రియాద్: సౌదీ అరేబియాలో మహిళలు సొంతంగా వాహనాలు డ్రైవింగ్ చేయడం ప్రారంభించారు. ఇక డ్రైవింగ్ విషయంలో మాకు పురుషుల అవసరం లేదంటూ సౌదీ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మహిళలు డ్రైవింగ్ చేయడాన్ని సౌదీ గతంలో నిషేధించగా.. తమకు అనుమతి ఇవ్వాలని వాళ్లు కోరారు. ఈ మేరకు సౌదీరాజు మమ్మద్ బిన్ సల్మాన్ గతేడాది సెప్టెంబర్‌లో ఉత్తర్వులు జారీ చేశారు. 2018 జూన్ 24 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
దాదాపు మూడు దశాబ్దాల నుంచి మహిళలు, హక్కుల కార్యకర్తలు చేసిన ఉద్యమానికి ఆశించిన ఫలితం నేడు కనిపిస్తోంది. తమపై నిషేధం ఎత్తివేయడంతో ఆదివారం సౌదీలో పలు ప్రాంతాల్లో మహిళా డ్రైవర్లు తమ వాహనాలతో రయ్.. రయ్ మంటూ రోడ్లపైకి వస్తున్నారు. తమకు ఇష్టమైన కార్లు, బైక్‌లు నడుపుతూ తమకు దొరికిన స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నారు. మా అమ్మను కారులో కాఫీకి తీసుకెళ్తామని, బయటకు తీసుకెళ్లి ఐస్‌క్రీమ్ ఇప్పించినప్పుడు వారి కళ్లల్లో ఆనందం చూడాలని ఉందంటూ మహిళా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
నిషేధం ఎత్తివేసిన ఉత్తర్వులు అమలైన కొన్ని నిమిషాలకే టీవీ యాంకర్ సబికా అల్ దోసారి కారు నడిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి సౌదీ అరేబియా మహిళకు ఇది చారిత్రాత్మక సందర్భమన్నారు. ‘డ్రైవర్ కోసం ఎదురుచూపులు చూడటానికి ఇక స్వస్తి పలుకుదాం. మాకు ఇంక పురుషుల అవసరం లేదు. సొంతంగా వాహనాలు నడుపుతామని’21 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని హతౌన్ బిన్ దఖిల్ అన్నారు.
డ్రైవింగ్ స్కూళ్ల ఏర్పాటు
మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేస్తున్నట్లు గతేడాది నిర్ణయం తీసుకున్న తర్వాత సౌదీలోని రియాద్, జెడ్డా, పలు నగరాల్లో వారి కోసం డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. 2020 నాటికి 30 లక్షల మంది మహిళలు డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment