Driving schools
-
డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్.. ప్రభుత్వం స్పష్టత
గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు (ఏడీటీసీ), డ్రైవింగ్ స్కూళ్లు జారీ చేసిన సర్టిఫికెట్లకు సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. మీడియా కథనాలపై స్పందించిన మంత్రిత్వ శాఖ జూన్ 1 నుంచి ప్రస్తుత నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది."కొన్ని వర్గాల మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలకు సంబంధించి, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్) 1989 లో గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణ కేంద్రాలకు నిర్దేశించిన నిబంధనలు 31బీ నుంచి 31జే వరకు 2021 జూన్ 7న జీఎస్ఆర్ 394 (ఇ) ప్రకారం చేర్చడం జరిగింది. ఈ నిబంధనలు 2021 జులై 1 నుంచి అమలులో ఉన్నాయి. కొత్తగా 2024 జూన్ 1 నుంచి వీటిలో ఎటువంటి మార్పు ఉండదు" అని రవాణా శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.డ్రైవింగ్ టెస్ట్ తప్పనిసరిఅంటే 2021 జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయని, 2024 జూన్ 1 నుంచి ఎలాంటి మార్పులు చేయలేదని రవాణా శాఖ స్పష్టం చేసింది. అలాగే గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు (ఫారం 5బి) లేదా ఇతర డ్రైవింగ్ స్కూళ్ల (ఫారం 5) నుంచి కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ పొందినప్పటికీ డ్రైవింగ్ పరీక్ష నుంచి మినహాయింపు ఉండదని రవాణా శాఖ పునరుద్ఘాటించింది. -
డ్రైవింగ్ స్కూళ్లలోనూ లైసెన్స్..
ఆదిలాబాద్: రహదారి భద్రత చట్టం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో నూతన సంస్కరణకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లను అందుబాటులోకి తీసుకు రానుంది. ఇకపై రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేకుండా ఈ స్కూళ్లలో డ్రైవింగ్ శిక్షణ పొందిన వారికి నేరుగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. మోటారు వాహన చట్టం మార్పులో భాగంగా ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ అంతా కూడా ప్రైవేటు భాగస్వామ్యంలో సాగనుంది.ఈ చట్టం జూన్ ఒకటి నుంచి అమలులోకి రానుంది. కాగా, జిల్లాలో ఇప్పటివరకు అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూల్ లేదు సరికదా ఇప్పటికిప్పుడు డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు కూడా కష్టమే. రవాణా శాఖ చట్టం నిబంధన మేరకు అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే పలు నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఇప్పుడున్న వారు ఏర్పాటుకు సముఖంగా లేరు. డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు సంస్థలు, వ్యక్తులు ముందుకు వస్తే అనుమతి ఇస్తామని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.పారదర్శకతతో డ్రైవింగ్ ఉంటేనే..అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లు ఇచ్చే డ్రైవింగ్ శిక్షణ నాణ్యమైనదిగా, సమర్థవంతమైనదిగా, పారదర్శకతతో ఉంటే లైసెన్స్‌లు ఇవ్వాలనేది రవాణా శాఖ ముఖ్యోద్దేశం. ఈ డ్రైవింగ్ స్కూళ్లు ఇచ్చే 5–ఏ సర్టిఫికేట్ల ఆధారంగా నేరుగా లైసెన్స్ జారీ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీలో రవాణా శాఖ అధికారులను పరిమితం చేస్తూ తీసుకొస్తున్న అక్రిడేటెడ్ స్కూళ్ల ఏర్పాటు ప్రస్తుతం కష్టతరంగానే ఉండబోనుంది. ప్రస్తుతం ఉన్న సాధారణ డ్రైవింగ్ స్కూళ్లు కూడా కఠిన నిబంధనలతో స్కూళ్ల ఏర్పాటు కష్టమే అంటున్నారు.మూడెకరాలు కావాల్సిందే..డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు కనీసం మూడెకరాల స్థలం కావాలి. రెండెకరాల్లో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, ప్రాథమిక శిక్షణ కోసం సిమ్యులేటర్లు ఏర్పాటు చేయాలి. మరో ఎకరంలో శిక్షణ తరగతుల కోసం భవనం, తరగతి గదులు, ఇంటర్నెట్ సదుపాయం, ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ, టీచింగ్ పరికరాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇందుకు పెద్దమొత్తంలో పెట్టుబడి అవసరం. భూముల విలువ రూ.లక్షలు, రూ.కోట్లలో ఉండగా మూడెకరాల్లో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు కష్టమే అంటున్నారు. అయినా ముందుకు వచ్చి ఏర్పాటు చేస్తే ఆదాయం ఆ స్థాయిలో ఉంటుందా అనేది అనుమానమేనని అంటున్నారు. -
లైసెన్స్టు కిల్!
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు భారీ వాహన డ్రైవర్లకు లైసెన్సు రెన్యువల్ సమయంలో ఒకరోజు అవగాహన, శిక్షణ కార్యక్రమం ఇవ్వడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలకు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. డబ్బు వసూలే ధ్యేయంగా ఏర్పడ్డ కొన్ని ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్లతో కుమ్మక్కైన కొందరు అధికారులు రవాణాశాఖలో తెరవెనక చక్రం తిప్పుతున్నారు. సాక్షి, హైదరాబాద్: ట్రక్కుల్లాంటి భారీ వాహనాలు నడిపే డ్రైవర్లకు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి. తమ లైసెన్సులను ప్రతి ఐదేళ్లకోసారి (ట్రాన్స్‌పోర్టు కేటగిరీ) రెన్యువల్ చేసుకోవాలి. అదే ప్రమాదకర పదార్థాలు తరలించే వాహనాల డ్రైవర్లు మూడేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ సమయంలో కేంద్రప్రభుత్వ నిర్దేశిత పద్ధతిలో డ్రైవర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలి. వాహనాలు నడపడం, జాగ్రత్తలు తీసుకోవడం, ప్రమాదాలను తప్పించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు, ప్రమాదాన్ని నివారించలేని పక్షంలో వీలైనంతవరకు దాని తీవ్రత తగ్గేలా చూడటం, రోడ్లలో వస్తున్న మార్పులు.. ఇలా పలు అంశాల్లో ఆధునిక సాంకేతికత ఆధారంగా ఆ శిక్షణ కార్యక్రమం ఉండాలి. ఆ శిక్షణ పూర్తి చేసినట్టు సర్టిఫికెట్ వచ్చిన వారికి మాత్రమే లైసెన్స్ రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. కొందరు డ్రైవర్లు మధ్యలో కొన్నేళ్లపాటు వేరే ఉద్యోగంలో ఉండి, మళ్లీ డ్రైవింగ్‌కు వచ్చే వారుంటారు. వారు డ్రైవింగ్ ఆపేసిన తర్వాత స్కిల్స్ తగ్గిపోతాయన్నది శాస్త్రీయంగా నిరూపణ అయింది. ఇలాంటి వారికి ఈ తరహా శిక్షణ అవశ్యమని కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో సిరిసిల్లలోని ‘టైడ్స్’ ఎంపిక గత ఏడాది మన దేశంలో రోడ్డు ప్రమాదాల రూపంలో లక్షన్నర కంటే ఎక్కువ మంది చనిపోయారు. కొన్నేళ్లుగా ఈ సంఖ్య ఇదే రీతిలో నమోదవుతుండటంతో సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో వాటిని నివారించేందుకు కేంద్రం కొన్ని సూచనలు చేసింది. అందులో భారీ వాహనాలను నడిపే డ్రైవర్లు తరచూ.. ఇటు డ్రైవింగ్, అటు వాహనాల్లో వస్తున్న మార్పులు, ఇతర అంశాలపై అవగాహన పెంచుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో ఈ శిక్షణ కోసం సిరిసిల్ల సమీపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ (టీఐడీఎస్)’ను ఎంపిక చేసింది. ఏం జరుగుతోంది? గతంలో ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్ల నుంచే డ్రైవర్లు శిక్షణ సర్టిఫికెట్ పొందేవారు. చాలా డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ ఇవ్వకుండానే, రూ.5 వేల వరకు వసూలు చేసి సర్టిఫికెట్ ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం... రూ.20 కోట్ల వ్యయంతో ఆత్యాధునికంగా తీర్చిదిద్దిన సిరిసిల్లలోని టైడ్స్‌ను శిక్షణకు ఎంపిక చేసింది. దీంతో కొందరు ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్ల యజమానులు పైరవీ అధికారులతో కుమ్మక్కయ్యారు. సిరిసిల్లకు వెళ్లి డ్రైవర్లు శిక్షణ తీసుకోవటం కష్టమని, అన్ని ప్రాంతాల్లో డ్రైవింగ్ స్కూళ్లు అందుబాటులో ఉన్నందున వాటిల్లో శిక్షణకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీన్ని అమల్లోకి తెచ్చేందుకు అధికారులు ఉన్నతస్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. లైసెన్సు ఇచ్చేప్పుడు ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్ల నుంచి తెచ్చిన సర్టిఫికెట్లనే పరిగణనలోకి తీసుకున్నప్పుడు, రెన్యువల్‌కు అంగీకరిస్తే ఏంటన్న కోణంలో ఈ ఒత్తిళ్లు నడుస్తున్నట్టు సమాచారం. దీంతో రాష్ట్రంలో వేరువేరు ప్రాంతాల్లో అనుబంధ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న సూచనలు వస్తున్నాయి. అవసరమైతే, ఆర్టీసీ శిక్షణ కేంద్రాల సహకారం తీసుకోవాలని కూడా చెబుతున్నారు. -
ఇక డ్రైవింగ్ ‘పరీక్ష’ లేదు!
సాక్షి, అమరావతి: ఇకపై లైసెన్సు కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ టెస్టులకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్లో నిర్దేశిత శిక్షణ పూర్తి చేసి సర్టిఫికెట్ పొందితే చాలు.. రవాణా శాఖ కార్యాలయం డ్రైవింగ్ లైసెన్సును మంజూరు చేయనుంది. అదే సమయంలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల గుర్తింపు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ‘డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు–2022’ నోటిఫికేషన్‌ను ఇటీవల జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలు ఈ ఏడాది జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుత విధానంతో పాటు ఇది కూడా కొనసాగనుంది. కొత్త విధానాన్ని ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. లైసెన్సుల జారీ సులభతరం.. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి పరీక్ష పాస్ కావాలి. థియరీ, ప్రాక్టికల్ పరీక్షల్లో అర్హత సాధించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చే విధానం ప్రకారం.. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆ శిక్షణా కేంద్రం జారీ చేసే సర్టిఫికెట్ కాపీతో పాటు అవసరమైన గుర్తింపు కార్డుల కాపీలు జతచేసి దరఖాస్తు చేస్తే రవాణా శాఖ డ్రైవింగ్ లైసెన్సు ఇస్తుంది. దీనివల్ల లైసెన్సుల కోసం నిరీక్షించే సమయం తగ్గుతుందని.. లైసెన్సుల జారీ విధానం సరళతరం, సులభతరం అవుతుందన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. నిబంధనలు కఠినతరం.. ఈ ప్రక్రియలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల పాత్ర కీలకం కానుండటంతో.. గుర్తింపు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. గుర్తింపు పొందిన శిక్షణా కేంద్రం జారీ చేసే సర్టిఫికెట్‌ను మాత్రమే రవాణా శాఖ పరిగణనలోకి తీసుకోనుంది. ► ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్ల డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే.. ట్రాక్ కోసం కనీసం ఎకరా భూమి ఉండాలి. భారీ వాహనాల డ్రైవింగ్ స్కూల్‌కు అయితే కనీసం 2 ఎకరాల భూమి ఉండాలి. వాటిలో కేంద్ర మార్గదర్శకాల ప్రకారం టెస్టింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలి. ► డ్రైవింగ్‌పై ప్రాథమికంగా అవగాహన కల్పించేందుకు స్టిమ్యూలేటర్ ఏర్పాటు చేయాలి. ► శిక్షకులు కనీసం ఇంటర్మీడియట్ పాస్ కావడంతో పాటు కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. ► ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్ల డ్రైవింగ్ శిక్షణా కాలం కనీసం నాలుగు వారాల్లో 29 గంటల పాటు ఉండాలి. వాటిలో థియరీ క్లాసులు 8 గంటలు, ప్రాక్టికల్ క్లాసులు 21 గంటల పాటు నిర్వహించాలి. ► భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణా కాలం ఆరు వారాల్లో కనీసం 38 గంటలు ఉండాలి. ఇందులో థియరీ క్లాసులు 8 గంటలు, ప్రాక్టికల్ క్లాసులు 30 గంటలు నిర్వహించాలి. ► అన్ని అర్హతలు కలిగిన డ్రైవింగ్ స్కూల్‌కు ఐదేళ్ల పాటు గుర్తింపు ఇస్తారు. అనంతరం రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. -
ఆర్టీసీతో కలిసి డ్రైవింగ్ స్కూళ్లు
సాక్షి, అమరావతి: ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక డ్రైవింగ్ స్కూలు చొప్పున ఏర్పాటుకు ఆర్టీసీతో కలసి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ సదుపాయాలను ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణ తదితరాల కోసం వినియోగించుకోవచ్చని సూచించారు. రహదారి భద్రత నిధికి సంబంధించి ప్రత్యేకంగా ఖాతా, అధికారులతో లీడ్ ఏజెన్సీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర రహదారి భద్రతా మండలి (ఆంధ్రప్రదేశ్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్) సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ట్రామా కేర్ సెంటర్లు కొత్త జిల్లాలకు అనుగుణంగా ప్రతి చోటా ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్ కళాశాలల్లో కూడా ట్రామా కేర్ సెంటర్లను నెలకొల్పాలన్నారు. అత్యాధునిక పద్ధతుల్లో అత్యవసర సేవలు అందించాలని స్పష్టం చేశారు. ప్రమాదాలకు గురైన వారు కోలుకునేందుకు వీలుగా సహాయ, పునరావాస కేంద్రాన్ని విశాఖలో ఉంచాలని, తిరుపతి బర్డ్ ఆస్పత్రిలోని కేంద్రాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. వేర్వేరుగా లేన్ మార్కింగ్ రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు లేన్ మార్కింగ్ చాలా స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బైక్‌లు, నాలుగు చక్రాల వాహనాలకు విడివిడిగా ప్రత్యేక లైన్ల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. ఎంత వేగంగా వెళ్లవచ్చో సూచిస్తూ బోర్డులు అమర్చడం ద్వారా చాలావరకు ప్రమాదాలు తగ్గే ఆస్కారం ఉందన్నారు. 1,190 బ్లాక్ స్పాట్స్.. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాలకు ఆస్కారం ఉన్న 1,190 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించడంతో పాటు 520 చోట్ల నివారణ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారులపై కూడా 78 బ్లాక్ స్పాట్స్‌ను సవరించినట్లు చెప్పారు. రహదారుల పక్కన నిర్వహించే ధాబాల్లో మద్యం విక్రయించకుండా అరికట్టడం ద్వారా చాలావరకు ప్రమాదాలు తగ్గుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యమైన రోడ్ల పక్కన యాక్సెస్ బారియర్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. లైసెన్స్ విధానాన్ని పునఃసమీక్షించాలి ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని పునఃసమీక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలన్నారు. జిల్లాలవారీగా ఏర్పాటవుతున్న కమిటీలు కూడా రోడ్డు ప్రమాదాలు, తీసుకుంటున్న చర్యలను పరిశీలించాలన్నారు. 108 ఆపద్బాంధవి.. రోడ్డు ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలను కాపాడటంలో 108 అంబులెన్స్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు తెలిపారు. నిర్దేశిత సమయంలోగా పేషెంట్లను ఆస్పత్రులకు చేర్చాలన్న నిబంధన ప్రాణ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గోల్డెన్ అవర్‌లోగా ఆస్పత్రులకు చేర్చడంతో చాలామంది ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు. సమావేశంలో రహదారులు, భవనాల శాఖ మంత్రి ఎం.శంకర నారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, లా సెక్రటరీ వి.సునీత, రవాణాశాఖ కమిషనర్ పి.సీతారామాంజనేయలు తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ సిగ్నల్.. ► పోలీసు, రవాణా, హెల్త్, రోడ్ ఇంజనీరింగ్ నిపుణులతో రోడ్ సేఫ్టీపై లీడ్ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం. ► క్షతగాత్రులకు నగదు రహిత చికిత్స అందించేలా నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రోత్సాహం. ► రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తరలించే వారికి మద్దతు ► ‘ఐరాడ్’ (ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటా బేస్) యాప్ ద్వారా ప్రమాదాలపై పోలీసులకు లైవ్ అప్డేట్ ► పీపీపీ పద్ధతిలో రవాణాశాఖ ద్వారా ఆటోమేటెడ్ ఎఫ్‌సీ టెస్టింగ్ ఏర్పాటుపై కార్యాచరణ ► రోడ్డు ప్రమాద బాధితులకు బీమా పరిహారం దక్కేలా ప్రత్యేక చర్యలు -
పుట్టగొడుగుల్లా నకిలీ డ్రైవింగ్ స్కూళ్లు!!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల నగరంలో తెల్లవారుజామున రోడ్డు డివైడర్‌కు కారు ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈమధ్య కాలంలో మద్యం తాగి అపరిమితమైన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఇలా వాహనాలు నడుపుతున్న వారిలో చాలా మందికి సరైన నైపుణ్యం కూడా ఉండడం లేదని, అరకొర డ్రైవింగ్ అనుభవంతో రోడ్డుమీదకు వచ్చి ప్రమాదాలకు పాల్పడుతున్నారని రోడ్డు భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వీధికొకటి చొప్పున పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ డ్రైవింగ్ స్కూళ్లతో ఈ తరహా ఎలాంటి శిక్షణ, నైపుణ్యం,అనుభవం లేని డ్రైవర్లు వాహనాలతో బయటకు వస్తు న్నారు. దీంతో డ్రంకన్ డ్రైవ్‌తో పాటు, ర్యాష్ డ్రైవింగ్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. నిబంధనలకు పాతర... డ్రైవింగ్ స్కూళ్ల నిర్వహణ ప్రహసనంగా మారింది. ఎలాంటి మౌలిక సదుపాయాలు, సాంకేతిక నైపుణ్యం లేని వ్యక్తులకు రవాణా అధికారులు ఎడాపెడా అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఇందుకోసం కొన్ని ప్రాంతీయ రవాణా కేంద్రాల్లో రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా మోటారు వాహన ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి డ్రైవింగ్ స్కూల్ నిర్వహణను క్షేత్రస్థాయిలో క్షుణ్నంగా పరిశీలించిన సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే అనుమతినివ్వాలి. ఇందుకోసంసదరు నిర్వాహకులు రూ.10 వేలు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో రవాణా శాఖకు చెల్లించాలి. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారే డ్రైవింగ్ స్కూల్ నిర్వహణకు అర్హతను కలిగి ఉంటారు. అనుభవజ్ఞుడైన ఇన్స్ట్రక్టర్ (శిక్షణనిచ్చే వ్యక్తి) ఉండాలి. డ్రైవింగ్ స్కూల్ కోసం ప్రత్యేకంగా రెండు తరగతి గదులతో కూడిన ఆఫీస్ తప్పనిసరి. ట్రాఫిక్ నిబంధనలపై ఇక్కడ శాస్త్రీయమైన బోధన జరగాలి. వాహనాలకు చిన్నపాటి మరమ్మతులను చేసుకొనే మెకానిజంలో కూడా శిక్షణనివ్వాల్సి ఉంటుంది. చాలా మంది డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు ఎలాంటి కార్యాలయం కూడా లేకుండానే కారుపై డ్రైవింగ్ స్కూల్ బోర్డు ఏర్పాటు చేసుకొని కొంతమంది అధికారుల సహాయంతో డ్రైవింగ్ స్కూల్ నిర్వహణకు కావాల్సిన ఫామ్–11 సంపాదిస్తున్నారు. ఇదో తరహా గొలుసుకట్టు.. అడ్డగోలు అనుమతులతో ఏర్పడుతున్న డ్రైవింగ్ స్కూళ్లు అభ్యర్ధుల నుంచి నెలకు రూ.5000 నుంచి రూ.8000 వరకు వసూలు చేసి కనీసం 30 రోజులు కూడా శిక్షణనివ్వకుండానే వదిలేస్తున్నారు. ఇలా అరకొర శిక్షణ తీసుకున్నవారు డ్రైవింగ్ లైసెన్సులు తీసుకొని యథేచ్ఛగా ఖరీదైన కార్లతో రోడ్లపైకి వస్తున్నారు. మరోవైపు ఇలాంటి నకిలీ స్కూళ్లు నగరమంతటా బ్రాంచీలు ఏర్పాటు చేసుకొని వినియోగదారులను మోసగిస్తున్నాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారుతూ వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గ్రేటర్లో అన్ని ప్రమాణాలతో కూడిన డ్రైవింగ్ స్కూళ్లు 120 వరకు ఉంటే నకిలీ స్కూళ్లు వెయ్యికిపైనే ఉన్నట్లు అంచనా. తీవ్రంగా నష్టపోతున్నాం: కేంద్ర మోటారు వాహన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేసుకున్న వాళ్లు ఇలాంటి నకిలీలతో తీవ్రంగా నష్టపోవాల్సివస్తోంది. ఇలాంటి వాటిని ఆర్టీఏ అధికారులు నియంత్రించాలి. – శ్రీకాంత్‌రెడ్డి సామల, తెలంగాణ డ్రైవింగ్ స్కూల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్మి -
ఇక డ్రైవింగ్ ట్రాక్‌ల ఆటోమేషన్
సాక్షి, అమరావతి: వీడియో ఆధారిత సెన్సర్ల వినియోగం ద్వారా శాస్త్రీయ పద్ధతిలో డ్రైవింగ్ సామర్థ్య పరీక్షల నిర్వహణకు రవాణా శాఖ సన్నద్ధమవుతోంది. రూ.13.4 కోట్లతో రాష్ట్రంలో తొమ్మిది చోట్ల డ్రైవింగ్ ట్రాక్‌ల ఆటోమేషన్ నిర్మాణాలను చేపట్టనుంది. ఇందుకు కేంద్రం ఏపీకి రూ.9 కోట్లు కేటాయించగా, మిగిలిన రూ.4.4 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. రాష్ట్రంలోని రవాణా కార్యాలయాల్లో సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట్ల ఈ ఆటోమేషన్ డ్రైవింగ్ ట్రాక్‌లు నిర్మిస్తారు. వైజాగ్, చిత్తూరు, అనంతపురం, విజయవాడ, తిరుపతి, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులలో ఈ ట్రాక్‌లకు టెండర్లు ఖరారయ్యాయి. మార్చి నెలాఖరుకల్లా విశాఖ, అనంతపురం, చిత్తూరు, విజయవాడలలో, డిసెంబర్ నాటికి తిరుపతి, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రొద్దుటూరులలో ట్రాక్‌ల్ నిర్మాణాన్ని పూర్తిచేస్తారు. ఆటో మేషన్ డ్రైవింగ్ ట్రాక్ అంటే.. డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రస్తుతం మోటారు వాహన తనిఖీ అధికారులు మాన్యువల్ విధానంలో పరీక్షలు నిర్వహించి సామర్థ్యాన్ని నిర్ధారిస్తున్నారు. ఈ విధానంలో ఏజెంట్లు, మధ్యవర్తులు, డ్రైవింగ్ స్కూళ్ల ప్రమేయం ఎక్కువగా ఉంటోంది. దీంతో నైపుణ్యం లేని వారికి కూడా తేలిగ్గా లైసెన్స్‌లు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ పరీక్షలను మానవ ప్రమేయ రహితంగా, పారదర్శకంగా నిర్వహించాలని రవాణా శాఖ నిర్ణయించింది. వీడియో సెన్సర్లే కీలకంగా పనిచేస్తాయి. ట్రాక్‌లో వాహనం నడిపే వ్యక్తి కదలికలను ఇవి నమోదు చేస్తాయి. వాహనాన్ని నడిపే తీరు, వేగం, వాహనం కండిషన్, పార్కింగ్ చేసే పద్ధతి, వాహనాన్ని వెనక్కి తీసుకోవడం, ఎత్తయిన ప్రాంతాల్లో, కచ్చా రోడ్లపైన, ట్రాఫిక్ రద్దీలో నడిపేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై కచ్చితమైన అంచనాలు ఉంటాయి. -
రాంగ్ రూట్
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. కొత్త మోడళ్లకుఅనుగుణంగా డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వాల్సిన డ్రైవింగ్ స్కూళ్లుదారితప్పుతున్నాయి. భారీగా ఫీజులు వసూలు చేస్తూ పాతవాహనాల్లో శిక్షణ ఇస్తున్నాయి.శిక్షణ కోసం అనుమతితీసుకునేది ఒక్కదానికే..బ్రాంచ్‌ల పేరుతో ఇష్టారాజ్యంగా కేంద్రాలను పెంచుకుంటూ నిబంధనలకు తూట్లు పొడుస్తూ రాంగ్రూట్లో పయనిస్తున్నాయి. ఈ స్కూళ్లనుపర్యవేక్షించాల్సిన అధికారులు కన్పించరు. పదేళ్లుగా డ్రైవింగ్ స్కూళ్లపై ఒక్కటంటే ఒక్క కేసు నమోదు కాలేదంటే అధికారుల పనితీరుఅవగతమవుతుంది. నెల్లూరు (టౌన్): అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో డ్రైవింగ్ నేర్పాలన్న ప్రభుత్వ లక్ష్యం పక్కదారిపట్టింది. పదుల సంఖ్యలో డ్రైవింగ్ స్కూళ్లకు అనుమతి పొందుతూ కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బ్రాంచిల పేరుతో ఎక్కడపడితే అక్కడ స్కూళ్లను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 18 స్కూళ్లకు మాత్రమే అనుమతి ఉంది. అనుమతిలేని స్కూళ్లు 50కి పైగానే ఉన్నాయి. నెల్లూరు నగరంలో 11, గూడూరులో 2, ఆత్మకూరులో 2, సూళ్లూరుపేటలో 2, కావలిలో 1 డ్రైవింగ్స్కూల్కు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది. పాత వాహనాల్లోనే శిక్షణ మార్కెట్లోకి ఆధునిక టెక్నాలజీతో కొత్త వాహనాలు వస్తున్నా, డ్రైవింగ్ స్కూళ్ల యాజమాన్యం మాత్రం పాత వాహనాలనే డ్రైవింగ్ శిక్షణకు వినియోగిస్తున్నాయి. ఎన్నోఏళ్ల క్రితం మార్కెట్లోకి వచ్చిన అంబాసిడర్, మారుతి 800 కార్లలోనే శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు అసలు ఉండవు. పేరుకే డ్రైవింగ్ స్కూల్. అక్కడ శిక్షణ ఇచ్చే ఇన్స్ట్రక్టర్ ఉండరు. డెమో క్లాసులు నిర్వహించేందుకు ప్రత్యేక తరగతి ఉండదు. కారు విడి విభాగాలు అసలు ఉండవు. మొక్కుబడి శిక్షణతో మమ అనిపిస్తున్నారు. నిబంధనలు బేఖాతర్ జిల్లాలో డ్రైవింగ్ స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతర్ చేస్తున్నాయి. శిక్షకులుగా కేవలం లైసెన్స్ ఉన్న వ్యక్తిని మాత్రమే నియమిస్తున్నారు. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు కనిపించరు. అనుభం ఉన్న వారి సంఖ్య కూడా తక్కువే. డ్రైవింగ్‌లో శిక్షణ కేవలం 15 రోజుల పాటు, రోజుకు ఒక గంట మాత్రమే నేర్పిస్తున్నారు. నేర్చుకునేందుకు వచ్చిన తొలిరోజు నుంచే వారికి స్టీరింగ్ పట్టిస్తున్నారు. డ్రైవింగ్ నేర్పించినందుకు ఒక్కొక్కొరి నుంచి స్కూల్‌ను బట్టి రూ. 5వేల నుంచి రూ.8వేలకు వసూలు చేస్తున్నారు. లైసెన్స్ కూడా ఇప్పించినట్లయితే అదనంగా మరో రూ.3వేలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఫీజలు పట్టిక ఏ డ్రైవింగ్ స్కూల్లో కనిపించదు. తనిఖీలు నిల్ డ్రైవింగ్ స్కూళ్లపై ఎక్కడా తనిఖీలు కనిపించవు. పదేళ్ల క్రితం నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. డ్రైవింగ్ స్కూల్స్ యాజమాన్యం ఇచ్చే మామూళ్లతో అధికారులు తనిఖీలు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని వాహనాలకు ఇన్సూ్యరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండానే డ్రైవింగ్ శిక్షణకు వినియోగిస్తున్నారు. ఇన్సూ్యరెన్స్, ఫిట్నెస్ లేని వాహనాలు ప్రమాదానికి గురైతే బాధితులకు ఒక్క రూపాయి కూడా రాదు. ఇప్పటికైనా రవాణా అధికారులు జిల్లాలో ఉన్న డ్రైవింగ్ స్కూళ్లను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న వాటిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. తక్షణమే తనిఖీలు నిర్వహిస్తాం డ్రైవింగ్ స్కూళ్లపై తక్షణమే తనిఖీలు నిర్వహిస్తాం. డ్రైవింగ్ స్కూళ్లకు తప్పనిసరిగా రవాణాశాఖ అనుమతి ఉండాలి. బ్రాంచీల పేరుతో ఎక్కడబడితే అక్కడ డ్రైవింగ్ స్కూళ్లను నిర్వహించకూడదు. శిక్షణకు అత్యాధునిక మోడల్ వాహనాలను వినియోగించాలి. తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్దంగా ఉన్న డ్రైవింగ్ స్కూళ్లపై చర్యలు తీసుకుంటాం. –ఎన్.శివరాంప్రసాద్,జిల్లా ఉపరవాణా కమిషనర్ -
ఇక పురుషుల అవసరం లేదు!
రియాద్: సౌదీ అరేబియాలో మహిళలు సొంతంగా వాహనాలు డ్రైవింగ్ చేయడం ప్రారంభించారు. ఇక డ్రైవింగ్ విషయంలో మాకు పురుషుల అవసరం లేదంటూ సౌదీ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మహిళలు డ్రైవింగ్ చేయడాన్ని సౌదీ గతంలో నిషేధించగా.. తమకు అనుమతి ఇవ్వాలని వాళ్లు కోరారు. ఈ మేరకు సౌదీరాజు మమ్మద్ బిన్ సల్మాన్ గతేడాది సెప్టెంబర్‌లో ఉత్తర్వులు జారీ చేశారు. 2018 జూన్ 24 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి మహిళలు, హక్కుల కార్యకర్తలు చేసిన ఉద్యమానికి ఆశించిన ఫలితం నేడు కనిపిస్తోంది. తమపై నిషేధం ఎత్తివేయడంతో ఆదివారం సౌదీలో పలు ప్రాంతాల్లో మహిళా డ్రైవర్లు తమ వాహనాలతో రయ్.. రయ్ మంటూ రోడ్లపైకి వస్తున్నారు. తమకు ఇష్టమైన కార్లు, బైక్‌లు నడుపుతూ తమకు దొరికిన స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నారు. మా అమ్మను కారులో కాఫీకి తీసుకెళ్తామని, బయటకు తీసుకెళ్లి ఐస్‌క్రీమ్ ఇప్పించినప్పుడు వారి కళ్లల్లో ఆనందం చూడాలని ఉందంటూ మహిళా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నిషేధం ఎత్తివేసిన ఉత్తర్వులు అమలైన కొన్ని నిమిషాలకే టీవీ యాంకర్ సబికా అల్ దోసారి కారు నడిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి సౌదీ అరేబియా మహిళకు ఇది చారిత్రాత్మక సందర్భమన్నారు. ‘డ్రైవర్ కోసం ఎదురుచూపులు చూడటానికి ఇక స్వస్తి పలుకుదాం. మాకు ఇంక పురుషుల అవసరం లేదు. సొంతంగా వాహనాలు నడుపుతామని’21 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని హతౌన్ బిన్ దఖిల్ అన్నారు. డ్రైవింగ్ స్కూళ్ల ఏర్పాటు మహిళల డ్రైవింగ్‌పై నిషేధం ఎత్తివేస్తున్నట్లు గతేడాది నిర్ణయం తీసుకున్న తర్వాత సౌదీలోని రియాద్, జెడ్డా, పలు నగరాల్లో వారి కోసం డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. 2020 నాటికి 30 లక్షల మంది మహిళలు డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
అక్రమాలకు ‘లైసెన్స్’
సాక్షి,సిటీబ్యూరో : రవాణాశాఖ అనుమతి లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న డ్రైవింగ్ స్కూళ్లు శిక్షణ కోసం వచ్చేవారిని నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఎలాంటి అర్హతలు, నిబంధనలు లేకుండా అక్రమంగా వెలుస్తున్న స్కూళ్లు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే రూ.వేలల్లో వసూలు చేస్తున్నాయి. కార్లు, బస్సులు, లారీలు వంటి వాహనాల డ్రైవింగ్ నేర్చుకోవాలనుకొనే వారి అవసరం, ఆసక్తిని ఆర్టీఏ ఏజెంట్లు ఆసరాగా చేసుకుంటున్నారు. శిక్షణ కోసం వచ్చే వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే అధికారుల అండదండలతో డ్రైవింగ్ లెసైన్సులు ఇప్పించేస్తున్నారు. ఫలితంగా డ్రైవింగ్ రాకపోయినా వాహనాలతో రోడ్డ్డెకే ్కస్తూ రహదారి భద్రతకు సవాళ్లు విసురుతున్నారు. రూ.వేలల్లో వసూళ్లు... డ్రైవింగ్ స్కూళ్ల ఫీజులు, శిక్షణ కాలం, ట్రైనర్ల అనుభవం తదితర అంశాలపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరికివారు ఇష్టం వచ్చినట్లుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. 30 రోజుల శిక్షణకు గాను రూ.5000 నుంచి రూ.7000 వరకు వసూలు చేస్తున్నాయి. పైగా వాహన మోడల్‌ను బట్టి ఫీజులు మారిపోతాయి. నెల రోజుల్లో పూర్తిగా నేర్పిస్తామని చెప్పినా.. మరో 2 నెలలు పొడిగించి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనికితోడు లెర్నింగ్ లెసైన్స్, డ్రైవింగ్ లెసైన్సులను సైతం తామే ఇప్పిస్తామని యథేచ్చగా దోపిడీ కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి ఆర్టీఏల పరిధిలో అనుమతి పొందిన స్కూళ్లు 150 నుంచి 200 వరకు ఉండగా, అనుమతి లేనివి గల్లీకి ఒకటి చొప్పున వందల్లో ఉన్నాయి. కొరవడిన నియంత్రణ .... నిబంధనల ప్రకారం డ్రైవింగ్ నేర్చుకొనేవారు ఆర్టీఓ కేంద్రం నుంచి లెర్నింగ్ లెసైన్స్ తీసుకోవాలి. ఈ లెర్నింగ్ లెసైన్స్ 6 నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఈ 6 నెలల్లో అభ్యర్థులు శిక్షణ పొంది శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. అభ్యర్థుల శిక్షణ , నైపుణ్యంతో నిమిత్తం లేకుండా డ్రైవింగ్ స్కూళ్ల సిఫార్సు మేరకు ఆర్టీఏ అధికారులు ఇష్టారాజ్యంగా లెసైన్సులు ఇచ్చేస్తున్నారు. అక్రమ స్కూళ్లపై కొరడా... నిబంధనలకు విరుద్ధ్దంగా అక్రమంగా నడుస్తున్న పలు డ్రైవింగ్ స్కూళ్లపై మేడ్చల్ ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. ఇటీవల దాడులు నిర్వహించి 10 స్కూళ్లపై చర్యలు తీసుకోవడమేగాకుండా. వాహనాలను సీజ్ చేశారు. కొన్ని స్కూళ్లు అనుమతి పొందిన వాటి కంటే ఎక్కువ వాహనాలను వినియోగిస్తూ బ్రాంచీలను కొనసాగిస్తుండగా, మరికొన్ని ఎలాంటి అనుమతి లేకుండానే స్కూళ్లను నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
శిక్షణ సమయంలోనే మర్యాద పాఠాలు
డ్రైవింగ్ స్కూళ్లకు ఆర్టీవో హుకుం సాక్షి, ముంబై: అత్యవసర సేవలందించే వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే విషయాన్ని శిక్షణ సమయంలోనే డ్రైవర్లకు నేర్పించాలని ప్రాంతీయ రవాణా కార్యాలయం(ఆర్టీఓ) భావిస్తోంది. అందుకు నగరంలోని అన్ని మోటార్ డ్రైవింగ్ స్కూళ్లకు సర్క్యులర్ జారీ చేయాలని నిర్ణయించింది. డ్రైవర్లకు సరైన అవగాహన లేకపోవడంవల్ల అంబులెన్స్, ఫైరింజన్ వంటి అత్యవసర సేవలందించే వాహనాలు ముందుకు వెళ్లేందుకు దారి దొరకడం లేదు. దీంతో రోగిని అంబులెన్స్‌లో సకాలంలో ఆస్పత్రికి చేర్చ లేకపోతున్నాయి. అగ్నిప్రమాదాలు సంభవించిన ప్పుడు కూడా భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతోంది. కొందరు డ్రైవర్లు వీటికి దారి ఇవ్వకపోవడంవల్ల గమ్యానికి ఆలస్యంగా చేరుకుంటున్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. ఫలితంగా అప్పటికే జరగాల్సిన ప్రాణ, ఆస్తి నష్టం జరిగిపోతుంది. దీంతో ఇకనుంచి వీటికి ఫుల్స్టాప్ పెట్టాలని ఆర్టీఓ ఈ నిర్ణయం తీసుకుంది. నగరంలో విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. ఎన్ని ఫ్లై ఓవర్లు నిర్మించినా పరిస్థితి ఎప్పటిలాగే ఉంది. ఉదయం, పగలు, రాత్రి అని తేడా లేకుండా రహదారులన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఇలాంటి సమయం లో ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసర సేవలు అందించే వాహనాలు ఘటనాస్థలానికి చేరుకోవడాని అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ట్రాఫిక్‌లోంచి దారి చేసుకుంటూ ముందుకు వెళ్లడం సవాలుగా మారుతోంది. అందుకు ముం దు వెళ్తున్న కార్లు, ఇతర వాహనాలు సహకరిస్తే కొంత మేలు జరుగుతుందని ఆర్టీఓ భావించింది. ప్రస్తుతం నగరంలో వాహనాలు తోలుతున్న డ్రైవర్లలో చాలామందికి అత్యవసర వాహనాల ప్రాధాన్యత గురించి తెలియదు. తమ వాహనం వెనకాలే వస్తున్న అంబులెన్స్ లేదా ఫైరింజిన్ సైరన్ మోగుతున్నా కొందరు పట్టించుకోవడం లేదు. ముందుకు వెళ్లేందుకు దారి ఇవ్వకపోవడంతో సంఘటన స్థలానికి ఆలస్యంగా చేరుకుంటున్నట్లు అనేక ఫిర్యాదులు ఆర్టీఓకు అందాయి. దీంతో మోటార్ డ్రైవింగ్ స్కూళ్లలో డ్రైవింగ్ నేర్చుకునే సమయంలోనే వారికి అత్యవసర వాహనాల ప్రాధాన్యత గురించి వివరిస్తే భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి రాదనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకు మోటార్ డ్రైవింగ్ స్కూళ్ల సాయం ఎంతైనా ఉందని భావించిన ఆర్టీఓ ఆ మేరకు ఈ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర వాహనాలకు కుడి నుంచి ముందుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని, అందుకు తాము నడుపుతున్న వాహన వేగాన్ని తగ్గించాలని ఆదేశాలలో సూచించింది. -
డ్రైవింగ్ స్కూళ్ల నిలువుదోపిడీ
శిక్షణలో కొరవడుతున్న నాణ్యత ఆర్టీఏ ప్రోత్సాహంతో ఏజెంట్లుగా చలామణి శిక్షకుల నుంచి రూ.వేలల్లో వసూళ్లు విచ్చలవిడిగా డ్రైవింగ్ లెసైన్స్‌ల జారీ సాక్షి,సిటీబ్యూరో : గ్రేటర్లో పుట్టగొడుగుల్లా అక్రమంగా వెలుస్తున్న డ్రైవింగ్ స్కూళ్లు శిక్షకుల పాలిట శిక్షగా మారుతున్నాయి. కార్లు, బస్సులు,లారీలు వంటి వాహనాల డ్రైవింగ్ నేర్చుకోవాలనుకొనే వినియోగదారుల అవసరాన్ని,ఆసక్తిని ఆసరా చేసుకొని నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. శిక్షణ ప్రమాణాలను, నాణ్యతను గాలికొదిలేసి కేవలం అక్రమార్జనే లక్ష్యంగా ఫక్తు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఆర్టీఏ అధికారులకు ఆదాయ మార్గమవుతున్నాయి. మరోవైపు ఈ డ్రైవింగ్ స్కూళ్లనే రాచమార్గంగా ఎంచుకొంటున్న కొందరు మోటారు వాహన తనిఖీ అధికారులు, ప్రాంతీయ రవాణా అధికారులు రహదారి భద్రతా చట్టాలను, ప్రమాణాలను తుంగలో తొక్కి విచ్చలవిడిగా డ్రైవింగ్ లెసైన్స్‌లు ఇచ్చేస్తున్నారు. దాంతో డ్రైవింగ్‌లో ఎలాంటి ప్రావీణ్యం,రహదారి నిబంధనల పట్ల పెద్దగా అవగాహన లేకుండానే చాలామంది డ్రైవర్లుగా రోడ్డెక్కేస్తున్నారు. ఇది డ్రైవింగ్ స్కూళ్లు, ఆర్టీఏ అధికారుల ధనదాహం రహదారి భద్రతకే ముప్పుగా పరిణమిస్తోంది. నియంత్రణ ఇలాగేనా? .... గ్రేటర్‌లోని కొండాపూర్, మేడ్చెల్, ఉప్పల్, నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాల నుంచి వాహనదారులకు రవాణాశాఖ డ్రైవింగ్ లెసైన్స్‌లను అందజేస్తోంది. ఇవి కాకుండా మిగతా ఖైరతాబాద్, అత్తాపూర్, మెహదీపట్నం, సికింద్రాబాద్, బహదూర్‌పురా, మలక్పేట్ల నుంచి లెర్నింగ్ లెసైన్స్‌లు ఇస్తారు. నిబంధనల ప్రకారం కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొనేవాళ్లు మొదట సమీపంలోని ఆర్టీఓ కేంద్రం నుంచి లెర్నింగ్ లెసైన్స్ (ఎల్ఎల్ఆర్) తీసుకోవాలి. అభ్యర్థులకు అరగంట రోడ్డు నిబంధనల పై పరీక్ష నిర్వహించి ఎల్ఎల్ఆర్ అందజేస్తారు. దీంతో వారికి డ్రైవింగ్‌లో శిక్షణ పొందేందుకు అనుమతి లభించినట్లు లెక్క. ఎల్ఎల్ఆర్ పొందిన వారు డ్రైవింగ్ స్కూళ్ల ద్వారా శిక్షణ పొందవచ్చు. లెర్నింగ్ లెసైన్స్ 6 నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఈ మధ్య కాలంలో అభ్యర్థులు పర్ఫెక్ట్గా డ్రైవింగ్ శిక్షణ తీసుకొని శాశ్వతంగా డ్రైవింగ్ లెసైన్స్ తీసుకోవచ్చు. మోటారు వాహన తనిఖీ అధికారులు వాహనదారుల డ్రైవింగ్ నైపుణ్యం పట్ల సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే లెసైన్స్‌లు ఇవ్వాలి. కానీ ఈ నిబంధనల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోవడం లేదు. లెర్నింగ్ లెసైన్స్‌ల నుంచి పర్మినెంట్ డ్రైవింగ్ లెసైన్స్‌ల వరకు అభ్యర్ధుల శిక్షణ , నైపుణ్యంతో నిమిత్తం లేకుండా డ్రైవింగ్ స్కూళ్ల సిఫార్సు మేరకు ఆర్టీఏ అధికారులు ఇష్టారాజ్యంగా ఇచ్చేస్తున్నారు. పరీక్షలు లేకుండానే డీఎల్స్ ... గ్రేటర్లో వేల సంఖ్యలో డ్రైవింగ్ స్కూళ్లు ఉన్నాయి. రవాణాశాఖ నుంచి ఎలాంటి అనుమతి, ఆమోదం లేకుండానే వందలాది స్కూళ్లు పని చేస్తున్నాయి. వాహనదారులకు డ్రైవింగ్ లెసైన్స్‌లు (డీఎల్స్) ఇప్పించడమే లక్ష్యంగా పని చేస్తూ ఆర్టీఏ అధికారులు, సంబంధిత మోటారు వాహన తనిఖీ అధికారులకు నమ్మకమైన దళారులుగా వ్యవహరిస్తున్నాయి.ఇలాంటి డ్రైవింగ్ స్కూళ్ల ద్వారా వచ్చే అభ్యర్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే డీఎల్స్ ఇచ్చేస్తున్నారు. డ్రైవింగ్ శిక్షణ, లెసైన్సుల పేరుతో అభ్యర్థుల నుంచి రూ.వేలల్లో వసూలు చేసినప్పటికీ చివరకు పెద్దగా శిక్షణ ఇవ్వకుండానే లెసైన్స్‌లు మాత్రం ఇప్పించడం గమనార్హం. ఇలా దోపిడీ... ఆర్టీఏ నిబంధనల మేరకు రూ.60 చెల్లించి ఎల్ఎల్ఆర్ తీసుకోవచ్చు. శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ కోసం చెల్లించవలసిన ఫీజు రూ.465లు. కానీ డ్రైవింగ్ స్కూళ్లు శిక్షణ పేరిట తీసుకొనే వేలాది రూపాయలు కాకుండానే,కేవలం ఎల్ఎల్ఆర్,డిఎల్స్పై పై రూ.1200 నుంచి రూ.1800 వరకు వసూలు చేస్తున్నారు. మొత్తంగా శిక్షణ కోసం వచ్చే అభ్యర్థుల దగ్గర ఒక నెల రోజుల శిక్షణ పేరిట రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు వసూలు చేస్తున్నాయి. లెసైన్స్‌లపై అక్రమ ఫీజులను బ్రోచర్లలో ముద్రించి వసూలు చేస్తున్నప్పటికీ రవాణా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాటిని మరింత ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు ఈ స్కూళ్లు ఏ ఒక్క నిబంధన పాటించడం లేదు. ఐటీఐ పూర్తి చేసి,డ్రైవింగ్‌లో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి మాత్రమే శిక్షణ ఇవ్వాలనే నిబంధన కానీ, ప్రతి ఐదేళ్లకోసారి స్కూళ్లు తమ అనుమతులను పునరుద్ధరించుకోవాలనే నిబంధనలు, డ్రైవింగ్ పై సైద్ధాంతిక శిక్షణనిచ్చే తరగతి గదుల నిబంధన గాలికి వదిలేసి డ్రైవింగ్ స్కూళ్ల పేరిట దళారులుగా మాత్రమే పని చేస్తున్నాయి. -
నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవింగ్ స్కూళ్లపై వేటు
సాక్షి, ముంబై: నిబంధనలు ఉల్లంఘించిన దాదాపు 400 డ్రైవింగ్ స్కూళ్ల లెసైన్సులను రాష్ట్ర రవాణా శాఖ అధికారులు రద్దుచేశారు. డ్రైవింగ్ స్కూళ్ల నిర్వహణను తనిఖీ చేయడానికి ఆర్టీవో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో స్కూళ్లు నియమ నిబంధనలు సమక్రమంగా పాటిస్తున్నాయా? లేదా? అని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలు పాటించని 404 స్కూళ్ల లెసైన్సులను రద్దు చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఇందులో ముంబైకి చెందిన 83 స్కూళ్లు ఉన్నాయి. నెల క్రితమే ఈ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించినట్లు అధికారి తెలిపారు. రాష్ట్ర రవాణా కమిషనరు వి.ఎన్.మోరే మాట్లాడుతూ ‘‘ఈ డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ ఇవ్వడానికి తగిన వనరులు లేవు. అవసరమైన పుస్తకాలు, ఇతర సామగ్రి అందుబాటులో లేవు. తమ వద్ద డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన వారి హాజరు పట్టికను కూడా నిర్వహించడం లేదు. శిక్షణ స్థలంలో ప్రిన్సిపల్‌తోపాటు డ్రైవింగ్‌పై సూచనలు ఇచ్చే శిక్షకులు లేరు. డ్రైవింగ్ స్కూళ్లలో విద్యార్థులకు కారు ఎలా పనిచేస్తుందో తెలియజేయడానికి అధునాతన ఇంజిన్‌ను కలిగి ఉండాల్సి ఉంటుంది. అయితే చాలా డ్రైవింగ్ స్కూళ్లు ఈ సదుపాయం కల్పించడంలో విఫలమయ్యాయి. ఈ శిక్షణ సంస్థలు కేవలం డ్రైవింగ్ లెసైన్స్‌లను ఇప్పించే ఏజెన్సీలుగా వ్యవహరిస్తున్నాయి. వాహనం ఎలా నడపాలనే విషయంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం లేదు’’ అని వివరించారు. నియమాలు ఉల్లంఘించిన ఈ డ్రైవింగ్ స్కూళ్లు ఎలాంటి అవకతవకలకు పాల్పడినా ఆర్టీవో ఇన్స్పెక్టర్లు తమ నివేదికలను వెంటనే ఫ్యాక్స్ లేదా ఈ-మెయిల్ ద్వారా కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. తనిఖీ నివేదికపై సదరు ఇన్స్పెక్టర్ సంతం, డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపల్, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సమాచారం పొందుపరుస్తారు. రాష్ట్ర రవాణా శాఖలో సిబ్బంది కొరత వల్ల తనిఖీలు అరుదుగా జరుగుతున్నాయని, దీనిని ఆసరాగా చేసుకొని ఆయా డ్రైవింగ్ స్కూళ్ల నిర్వహకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆయన తెలిపారు. పూర్తిస్థాయి తనిఖీలు జరిపిన తరువాత 1,600 డ్రైవింగ్ స్కూళ్ల వనరుల స్థాయినిబట్టి గ్రేడ్లు ప్రకటిస్తామని వెల్లడించారు. గ్రేడింగ్ వలన ప్రజలు అధికారిక డ్రైవింగ్ స్కూళ్ల వివరాలను తెలుసుకునే వీలుంటుంది. ఐటీఐలో డ్రైవింగ్ స్కూళ్లు.. 450 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(ఐటీఐ)లలో డ్రైవింగ్ స్కూళ్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం 25 ఐటీఐలలోనే డ్రైవింగ్ స్కూళ్లున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సచిన్ ఆహిర్ పేర్కొన్నారు.