ఆదిలాబాద్: భైంసా పట్టణానికి చెందిన జిలకరి హిమాన్షు ఐదేళ్ల వయసుకే అబ్బురపరుస్తున్నాడు. వయసుకు మించి ప్రతిభతో రాణిస్తూ అందరిచేత ఔరా అనిపించుకుంటున్నాడు. భైంసా పట్టణానికి చెందిన జిలకరి రాజేశ్వర్–రజిత దంపతులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగా వీరికి ఇద్దరు సంతానం. పెద్దవాడైన హిమాన్షు ప్రస్తుతం గుజిరిగల్లి శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుండగా, సెకండ్ల వ్యవధిలో అన్ని రాష్ట్రాలు–రాజధానుల పేర్లు చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు.
అంతేగాక తోటి పిల్లలు ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాల్ అని నేర్చుకుంటుంటే తను మాత్రం ఆంగ్ల అక్షరాలతో పురాణ పురుషుల పేర్లు కంఠస్తంగా చెబుతుండడంతో ఉపాధ్యాయులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏ ఫర్ అర్జున, బి ఫర్ బలరామ అంటూ జెడ్ ఫర్ జాంబవంత వరకు పురాణ పురుషుల పేర్లు పొల్లు పోకుండా చెబుతున్నాడు. తల్లిదండ్రులు సైతం తమ కుమారుడి ప్రతిభ చూసి మరింత ప్రోత్సహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment