cancel lesainsu
-
16 వేల మంది లెసైన్సులు రద్దు చేయండి
న్యూఢిల్లీ: తాగిన మత్తులో వాహనం నడుపుతూ అమాయకులను బలిగొంటున్నవారి సంఖ్య నగరంలో పెరిగిపోతుండడంతో ట్రాఫిక్ విభాగం అప్రమత్తమైంది. వారం రోజుల వ్యవధిలో మూడు ఘటనలు జరగడంతో ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారంటూ నిలదీసేవారి సంఖ్య పెరిగింది. దీంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పదే పదే పట్టుబడుతున్నవారి లెసైన్సులను శాశ్వతంగా రద్దు చేయాలని ట్రాఫిక్ విభాగం నిర్ణయించింది. ఇలాంటివారు నగరంలో 16,000 మంది ఉన్నారని, వారందరి లెసైన్సులను రద్దు చేయాలని రవాణా విభాగాన్ని ఆదేశించింది. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ... ‘ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఒకసారి కంటే ఎక్కువసార్లు పట్టుబడిన వారి జాబితాను సిద్ధం చేశాం. ఇలాంటి వారివల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల టాటా సఫారీ కారు ఢీకొన్న ఘటనలో ఓ రిక్షావాలా మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తి తాగిన మత్తులో వాహనం నడపడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది. అతను గతంలో కూడా తాగిన మత్తులో వాహనం నడిపి రెండు, మూడుసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. జరిమానాలు చెల్లించి బయటపడిన సదరు వ్యక్తి తాజా ఘటనలో ఒకరి ప్రాణం బలితీసుకున్నాడు. ఇటువంటి వారి లెసైన్సులు రద్దు చేయడంవల్ల మరోసారి ప్రమాదం చేయకుండా ఉంటారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారు ఇప్పటిదాకా 16,000 మంది ఉన్నారు. వీరిలో 302 మంది డ్రైవర్లే కావడం గమనార్హం. వీరంతా డ్రంకెన్ డ్రైవర్లే. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 15 వరకు 20,400 మందిపై కేసులు నమోదు చేసి, విచారించగా వారిలో 302 మంది పదే పదే ఈ నేరానికి పాల్పడుతున్నట్లు స్పష్టమైంది. దీంతో ఇటువంటి వారిపై మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. లెసైన్సులను రద్దు చేసే అధికారం కూడా చట్టం కల్పిస్తున్నందున ఆ దిశగా ఆలోచించాలని రవాణా విభాగానికి లేఖ రాశామ’న్నారు. భారీగా చలాన్లు... ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నవారిని చలాన్ల రూపంలో శిక్షిస్తున్నా మార్పు రావడంలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా 20,400 చలాన్లు జారీ చేశామన్నారు. ఐదేళ్ల క్రితం ఇదే సమయానికి 12,784 చలాన్లు జారీ చేశామని చెప్పారు. చలాన్ల సంఖ్య పెరగడంతోపాటు తప్పిదాలకు పాల్పడుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. ఏటా 50 లక్షల మందిని ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద పోలీసులు విచారిస్తున్నారని చెప్పారు. నగరంలో 85 లక్షల వాహనాలుండగా 50 లక్షల మంది నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటే ట్రాఫిక్ క్రమశిక్షణ నగరవాసుల్లో ఏ మేరకు ఉందో అర్థమవుతుందన్నారు. -
నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవింగ్ స్కూళ్లపై వేటు
సాక్షి, ముంబై: నిబంధనలు ఉల్లంఘించిన దాదాపు 400 డ్రైవింగ్ స్కూళ్ల లెసైన్సులను రాష్ట్ర రవాణా శాఖ అధికారులు రద్దుచేశారు. డ్రైవింగ్ స్కూళ్ల నిర్వహణను తనిఖీ చేయడానికి ఆర్టీవో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో స్కూళ్లు నియమ నిబంధనలు సమక్రమంగా పాటిస్తున్నాయా? లేదా? అని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలు పాటించని 404 స్కూళ్ల లెసైన్సులను రద్దు చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఇందులో ముంబైకి చెందిన 83 స్కూళ్లు ఉన్నాయి. నెల క్రితమే ఈ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించినట్లు అధికారి తెలిపారు. రాష్ట్ర రవాణా కమిషనరు వి.ఎన్.మోరే మాట్లాడుతూ ‘‘ఈ డ్రైవింగ్ స్కూళ్లలో శిక్షణ ఇవ్వడానికి తగిన వనరులు లేవు. అవసరమైన పుస్తకాలు, ఇతర సామగ్రి అందుబాటులో లేవు. తమ వద్ద డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన వారి హాజరు పట్టికను కూడా నిర్వహించడం లేదు. శిక్షణ స్థలంలో ప్రిన్సిపల్‌తోపాటు డ్రైవింగ్‌పై సూచనలు ఇచ్చే శిక్షకులు లేరు. డ్రైవింగ్ స్కూళ్లలో విద్యార్థులకు కారు ఎలా పనిచేస్తుందో తెలియజేయడానికి అధునాతన ఇంజిన్‌ను కలిగి ఉండాల్సి ఉంటుంది. అయితే చాలా డ్రైవింగ్ స్కూళ్లు ఈ సదుపాయం కల్పించడంలో విఫలమయ్యాయి. ఈ శిక్షణ సంస్థలు కేవలం డ్రైవింగ్ లెసైన్స్‌లను ఇప్పించే ఏజెన్సీలుగా వ్యవహరిస్తున్నాయి. వాహనం ఎలా నడపాలనే విషయంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం లేదు’’ అని వివరించారు. నియమాలు ఉల్లంఘించిన ఈ డ్రైవింగ్ స్కూళ్లు ఎలాంటి అవకతవకలకు పాల్పడినా ఆర్టీవో ఇన్స్పెక్టర్లు తమ నివేదికలను వెంటనే ఫ్యాక్స్ లేదా ఈ-మెయిల్ ద్వారా కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. తనిఖీ నివేదికపై సదరు ఇన్స్పెక్టర్ సంతం, డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపల్, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సమాచారం పొందుపరుస్తారు. రాష్ట్ర రవాణా శాఖలో సిబ్బంది కొరత వల్ల తనిఖీలు అరుదుగా జరుగుతున్నాయని, దీనిని ఆసరాగా చేసుకొని ఆయా డ్రైవింగ్ స్కూళ్ల నిర్వహకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆయన తెలిపారు. పూర్తిస్థాయి తనిఖీలు జరిపిన తరువాత 1,600 డ్రైవింగ్ స్కూళ్ల వనరుల స్థాయినిబట్టి గ్రేడ్లు ప్రకటిస్తామని వెల్లడించారు. గ్రేడింగ్ వలన ప్రజలు అధికారిక డ్రైవింగ్ స్కూళ్ల వివరాలను తెలుసుకునే వీలుంటుంది. ఐటీఐలో డ్రైవింగ్ స్కూళ్లు.. 450 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(ఐటీఐ)లలో డ్రైవింగ్ స్కూళ్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం 25 ఐటీఐలలోనే డ్రైవింగ్ స్కూళ్లున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సచిన్ ఆహిర్ పేర్కొన్నారు. -
ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే లెసైన్సులు రద్దు
గంగావతి, న్యూస్‌లైన్ :ప్లాస్టిక్ కవర్లు వినియోగించే హోటళ్లు, దుకాణాల లెసైన్పులు రద్దు చేస్తామని నగరసభ అధ్యక్షుడు షామిద్ మనియార్ హెచ్చరించారు. స్థానిక జంతకల్లులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మద్దానేశ్వర యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఎస్ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్లాస్టిక్ కవర్లు వినియోగించే దుకాణ యజమానుల గురించి నగర ప్రజలు సమాచారం అందించాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేందుకు మొక్కలను పెంచాలన్నారు. వార్డుల్లోకి వచ్చే చెత్త తరలింపు ట్రాక్టర్లలో చెత్త వేయకుండా చెత్తను ఇళ్లలోనే నిల్వ ఉంచినవారిపై జరిమాన విధించే చట్టం బెంగళూరులో అమలులోకి వచ్చిందన్నారు. నగర, పట్టణ పంచాయతీల పరిధిలో కూడా ఈ చట్టం త్వరలో అమలు అవుతుందని తెలిపారు. పరిసరాలను శుభ్రంగా ఉంచకోకపోతే డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి మండలి మాజీ అధ్యక్షురాలు లలితరాణి శ్రీరంగదేవరాయలు, మద్దానేశ్వర యువజన సంఘం అధ్యక్షులు సోమశేఖరగౌడ, కళాశాల అభివృద్ధి సమితి అధ్యక్షులు సురేష్ గౌడప్ప, కౌన్సిలర్లు హుసేన్, ఉద్భవ లక్ష్మీ మహిళా మండలి ప్రముఖులు మల్లమ్మ, హంపమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.