Transportation Department
-
ఇక డ్రైవింగ్ ‘పరీక్ష’ లేదు!
సాక్షి, అమరావతి: ఇకపై లైసెన్సు కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ టెస్టులకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్లో నిర్దేశిత శిక్షణ పూర్తి చేసి సర్టిఫికెట్ పొందితే చాలు.. రవాణా శాఖ కార్యాలయం డ్రైవింగ్ లైసెన్సును మంజూరు చేయనుంది. అదే సమయంలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల గుర్తింపు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ‘డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు–2022’ నోటిఫికేషన్‌ను ఇటీవల జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలు ఈ ఏడాది జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుత విధానంతో పాటు ఇది కూడా కొనసాగనుంది. కొత్త విధానాన్ని ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. లైసెన్సుల జారీ సులభతరం.. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి పరీక్ష పాస్ కావాలి. థియరీ, ప్రాక్టికల్ పరీక్షల్లో అర్హత సాధించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చే విధానం ప్రకారం.. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆ శిక్షణా కేంద్రం జారీ చేసే సర్టిఫికెట్ కాపీతో పాటు అవసరమైన గుర్తింపు కార్డుల కాపీలు జతచేసి దరఖాస్తు చేస్తే రవాణా శాఖ డ్రైవింగ్ లైసెన్సు ఇస్తుంది. దీనివల్ల లైసెన్సుల కోసం నిరీక్షించే సమయం తగ్గుతుందని.. లైసెన్సుల జారీ విధానం సరళతరం, సులభతరం అవుతుందన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. నిబంధనలు కఠినతరం.. ఈ ప్రక్రియలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల పాత్ర కీలకం కానుండటంతో.. గుర్తింపు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. గుర్తింపు పొందిన శిక్షణా కేంద్రం జారీ చేసే సర్టిఫికెట్‌ను మాత్రమే రవాణా శాఖ పరిగణనలోకి తీసుకోనుంది. ► ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్ల డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే.. ట్రాక్ కోసం కనీసం ఎకరా భూమి ఉండాలి. భారీ వాహనాల డ్రైవింగ్ స్కూల్‌కు అయితే కనీసం 2 ఎకరాల భూమి ఉండాలి. వాటిలో కేంద్ర మార్గదర్శకాల ప్రకారం టెస్టింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలి. ► డ్రైవింగ్‌పై ప్రాథమికంగా అవగాహన కల్పించేందుకు స్టిమ్యూలేటర్ ఏర్పాటు చేయాలి. ► శిక్షకులు కనీసం ఇంటర్మీడియట్ పాస్ కావడంతో పాటు కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. ► ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్ల డ్రైవింగ్ శిక్షణా కాలం కనీసం నాలుగు వారాల్లో 29 గంటల పాటు ఉండాలి. వాటిలో థియరీ క్లాసులు 8 గంటలు, ప్రాక్టికల్ క్లాసులు 21 గంటల పాటు నిర్వహించాలి. ► భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణా కాలం ఆరు వారాల్లో కనీసం 38 గంటలు ఉండాలి. ఇందులో థియరీ క్లాసులు 8 గంటలు, ప్రాక్టికల్ క్లాసులు 30 గంటలు నిర్వహించాలి. ► అన్ని అర్హతలు కలిగిన డ్రైవింగ్ స్కూల్‌కు ఐదేళ్ల పాటు గుర్తింపు ఇస్తారు. అనంతరం రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. -
ఏదీ నిఘా.. ఉత్తుత్తి చర్యగా మారిన లైసెన్స్ రద్దు
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖ రద్దు చేసిన డ్రైవింగ్ లైసెన్సులపైన నిఘా కొరవడింది. సాధారణంగా ఒకసారి లైసెన్సు రద్దయ్యాక ఆరు నెలల పాటు సదరు వాహనదారుడు బండి నడిపేందుకు వీలులేదు. 6 నెలల అనంతరం తిరిగి డ్రైవింగ్ లైసెన్సును పునరుద్ధరించుకున్న తరువాత మాత్రమే వాహనం నడిపేందుకు అనుమతి లభిస్తుంది. అయితే ఆర్టీఏ, పోలీసుల మధ్య సమన్వయ లోపం కారణంగా లైసెన్సుల రద్దు ప్రక్రియ ఉత్తుత్తి ప్రహసనంగా మారింది. నగరంలో రోడ్డు ప్రమాదాలు, మద్యంసేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపైన ఏటా వేల సంఖ్యలో లైసెన్సులు రద్దవుతున్నాయి. కానీ ఇలా రద్దయిన వాహనదారులు యధేచ్చగా రోడ్డెక్కేస్తూనే ఉన్నారు. మరోవైపు మోటారు వాహన నిబంధనల మేరకు డ్రైవింగ్ లైసెస్సు రద్దయినట్లు ఎలాంటి సమాచారం కానీ, హెచ్చరికలు రద్దయినట్లు సదరు వాహనదారులకు అందకపోవడం వల్ల అదే పనిగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. రద్దులోనూ జాప్యం... నగరంలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ప్రతి రోజు పదుల సంఖ్యలో పట్టుబడుతున్నారు. ఇలా వరుసగా డ్రంకెన్ డ్రైవ్‌లలో పట్టుపడిన వారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు ఆర్టీఏను సంప్రదిస్తారు. ఆన్లైన్ ద్వారా ఆర్టీఏ అధికారులకు డేటా అందజేయాల్సి ఉంటుంది. కానీ పోలీసులు స్వాధీనం చేసుకున్న లైసెన్సుల వివరాలను ఎప్పటికప్పుడు రవాణాశాఖకు చేరవేయడంలో జాప్యం చోటుచేసుకుంటుంది. ఉదాహరణకు జనవరిలో పట్టుకున్న నిందితుల డేటాను మార్చి నెలలో ఆర్టీఏకు చేరవేస్తున్నారు. దీంతో మార్చి నుంచి 6 నెలల పాటు అమలయ్యే విధంగా ఆర్టీఏ సదరు డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తుంది. కానీ జనవరిలో పట్టుబడిన నిందితులు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి యధావిధిగా తిరుగుతున్నారు. మార్చి నుంచి ఆరు నెలల పాటు రద్దయిన సమాచారం కూడా వాహనదారులకు సకాలంలో అందడం లేదు. ఎం–వాలెట్లో చూడాల్సిందే... రద్దయిన డ్రైవింగ్ లైసెన్సుల వివరాలు ఆర్టీఏ ఎం–వాలెట్లో మాత్రమే నమోదవుతున్నాయి. ఎం–వాలెట్ యాప్ కలిగి ఉన్న వాహనదారులు ఆ యాప్‌లో తమ డ్రైవింగ్ లైసెన్సు ఏ స్థితిలో ఉందో తెలుసుకుంటే మాత్రమే సస్పెండ్ అయినట్లుగా నోటిఫికేషన్ కనిపిస్తుంది. కానీ పోలీసులు, ఆర్టీఏ నిఘా లేకపోవడం వల్ల డ్రైవింగ్ లైసెన్సులు లేకపోయినా యధేచ్చగా రోడ్డెక్కుతున్నారు. (చదవండి: పక్కాగా ప్లాన్ చేసిన దొరికిపోయాడు!....కథ మొత్తం కారు నుంచే..) -
రాష్ట్రేతర వాహనాలపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా అరకు సమీపంలోని అనంతగిరి మండలం డముకు మలుపు వద్ద ప్రైవేటు బస్సు ఘోర ప్రమాదానికి గురైన నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర పరిధిలోని రవాణా శాఖ చెక్ పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల కండిషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్లను సమగ్రంగా పరిశీలించిన తరువాతే వాటిని రాష్ట్రంలోకి అనుమతించాలని ఆదేశాలిచ్చింది. ఈ విషయంలో అలక్ష్యం వహిస్తే అధికారులపై వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. అన్ని చెక్‌పోస్టుల్లో అంతర్ రాష్ట్ర పర్మిట్లపై కఠిన ఆంక్షలు జారీ అయ్యాయి. అక్రమంగా ప్రవేశిస్తే ఐదు రెట్ల జరిమానా ఏపీలోకి ప్రవేశించే పొరుగు రాష్ట్రాల వాహనాలకు సంబంధించిన పన్నులను ఆన్లైన్లో చెల్లించే అవకాశం కల్పించారు. ఈ పన్నులు వారానికి, నెలకు చొప్పున చెల్లిస్తారు. ఆఫ్లైన్లోనూ ఈ పన్నులు కట్టించుకుంటున్నారు. పన్ను చెల్లించకుండా ఏదైనా వాహనం రాష్ట్రంలో తిరుగుతూ పట్టుబడితే ఐదు రెట్ల జరిమానా విధించాలని రవాణా అధికారులు ప్రతిపాదించారు. రెండో డ్రైవర్ ఉండాల్సిందే టూరిస్ట్, కాంట్రాక్ట్ క్యారియర్ బస్సుల్లో రెండో డ్రైవర్ నిబంధనను కచ్చితంగా పాటించేలా చూడాలని రవాణా శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర పరిధిలోని ప్రజా రవాణా వాహనాలకు సైతం రెండో డ్రైవర్ ఉండాలని పేర్కొంది. డముకు మలుపు వద్ద బస్సు లోయలో పడిపోవడానికి దాని డ్రైవర్‌కు విశ్రాంతి లేకపోవడమే కారణమని గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. డ్రైవర్ అలసటకు గురి కావడం, నిద్ర లేమి వల్ల ఆ ప్రమాదం జరిగిన దృష్ట్యా డ్రైవర్లు విధిగా 8 గంటల డ్యూటీపై నిబంధన పాటించాలని, ఆ దిశగా తనిఖీలు చేయాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. చెక్‌పోస్టుల్లో తనిఖీల సందర్భంగా అశ్రద్ధ వహిస్తే అక్కడ పనిచేసే ఎంవీఐ, ఏఎంవీఐలపై వేటు తప్పదని రవాణా శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
అతిక్రమణకు తప్పదు భారీ మూల్యం!
సాక్షి, అమరావతి: రహదారి భద్రతకు సంబంధించి ఉల్లంఘనలు, నేరాలకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ నిబంధనను ప్రభుత్వం కఠినంగా అమలు చేయనుంది. నిబంధనలను ఉల్లంఘించిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలల కంటే తక్కువగా సస్పెండ్ చేయాలని అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్ (డీసీ)లను రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు ఆదేశించారు. ప్రస్తుతం పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి వారి లైసెన్స్‌లు సస్పెండ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమైన 4 కేటగిరీల్లో డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని, ఈ నిబంధన కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నాలుగు కేటగిరీలు ఇవే.. కేంద్ర మోటారు వాహన చట్టం సెక్షన్ 19 కింద డ్రైవింగ్ లైసెన్స్‌లు సస్పెండ్ చేస్తారు. అధిక వేగంతో వెళ్లినా..ఓవర్ లోడ్‌తో వాహనం నడుపుతున్నా, మద్యం సేవించి వాహనం నడిపినా, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడిపినా డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తారు. మోటార్ వాహన చట్టం 206(4) సెక్షన్ కింద ఉల్లంఘనలకు పాల్పడినా.. లైసెన్స్ సస్పెండ్ చేయాలని అధికారులను రవాణా శాఖ ఆదేశించింది. ఈ ఉల్లంఘనలకు పాల్పడితే 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోవాల్సి ఉంటుంది. రవాణా శాఖ కార్యాలయాల్లో ప్రీ ఎల్ఎల్ఆర్ (లెర్నర్ లైసెన్స్ ఇచ్చే ముందు) దరఖాస్తుదారులకు ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నిర్వహించాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఇందుకుగాను విజయవాడ, విశాఖలలో సేఫ్టీ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. 2022 మార్చి కల్లా అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో ఈ సెంటర్లు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. శిక్షణకు హాజరైతేనే ఎల్ఎల్ఆర్ రవాణా శాఖ కార్యాలయాల్లో లెర్నర్ లైసెన్స్‌లకు స్లాట్ బుక్ చేసుకున్న దరఖాస్తుదారులు ముందుగా 2 గంటల పాటు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సహకారం అందించేందుకుగాను హోండా మోటార్ సైకిల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చింది. ఎల్ఎల్ఆర్ పరీక్షలకు హాజరయ్యే దరఖాస్తుదారులకు ఈ శిక్షణ ఉపయోగకరంగా ఉంటుందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రహదారి భద్రతకు సంబంధించి వాహనదారుల్లో అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే ఈ శిక్షణ అవసరమని రవాణా శాఖ భావిస్తోంది. ఎల్ఎల్ఆర్ దరఖాస్తుదారులు కచ్చితంగా శిక్షణ కార్యక్రమానికి హాజరైతేనే ఎల్ఎల్ఆర్ మంజూరు చేస్తారు. -
డెమో కారిడార్లుగా డేంజర్ రోడ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రమాదకరంగా ఉన్న రాష్ట్ర రహదారులు ఇకపై డెమో కారిడార్లుగా మారనున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ వంద కిలోమీటర్ల చొప్పున వీటిని ఏర్పాటు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రహదారి భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీకి తాజాగా నివేదిక పంపింది. డెమో కారిడార్లతో ప్రమాదాల శాతం తగ్గుతుందని పేర్కొంది. రేణిగుంట–రాయలచెరువు కారిడార్‌తో సత్ఫలితాలు వచ్చాయని తెలిపింది. దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలన్నిటినీ గుర్తించి ఆయా చోట్ల డెమో కారిడార్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపింది. జిల్లాల్లో ఏ రాష్ట్ర రహదారిపై అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో త్వరలో నివేదికలు ఇవ్వాల్సిందిగా ఆయా జిల్లాల్లో రోడ్డు భద్రతా కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న కలెక్టర్లను కోరామని వివరించింది. మొత్తం 1,300 కి.మీ మేర ► 13 జిల్లాల్లో 1,300 కి.మీ. మేర రాష్ట్ర రహదారులపై డెమో కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో డెమో కారిడార్‌కు రూ.30 కోట్లకు పైగా వెచ్చించనున్నారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న జిల్లాలకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. ► ఇప్పటికే కడప, అనంతపురం జిల్లాల మధ్య 139 కి.మీ మేర రేణిగుంట–రాయలచెరువు డెమో కారిడార్ ఉంది. తాజాగా ఇవే జిల్లాల్లో రాజంపేట–రాయచోటి–కదిరి మధ్య మరో డెమో కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ► అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న గుంటూరు జిల్లాలోని కొండమోడు–పేరేచర్ల, కృష్ణా జిల్లాలోని విజయవాడ–పునాదిపాడు, నూజివీడు–పశ్చిమ గోదావరిలోని భీమవరం మధ్య డెమో కారిడార్ ప్రతిపాదించారు. రూ.2.5 కోట్లతో రోడ్ సేఫ్టీ ఆడిట్ రాష్ట్రంలో వెయ్యి కిలోమీటర్ల మేర రూ.2.5 కోట్లతో రోడ్ సేఫ్టీ ఆడిట్ (రోడ్డు భద్రత పరిశీలన)ను ప్రారంభించినట్లు రవాణా శాఖ తెలిపింది. ఇకపై కొత్తగా 5 కి.మీ. రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నా..రోడ్ సేఫ్టీ ఆడిట్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు వివరించింది. రాష్ట్రంలో ఇప్పటికే రూ.25 కోట్ల విలువైన బ్లాక్‌స్పాట్ (ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతం)ల మెరుగుదల పనులు జరిగాయని, మరో రూ.50 కోట్ల పనులు కొనసాగుతున్నట్లు వివరించింది. అలాగే రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, మోటారు వాహన చట్టం అమలు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు విధిస్తున్న జరిమానాలు తదితర వివరాలతో సమగ్ర నివేదికను పంపింది. రేణిగుంట–రాయలచెరువు కారిడార్‌తో సత్ఫలితాలు ► 2012లో రేణిగుంట–రాయలచెరువు మధ్య డెమో కారిడార్ ఏర్పాటు చేసేందుకు ప్రపంచ బ్యాంకు రూ.36 కోట్లు అందజేసింది. ► 2013లో ఈ రహదారిలో 250 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా.. కారిడార్ ఏర్పాటు తర్వాత ప్రమాదాలు క్రమంగా తగ్గుతున్నాయి. 2015 నాటికి సగానికి తగ్గగా, 2017 నాటికి వంద వరకు నమోదయ్యాయి. ఇక 2018 నాటికి పదుల సంఖ్యలోనే ప్రమాదాలు నమోదు కావడం గమనార్హం. డెమో కారిడార్ అంటే... డెమో కారిడార్ అంటే ప్రమాదాలకు అంతగా అవకాశం లేనిరోడ్డు. డెమో కారిడార్ కింద తొలుత ఆ రహదారిని మలుపులు లేకుండా నిర్మిస్తారు. ఎక్కడికక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఎక్కడా గుంతలు లేకుండా చూస్తారు. నిర్దేశిత బరువున్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. వాహనాల బరువును చూసేందుకు ఆయా రోడ్లలో వే బ్రిడ్జిలు (కాటా యంత్రాలు) ఏర్పాటు చేస్తారు. ప్రమాదం జరిగితే వెంటనే ఆస్పత్రికి చేర్చేలా అంబులెన్స్‌లు కూడా అందుబాటులో ఉంచుతారు. -
ఫాస్టాగ్ యూజర్లు 57 శాతమే!
సాక్షి, అమరావతి: ఏపీలో ప్రస్తుతం ఫాస్టాగ్ యూజర్లు 57 శాతం వరకు ఉన్నట్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అంచనా వేస్తోంది. టోల్గేట్ల వద్ద ఫాస్టాగ్ లైన్ ద్వారా ప్రస్తుతం 50 నుంచి 57 శాతం వాహనాలు మాత్రమే వెళుతున్నట్టు లెక్కగట్టింది. ఈ నెలాఖరు నాటికి 90 శాతం వాహనాలకు ఫాస్టాగ్ ఉండేలా.. టోల్గేట్ల వద్ద ప్రత్యేకంగా ఫాస్టాగ్ స్టిక్కర్లను విక్రయించే కౌంటర్లు ఏర్పాటు చేసింది. జనవరి 1 నుంచి అన్ని టోల్గేట్లలో ఫాస్టాగ్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి నుంచి నగదు చెల్లించే లైన్లను తొలగించాలంటూ టోల్ ప్లాజాల నిర్వాహకులకు ఆదేశాలందాయి. ఏ వాహనమైనా ఫాస్టాగ్ లేకుండా టోల్గేట్ల వద్దకు వస్తే.. వెనక్కి పంపిస్తారు. మొండికేసి ముందుకు వెళ్దామంటే రెట్టింపు ఫీజు వసూలు చేస్తారు. మరోవైపు ఫాస్టాగ్ ఉంటేనే రవాణా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలని రవాణా శాఖ సైతం ఆదేశాలు జారీ చేసింది. ఫాస్టాగ్ అంటే.. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ (ఆర్ఎఫ్ఐడీ)తో కూడిన స్టిక్కర్‌ను ఫాస్టాగ్ అంటారు. 2014లోనే ఫాస్టాగ్ విధానాన్ని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అమల్లోకి తెచ్చింది. వాహనాలకు అతికించి ఉండే ఈ స్టిక్కర్‌పై గల బార్‌కోడ్‌ను టోల్‌ప్లాజాలోని ఆర్ఎఫ్ ఐడీ యంత్రం రీడ్ చేస్తుంది. వాహనం టోల్ ప్లాజా దాటుతున్నప్పుడు టోల్ ఫీజును సం బంధిత వాహన యజమాని ఫాస్టాగ్‌కు రీచార్జి చేయించుకున్న మొత్తం నుంచి ఆటోమేటిక్‌గా మినహాయించుకుంటుంది. బ్యాంక్ ఖాతాతో అనుసంధానించిన ఫోన్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు కానున్న ‘వన్ నేషన్.. వన్ ట్యాగ్’ కింద అన్ని టోల్గేట్లలో ఫాస్టాగ్ విధానాన్ని కచ్చితంగా అమలు చేయనున్నారు. కనీసం రూ.వందతో ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ పొందవచ్చు. రాష్ట్ర రహదారులపైనా.. స్టేట్ హైవేస్‌పై ఉన్న టోల్‌ప్లాజాల్లోనూ ఫాస్టాగ్ అమలు చేయాలని ఎన్హెచ్ఏఐ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఆర్ అండ్ బీ అధికారులతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. టోల్గేట్లలో ఆర్ఎఫ్ ఐడీ యంత్రాలు పెట్టేందుకు అయ్యే ఖర్చులో 50 శాతాన్ని ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ భరిస్తుంది. ఇవీ ఉపయోగాలు ► ఇంధనం, టోల్గేట్ల వద్ద వేచి ఉండే సమయం ఆదా అవుతాయి. ► పొల్యూషన్ తగ్గుతుంది. ట్రాఫిక్ సమస్యలుండవు. ► ఫాస్టాగ్ ఉన్న వాహనం చోరీ అయితే.. ఆ వాహనం టోల్‌ప్లాజా దాటితే ఎక్కడ దాటిందో.. ఏ సమయంలో దాటిందో ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. వాహనాన్ని కనిపెట్టే ఆస్కారం కలుగుతుంది. ► టోల్ ఫీజుల వసూళ్లు క్యాష్‌లెస్ విధానంలో సాగటం వల్ల వాహనదారునికీ ఇబ్బందులు తప్పుతాయి. -
‘కాలుష్య’ వాహనాలపై కొరడా
సాక్షి, అమరావతి: కాలుష్య నియంత్రణ పాటించని వాహనాలపై కొరడా ఝుళిపించేందుకు రవాణా శాఖ సమాయత్తమైంది. నిబంధనలు, ప్రమాణాలు పాటించని వాహనాల పర్మిట్లు, రిజిస్ట్రేషన్ కార్డులు సస్పెన్షన్ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలకు రవాణా అధికారులు రంగంలోకి దిగారు. రవాణా అధికారులు నిర్వహించే పొల్యూషన్ టెస్ట్‌లలో ఫెయిలైయితే వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేయనున్నారు. వాహనాల యజమానులు ఎప్పటికప్పుడు కాలుష్య పరీక్షలు చేయించుకోవాలని రవాణా శాఖ సూచించింది. పొల్యూషన్ పరీక్షలు చేయించి ప్రతి వాహనదారుడు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ పొందాలి. కార్లు, ఇతర వాహనాలకు కార్బన్ మోనాక్సైడ్ 0.3 శాతం, హైడ్రో కార్బన్ 200 పీపీఎంలోపు ఉండాలి. కాలుష్య ఉద్గారాలు ఇంతకు మించి ఉంటే రవాణా శాఖ చర్యలు తీసుకుంటుంది. కాలం చెల్లిన వాహనాలపైనా అధికారులు దృష్టి సారించారు. -
మహిళల రక్షణకు రవాణా శాఖ ప్రత్యేక యాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించేందుకు, వారికి పూర్తి భద్రత కల్పించేందుకు రవాణా శాఖ కొత్తగా యాప్ ఆధారిత ప్రాజెక్టు చేపట్టనుంది. ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు దీన్ని అమలు చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం భాగస్వామ్యంతో ప్రాజెక్టుకు నిధులు కేటాయించనున్నాయి. కేంద్రం తన వాటా నిధులు అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కేంద్రం తన వాటాగా రూ.56 కోట్ల వరకు నిధులు కేటాయించినా చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.135 కోట్లు్ల వెచ్చించనున్నాయి. ప్రాజెక్టు అమలు ఇలా.. ► రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్‌లలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) బాక్స్‌లు అమరుస్తారు. వీటితోపాటు రవాణా శాఖ యాప్‌ను రూపొందిస్తుంది. ► మహిళలకు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైతే మొబైల్ యాప్ నుంచి వాహనం నంబర్ పంపితే వాహనం ఎక్కడుందో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) ద్వారా ఇట్టే తెలుసుకుని పట్టుకోవచ్చు. ► రాష్ట్రంలో 4.50 లక్షల ఆటోలు, లక్ష వరకు క్యాబ్‌లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ► ఈ వాహనాలకు దశల వారీగా ఐవోటీ బాక్సులు అమరుస్తారు. వీటిని రవాణా, పోలీస్ శాఖ సిబ్బంది పర్యవేక్షిస్తారు. ► ఐవోటీ బాక్సులను వాహనాల ఇంజన్ల వద్ద అమరుస్తారు. ఆ తర్వాత డ్రైవర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ కార్డులు జారీ చేస్తారు. ఈ కార్డులను ఐవోటీ బాక్సుకు స్వైప్ చేస్తేనే ఆటో స్టార్ట్ అవుతుంది. ► యాప్ వాడకం తెలియని మహిళలు ఐవోటీ బాక్స్‌కు ఉండే క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వెంటనే కంట్రోల్ రూమ్‌కు అనుసంధానమవుతుంది. ► మహిళలకు ఇబ్బందులు ఎదురైతే ప్యానిక్ బటన్ నొక్కితే వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారమందిస్తుంది. ► పైలెట్ ప్రాజెక్టుగా తొలుత విజయవాడలో అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. ► ఇక్కడ ముందుగా 100 ఆటోల్లో ఐవోటీ బాక్సులు ఏర్పాటు చేసి త్వరలో ప్రాజెక్టు అమలు తీరుతెన్నులు పరిశీలించనున్నారు. ► అక్టోబర్‌లో సీఎం జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు ఈ యాప్‌ను ప్రారంభించనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడతాం గతంలో అమలు చేయలేకపోయిన ఈ ప్రాజెక్టుపై మంత్రి పేర్ని నానితో ఇప్పటికే చర్చించాం. మహిళల భద్రత ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపడతాం. – పీఎస్సార్ ఆంజనేయులు, రవాణా శాఖ కమిషనర్ -
ఫోర్జరీ జేసీ.. వాహనాల కొనుగోల్‌మాల్
సాక్షి, అమరావతి/అనంతపురం సెంట్రల్: అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేతలైన జేసీ బ్రదర్స్ అక్రమ వ్యవహారాలు విస్తుగొలుపుతున్నాయి. జేసీ బ్రదర్స్‌కు చెందిన కంపెనీ చేసిన అక్రమాలు రవాణా శాఖ చరిత్రలోనే ఎన్నడూ జరగలేదు. ప్రైవేట్ ట్రావెల్స్ వ్యాపారంలో వీరి అక్రమాలకు అంతు లేకుండా పోయింది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతూ బస్సుల్ని తిప్పి అక్రమాలకు తెగబడ్డారు. దొంగ పర్మిట్లతో బస్సులు నడపడం ఓ ఎత్తు అయితే.. తాజాగా బయల్పడిన దొంగ రిజిస్ట్రేషన్ల వ్యవహారంతో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిషేధిత బీఎస్–3 వాహనాలను బీఎస్–4 వాహనాలుగా చూపి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన వ్యవహారం కలకలం రేపింది. ఈ అక్రమ వ్యవహారాన్ని రవాణా రంగ నిపుణులు నేషనల్ ఫ్రాడ్‌గా పేర్కొంటున్నారంటే దీని తీవ్రత ఎంతో ఇట్టే అర్థం అవుతోంది. దివాకర్ రోడ్లైన్స్కు చెందిన రెండు బస్సులకు నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లు సమర్పించి ఇతర రాష్ట్రాల వారికి విక్రయించిన ఘటనలో ఆర్టీఏ అధికారుల ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను పోలీసులు శనివారం అరెస్టు చేసిన నేపథ్యంలో వారి బాగోతాల చిట్టాలో కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి. అధికారులు సీజ్ చేసిన లారీల ఛాసీలు బీఎస్4 పేరుతో అక్రమాలు – బీఎస్–3 శ్రేణి వాహనాలను అత్యధికంగా కాలుష్యం వెదజెల్లే వాహనాలుగా గుర్తించిన సుప్రీంకోర్టు 2017 మార్చి 29న వాటి తయారీని నిషేధించింది. 2017 ఏప్రిల్ 1 తర్వాత ఈ వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో విక్రయాలు, రిజిస్ట్రేషన్ చేయరాదని ప్రకటించింది. – అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో అప్పటి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ట్రాన్స్‌పోర్టు రంగంలో సుదీర్ఘ కాలంగా ఉన్న అనుభవంతో అశోక్ లైలాండ్ కంపెనీకి చెందిన లారీలు, టిప్పర్లను కారుచౌకగా కొట్టేయాలని భావించారు. – జేసీ ప్రభాకర్‌రెడ్డి భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిలకు చెందిన జఠాధర ఇండస్ట్రీస్, జేసీ ప్రభాకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గోపాల్‌రెడ్డికి చెందిన సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీలు.. గడువు మీరిపోయి విక్రయం కాకుండా నిలిచిపోయిన 154 లారీలను నాగాలాండ్‌కు వెళ్లి అశోక్ లైలాండ్ కంపెనీ నుంచి తుక్కు(స్క్రాప్) కింద అతి తక్కువ ధరకు కొనుగోలు చేశాయి. – ఒకేసారి 154 వాహనాలను జఠాధర కంపెనీ పేరుతో జేసీ ఉమారెడ్డి పేరు మీద, సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీతో సి.గోపాల్‌రెడ్డి పేర్ల మీద తప్పుడు పత్రాలు సమర్పించి 2018లో నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత కొన్ని లారీలను వారే నిర్వహిస్తుండగా మరికొన్నింటిని ఇతర లారీ ఓనర్లకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. నకిలీ పత్రాలతో బీమా కంపెనీలను బురిడీ కొట్టించారు. ఇలా బట్టబయలు.. – ఈ వాహనాలు రాష్ట్రంలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తిప్పుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో తొలుత 66 వాహనాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఈ ఏడాది జనవరి 10న అశోక్ లే లాండ్ కంపెనీకి ఏపీ రవాణా అధికారులు లేఖ రాశారు. అ కంపెనీ అదే నెల 23న పూర్తి వివరాలు పంపించింది. – కాలం చెల్లిన బీఎస్–3కి చెందిన 66 వాహనాలలో 40 వాహనాలను తాడిపత్రికి చెందిన సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీకి, మరో 26 వాహనాలను జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్‌కు తుక్కు కింద విక్రయించినట్లు అశోక్ లే లాండ్ కంపెనీ తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన రవాణా శాఖ ప్రధాన రికార్డులను పరిశీలించింది. – ఆ వాహనాలన్నింటినీ నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత ఎన్ఓసీ తీసుకుని అనంతపురం జిల్లాకు తరలించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తేలింది. అనంతరం రవాణా శాఖ, అనంతపురం జిల్లా పోలీసు శాఖకు చెందిన అధికారుల బృందం నాగాలాండ్ రా«జధాని కోహిమాలో రవాణా శాఖ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి వివరాలు సేకరించగా అక్రమాల డొంక కదిలింది. – వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఈ రెండు కంపెనీలు ఇచ్చిన అశోక్ లే లాండ్ కంపెనీ ఇన్వాయిస్లలో ఎక్కడా ఒకదానితో మరొక దానికి పోలిక లేకుండా వేర్వేరు తేదీలతో ఉన్నాయి. పైగా ఇన్వాయిస్లను మార్చి సమర్పించిన ఈ రెండు కంపెనీలు తమ వాహనాలన్నింటికీ రిజిస్ట్రేషన్ పొందాయి. – ఉత్తరాఖండ్‌లోని కళ్యాణ్పూర్, తమిళనాడు హోసూరులో ఉన్న అశోక్ లే లాండ్ కంపెనీలు ఆ ఇన్వాయిస్లు ఇచ్చాయి. ఆ వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసినప్పటికీ, అవి రహదారులపై తిరగడానికి ఫిట్‌గా ఉన్నట్లు రికార్డులు సృష్టించి వాటిని యథేచ్ఛగా నడిపారు. తాడిపత్రిలో గత శుక్రవారం అధికారులు సీజ్ చేసిన బీఎస్3 టిప్పర్లు కేసు నమోదు – వీటన్నింటి నేపథ్యంలో అనంతపురం 1వ టౌన్ పోలీసు స్టేషన్లో జేసీ బ్రదర్స్ కంపెనీపై రవాణా శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. – జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీ యజమానులు, వారి భాగస్వాములతో పాటు, ఆయా సంస్థల ప్రతినిధులపై చర్య తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పోలీసులు క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. తదనంతరం మరింత లోతుగా దర్యాప్తు చేస్తే దిగ్భ్రాంతి గొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫిట్‌గా ఉన్నాయంటూ తప్పుడు పత్రాలు – తుక్కు కింద బీఎస్–3 ప్రమాణాలతో కూడిన 154 వాహనాలను ఈ రెండు కంపెనీలు కొనుగోలు చేశాయి. జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ 50 వాహనాలు కొనుగోలు చేయగా, సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీ 104 వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసింది. – వీటన్నింటికీ నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లు సృష్టించి రహదారులపై తిరగడానికి ఫిట్‌గా ఉన్నాయంటూ, బీఎస్–4 ప్రమాణాలతో ఉన్నాయంటూ దేశంలో పలు చోట్ల రిజిస్ట్రేషన్ చేయించారు. వీటిలో అత్యధికం అనంతపురం జిల్లాలోనే జరిగాయి. – ఆయా వాహనాల ఛాసిస్ నంబర్లను రవాణా అధికారులు పరిశీలించగా, అన్నీ బీఎస్–3కు చెందినవేనని తేలింది. ఇదే విషయాన్ని అశోక్ లే లాండ్ కంపెనీ ప్రతినిధులు కూడా నిర్ధరించారు. – దీంతో 154 వాహనాల లావాదేవీలు నిషేధించేందుకు రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్‌కు లేఖ రాశారు. ఇందులో 28 వాహనాలను ఇప్పటికే ఎన్ఓసీపై వేరే రాష్ట్రాలకు తరలించారు. వాటికి సంబంధించి ఆయా రాష్ట్రాల రవాణా శాఖ అధికారులకు సమాచారం పంపించారు. ‘వాహన్’ డేటాబేస్‌లో అన్ని వాహనాలను బ్లాక్ చేయాలని కోరారు. – ఈ వ్యవహారానికి సంబంధించి అనంతపురం జిల్లాలో 24, కర్నూలులో 3.. మొత్తం 27 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జేసీ ఉమారెడ్డి, సి.గోపాల్‌రెడ్డిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. – ఈ 154 వాహనాల్లో ప్రస్తుతం ఆంధ్రపదేశ్‌లో 101, కర్ణాటకలో 33, తెలంగాణలో 15, నాగాలాండ్‌లో 3, తమిళనాడు, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్లు గుర్తించారు. మనరాష్ట్రంలో 79 వాహనాలు అనంతపురం జిల్లాలో, 8 నెల్లూరు, 5 చిత్తూరు, 3 కడప, 2 వాహనాలు గుంటూరు జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇప్పటి వరకు 53 వాహనాలను సీజ్ చేశారు. అక్రమాలు కప్పిపుచ్చే యత్నం – ప్రభుత్వం అక్రమాలను వెలికి తీయడంతో జేసీ సోదరులు వాటిని కప్పిపుచ్చేందుకు యత్నించారు. ఆయా వాహనాలను కొనుగోలు చేసిన వారు ఇటీవల జేసీ నివాసం వద్దకు వెళ్లి గొడవకు దిగారు. మరికొందరు వారి నివాసం వద్ద ధర్నా చేసిన దాఖాలాలు కూడా ఉన్నాయి. – పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేస్తామని హెచ్చరించడంతో జేసీ సోదరులు వారితో బేరసారాలకు దిగినట్లు తెలిసింది. ఒక్కొ లారీ యజమానికి రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఇలా 35 మందికి చెల్లించినట్లు సమాచారం. -
జేసీ బ్రదర్స్ కంపెనీపై 24 క్రిమినల్ కేసులు
సాక్షి, అమరావతి: బీఎస్–3 వాహనాలను బీఎస్–4 వాహనాలుగా చూపించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించిన జేసీ బ్రదర్స్ కంపెనీ జటాధర ఇండస్ట్రీస్‌పై 24 కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ జాయింట్ కమిషనర్ (రోడ్ సేఫ్టీ) ఎస్ఏవీ ప్రసాదరావు తెలిపారు. మంగళవారం విజయవాడ రవాణా శాఖ కార్యాలయంలో అదనపు కమిషనర్ పి.శ్రీనివాస్, జాయింట్ కమిషనర్ (ఐటీ, ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్) ఎల్ఎస్ఎం రమాశ్రీతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రసాదరావు తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే.. ► అశోక్ లేలాండ్ కంపెనీ ఉత్పత్తి చేసిన బీఎస్–3 లారీలను తుక్కు (స్క్రాప్) కింద విక్రయించగా.. వాటిని జేసీ బ్రదర్స్ కంపెనీ కొనుగోలు చేసింది. ► వాటిలో 98 లారీలను నాగాలాండ్‌లో, 32 లారీలను ఏపీలో, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో 24 లారీలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ► ప్రస్తుతం ఈ 154 లారీల్లో ఏపీలో 101, కర్ణాటకలో 33, తెలంగాణలో 15, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. మరో మూడు లారీలు గుర్తించాల్సి ఉంది. ► వీటిలో నాలుగు లారీలను బస్సులుగా మార్చి తిప్పుతున్నారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన మొత్తం లారీలను బ్లాక్ లిస్ట్‌లో ఉంచాలని రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్‌కు లేఖ రాశారు. ► జాతీయ డేటాబేస్ ‘వాహన్’ నుంచి ఈ రిజిస్ట్రేషన్లు తొలగించాలని కోరాం. ఏపీలో గుర్తించిన 101 లారీల్లో 95 లారీల రిజిస్ట్రేషన్లు రద్దు చేశాం. మిగిలిన ఆరు లారీల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం. ► ఇందులో 80 లారీలు అనంతపురం, 5 కర్నూలు, మరో 5 చిత్తూరు, కడపలో 3, గుంటూరులో 2 చొప్పున ఉన్నాయి. లారీల బీమా పత్రాలను పరిశీలించగా.. అవి కూడా నకిలీవేనని తేలాయి. యునైటెడ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ తదితర బీమా కంపెనీలకు సమాచారం ఇచ్చాం. ► అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన లారీలను జటాధర కంపెనీ ప్రతినిధులు వివిధ జిల్లాల్లో విక్రయించారు. కొనుగోలు చేసిన వారు తాము మోసపోయామని గుర్తించి జేసీ బ్రదర్స్ కంపెనీపై చీటింగ్ కేసులు పెట్టారు. ► వారిని జేసీ బ్రదర్స్ సంప్రదించి వ్యవహారం సెటిల్ చేసుకునేందుకు రూ.12 నుంచి రూ.14 లక్షలు తిరిగి ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు మా దృష్టికి వచ్చింది. ► ఈ వ్యవహారానికి సంబంధించి జటాధర కంపెనీ డైరెక్టర్లు జేసీ ఉమాదేవి, అస్మిత్ రెడ్డి, సి.గోపాలరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. -
రెండో విడత ‘వైఎస్సార్ వాహన మిత్ర’
సాక్షి, తాడేపల్లి: రెండో విడత వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రూ.262.49 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఆటో, ట్యాక్సీ ఉన్న 2,62,493 మంది లబ్దిదారులకు రెండో విడతగా రూ.10వేలు ఆర్ధిక సాయం అందనుంది. ఆటో, ట్యాక్సీ కార్మికులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. (ఆటోవాలా.. మురిసేలా) గత ఏడాది కంటే అదనంగా 37,756 మంది లబ్ధిదారులను రవాణా శాఖ ఎంపిక చేసింది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులకు అక్టోబర్‌లో రూ.పది వేలు ఇవ్వాల్సి ఉంది. అయితే కరోనా కష్టాల నేపధ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయం విడుదల చేయనున్నారు. ఈ పథకానికి ఎనిమిది కార్పొరేషన్ల ద్వారా రెండో ఏడాది ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. కొత్తగా ఆటోలు కొన్నవారికీ వాహన మిత్ర పథకాన్ని వర్తింపజేశారు. గతేడాది సెప్టెంబరు 23 నుంచి ఈ ఏడాది మే 16 వరకు వాహనాల కొనుగోలు, యాజమాన్య బదిలీ హక్కులు పొందిన వారిని అర్హులుగా ఎంపిక చేశారు. వాహన మిత్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకాశం జిల్లా నుంచి రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఆదిమూలపు సురేష్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు నుంచి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, ఎంపీ రెడప్ప, కలెక్టర్ భరత్ గుప్త , ఏపీఐఐసీ చైర్మన్ ఆర్ కె రోజా, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు,నవాజ్ బాషా,ఎం ఎస్ బాబు పాల్గొన్నారు. -
4 నెలల ముందుగానే వైఎస్సార్ వాహన మిత్ర
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్డౌన్ విధించిన నేపధ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు నాలుగు నెలల ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం కింద ఆర్థిక సాయం అందించనుంది. గురువారం (నేడు) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రూ.262.49 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తం 2,62,493 మంది లబ్ధిదారులకు నేరుగా రూ.10 వేల చొప్పున ఆన్లైన్ చెల్లింపులు జరగనున్నాయి. గత ఏడాది కంటే అదనంగా 37,756 మంది లబ్ధిదారులను రవాణా శాఖ ఎంపిక చేసింది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులకు అక్టోబర్‌లో రూ.పది వేలు ఇవ్వాల్సి ఉంది. అయితే కరోనా కష్టాల నేపధ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయం విడుదల చేయనున్నారు. ఈ పథకానికి ఎనిమిది కార్పొరేషన్ల ద్వారా రెండో ఏడాది ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. కొత్తగా ఆటోలు కొన్నవారికీ వాహన మిత్ర పథకాన్ని వర్తింపజేశారు. గతేడాది సెప్టెంబరు 23 నుంచి ఈ ఏడాది మే 16 వరకు వాహనాల కొనుగోలు, యాజమాన్య బదిలీ హక్కులు పొందిన వారిని అర్హులుగా ఎంపిక చేశారు. లబ్ధిదారుల్లో అత్యధికులు బీసీలే.. ► కొత్తగా ఈ ఏడాది 38,605 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 849 దరఖాస్తులు సరైన డాక్యుమెంట్లు లేక తిరస్కరించగా 37,756 మంది కొత్తగా ఎంపికయ్యారు. ► మొత్తం లబ్ధిదారుల్లో 61,390 మంది ఎస్సీలు, 1,17,096 మంది బీసీలు, 14,592 మంది ఈబీసీలు, 29,643 మంది కాపులు, 10,049 మంది ఎస్టీలు, 28,118 మంది మైనార్టీలు, 581 మంది బ్రాహ్మణులు, 1,026 మంది క్రైస్తవులు ఉన్నారు. ► గతేడాది 2,39,957 మందికి లబ్ధి చేకూరగా కొంతమంది వాహన యాజమాన్య హక్కులు బదిలీ చేసుకున్నారు. గ్రామాల్లో సోషల్ ఆడిట్ పూర్తి చేసి లబ్ధిదారుల్ని నిర్ధారించారు. ► గతేడాది లబ్ధి పొందిన వారితో పాటు కొత్తగా ఎంపికైన వారికి ఆన్లైన్ ద్వారా వారి ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేయనున్నారు. ► ఈ పథకానికి గాను 8 కార్పొరేషన్లకు అదనంగా నిధుల కేటాయింపు. ఇదీ పథకం.. ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే పేద డ్రైవర్లకు ‘వైఎస్సార్ వాహన మిత్ర’ ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ఏటా వారికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ డబ్బును వాహనాల ఫిట్నెస్, బీమా, మరమ్మతుల కోసం వినియోగించుకోవచ్చు. అడగకుండానే ఆదుకుంటున్నారు.. కరోనా కారణంగా పనుల్లేక, క్యాబ్‌లు తిప్పేందుకు వీల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేం అడగకుండానే ఈ ఏడాదికి గాను నాలుగు నెలలు ముందుగానే రూ.10 వేల సాయం అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది. గతేడాది అందించిన ఆర్థిక సాయంతో వాహనాలకు బీమా, ఫిట్నెస్, మరమ్మతులు చేయించుకున్నాం. – మహేష్, క్యాబ్ డ్రైవర్, విజయవాడ కరోనా నేపథ్యంలో ముందుగానే సాయం కోవిడ్–19 పరిస్థితి దృష్ట్యా ఉపాధి లేక క్యాబ్, ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. వీరిని ఆదుకునేందుకే నాలుగు నెలలు ముందుగా సాయం అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. మామూలుగా అయితే అక్టోబర్, నవంబర్ నెలల్లో సాయం అందించాల్సి ఉంది. ఏడాదిలోగానే సాయం అందించి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు మేలు చేస్తున్నాం. – పీఎస్సార్ ఆంజనేయులు, రవాణా శాఖ కమిషనర్ -
‘నిబంధనల’ రూటు తప్పిన బస్సు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కరోనా ప్రమాదకరంగా విస్తరిస్తున్న సమయంలోనూ ఆర్టీసీలో తీరు మారలేదు. రెండు రోజుల క్రితమే ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. బస్కెక్కే ప్రయాణికులకు కచ్చితంగా శానిటైజర్ అందుబాటులో ఉంచాలని స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించినా, అధికారులు నిర్లక్ష్యం వీడలేదు. బుధవారం శానిటైజర్ సీసాలు అందుబాటులో లేకుండానే కొన్ని బస్సులు తిరిగాయి. ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంలో కోదాడ డిపోకు చెందిన ఓ బస్సులో శానిటైజర్ లేని విషయం ఆయన దృష్టికి వచ్చింది. దీంతో కారణం అడగ్గా, తనకు శానిటైజర్ సరఫరా చేయలేదని కండక్టర్ సమాధానమిచ్చారు. దీంతో వెంటనే ఆ డిపో మేనేజర్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా మంత్రి అజయ్‌కుమార్ సంబంధిత ఆర్ఎంను ఆదేశించారు. అయితే అసలు కొన్ని డిపోలకే శానిటైజర్ సరఫరా కాలేదని, ఆ కారణంతో డిపో మేనేజర్లు కొందరు కండక్టర్లకు అందివ్వలేదని తెలిసింది. కోదాడ డిపోకు సరఫరా అయిందీ లేనిదీ విచారణలో తేలనుంది. ఈ విషయం వెలుగు చూడటంతో తమ డిపోలకు కూడా శానిటైజర్ సరఫరా కాలేదంటూ పలువురు డిపో మేనేజర్లు ఫిర్యాదు చేశారు. దీంతో పరిస్థితి గందరగోళంగా ఉందని గుర్తించిన మంత్రి అజయ్‌కుమార్, గురువారం అత్యవసరంగా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మకు పరిస్థితి చక్కదిద్దాల్సిందిగా ఆదేశించారు. బస్సుల్లో శానిటైజర్ ఎందుకు సరఫరా కాలేదో తేల్చి తనకు నివేదిక అందించాలని కోరారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సొంతంగా కొన్న డీఎంలు.. లాక్‌డౌన్‌కు పూర్వం దాదాపు వారం రోజులపాటు బస్సుల్లో శానిటైజర్ అందుబాటులో ఉంచారు. అప్పట్లో కొన్ని డిపోల్లో స్థానిక డీఎంఅండ్హెచ్ఓల మార్గదర్శనంలో సొంతంగా శానిటైజర్ తయారు చేసుకున్నారు. నైపుణ్యం లేకుండా కెమికల్స్‌తో సొంతంగా తయారు చేయటం సరికాదని భావించి ఇప్పుడు జైళ్ల శాఖ రూపొందించిన శానిటైజర్‌ను వినియోగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు అక్కడి నుంచి పెద్దమొత్తంలో శానిటైజర్‌ను సరఫరా చేసినట్టు సమాచారం. తమ పరిధిలో డిపోలకు శానిటైజర్ పంపినట్టు ఆర్ఎంలు చెబుతుండగా, తమకు అందలేదని కొందరు డీఎంలు పేర్కొన్నారు. కోదాడ విషయంలోనూ ఇలాగే జరిగినట్టు తెలిసింది. శానిటైజర్ అందకపోవటంతో కొన్ని చోట్ల డీఎంలు ప్రైవేటు దుకాణాల్లో సొంతంగా కొని బస్సుల్లో ఉంచగా, కొందరు డీఎంలు అవి లేకుండానే బస్సులు పంపించారు. నిజంగా డిపోలకు శానిటైజర్ సరఫరా కాలేదా, అయినా డీఎంలు నిర్లక్ష్యంగా వ్యవహరించారా అన్నది తేలాల్సి ఉంది. -
చెక్‌పోస్టుల్లో డ్రైవర్లకు థర్మల్ స్క్రీనింగ్
సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చే సరుకు రవాణా వాహనాల డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు రవాణా అధికారులను ఆదేశించారు. థర్మల్ స్కానింగ్ యంత్రంతో పరీక్షించాలని సూచించారు. డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలుంటే వెంటనే వైద్య శాఖకు సమాచారం అందించాలని సూచించారు. ► సరుకులు రవాణా చేసే డ్రైవర్లకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేప«థ్యంలో రవాణాశాఖ అప్రమత్తమైంది. ► రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టుల్లో పనిచేస్తున్న రవాణా శాఖ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లకు థర్మల్ స్కానింగ్ యంత్రాలను పంపించారు. ► వీటితో పాటు మాస్క్‌లు, శానిటైజర్లను రవాణా సిబ్బందికి అందించారు. ► సరుకు రవాణా చేసే డ్రైవర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని, జాతీయ రహదార్లపై దాబాలలో వారికి ఆహారం అందేలా చూడాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
బీఎస్–4.. రిజిస్ట్రేషన్ల జోరు
సాక్షి, అమరావతి: బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు డెడ్ లైన్ దగ్గరపడుతుండటంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ రవాణా శాఖ వాహన డీలర్ల వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్లు చేయిస్తోంది. మొన్నటి వరకు రోజుకు సగటున 3–4 వేల వాహనాల రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ఇప్పుడు 5 వేలకు పైగా జరుగుతున్నాయి. దీంతో రెండ్రోజులకే రిజిస్ట్రేషన్ సిరీస్ మారుతోంది. ఈ నెల రెండో వారం తరువాత ఈ రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజుకు 10 వేల వరకు జరిగే అవకాశం ఉందని రవాణా శాఖ భావిస్తోంది. ఇందుకు తగ్గ ఏర్పాట్లు అన్ని రవాణా శాఖ కార్యాలయాల యూనిట్లలో చేశామని అధికారులు చెబుతున్నారు. నేరుగా బీఎస్–6కు.. ► వాహన రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలోనూ కాలుష్యం, రోడ్డు భద్రత, మెకానికల్ అంశాలకు సంబంధించి భారత్ స్టాండర్డ్స్ (బీఎస్) పేరిట నాణ్యత ప్రమాణాలను నిర్ణయించారు. ► వీటిని బీఎస్–1, 2, 3, 4, 5, 6 కేటగిరీలుగా విభజించారు. ప్రస్తుతం బీఎస్–4 వాహనాల నుంచి బీఎస్–5 కాకుండా నేరుగా బీఎస్–6కు వెళ్లారు. బీఎస్‌లో ప్రధానంగా కాలుష్యంపైనే అత్యున్నతంగా ప్రమాణాలను నిర్దేశించారు. బీఎస్–6 వాహనాలు 68 శాతం కాలుష్య రహితంగా రూపొందించారు. ► అన్ని కంపెనీలకు బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్లు డీలర్ల వద్దే జరగనుండటంతో వీటిపై రవాణా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఏయే పేర్లతో వాహనాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ జరిగే వాహనదారులకు రెండో వాహనం ఉందా? అన్న అంశాలపై దృష్టి పెట్టారు. ► రెండో వాహనం ఉంటే రిజిస్ట్రేషన్ చార్జీలు రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ద్విచక్ర వాహనాలు సహా బీఎస్–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ►ఈ నేపథ్యంలో బీఎస్–4 వాహనాలకు కంపెనీలు ఆఫర్లు ప్రకటించాయి. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ధరలను తగ్గించారు. ►కొందరు డీలర్లు బీఎస్–4 వాహనాలను తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించి ఏప్రిల్ తర్వాత ప్రీ ఓన్డ్ షోరూంలకు తరలించే ఆలోచన చేస్తున్నారని రవాణా అధికారులు చెబుతున్నారు. -
‘వారి ప్రమేయం ఉన్నా వదలం’
సాక్షి, విజయవాడ : నిబంధనలకు విరుద్ధంగా బిఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి అక్రమ ధ్రువ పత్రాల ద్వారా ఆంధ్రపదేశ్‌లో తిప్పడంపై ట్రాన్స్పోర్ట్ విజిలెన్స్ జాయింట్ కమిషనర్ ప్రసాద్ గురువారం మీడియాతో మాట్లాడారు. బిఎస్-౩ వాహనాలు 31-03-2017 తరువాత అమ్మకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని అన్నారు. అశోక్ లైల్యాండ్ నుంచి బీఎస్-3 వాహనాలు కొనుగోలు చేసి తిప్పుతున్నట్లు తెలిసిందన్నారు. 66 వాహనాలు స్క్రాప్‌గా అమ్మడం జరిగిందని, అశోక్ లైల్యాండ్ వాళ్లు తెలిపారని చెప్పారు. దేశంలో తిరగడానికి వీలులేని వాహనాలను తిప్పుతున్నారని, పోలీసుల సర్టిఫికెట్లు కూడా దొంగవి పెట్టారన్నారు. పోలీస్ శాఖ కూడా క్రిమినల్ కేసులు కూడా పెట్టిందని తెలిపారు. 25 వాహనాలు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్న కారణంగా ఆ రాష్ట్రాలలో కూడా లావాదేవీలు నిలిపివేయాలని కోరామన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ అక్రమ ధ్రువ పత్రాలు ఉన్న వాహనాలను సీజ్ చేసే ప్రక్రియ మొదలు పెట్టాం. ఇప్పటికి 23 వాహనాలు సీజ్ చేసాం.వాహనాలు కొని మోసపోయిన వారు అమ్మిన వారిపై కేసులు పెట్టాలని సూచించాం. జఠాధర ఇండస్ట్రీస్, సి గోపాల కృష్ణ కంపెనీకి చెందిన 80 బస్సులు ఉన్నాయి. లారీలు తీసుకువచ్చి బస్సులు కింద మార్చారు. ఆ బస్సుల్లో ప్రయాణం ప్రాణాంతకం. 88 వాహనాలకు సంబంధించి 3 కేసులు నమోదు అయ్యాయి. 23 వాహనాలకు సంబంధించి రవాణా శాఖ అధికారుల ప్రమేయం ఉన్నా వారిని వదిలే ప్రసక్తి లేదు. ఆగష్టు 2018న నాగాలాండ్‌లో ఈ వాహనాలు రిజిష్టర్ చేశారు. 45 వాహనాలు ఏపీలోనే ఉన్నాయని తెలిసింది. గోపాల్ రెడ్డి అండ్ కంపెనీ పేరిట 45 వాహనాలు, మిగిలినవి జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట రిజిష్టర్ చేశారు. పీఆర్ హిల్ కోహిమా అని అడ్రస్ ఇచ్చారు, తాడిపత్రిలో పర్మనెంట్ అడ్రస్ ఇచ్చారు. జె.సి.ఉమారెడ్డి నాలుగు వాహనాలకు సంతకం చేశారు. సి.గోపాల్ రెడ్డి రెండు వాహనాలకు సంతకం చేశారు. నాగాలాండ్‌లో రిజిష్టర్ చేస్తే పట్టుబడమని అనుకున్నారు. అక్కడి నుంచి ఎన్ఓసీ కింద ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాయి. అనంతపురంలో ఒక క్రిమినల్ కేసు వేశాము. ఇన్సూరెన్స్ కూడా దొంగ ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఏప్రిల్ 2020 నుంచీ బీఎస్ - 6 కాకపోతే తిగడానికే వీలు లేదు. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 182 ప్రకారం మేనుఫ్యాక్చరర్ తప్పుంటే చర్యలు తీసుకుంటాం. తప్పుడు పత్రాలు కనుక.. రిజిస్ట్రేషన్ రద్దు చేసి, ఇతర రాష్ట్రాలకు కూడా తెలిపాం. చట్ట వ్యతిరేకంగా తిరుగుతున్న వాహనాలు కనుక ఇప్పటి వరకూ 23 వాహనాలు సీజ్ చేశాం. లారీలను బస్సులుగా మార్చడంతో క్రిమినల్ కేసు నమోదు. ఏపీలోనే 29 రిజిష్టర్ కావడంతో, ట్రాన్స్పోర్ట్ అధికారులెవరైనా చర్యలు తప్పవు. అనంతపురంలోనే 29వాహనాలు రిజిష్టర్ అయ్యాయి. లారీ ఛాసిస్ తో మూడు బస్సులుగా మార్చారు. వాహనాలన్ని సి గోపాల్ రెడ్డి అండ్ కంపెనీ, జఠాధర కంపెనీ కింద రిజర్వేషన్లు అయ్యాయి. 6 వాహనాలకు సంబంధించి వాహన యజమానులతో పాటు అశోక్ లైలాండ్ కంపెనీపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేశాం. దొంగ ఇన్సూరెన్స్‌లు పెట్టారు. యునైటెడ్ చీఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో కూడా ఈ విషయంపై మాట్లాడుతున్నాం . ఈ వ్యవహారంపై జాయింట్ కమిషనర్ నేతృత్వంలో యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశార’ని తెలిపారు. -
ఆర్టీసీకి ‘బీఎస్–6’ గండం
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీకి భారత్ స్టేజ్(బీఎస్)–6 గండం పొంచి ఉంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీఎస్–4 వాహనాలు తిరుగుతున్నాయి. బీఎస్–5కు వెళ్లకుండా కాలుష్య నియంత్రణ కోసం ఏకంగా బీఎస్–6 వాహనాలనే ఉపయోగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ మార్చి 31వ తేదీ వరకే పాత వాహనాల రిజిస్ట్రేషన్లు చేయాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కేవలం బీఎస్–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేయాలని, పాత వాహనాలకు రిజిస్ట్రేషన్లను అనుమతించబోమని తేల్చి చెప్పింది. ఆర్టీసీ కొనుగోలు చేసిన బస్సులకు రిజిస్ట్రేషన్ సమస్య ఉత్పన్నమైంది. కొత్త బస్సులను కొనుగోలు చేసేటప్పుడు కేవలం ఛాసిస్‌లను కొనుగోలు చేస్తారు. అప్పుడు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతాయి. బస్సులకు బాడీ బిల్డింగ్ చేస్తేనే శాశ్వత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను రవాణా శాఖ చేపడుతుంది. దీంతో ఆర్టీసీ కొనుగోలు చేసిన 300 కొత్త బస్సులకు వెంటనే బాడీ బిల్డింగ్ పూర్తి చేసేందుకు సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం పొరుగు రాష్ట్రాల నుంచి బస్ బాడీ బిల్డింగ్ కార్మికులను పిలిపించాలని నిర్ణయించారు. ఒకవేళ అన్ని బస్సులకు బాడీ బిల్డింగ్ పూర్తి కాకుంటే ఏం చేయాలన్న దానిపై ఆర్టీసీ అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. 2020 డిసెంబరు 31 నాటికి తొలి దశలో కాలం చెల్లిన 1,000 బస్సులను మార్చాలని ఆర్టీసీ ప్రతిపాదించింది. వీటి స్థానంలో కొత్తగా 1,000 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. నెలన్నర కిందటే కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినా.. 1,000 బస్సులకు బాడీ బిల్డింగ్ చేయాలంటే వంద రోజుల దాకా సమయం పడుతుందని, శాశ్వత రిజిష్ట్రేషన్లు జరగవని భావించారు. అందుకే కొత్త బస్సులను 300కే పరిమితం చేశారు. మార్చి 31లోగా శాశ్వత రిజిస్ట్రేషన్లు చేయిస్తాం.. ‘‘ఏప్రిల్ నుంచి బీఎస్–6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినందున 300 బస్సులనే కొనుగోలు చేశాం. వీటికి మార్చి 31వ తేదీలోగా శాశ్వత రిజిస్ట్రేషన్ చేయిస్తాం. పాత వాహనాలకు మార్చి 31వ తేదీ కంటే ముందే శాశ్వత రిజిస్ట్రేషన్ జరగాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్లను శాశ్వత రిజిస్ట్రేషన్లుగా గుర్తించవచ్చని మధ్యప్రదేశ్‌లో బస్సుల కొనుగోలు అంశంలో సుప్రీంకోర్టు మౌఖికంగా పేర్కొన్నట్లు మాకు సమాచారం ఉంది. నిర్ణీత తేదీలోగా 300 బస్సులకు బాడీ బిల్డింగ్, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని ఆశిస్తున్నాం’’ – మాదిరెడ్డి ప్రతాప్, ఆర్టీసీ ఎండీ -
లైసెన్సు లేకుండా వాహనంతో రోడ్డెక్కితే జైలుకే!
సాక్షి, అమరావతి: డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే ఏకంగా జైలుకు పంపనున్నారు. ఇప్పటివరకు జరిమానాలతో సరిపెట్టిన రవాణా శాఖ ఇక కఠినంగా వ్యవహరించనుంది. పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 88,872 మంది డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ఈ మేరకు రవాణా శాఖ తాజాగా ఒక నివేదిక రూపొందించింది. ఈ నివేదికను రోడ్ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీకి అందజేసింది. లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపేవారిని జైలుకు పంపాలని సుప్రీంకోర్టు కమిటీ సూచించింది. దీంతో ఏపీ రవాణా శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించనుంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను ఈ ఏడాది 20 శాతం తగ్గించాలని రవాణా శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా డ్రైవింగ్ లైసెన్సుల తనిఖీలను ఇక ముమ్మరంగా చేపట్టనున్నారు. లైసెన్సుల జారీ మరింత సులభతరం డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను ఇప్పటికే సులభతరం చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో మోటారు వాహన చట్టంలో సవరణలు చేసిన సమయంలోనే డ్రైవింగ్ లైసెన్సులకు విద్యార్హత నిబంధన తొలగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. దీంతో గతేడాది ఎనిమిదో తరగతి నిబంధనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో వాహనదారులు డ్రైవింగ్ లైసెన్సులు పొందడం మరింత సులభం కానుంది. -
హలో డ్రైవర్.. లైసెన్స్ తీసుకెళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిరునామాలు సరిగ్గాలేక రవాణా శాఖ పంపుతున్న డ్రైవింగ్ లైసెన్సు (డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) కార్డులు తిరిగొస్తున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలల్లో ఏడు వేలకు పైగా కార్డులు రవాణా శాఖ కార్యాలయాలకు వచ్చాయి. వాహనాల కొనుగోలు, డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు హాజరైన సమయంలో అందజేసే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్‌కు రవాణా శాఖాధికారులు ఆర్సీలు, డీఎల్లు పంపడమే ఇందుకు కారణం. అయితే, వాహనదారుడు ఆ అడ్రస్‌లో లేకపోవడంతో పోస్టల్ శాఖ వాటిని తిరిగి రవాణా శాఖకు పంపుతోంది. అంతేకాక.. వాహనదారులు సైతం దరఖాస్తు చేసి పట్టించుకోవడంలేదు. కాగా, విశాఖ జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇక్కడొక్క చోటే రెండు వేలకు పైగా కార్డులు తిరిగొచ్చాయి. అడ్రస్ మారితే మార్చుకోవాలి వాహనదారులు వాహనం కొనుగోలు చేసినప్పుడు డీలరు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాన్ని ఇస్తున్నారు. దీంతోనే వాహనదారులు తమ వాహనాలను తిప్పుతున్నారని రవాణా అధికారులు చెబుతున్నారు. ఆర్సీలు లేకుండా వాహనాలు తిప్పితే సీజ్ చేయాలని రవాణా శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. అయితే.. ఆర్సీలు, డీఎల్లు పొందినా.. అడ్రస్ మారితే ఆ అడ్రస్ ఆధారంగా కార్డులను మార్చుకోవాలని రవాణా శాఖ సూచిస్తోంది. కాగా, తిరిగొచ్చిన ఆర్సీలు, డీఎల్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ కార్యాలయాల్లో ఉ. 10 గంటల నుంచి మ. ఒంటి గంటలోగా పొందేందుకు అధికారులు వీలు కల్పిస్తున్నారు. అప్పటికీ వాహనదారుల నుంచి స్పందన లేకుంటే వాటిని రద్దు చేయనున్నారు. రవాణా, పోలీసు శాఖలకు చిక్కులు ఇదిలా ఉంటే.. ఆర్సీలో ఉన్న చిరునామా, వాహనదారుడు నివాసం ఉండే చిరునామా వేర్వేరుగా ఉండడంతో పోలీస్, రవాణా శాఖలకు చిక్కులు ఎదురవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించినప్పుడు ఈ–చలానాలు పంపినా.. వేల సంఖ్యలో అవి తిరిగొస్తున్నాయి. ముఖ్యంగా ప్రమాదాలు జరిగినప్పుడు వాహన నంబరు నోట్ చేసుకుని ఆన్లైన్లో చిరునామా కోసం వెతికితే తప్పుడు అడ్రస్సులు దర్శనమిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు జనవరి నుంచి ఆర్సీల తనిఖీని ముమ్మరం చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. -
జనవరి నుంచి ‘సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్’
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంగా వచ్చే ఏడాది జనవరి నుంచి డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించనున్నారు. ఇందుకోసం సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఆటోమేషన్ విధానంలో జరిగే ఈ డ్రైవింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే లైసెన్సు దక్కుతుంది. డ్రైవింగ్ టెస్ట్ మొత్తం వీడియో రికార్డు ప్రక్రియ ద్వారానే జరుగుతుంది. వాహనాన్ని సరిగ్గా డ్రైవింగ్ చేయకుంటే మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా లైసెన్సు జారీ చేయలేరు. ఆటోమేషన్ విధానంలో లైసెన్సుల జారీ ప్రక్రియ గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో అమలవుతోంది. అక్కడ ‘సాఫ్ట్’ ట్రాక్‌ల పేరుతో ఈ విధానం అమల్లో ఉంది. ఇప్పుడు ఏపీలో కూడా వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ట్రాక్‌ల నిర్మాణం ఇక్కడే.. రాష్ట్రంలో మొత్తం తొమ్మది చోట్ల అధునాతన సైంటిఫిక్ టెస్ట్ ట్రాక్‌లు నిర్మించడానికి రవాణా శాఖ టెండర్లను ఖరారు చేసింది. ఒక్కో ట్రాక్‌ను రూ. కోటి ఖర్చుతో నిర్మించనున్నారు. కేంద్రం రూ. 9 కోట్లు సాయం చేయనుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్లు వెచ్చించనుంది. విశాఖపట్టణం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురంలలో ఈ ట్రాక్‌లు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం లైసెన్సుల జారీ ఇలా.. ప్రస్తుతం టూ వీలర్, త్రీ వీలర్, హెవీ, ట్రాన్స్పోర్ట్ వాహనాలు నడిపేందుకు లైసెన్సులు పొందాలంటే డ్రైవింగ్ ట్రాక్‌లలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో వాహనం నడపాల్సి ఉంటుంది. డ్రైవింగ్ పరీక్ష పాస్ కాకున్నా మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ లైసెన్సు జారీ చేసే అవకాశం ఉంది. మధ్యవర్తుల ద్వారా అక్రమాలు జరుగుతున్నాయి. ఆటోమేషన్ విధానంలో ఇలా.. అధునాతనంగా ఏర్పాటు చేసే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో సెన్సార్లు, కెమెరాలు బిగించి మొత్తం డ్రైవింగ్ పరీక్షను రికార్డ్ చేస్తారు. తాము డ్రైవింగ్ సరిగ్గా చేసినా.. తమకు లైసెన్సు ఇవ్వలేదని దరఖాస్తుదారులు ఆరోపించడానికి అవకాశం ఉండదు. ఎలాంటి అక్రమాలకు, సిఫార్సులకు, ఆరోపణలకు ఆస్కారం ఉండదు. నిర్దేశిత నిబంధనల ప్రకారం డ్రైవింగ్ చేసిన వారికి లైసెన్సు వస్తుంది. దరఖాస్తుదారుడు కోరితే తన డ్రైవింగ్ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డు ఫుటేజీ ఇవ్వనున్నారు. ఆరోపణలకు తావుండదు రాష్ట్రంలో ఏర్పాటయ్యే 9 ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లకు కేంద్రం రూ. 9 కోట్లు ఇవ్వనుంది. రూ. 2 కోట్లు టెండర్ల ప్రక్రియకు, రూ. 2.50 కోట్లు టెస్ట్ డ్రైవ్ ట్రాక్‌లకు వెచ్చించేలా రోడ్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి డ్రైవింగ్ శిక్షణా, తనిఖీ మొత్తం ఆటోమేటెడ్ విధానం ద్వారానే జరుగుతుంది. ఈ విధానంతో లైసెన్సుల జారీలో ఎలాంటి ఆరోపణలకు వివాదాలకు తావుండదు. – పీఎస్సార్ ఆంజనేయులు, రవాణా శాఖ కమిషనర్ -
అతిక్రమణకు తప్పదు భారీ మూల్యం
సాక్షి, విజయనగరం ఫోర్ట్/పార్వతీపురం టౌన్: ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదా.. వాహన పత్రాలు, లైసెన్సులు వెంట లేవా.. మద్యం తాగి డ్రైవ్ చేస్తున్నారా... నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. పోలీసులకు పట్టుబడితే భారీగానే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. జరిమానాతో సరిపెట్టుకోకుండా జైలు శిక్షకూడా పడే అవకాశం ఉంది. అంతేనా... రహదారి భద్రత నిబంధనలు ఉల్లం ఘించి వాహనాలు అడ్డదిడ్డంగా నడిపేవారి ఆటలు ఇక సాగవు. తమ కళ్లెదుటే రాంగ్ రూట్లో వెళుతూ... నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపు తూ... పౌరులకు ఇబ్బంది కలిగిస్తే... వారే నేరుగా వాట్సాప్‌ద్వారా రవాణా శాఖకు ఆధారాలతో ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం రవాణా శాఖ 9542800800 నంబర్‌ను ప్రవేశపెట్టింది. దాని ద్వారా వచ్చిన ఫిర్యాదులను వారు పరిశీలించి పెద్ద మొత్తంలో జరిమానా విధించవచ్చు. అంటే రాబోయే రోజుల్లో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే ఎటువైపు నుంచైనా వడ్డన పడే అవకాశం ఉంది. కాబట్టి వాహన చోదకులు జాగ్రత్తగా ఉండాల్సిందేనని పోలీసు, రవాణా శాఖలు హెచ్చరిస్తున్నాయి. కొత్త వాహన చట్టంలో నిబంధనలు కఠినం.. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతన వాహన చట్టాన్ని అమలులో కి తెచ్చింది. ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మోటారు వెహికల్ చట్టంలో కొత్త మార్పులు తీసుకువచ్చారు. ఈ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, జైలు శిక్షలు ఉండేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. ఇప్పటికే పోలీసులు ఈ చట్టంపై వాహనచోదకులు, యజమానులకు అవగాహన కలిగిస్తున్నారు. చట్టంలోని ముఖ్యాంశాలు.. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా, మద్యం తాగి, అతి వేగంగా, హెల్మెట్ లేకుండా, అంబు లెన్సు వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోయినా, వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోయినా, కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు సీటుబెల్ట్ పెట్టుకోకున్నా శిక్షార్హులు. మైనర్లు వాహనాలు నడిపితే వారికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులపై అధిక మొత్తంలో జరిమానా విధించేలా చట్టం తీసుకొచ్చారు. చట్టంలోని పలు అంశాల కు సంబంధించి ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులపై అధికారులు కఠినంగా వ్యవహరించనున్నారు. ఫిర్యాదుల కోసం రవాణా శాఖ వాట్సాప్.. రహదారి భద్రత నిబంధనలు పాటించకపోవడం వల్ల అమాయకులు ప్రమాదాలబారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో రహదారి నిబంధనలు పాటించని వారితో పాటు రహదారిపై ప్రయాణించే వారు సైతం ప్రమాదాల్లో ఇరుక్కునే సందర్భాలున్నా యి. ఇలాంటివాటికి అడ్డుకట్ట వేసేందు కు ప్రజాభాగస్వామ్యం అవసరమని రవాణా శాఖ భావించింది. ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది. స్మార్ట్ ఫోన్ ఉండి ఫోటో తీసే కొద్ది పాటి అవగాహన ఉన్నవారు ఎవరైనా ఎక్కడినుంచైనా నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫొటో తీసి రవాణాశాఖ అధికారులు అందుబా టులోకి తెచ్చిన 9542800800 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపిస్తే చాలు. ఆ వెంటనే రవాణా శాఖ అధికారులు రం గంలోకి దిగి నిబంధనలు భేఖాతరు చేసిన వారి భరతం పడతారు. ఫొటోల ను రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధి కారులు పరిశీలించి వాహనయజమాని అడ్రస్‌కు నేరుగా చలానా పంపుతారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే వారి లైసెన్సులు రద్దు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఎవరైనా వాట్సాప్ ద్వారా పంపవచ్చు.. నిబంధనలు అతిక్రమించిన వారి ఫొటోలు తీసి ఎవరైనా 9542800800 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపవచ్చు. వాటి ఆధారంగా సంబంధిత వాహన యజమాని ఇంటికి చలానా పంపించి జరిమానా వసూలుకు చర్యలు తీసుకుంటాం. – సీహెచ్.శ్రీదేవి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, విజయనగరం వాహన చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకువచ్చిన మోటారు వాహన చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం కొత్త మోటారు చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతోపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. – వి.లోవరాజు, పట్టణ ఎస్ఐ, పార్వతీపురం ట్రాఫిక్ నియమాలు తప్పనిసరి.. వాహన చోదకులు ట్రాఫిక్ నియమాలు పాటించాలి. ఎవరైనా నియమాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా లో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మైనర్లు వాహనం నడిపితే సంరక్షకులకు రూ.25వేలు జరిమానా, మూడే ళ్ల జైలు శిక్షతోపాటు లైసెన్సు రద్దు చేస్తాం. – ఆర్.జయంతి, పట్టణ మహిళా ఎస్ఐ, పార్వతీపురం -
మనం సేవకులం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘వినతులు ఇచ్చే ప్రజల పట్ల కొందరు సిబ్బంది సవ్యంగా ప్రవర్తించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి.. ఇలాంటి వాటిని సహించేది లేదు.. ప్రజలు ఓట్లు వేస్తేనే మనం ఈ స్థాయికి వచ్చాం.. మనం సేవకులమే కాని, పాలకులం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరించారు. ‘స్పందన’ కార్యక్రమంపై బుధవారం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్పందనలో వచ్చిన వినతులను సీరియస్‌గా తీసుకోవాలని కింది స్థాయి అధికారులందరికీ చెప్పాలని సూచించారు. సరిగా స్పందించని కేసులు 2 నుంచి 5 శాతం వరకు ఉన్నాయన్నారు. వినతులు, సమస్యలు నివేదించే వారిని చిరునవ్వుతో ఆహ్వానించాలని, కలెక్టర్లు.. అధికారులకు ఈ విషయాలన్నీ తెలిసినవేనని అన్నారు. అయితే పని భారం వల్లో, మరే ఇతర కారణాలవల్లో ఇలాంటివి తలెత్తవచ్చునని, మరోసారి అలాంటి పొరబాట్లు జరగకుండా పరిశీలన చేసుకోవాలన్నారు. స్పందన కార్యక్రమం స్ఫూర్తి తగ్గకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. గొప్ప ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్న విషయాన్ని మరిచిపోవద్దని, అలసత్వం వహించవద్దని పేర్కొన్నారు. ఆ మేరకు యంత్రాంగాన్ని చురుగ్గా పని చేయించాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని, ఈ విషయంలో దిగువ స్థాయి అధికారులకు మార్గ నిర్దేశం చేయాలని చెప్పారు. ప్రతి చర్యలో మానవత్వం కనిపించాలి ‘స్పందన’లో సమస్యలు పరిష్కరించుకున్న వారిలో 59 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని, మిగిలిన 41 శాతం మంది మరింత మెరుగ్గా సమస్యలను పరిష్కరించవచ్చనే అప్రాయాన్ని వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. వీరికి రాండమ్‌గా కాల్ చేసి అభిప్రాయాలు స్వీకరించామని చెప్పారు. ఈ విషయంలో జిల్లాల నుంచి ఎంపిక చేసిన కొంతమంది అధికారులను పిలిపిస్తామని, వినతుల్లో భాగంగా ఇచ్చిన సమాధానాలను వారికే చూపిస్తామన్నారు. ఏ తరహా సమాధానాలు ఇచ్చారో చూపించి వర్క్‌షాపు నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మార్వో, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లు.. అందర్నీ పిలిపించి ఈ తరహా ప్రక్రియ చేపడతామని చెప్పారు. మానవత్వం అనేది ప్రతి చర్యలో, ప్రతి అక్షరంలో కనిపించాలని, లేకపోతే వ్యవస్థ ఎందుకు నడుస్తుందో.. అర్థంకాని పరిస్థితి వస్తుందన్నారు. దీనిపై కలెక్టర్లు.. ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడాలని ముఖ్యమంత్రి సూచించారు. వర్షాల కారణంగా జ్వరాలు వస్తున్నాయని, వీటిపై ఆరోగ్య శాఖ, పారిశుద్ధ్య విభాగాలు దృష్టి పెట్టాలని.. ఆస్పత్రులు, ఇతర ప్రాంతాల్లో కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసం హెల్ప్ డెస్క్‌లు సొంతంగా ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇచ్చే పథకానికి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు కలెక్టర్లకు మార్గదర్శకాలను వివరించారు. వాహన యజమాని భార్య అయినా, భర్త అయినా పర్వాలేదని, దరఖాస్తులు ఇవ్వడానికి ఆఖరు తేదీ సెప్టెంబరు 25గా నిర్ణయించామని, సెప్టెంబర్ 30 లోగా వెరిఫికేషన్, అప్ లోడింగ్ పూర్తి చేస్తామని కృష్ణబాబు పేర్కొన్నారు. దరఖాస్తుదారులకు సౌకర్యం కోసం రవాణాశాఖ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామని, దరఖాస్తులు స్వీకరించేటప్పుడు లబ్ధిదారులను ఇబ్బంది పెట్టకుండా వీలైనన్ని కౌంటర్లు పెట్టాలని చెప్పారు. విశాఖ, విజయవాడల్లో ఆటోలు, ట్యాక్సీలు ఎక్కువ కాబట్టి.. అక్కడ ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్లుకు సూచించారు. మీ సేవ ద్వారా కూడా దరఖాస్తులు ఇచ్చే అవకాశం ఉందని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నెట్ సదుపాయం ఉంటే ఎక్కడి నుంచైనా దరఖాస్తు నింపవచ్చనని, మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా దరఖాస్తు చేయొచ్చని అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తులు ఆమోదం పొందగానే అక్టోబరు 4 నుంచి డబ్బులు పంపిణీ చేయాలని, అక్టోబరు 5న రశీదులను వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇళ్ల స్థలాల పంపిణీపై దృష్టి సారించండి ఈ ఏడాది డిసెంబర్ నుంచి కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్‌లో ప్రారంభం కానున్న వైఎస్సార్ కంటి వెలుగుపై జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు. ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఈ కార్యక్రమం వల్ల కలెక్టర్లు, అధికారుల పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి జిల్లాలో కనీసం 2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని, ఇన్ని లక్షల మంది జీవితాలను మార్చే అవకాశం ఉన్నందున దీనిపై అందరూ ఫోకస్ పెట్టాలని కలెక్టర్లను కోరారు. రాష్ట్రంలోని 1,45,72,861 కుటుంబాలకు గాను 1,21,62,651 ఇళ్లలో వలంటీర్లు వెరిఫికేషన్ పూర్తి చేశారని, ఈ వారంతో పూర్తి స్థాయిలో పూర్తవుతుందని, ఇప్పటి వరకు 23,83,154 మంది ఇళ్ల స్థలాల కోసం లబ్ధిదారులుగా గుర్తించామని అధికారులు సీఎంకు వివరించారు. పట్టణ ప్రాంతాల్లో 3,772 ఎకరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 25,822 ఎకరాలు అందుబాటులో ఉందని చెప్పారు. అన్నీ పూర్తయ్యాక తుది గణాంకాలు నివేదిస్తామని అధికారులు తెలిపారు. అక్టోబరు 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా అమలు చేస్తున్నామని, అర్హత ఉన్న వారందరికీ పారదర్శకంగా ఈ పథకం అందేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. వరదలు తగ్గగానే అందుబాటులోకి ఇసుక రీచ్‌లు వరదల కారణంగా ఇసుక రీచ్‌లు నిర్వహించడానికి ఇబ్బంది కలిగిందని, వరదలు తగ్గగానే ఇసుక రీచ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. స్టాక్ యార్డుల్లో నిల్వలు పెంచేలా చూడాలన్నారు. ఇసుకలో మాఫియా, దోపిడీ లేకుండా చేశామని, వీలైనంత తక్కువ రేటుకు పారదర్శకంగా ఇసుక పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కొరత కారణంగా పండ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు పడుతున్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వరదలు తగ్గగానే చురుగ్గా ఇసుకను అందుబాటులోకి తెస్తామని కలెక్టర్లు తెలిపారు. ప్రతి కలెక్టరేట్లో ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు. వీలైతే ఆయా సంఘాలకు చెందిన ప్రతినిధులను ఆ విభాగంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో రూ.5 వేల ప్రత్యేక సహాయంపై సీఎం ఆరా తీశారు. ప్రభుత్వ ఉత్తర్వులు అందాయని, వెంటనే పంపిణీ ప్రారంభిస్తామని ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో మళ్లీ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. కృష్ణా వరదలపై కూడా సీఎం ఆరా తీయగా విజయవాడ నగరంలో పునరావాస శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. -
రూ.వేయి కోట్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఈ బడ్జెట్లో రూ.వేయి కోట్లు కేటాయించాలని ఆర్టీసీ ప్రభుత్వాన్ని కోరింది. కొత్త బస్సులు కొనుగోలు చేసి చాలా కాలం గడిచిపోయినందున, సత్వరం బస్సుల కొనుగోలుకు నిధులు ఇవ్వాలని కోరింది. బస్‌పాస్‌ల రాయితీకి సంబంధించి రీయింబర్స్‌మెంటు కోసం రూ.600 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో తీసుకున్న బ్యాంకు రుణం తిరిగి చెల్లింపునకు సంబంధించి రూ.200 కోట్లు, కొత్త బస్సుల కొనుగోలు కోసం రూ.150 కోట్లు, ఇతర ఖర్చులు కలిపి మొత్తం రూ.వేయి కోట్లు కేటాయించాలని ఆర్టీసీ ఆర్థిక శాఖకు ప్రతిపాదించింది. గత ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.525 కోట్లు ప్రకటించింది. కానీ ఇప్పటివరకు రూ.30 కోట్లు మించి అదనంగా విడుదల చేయలేదని సమాచారం. గడచిన రెండు నెలలుగా వేతనాలు చెల్లించేందుకు ఆర్టీసీ వద్ద నిధులు లేకపోవటంతో ప్రభుత్వం బకాయిపడ్డ బస్‌పాస్ రాయితీ రీయింబర్స్‌మెంటు నిధుల నుంచి రూ.200 కోట్లు విడుదల చేసింది. గతేడాది సాధారణ బడ్జెట్లో రూ.960 కోట్లు కేటాయించినా, మొత్తం నిధులు మాత్రం ఆర్టీసీకి అందలేదు. ఈసారి ప్రకటించిన నిధులతోపాటు పాత బకాయిలు కూడా ఇవ్వాలని కోరింది. కొత్త మంత్రికి కొత్త ఛాంబర్.. కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రస్తుత సచివాలయ భవనాలను ఖాళీ చేయటంతో మంత్రులకు వివిధ ప్రాంతాల్లో కార్యాలయాలు కేటాయించిన విషయం తెలిసిందే. రోడ్లు భవనాల శాఖతోపాటు రవాణా శాఖను పర్యవేక్షించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఎర్రమంజిల్‌లోని రోడ్లు భవనాల శాఖ ఈఎ న్సీ కార్యాలయంలో ఛాంబర్ ఇచ్చారు. తాజా విస్తరణలో రవాణా శాఖను అజయ్‌కుమార్‌కు కేటాయించటంతో రవాణా శాఖ కార్యాలయంతోపాటు బస్‌భవన్‌లో కొత్త ఛాంబర్ ఏర్పాటును అధికారులు పరిశీలిస్తున్నారు. -
ఇక్కడ పాత చలాన్లే!
సాక్షి, హైదరాబాద్: కొత్త మోటారు వాహన సవరణ చట్టం–2019 దేశవ్యాప్తంగా ఆదివారం అమలులోకి వచ్చింది. కానీ, తెలంగాణలో మాత్రం పోలీసులు ఆదివారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పలువురికి పాత చలాన్లే విధించారు. కొత్త చట్టం ప్రకారం.. చలాన్లు విధించాలంటూ తమకు రవాణా శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని పోలీసులు స్పష్టం చేశారు. జరిమానాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, వీటిని తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్రంతో సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పైగా కొత్త చలాన్లు ఇప్పటికిప్పుడు అమలు చేస్తున్న పలు రాష్ట్రాల్లో దాని పరిణామాలు ఎలా ఉంటాయి? అక్కడ ప్రజల నుంచి ఎలాంటి స్పందనవస్తుంది? అన్న విషయాలు కూడా అధ్యయనం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అందుకే, రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మనకు ఇక్కడ పాత జరిమానాలే వర్తించనున్నాయని రవాణా, పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ‘ట్రాఫిక్ రూల్స్ పాటించండి... మీ డబ్బు ఆదా చేసుకోండి’ అనే నినాదంతో హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అధికారులు వినూత్న ప్రచారం ప్రారంభించారు. కొత్త నిబంధనలతో జరిమానాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయి.. నిబంధనల్ని పాటిస్తే ఏ మేరకు డబ్బు ‘ఆదా’చేసుకోవచ్చు తదితర విషయాలను వివరిస్తూ ఫ్లెక్సీలు, బ్యానర్లు రూపొందించి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. దీంతో పాటు క్షేత్రస్థాయి అధికారులు సైతం వాహనచోదకుల్ని ఆపి వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్‌ల్ని తనిఖీ చేస్తున్నారు. ఏదైనా లేకపోతే ప్రస్తుతం ఎంత జరిమానా పడుతోంది, కొత్త యాక్ట్ అమలులోకి వస్తే ఏ స్థాయిలో పడుతుంది అనేవి వివరిస్తున్నారు. మరోపక్క వాహనదారులు కూడా ఉల్లంఘనలకు పాల్పడకూడదనే ఉద్దేశంతో డ్రైవింగ్ చేస్తున్నారు. వారం రోజులుగా హెల్మెట్ వినియోగం పెరిగిందని, ఇదే వాహనచోదకులు తీసుకుంటున్న జాగ్రత్తకు నిదర్శనమని ఓ అధికారి తెలిపారు. -
ఫొటో తీసి 95428 00800కు వాట్సప్ చేయండి
సాక్షి, అమరావతి: కళ్లెదుట ఎవరైనా రాంగ్ రూట్లో వస్తున్నా, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నా, హెల్మెట్, సీటు బెల్టు లేకుండా వాహనం నడుపుతున్నా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నా ఏమీ చేయలేకపోతున్నామని చాలా మంది బాధపడుతుంటారు. ఇకపై ఇలా బాధపడనక్కర్లేదు. మీ చేతిలోని స్మార్ట్ ఫోన్‌తో ఒక్క ఫొటో క్లిక్ మనిపించి.. దాన్ని రవాణా శాఖకు అందుబాటులోకి తీసుకురానున్న ఫోన్ నంబర్‌కు వాట్సప్ చేస్తే చాలు. ఆ వెంటనే రవాణా శాఖ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు రంగంలోకి దిగి వారి భరతం పడతారు. రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారికి పౌర భాగస్వామ్యంతో ముకుతాడు వేసేందుకు రవాణా శాఖ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా 95428 00800 వాట్సప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్రంలో ఎక్కడైనా ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణకు పాల్పడేవారి ఫొటోల్ని ప్రజలు ఈ వాట్సాప్ నంబర్‌కు పంపితే చాలు. అయితే ఇలా పంపే ఫొటోలో వాహన నంబర్ స్పష్టంగా కనిపించేలా జాగ్రత్త వహించాలి. ఈ ఫొటోలను రవాణా శాఖ ఎన్ఫోర్సుమెంట్ బృందాలు పరిశీలించి, వాహన నంబర్ ఆధారంగా వాహనదారుడి అడ్రస్‌కు నేరుగా చలానా పంపుతాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఫొటోల్ని ఆయా జిల్లాల రవాణా శాఖ అధికారులకు పంపి ఉల్లంఘనులకు ముకుతాడు వేస్తారు. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించేందుకు జిల్లాలవారీగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి లైసెన్సు రద్దు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాతో కూడిన చలానాలు నేరుగా ఇంటికే రానున్నాయి. ప్రజలను నేరుగా భాగస్వాములను చేయడం ద్వారా ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణకు పాల్పడేవారికి అడ్డుకట్ట వేయడం సులభతరమవుతుందని రవాణా శాఖ ఆశిస్తోంది. ఈ విధానంపై అధికారులకు సూచనలు చేసినట్లు రవాణా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. (చదవండి: ట్రాఫిక్ ఉల్లం‘ఘనుల’ ఆటలు చెల్లవిక)