అమృత్ 2.0.. ఇంకెప్పుడో?
ఇప్పటికే పూర్తయిన టెండర్ల ప్రక్రియ
పనుల ప్రారంభంలో తీవ్ర జాప్యం
దృష్టి సారించని పాలకులు
ఆదిలాబాద్: స్థానిక మున్సిపాలిటీలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద రూ. 95.50 కోట్ల నిధులు విడుదల చేసింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల కారణంగా నిలిచిపోయిన పనులను చేపట్టేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి కూడా ఇచ్చింది. ఈ పనుల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. నిధులు సైతం మంజూరయ్యాయి. అయినా పనుల ప్రారంభంపై అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
14 నెలల క్రితం నిధుల మంజూరు..
రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రజలకు అవసరమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద 2023 మే 20న నిధులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి రూ.95.50 కోట్లు కేటాయిస్తూ జీవో నంబర్ 312ను జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు బల్దియా కూడా తమ వాటా చెల్లించి తాగునీటి పనులు చేపట్టేలా మార్గదర్శకాలు జారీ చేసింది.
అప్పుడే పనులు ప్రారంభించాల్సి ఉండగా టెండర్ల దాఖలకు కాంట్రాక్టర్లు ఆ సమయంలో ముందుకు రాలేదు. దీంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. గతేడాది డిసెంబర్‌లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల పాటు ఈ పనులను నిలిపివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరిగి చేపట్టేందుకు అనుమతినిచ్చింది. పనులు ప్రారంభమవుతాయని ప్రజలు సంబరపడ్డారు. అయితే ఇప్పటికి ఎలాంటి ప్రగతి లేకపోవడం గమనార్హం.
టెండర్ల ప్రక్రియ పూర్తయినా..
పట్టణంలోని ప్రతీ వ్యక్తికి రోజుకు 135 లీటర్ల నీటిని అందించాలనే ఉద్దేశంతో పనులు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తాగునీటి సమస్య ఉన్న పట్టణంలో కొత్తగా విలీనమైన కేఆర్‌కే కాలనీ, భగత్‌సింగ్‌నగర్, న్యూ హౌసింగ్‌బోర్డు, రాంపూర్ వంటి కాలనీల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణాలతో పాటు తాగునీటి సరఫరాకు అవసరమైన పైపులైన్లు, నల్లా కనెక్షన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
మున్సిపల్ పరిధిలోని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా ఏయే కాలనీల్లో ఎలాంటి పనులు చేపట్టాలనే దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రస్థాయిలోనే టెండర్ల ప్రక్రియ ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించకపోవడంలో ఆంతర్యమేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది వేసవిలోనూ ఆయా ఆయా కాలనీల ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికై నా త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.
త్వరలోనే ప్రారంభిస్తాం..
అమృత్ 2.0 పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క చేతుల మీదుగా పనులకు భూమి పూజ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మరో పది, పదిహేను రోజుల్లోగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. – గంగాధర్, పబ్లిక్ హెల్త్, ఈఈ
Comments
Please login to add a commentAdd a comment