శిక్షణలో కొరవడుతున్న నాణ్యత
ఆర్టీఏ ప్రోత్సాహంతో ఏజెంట్లుగా చలామణి
శిక్షకుల నుంచి రూ.వేలల్లో వసూళ్లు
విచ్చలవిడిగా డ్రైవింగ్ లెసైన్స్‌ల జారీ
సాక్షి,సిటీబ్యూరో :
గ్రేటర్‌లో పుట్టగొడుగుల్లా అక్రమంగా వెలుస్తున్న డ్రైవింగ్ స్కూళ్లు శిక్షకుల పాలిట శిక్షగా మారుతున్నాయి. కార్లు, బస్సులు,లారీలు వంటి వాహనాల డ్రైవింగ్ నేర్చుకోవాలనుకొనే వినియోగదారుల అవసరాన్ని,ఆసక్తిని ఆసరా చేసుకొని నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. శిక్షణ ప్రమాణాలను, నాణ్యతను గాలికొదిలేసి కేవలం అక్రమార్జనే లక్ష్యంగా ఫక్తు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఆర్టీఏ అధికారులకు ఆదాయ మార్గమవుతున్నాయి. మరోవైపు ఈ డ్రైవింగ్ స్కూళ్లనే రాచమార్గంగా ఎంచుకొంటున్న కొందరు మోటారు వాహన తనిఖీ అధికారులు, ప్రాంతీయ రవాణా అధికారులు రహదారి భద్రతా చట్టాలను, ప్రమాణాలను తుంగలో తొక్కి విచ్చలవిడిగా డ్రైవింగ్ లెసైన్స్‌లు ఇచ్చేస్తున్నారు. దాంతో డ్రైవింగ్‌లో ఎలాంటి ప్రావీణ్యం,రహదారి నిబంధనల పట్ల పెద్దగా అవగాహన లేకుండానే చాలామంది డ్రైవర్లుగా రోడ్డెక్కేస్తున్నారు. ఇది డ్రైవింగ్ స్కూళ్లు, ఆర్టీఏ అధికారుల ధనదాహం రహదారి భద్రతకే ముప్పుగా పరిణమిస్తోంది.
నియంత్రణ ఇలాగేనా? ....
గ్రేటర్‌లోని కొండాపూర్, మేడ్చెల్, ఉప్పల్, నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాల నుంచి వాహనదారులకు రవాణాశాఖ డ్రైవింగ్ లెసైన్స్‌లను అందజేస్తోంది. ఇవి కాకుండా మిగతా ఖైరతాబాద్, అత్తాపూర్, మెహదీపట్నం, సికింద్రాబాద్, బహదూర్‌పురా, మలక్‌పేట్‌ల నుంచి లెర్నింగ్ లెసైన్స్‌లు ఇస్తారు. నిబంధనల ప్రకారం కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొనేవాళ్లు మొదట సమీపంలోని ఆర్టీఓ కేంద్రం నుంచి లెర్నింగ్ లెసైన్స్ (ఎల్‌ఎల్‌ఆర్) తీసుకోవాలి. అభ్యర్థులకు అరగంట రోడ్డు నిబంధనల పై పరీక్ష నిర్వహించి ఎల్‌ఎల్‌ఆర్ అందజేస్తారు. దీంతో వారికి డ్రైవింగ్‌లో శిక్షణ పొందేందుకు అనుమతి లభించినట్లు లెక్క. ఎల్‌ఎల్‌ఆర్ పొందిన వారు డ్రైవింగ్ స్కూళ్ల ద్వారా శిక్షణ పొందవచ్చు. లెర్నింగ్ లెసైన్స్ 6 నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఈ మధ్య కాలంలో అభ్యర్థులు పర్ఫెక్ట్‌గా డ్రైవింగ్ శిక్షణ తీసుకొని శాశ్వతంగా డ్రైవింగ్ లెసైన్స్ తీసుకోవచ్చు. మోటారు వాహన తనిఖీ అధికారులు వాహనదారుల డ్రైవింగ్ నైపుణ్యం పట్ల సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే లెసైన్స్‌లు ఇవ్వాలి. కానీ ఈ నిబంధనల్లో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోవడం లేదు. లెర్నింగ్ లెసైన్స్‌ల నుంచి పర్మినెంట్ డ్రైవింగ్ లెసైన్స్‌ల వరకు అభ్యర్ధుల శిక్షణ , నైపుణ్యంతో నిమిత్తం లేకుండా డ్రైవింగ్ స్కూళ్ల సిఫార్సు మేరకు ఆర్టీఏ అధికారులు ఇష్టారాజ్యంగా ఇచ్చేస్తున్నారు.
పరీక్షలు లేకుండానే డీఎల్స్ ...
గ్రేటర్‌లో వేల సంఖ్యలో డ్రైవింగ్ స్కూళ్లు ఉన్నాయి. రవాణాశాఖ నుంచి ఎలాంటి అనుమతి, ఆమోదం లేకుండానే వందలాది స్కూళ్లు పని చేస్తున్నాయి. వాహనదారులకు డ్రైవింగ్ లెసైన్స్‌లు (డీఎల్స్) ఇప్పించడమే లక్ష్యంగా పని చేస్తూ ఆర్టీఏ అధికారులు, సంబంధిత మోటారు వాహన తనిఖీ అధికారులకు నమ్మకమైన దళారులుగా వ్యవహరిస్తున్నాయి.ఇలాంటి డ్రైవింగ్ స్కూళ్ల ద్వారా వచ్చే అభ్యర్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే డీఎల్స్ ఇచ్చేస్తున్నారు. డ్రైవింగ్ శిక్షణ, లెసైన్సుల పేరుతో అభ్యర్థుల నుంచి రూ.వేలల్లో వసూలు చేసినప్పటికీ చివరకు పెద్దగా శిక్షణ ఇవ్వకుండానే లెసైన్స్‌లు మాత్రం ఇప్పించడం గమనార్హం.
ఇలా దోపిడీ...
ఆర్టీఏ నిబంధనల మేరకు రూ.60 చెల్లించి ఎల్‌ఎల్‌ఆర్ తీసుకోవచ్చు. శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్ కోసం చెల్లించవలసిన ఫీజు రూ.465లు. కానీ డ్రైవింగ్ స్కూళ్లు శిక్షణ పేరిట తీసుకొనే వేలాది రూపాయలు కాకుండానే,కేవలం ఎల్‌ఎల్‌ఆర్,డిఎల్స్‌పై పై రూ.1200 నుంచి రూ.1800 వరకు వసూలు చేస్తున్నారు. మొత్తంగా శిక్షణ కోసం వచ్చే అభ్యర్థుల దగ్గర ఒక నెల రోజుల శిక్షణ పేరిట రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు వసూలు చేస్తున్నాయి. లెసైన్స్‌లపై అక్రమ ఫీజులను బ్రోచర్లలో ముద్రించి వసూలు చేస్తున్నప్పటికీ రవాణా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాటిని మరింత ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు ఈ స్కూళ్లు ఏ ఒక్క నిబంధన పాటించడం లేదు. ఐటీఐ పూర్తి చేసి,డ్రైవింగ్‌లో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి మాత్రమే శిక్షణ ఇవ్వాలనే నిబంధన కానీ, ప్రతి ఐదేళ్లకోసారి స్కూళ్లు తమ అనుమతులను పునరుద్ధరించుకోవాలనే నిబంధనలు, డ్రైవింగ్ పై సైద్ధాంతిక శిక్షణనిచ్చే తరగతి గదుల నిబంధన గాలికి వదిలేసి డ్రైవింగ్ స్కూళ్ల పేరిట దళారులుగా మాత్రమే పని చేస్తున్నాయి.
డ్రైవింగ్ స్కూళ్ల నిలువుదోపిడీ
Published Tue, Mar 11 2014 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM
Advertisement
Advertisement