Woman driver
-
అర్చన... అనుకున్నది సాధించింది
‘నేర్చుకోవాలి’ అనే తపన ఉంటే ఏ విద్య అయినా చేతికి చిక్కుతుంది. సైకిల్ తొక్కడం కూడా రాని అర్చనా ఆత్రమ్ పెద్ద బస్సును నైపుణ్యంగా నడుపుతూ ‘భేష్’ అనిపించుకోవడానికి ఆ తపనే కారణం.... మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (ఎంఎస్ఆర్టీసీ) తొలి మహిళా డ్రైవర్‌గా వార్తల్లో నిలిచింది అర్చనా ఆత్రమ్. నాందేడ్ జిల్లాలోని కివ్వత్ తాలూకలోని సర్కానీ గ్రామానికి చెందిన అర్చన డ్రైవింగ్ ఫీల్డ్‌ను ఎంచుకోవడం తండ్రికి నచ్చలేదు. బంధువులు ‘అది ఆడవాళ్లు చేసే ఉద్యోగం కాదు’ అన్నారు. కొందరైతే...‘నీకు సైకిల్ తొక్కడమే రాదు. బస్సు నడుపుతావా!’ అని బిగ్గరగా నవ్వేవాళ్లు. ఎన్నో ప్రతికూల మాటలను ఈ చెవిన విని ఆ చెవిన వదిలేసిందేగానీ ఒక్క అడుగు వెనక్కి వేయలేదు అర్చన. ‘పట్టుదల ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు’ అంటున్న అర్చన పుణెలో జరిగిన శిక్షణ తరగతులలో ఎన్నో విషయాలు నేర్చుకుంది. క్లచ్, గేర్ అంటే ఏమిటో తెలియని అర్చన జీరో నుంచి ప్రయాణం ప్రారంభించి హీరో అయ్యింది. డిపో మేనేజర్ నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరకు ఎంతో మంది అర్చనా ఆత్రమ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. -
Ankita Shah: ఆసరాకు అంకితం
ఆడపిల్లలు తల్లికి ఇంటి పనుల్లో తప్ప తండ్రికి ఏవిధంగా సాయపడగలరు... అనే ఆలోచన నిన్నామొన్నటి వరకు సమాజంలో ఉండేది. ఇప్పుడు ఏమరుపాటుగా కూడా అలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నారు అంకితలాంటి అమ్మాయిలు. గుజరాత్లో పుట్టి పెరిగిన అంకిత షా దివ్యాంగురాలైనా ఆటో నడుపుతూ తల్లిదండ్రులకు ఆసరా అయ్యింది. జీవితంలో నిలదొక్కుకోవడానికి తనలాంటి దివ్యాంగులకు ప్రేరణ గా నిలుస్తోంది. అంకిత ఏడాది బిడ్డగా ఉన్నప్పుడు పోలియో వచ్చి కుడికాలు వైకల్యానికి లోనైంది. అయినా, తల్లిదండ్రులు ఆమెను చదువులో ప్రోత్సహించారు. దీంతో ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసింది అంకిత. 2009లో ఉద్యోగం కోసం అహ్మదాబాద్ కు వెళ్లింది. చుక్కెదురైంది అక్కడ. అక్కడనే కాదు, అలా చాలా చోట్ల ఇంటర్వ్యూలకు హాజరయ్యింది. కానీ, ప్రతీచోటా తిరస్కారాన్నే ఎదుర్కొంది. కొన్ని ఆఫీసులలో వైకల్యం కారణంగా జాబ్ ఇవ్వలేమన్నారు. అంకిత కుటుంబంలో తోబుట్టువులతో కలిపి ఏడుగురు సభ్యులు. తండ్రి సంపాదన పైనే ఇల్లు గడిచేది. అంకిత చిన్న చిన్న పనులు వెతుక్కొని చేసినా అవేవీ కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. ఇది చాలదన్నట్టు అంకిత తండ్రి నాలుగేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడ్డాడు. మనో ధైర్యమే ఊతంగా.. సంపాదించే పెద్ద దిక్కు లేకపోతే ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితిలో ఉంటుందో ఊహించవచ్చు. అప్పటికీ కుటుంబ పోషణకు సరిపడా ఉద్యోగం కోసం అంకిత వెతుకుతూనే ఉంది. అలాంటి సమయంలోనే దివ్యాంగుడైన ఆటో డ్రైవర్ లాల్జీ బారోట్ పరిచయం అయ్యాడు. ఏ పనీ దొరక్క చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడంతో అతను అంకితకు ఆటో నడపడం నేర్పించాడు. ఆటో నడపడం పూర్తిగా వచ్చాక, లైసెన్స్ తీసుకుంది అంకిత. ఆటో రిక్షా కొనుగోలులోనూ అంకితకు సాయం చేశాడు బారోట్. దీంతో మూడేళ్లుగా అంకిత ఆటో డ్రైవింగ్ చేస్తూ నెలకు రూ.25 వేలు సంపాదిస్తోంది. ‘డ్రైవింగ్ వల్ల మొదట్లో వళ్లు నొప్పులు వచ్చేవి అయినా, కుటుంబం కళ్ల ముందు మెదిలి మనోధైర్యాన్నే ఊతంగా చేసుకుంది. శక్తినంతా కూడదీసుకొని డ్రైవింగ్‌లో నైపుణ్యం సాధించింది. ‘రోజూ ఉదయం 10:30 గంటల నుంచి ఆటో నడపడానికి బయల్దేరుతాను. తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి 8:30 గంటలు అవుతుంది. మా నాన్న బాధ్యత తీసుకోగలిగాను అనే ఆనందంతోపాటు కుటుంబానికి భరోసాగా ఉన్నాను అనే సంతృప్తి కలుగుతుంది. ధైర్యం చేసి ఉండకపోతే ఈ రోజు మా కుటుంబం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది’ అంటోంది అంకిత. తండ్రి బాధ్యతను భుజాలకెత్తుకున్న కూతురుగానే కాదు దివ్యాంగులకూ ప్రేరణగా నిలుస్తోంది అంకిత. -
‘ఆమె’ డ్రైవర్
జమ్మూ – కథువా – పఠాన్‌కోట్ రహదారి పెద్ద పెద్ద ట్రక్కులు, వాహనాలతో బిజీగా ఉంటుంది. అలాంటి రహదారి మీద కథువా నుండి జమ్మూ వెళ్లే ప్రైవేట్ బస్సులో ఉన్న ప్రయాణికులు మొదట ఆశ్చర్యపోయారు బస్సు డ్రైవర్ని చూసి. తర్వాత సందేహించారు. కారణం ‘ఆమె’ బస్సు నడపగలదా? అని. తర్వాత తమ ప్రయాణానికి ఢోకా లేదని నిశ్చింతంగా కూర్చున్నారు. బస్సు గమ్యస్థానానికి చేరింది. ప్రయాణికులు ఒక్కొక్కరుగా దిగుతూ బస్సు డ్రైవర్‌కి అభినందనలు తెలిపారు. ఆ బస్సు డ్రైవరు పేరు పూజా దేవి. జమ్మూ కాశ్మీర్లో మొదటిసారి బస్సు నడిపిన మహిళగా పేరుపొంది పూజాదేవి. కతువా జిల్లాలోని సంధర్–భష్లో అనే మారుమూల గ్రామానికి చెందిన పూజాదేవికి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. టీనేజ్ నుంచి కార్లు, మోటార్ సైకిళ్లు డ్రైవ్ చేస్తుండేది. ఆ వయసు నుంచే పెద్ద పెద్ద వాహనాలను నడపాలనుకునేది. పూజాదేవి తాను చేస్తున్న పని గురించి వివరిస్తూ ‘నా కుటుంబం మొదట్లో నాకు మద్దతు ఇవ్వలేదు. కానీ, నాకు వేరే ఉద్యోగం ఎంచుకునేంత పెద్ద చదువు లేదు. నాకు డ్రైవింగ్ పని వచ్చు. కుటుంబ పోషణకు డబ్బు కావాలి. నాకు వచ్చిన పని నుంచే ఉపాధి పొందవచ్చు కదా అనుకున్నాను. అందుకు ఇంట్లో వాళ్లు ఆడవాళ్లు అంత పెద్ద పెద్ద వాహనాలను ఎలా నడపగలరు. శక్తి సరిపోదు అన్నారు. కానీ, నేను వారి మాటలను పట్టించుకోలేదు. కమర్షియల్ వెహికిల్స్‌ను ఎలా నడపాలో తెలుసుకోవడానికి ఇప్పటి వరకు టాక్సీ నడుపుతున్నాను. కతువా నుండి జమ్మూ వరకు ట్రక్కు కూడా నడిపాను. ఈ వారమే ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరాను. ఇప్పుడిలా ప్రయాణికులను చేరవేసే బస్సు నడపడంతో ఎప్పటి నుంచో నాకున్న కల నెరవేరింది’ అని సంతోషం వెలిబుచ్చిన పూజను కలిస్తే ఎవ్వరైనా అభినందించకుండా ఉండలేం. పురుషులు మాత్రమే ప్రయాణికుల బస్సులను నడపగలరనే మూసను ముక్కలు చేయాలనుకున్న విషయాన్నీ పూజ ప్రస్తావిస్తారు. డ్రైవింగ్ ద్వారా ఉపాధి పొందాలని కోరుకునే మహిళలకు వారి కుటుంబాలు మద్దతు ఇవ్వాలని చెబుతుంది పూజ జమ్మూ కథువా పఠా¯Œ కోట్ రహదారి భారీ ట్రాఫిక్‌తో ఉంటుంది. ఇతర పురుష డ్రైవర్లు సైతం రాకపోకలు సాగించడం కష్టంగా ఉండి, సరిగ్గా విధులకు హాజరు కాకపోడంతో, ఈ ఉద్యోగం పూజకు ఇచ్చారు. తన శక్తిని నమ్మి డ్రైవింగ్ ఉద్యోగం ఇచ్చిన బస్సు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతుంది పూజ. -
ఇంతకీ ఎవరీ కల్పన?
కోల్‌కతాలో బస్సు నడపడం అంత తేలికైన పనికాదు. ఇరుకైన రోడ్లు, ట్రాఫిక్, రద్దీగా ఉండే నివాస–మార్కెట్ ప్రాంతాలు.. ప్రతి ట్రిప్‌ని కష్టంగా మారుస్తాయి. అయినా సరే ఆ వీధుల్లో పీ.. పీ.. పీ.. అని హారన్ కొడుతూ ఒడుపుగా స్టీరింగ్ తిప్పుతూ బస్సు నడుపుతోంది బక్కపల్చగా ఉన్న ఓ యువతి. ఆమె పేరు కల్పనా మొండల్. వయసు 21. ఆమెను చూసిన ప్రయాణికులు ఒక మహిళ అయి ఉండి బస్సు ఎలా నడిపిస్తుంది అని ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇంతకీ ఎవరీ కల్పన? ఆమె ఎందుకు బస్సు నడిపిస్తోంది? కల్పనా మొండల్ గురించి మనకు పెద్దగా తెలియదు. కానీ, సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందిన బస్సు డ్రైవర్. కోల్‌కతా శివారులోని నోసారిలో కల్పన కుటుంబం ఉంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా తను చదువుకోలేదు. కుటుంబంలో నలుగురు సభ్యులు. అక్క, తల్లి, తండ్రి, తను. అందరూ ఇంటిలాంటి ఒక గదిలో ఉంటున్నారు. కల్పన తండ్రి సుభాష్ ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పని చేసేవాడు. చిన్నప్పుడు తండ్రికి సాయంగా ఉండటానికి తరచూ కల్పన కూడా బస్సులో వెళ్లేది. తండ్రి రోజుకు రెండు రూపాయలు ఇచ్చేవాడు. ఆ డబ్బులతో కల్పన మిఠాయి కొనుక్కొనేది. బస్సు డ్రైవింగ్ చేయగా వచ్చే తండ్రి ఆదాయంతోనే నడిచే ఆ కుటుంబం ఓ రోజు పెద్ద కుదుపుకు లోనయ్యింది. తండ్రికి ధైర్యం చెప్పి.. రెండేళ్ల క్రితం కల్పన తండ్రి ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో రెండు కాళ్లకు ఆపరేషన్ అయ్యి మెటల్ ప్లేట్స్ వేశారు. కుటుంబం గడిచే పరిస్థితి లేక కల్పన తనే కుటుంబాన్ని పోషించాలని నిర్ణయించుకుంది. ‘డ్రైవింగ్ నేర్చుకొని ముందు కాలనీలోనే ట్రక్కులు నడిపేది. గోడౌన్లకు లోడు చేర్చేది. మేజర్ అయిన తర్వాత లైసెన్స్ తీసుకొని బస్సు నడపడం నేర్చుకుంది. నాకు వెన్నుదన్నుగా నిలిచింది’ అంటూ కూతురు గురించి గొప్పగా ఉత్సాహంగా చెబుతూ ఉంటాడు సుభాష్, ‘ఆపరేషన్ అయ్యాక మేటల్ ప్లేట్స్ కారణంగా నా కాళ్లను వంచలేకపోయాను. దీంతో మానసికంగా చాలా కృంగిపోయాను. అలాంటి సమయంలో నా కూతురు కల్పన హామీ ఇచ్చింది నేను కుటుంబాన్ని నడుపుతాను అని. అప్పటికే చుట్టుపక్కల కాలనీలలో రాత్రిపూట కొన్నాళ్లపాటు డ్రైవింగ్ నేర్చుకుంటూ ప్రయత్నించింది. బాగా నేర్చుకున్నప్పటికీ 34సి మార్గంలో (ఎస్ప్లానేడ్–బరానగర్) బస్సు యజమాని కల్పనకు బస్సు ఇవ్వడానికి అంగీకరించలేదు. ఎందుకంటే అది చాలా రద్దీ రూటు. వాళ్లు అంగీకరించేవరకు ప్రయత్నించి సాధించింది. అప్పుడు తిరస్కరించినవాళ్ల బస్సునే ఆమె ఇప్పుడు చాకచక్యంగా నడపడం చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. కుటుంబ శ్రేయస్సు కోసం తన భవిష్యత్తు త్యాగం చే సింది నా తల్లి కల్పన’ అంటూ కూతురి గొప్పతనం చెబుతాడు సుభాష్. తల్లి మంగళ మాట్లాడుతూ –‘మొదట్లో తండ్రి (సుభాష్) కల్పన వెనకాల కూర్చొని సూచనలు ఇస్తూ ఉండేవాడు. కానీ, ఎప్పుడూ తన చేతిని పట్టుకొని నేర్పలేదు’ అంటారు ఆమె. పోలీసులు సెల్ఫీలు తీసుకుంటారు! ఇక కల్పన మాట్లాడుతూ ‘ట్రాఫిక్ పోలీసులు నన్ను రద్దీ దారుల్లో నడపమని ప్రోత్సహిస్తుం టారు. ఇంకొంతమంది నాతో సెల్ఫీలు దిగి ఆసక్తిగా నా గురించి అడుగుతుంటారు’ అంటుంది. అంతేకాదు, ఇప్పుడామెకు డ్రైవింగ్ స్కూల్ పెట్టుకోవడానికి కూడా అనుమతి వచ్చింది. ‘‘ప్రయాణీకులు కొందరు బస్సు ఎక్కినప్పుడు ముందు నన్ను చూడరు. కానీ, ఆ తర్వాత నేను ఓ మహిళనని గమనించి ఆసక్తిగా చూస్తూ ఉండటాన్ని నేను నా డ్రైవింగ్ సీట్ నుంచే అద్దంలో చూసి తెలుసుకుంటుంటాను’ సంబరంగా చెబుతుంది కల్పన. కనీసం పదోతరగతి కూడా పాస్‌కాని కల్పన ఇప్పుడు ప్రైవేట్‌గా చదువుకొని పదవ తరగతి పరీక్షలు రాయాలనుకుంటోంది. ‘అప్పుడైతే ప్రభుత్వంలో డ్రైవర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నా తండ్రి కలనే నేను నెరవేర్చాలనుకుంటున్నాను’ అని ఉత్సాహంగా చెబుతుండటం చూస్తుంటే ముచ్చటేస్తుంది. కుటుంబానికి కష్టం వస్తే పెద్దవాళ్లు చూసుకుంటారులే అనుకోకుండా తానే కుటుంబానికి అండగా నిలబడ్డ కల్పన తన తోటి అమ్మాయిలకే కాదు, యువకులకూ రోల్‌మోడల్. – నిర్మలారెడ్డి చిలకమర్రి -
‘బెస్ట్’ బస్సు నడపనున్న ప్రతీక్ష
ముంబై: ముంబై బెస్ట్ బస్సుల్లో డ్రైవర్‌గా ఓ మహిళను త్వరలో చూడబోతున్నాం. ప్రతీక్షా దాస్ అనే 24 ఏళ్ల యువతి ఈ చరిత్రాత్మక ఘట్టానికి నాంది పలుకబోతోంది. ఈ విషయం తెలిసిన ప్రజలు ఆమెపై సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ప్రతిక్షా దాస్ అనే మహిళ ప్రస్తుతం బెస్ట్ శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ పొందుతోంది. శిక్షణ అనంతరం విధుల్లో చేరనుంది. ఇలా బస్సు డ్రైవర్‌గా ఓ మహిళ స్టీరింగ్ చేత పట్టడం బెస్ట్ సంస్థ చరిత్రలో ఇదే ప్రథమం కానుంది. గతంలో అంటే సుమారు 12 ఏళ్ల కిందట ఐదుగురు మహిళలు కండక్టర్‌గా విధులు నిర్వహించారు. కానీ, రద్దీ సమయంలో పురుష ప్రయాణికుల మధ్య నిలబడి టికెట్లు జారీ చేయడం మహిళా కండక్టర్లు ఇబ్బంది పడ్డారు. అనేక ఫిర్యాదులు రావడంతో చివరకు వారిని కండక్టర్ విధుల నుంచి తప్పించి కార్యాలయంలో వారి అర్హతను బట్టి కూర్చుండి పనిచేసే ఉద్యోగం కల్పించారు. ఆ తరువాత బెస్ట్ బస్సుల్లో మహిళా సిబ్బంది దర్శనమివ్వలేదు. కానీ, సుదీర్గ కాలం తరువాత మహిళ డ్రైవర్‌ను నియమించాలనే ఆలోచన తెరమీదకు వచ్చింది. ఆ మేరకు ప్రతీక్ష దాస్‌కు ఈ అవకాశం వరించింది. ఆర్టీఓ నియమాల ప్రకారం ఆమె వద్ద హెవీ ప్యాసెంజర్ బస్సు బ్యాడ్జీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర అనుమతుల పత్రాలు కూడా ఉన్నాయి. బస్సు నడిపిన అనుభవం కూడా ఉండటంతో ఆమెను బెస్ట్ డ్రైవర్‌గా నియమించాలని సంస్థ భావించింది. బస్సు నడపడం నేర్చుకోకముందు ఆమె బైక్, కారు నడపడం నేర్చుకుంది. ఆ తరువాత ప్రైవేటు బస్సు స్టీరింగ్ చేతపట్టింది. అంతేగాకుండా ఆమె ఇటీవలే మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. -
ఇక పురుషుల అవసరం లేదు!
రియాద్: సౌదీ అరేబియాలో మహిళలు సొంతంగా వాహనాలు డ్రైవింగ్ చేయడం ప్రారంభించారు. ఇక డ్రైవింగ్ విషయంలో మాకు పురుషుల అవసరం లేదంటూ సౌదీ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మహిళలు డ్రైవింగ్ చేయడాన్ని సౌదీ గతంలో నిషేధించగా.. తమకు అనుమతి ఇవ్వాలని వాళ్లు కోరారు. ఈ మేరకు సౌదీరాజు మమ్మద్ బిన్ సల్మాన్ గతేడాది సెప్టెంబర్‌లో ఉత్తర్వులు జారీ చేశారు. 2018 జూన్ 24 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి మహిళలు, హక్కుల కార్యకర్తలు చేసిన ఉద్యమానికి ఆశించిన ఫలితం నేడు కనిపిస్తోంది. తమపై నిషేధం ఎత్తివేయడంతో ఆదివారం సౌదీలో పలు ప్రాంతాల్లో మహిళా డ్రైవర్లు తమ వాహనాలతో రయ్.. రయ్ మంటూ రోడ్లపైకి వస్తున్నారు. తమకు ఇష్టమైన కార్లు, బైక్‌లు నడుపుతూ తమకు దొరికిన స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నారు. మా అమ్మను కారులో కాఫీకి తీసుకెళ్తామని, బయటకు తీసుకెళ్లి ఐస్‌క్రీమ్ ఇప్పించినప్పుడు వారి కళ్లల్లో ఆనందం చూడాలని ఉందంటూ మహిళా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నిషేధం ఎత్తివేసిన ఉత్తర్వులు అమలైన కొన్ని నిమిషాలకే టీవీ యాంకర్ సబికా అల్ దోసారి కారు నడిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి సౌదీ అరేబియా మహిళకు ఇది చారిత్రాత్మక సందర్భమన్నారు. ‘డ్రైవర్ కోసం ఎదురుచూపులు చూడటానికి ఇక స్వస్తి పలుకుదాం. మాకు ఇంక పురుషుల అవసరం లేదు. సొంతంగా వాహనాలు నడుపుతామని’21 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని హతౌన్ బిన్ దఖిల్ అన్నారు. డ్రైవింగ్ స్కూళ్ల ఏర్పాటు మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేస్తున్నట్లు గతేడాది నిర్ణయం తీసుకున్న తర్వాత సౌదీలోని రియాద్, జెడ్డా, పలు నగరాల్లో వారి కోసం డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. 2020 నాటికి 30 లక్షల మంది మహిళలు డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
బంధం వీడింది.. బాధ్యత నేర్పింది!
మండవల్లి : ఆటో నడుపుతూ కుటుంబ పోషణ చేసుకుంటున్న ఒక మహిళ స్వశక్తితో ముందడుగు వేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. మూడేళ్ల క్రితం భర్త తెగతెంపులు చేసుకుని వదలివెళ్లినా ఆటో నడుపుకుంటూ కుటుంబానికి ఆలంబనగా నిలిచింది. మొక్కవోని ధైర్యంతో తన ఇద్దరు బిడ్డల భవిష్యత్తుకు చుక్కానిలా నడుస్తోంది. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన నాగలక్ష్మికి మండవల్లి మండలం పెరికెగూడేనికి చెందిన కాకర్ల ప్రసాద్‌తో 2001లో వివాహం జరిగింది. అప్పటి నుంచి మద్యానికి బానిసగా మారి అతను భార్యను వేధించేవాడు. ఈ క్రమంలోనే ప్రసాద్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఉడాయించాడు. ఆ సమయంలో బతుకు జట్కా బండి ప్రోగ్రామ్‌లో కూడా నాగలక్ష్మి తన గోడు వెళ్లబోసుకుంది. 2017 ఫిబ్రవరిలో ఈ ప్రోగ్రామ్ టీవీలో ప్రసారం అయ్యింది. ఈ ప్రోగ్రామ్ చూసిన పలువురు మండవల్లిలో ఆమె భర్త ప్రసాద్ వేరే మహిళతో ఉండటం గమనించి ఇల్లు అద్దెకు ఇవ్వమని చెప్పినట్లు తెలిపింది. నాగలక్ష్మికి ఇద్దరు పిల్లలు. ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆమె కుమార్తె దుర్గాభవాని ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు రాస్తోంది. కుమారుడు బాలాజి 7వ తరగతి చదువుతున్నాడు. భర్త వదలి వెళ్లిన తర్వాత పెరికెగూడెంలోనే రూ.35 వేలు సొంత పెట్టుబడి, రూ.లక్ష 20 వేలు అప్పు చేసి కర్రీ పాయింట్ పెట్టింది. అనివార్య కారణాలతో ఆ వ్యాపారం వదిలేసింది. కర్రీ పాయింట్లో ఉన్న సామగ్రి అంతా విక్రయిస్తే రూ.40 వేలు వచ్చాయి. ఇంకా రూ.80 వేలు అప్పు తీర్చవలసి వచ్చింది. పెరికెగూడెంలో భర్త మొదలుపెట్టిన ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆపి వెళ్లిపోయాడు. మళ్లీ ఆ ఇంటి నిర్మాణానికి కొంత అప్పు చేసి పూర్తి చేసింది. ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలియక ఎట్టకేలకు తనకు పూర్వం బైక్ నడిపే అలవాటు ఉండటంతో ఆమె బాబాయ్ సహాయంతో ఆటో డ్రైవింగ్ నేర్చుకుంది. ముందుగా ఒక సెకండ్ హ్యాండ్ ఆటోతో డ్రైవింగ్ ప్రారంభించింది. నాగలక్ష్మి డ్రైవింగ్ చూసి మండవల్లి మండలం లింగాల సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ పట్నాయక్ కొత్త ఆటో కొనుగోలుకు రూ.2 లక్షల 26 వేలు రుణం అందించారు. ఏడు నెలల నుంచి నెలకు రూ.6 వేలు చొప్పున రుణం చెల్లిస్తోంది. రోజుకు రూ.500 వరకు సంపాదన ఉంటే చాలని నాగలక్ష్మి చెబుతోంది. తన కుమార్తె డాక్టర్ చదవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. తనకున్న ఇద్దరి పిల్లల చదువుకు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి 99085 20466 నంబరుకు ఫోన్ చేసి ఆర్థిక సాయం చేయవలసినదిగా నాగలక్ష్మి విజ్ఞప్తి చేస్తోంది. ప్రతి మహిళ ఎవరి కాళ్లపైవారే నిలబడాలి మహిళలు వారి కాళ్లపై వారే నిలబడటానికి ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులపై ఆధారపడి వారికి భారం కాకూడదు. ప్రతిభాపాటవాలపై ఆధారపడి ముందుకు సాగాలి. ఇతరులకు ఆదర్శంగా నిలవాలి.– నాగలక్ష్మి, ఆటో డ్రైవర్ -
సౌదీలో మహిళల డ్రైవింగ్‌కు అనుమతి
రియాద్: సౌదీ అరేబియాలో మహిళలు డ్రైవింగ్ చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఆ దేశం నిర్ణయించింది. ఇకపై డ్రైవింగ్ చేసేందుకు మహిళలను అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సౌదీ రాచకుటుంబం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2018 జూన్ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మహిళలు డ్రైవింగ్ చేయడాన్ని సౌదీ గతంలో నిషేధించింది. ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని దాదాపు మూడు దశాబ్దాల నుంచి మహిళలు, హక్కుల కార్యకర్తలు ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగొచ్చిన ప్రభుత్వం.. నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలు వెంటనే కాకుండా.. 2018 జూన్ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆదేశాల అమలుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నామని పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సౌదీలో మహిళల అభివృద్ధికి ఓ గొప్ప ముందడుగు అని సౌదీ యువరాజ్ ఖలీద్ బిన్ సల్మాన్ పేర్కొన్నారు. సౌదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించారు. సౌదీలో మహిళల హక్కులు, అవకాశాలను ప్రోత్సహించేందుకు ఇదొక సానుకూల చర్యగా ఆయన పేర్కొన్నారు. సౌదీ ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసిందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. మహిళలకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్న సౌదీ అరేబియాను బ్రిటన్ ప్రధాని థెరిసా మే ప్రశంసించారు. -
జాబ్ బోరు... క్యాబ్ జోరు
• ఫస్ట్ ఉమన్ డ్రైవర్ ఈమె పేరు మోనికా యాదవ్. ఆర్కిటెక్చర్లో డిగ్రీ. సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీలో పీజీ చేస్తోంది. ప్రత్యేకత ఏంటి? ఆర్కిటెక్ట్‌గా అయిదు నెలలు పనిచేశాక.. బోర్ అనిపించి.. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి అహ్మదాబాద్‌లో ఊబర్ క్యాబ్స్‌కి అప్లయ్ చేసుకుంది డ్రైవర్‌గా! ఆ జాబ్ వచ్చింది. ఊబర్ క్యాబ్స్‌లో తొలి మహిళా డ్రైవరుగా మహిళా ప్రయాణికులను చాలా సురక్షితంగా గమ్యం చేరుస్తోంది. ఆ జర్నీ గురించి వివరంగా ఆమె మాటల్లోనే... ‘జైపూర్‌లో ఆర్కిటెక్చర్ చదివాను. వెంటనే అహ్మదాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీలో సీట్ దొరికింది. డిగ్రీ అర్హతతో ఆర్కిటెక్ట్‌గా ఉద్యోగం దొరికింది. చేరాను. అయిదేళ్ల ఆ చదువులో ఎన్నో అసైన్మెంట్స్.. ప్రాజెక్ట్స్.. బోర్ కొట్టింది. రోజూ అదే టైమ్‌కి రావాలి.. అదే డెస్క్ దగ్గర కూర్చోవాలి.. అదే షీట్.. స్కేల్.. స్కెచ్..డ్రాఫ్ట్.. డిస్గస్టింగ్. అసలు నేనేంటి? నాకేం కావాలి?ఆలోచనలు మొదలయ్యాయి. ఎవరేమనుకుంటారోనన్న భయం వద్దు.. మీ మనసు ఏం చెప్తుందో అది వినండి. ఆర్కిటెక్చర్ చదివి ఊబర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నానని నన్ను చిన్నచూపు చూసిన వాళ్లూ ఉన్నారు. వాళ్లు మొహం ముందే కామెంట్స్ చేశారు. ఇదేదో లోక్లాస్ ఉద్యోగమని హేళన చేశారు. అయినా డోంట్ కేర్ అనుకున్నా. ఎవరికో నచ్చడం కాదు కదా.. నాకు నచ్చాలి.. నన్ను నేను సమాధానపర్చుకోవాలి. ఉద్యోగాల్లో పెద్ద ఉద్యోగం. చిన్న ఉద్యోగం.. ఆడవాళ్లు చేసేది.. మగవాళ్లు చేసేది అనే తేడాలుండవు. ఆసక్తి, సౌకర్యం రెండే ఉంటాయి. అమ్మాయిలు క్యాబ్ డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తే స్త్రీలకు రక్షణ, భద్రత కూడా!’ ఆ అయిదేళ్లు తీసేస్తే.. నా జీవితంలోంచి ఆర్కిటెక్చర్ చదివిన అయిదేళ్లూ తీసేస్తే... అంతకుముందు నేనెలా ఉన్నానో .. అదే నేను అని డిసైడ్ అయ్యా. ఆర్కిటెక్ట్ కంటే అయిదేళ్ల ముందున్న నా జీవితాన్ని తలుచుకున్నా. దేని పట్ల నాకు ఆసక్తి ఉండిందో గుర్తు తెచ్చుకున్నా. ఏమాత్రం ఉత్సుకత, కొత్తదనం లేని పని అంటే చిరాకు పడే మనస్తత్వం నాది. నైన్ టు ఫైవ్ జాబ్ అంటే విపరీతమైన అనాసక్తత. ట్రావెలింగ్ అంటే ఇష్టం. దేశంలోని ప్రతి రాష్ట్రానికి వెళ్లా. విదేశాలూ తిరిగాను. కొత్త ప్రదేశాలు ఎక్స్ప్లోర్ చేయడం, కొత్త వాళ్లను కలవడం ఇష్టం. అన్నిటికన్నా డ్రైవింగ్.. యెస్.. డ్రైవింగ్ అంటే ప్రాణం. అర్థమైంది. నా మెదడులో ముడిపడ్డ చిక్కు వీడింది. అంతా క్లియర్.. నా గమ్యం ఏంటో క్లిస్టర్ క్లియర్ అయింది. నిరవధికంగా పన్నెండు గంటలు డ్రైవింగ్ చేసినా అలసిపోయిన రోజుల్లేవ్. పైగా చాలా ఉత్సాహంగా ఉండేదాన్ని. అంటే డ్రైవింగ్ సంబంధించి ఉద్యోగాన్ని ఇష్టంగా చేయగలను. ఓలా నో అంది.. ఊబర్ ఎస్ అంది నాకు దేనిపట్ల మక్కువో తెలిశాక.. వెంటనే అహ్మదాబాద్‌లోని ఓలా క్యాబ్స్ ఆఫీస్‌కి వెళ్లా. డ్రైవర్ ఉద్యోగం కోసం. నేను వాళ్లకు నచ్చలేదు. బహుశా.. ఆడపిల్ల డ్రైవర్‌గా ఏంటి? అనుకున్నారోఏమో మరి నో అన్నారు. నేనేం నొచ్చుకోలేదు. తక్షణమే ఊబర్ క్యాబ్స్‌ని అప్రోచ్ అయ్యా. ఇక్కడ క్వయిట్ అపోజిట్ రియాక్షన్. నా రెజ్యూమె, నా ఇంట్రెస్ట్ చూసి ఊబర్ క్యాబ్స్ వాళ్లు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ‘రేపటి నుంచే జాయిన్ కావచ్చు’ అని చెప్పారు. లెసైన్స్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకొని ఊబర్‌లో జాయిన్ అయ్యా.. ఫిమేల్ డ్రైవర్‌గా. గుజరాత్‌లోనే ఫస్ట్ ఫిమేల్ టాక్సీ డ్రైవర్ని నేను. డ్రైవర్‌గా కొత్తలో.. ఉత్సాహంగా జాయిన్ అయ్యాను కాని.. కొత్తలో కొంత నెర్వస్‌గా ఫీలయ్యా. అది కొన్ని రోజులే. ప్రతి కొత్త రైడ్.. కొత్త ప్లేస్.. కొత్త మనుషులు ఎక్సయిటింగ్‌గా అనిపించసాగింది. ఓ అమ్మాయి.. క్యాబ్‌ను డ్రైవ్చేస్తుంటే హ్యాపీగా.. సేఫ్‌గా ఫీలయిన కస్టమర్సూ ఉన్నారు. వాళ్లలో కొందరు టిప్ ఇచ్చి ఆశీర్వదించారు కూడా. అమ్మాయిలతే నా క్యాబ్‌లో ఫుల్ జోష్.. అండ్ మజా. ఉదయం అయిదు నుంచి నా డైలీ రైడ్ ఉదయం అయిదు గంటలకు మొదలవుతుంది. ఎనిమిదిన్నర వరకు ట్రిప్స్ చూసుకొని కాలేజ్‌కి వెళ్తా. సాయంత్రం అయిదింటికి కాలేజ్ అయిపోతుంది. ఆరింటి నుంచి ఊబర్ జాబ్. రాత్రి పదిన్నర వరకు సాగుతుంది. హెక్టిక్ షెడ్యూలే కాని ఎంజాయింగ్ లాట్. ప్రతిరోజూ కొత్త విషయం తెలుసుకుంటున్నా.. కొత్త పాఠం నేర్చుకుంటున్నా. ఒకసారి అర్థరాత్రి గాంధీనగర్‌లో ఓ అమ్మాయిని పికప్ చేసుకోవాలి. ఫోన్లో అడ్రస్ అడుగుతూ వెళ్లా. అయినా సరిగా ట్రేస్ కాలేదు. దాంతో ఆ అమ్మాయికి (ఇంచుమించు నా వయసే) చాలా కోపమొచ్చింది. ఫోన్లోనే చడామడా తిట్టేసింది. నాకూ ఆవేశం వచ్చినా తమాయించుకొని కరెక్ట్ అడ్రస్ ట్రేస్ చేసి పికప్చేసుకున్నా. నన్ను చూసి కూల్ అయిపోయింది. సారీ చెప్పింది. కలిసి డిన్నర్ చేద్దామంది. చేశాం. కట్ చేస్తే.. ఇప్పుడు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఇంకోసారి ఓ మాడ్యులర్ కిచెన్స్ షోరూమ్ ఓనర్ ఎక్కారు కార్లో. అమ్మాయి క్యాబ్ నడుపుతుంటే ప్రౌడ్‌గా ఉంది అన్నారు. ఏం చదివావ్ అని అడిగారు. అర్కిటెక్చర్ అని చెప్పగానే ఆశ్చర్యపోయారు. వాళ్లిల్లు రాగానే లోపలికి పిలిచారు. ఇంట్లో వాళ్లను పరిచయం చేశారు. ఫోన్ నంబర్ ఇచ్చి... ‘నాకు, మా ఆవిడకు ఇంటీరియర్ అంటే ఇష్టం. నీకు లీజర్‌గా ఉన్నప్పుడు రామ్మా.. నేర్పించడానికి. ఫీజు విషయంలో మొహమాటపడొద్దు’ అన్నారు. కొంతమంది ఆంటీలయితే వాళ్ల అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పించమని పట్టుబడుతున్నారు. ఇవన్నీ భలే ఉత్సాహాన్ని నింపుతుంటాయి నాలో. స్ట్రేంజర్గా నా కార్లో ఎక్కిన మనిషి వాళ్ల గమ్యం వచ్చేసరికి కుటుంబ సభ్యులుగా మారిపోవడం.. నిజంగా..గ్రేట్. అందుకే అనిపిస్తుంటుంది.. ఊబర్‌లో ఉద్యోగం.. నాట్ ఎ రాంగ్ చాయిస్ అంటూ ముగించింది మోనికా యాదవ్. -
మెట్రో రైలుకు మహిళా డ్రైవర్
చెన్నై: తమిళనాడులోని చెన్నై నగరానికి ప్రతిష్ఠాత్మక మెట్రోరైలును ఒక ప్రముఖ రాజకీయ నాయకురాలు జెండా ఊపి ప్రారంభిస్తే.. నగరానికి చెందిన ఓ నవయువతి ఈ మొట్టమొదటి రైలుకు మొట్టమొదటి మహిళా డ్రైవర్‌గా ఆవిష్కృతమయ్యారు. చెన్నై ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ నుంచి ఇంజనీరింగ్‌లో డిప్లమో చేసిన ప్రీతి (28) రైలు డ్రైవర్ కావాలని కలలు కంది. దీని కోసం ఢిల్లీలో ఏడాదిన్నర పాటు శిక్షణ తీసుకుంది. ముగ్గురు యువతులు పోటీలో ఉండగా చివరకు ఈ అవకాశాన్ని ప్రీతి దక్కించుకుంది. అలందూర్ స్టేషన్ నుంచి కోయంబేడు వరకు ప్రీతి డ్రైవర్‌గా వ్యవహరించారు. దీనిపై ప్రీతి తండ్రి అన్బు ఆనందం వ్యక్తం చేశారు. మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటినుంచి కష్టపడి, చివరకు తన కలను సాకారం చేసుకుందంటూ మురిసిపోయారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేతులుమీదుగా చెన్నై నగరానికి మొట్టమొదటి మెట్రో రైలు సోమవారం ఉదయం పట్టాలెక్కింది. తమిళనాడు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం పచ్చజెండా ఊపారు. మెట్రో సొబగులతో మెరిసిపోయిన ఆనందూర్ స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. మొట్టమొదటి మెట్రో రైల్లో ప్రయాణం చాలా గొప్పగా ఉందన్నారు.