సాక్షి, అమరావతి: ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక డ్రైవింగ్ స్కూలు చొప్పున ఏర్పాటుకు ఆర్టీసీతో కలసి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ సదుపాయాలను ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణ తదితరాల కోసం వినియోగించుకోవచ్చని సూచించారు. రహదారి భద్రత నిధికి సంబంధించి ప్రత్యేకంగా ఖాతా, అధికారులతో లీడ్ ఏజెన్సీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర రహదారి భద్రతా మండలి (ఆంధ్రప్రదేశ్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్) సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
ట్రామా కేర్ సెంటర్లు
కొత్త జిల్లాలకు అనుగుణంగా ప్రతి చోటా ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్ కళాశాలల్లో కూడా ట్రామా కేర్ సెంటర్లను నెలకొల్పాలన్నారు. అత్యాధునిక పద్ధతుల్లో అత్యవసర సేవలు అందించాలని స్పష్టం చేశారు. ప్రమాదాలకు గురైన వారు కోలుకునేందుకు వీలుగా సహాయ, పునరావాస కేంద్రాన్ని విశాఖలో ఉంచాలని, తిరుపతి బర్డ్ ఆస్పత్రిలోని కేంద్రాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు.
వేర్వేరుగా లేన్ మార్కింగ్
రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు లేన్ మార్కింగ్ చాలా స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బైక్‌లు, నాలుగు చక్రాల వాహనాలకు విడివిడిగా ప్రత్యేక లైన్ల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. ఎంత వేగంగా వెళ్లవచ్చో సూచిస్తూ బోర్డులు అమర్చడం ద్వారా చాలావరకు ప్రమాదాలు తగ్గే ఆస్కారం ఉందన్నారు.
1,190 బ్లాక్ స్పాట్స్..
రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాలకు ఆస్కారం ఉన్న 1,190 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించడంతో పాటు 520 చోట్ల నివారణ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారులపై కూడా 78 బ్లాక్ స్పాట్స్‌ను సవరించినట్లు చెప్పారు. రహదారుల పక్కన నిర్వహించే ధాబాల్లో మద్యం విక్రయించకుండా అరికట్టడం ద్వారా చాలావరకు ప్రమాదాలు తగ్గుతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యమైన రోడ్ల పక్కన యాక్సెస్ బారియర్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
లైసెన్స్ విధానాన్ని పునఃసమీక్షించాలి
ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని పునఃసమీక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలన్నారు. జిల్లాలవారీగా ఏర్పాటవుతున్న కమిటీలు కూడా రోడ్డు ప్రమాదాలు, తీసుకుంటున్న చర్యలను పరిశీలించాలన్నారు.
108 ఆపద్బాంధవి..
రోడ్డు ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలను కాపాడటంలో 108 అంబులెన్స్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు తెలిపారు. నిర్దేశిత సమయంలోగా పేషెంట్లను ఆస్పత్రులకు చేర్చాలన్న నిబంధన ప్రాణ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గోల్డెన్ అవర్‌లోగా ఆస్పత్రులకు చేర్చడంతో చాలామంది ప్రాణాలు నిలబడుతున్నాయని తెలిపారు. సమావేశంలో రహదారులు, భవనాల శాఖ మంత్రి ఎం.శంకర నారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, లా సెక్రటరీ వి.సునీత, రవాణాశాఖ కమిషనర్ పి.సీతారామాంజనేయలు తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్ సిగ్నల్..
► పోలీసు, రవాణా, హెల్త్, రోడ్ ఇంజనీరింగ్ నిపుణులతో రోడ్ సేఫ్టీపై లీడ్ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం.
► క్షతగాత్రులకు నగదు రహిత చికిత్స అందించేలా నెట్‌వర్క్ ఆస్పత్రులకు ప్రోత్సాహం.
► రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తరలించే వారికి మద్దతు
► ‘ఐరాడ్’ (ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటా బేస్) యాప్ ద్వారా ప్రమాదాలపై పోలీసులకు లైవ్ అప్‌డేట్
► పీపీపీ పద్ధతిలో రవాణాశాఖ ద్వారా ఆటోమేటెడ్ ఎఫ్‌సీ టెస్టింగ్ ఏర్పాటుపై కార్యాచరణ
► రోడ్డు ప్రమాద బాధితులకు బీమా పరిహారం దక్కేలా ప్రత్యేక చర్యలు
Comments
Please login to add a commentAdd a comment