ఇలా అయితే డ్రైవింగ్ లైసెన్స్ కష్టమే! | Driving License Rules Changed: All You Need To Know | Sakshi
Sakshi News home page

ఇలా అయితే డ్రైవింగ్ లైసెన్స్ కష్టమే!

Published Sun, Jan 12 2025 1:58 PM | Last Updated on Sun, Jan 12 2025 2:25 PM

Driving License Rules Changed: All You Need To Know

డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) పొందడం మరింత కష్టతరంగా మారుతోంది. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి వచ్చే దరఖాస్తుదారులు సిమ్యులేటర్, 108 కెమెరాల పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జనవరి 16 నుంచి ప్రారంభం కానున్న డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ (DTC) డ్రైవింగ్ పరీక్షను మరింత కష్టతరం చేయనుంది. ఈ అత్యాధునిక వ్యవస్థ మోసాలను అరికట్టడంతో పాటు రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తుంది.

ఇప్పటి వరకు ఇలా..
ఇప్పటి వరకు డివిజనల్‌ రవాణాశాఖ కార్యాలయంలో మాన్యువల్‌గా డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించేవారు. ఏదో ఫార్మాలిటీగా మాత్రమే ఈ పరీక్ష ఉండేది. దీంతో డ్రైవింగ్‌ తెలియని వారు కూడా పరీక్ష రాసేవారు. ఇలా డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందినవారు వాహనాలు నడుపుతుండటంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి.

‘జనవరి 16 నుంచి డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ప్రారంభం కానుంది. ఇందులో కెమెరాలు, సిమ్యులేటర్లు ఉంటాయి. ఇది ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అందులో మోసానికి ఆస్కారం ఉండదు. డ్రైవింగ్‌ తెలిసిన వారు, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన ఉన్నవారు మాత్రమే పరీక్షలో ఉత్తీర్ణులవుతారు’ అని ప్రాంతీయ రవాణా అధికారి ప్రమోద్ కుమార్ సింగ్ చెబుతున్నారు.

ఘజియాబాద్‌లో ప్రతిరోజూ సగటున 225 మంది మాన్యువల్ డ్రైవింగ్ పరీక్షకు హాజరవుతున్నారు. అత్యాధునిక డ్రైవింగ్ టెస్ట్ కోసం డిపార్ట్‌మెంట్ డీటీసీని ఏర్పాటు చేసింది. డీటీసీ పనులు పూర్తయ్యాయి. డీటీసీలో 108 కెమెరాలను ఏర్పాటు చేశారు. కేంద్రం నిర్వహణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు.

డ్రైవర్ పరీక్ష ఏజెన్సీ పర్యవేక్షణలో జరుగుతుంది. అయితే పరీక్షలో అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారా లేదా విఫలమయ్యారా అనేది అధికారులు నిర్ణయిస్తాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అభ్యర్థుల ప్రతి కదలికనూ వీడియో రికార్డింగ్‌ చేస్తారు.

దరఖాస్తుదారు డ్రైవింగ్‌తో పాటు ట్రాఫిక్ నియమాలన్నింటినీ తెలుసుకోవాలి. డ్రైవింగ్‌తో పాటు ప్రతి నియమం తెలిస్తేనే పరీక్షలో ఉత్తీర్ణులవుతారు. దీంతో టెస్టింగ్‌లో మోసాలు పూర్తిగా నిలిచిపోతాయి. 108 కెమెరాల వీడియో రికార్డును కేంద్రంలో భద్రంగా ఉంచుతారు. ఇది భవిష్యత్తులో ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు.

సిమ్యులేటర్ అంటే ఏమిటి?
సిమ్యులేటర్ అనేది నిజమైన కారుకు ప్రతిరూపం. ఇందులో స్టీరింగ్ వీల్, గేర్లు, బ్రేక్‌లు, పెడల్స్, సూచికలు,  స్విచ్‌లు, స్పీడ్ కంట్రోల్ అన్నీ ఉంటాయి. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ సిమ్యులేటర్ నడుస్తుంది. డ్రైవింగ్ ప్రవర్తనను అధ్యయనం చేయడానికి దీనిని ప్రయోగశాలగా కూడా వ్యవహరిస్తారు. దీని ద్వారా ఎకో డ్రైవింగ్ శిక్షణ కూడా అందించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement