వేశ్య వృత్తి వద్దనుకునే కమల
వేశ్య వృత్తి వద్దనుకునే కమల
Published Thu, Mar 6 2014 10:38 PM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM
వేశ్య వృత్తి నుంచి బయటపడాలని తపించే ఓ స్త్రీ, సమాజాన్ని ఎదిరించైనా సరే వేశ్య వృత్తి నుంచి ఆమెను బయటకు తెచ్చి కొత్త జీవితాన్ని ఇవ్వాలని ఆశించే ఓ వ్యక్తి. ఈ ఇద్దరి కథతో తెరకెక్కిన చిత్రం ‘కమలతో నా ప్రయాణం’. 1950 నాటి యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో శివాజీ, అర్చన జంటగా నటించారు. నరసింహ నంది దర్శకుడు. ఇసనాక సునీల్‌రెడ్డి, బాగోలు సిద్దార్థ్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ నెల 14న విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ -‘‘కథకు ప్రాధాన్యత ఇస్తూ, అందుకు తగ్గ నటీనటులను ఎంచుకొని చేసిన చిత్రమిది.
ఓ మంచి సినిమా నిర్మించామనే సంతృప్తినిచ్చిందీ సినిమా. సందర్భానుగుణంగా వచ్చే పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని తెలిపారు. ‘‘ఇందులోని పాత్రలన్నీ నిజానికి నిలువుటద్దంగా ఉంటాయి. వేశ్య వృత్తితో జీవనం సాగించే కమలగా అర్చన, ఉన్నత భావాలనున్న వ్యక్తిగా శివాజీ, కమలను ఇంట్లో ఉంచుకొని వేశ్య వృత్తి చేయించే శేషమ్మ పాత్రలో పావలా శ్యామల... ఇలా ప్రతి ఒక్కరూ పాత్రలో లీనమై నటించారు. ఈ నెల 14న విడుదలయ్యే ఈ సినిమా తప్పకుండా అందరి మన్ననలూ అందుకుంటుందని నా నమ్మకం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.మురళీమోహన్‌రెడ్డి, పాటలు: వనమాలి, కూర్పు: వి.నాగిరెడ్డి, కళ: బాబ్జీ.
Advertisement