సాక్షి, అమరావతి: ఇకపై లైసెన్సు కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ టెస్టులకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్‌లో నిర్దేశిత శిక్షణ పూర్తి చేసి సర్టిఫికెట్ పొందితే చాలు.. రవాణా శాఖ కార్యాలయం డ్రైవింగ్ లైసెన్సును మంజూరు చేయనుంది. అదే సమయంలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల గుర్తింపు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ‘డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు–2022’ నోటిఫికేషన్‌ను ఇటీవల జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలు ఈ ఏడాది జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుత విధానంతో పాటు ఇది కూడా కొనసాగనుంది. కొత్త విధానాన్ని ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు.
లైసెన్సుల జారీ సులభతరం..
ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి పరీక్ష పాస్ కావాలి. థియరీ, ప్రాక్టికల్ పరీక్షల్లో అర్హత సాధించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చే విధానం ప్రకారం.. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆ శిక్షణా కేంద్రం జారీ చేసే సర్టిఫికెట్ కాపీతో పాటు అవసరమైన గుర్తింపు కార్డుల కాపీలు జతచేసి దరఖాస్తు చేస్తే రవాణా శాఖ డ్రైవింగ్ లైసెన్సు ఇస్తుంది. దీనివల్ల లైసెన్సుల కోసం నిరీక్షించే సమయం తగ్గుతుందని.. లైసెన్సుల జారీ విధానం సరళతరం, సులభతరం అవుతుందన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది.
నిబంధనలు కఠినతరం..
ఈ ప్రక్రియలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల పాత్ర కీలకం కానుండటంతో.. గుర్తింపు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. గుర్తింపు పొందిన శిక్షణా కేంద్రం జారీ చేసే సర్టిఫికెట్‌ను మాత్రమే రవాణా శాఖ పరిగణనలోకి తీసుకోనుంది.
► ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్ల డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే.. ట్రాక్ కోసం కనీసం ఎకరా భూమి ఉండాలి. భారీ వాహనాల డ్రైవింగ్ స్కూల్‌కు అయితే కనీసం 2 ఎకరాల భూమి ఉండాలి. వాటిలో కేంద్ర మార్గదర్శకాల ప్రకారం టెస్టింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలి.
► డ్రైవింగ్‌పై ప్రాథమికంగా అవగాహన కల్పించేందుకు స్టిమ్యూలేటర్ ఏర్పాటు చేయాలి.
► శిక్షకులు కనీసం ఇంటర్మీడియట్ పాస్ కావడంతో పాటు కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
► ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్ల డ్రైవింగ్ శిక్షణా కాలం కనీసం నాలుగు వారాల్లో 29 గంటల పాటు ఉండాలి. వాటిలో థియరీ క్లాసులు 8 గంటలు, ప్రాక్టికల్ క్లాసులు 21 గంటల పాటు నిర్వహించాలి.
► భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణా కాలం ఆరు వారాల్లో కనీసం 38 గంటలు ఉండాలి. ఇందులో థియరీ క్లాసులు 8 గంటలు, ప్రాక్టికల్ క్లాసులు 30 గంటలు నిర్వహించాలి.
► అన్ని అర్హతలు కలిగిన డ్రైవింగ్ స్కూల్‌కు ఐదేళ్ల పాటు గుర్తింపు ఇస్తారు. అనంతరం రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది.
Driving License Rules 2022: ఇక డ్రైవింగ్ ‘పరీక్ష’ లేదు!
Published Mon, May 9 2022 3:35 AM | Last Updated on Mon, May 9 2022 2:11 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment