ఆ భార్యభర్తల బ్లాక్‌మెయిలింగ్ ఏ రేంజ్లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. చివరకు ఓ నిర్మాతను మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో.. ఆయన నాయపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 6న అర్చనా అరెస్ట్ కాగా.. అప్పటి నుంచి రోజుకో రోజుకో సంచలనం బయటపడుతూనే వస్తోంది. జగబంధు డ్రగ్స్ కార్యకలాపాలు సైతం వెలగపెట్టేవాడని తేలింది. ఇక ఈ వ్యవహారంలో ఆర్థిక దర్యాప్తు విభాగాలను సైతం దర్యాప్తు చేపట్టాలని ఒడిషా పోలీసులు కోరుతున్నారు. ► ఇక ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే అర్చనపై ఫిర్యాదుకు ముందుకు వచ్చారని, మరికొందరు బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలని భువనేశ్వర్ డీసీపీ ప్రతీక్ సింగ్ కోరుతున్నారు. మరోవైపు ఒడియా ఫిల్మ్ మేకర్ శ్రీధర్ మార్థా.. అర్చనా చేసిన డర్టీ పనుల ఆధారంగా ఓ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు కూడా. సెక్స్, డబ్బు, మోసంతో పాటు అర్చనా నాగ్ వ్యవహారంలో ఇప్పుడు రాజకీయమూ కీలకంగా మారింది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ వ్యవహారంలో అధికార బీజేడీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారని ఆరోపిస్తోంది. ఒకవేళ అదే గనుక బయటపడితే 22 ఏళ్ల నవీన్ పట్నాయక్ ప్రభుత్వం పతనం కాకతప్పదని అంటోంది. మరోవైపు బీజేపీ కూడా బీజేడీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అర్చనా వలలో ఉన్నట్లు ఆరోపిస్తోంది. బీజేడీ మాత్రం ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దంటూ బీజేపీ, కాంగ్రెస్‌లకు సూచిస్తోంది. సుమారు 25 మంది రాజకీయ ప్రముఖులు ఆమె ఉచ్చులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ప్రేమను కాదందనే రైలు కిందకు తోసేశాడు -
హైదరాబాద్‌లో శ్రీవారి వైభవోత్సవాలు.. తరలివచ్చిన భక్తులు
సాక్షి, హైదరాబాద్: శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు మంగళవారం ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీనివాస కల్యాణం, శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ ప్రాజెక్ట్ తిరుపతి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న వైభవోత్సవాలు 15వ తేదీ వరకు కొనసాగుతాయి. తిరుపతికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోలేని భక్తుల కోసం టీటీడీ నగరంలో వెంకటేశ్వర స్వామి మహోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి రోజు పది వేల మంది దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వర్షాల కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైభవోత్సవాలను ప్రచారం చేసేందుకు తిరుమల తిరుపతి నుంచి ప్రత్యేకంగా రూపొందించిన శ్రీ వెంకటేశ్వర స్వామి రథం నగరానికి వచ్చింది. అంతేకాకుండా ఇక్కడే లడ్డూలు తయారు చేసి భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. గోపూజ చేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేని భక్తుల సౌకర్యార్థం ఎన్టిఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఎన్టిఆర్ స్టేడియం ప్రాంగణంలో గోపూజ నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల ప్రచార రధాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతికి వెళ్లి స్వామి వారిని దర్శించుకోలేని వారికోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నగరానికి తరలిరావడం ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. కార్యక్రమంలో నిర్వహకులు ముప్పవరపు హర్షవర్ధన్, బి.సుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలివీ.. ఎన్టీఆర్ స్టేడియంలో 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే రోజు వారి పూజా కార్యక్రమాలు 11న ఉదయం 6 గంటలకు సుప్రభాతం, 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాల సేవ, కొలుపు, అర్చన, 7.30 నుంచి 8.15 వరకు నివేదన, 8.15 నుంచి 8.30 వరకు పాద పద్మారాదన, ఉదయం 8.30 నుంచి 9.30 వరకు రెండో నివేదన, 9.30 నుంచి 10 గంటల వరకు వసంతోత్సవం, వీధి ఉత్సవం, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు సర్వదర్శనం, సహస్ర దీపాలంకరణ సేవ సాయంత్రం 5.30 గంటల నుచి 6.30 వరకు, వీధి ఉత్సవం సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు, రాత్రి కైంకర్యం రాత్రి 7.30 నుంచి 8.30 వరకు, ఏకాంత సేవ రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు జరుగుతాయి. 15న... 15వ తేదీన ఉదయం ఆరు గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాల సేవ, కోలుపు, అర్చన 7.30 నుంచి 8.15, నివేదన 8.15 నుంచి 8.30 వరకు, పాదపద్మారాధన, ఉదయం 8.30 నుంచి 10.30 వరకు, పుష్పయాగం, రెండవ నివేదన 10.30 నుంచి 11 గంటల వరకు, సర్వదర్శనం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు, సహస్రదీపాలంకరణ సేవ, సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 వరకు శ్రీనివాస కళ్యాణం, సాయంత్రం 6.30నుంచి 8.30 వరకు తోమాల సేవ అర్చన, నివేధన రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు జరుగుతాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హాయ్ అంటూ కవ్విస్తుంది.. ఇంటికి పిలిచి క్లోజ్‌గా ఉంటుంది.. ఆ తర్వాత..
ఆమె తన అందంతో రంగంలోకి దిగి.. ప్రముఖులను ముగ్గులోకి దింపుతుంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయం పెంచుకుని వారింతో సన్నిహితంగా మెదులుతుంది. ఈ క్రమంలో వారితో తీసుకున్న ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తూ హానీట్రాప్ చేస్తుంది. ఇలా డబ్బులు వసూలు చేస్తున్న అర్చనా నాగ్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కాగా, విచారణలో భాగంగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందుతురాలు అర్చనకు భువనేశ్వర్‌లో విశాలమైన భవనం ఉన్నట్టుగా గుర్తించారు. ఇక, అర్చన.. ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా ప్రముఖులు, సంపన్నులు, ఉన్నతాధికారులతో పరిచయం పెంచుకుంటుంది. అనంతరం.. మాటలు కలిపి వారిని ముగ్గులోకి దింపుతుంది. పరిచయం అనంతరం.. వారిని తన నివాసానికి రప్పించుకునేది. వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో సీక్రెట్‌గా ఫొటోలు, వీడియోలు తీసేది. అనంతరం, వారికి ఈ ఫొటోలు, వీడియోలను పంపించి డబ్బులు వసూలు చేసేది. తాను అడిగినంత ఇవ్వకపోతే ఆ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరింపులకు గురిచేసేది. ఇక, కొంతమంది పోలీసు అధికారులు కూడా ఆమె వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఆమెకు ఎంతో ఖరీదు చేసే బీఎండబ్ల్యూ, ఫోర్డు తదితర కంపెనీల కార్లు, ఫార్మ్ హౌస్ కూడా ఉన్నట్టు గుర్తించారు. కాగా, అర్చనను అరెస్ట్ చేసిన అనంతరం.. పోలీసులు ఆమె కంప్యూటర్ హార్డ్ డిస్క్, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు వెల్లడించారు. మరోవైపు.. ఆమె బ్యాంకు ఖాతాలు, లావాదేవీలకు సంబంధించిన వివరాలను సైతం ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ని కోరినట్టు డీసీపీ ప్రతీక్ సింగ్ తెలిపారు. #ବ୍ୟକ୍ତିଗତ_ଫଟୋ_ରଖି_ଲୋକଙ୍କୁ_ବ୍ଲାକମେଲ_କରୁଥିଲା_ଅର୍ଚ୍ଚନା ଅର୍ଚ୍ଚନା ନାଗ୍ ମାମଲାରେ କ’ଣ ପ୍ରତିକ୍ରିୟା ରଖୁଛନ୍ତି ଡିସିପି ଶୁଣନ୍ତୁ...#Odisha #Bhubaneswar #ArchanaNag #DCP pic.twitter.com/KkZxOodmN0 — NandighoshaTV (@NandighoshaTV) October 9, 2022 -
తల్లిప్రేమ ముందు పులి ఎంత!
పులి అనగానే అమ్మో అనుకుంటాం. కాని అమ్మ ముందు పులి బలమెంత! ఒక తల్లి తన బిడ్డను రక్షించుకోవడానికి పులితో పోరాడిన సాహసం సోషల్‌మీడియాలో వైరల్ అయింది... మధ్యప్రదేశ్‌లోని ఉమేరియా జిల్లాలోని బందవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌కు సమీపంలో రోహనియా అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన అర్చన చౌదరికి పదిహేను నెలల కొడుకు రవిరాజ్. కొడుకు నవ్వితే నవ్వేంత, ఏడిస్తే ఏడ్చేంత ప్రేమ తనకు! కొన్ని నెలల క్రితం చీమ కుట్టి కొడుకు ఏడుస్తుంటే తాను కూడా ఏడ్చేసింది. ఈసారి మాత్రం చీమ కుట్టలేదు. పులి ఎదురైంది! బిడ్డను నోట కరుచుకుపోవడానికి రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం అర్చన ఏడ్వలేదు. వణికిపోలేదు. ఏం జరిగిందంటే... ఆరోజు రాత్రి బిడ్డ రవిరాజ్‌ను తీసుకొని ఇంటి నుంచి బయటికి వచ్చింది అర్చన. అక్కడి పొదల్లో ఒక పులి కాచుకొని కూర్చుంది. వీరిని చూడగానే బయటికి వచ్చింది. పిల్లాడిని దూరంగా ఎత్తుకుపోవడానికి ప్రయత్నించింది. అంతే... అర్చన తన శక్తినంతా కూడదీసుకొని పెద్దగా అరుస్తూ ఎదురుదాడి ప్రారంభించింది. అర్చన కేకలు విన్న గ్రామస్థులందరూ మెరుపు వేగంతో పరుగెత్తుకు వచ్చారు. వారిని చూసి పులి తోకముడిచి సమీపంలోని అడవిలోకి పారిపోయింది! తల, వీపు వెనుక గాయాలైన బిడ్డను, ఒళ్లంతా గాయాలైన తల్లిని గ్రామస్థులు వెంటనే హాస్పిటల్లో చేర్చడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ‘ఒక పులి టైగర్ రిజర్వ్ దాటి జనావాసాలలోకి వచ్చింది అని ప్రచారం చేస్తున్నాం. ఈ విషయం చాలామందికి తెలుసు’ అని అటవీశాఖ అధికారులు చెబుతున్నారుగానీ అదెంత వరకు నిజమో తెలియదు. ‘మాకు అలాంటి వార్త గురించి ఏమీ తెలియదు’ అని చెబుతున్నాడు అర్చన భర్త బోలా చౌదరి. అరుదుగా మాత్రమే ఊరు దాటేది అర్చన. అలాంటి అర్చన పేరు ఇప్పుడు ఊళ్లు, జిల్లాలు, రాష్ట్రాలు దాటింది. ‘తల్లి శక్తి ఏమిటో నిరూపించావు’ అని వేనోళ్ల కొనియాడుతున్నారు నెటిజనులు. ‘మా ఊళ్లోనే కాదు, ఇంకా చాలా ఊళ్లలో అర్చన పేరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆమె సాహసం అద్భుతం. పులిని చూడగానే వణికిపోయి, భయపడి ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహించడానికి కూడా భయంగా ఉంది. ఎంతోమంది తల్లులకు స్ఫూర్తిని ఇచ్చే సాహసం ఆమెది’ అంటుంది రోహనియ గ్రామానికి చెందిన కులుమతి. ఆరోజు అర్చన అరుపులు విని పరుగెత్తుకు వచ్చిన వారిలో కుష్వా అనే రైతు ఉన్నాడు. ‘అరుపులు వినగానే ప్రమాదాన్ని ఊహించి కట్టె తీసుకొని పరుగెత్తుకు వచ్చాను. అక్కడికి వెళ్లగానే విషయం అర్థమైంది. అందరం గట్టిగా అరుస్తూ ముందుకు వెళుతుంటే పులి భయపడి పారిపోయింది. తల్లీబిడ్డలను ఆ దేవుడే రక్షించాడు’ అంటున్నాడు కుష్వా. చాలామందికి మాత్రం అర్చన తన బిడ్డను రక్షించుకున్న దేవత. ఊరి జనాల నుంచి నెటిజనుల వరకు అర్చనా చౌదరి సాహసానికి అందరూ జై కొడుతున్నారు. -
'మగధీర'లో ఆఫర్ వచ్చింది, కానీ నో చెప్పా: అర్చన
హీరోయిన్గా పలు సినిమాల్లో నటించిన అర్చన ఈ మధ్య వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఆ మధ్య బిగ్‌బాస్ షోలోనూ పాల్గొని బుల్లితెర ప్రేక్షకులక సైతం చేరువైన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ సినిమాలో తాను బాలకృష్ణకు డ్యాన్స్ నేర్పించానంది. బాలయ్య బృందావనంలో గోపికలతో కలిసి డ్యాన్స్ చేసే ఒక బిట్ నేర్పించినట్లు వెల్లడించింది. ఇక పెళ్లికి ముందు ఫ్రెండ్స్‌తో పార్టీకి వెళ్లిన తాను పెగ్గులు ఎక్కువవడంతో ఆసుపత్రికి వెళ్లానని చెప్పింది. రాజమౌళిగారు మగధీరలో చేయమని ఆఫర్ ఇచ్చారు, కానీ అప్పుడంత లౌక్యం లేకపోవడంతో చేయలేదని తెలిపింది. నిజంగా ఆ సినిమా చేసుంటే ఇప్పుడు ఇంకోలా ఉండేదేమోనని పేర్కొంది. కొన్ని పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారాయంటూ ఎమోషనలైంది అర్చన. చదవండి: నాకు అలాంటి సీన్స్‌లో నటించడమే ఈజీ పావురాల వ్యర్థాల వల్లే మీనా భర్త మృతిచెందాడా?..షాకింగ్ రీజన్ -
నా వయసున్నోళ్లు లవ్‌స్టోరీస్ కూడా చేస్తున్నారు
‘‘చోర్ బజార్’ ఎంటర్టైన్మెంట్, కమర్షియల్, కలర్‌ఫుల్ ఫిల్మ్. ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్ర చేశాను. ఇదొక మాస్ ఫిలిం. నా జానర్ దాటి బయటికొచ్చి ఈ సినిమా చేశాను’’ అని నటి అర్చన (‘నిరీక్షణ’ ఫేమ్) అన్నారు. ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన అర్చన మాట్లాడుతూ– ‘‘నా గురువులు, దర్శకులు నన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. 300 సినిమాల్లో చేసిన హీరోయిన్‌కి ఎలాంటి గుర్తింపు ఇవ్వాలో అలాంటి గుర్తింపును భారతీయ సినిమా, నా దర్శకులు నాకు ఇచ్చారు.. ఆ గౌరవాన్ని పాడు చేసుకునే హక్కు నాకు లేదు. నేను చెన్నైలో ఉంటున్నాను. షూటింగ్ కోసం హైదరాబాద్ రాలేకపోయేదాన్ని. అందుకే తెలుగులో గ్యాప్ వచ్చింది. ఒకప్పుడు హీరో సరసన నటించిన హీరోయిన్ కొంత కాలానికి అదే హీరోకి సోదరి, వదిన, తల్లి, అత్త అవుతోంది. మన సినిమాల్లో మహిళా పాత్రలకు 80 శాతం ప్రాధాన్యత ఉండటం లేదు. మరాఠీలో మహిళలకు ఎక్కువ వైవిధ్యమైన పాత్రలు దక్కుతున్నాయి. నా వయసువాళ్లు అక్కడ లవ్ స్టోరీస్‌లో నటిస్తున్నారు.. బోల్డ్ సీన్స్ చేస్తున్నారు. ‘చోర్ బజార్లో’ నాది అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ పాత్ర. ఆయన్ను ప్రేమించి, ఆయన కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయే పాత్ర నాది. ఈ మూవీలో హీరో పేరు బచ్చన్ సాబ్. మా ఇద్దరికీ అమితాబ్ అంటే ఇష్టం. అర్చన అంటే నెక్ట్స్ డోర్ ఉమెన్ అనే ఇమేజ్ ఉంది.. ఆ గుర్తింపును ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను. ప్రస్తుతం తమిళంలో ఒకటి, కన్నడలో ఒక ఆర్ట్ ఫిలిం చేస్తున్నాను. అలాగే ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించనున్నాను’’ అన్నారు. -
బ్రేక్‌కి బ్రేక్.. రీ ఎంట్రీ ఇస్తున్న అలనాటి తారలు
సిల్వర్ స్క్రీన్ ఎప్పుడు ఆనందపడుతుంది? తన అభిమాన తార సినిమా తెరకు వచ్చినప్పుడు. సిల్వర్ స్క్రీన్ ఎప్పుడు బాధపడుతుంది... తన అభిమాన తార సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పుడు. ఆ బ్రేక్‌కి బ్రేక్ ఇచ్చి ఆ తారలు మళ్లీ సినిమాలు చేస్తే.. రండి.. రండి.. రండి.. మీ రాక ఎంతో ఆనందమండి అని వెండితెర ఆహ్వానించకుండా ఉంటుందా. ఇక కొందరు తారలు బ్రేక్ తర్వాత చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. 28 ఏళ్ల తర్వాత... బ్యాక్ టు బ్యాక్ జాతీయ ఉత్తమ నటిగా (తమిళ చిత్రం ‘వీడు’– 1987, తెలుగు చిత్రం ‘దాసి’– 1988 చిత్రాల్లోని నటనకు) అవార్డులు సాధించిన అర్చన ప్రేక్షకులకు గుర్తుండే ఉంటారు. ‘నిరీక్షణ’, ‘లేడీస్ టైలర్’, ‘భారత్ బంద్’ వంటి తెలుగు చిత్రాల్లో అర్చన యాక్టింగ్ అదుర్స్ అని అప్పట్లో తెలుగు ప్రేక్షకులు కితాబులిచ్చారు. అర్చన కేవలం తెలుగులోనే కాదు.. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లోనూ సినిమాలు చేశారు. అయితే మిగతా భాషల్లో అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నా తెలుగు తెరపై నల్లపూస అయిపోయారు అర్చన. 1994లో వచ్చిన ‘పచ్చతోరణం’ తర్వాత మరో తెలుగు మూవీలో ఆమె కనిపించలేదు. ఇప్పుడు అర్చన మళ్లీ తెలుగు డైలాగ్స్ చెబుతున్నారు. ఈ డైలాగ్స్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న ‘చోర్ బజార్’ చిత్రం కోసమే. జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆకాశ్ తల్లిగా కనిపిస్తారు అర్చన. ఈ ఏడాదే ‘చోర్ బజార్’ చిత్రం థియేటర్స్‌కు రానున్నట్లుగా తెలిసింది. అంటే.. దాదాపు 28 సంవత్సరాల తర్వాత అర్చన మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నారన్నమాట. తమిళంలో ఇరవై.. తెలుగులో పది తెలుగులో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ‘శివ’లో హీరోయిన్గా చేసిన అమలను అంత ఈజీగా మర్చిపోలేరు తెలుగు ప్రేక్షకులు. అయితే 1993లో ‘ఆగ్రహం’ తర్వాత అమల తెలుగు సినిమాకు గ్యాప్ ఇచ్చారు. తిరిగి 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రం ద్వారా తెలుగు తెరపై కనిపించారు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఆ తర్వాత ‘మనం’ (2014) చిత్రంలో అతిథిగా కనిపించినప్పటికీ ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది మాత్రం తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’) లోనే అని చెప్పాలి. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఈ ద్విభాషా (తెలుగు, తమిళ) చిత్రంలో శర్వానంద్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇందులో శర్వా తల్లి పాత్రలో కనిపిస్తారు అమల. దాదాపు పదేళ్ల తర్వాత తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్లో అమల కనిపించనున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఇక తమిళంలో 1991లో వచ్చిన ‘కర్పూర ముల్లై’ తర్వాత అమల మరో సినిమా చేయలేదు. ఇరవైసంవత్సరాల తర్వాత ‘కణం’ సినిమాతో తమిళ తెరపై ఆమె మళ్లీ కనిపించనున్నారు. రెండు దశాబ్దాలకు మళ్లీ... ‘బద్రి, జానీ’ సినిమాల్లో హీరోయిన్గా నటించిన రేణూ దేశాయ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2003లో వచ్చిన ‘జానీ’ తర్వాత తెలుగులో ఆమె మరో చిత్రం చేయలేదు. 2014లో మరాఠీ చిత్రం ‘ఇష్క్ వాలా లవ్’కి దర్శకత్వం వహించారు కానీ నటిగా వెండితెరపై మాత్రం మెరవలేదు. ఇప్పుడు కనిపించనున్నారు. రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’లో ఓ కీ రోల్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారామె. ఈ సినిమాకు వంశీ దర్శకుడు. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజయ్యే చాన్స్ ఉంది. పదేళ్ల తర్వాత.. ‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’... ఈ డైలాగ్ విన్న వెంటనే జెనీలియా గుర్తు రాకుండా ఉండరు. 2012లో వచ్చిన ‘నా ఇష్టం’ సినిమా తర్వాత జెనీలియా మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు. ఇటీవలే ఆమె ఒక తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కిరీటి (వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు) హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో జెనీలియా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత జెనీలియా తెలుగు సినిమావైపు చూశారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ద్విభాషా (తెలుగు, కన్నడం) చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైంది. డబుల్ ధమాకా ‘గోల్కొండ హైస్కూల్’, ‘స్వామి రా రా’, ‘కార్తికేయ’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ‘కలర్స్’ స్వాతి ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2017లో వచి్చన ‘లండన్ బాబులు’ తర్వాత ఈ బ్యూటీ తెలుగులో మరో సినిమా చేయలేదు. దాదాపు ఐదేళ్ల తర్వాత తెలుగులో ఆంథాలజీ ఫిల్మ్ ‘పంచతంత్రం’ అంగీకరించారు. అలాగే ఈ సినిమాతో పాటు స్వాతి ‘ఇడియట్స్’ అనే ఫిల్మ్ కూడా చేశారు. స్వాతి, నిఖిల్ దేవాదుల, సిద్ధార్థ్ శర్మ, శ్రీ హర్ష ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఆదిత్యా హాసన్ దర్శకుడు. అభిõÙక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి నవీన్ మేడారం షో రన్నర్. ఇలా కమ్బ్యాక్లోనే ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ డబుల్ ధమాకా ఇస్తున్నారు స్వాతి. వీరే కాదండోయ్... ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సోనాలీ బింద్రే, రామ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో మీరా జాస్మిన్ కీ రోల్స్ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా తెలుగు సినిమాల పరంగా బ్రేక్‌లో ఉన్న మరికొందరు తారలు కూడా రీ ఎంట్రీ లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది. -
ఆ దర్శకుడు నాన్సెన్స్ చేసేవాడు, ఇంటికొచ్చి మరీ..: అర్చన
హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన అర్చన ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. గతంలో బిగ్‌బాస్ షోలో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు కూడా చేరువయ్యిందీ భామ. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తనకు ఎదురైన కొన్ని అనుభవాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఒక తెలుగు డైరెక్టర్ తనను నానా హింసించేవాడని పేర్కొంది. 'ఒక డైరెక్టర్ ఉన్నాడు. అతడు రోజుకోసారి డైలాగ్ మార్చేస్తాడు, రోజుకోసారి స్క్రిప్ట్ మార్చేస్తాడు. చాలా నాన్సెన్స్ చేశాడు. అతడిని చూశాక మనుషులు ఇలా కూడా ఉంటారా అనుకున్నా! అతడు సెట్లో డిఫరెంట్‌గా ఉండేవాడు.. కానీ మళ్లీ ఇదెక్కడ సినిమా వదిలేస్తుందోనని అమ్మా, నిన్ను కలుస్తా, ఇంటికొచ్చి మాట్లాడతాను అంటూ నాతో మాటలు కలిపేవారు. అలా ఒకసారి ఆయన మా ఇంటికొచ్చినప్పుడు మీరు చెప్పింది ఒకటి, చేస్తుంది మరొకటి.. ఇది కరెక్ట్ కాదు సర్ అని చెప్పాను. దీంతో అతడు కాకమ్మ కబుర్లు చెప్తూ తియ్యగా మాట్లాడుతూ నా బ్రెయిన్ వాష్ చేసేవాడు. అతడి మాటలు విని.. నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో అనుకుని మళ్లీ షూటింగ్‌కు వెళ్లేదాన్ని. కానీ సెట్లో చాలా ఇరిటేషన్ వచ్చింది. నువ్వు నాకు పైసా కూడా ఇవ్వకు అని ముఖం మీదే చెప్పి వచ్చేశాను. తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ సంఘటన కొన్నేళ్ల క్రితం జరిగింది. అతడు మనందరికీ తెలిసిన హీరో, కానీ పెద్దగా సక్సెస్ఫుల్ హీరో కాదు. ఆయన నాకు తెలీకుండా నా వెనకాల కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. చూడటానికి అతడు చాలా సింపుల్‌గా, సీదాగా ఉన్నారనిపిస్తుంది, కానీ అది అతడి నిజస్వరూపం కాదు. వేరే నిజం ఇంకేదో ఉంటుంది. అతడు చాలా వంకరగా ఆలోచించేవాడు. అందమైన అమ్మాయిలు, అందులోనూ ఎవరి అండా లేనివాళ్లు సెట్లో ఉన్నారంటే వాళ్ల మైండ్‌ను క్యాప్చర్ చేసేందుకు ఇలాంటి వ్యక్తులు రెడీగా ఉంటారు' అని చెప్పుకొచ్చింది అర్చన. -
‘ది రోజ్ విల్లా’ మూవీ రివ్యూ
టైటిల్ : ది రోజ్ విల్లా నటీనటులు : దీక్షిత్ శెట్టి, శ్వేతా వర్మ, రాజా రవీంద్ర, అర్చన తదితరులు నిర్మాణ సంస్థ : చిత్ర మందిర్ స్టూడియోస్ నిర్మాత : అచ్యుత్ రామారావు దర్శకత్వం :హేమంత్ సంగీతం : సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ : అంజి ఎడిటింగ్: శివ విడుదల తేది : అక్టోబర్ 1,2021 ‘కన్నడ `దియా` ఫేమ్ దీక్షిత్ శెట్టి, బిగ్‌బాస్ -5 ఫేమ్ శ్వేతా వర్మ హీరో,హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ది రోజ్ విల్లా. చిత్ర మందిర్ స్టూడియోస్ బ్యానర్‌పై అచ్యుత్ రామారావు నిర్మించిన ఈ సినిమాకు హేమంత్ దర్శకత్వం వహించాడు. రాజా రవీంద్ర కీలకపాత్రలో నటించారు. అక్టోబర్ 1న ఈ మూవీ తెలుగు, కన్నడలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ డాక్టర్ రవి (దీక్షిత్ శెట్టి), శ్వేత (శ్వేత వర్మ) కొత్తగా పెళ్లి చేసుకున్న యువ జంట. ఇద్దరూ తాము కోరుకున్న విధంగా ఉండాలని.. మున్నార్ అనే అందమైన ప్రాంతానికి కారులో బయలుదేరుతారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం సాగిస్తారు. అయితే వీరిద్దరు అనుకోకుండా నక్సల్స్ ఉన్న డేంజర్ పాయింట్‌కు వెళ్తారు. అక్కడ వారి కారు పాడైపోతుంది. ఎంతకీ స్టార్ట్ అవ్వదు. అలాంటి సమయంలో పోలీసులు వచ్చి వారిని సురక్షితంగా పక్క గ్రామంలో దిగబెడతారు. అక్కడ రెస్టారెంట్లో వీళ్ళు తింటుండగా మిలట్రీ రిటైర్ అయిన సోల్మాన్ (రాజా రవీంద్ర) తన భార్య హెలెన్‌తో (అర్చనా కుమార్)తో అక్కడే ఉంటాడు. అతన్ని ఓ ప్రమాదం నుంచి డాక్టర్ రవి కాపాడతాడు. దీంతో వారిద్దరు స్నేహితులైపోతారు. తనను కాపాడినందుకు ఆ యువ జంటని ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తారు. అలా అక్కడికి వెళ్ళిన ఈ యువజంటకు అక్కడి వాతావరణం వితంగానే కాకుండా భయం కలిగించేలా ఉంటుంది. అలా ఎందుకు అనిపించింది.. ఏం జరిగింది? అప్పుడు ఈ యువజంట ఏం చేశారు? అనేది మిగిలిన కథ ఎలా చేశారంటే.. డాక్టర్ రవి పాత్రకు దీక్షిత్ పూర్తి న్యాయం చేశాడు. బిగ్ బాస్ 5 తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న శ్వేతా వర్మ ఇందులో హీరోయిన్. ఈమె కూడా బాగానే నటించింది. తెరపై అందంగా కనిపించడంతో పాటు తనదైన నటనతో మెప్పించింది. రైటైర్ మిలట్రీ సోల్మాన్ పాత్రలో రాజా రవీంద్ర తన అనుభవాన్ని చూపించాడు. అర్చనతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ ఓ సాధారణ కథకి భావోద్వేగాన్ని అతికించి తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు హేమంత్. దర్శకుడు తీసుకున్న పాయింట్ చిన్నదే అయినా.. దాని చుట్టు అల్లుకున్న సీన్స్ ప్రేక్షకుడిని థ్రిల్లింగ్ కలిగిస్తాయి. మాటలు కూడా బానే రాసుకున్నాడు. ఫస్టాఫ్ అంతా కాస్త నెమ్మదిగా సాగుతుంది. సెకండాఫ్ మాత్రం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా అర్చన, రాజా రవీంద్ర మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. అయితే కొన్ని సీన్స్ పునరావృతం కావడం ప్రేక్షకుడి బోర్ కొట్టిస్తాయి. హీరో హీరోయిన్లు రాజా రవీంద్ర ఇంటికి వచ్చిన తర్వాత వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగిస్తాయి. దీక్షిత్‌ను చూసి తన కొడుకు అనుకుని ఇక్కడే ఉండమని బలవంతం చేయడంతో.. తను అక్కడ్నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయడం.. ఆ తర్వాత ఏం జరిగిందనేది బాగానే అనిపిస్తుంది. సురేష్ బొబ్బిలి నేపథ్య బాగుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ, నేపథ్య సంగీతం మాత్రం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. అంజి సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలను సహజంగా చిత్రీకరించారు. ఎడిటర్ శివ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.