అక్రమాలకు ‘లైసెన్స్’
సాక్షి,సిటీబ్యూరో : రవాణాశాఖ అనుమతి లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న డ్రైవింగ్ స్కూళ్లు శిక్షణ కోసం వచ్చేవారిని నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఎలాంటి అర్హతలు, నిబంధనలు లేకుండా అక్రమంగా వెలుస్తున్న స్కూళ్లు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే రూ.వేలల్లో వసూలు చేస్తున్నాయి. కార్లు, బస్సులు, లారీలు వంటి వాహనాల డ్రైవింగ్ నేర్చుకోవాలనుకొనే వారి అవసరం, ఆసక్తిని ఆర్టీఏ ఏజెంట్లు ఆసరాగా చేసుకుంటున్నారు. శిక్షణ కోసం వచ్చే వారికి ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే అధికారుల అండదండలతో డ్రైవింగ్ లెసైన్సులు ఇప్పించేస్తున్నారు. ఫలితంగా డ్రైవింగ్ రాకపోయినా వాహనాలతో రోడ్డ్డెకే ్కస్తూ రహదారి భద్రతకు సవాళ్లు విసురుతున్నారు.
రూ.వేలల్లో వసూళ్లు...
డ్రైవింగ్ స్కూళ్ల ఫీజులు, శిక్షణ కాలం, ట్రైనర్ల అనుభవం తదితర అంశాలపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఎవరికివారు ఇష్టం వచ్చినట్లుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. 30 రోజుల శిక్షణకు గాను రూ.5000 నుంచి రూ.7000 వరకు వసూలు చేస్తున్నాయి. పైగా వాహన మోడల్‌ను బట్టి ఫీజులు మారిపోతాయి. నెల రోజుల్లో పూర్తిగా నేర్పిస్తామని చెప్పినా.. మరో 2 నెలలు పొడిగించి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనికితోడు లెర్నింగ్ లెసైన్స్, డ్రైవింగ్ లెసైన్సులను సైతం తామే ఇప్పిస్తామని యథేచ్చగా దోపిడీ కొనసాగిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి ఆర్టీఏల పరిధిలో అనుమతి పొందిన స్కూళ్లు 150 నుంచి 200 వరకు ఉండగా, అనుమతి లేనివి గల్లీకి ఒకటి చొప్పున వందల్లో ఉన్నాయి.
కొరవడిన నియంత్రణ ....
నిబంధనల ప్రకారం డ్రైవింగ్ నేర్చుకొనేవారు ఆర్టీఓ కేంద్రం నుంచి లెర్నింగ్ లెసైన్స్ తీసుకోవాలి. ఈ లెర్నింగ్ లెసైన్స్ 6 నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఈ 6 నెలల్లో అభ్యర్థులు శిక్షణ పొంది శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. అభ్యర్థుల శిక్షణ , నైపుణ్యంతో నిమిత్తం లేకుండా డ్రైవింగ్ స్కూళ్ల సిఫార్సు మేరకు ఆర్టీఏ అధికారులు ఇష్టారాజ్యంగా లెసైన్సులు ఇచ్చేస్తున్నారు.
అక్రమ స్కూళ్లపై కొరడా...
నిబంధనలకు విరుద్ధ్దంగా అక్రమంగా నడుస్తున్న పలు డ్రైవింగ్ స్కూళ్లపై మేడ్చల్ ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. ఇటీవల దాడులు నిర్వహించి 10 స్కూళ్లపై చర్యలు తీసుకోవడమేగాకుండా. వాహనాలను సీజ్ చేశారు. కొన్ని స్కూళ్లు అనుమతి పొందిన వాటి కంటే ఎక్కువ వాహనాలను వినియోగిస్తూ బ్రాంచీలను కొనసాగిస్తుండగా, మరికొన్ని ఎలాంటి అనుమతి లేకుండానే స్కూళ్లను నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.