నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవింగ్ స్కూళ్లపై వేటు
Published Thu, Oct 17 2013 11:46 PM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM
సాక్షి, ముంబై: నిబంధనలు ఉల్లంఘించిన దాదాపు 400 డ్రైవింగ్ స్కూళ్ల లెసైన్సులను రాష్ట్ర రవాణా శాఖ అధికారులు రద్దుచేశారు. డ్రైవింగ్ స్కూళ్ల నిర్వహణను తనిఖీ చేయడానికి ఆర్టీవో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో స్కూళ్లు నియమ నిబంధనలు సమక్రమంగా పాటిస్తున్నాయా? లేదా? అని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలు పాటించని 404 స్కూళ్ల లెసైన్సులను రద్దు చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఇందులో ముంబైకి చెందిన 83 స్కూళ్లు ఉన్నాయి. నెల క్రితమే ఈ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించినట్లు అధికారి తెలిపారు.
రాష్ట్ర రవాణా కమిషనరు వి.ఎన్.మోరే మాట్లాడుతూ ‘‘ఈ డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ ఇవ్వడానికి తగిన వనరులు లేవు. అవసరమైన పుస్తకాలు, ఇతర సామగ్రి అందుబాటులో లేవు. తమ వద్ద డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన వారి హాజరు పట్టికను కూడా నిర్వహించడం లేదు. శిక్షణ స్థలంలో ప్రిన్సిపల్‌తోపాటు డ్రైవింగ్‌పై సూచనలు ఇచ్చే శిక్షకులు లేరు. డ్రైవింగ్ స్కూళ్లలో విద్యార్థులకు కారు ఎలా పనిచేస్తుందో తెలియజేయడానికి అధునాతన ఇంజిన్‌ను కలిగి ఉండాల్సి ఉంటుంది. అయితే చాలా డ్రైవింగ్ స్కూళ్లు ఈ సదుపాయం కల్పించడంలో విఫలమయ్యాయి. ఈ శిక్షణ సంస్థలు కేవలం డ్రైవింగ్ లెసైన్స్‌లను ఇప్పించే ఏజెన్సీలుగా వ్యవహరిస్తున్నాయి. వాహనం ఎలా నడపాలనే విషయంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం లేదు’’ అని వివరించారు.
నియమాలు ఉల్లంఘించిన ఈ డ్రైవింగ్ స్కూళ్లు ఎలాంటి అవకతవకలకు పాల్పడినా ఆర్టీవో ఇన్‌స్పెక్టర్లు తమ నివేదికలను వెంటనే ఫ్యాక్స్ లేదా ఈ-మెయిల్ ద్వారా కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. తనిఖీ నివేదికపై సదరు ఇన్‌స్పెక్టర్ సంతం, డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపల్, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సమాచారం పొందుపరుస్తారు. రాష్ట్ర రవాణా శాఖలో సిబ్బంది కొరత వల్ల తనిఖీలు అరుదుగా జరుగుతున్నాయని, దీనిని ఆసరాగా చేసుకొని ఆయా డ్రైవింగ్ స్కూళ్ల నిర్వహకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆయన తెలిపారు. పూర్తిస్థాయి తనిఖీలు జరిపిన తరువాత 1,600 డ్రైవింగ్ స్కూళ్ల వనరుల స్థాయినిబట్టి గ్రేడ్లు ప్రకటిస్తామని వెల్లడించారు. గ్రేడింగ్ వలన ప్రజలు అధికారిక డ్రైవింగ్ స్కూళ్ల వివరాలను తెలుసుకునే వీలుంటుంది.
ఐటీఐలో డ్రైవింగ్ స్కూళ్లు..
450 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(ఐటీఐ)లలో డ్రైవింగ్ స్కూళ్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం 25 ఐటీఐలలోనే డ్రైవింగ్ స్కూళ్లున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సచిన్ ఆహిర్ పేర్కొన్నారు.
Advertisement
Advertisement