
‘నేర్చుకోవాలి’ అనే తపన ఉంటే ఏ విద్య అయినా చేతికి చిక్కుతుంది. సైకిల్ తొక్కడం కూడా రాని అర్చనా ఆత్రమ్ పెద్ద బస్సును నైపుణ్యంగా నడుపుతూ ‘భేష్’ అనిపించుకోవడానికి ఆ తపనే కారణం.... మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ (ఎంఎస్‌ఆర్‌టీసీ) తొలి మహిళా డ్రైవర్‌గా వార్తల్లో నిలిచింది అర్చనా ఆత్రమ్. నాందేడ్ జిల్లాలోని కివ్వత్ తాలూకలోని సర్కానీ గ్రామానికి చెందిన అర్చన డ్రైవింగ్ ఫీల్డ్‌ను ఎంచుకోవడం తండ్రికి నచ్చలేదు. బంధువులు ‘అది ఆడవాళ్లు చేసే ఉద్యోగం కాదు’ అన్నారు.
కొందరైతే...‘నీకు సైకిల్ తొక్కడమే రాదు. బస్సు నడుపుతావా!’ అని బిగ్గరగా నవ్వేవాళ్లు. ఎన్నో ప్రతికూల మాటలను ఈ చెవిన విని ఆ చెవిన వదిలేసిందేగానీ ఒక్క అడుగు వెనక్కి వేయలేదు అర్చన. ‘పట్టుదల ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు’ అంటున్న అర్చన పుణెలో జరిగిన శిక్షణ తరగతులలో ఎన్నో విషయాలు నేర్చుకుంది. క్లచ్, గేర్ అంటే ఏమిటో తెలియని అర్చన జీరో నుంచి ప్రయాణం ప్రారంభించి హీరో అయ్యింది. డిపో మేనేజర్ నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరకు ఎంతో మంది అర్చనా ఆత్రమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.