రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు భారీ వాహన డ్రైవర్లకు లైసెన్సు రెన్యువల్ సమయంలో ఒకరోజు అవగాహన, శిక్షణ కార్యక్రమం ఇవ్వడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలకు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. డబ్బు వసూలే ధ్యేయంగా ఏర్పడ్డ కొన్ని ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్లతో కుమ్మక్కైన కొందరు అధికారులు రవాణాశాఖలో తెరవెనక చక్రం తిప్పుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: ట్రక్కుల్లాంటి భారీ వాహనాలు నడిపే డ్రైవర్లకు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి. తమ లైసెన్సులను ప్రతి ఐదేళ్లకోసారి (ట్రాన్స్‌పోర్టు కేటగిరీ) రెన్యువల్ చేసుకోవాలి. అదే ప్రమాదకర పదార్థాలు తరలించే వాహనాల డ్రైవర్లు మూడేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ సమయంలో కేంద్రప్రభుత్వ నిర్దేశిత పద్ధతిలో డ్రైవర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలి.
వాహనాలు నడపడం, జాగ్రత్తలు తీసుకోవడం, ప్రమాదాలను తప్పించేందుకు అనుసరించాల్సిన పద్ధతులు, ప్రమాదాన్ని నివారించలేని పక్షంలో వీలైనంతవరకు దాని తీవ్రత తగ్గేలా చూడటం, రోడ్లలో వస్తున్న మార్పులు.. ఇలా పలు అంశాల్లో ఆధునిక సాంకేతికత ఆధారంగా ఆ శిక్షణ కార్యక్రమం ఉండాలి.
ఆ శిక్షణ పూర్తి చేసినట్టు సర్టిఫికెట్ వచ్చిన వారికి మాత్రమే లైసెన్స్ రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. కొందరు డ్రైవర్లు మధ్యలో కొన్నేళ్లపాటు వేరే ఉద్యోగంలో ఉండి, మళ్లీ డ్రైవింగ్‌కు వచ్చే వారుంటారు. వారు డ్రైవింగ్ ఆపేసిన తర్వాత స్కిల్స్ తగ్గిపోతాయన్నది శాస్త్రీయంగా నిరూపణ అయింది. ఇలాంటి వారికి ఈ తరహా శిక్షణ అవశ్యమని కేంద్రం పేర్కొంది.
రాష్ట్రంలో సిరిసిల్లలోని ‘టైడ్స్’ ఎంపిక
గత ఏడాది మన దేశంలో రోడ్డు ప్రమాదాల రూపంలో లక్షన్నర కంటే ఎక్కువ మంది చనిపోయారు. కొన్నేళ్లుగా ఈ సంఖ్య ఇదే రీతిలో నమోదవుతుండటంతో సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో వాటిని నివారించేందుకు కేంద్రం కొన్ని సూచనలు చేసింది.
అందులో భారీ వాహనాలను నడిపే డ్రైవర్లు తరచూ.. ఇటు డ్రైవింగ్, అటు వాహనాల్లో వస్తున్న మార్పులు, ఇతర అంశాలపై అవగాహన పెంచుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో ఈ శిక్షణ కోసం సిరిసిల్ల సమీపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ (టీఐడీఎస్)’ను ఎంపిక చేసింది.
ఏం జరుగుతోంది?
గతంలో ప్రైవేట్ డ్రైవింగ్ స్కూళ్ల నుంచే డ్రైవర్లు శిక్షణ సర్టిఫికెట్ పొందేవారు. చాలా డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ ఇవ్వకుండానే, రూ.5 వేల వరకు వసూలు చేసి సర్టిఫికెట్ ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం... రూ.20 కోట్ల వ్యయంతో ఆత్యాధునికంగా తీర్చిదిద్దిన సిరిసిల్లలోని టైడ్స్‌ను శిక్షణకు ఎంపిక చేసింది. దీంతో కొందరు ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్ల యజమానులు పైరవీ అధికారులతో కుమ్మక్కయ్యారు.
సిరిసిల్లకు వెళ్లి డ్రైవర్లు శిక్షణ తీసుకోవటం కష్టమని, అన్ని ప్రాంతాల్లో డ్రైవింగ్ స్కూళ్లు అందుబాటులో ఉన్నందున వాటిల్లో శిక్షణకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీన్ని అమల్లోకి తెచ్చేందుకు అధికారులు ఉన్నతస్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది.
లైసెన్సు ఇచ్చేప్పుడు ప్రైవేటు డ్రైవింగ్ స్కూళ్ల నుంచి తెచ్చిన సర్టిఫికెట్లనే పరిగణనలోకి తీసుకున్నప్పుడు, రెన్యువల్‌కు అంగీకరిస్తే ఏంటన్న కోణంలో ఈ ఒత్తిళ్లు నడుస్తున్నట్టు సమాచారం. దీంతో రాష్ట్రంలో వేరువేరు ప్రాంతాల్లో అనుబంధ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న సూచనలు వస్తున్నాయి. అవసరమైతే, ఆర్టీసీ శిక్షణ కేంద్రాల సహకారం తీసుకోవాలని కూడా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment