ముంబై: ముంబై బెస్ట్ బస్సుల్లో డ్రైవర్‌గా ఓ మహిళను త్వరలో చూడబోతున్నాం. ప్రతీక్షా దాస్ అనే 24 ఏళ్ల యువతి ఈ చరిత్రాత్మక ఘట్టానికి నాంది పలుకబోతోంది. ఈ విషయం తెలిసిన ప్రజలు ఆమెపై సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ప్రతిక్షా దాస్ అనే మహిళ ప్రస్తుతం బెస్ట్ శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ పొందుతోంది. శిక్షణ అనంతరం విధుల్లో చేరనుంది. ఇలా బస్సు డ్రైవర్‌గా ఓ మహిళ స్టీరింగ్ చేత పట్టడం బెస్ట్ సంస్థ చరిత్రలో ఇదే ప్రథమం కానుంది. గతంలో అంటే సుమారు 12 ఏళ్ల కిందట ఐదుగురు మహిళలు కండక్టర్‌గా విధులు నిర్వహించారు. కానీ, రద్దీ సమయంలో పురుష ప్రయాణికుల మధ్య నిలబడి టికెట్లు జారీ చేయడం మహిళా కండక్టర్లు ఇబ్బంది పడ్డారు. అనేక ఫిర్యాదులు రావడంతో చివరకు వారిని కండక్టర్ విధుల నుంచి తప్పించి కార్యాలయంలో వారి అర్హతను బట్టి కూర్చుండి పనిచేసే ఉద్యోగం కల్పించారు. ఆ తరువాత బెస్ట్ బస్సుల్లో మహిళా సిబ్బంది దర్శనమివ్వలేదు.
కానీ, సుదీర్గ కాలం తరువాత మహిళ డ్రైవర్‌ను నియమించాలనే ఆలోచన తెరమీదకు వచ్చింది. ఆ మేరకు ప్రతీక్ష దాస్‌కు ఈ అవకాశం వరించింది. ఆర్టీఓ నియమాల ప్రకారం ఆమె వద్ద హెవీ ప్యాసెంజర్ బస్సు బ్యాడ్జీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర అనుమతుల పత్రాలు కూడా ఉన్నాయి. బస్సు నడిపిన అనుభవం కూడా ఉండటంతో ఆమెను బెస్ట్ డ్రైవర్‌గా నియమించాలని సంస్థ భావించింది. బస్సు నడపడం నేర్చుకోకముందు ఆమె బైక్, కారు నడపడం నేర్చుకుంది. ఆ తరువాత ప్రైవేటు బస్సు స్టీరింగ్ చేతపట్టింది. అంతేగాకుండా ఆమె ఇటీవలే మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment