నాగలక్ష్మి, ఆటో డ్రైవర్
మండవల్లి : ఆటో నడుపుతూ కుటుంబ పోషణ చేసుకుంటున్న ఒక మహిళ స్వశక్తితో ముందడుగు వేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. మూడేళ్ల క్రితం భర్త తెగతెంపులు చేసుకుని వదలివెళ్లినా ఆటో నడుపుకుంటూ కుటుంబానికి ఆలంబనగా నిలిచింది. మొక్కవోని ధైర్యంతో తన ఇద్దరు బిడ్డల భవిష్యత్తుకు చుక్కానిలా నడుస్తోంది. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన నాగలక్ష్మికి మండవల్లి మండలం పెరికెగూడేనికి చెందిన కాకర్ల ప్రసాద్‌తో 2001లో వివాహం జరిగింది. అప్పటి నుంచి మద్యానికి బానిసగా మారి అతను భార్యను వేధించేవాడు. ఈ క్రమంలోనే ప్రసాద్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఉడాయించాడు. ఆ సమయంలో బతుకు జట్కా బండి ప్రోగ్రామ్‌లో కూడా నాగలక్ష్మి తన గోడు వెళ్లబోసుకుంది. 2017 ఫిబ్రవరిలో ఈ ప్రోగ్రామ్ టీవీలో ప్రసారం అయ్యింది. ఈ ప్రోగ్రామ్ చూసిన పలువురు మండవల్లిలో ఆమె భర్త ప్రసాద్ వేరే మహిళతో ఉండటం గమనించి ఇల్లు అద్దెకు ఇవ్వమని చెప్పినట్లు తెలిపింది.
నాగలక్ష్మికి ఇద్దరు పిల్లలు. ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆమె కుమార్తె దుర్గాభవాని ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు రాస్తోంది. కుమారుడు బాలాజి 7వ తరగతి చదువుతున్నాడు. భర్త వదలి వెళ్లిన తర్వాత పెరికెగూడెంలోనే రూ.35 వేలు సొంత పెట్టుబడి, రూ.లక్ష 20 వేలు అప్పు చేసి కర్రీ పాయింట్ పెట్టింది. అనివార్య కారణాలతో ఆ వ్యాపారం వదిలేసింది. కర్రీ పాయింట్‌లో ఉన్న సామగ్రి అంతా విక్రయిస్తే రూ.40 వేలు వచ్చాయి. ఇంకా రూ.80 వేలు అప్పు తీర్చవలసి వచ్చింది. పెరికెగూడెంలో భర్త మొదలుపెట్టిన ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆపి వెళ్లిపోయాడు. మళ్లీ ఆ ఇంటి నిర్మాణానికి కొంత అప్పు చేసి పూర్తి చేసింది. ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలియక ఎట్టకేలకు తనకు పూర్వం బైక్ నడిపే అలవాటు ఉండటంతో ఆమె బాబాయ్ సహాయంతో ఆటో డ్రైవింగ్ నేర్చుకుంది.
ముందుగా ఒక సెకండ్ హ్యాండ్ ఆటోతో డ్రైవింగ్ ప్రారంభించింది. నాగలక్ష్మి డ్రైవింగ్ చూసి మండవల్లి మండలం లింగాల సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ పట్నాయక్ కొత్త ఆటో కొనుగోలుకు రూ.2 లక్షల 26 వేలు రుణం అందించారు. ఏడు నెలల నుంచి నెలకు రూ.6 వేలు చొప్పున రుణం చెల్లిస్తోంది. రోజుకు రూ.500 వరకు సంపాదన ఉంటే చాలని నాగలక్ష్మి చెబుతోంది. తన కుమార్తె డాక్టర్ చదవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. తనకున్న ఇద్దరి పిల్లల చదువుకు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి 99085 20466 నంబరుకు ఫోన్ చేసి ఆర్థిక సాయం చేయవలసినదిగా నాగలక్ష్మి విజ్ఞప్తి చేస్తోంది.
ప్రతి మహిళ ఎవరి కాళ్లపైవారే నిలబడాలి
మహిళలు వారి కాళ్లపై వారే నిలబడటానికి ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులపై ఆధారపడి వారికి భారం కాకూడదు. ప్రతిభాపాటవాలపై ఆధారపడి ముందుకు సాగాలి. ఇతరులకు ఆదర్శంగా
నిలవాలి.– నాగలక్ష్మి, ఆటో డ్రైవర్
Comments
Please login to add a commentAdd a comment