జూన్ ఒకటి నుంచి కొత్త చట్టం అమలు
కనీసం మూడెకరాల స్థలం అవసరం
ఆదిలాబాద్: రహదారి భద్రత చట్టం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో నూతన సంస్కరణకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లను అందుబాటులోకి తీసుకు రానుంది. ఇకపై రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేకుండా ఈ స్కూళ్లలో డ్రైవింగ్ శిక్షణ పొందిన వారికి నేరుగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. మోటారు వాహన చట్టం మార్పులో భాగంగా ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ అంతా కూడా ప్రైవేటు భాగస్వామ్యంలో సాగనుంది.
ఈ చట్టం జూన్ ఒకటి నుంచి అమలులోకి రానుంది. కాగా, జిల్లాలో ఇప్పటివరకు అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూల్ లేదు సరికదా ఇప్పటికిప్పుడు డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు కూడా కష్టమే. రవాణా శాఖ చట్టం నిబంధన మేరకు అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే పలు నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఇప్పుడున్న వారు ఏర్పాటుకు సముఖంగా లేరు. డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు సంస్థలు, వ్యక్తులు ముందుకు వస్తే అనుమతి ఇస్తామని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
పారదర్శకతతో డ్రైవింగ్ ఉంటేనే..
అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లు ఇచ్చే డ్రైవింగ్ శిక్షణ నాణ్యమైనదిగా, సమర్థవంతమైనదిగా, పారదర్శకతతో ఉంటే లైసెన్స్‌లు ఇవ్వాలనేది రవాణా శాఖ ముఖ్యోద్దేశం. ఈ డ్రైవింగ్ స్కూళ్లు ఇచ్చే 5–ఏ సర్టిఫికేట్ల ఆధారంగా నేరుగా లైసెన్స్ జారీ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీలో రవాణా శాఖ అధికారులను పరిమితం చేస్తూ తీసుకొస్తున్న అక్రిడేటెడ్ స్కూళ్ల ఏర్పాటు ప్రస్తుతం కష్టతరంగానే ఉండబోనుంది. ప్రస్తుతం ఉన్న సాధారణ డ్రైవింగ్ స్కూళ్లు కూడా కఠిన నిబంధనలతో స్కూళ్ల ఏర్పాటు కష్టమే అంటున్నారు.
మూడెకరాలు కావాల్సిందే..
డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు కనీసం మూడెకరాల స్థలం కావాలి. రెండెకరాల్లో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, ప్రాథమిక శిక్షణ కోసం సిమ్యులేటర్లు ఏర్పాటు చేయాలి. మరో ఎకరంలో శిక్షణ తరగతుల కోసం భవనం, తరగతి గదులు, ఇంటర్‌నెట్ సదుపాయం, ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ, టీచింగ్ పరికరాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇందుకు పెద్దమొత్తంలో పెట్టుబడి అవసరం. భూముల విలువ రూ.లక్షలు, రూ.కోట్లలో ఉండగా మూడెకరాల్లో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు కష్టమే అంటున్నారు. అయినా ముందుకు వచ్చి ఏర్పాటు చేస్తే ఆదాయం ఆ స్థాయిలో ఉంటుందా అనేది అనుమానమేనని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment